ఎండ
~ రాచకొండ విశ్వనాథ శాస్త్రి
మన ఊరిచివర(కింద టేడు వ్యాపారం గురించి కలకత్తాకి వెళ్తూ వెళుతూదార్లో అకస్మాత్తుగా చచ్చి పోయిన), మనూరి పాత మొఖాసాదార్ గారి తోటలో ట్రంకురోడ్డుకి ప్రక్కగా చీకటిమర్రి చెట్టుకింద ఒంటిగా -నిల్చున్న పాడుపడ్డ గదిలో కాపరం వుంటూ, ఊళ్ళో ఇంటింటికి తిరిగి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముకుబతికే శారదమ్మగారి.. ఆరేళ్ళ కూతురు సుందరం ఓ రోజు సాయంకాలం వాళ్ళమ్మని.
“అమ్మా అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?” అని అడిగింది.
సాయంకాలం చాలా చీకటిగా చాలా భయంగా మరోఘడియలోనో క్షణంలోనో మనింటికి రాబోయే చావులా వుంది. మూడ్రోజులపాటు మన్నూ మిన్నూ ఏకమైపోయినట్టనిపించింది, ఇవాళ నాలుగో రోజు వుదయానికి కాస్త తెరిపిచ్చిందేకాని, ఆకాశం మాత్రం రవ్వంత మేరయినా విడకుండా మబ్బుతో దట్టంగా మూసుకుపోయేవుంది. వర్షంతోపాటు ఈ మూడ్రోజులూ చలిగాలికూడా ప్రచండంగా వీచివీచి నానా భీభత్సం చేసింది. ఈరోజు మాత్రం గాలిబాగా సద్దుమణిగింది. శారదమ్మ గది వెనకనున్న పాపతోటలో చెట్లన్నీకూడా పగవాడు తెరిపివ్వకుండా తీసిన పిడుగు దెబ్బకి తట్టుకోలేక చెల్లాచెదురై పోయి అలిసిపోయి మరింక కదల్లేక శవాల్లా వుండిపోయిన బీదవాళ్ళకోటలోని పేదజనంలా వున్నాయి.
“అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా!” అని అడిగింది సుందరం. కూతురు వేసిన ప్రశ్న శారదమ్మ వినిపించుకోలేదు. ఆవిడ, ఆ కిటికీల్లేని చీకటిగది గుమ్మం ముందున్న సన్నపాటి నడవలో కూర్చోని, పాత హరికెన్ లాంతరు చిమ్నీ బీటలు విడిపోకుండా నెమ్మదిగా భద్రంగా తుడుస్తోంది.
సుందరం తన ఆరేళ్ల జీవితంలోనూకూడా ఇంత గాలీ వర్షం… ఎన్నడూ ఎరగదు. మొదటిరోజున సరదా పడ్డది కాని రెండో రోజు రాత్రికల్లా ఆ పిల్లకి భయం పట్టుకుంది. మూడోరోజల్లా ఈ వర్షం మరింక తగ్గదు కాబోలు ఎండ మరింక రాదు కాబోలు అనుకొని బెంగపెట్టేసుకొని ఏడుస్తూ కూర్చొంది. ఈ రోజు పొద్దున్నుంచీ కూడా వర్షం లేకపోవడంతో ఆమెక్కొంచెం ధైర్యం వచ్చింది కాని, ఎండ తప్పక రేపొస్తుందని అమ్మకూడా చెప్తేకాని ఆ పిల్లకి పూర్తిగా నమ్మకం కుదరదు.
“అమ్మా! ఎండమ్మా ఎండ, ఎండ ఎప్పుడొస్తుందమ్మా?” అని మళ్ళీ అడిగింది సుందరం.
సుందరానికి ఎండంటే ఎంతో ఇష్టం.
వాళ్ళ నాన్న పైనింకా ఉన్నప్పుడు, రెండేళ్ళ కిందట, కార్తీక మాసంలో వాళ్ళ నాన్నతోనూ అందరితోనూ కలిసి సుందరం వన సంతర్పణకి వెళ్ళింది. నాన్నతో మిల్లులో వచ్చేసే మిగతా పనివాళ్ళూ, వాళ్ళ ఆడవాళ్ళూ, పిల్లలూ అంతాకూడా వచ్చేరా రోజున. బంగారం లాంటి ఎండని సుందరం ఆ ఒక్కరోజే చూసింది. అక్కడ కొండవార రాజుగారి పువ్వుల తోటలో అంతా చీకటితోనే వెళ్ళి దిగి అక్కడే వండుకొని తిసుకొని ఆడుకొని పాడుకొని రోజు రోజుల్లా హాయిగా గడిపేరు.
ఆవేళ పొద్దున్నే కొండమీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండ – నీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే “నెమిలి పింఛంలా మెరిసింది. మరి కొంతసేపటికి ఆ యెండే ముద్దుగా విడుతున్న గులాబి పువ్వులతోటలో ఎర్రగా విరిసింది. పది గంటలకి ఎండ వెచ్చవెచ్చగా వుంటూ కమ్మగా వండిన వంట వాసనల్లో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా వుంది. పన్నెండు గంటలకి చెట్ల ఆకుల్లోంచి పల్చపల్చగా కిందికి జారిన ఎండ పౌర్ణమి నాటి అర్థరాత్రి పండు వెన్నెల్లా సుఖంగావుంది. చెట్లకింద కొత్త తాటాకు చాపమీద వెల్లకిలా పడుకున్న సుందరానికి పైనున్న లేతాకు “అన్నీ ఆకుపచ్చ గాజుతో నాజూగ్గా చెక్కిన గాజూకుల్లా వింతగా కనిపించేయి. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళా మెరిసింది.
ఎండంటే సుందరానికి ఎంతో ఇష్టం. కాని, ఎండని సరిగ్గా చూడ్డానికి ఆ పిల్లకి ఎప్పుడోకాని అవకాశం వుండదు. శారదమ్మ ఊళ్ళోకి పోకపోతే ఆవిడకి దినం గడవదు. అంచేత, సుందరం ఇంటిపట్టునే వుండితీరాలి. ఇంటి కాపలా వుండి, చెల్లెల్ని చూసుకోవాలి. అన్నయ్య ఎక్కడికీ పారిపోకుండా కాసుకోవాలి. వాళ్లుండే గది వెనక కొండదాకా వున్న పాతమామిడితోట ఎప్పుడూ చీకటిగా వుంటుంది నాలుగైదేళ్ళయి ఆతోట పూతాలేదు. కాపూలేదు ఎదరగావున్న రోడ్డు. క్కూడా రెండువైపుల్నుంచీ ఎత్తుగా దట్టంగా కమ్ముకున్న చెట్లతో అదో పొడవాటి గుహలా వుంటుంది. సుందరం వుండే పాతగదికి వీధి చీకటిగా వైపుకి ఒక్క గుమ్మంతప్ప కిటికీల్లేవు. గదంతా చాలా వుంటుంది. గదికి ఎదురుగా కొంచెంపక్కగా వున్న పాతమర్రి చెట్టు దగ్గిరకొచ్చిన వాళ్ళని ఊడల్లాంటి చేతుల్తో లుమ్మల్చుట్టేసి తినేస్తూ కాలం గడిపేసే కదల్లేని ముసలి రాక్షసిలా చీకటిగా భయంకరంగా వుంటుంది. కిందవున్న గదిలోకి ఒక్క చుక్కయినా రానీకుండా ఎక్కళ్ళేని ఎండనీ అదే మింగేస్తుంది. తాగేస్తుంది. ఇంట్లోకి ఎండ ఎంతగా రాదో అంతగా ఎండకావాలి సుందరానికి.
చుట్టుపక్కల మైలుదూరంలో ఎక్కడా ఇళ్ళులేవు. రోడ్డుమీద జ నసంచారం కూడా అటేవుండదు. అమ్మ లేనపుడు వీధి గుమ్మంలో చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని బితుకూ బితుకూ కూర్చుంటుంది. సుందరం. ఆ పిల్ల ముఖంలో స్పష్టంగా కనిపించేవి కళ్లే. మర్రిచెట్టుకి చాలా అవతల మిగిలిపోయిన ఎండ ఆ కళ్ళల్లో బలహీనంగా మెరు స్తుంది. ఆపిల్లనోరు, చలిగాలికి ముడుచుకుపోయిన గులాబి మొగ్గలా, చాలా చిన్నదిగా వుంటుంది. గట్టిగా గెంతినా నవ్వినా ఆమెకి దగ్గోస్తూంటుంది. ప్రాణంతోపున్న సుందరానికి నీడగాపడిన సుందరంలా వుంటుంది సుందరం. అందుకే ఆ పిల్లని చూస్తూ చూస్తూ ‘ఈనీడ ఎప్పుడు మాయమైపోతుందోనని’ శారదమ్మ అప్పుడప్పుడు భయపడుతూ వుంటుంది.
వర్షంపడిన మూడ్రోజులూ ఎక్కడికి పోకుండా శారదమ్మ ఇంటి పట్టునే వుండిపోయింది. సుందరానికి అది కొంత నయం అనిపించింది, కాని ఆమెకి భయం మాత్రం లోజ్వరంలా అలా పుంటూనే వుంది. ఇవాళ వర్షం పళ్ళేదు. రేపు ఎండ రాదా అనుకొంది సుందరం. ఆకాశంలో మబ్బులు కొత్త బలాన్ని తెచ్చుకొంటున్నాయని ఆ పిల్ల గ్రహించుకోలేదు. కాని, ఆకాశంవైపు చూస్తేమాత్రం ఆమెకి బెంగ తగ్గడంలేదు.
“అమ్మ! అమ్మా! ఎప్పుడొస్తుందమ్మా ఎండా?” అంటూ తల్లి భుజం పట్టుకు ఊపుతూ మళ్ళీ అడిగింది సుందరం,
“రేపు రావొచ్చు తల్లీ :- అంది శారదమ్మా చిమ్మీ నెమ్మదిగా ‘తుడుస్తూనే.
“ఎండొస్తుందామ్మా?!”
“ఎందుకు రాత్తల్లీ?!”
శారదమ్మ అలా అనగానే సుందరం ఎగిరి గంతేసి తల్లి ‘ పక్కనే కూర్చున్న నాలుగేళ్ళ చెల్లెలు నరూతో. “చెల్లీ! చెల్లీ: రేపు ఎండొస్తుందిటే! ఎండ!! మరంచేత దేవుడికి దండం పెట్టమా!” అంది.
సరూ, గౌనులేకుండా లాగుమాత్రం తొడుక్కొని బుద్ధిగా అమ్మ పక్క మఠం వేసుక్కూర్చుంది. అక్కమాట వినగానే ఆ పిల్ల వీధి వైపు తిరిగి ముద్దుగా ఓ దండం పెట్టింది. సుందరం చెల్లెల్ని ముద్దాడి. అక్కణ్నించి గదిలోకి పరిగెట్టి, ఆ చీకట్లో గోడవార కర్ర పెట్టెమీద కూర్చున్న అన్నదగ్గిరకి వెళ్ళి, “అన్నా ఒరే! ఎండరా ఎండ! ఎండ రేపొస్తుందిట!” అంటూ సంతోషంతో కేకలు వేసింది.
అన్న, అంజిగాడు సుందరంకంటె రెండేళ్ళు పెద్ద. వాడికి కాళ్ళూ చేతులూ వళ్ళూ పెద్దవిగా ఉంటాయి; తలమాత్రం గుళ్ళీ చెంబులా చిన్నదిగా ఉంటుంది. వాడు ఎండా నీడా అంటే అర్ధం చేసుకోలేడు. అన్నం కలుపుకు తినలేడు. వాడికి మాటలు రావు, వాడు వెర్రివాడు; వాడెప్పుడూ ఆ కర్ర పెట్టెమీదే కూర్చుంటాడు. లేపోతే దాని మీదే పడుకుంటాడు. ఎప్పుడు నోట్లో వేలుపెట్టుకు కనిపిస్తాడు.
చెల్లెలి కేకలకి భయపడి అంజిగాడు నోట్లోంచి వేలు తీసేసి “ఏ.. ఏ.. ఏ” అంటూ కోపంతో కొట్టవచ్చినట్టుగా అరిచేడు. ఆ తరువాత చాలా కోపంగా నోట్లో వేలు పెట్టుక్కూర్చున్నాడు. సుందరం మాత్రం గెంతుకుంటూ తడి పరికిణీ పరపరలాడించుకొంటూ సరూ దగ్గిరకొచ్చి, రావే!” లేవే సరూ! రేపు ఎండొచ్చేదాకా ఆడుకుందాం అంటూ చెల్లెల్ని చెయ్యిపట్టుకు లేవదీసింది. ఇద్దరూ రంయిమంటూ నడవమీంచి వాకిట్లోకి గెంతి, అక్కడ నిలవనీళ్ళల్లో, చప్పట్లు, కొడుతూ, ఆడ్డం మొదలు పెట్టేరు.
“ఎండొస్తుందీ. రేపు ఎండొస్తుందీ నెమలికన్నులా వెండి గిన్నెలా ఎండొస్తుందీ! ఎంతో చక్కని ఎండొస్తుందీ;” అంటూ సుందరం పాడేపాట శారదమ్మ చెవిలో పడుతోందే కాని, ఆవిడ అదేదీ సరిగా వినడంలేదు.
లాంతరు ముందు కూర్చొని శారదమ్మ భగవంతుణ్ణి అగ్గిపుల్ల వెలిగించమని ప్రార్దిస్తోంది.
శారదమ్మకి దేవుడి యెడల భక్తేక్కువ. ఎన్ని విషయాల్లో భగవంతుడావిణ్ని ఎంత ఎడం పెట్టినా, ఆవిడమాత్రం ఆయన ముంగిట నుండి కదలకుండా మొండిగా కూర్చుంది ఏడాది కిందట. ఆవిడ పెనిమిటి తను పనిచేసే మిల్లు తాలూకు లేబరు వ్యవహారాల్లోకి కూలివాళ్ళ తరపున తను తగువుల్లోదిగి తగపుల్లో ఇరుక్కుని దెబ్బలాటల్లో చిక్కుకొని, ఖూనీ కేసులోకి అక్రమంగా ఈడవబడి, యావజ్జీవ కారాగారవాసశిక్ష అనుభవించటానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకి దేవుడంటే కొంచెం… అతి కొంచెం చిరుకోపం వచ్చింది. పెనిమిటికి శిక్ష పడిన నాటి రాత్రి ఆమె తన చీకటిగదిలో కూర్చొని, అంతకు ముందల్లా ఎంత దీనంగా దేవుణ్ని ప్రార్ధించిందో ఎన్నిసార్లు ఆ దీనరక్షకుడి ముందు భక్తితో మోకరిల్లి ఎన్ని కష్టాలనుండి కాపాడమని ఎంతగా వలవల ఏడ్చిందో తల్చుకొని, తీరని దుఃఖంతో ఉప్పెనగా ఏడ్చింది. “మీ అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నారు మందు కావాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు; పిల్లలికి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటితప్ప ఇంకేంలేదు; నాకెక్కడా ఎవరూ సహాయం లేరు; మాయందు దయ ఉంచి ఒక్కసారి రానాన్నా !” అంటూ ఎందరిచేత ఎన్ని కబుర్లు పంపినా, ఏడుస్తూ ఎన్ని
ఉత్తరాలు రాసినా, భయపడి గుండె బేజారెత్తిపోయి ఎన్ని అర్జంటు టెలిగ్రాములు కొట్టినా ఎంతకీరానట్టు డబ్బుగల తండ్రి మీద, పేదింటి కోడలైన ఆడకూతురికి కోపంవచ్చి అలిగినట్టు ఆమె ఆ రాత్రి భగవంతుడిమీద కోపం తెచ్చుకుని అలిగింది. కాని, ఆ కోపంలో కాఠిన్యంలేదు! ఆ అలగడంలో కల్మషం లేదు. మర్నాటికల్లా ఆమె సర్దుకొంది. భగవంతుడున్నాడు కాబట్టే. అతనెంతో మంచివాడు కాబట్టే తన పెనిమిటికి ఉరి శిక్ష తప్పించి జెయిలుశిక్ష వేయించేడు. ఇంత పనికిరాని తుచ్ఛజీవి ఏడుపువిని ఈ నిర్భాగ్యురాలి యెడల భగవంతుడు ఆపాటి దయ చూపించడం అదెంత కాదు!! మరో పదేళ్ళలో తన పెనిమిట్ని దేవుడే మళ్ళీ తనకి ఇచ్చేస్తాడు. “అబద్దం కేసులో ఎందుకు ఇరికించేవు? అన్యాయంగా శిక్ష ఎందుకు వేయించేవు?” అని అడగడానికి తనెవరు? తనేపాటిది? ఆ దయామయుడికి ఏం తోస్తే అది చేస్తాడు; లేకపోతే, చెయ్యకపోతాడు; అమాయకుల్ని రంపపు కోత కోస్తాడు; నిర్భాగ్యుల్ని నాశనం చేస్తాడు; అసహాయుల్ని హతమారుస్తాడు. అదంతా అతని ఇష్టం అతని లీల ప్రార్థించడమే మనపని కాని రక్షించమని ఆ మహానుభావుణ్ని బలవంత పెట్టడానికి మన మెవరం? అని సమాధాన పర్చేసుకొంది శారదమ్మ.
“అమ్మా అమ్మా! ఆకాశం అంతా మబ్బుగా మన మర్రిచెట్టులా ఉందమ్మా! ఎండ నిజంగా రేపొస్తుందా అమ్మా?” అంటూ అనుమానంతో నడవలోకివచ్చి అమ్మని మళ్ళీ భయం భయంగా అడిగింది సుందరం.
“దేవుడి దయుంటే ఒస్తుందమ్మా” అంది శారదమ్మ.
ఆవిడ రాత్రికి దీనం సంపాదించడం గొడవలో మునిగిపోయింది. లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు చూస్తే మూడే ఉన్నాయి. అందులో రెండప్పుడే వెలక్కుండా ఒట్టిపోయి విరిగిపోయేయి. మూడోది దేవుడి దయుంటే వెలుగుతుంది. .
లేదు, ఈ రోజుకి దేవుడికి శారదమ్మ యెడల దయలేదు. ఈ రాత్రికి ఈ ఇల్లంతా చీకట్లో ఉండవలసిందనే అతని అభిప్రాయం. అంచేత, చీకటి మరీ ఎక్కువవకుండా పిల్లలకి అన్నాలు పెట్టేస్తే, అందరూ వేగిరం కళ్ళు మూసుకు పడుకోవచ్చు. తెలివున్నంతసేపే కాని తెలివి తప్పిపోయేక దీపం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చచ్చిన వాళ్ళకి సౌఖ్యాలక్కర్లేనట్టు.
కాని, దీపం లేకపోతే పిల్లలు మధ్య మధ్య నిద్రలేచినప్పుడు భయపడి జడుసుకొంటారేమోనని శారదమ్మ భయపడుతోంది. అందులో ఊరవతల పాడుగుడిలో దెయ్యాల మర్రికింద కాపరమాయె!
అయినా ఇటువంటివాటి గురించి మనం ఏమీ అనుకోకూడదు. చింతించకూడదు. కించ పడకూడదు. ఈ పాడుపడిన గది దొరకడమైనా అదెంతకాదు!! పాతమొఖాసాదార్ గారి భార్యకి తమ యెడల భగవంతుడి దయవల్ల కరుణ కలగబట్టి అందులో ఈపాటి తలదాచుకోనిచ్చింది. వారానికి వంద అప్పడాలు పుచ్చుకోడం తప్ప అద్దిచ్చినా పుచ్చుకొంది కాదు. గొప్పవారిలో, డబ్బున్నవారిలో పెట్టిపుట్టిన మహారాజుల బిడ్డల్లో వెయ్యి మందిలో ఏ ఒక్కరికైనా బీదవెధవల మీదా, పేదముండల యెడలా ఆపాటి చిన్నపిసరు కరుణ కలగడం…. అదికూడా భగవంతుడి దయవల్ల కాకపోతే ఇంకేవిఁటి?ఆ వెయ్యిమందిలో ఆ ఒక్కరికైనా అంతపాటి కరుణయినా కలక్కపోతే నువ్వూ నేనూ శారదమ్మాచెయ్య గలిగిందేఁవుంది?!
“అమ్మా! గదిలో చాలా చీకటిగా ఉందమ్మా” అంది సుందరం.
“ఆవును తల్లీ!” అంది శారదమ్మ.
“మరైతే నడవలో భోంచెయ్యవాఁ అమ్మా?”
“అలాగే తల్లీ!”
రెండుపూట్లా వంటచేసి పిల్లలకి కాస్త వేడన్నం రెండు పూట్లా పెడదామంటే ఈ వర్షంవల్ల ఎక్కడా ఓ కాణీ అయినా పుట్టకుండా ఉంది. వర్షాలవల్ల కూరా నారా దొదకని ఈ రోజుల్లో అప్పడాలూ, వడియాలూ పేరయ్య కొట్టుమీద వేడి వేడిపకోడీల్లాగ జోరుజోరుగా చెల్లిపోను. కాని ఏం చేస్తాం? ఇంట్లో పిండిలేదు. ఎండలేదు.
“అమ్మా! కంచాలేసుకున్నాం.” అన్నం వీధి వరండాలోకి గిన్నెతో పట్టుకొచ్చింది శారదమ్మ.
“అటు చూడమ్మా! ఎంత చీకటిగా ఉందో!” అంది సుందరం.
ఆకాశంకేసి చూసేసరికి శారదమ్మకి నిజంగా చాలా భయం వేసింది. అలలు చచ్చిపోయి, కారునల్లగా నలుపెక్కిపోయి గడ్డకట్టుకుపోయి, ఏక్షణాన్నయినా ఫెళ ఫెళా మనమీదికి విరుచుకు పడిపోయే విషసముద్రంలా ఉంది ఆకాశం. బుసలుకొడుతూ విషసర్పాలూ దిగినట్టు రాత్రల్లా పడుతుంది వర్షం! తప్పదు మరింక!
“అమ్మా! అలా చూస్తున్నావేంటమ్మా? ఎండ రేపు రాదా?” అని అడిగింది సుందరం.
“ఏమోనమ్మా?ముందు మీరంతా బోంచేసి వేగిరం పడుకోండి: “
“ఎండ రాదేంటమ్మా?” అని మళ్ళీ అడిగిన సుందరం కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. అమ్మ ముఖంలో ఎండ రేపొచ్చే సూచనలు కనిపించలేదా పిల్లకి.
“ఎందుకమ్మా నీకా బెంగ? ఎండ తప్పక రేపొస్తుంది ముందు భోంచెయ్యి, బెంగ పెట్టుకోక!” అంది శారదమ్మ.
“నేను భోంచెయ్యనమ్మా!”
“అల్లరి చెయ్యకమ్మా సుందరం!”
“రేపు ఎండొస్తుందా?”
“ఒస్తుంది. భోంచెయ్యి.”
“నాన్నొస్తాడన్నాపు. రానేలేదు. నువ్విలాగే ఉత్తుత్తి మాటల్చెప్తావమ్మా.”
“మన చేతుల్లో ఏఁపుందమ్మా? దేవుడికి దయకలగాలి!
“దేవుడికి దయెప్పుడు కలుగుతుందమ్మా?”
“కలుగుతుంది తల్లీ! బెంగపడక భోంచెయ్యి!”అంది శారదమ్మ. అంతలో సరూ, “అమ్మా అగ్గి! అమ్మా అగ్గి!” అని కేకలు వేసింది.
చూస్తే, అవి చీమలు. మూడు కంచాల్లోనూ ఉన్న అన్నాల నిండా చిన్న ఎర్రచీమలు వందలు వందలు పాకుతున్నాయి. మూత సరిగా లేక అన్నం గిన్నె చీమలు పట్టేసింది. శారదమ్మకి ఏంచెయ్యాలో పాలుపోక అలా చూస్తూ నిల్చుంది. అంతలో ఆవిడ వెర్రికొడుకు వీధి వైపు చెయ్యి చూపిస్తూ,” ఆ ఆ ఆ! ఏ ఏ!” అని వెర్రినఫ్వు నవ్యుతూ కేకలు వేసేడు.
వీధిలో సుమారు రెండువందలమంది ముష్టివాళ్ళు గోనెలూ జోలెలూ డొక్కులూ కుండలూ కంపలూ పట్టుకొని మోసుకొని తొందర తొందరగా ఊరివైపుకి నడుచుకుపోతున్నారు. వాళ్ళంతా శారదమ్మ కావరం ఉండే గదికి కొంతదూరంలో ఉండే సాధుమఠంలో ఉంటూంటారు. ఇవాళ పొద్దున్న కాబోలు మఠం గోడొకటి వర్షానికి నానిపోయి కూలిపోయిందన్నారు. రాత్రికి వర్షం తిరిగివచ్చే సూచన్లు చూసి వాళ్లంతా మరెక్కడైనా తలదాచుకొందికి పోతున్నట్టున్నారు. సొట్ట వాళ్లు, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు జబ్బువాళ్ళు, ఆడ, మగ, ముసిలి, పడుచు (!) పిల్లవాళ్ళు అంతాకలిసి వర్షించే పెత్తనంలా ఘోష పెట్టుకుపోతున్నారు. విడివిడిగా చూస్తేవాళ్ళందరూ కూడా వర్షంలో కాలడానికి తడి కర్రలయినా దొరక్క, మరింక కుళ్ళికుళ్ళి ఇలాగే ఉండిపోవాలేమోననే భయంతో బెదురుతో గాభరాగా కట్టెల కోసం వెతుక్కొంటూ వరిగెట్టే నిన్నటి శవాల్లా ఉన్నారు.
వాళ్ళనలా చూస్తూ శారదమ్మ మౌనంగా నిల్చుండి పోయింది; సరూ, సుందరాలు మౌనంగా కూర్చుండిపోయేరు. వెర్రిపిల్లడు మాత్రం వాళ్ళని చూస్తూ సంతోషిస్తూ, వాళ్ళు దృష్టిపథంనించి దాటిపోయేక్కూడా చెయ్యి అటువై పే చూపిస్తూ నవ్వుకొంటూ కూర్చున్నాడు.
” అమ్మా! వాళ్ళెందుకమ్మా అలా పారిపోతున్నారు?” అని అడిగింది సుందరం.
“భయంచేత అలా పారిపోతున్నారమ్మా!”
“ఎందుకమ్మా వాళ్ళకి భయం?”
“వాళ్ళ బతుకులికి ఎండలేదమ్మా! అందుకూ భయం!”
“మరి, మనకి ఎండ ఉంటుందా అమ్మా!”
“దేవుడికి దయుంటే అందరికీ ఉంటుంది తల్లీ!”
“దేఁవుడికి మనందరిమీదా కోపవాఁ అమ్మా?”
“లే తల్లీ!” అంది శారదమ్మ.
దేవుడికి మనమీన దయలేదో లేక కోపంలేదో తెలీక సుందరం తికమకపడ్డది. శారదమ్మ మూడు కంచాల్లోనూ ఉన్న అన్నం మళ్ళీ, గిన్నెల్లోకి ఎత్తి, మూడుసార్లు నీళ్ళతో కడగ్గా చీమలన్నీ తేలిపోయాయి. తేలిపోయేయేకాని ఎన్ని చీమలు చచ్చిపోయేయో ఏవిఁటో అని శారదమ్మ చాలా బాధపడింది. పిల్లలకి అన్నం పెట్టడంకోసం చీమల కడుపులు కొట్టవలసొచ్చిందనేసరికి ఆమెకెందుకో కాని కడుపులో దేవేసినట్టయింది.
తడి అన్నంలో మజ్జిగ నీళ్ళువేసి ముగ్గురు పిల్లల చేతా శారదమ్మ భోజనాలు చేయిస్తూండగా వర్షం యధాప్రకారం నిన్నా, మొన్నా, అటు మొన్నట్లాగే పట్టుకొంది. వర్షాన్ని చూసి సుందరం బిక్క చచ్చిపోయింది; సరూ ఏడవడం మొదలెట్టింది. వెర్రివాడు మాత్రం అన్నం తినిపిస్తున్న తల్లిచెయ్యి తోసేసి. వర్షాన్ని చూస్తూ సంతోషిస్తూ వెర్రికేకలు వేసి నవ్వడం ప్రారంభించేడు.
పిల్లల భోజనాలయాక, శారదమ్మ గిన్నె కంచాలు కడిగేసి గదిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని బుద్ధిగా పడుకోమన్చెప్పి కేక వేసింది. వర్షం చాలా జోరుగా, తెగజోరుగా పడుతోంది. వర్షం చేసేచప్పుడికి, కేకలు వేస్తేగాని నడవలో మాట గదిలోకి వినిపించడంలేదు.
వెర్రిపిల్లడు నోట్లో వేలు పెట్టుకుని గోడవార కర్రపెట్టె మీద ముణుచుకు పడుక్కున్నాడు ఆ పిల్లడి మీద తడిపూర్తిగా ఆరని పాత చీరె మడతలు పెట్టి కప్పింది శారదమ్మ. మరోవారా పొట్టిమడత మంచంమీద సరూ సుందరాలు తడారని పాతబొంత కప్పుకు పడుకున్నారు. గదంతా యధాప్రకారం కురవడం ప్రారంభించింది. చూరు నుంచి కిందకి పడే నీటిబొట్లు చేసే చప్పుడు చావు చప్పుడులా ఉంది. పైన వర్షపు హోరు అదేదో రాక్షస రాజ్యంలో ప్రజలందరి ఘోషలా ఉంది.
బాగా చీకటిపడి గంటే అయిందో, రెండుగంటలే అయిందో, శారదమ్మా తడిపైటని గుండెలమీదకి తెచ్చుకు కప్పుకొని, చలికి పైటలో చేతులు ముణుచుకు దాచుకొని, నడవపక్క వీధిగుమ్మానికి చేర్లబడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకి నిద్రరావడంలేదు. వర్షంలోకి, అలా రెప్ప వెయ్యలేకుండా, అదే పనిగా చూస్తూ ఆలో చిస్తోంది.
చీకట్లో వర్షధారలు చాలా అస్పష్టంగా కనిపించడంచేత ఆకాశానికీ భూమికీ మధ్య నీరుతప్ప మరేం ఉన్నట్టు అనిపించడంలేదు. నీటి ధాటికీ గాలిగాలంతా కూడా అదిరిపోయి అణగారిపోయి ఎక్కడకో పారిపోయినట్టుంది. ఏ అడ్డూ లేకపోవడంతో వర్షించే పెనుమబ్బులన్నీ నీటితోనే భూమ్మీదకి దిగిపోయి ఆకాశమంత ఎత్తుకిలేచి అంత దళసరిగా ఉన్నట్టున్నాయి.
శారదమ్మ కళ్ళంట నీరు తిరగడం ఆ చీకట్లో కనిపించడం లేదు. చీకట్లో కూడా చీకటి నీడలా కనిపించే ఆవిణ్ని అక్కడ ఆ సమయంలో చూస్తే, అమావాస్యనాటి రాత్రి సముద్రం అట్టడుగున అణిగిపోయి ఒదిగి కూర్చున్న అటేదో వింత ప్రాణిలా కనిపిస్తోందో కాని మనిషిలా కనిపించడం లేదు.
తన మట్టుకు తనకి శారదమ్మకి, తనెక్కడో ఏదోలోతు దొరకని సముద్రం లోపల గులకరాళ్ళు గుహలో తేలలేక కూలబడి కూర్చున్న రీతిగానే తోస్తోంది. ఎంతటి ప్రకాశవంతమైన సూర్యరశ్మయినా ఇంత లోతు నీటిలోకి ఇంత లోతుకి దిగదు దిగజాలదు. ఈ మహాసముద్రపు విషపు నీటి అట్టడుక్కి ఏ యెండా, ఏ వెలుగూ ఎన్నటికీ రాదు. రాజాలదు. ఈ శారదమ్మ మరింక భూమ్మీదికి తేలడానికి ఏ అవకాశం అయినా సరే ఎక్కడా లేదు. ఉండదు ఉండబోదు.
ఆ సమయంలో శారదమ్మకి ఎండలేని తన బాల్యం, చలి కాలపు సాయంకాలపు ఎండలాంటి తన యవ్వనం, నీ రెండయినా చొరని రాతిగోడల మధ్య ఇరుక్కున్న తన పెనిమిటి రూపం, మెదడంతా చీకటితో నిండిన తన వెర్రికొడుకు జీవితం, ఎండకోసం పాకులాడుతూ తనతోపాటు ఈసముద్రపు అట్టడుగున, సముద్రమంత బరువు కిందా, ఈ చీకటి నీట్లో ఈదలేక తేలలేక చావలేక ఉక్కిరి బిక్కిరయి కొట్టుమిట్టాడే తన అతిచిన్న ఆడపిల్లల ఘోర పరితాపం అన్నీ గుర్తు కొచ్చి ఆమెని కుంగదీసి కలచివేయగా ఆమె కళ్ళంట జారిన కన్నీళ్ళు నడవలో రాతిగచ్చుమీదపడి అక్కడ కురుస్తున్న నీటితో కలిసి వాకిట్లోకి కుంటుకొంటూ పోయి, అక్కణ్నించి రోడ్డుమీదికి తేలి అక్కణ్నించి కాలవలోకి దూకి ఆ రాత్రి ఆ చీకట్లో ఆ వర్షంలో ఎక్కడో ఏ చీకటి సముద్రంలోకో కాని కొట్టుకుకొట్టుకుపోయి కలిసి పోయేయి.
వెర్రిపిల్లడు కర్రపెట్టెమీద వింత జంతువులా పడుకున్నాడు. “ఎండంతా చచ్చిపోయిందటే అక్కా? నిజం చెప్పవే” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సరూ చివరికి నిద్దరనే చీకట్లో మెల్లి మెల్లిగా కలిసిపోయింది. పిల్లల ఏడుపు వినిపిస్తే రాక్షసులొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని సుందరాన్ని ఎప్పుడో ఎవరో జడిపించేరు. ఆ జడుపు ఇప్పటికీ ఆమెని వదల్లేదు అందుచేత, రాక్షసులెవరికీ వినిపించకుండా, బెంగతోబాధతో చెప్పజాలని ఆవేదనతో ఆ రాత్రి అతి రహస్యంగా ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన సుందరాన్ని చూసిచూసి మరింక చూడలేక దయదల్చిన చాపులాంటి నిద్ర, ఆ పిల్ల కప్పుకున్న తడిబొంతలా ఆఖరి కెలాగైతేనేం ఆమెని అతిచల్లగా కప్పింది.
చీకట్లో తెరిపిలేకుండా పడే వర్షం, కళ్ళులేని గుండెలేని కారు నల్లని గీతల గీతల భూతంలా ఉంది.






