ప్రశాంతమైన గాఢనిద్ర తరువాతి రోజు ఉదయం ఇంత ఆహ్లాదకరంగా తెల్లవారుతుందని నాకు ఈ మధ్యే తెలిసింది.
రాత్రి ఆ ముగ్గురినీ చంపేసాక తృప్తిగా నిద్రపట్టింది. వొళ్ళు తెలీకుండా పడుకుండిపోయాను. మిగతా ముగ్గురూ చిక్కలేదు. వారు కూడా దొరికితే ఇంకెంత బాగుండేదో? ఈ రోజు వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను . ఈ రాత్రికి ఎలాగైనా పట్టుకుని మట్టు బెట్టాలి. దానికి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలి.
******* * ******** ********
మొదటి నుంచీ ప్రథమశ్రేణి విద్యార్థిని. ఏకసంథాగ్రహిని. స్కూలు నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తరగతులతో పాటుగా మార్కులు కూడా పెరుగుతూ వచ్చాయి. పీజీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఎన్నో ఎన్నెన్నో పోటీ పరీక్షలు రాసీ రాసీ, విసుగు పుట్టి ఇక వల్ల కాదు విరమిద్దాం అనుకునే సమయంలో, వయసు దాటి పోతున్నప్పుడు పంచాయితీ ఆఫీసులో అసిస్టెంట్ ఉద్యోగంలో స్థిరపడ్డాను. పెళ్ళీ, పిల్లలు మిగతా అంతా అందరి బాపతే.
ఇంకా పదేళ్ల సర్వీసుంది. క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటు పడ్డాను కనుక క్రమక్రమంగా జీవితం ఈదడానికి సంబంధించి పదుగురు చర్చించుకునే అన్ని రకాల శిక్షలకు కూడా అంతే అలవాటుపడ్డాను. తృప్తిగానే ఉన్నాను. ‘గానే’ కాదు తృప్తిగా ఉన్నాను. సంతృప్తిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. నాతో జీవించేవాళ్ల సంగతి మాత్రం స్పష్టంగా తెలీదు. నాకు అనవసరం కూడా.
సర్వీసులో ఏళ్ళు గడుస్తున్నాయి కాబట్టి ప్రమోషన్లు వస్తున్నాయి గానీ, నా బోటి వారికి అసలు ఇవ్వరు. అన్నీ ఎక్కువే మనకు. తెలివితేటలని ఎదుటివారి ముందు ప్రదర్శించకూడదని తెలుసు, కానీ నా ప్రమేయం లేకుండానే బయటికి తన్నుకొస్తూ ఉంటాయి. పిరికి వాడి అసహాయత లాగా అణుచుకోలేకున్నాను. మరీ ముఖ్యంగా మన బాస్ ల ముందు బయట పడకూడదు. ఉబికి వచ్చే ఊటని ఆపడం ఎవరి వల్లా కాదు. అది అందరి గొంతు తడపాలి అన్న ఉబలాటమే తప్ప, ఎవరి సీటు కిందో తడి చేస్తుందోనని పట్టించుకోని మనస్తత్వం.
అన్ని రంగాల్లో ప్రవేశముంది. దాదాపు అన్ని విషయాల్లో అంతో ఇంతో అవగాహన ఉంది. అకస్మాత్తుగా ఏదైనా కొత్త విషయం గురించి మాట్లాడమని అడిగితే తడబడకుండా కనీసం అయిదు నిమిషాలు మాట్లాడగలను. ఇది ఎచ్చులు చెప్పుకోవడం అన్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా నేను పట్టించుకోను. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం ప్రారంభిస్తే దాన్ని లోతుల్లోకి వెళ్లి శోధించడం అలవాటుగా మారింది. ప్రతీదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస సాఫ్ట్ వేర్ రంగం మీద పట్టు దొరికేట్టు చేసింది. హ్యాకింగు నుండి AI వరకు పూర్తిగా వాడగలిగే స్థాయిని అందుకున్నాను.
మెదడు ఏ రోజుకారోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ముందే చెప్పినట్లు ఒక్కసారి దృష్టి సారిస్తే చాలు అంతా అర్ధమైపోతుంది. ఫోటో గ్రాఫిక్ మెమొరీ అంటారు అదన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు మెదడులో ముద్రించుకుపోతుంది.
నాతో పాటు పని చేసే ఈ మధ్యే పెళ్ళైన ఒక అమ్మాయి నన్నో పెద్ద narcissist అంటూ ఉంటుంది. గూగులించాను. ఆమెకు అలా అనిపించడం సహజమనిపించింది,
నాతో బతికే వాళ్ళూ, జీవించే వాళ్లూ ఎవరూ నా అంత తృప్తిగా బతకట్లేదు, జీవించట్లేదు అని మాత్రం నాకు తెలిసిపోతూనే ఉంది. ప్రపంచంలో నటులకు కొదవలేదు. నాకు వంటబట్టలేదు, అవసరం కూడా లేదు.
ఈ మధ్యే నాకు కొంచం అసహనం ఆవహించిందనిపిస్తూంది. క్రమశిక్షణ ఇంటి పేరుగా స్థిరపరుచుకున్న నాకు అది తప్పేవారిని చూస్తే, నాకు తెలీకుండానే బీపీ పది పాయింట్లు పెరిగినట్లవుతుంది. నరాల్లోని రక్తం ఉరకలెత్తుతూ ఉంటుంది. గతి తప్పుతూ ఉంటుంది. వయసుతో పాటు పెరిగే చాదస్తమా, సక్రమంగా ప్రవర్తించని వారిని చూస్తే వచ్చే కోపమా అర్ధం కావడం లేదు. చిరాకు ఎక్కువైంది. అసహాయత ఆకాశాన్నంటింది. పద్ధతులకు తిలోకదాలిచ్చేవారికి తిలలతో కూడిన ఉదకాలు ధారపోయాలనిపిస్తూంటుంది.
ఎలా మార్చాలి వీరిని. ఎట్లా అదుపులో పెట్టాలి. ఎవరికైనా చెబితే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ అవి జీవితం మీద చూపించే ప్రభావానికి మాత్రం అంతు లేదు. మనుషులందరిలో కామన్ గా ఉండాల్సిన కామన్ సెన్స్ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుందో అంతు చిక్కడం లేదు.
త్రివిక్రమ్అన్నట్లు ‘డబ్బులున్న వాళ్ళందరూ తెలివితేటలు గలవాళ్ళు అనుకుంటాం…తప్పు, వాళ్ళు కేవలం అదృష్టవంతులు మాత్రమే’ ఇది ముమ్మాటికీ నిజం అన్న సంగతి మాత్రం వాస్తవం. వీరిలో కూడా చాలా మందికి కామన్ సెన్స్ లోపిస్తూ ఉంటుంది. కలిమికీ, లేమికి కామన్ సెన్స్ కీ సంబంధం లేదు.
నిత్యం చూస్తున్న సంఘటనలు నన్ను కూర్చోనివ్వకుండా, మనశాంతిగా పడుకోనివ్వకుండా నన్ను అశాంతికి గురిచేశాయి…చేస్తూనే ఉన్నాయి.
ఆ రోజు జరిగిన సంఘటనతోనే నేను రోజూ చేస్తున్న ఈ హత్యలకు నాంది పలకడం జరిగింది. ఇది అనుకుని చేసిందేమీ కాకపోయినా, ఇన్నాళ్లుగా నాలో పేరుకుపోయిన అసహనం, అనిశ్చితి, ఆరాటం దీనికి దారి తీసింది అనుకుంటున్నాను. .
ఆ రోజు మా ఆఫీసు నుండి మండలాఫీసుకి వెళ్లే పనుండడం వల్ల లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. మధ్యాహ్నం అయ్యిందని దగ్గర్లో ఉన్న ఉడుపి హోటల్లోకి నడిచాను. ఈ చుట్టు పక్కల కొద్దో గొప్పో శుచిగా, రుచిగా ఉంటుందంటే అది ఇక్కడే. హ్యాండ్ వాష్ చేసుకుని పక్కనే ఉన్న నలుగురు కూర్చునే టేబుల్ దగ్గర ఒక కుర్చీ ఖాళీగా ఉండడం చూసి అక్కడ కూచుని మెనూ అంతా గాలించాను. ప్లేట్ మీల్స్ పూర్తిగా తినలేను, మిగల్చడం ఇష్టం ఉండదు …దోస, ఇడ్లీ తక్కువవుతుందని ‘పొంగల్’ అర్డర్ చేసి ఎదురు చూస్తూ ఉన్నాను.
అప్పటి వరకూ నా ఎదురుగా కూర్చుని వెజిటబుల్ బిర్యాని తినేసిన ఒకతను చేతులు కడుగుకోవడానికి లేచాడు. అతని ప్లేటు వంక చూస్తే చిరాకేసింది. కోడి కెలికినట్లు కెలికేసి ఉంది ప్లేటు. పూర్తిగా కూడా తినలేదతను. ప్లేటు చుట్టూ అన్నం మెతుకులు పరుచుకొని ఉన్నాయి. బిర్యానీలో వేసిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు, బీన్స్ ముక్కలు ప్లేటు పక్కన కుప్పగా పోసి ఉన్నాయి. అది చూసి చేయికడుగుకుంటున్న అతని వంక చూశాను.
రాజకీయనాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అకస్మాత్తుగా డబ్బు చేసిన వాళ్లు వేసుకునేటటువంటి తెల్లటి షర్టు వేసుకునున్నాడు. మూడు నాలుగు అయిదు వందల రూపాయల నోట్లు అతని ఉల్లిపొర జేబులోంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు తినకూడని పదార్థాలు ఏవీ కూడా తినే వంటలో వేయరు. అందులో వేసినవి ఎందుకు అలా ఏరి పక్కన పడేస్తారో నాకెప్పటికీ అర్థం కాదు. దాల్చిన చెక్కా, బిర్యానీ ఆకు లాంటివి అంటే అర్థం చేసుకోవచ్చు.
ఇంతలో వెయిటర్ ‘పొంగల్’ తీసుకు వచ్చి నా ముందు పెట్టాడు. మఘుమలాడుతున్నది. ఇందులో వేసే మిరియాలు పంటి కింద అలా నలిగినప్పుడు అద్భుతమైన రుచి నాలుకను తృప్తి పరిచి, మెదడుకు ఆస్వాదన కలగజేస్తుంది. అందుకు ఉపక్రమించబోతుండగా… ఒక్కసారిగా నా మీదా, నా ముందున్న ప్లేటులోని పొంగల్ మీదా నీటి జల్లు కురిసింది. తల పైకెత్తి చూశాను.
చెయ్యి కడుక్కున్న తెల్ల షర్టు చేతిని విదిలిస్తున్నాడు.
కోపం నషాళానికి అంటింది, అసహనం హద్దులు దాటింది, పిడికిళ్లు బిగుసుకున్నాయి. సంభాళించుకున్నాను. క్షణాల్లో నన్ను నేను నా ఆధీనంలోకి తెచ్చేసుకున్నాను. వెయిటర్ కి డబ్బులిచ్చి, ఆ ప్లేటు తీసెయ్యమని చెప్పి లేచాను.
తెల్ల షర్టు బయటికి నడుస్తున్నాడు. అతను పక్కనే పార్క్ చేసిన కారు దగ్గరకు చేరుకునే లోపల వేగంగా వెళ్లి వెనక నుండి పలకరించాను, “నమస్తే సార్, మీరూ…మిమ్మల్నెక్కడో కలిశాను…గుర్తుకు రావడం లేదు.”
ఆగి వెనక్కి తిరిగి నన్ను కింది నుండి పై వరకు ఒకసారి చూసి, “నాకూ గుర్తు రావడం లేదు,” అన్నాడు.
“మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా?” అతని కారు వెనక అద్దం మీద ఒక మూలగా ‘ఏ-1 బిల్డర్స్’ స్టికర్ని గమనించాననే సంగతి అతనికి తెలీకుండా అడిగాను.
“అవును సార్, బిల్డర్ని … ప్లాట్లు, భూముల అమ్మకం కూడా చేస్తుంటాను.” అడ్వర్టైజిమెంట్ మొదలెట్టాడు.
“అలాగా… మిమ్మల్నెక్కడో కలిశాను సారూ గుర్తుకు రావడం లేదు.”
అయిదు నిమిషాల్లో అతని బిజినెస్ కార్డు ఇచ్చాడు, అతను ఎక్కడెక్కడ బిల్డింగులు కట్టింది, ఎక్కడెక్కడ భూములు అమ్మిందీ, సమస్తం పది నిమిషాల్లో మొత్తం చెప్పేశాక, అతన్ని వదిలించుకుని బయట పడ్డాను. అతనిచ్చిన కార్డు వెనక అతని కారు నంబరు రాసుకున్నాను.
*** *** ***
హిందీలో ఒక సామెత ఉంది, ‘జో దిఖ్తా హై , వో బిఖ్తా హై ‘ కంటికి ఇంపుగా కనిపించేదే అమ్ముడు పోతుంది అని అర్థం. ఒక వస్తువుకే అంత ప్రాధాన్యత ఇచ్చే మనం, మనల్ని మనం అందంగా ఉంచుకోవడం మన కనీస ధర్మం. మురికి బట్టలు వేసుకున్నవాడికి, పద్దతిగా తయారయ్యే వాడికి సమాజం ఇచ్చే గౌరవం ఎలాంటిదో మనమందరం ఎరిగినవాళ్ళమే. కనీసం అద్దంలో కనిపించే వాడికి గౌరవం ఇవ్వడానికి మనస్కరించకపోతే, పక్కవాడెవడూ మనల్ని గౌరవంగా చూడరు.
ప్యాకింగ్ యుగంలో ఉన్నాము. మన విలువ పెంచుకోవడానికి మంచి ప్యాకింగ్ తప్పనిసరి. మడత నలగని బట్టలు చాలా మంది వేసుకుంటారు, దానికి కొన్ని మెరుగులు దిద్దుకుని, పర్ఫెక్ట్ కాంబినేషన్ లో తీర్చిదిద్దుకుంటే ఆ స్టయిలే వేరు. అలా తయారవ్వడం నాకు ముందు నుంచీ అలవాటు.
ఒక రోజు బైక్ మీద ఆఫీసుకి బయలుదేరాను. ఆర్టీసీ బస్సుని దాటుతూండగా బస్సు కిటికీలోంచి ఒకతను బయటికి ఊశాడు. నా గోధుమ రంగు షర్టు మీద గుట్కా మరకలు. హెల్మెట్ ఉంది కాబట్టి మొహం మీద పడలేదు, ఛాతీమీదా, భుజం మీదా అసహ్యమైన ఎర్రటి చారలు.
తరువాతి బస్టాపు దగ్గర బండి ఆపి తాళం వేశాక అప్పుడే వచ్చిన ఆ బస్సు ఎక్కి, గుట్కా ఊసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి నిల్చుని, మెల్లిగా అతన్ని మాటల్లోకి దింపుతూ నా గుర్తింపు కార్డు చూపించాను. అతని మోహంలో భయం ప్రస్ఫూటంగా కనిపించింది. అతని దగ్గర ఆధార్ కార్డు తీసుకుని నా మొబైల్ కెమెరాతో ఫోటో తీసుకున్నాను. మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని బస్సు దిగేశాను. నేను దిగేదాకా వెనక్కి తిరిగి అతను నా వైపే బెదురుగా చూస్తూ ఉండి పోవడం నాకు తెలుస్తూనే ఉంది.
*** *** ***
రెడ్ సిగ్నల్ పడిందని నా ఆల్టో కారుని నెమ్మదించి, ఒక ఆటో వెనకాల ఆగాను. నా వెనగ్గా ఆగిన రేంజ్ రోవర్ కారు ఆగకుండా హారన్ కొడుతున్నది. నా ముందు ఆటో, దాని ముందు ఒక ఆర్టీసీ బస్సు, వాటికీ ఇరువైపులా లెక్కకు అందని బైకులు. ఇంచి స్థలం లేదు జరగడానికి. రేంజ్ రోవర్ అరుస్తూనే ఉంది.
ఇలాంటి విషయాల్లో ఇమ్మీడియేట్ గా ప్రతిస్పందించే అలవాటు కొంచం తగ్గింది. అనుభవం పేరుకుంటున్నందుకు కాబోలనిపించింది. నా ఫోన్లోని వాట్సాప్ లో ఆ కారు నంబరు నోట్ చేసుకుని నాకే పంపించుకున్నాను.
ఆర్.టీ. ఓ. ఆఫీస్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ కార్ నంబర్ ఆధారంగా, అడ్రసు కనుక్కోవడం నాకు హ్యాకింగ్ తో పెట్టిన విద్య.
*** *** ***
ఈ సిటీలో కెల్లా పెద్ద ఫ్లైఓవర్ ఇది. పొద్దున్నే వేర్వేరు పనుల నిమిత్తం పరుగులు పెట్టే సమయం. ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ పరుగులు తీసే వేళ. సూపర్ ఫాస్ట్ గా వెళ్తున్న కారులన్నీ ఫస్ట్ లేన్ లో పోటీ పడుతున్నాయి. పోటీలో నేను కూడా ఉన్నాను.
సరిగ్గా ఫ్లైఓవర్మధ్యలోకి రాగానే కార్లన్నీ మందగించాయి. దాదాపు బండ్లన్నీ కిక్కిరిసి పోయాయి. ఒక ఎస్యూవీ చాలా అంటే చాలా నింపాదిగా కదులుతున్నది. దాని ముందంతా ఖాళీ రోడ్డు. వెనకాల చాంతాడంత జాతర. ఎస్యూవీ నడుపుతున్న అమ్మాయి ప్రపంచంతో సంబంధాలు తెగతెంపులు చేసుకుని ఫోన్లో పగలబడి నవ్వుతోంది. వెనకాల హారన్లు మారు మోగుతున్నాయి. అవేవీ ఆ అమ్మాయి చెవికి అందనట్లే ఉన్నాయి. బండ బూతులు తిట్టుకుంటూ ఆమె పక్కాగా వెళ్లిపోతున్నారు.
నా మెదడులో ఆ కారు నంబరు ముద్రించుకున్నాను. నాకు తప్పదు.
*** *** ***
సిటీలోని బండ్లన్నీ ఈ చౌరస్తాలోని కొలువు తీరి నట్లున్నాయి. వాహనాలు పెండ్లి నడకలు నడుస్తున్నాయి గ్రీన్ సిగ్నల్ వెలగగానే బండ్లన్నీ కళ్ళాలు విడిచిన అశ్వాలయ్యాయి. అప్పుడు ఆ రోడ్డుకు అడ్డంగా ఒక కాలేజీ అమ్మాయి, ఫోన్ చెవికి ఆనించుకుని సంజీవయ్య పార్కులో సరదాగా, కులాసాగా అడుగులేస్తున్నట్లు రోడ్డు దాటుతున్నది.
రోడ్డుకు వారగా బండి పార్క్ చేసి, రెడ్ సిగ్నల్ పడగానే జీబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్ దాటి ఆ అమ్మాయి వైపు అడుగులేశాను. ఆమెను చేరుకొని జేబులోంచి వాలెట్ తీసి ఫోటో షాప్ లో తయారు చేసుకున్న అనేక కార్డుల్లోంచి ఒక కార్డు తీసి ఆ అమ్మాయికి చూపించాను. డిపార్టుమెంట్ కార్డు అది.
“ఏమయ్యింది అంకుల్?” తడబడుతూ అడిగింది.
“ఒకసారి నీ కాలేజీ ఐడి కార్డు చూపించమ్మా, అలాగే ఆధార్ కూడా.”
సిన్సియర్గా తీసి చూపించింది. ఐ డి కార్డులోని వాళ్ళ నాన్న పేరు చెబుతూ, “ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ కదమ్మా?” అడిగాను.
“కాదంకుల్, హై స్కూల్ హెడ్ మాస్టర్,” ఇంకా వివరాలు చెప్పబోతూ ఉంటే, “సారీ అమ్మా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ వారి కూతురివనుకున్నా, సారీ,” అని చెప్పేసి వెనక్కి తిరిగాను.
అప్పటికే నా ఫోటో గ్రాఫిక్ మెమొరీ చిప్ లోకి ఆ అమ్మాయి ఆధార్ కార్డు అప్ లోడ్ అయిపొయింది.
*** *** *** పొద్దున్నే వాకింగ్ కోసమని బయల్దేరి ఎవరూ చూడకుండా చెత్త కవరుని ఏదో ఒక మూలలోకి పడేసే వాళ్ళు, ఎవరూ నిద్ర లేవక ముందు ఒక ఖాళీ కవరు పట్టుకుని అందరి ఇళ్ల ముందున్న పువ్వులు కోసే వాళ్ళు, బండికి ఇండికేటరు వెయ్యకుండా మలుపు తిరిగే వాళ్లు, పబ్లిక్ ప్లేస్ లో పాన్, గుట్కా ఊసే వాళ్లు, దమ్ము కొట్టే వాళ్ళు, ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టుకుని బస్సులో మాట్లాడే వాళ్ళు, మెట్రోలో ఉన్నప్పుడు ఫోన్లో గట్టిగా పోసుకోలు కబుర్లు చెప్పుకునే వాళ్ళు, రైల్లో వేయించిన వేరు శెనగలు తినేసి ఆ పొట్టంతా అక్కడే కింద పడేసే వాళ్ళు, పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించిన తరువాత ఫ్లష్ చెయ్యని వాళ్ళు, సినిమా థియేటర్లో ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకోని వాళ్ళు, రెస్టారెంట్లో తల దువ్వుకునే వాళ్ళు, తాగేసిన నీళ్ల సీసాలూ, కవర్లూ కారులోంచి బయట పడేసే వాళ్ళు, సిటీలో రోడ్డు పక్కన మూత్రం చేసే వాళ్ళు, రాంగ్ సైడ్ లో వాహనాలతో ఎదురొచ్చే వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ చేసే ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్లు, మైనారిటీ తీరని పిల్లలకు నడపడానికి బండ్లు ఇచ్చే వాళ్లు, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు, భుజానికీ చెవికీ మధ్య ఫోన్ ఇరికించుకుని బండ్లు నడిపే పుష్పాలూ, ఫంక్షన్స్ లో ప్లేట్ లో తినే పదార్థాలు మిగిల్చి చెత్త డబ్బాలో పడేసే వాళ్ళూ…వీళ్ళే, సరిగ్గా వీళ్ళే ఇంగిత జ్ఞానం లోపించిన వాళ్లు. పక్కవాడి గురించి పట్టించుకోని వాళ్ళు. ఏవరేమైపోయేదీ లెక్క చెయ్యని వాళ్ళు. కనీస క్రమశిక్షణ కూడా లేని వాళ్ల వల్ల ముందు ముందు చాలా అనర్థాలు జరగడానికి నూటికి నూరుపాళ్లు ఆస్కారం ఉంది.
క్రమశిక్షణ అంటే తెలీని వాళ్లకు బాధ్యత ఉండదు. బాధ్యత లేని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. అది దేశ హితానికే చేటు. కొన్నింటిని మొగ్గలోనే తుంచెయ్యాలి. తొలి దశలోనే చీడ పీడలను సమూలంగా నిర్మూలించాలి, లేకపోతే పంటంతా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. ఇలా చెప్పుకుంటూ పొతే రామబంటు వాలంలా అంతు చిక్కదు. ఒక్కరి కోసం వెతికితే వెయ్యి మంది దొరుకుతారు.
ఒక్కోసారి నా మీద నాకే అనుమానం వేస్తుంది. మెజారిటీ వాళ్ళు ఇలాగే బతుకుతున్నారు, మరి నాకెందుకు తప్పనిపిస్తూంది? లోపం నాలోనే ఉందేమోనని చాలా మదనపడి నాకు నేను సమాధానం చెప్పుకుని అప్పుడు మొదలెట్టాను ఈ హత్యలు.
రంగంలోకి దిగాకే తెలిసొచ్చింది ఇది అంత ‘వీజీ’ కాదని. ముందే చెప్పానుగా ఏదైనా లోతుల్లోకి వెళ్లి పరిశోధిస్తానని, హత్యలు చేశాక పోలీసులకు దొరకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను.
నేరాల్లో పార్టనర్ షిప్ పనికిరాదు. నేరం చెయ్యడానికి తోడు తీసుకెళ్లకూడదు. ఒక్కరే చెయ్యాలి. ప్రధాన సూత్రం ఇదే.
వెళ్లే దారి వచ్చే దారి ఒక్కటి కాకూడదు. పక్కనే ఉన్న సందులో హత్య చెయ్యాలన్నా కనీసం పది బజార్లు తిరిగి పని పూర్తి చేసుకుని మళ్ళీ కొత్త దారిలో ఇంకో రెండెక్కువ బజార్లు తిరిగి రావాలి. బట్టలు చెప్పులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ముదురు రంగు బట్టలు వేసుకోకూడదు. ప్రప్రధమంగా ఫోన్ తీసుకెళ్ల కూడదు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మాత్రమే వాడాలి. సీ సీ కెమెరాలు ఉన్న ప్రాంతాలను సాధ్యమైనంతవరకు ఉపయోగించకూడదు, తప్పని సరి అనిపించినప్పుడు మొహాన్ని సాధ్యమైనంత వరకు కప్పుకుని ఉండాలి.
హత్యలు చెయ్యడానికి రాత్రుల్లే అనుకూలం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు చంపడం కాస్త తేలిక. నలభై అయిదు దాటినా నేను బలంగానే ఉన్నానన్న నమ్మకం. కాకపొతే యవ్వన శిఖరాన ఉన్న వారితో పోలిస్తే కాస్త తక్కువనిపించవచ్చు. ఎక్కువగా ఈ మతి లేని తప్పిదాలు చేసేది వాళ్ళే. అందుకే రాత్రుళ్ళు ఎంచుకుంటాను.
అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నక నేను సిద్ధమౌతాను. వెలిసి పోయిన ట్రాక్ ప్యాంటు, చవక రకం రంగు వెలిసిన టీ షర్టు వేసుకుని బయలుదేరుతాను.
విజయవాడ సత్యనారాయణపురంలో నివసిస్తున్న ఆ అమ్మాయి అడ్రసు ఇంకా బుర్రలో తాజాగా ఉంది. గూగుల్ మ్యాప్స్ లో ముందే ఆ అడ్రసు చూసుకుని మెదడులో ctrl v చేస్తాను కాబట్టి, వెతుక్కోవడం తేలిక. కిటికీ గ్రిల్స్ స్క్రూలు జాగ్రత్తగా విప్పి బెడ్ రూమ్ లోకి నడిచాను. ఏం గుర్తొచ్చిందో నిద్రలో కూడా నవ్వుతోంది. దిండు పక్కనే ఆమె ఫోన్.
ట్రాక్ ప్యాంట్ బిగుతుగా కట్టుకోవడానికి ఉన్న నడుము నాడా విప్పి, ఆ అమ్మాయి మెడ చుట్టూ వేసి గట్టిగా బిగించాను…క్షణ కాలంలో కాళ్ళూ చేతులు గిల గిలా కొట్టుకుని ఊపిరి వదిలేసింది. వెంటనే అక్కడి నించి జారుకున్నాను.
ఖైరతాబాద్ ఆనంద్ నగర్ లోని అపార్టుమెంట్ లోకి కూడా అలాగే ప్రవేశించి, సినిమా థియేటర్లో ఫోన్ సైలెంట్ లో పెట్టుకోని కుర్రాడి గొంతు కోసి, విశాఖ గాజువాక, వినాయక్ నగర్ లో ఉంటున్న సుమారు నా వయసు దంపతులను ఉరేసి చంపేశాను, మైనారిటీ తీరని ముక్కు పచ్చలారని పసివాడు అమాయకంగా నిద్రపోతున్నాడు. పోర్టికోలో వాడు నడిపిన బుల్లెట్ బండి తళ తళా మెరుస్తున్నది. వాడి పాల బుగ్గలు ఒకసారి నిమిరి నిష్క్రమించాను. పాతబస్తీలోని తలాబ్ కట్ట దగ్గరున్న రైల్వే బ్రిడ్జి పక్క సందులోని ట్రిపుల్ రైడింగ్ చేసిన కుర్రాడి గొంతు నులిమి బయటపడ్డాను.
గుంటూరు, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాదు…క్షణం తీరిక దొరకట్లేదు.
ఇప్పటి వరకు మొత్తం నూట యాభయ్యారు మందిని పరలోకానికి పంపించేశాను. ఇంకా చాలా మంది మిగిలి పోతున్నారు. తప్పుడు ఆధార్ కార్డులు వాడే మోసగాళ్ళూ తారస పడుతున్నారు. పాపం నా నుండి తప్పించుకుందామనే అనుకుంటున్నారు. ఎవరినీ వదలను. తప్పదు. నా ధర్మం నేను నెర వేర్చాలి.
డేటా బ్యాంకు నిండి పోయింది కామన్ సెన్స్ లేని మనుషులతో. వరుస క్రమంలో కాకుండా కొంచం ప్రాధాన్యత ఎక్కువున్న కేసులను వెంటనే టేక్ అప్ చేస్తుంటాను. ఉదాహరణకి అంబులెన్స్ కి దారివ్వని వాళ్ళని అసలు ఉపేక్షించను.
ఈ రోజు కూడా ఆఫీసు నుండి మామూలు సమయానికే వచ్చాను. ఏడు గంటల లోపల స్నానము, భోజనము చేసేప్పుడు వార్తలు వింటున్నాను. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు.
” మన రాష్ట్రం ఇప్పుడు సంపన్న రాష్ట్రం. ప్రతి ఇంట్లో మనిషి కొక బైక్ గానీ, కారు గానీ ఉన్నాయి. జనాభా కన్నా వాహనాల సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి ఉన్న రోడ్లు సరి పోవట్లేదు, అందుకని మన నగరంలో రోడ్లు విస్తరించే పని చేబట్టబోతున్నాం. రోడ్లపై నడిచే పాదచారులు లేని సంపన్న రాష్ట్రంగాచేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఫుట్ పాత్ లు అవసరంలేదు….,” మెల్లిగా నా పెదవులు విచ్చుకున్నాయి.
అత్యంత ప్రాముఖ్యత గలిగిన కేసు కాబట్టి, దీనికే అతి ప్రాధాన్యత నివ్వాలని గబగబా భోజనం చేసేసి, ట్రాక్ ప్యాంటు, టీ –షర్టు వేసుకుని, నేను రోజూ వేసుకునే డోసు కంటే రెట్టింపు డోసు నిద్రమాత్రలని వేసుకుని మంచి నీళ్లు తాగిపడుకున్నాను.
నాకు తెలుసు ఈ రోజు నాకు అతి ప్రాముఖ్యత కలిగిన కల వస్తుందని.
