రాతి కొండ అద్భుతం

Spread the love

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక పేదవాడు. అతనికి ముగ్గురు కొడుకులు – పెట్రో, ద్మిత్రో, ఫెడ్కో. లోకం దృష్టిలో ఫెడ్కో కొంచెం అమాయకుడు. పని పాట చేతకానివాడు.

చూస్తూ చూస్తూనే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ కుటుంబానికి ఉన్నది కొద్దిపాటి పొలం. చిన్న మడి చెక్క. అది ఎంత చిన్నది అంటే చిన్న కుందేలు పిల్ల కూడా ఒక్క గెంతులో ఆ పొలం ఇవతల గట్టు నుండి అవతలి గట్టుకు అవలీలగా దాటెయ్యగలదు అన్న మాట! అంత చిన్నది! ఆ కుటుంబంలో పేదరికం ఏళ్ళ తరబడి పాతుకుపోయింది. ఎంత వదిలించుకుందాం అన్నా, జిడ్డులా వీళ్ళ కుటుంబాన్ని అస్సలు వదలట్లేదు.

ఒకరోజు ఆ పేదవాడు ఓ ధనవంతుడి దగ్గరకు వెళ్లి, “అయ్యా! నాకు ఒక జత ఎద్దులు, నాగలి అప్పుగా ఇప్పించండి. నేను, నా పిల్లలు మీ పొలాల్లో పని చేసి మీ ఋణం తీర్చుకుంటాం” అన్నాడు.

ధనవంతుడు దానికి ఒప్పుకొని, “సరే అయితే. వారంలో మూడు రోజులు నా పొలంలో పని చేయాలి చూసుకో మరి.” అన్నాడు.

“అలాగే అయ్యా!” అని పేదవాడు ఆ ఒప్పందానికి అంగీకరించాడు.

ధనవంతుడి ఇంటి నుండి ఎద్దులు, నాగలి తీసుకొచ్చి తన పెద్ద కొడుకు పెట్రోతో – “ఒరేయ్! ఊరి అవతల ఉన్న రాతి కొండను దున్ని, అక్కడ గోధుమలు సాగు చెయ్యి,” అని చెప్పాడు.

తండ్రి చెప్పినట్టు పెట్రో అక్కడికి వెళ్లి దున్నడం మొదలుపెట్టాడు. అయితే కొద్దిసేపటికే కొండ లోపల నుంచి ఒక నల్లటి, వెంట్రుకలతో నిండిన పెద్ద చెయ్యి బయటకు వచ్చి ఎద్దులను గట్టిగా ఒక్క దెబ్బ కొట్టింది. అంతే! ఆ దెబ్బకి ఎద్దులు, నాగలితో సహా లోయలో పడిపోయాయి.

పెట్రో భయంతో గజగజ వణికిపోతూ పరుగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి తండ్రికి జరిగిన సంగతి చెప్పాడు.

తండ్రికి చాలా కోపం వచ్చింది.

“నువ్వు అసలు నా కంటికి కనిపించకు. నా ఇంట్లో నుండి బయటకి ఫో!” అని అరిచాడు.

పెట్రో చిన్నబుచ్చుకున్న ముఖంతో జాకెట్ వేసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

తర్వాత పేదవాడు మరొక ధనవంతుడి దగ్గర నుంచి మరో జత ఎద్దులు, నాగలి అప్పుగా తీసుకొచ్చాడు. ఈసారి రెండో కొడుకు ద్మిత్రోను పిలిచి తన పెద్దకొడుకుకి ఇచ్చిన పనే ఇతనికీ అప్పగించాడు.

ద్మిత్రో కూడా తన అన్నగారి లాగానే రాతి కొండ దగ్గరకు వెళ్లి దున్నడం మొదలుపెట్టాడు. అక్కడ అసలు అన్నయ్య పొలం దున్నిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. కొంత దున్నగానే మళ్లీ అదే నల్లటి వెంట్రుకల చెయ్యి బయటకు వచ్చి ఎద్దులను, నాగలిని లోయలోకి విసిరేసింది.

ద్మిత్రో ఇంటికి వెళ్లడానికి భయపడి అన్నగారిని వెతుక్కుంటూ ఎటో వెళ్లిపోయాడు.

కొడుకుల కోసం ఇంట్లో తల్లి ఏడుస్తూంటే, తండ్రి, “నువ్వు ఏం కంగారు పడకు. పని పూర్తి చేసుకుని వస్తాడులే,” అని భార్యను ఓదార్చాడు.

మరుసటి రోజు చిన్న కొడుకు ఫెడ్కో మంచం మీద నుంచి లేచి, – “నాన్నా… ద్మిత్రో కూడా రాతి కొండను దున్నలేకపోయాడు. ఎద్దులు చనిపోయాయి. నాగలి కూడా పాడైంది. చిన్నన్నయ్య కూడ పెద్ద అన్నయ్యని వెతుక్కుంటూ ఎటో వెళ్లిపోయాడు,” అన్నాడు.

“ఇవన్నీ నీకు ఎలా తెలుసు?” అని తండ్రి ఆశ్చర్యపోయాడు.

“నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే!” అన్నాడు ఫెడ్కో.

తండ్రి కొండ దగ్గరకు వెళ్లి చూశాడు. నిజంగానే రెండు జతల ఎద్దులు, రెండు నాగళ్లు లోయలో పడి ఉన్నాయి.

తండ్రి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు. చేతికి అందివచ్చిన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకోవడమే కాకుండా, తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు.

అప్పుడు ఫెడ్కో, “నాన్నా, బాధపడొద్దు. రేపు నేను వెళ్తాను. గోధుమలు వేస్తాను. నా అన్నలను, ఎద్దులను కూడా తిరిగి తీసుకొస్తాను,” అన్నాడు.

మళ్లీ మరొక ధనవంతుడి దగ్గర నుండి ఎద్దులు, నాగలి అప్పుగా తెచ్చి ఫెడ్కోను పంపించాడు తండ్రి.

కొండ దగ్గరకు వెళ్లి లోయలో చనిపోయిన ఎద్దులను చూసి మొదట ఫెడ్కోకు కూడా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని దున్నడం మొదలుపెట్టాడు.

కొద్దిసేపటికి మళ్లీ అదే నల్లటి వెంట్రుకల చెయ్యి బయటకు వచ్చింది.

ఈసారి ఫెడ్కో వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

బలంగా లాగుతూ ఉండగా చివరకు మొత్తం దెయ్యమే బయటకు వచ్చింది.

ఫెడ్కో దాని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి మోకాలితో అదిమిపట్టాడు.

“నువ్వు ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నావు? ఇక నిన్ను వదలను!” అన్నాడు.

నిజానికి అది దెయ్యం.

కానీ ప్రాణభయంతో,

“ఫెడ్కో! నన్ను చంపకు. నీకు దణ్ణం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను.” అని వేడుకుంది.

ఫెడ్కో చిన్న కత్తితో దెయ్యం ఎడమ చెవి కొస కొంచెం కోసి తన నడుముకు ఉన్న దట్టీలో పెట్టుకున్నాడు.

ఫెడ్కో దెయ్యాన్ని  బెదిరిస్తూ “ఇప్పుడు నువ్వే కాడి మెడ మీద వేసుకుని నాగలితో ఈ రాతి కొండ అంతా దున్నాలి. ఇక్కడ బంగారు గోధుమలు పండాలి. చూసుకో.” అన్నాడు.

దెయ్యం మెడలు వంచి, ఫెడ్కో బలవంతంగా దాన్ని నాగలికి కట్టాడు.

దెయ్యం చెమటలు కారుస్తూ మొత్తం కొండ అంతా దున్నేసింది.

వెంటనే ఫెడ్కో పరుగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి – “నాన్నా! త్వరగా గోధుమలు ఇవ్వండి. అక్కడ దెయ్యానికి ఎక్కువ టైం లేదు!” అని అరిచాడు.

తండ్రి రెండు గుప్పెళ్ళు గోధుమలు ఇచ్చాడు.

దెయ్యం పొలంలో ఆ గోధుమలు చల్లి తన తోకతో నేలను చదును చేసింది.

పని పూర్తయ్యాక, దెయ్యం –  “దయచేసి నా చెవి ముక్క నాకు తిరిగి ఇచ్చెయ్యి” అని వేడుకొంది.

దానికి ఫెడ్కో నవ్వుతూ, “ముందు నా ఇద్దరు అన్నలను తీసుకురా,” అన్నాడు.

దెయ్యం వెంటనే గాలి వేగంతో వెళ్లి పెట్రో, ద్మిత్రోలతో తిరిగొచ్చింది.

“ఇంక ఇప్పుడయినా నా చెవి ముక్క నాకు ఇచ్చెయ్యి” అని బతిమలాడింది దెయ్యం.

“అప్పుడేనా? ఎద్దులు, నాగళ్లను ఎవరు తీసుకొస్తారు?” అన్నాడు ఫెడ్కో.

దెయ్యం వెంటనే లోయలోకి వెళ్లి ఎద్దులను బతికించి, కొత్త నాగళ్లతో సహా ప్రత్యక్షమయింది.

అప్పుడు ఫెడ్కో, చెవి ముక్క తిరిగి ఇచ్చేస్తూ –

“ఇక మీదట మనుషులకు ఎప్పుడూ ఎలాంటి కీడు చేయకు. వాళ్ళను ఇబ్బంది పెట్టకు. మళ్ళీ ఈ దరిదాపుల్లో కనిపిస్తే నిన్ను ప్రాణాలతో వదలను జాగ్రత్త!” అని హెచ్చరించాడు.

దెయ్యం వెంటనే అక్కడి నుంచి తోక ముడిచి పారిపోయింది.

ముగ్గురు అన్నదమ్ములు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు.

ముగ్గురు కొడుకులు తిరిగి రావడం చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.

మరుసటి రోజు తండ్రి రాతి కొండ దగ్గరకు వెళ్లి చూస్తే గోధుమ పంట బంగారు రంగులో మెరిసిపోతూ కోతకు సిద్ధంగా కనిపించింది.

తండ్రి ఆనందంతో ఇంటికి పరిగెత్తుకు వచ్చి – “రండర్రా రండి! కొడవళ్లు తీసుకురండి. మన పంట కోతకు సిద్ధంగా ఉంది!” అని అరిచాడు.

పెట్రో, ద్మిత్రో వెంటనే కొడవళ్ళు పట్టుకుని కోతకు బయలుదేరారు.

ఫెడ్కో మాత్రం ఎప్పటిలాగే మంచం మీద బాసింపట్టు వేసుకుని కూర్చొని తన పిల్లి పిల్ల తో ఆడుకుంటున్నాడు.

ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది.

శుభం..!

శివ చల్లా

5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్‌.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్‌మెంట్‌లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు. ఇదే వీరి తొలి అనువాదం.
నివాసం: హైదరాబాద్, మొబైల్: 9574696282, ఇ-మెయిల్: challashiva4232@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *