పహెలా జుమ్మా…
రంజాన్ కా చాంద్ కోసం కోట్లాది ముస్లిములు ఆకాశాన్ని తరచి తరచి చూస్తున్నారు. నెలవంక కన్పించీ కన్పించకుండా ఉండేలా ఆస్‌మానేమో ముసురు పట్టించుకుని ఏమీ ఎరగని నంగనాచిలా ఉంది. మొజంజాహీ మార్కెట్ ప్రాంతంలో డాబా మీద ‘చాంద్ కమిటీ’ బయోస్కోపులో ఆకాశం దిక్కు వేయికళ్ళతో చూస్తున్నది. అపార్ట్‌మెంట్ టెర్రస్ మీద నిలబడి దిల్‌సుఖ్‌నగర్ ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్న హుస్సేన్ సాహెబ్ వద్దకు వచ్చి అమీర్, “అబ్బా… అబ్బా చాంద్ ముబారక్. చందమామ ఢిల్లీలో కనిపించిందట. రోజా రేపటి నుంచే షురూ. ఇప్పుడే టీవీలో చెప్పారు” అన్నాడు. మసకమసక చీకటిలో సన్నగా, తెల్లగా, పెద్ద అరసున్నా ఆకారంలో కనిపిస్తున్న చందమామను చూడగానే ఎందుకో తల్లి జ్ఞాపకం వచ్చింది హుస్సేన్ సాహెబ్‌కు. తల కొడుకు వైపు తిప్పి అన్నాడు-
“అది సరేగానీ, నీకో చిన్న కథ చెబుతాను, విను. చాంద్, సూరజ్‌ల పుట్టుక గురించి మా అమ్మ ఆగమ్మ- అదే మీ దాదీమా చిన్నప్పుడు ఒక కథ చెబుతుండేది. సూర్యచంద్రులు స్వయానా అన్నదమ్ములంట. ఎవరో పిలిస్తే ఏదో దావత్‌కు పోయినారంట. సూర్యుడు, మెత్తటి మాంసం ముక్కలు తను తిని మిగిలిపోయిన బొక్కలు జేబులో వేసుకుని అమ్మకోసం తెచ్చినాడంట. చాందేమో, బొక్కలు తను తిని మెత్తటి ముక్కలు మూట గట్టుకుని అమ్మకోసం తెచ్చినాడంట. వాళ్ళమ్మ సూరజ్‌ను మలమలమాడుతూ ఎప్పటికీ ఎండల్లో చస్తూ, జనంచేత తిట్లు తింటూ బతుకు అని తిట్టిందట. చాంద్‌నేమో చల్లచల్లగా వెన్నెల్లో విహరిస్తూ అద్భుతంగా వెలిగిపోతూ బతుకు బేటా అని దీవించిందట.

“అబ్బే అది అబద్ధం అయ్యుంటది. అమ్మలు అట్లా ఎన్నడూ ఆలోచించరు. బిడ్డలందరినీ ఒకేలా ప్రేమిస్తారు. ఒకవేళ ఎవరిపట్లన్నా అయిష్టం ఉన్నా బయటకు చూపించరు” అన్నాడు అమీర్.
తండ్రీ కొడుకులైనా హుస్సేన్ సాహెబ్, అమీర్ మంచి స్నేహితుల్లా మాట్లాడుకుంటారు. సినిమాలకు, షికార్లకు, బజార్లకు కలిసే తిరుగుతుంటారు. హుస్సేన్ సాహెబ్‌ని ఇదీ, ఈ తరహా మనిషి అని చెప్పడం కష్టం. ఆ మాటకొస్తే ఎవరి విషయంలో అయినా అంతేనేమో. కాలచక్రంలో ప్రతి మనిషిలో మార్పులు సంభవించడం సహజం. ఏ వాతావరణంలో ఉన్నాడో ఆ వాతావరణం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. సహజంగా మనిషి పరిస్థితులకు లోబడి ఉంటుంటాడు.
మాహోల్ కా ఆసర్ ఆద్మీసే భీ శక్తిమాన్.
అందుకే హైదారాబాద్ వచ్చిన ఈ ఐదు సంవత్సరాల నుంచీ హుస్సేన్ సాహెబ్ రంజాన్‌లో రోజా ఉంటున్నాడు.
గతంలో అతనేనాడూ ఈ ఈద్ పండుగ ఉపవాసాలు ఉండలేదు.
అతనికి ఏ విషయంలోనూ ఖచ్చితమైన అభిప్రాయాలు లేవు. ఏ విషయానికైనా చాలా తొందరగా, చాలా సులభంగా ప్రభావితమైపోతాడు. ఈ ఒక్కపొద్దుల విషయమూ అంతే. కాకపోతే అదనంగా ఇంకొన్ని కారణాలున్నాయి. తనతోపాటు తన లోలోపల హమేశా ఉంటూ వస్తున్న అశాంతి, బేచైనీ శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతాయేమోననే ఒక ఆశ. నెలరోజులపాటు పాతబస్తీలోని పండుగ సంబరంతో సంబంధం ఉంచుకోవచ్చని, హలీం లాంటి ఎంతో రుచికరమైన వంటకాలు ఎక్కువసార్లు తినొచ్చనే భోజన ప్రియత్వం. దఫ్తర్‌లో ముస్లీం కొలీగ్స్ అంతా ఉపవాసాలు ఉంటుంటే వాళ్ళముందు టీలు, భోజనాలు చేయలేని మొహమాటం. శరీరంలో పెరుగుతున్న కొవ్వు, కుండమాదిరిగా ముందుకువస్తున్న బొజ్జకు కనీసం ఒక నెలరోజులన్నా ఆనకట్ట వేయవచ్చనే ఆలోచన. అలా రకరకాల కారణాల వలన అతను రోజా ఉంటున్నాడు.

అతను కిరాయికి ఉండే అపార్టుమెంటు చైతన్యపురి రామాలయం పక్కనుంది. అతడి ఆఫీస్ అబిడ్స్‌లో ఉంది. అతను ఉద్యోగనిమిత్తం ఆంధ్రా నుంచి వచ్చి దాదాపు పాతిక సంవత్సరాలు కావస్తోంది…. హైదారాబాద్‌కు రాకముందు వరంగల్లు, నల్గొండల్లో పనిచేశాడు. చాలా విషయాల్లో తండ్రీ కొడుకులిద్దరూ ఒకేరకంగా ఉంటారు. కొన్ని విషయాల్లో మాత్రం కొంత తేడా ఉంది. హుస్సేన్ సాహెబ్ మసీదు మనిషి కాడు. నమాజు చదివే అలవాటు లేదు. ముస్లిం మతంలో పుట్టినందున ముస్లిం అయ్యాడు. కానీ అతనేనాడూ ఇస్లాంను అనుసరించాలనే ఆలోచన కలిగినవాడు కాదు. పైగా అటువంటి ఆలోచనలు అతనికి రావు. ఎందుకంటే అతని పెద్దలకు కూడా నమాజ్ చదివే అలవాటు లేదు. అసలు వాళ్ళూరు మొత్తంలో ముస్లిం గడపలు ఓ వంద దాకా ఉన్నా, ఎవరికీ అటువంటి అలవాట్లు లేవు. వాళ్ళందరికీ తెల్లారింది మొదలు కడుపుకింత ముద్ద సంపాదించే పనే. వాళ్ళందరికీ ‘జీనేకి నమాజ్’ తోనే సరిపోయేది. కానీ అతని కొడుకు అమీర్ మాత్రం అల్లా విశ్వాసి. తనది ఇస్లాం మతం అనుకుంటాడు. కాకపోతే మసీదుకు పోడు. ఇస్లాం విషయాలు ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళింటికి దగ్గరలో మసీదు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళింటికి మసీదుకన్నా రామాలయమే దగ్గర. వాళ్ళ స్నేహితులు, ఇరుగుపొరుగూ అంతా హిందువులే. వాళ్ళు చిన్నప్పటి నుంచి అటువంటి మహోల్‌లోనే ఉన్నారు. ఎప్పుడైనా చార్మినార్ వైపు పోయివస్తే అమీర్ సంతోషంగా కనిపిస్తాడు. ఆ రద్దీ, ఆ ముస్లిం వాతావరణం, ఆ కట్టడాలు అవన్నీ వాడికి నచ్చుతాయి. కానీ వాడికి ఒక్కడే తిరిగే అలవాటు లేదు. ఎక్కడికిపోయినా వాళ్ళిద్దరూ కలిసేపోవాలి. ఇద్దరూ బిజీగా ఉంటారు. అంగ్రేజీ చదువుల్తో అమీర్, ఏవో ఆలోచనల్తో హుస్సేన్ సాహెబ్.
ఈసారి మాత్రం ‘రంజాన్ హైదారాబాద్’ను కొడుక్కి చవిచూపించాలనుకున్నాడు. వాడికి అదొక అనుభవంలా మిగల్చాలనుకున్నాడు. వాడీమధ్య ఉత్సాహంగా ఉండటంలేదు. పిల్లల్తో తల్లిదండ్రులు సన్నిహితంగా, ఆత్మీయంగా, నిత్యం కొంత సమయమన్నా గడపకపోతే వాళ్ళు మానసిక రోగులుగా తయారవుతారని ఎవరో వైద్యుడు రాస్తే చదివాడు. రెండవది, పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే మంచి బహుమానం ఏమంటే మంచి అనుభూతి కలిగించే వాతావరణంలో వాళ్ళను అనుసంధానం చేయడం అని హుస్సేన్ సాహెబ్ అభిప్రాయం. అందుకు రంజాన్ పండగ మంచి అవకాశం. ఎందుకంటే అదో మహా అద్భుతం, నెలరోజుల ఉత్సవం.
దూసరా జుమ్మా
ఒక శుక్రవారం సాయంత్రం ఇద్దరూ బస్టాపులో నిలబడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటే వాళ్ళూరు ఒంగోలులో ఉన్నట్టే ఉంటుంది. అక్కడ బస్సెక్కి మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌లో దిగారు.
హైదరాబాద్ స్వర్గం. లోకల్ బస్సు ప్రయాణం నరకం. చాదర్‌ఘాట్ నుంచి హైదరాబాద్ వాతావరణం వేరేగా కనిపిస్తుంది. ఖబర్‌స్తాన్‌లు, మజార్‌లు, ఆకుపచ్చ జెండాలు, కమాన్‌లు, మీనార్‌లు, గుంబజ్‌లు, మసీదులు, దాడీ టోపీలు, బురఖాలు అవన్నీ చూస్తూపోతుంటే ఒక ఉర్దూ చారిత్రక సినిమా కళ్ళముందు పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది. అదే అమీర్‌పేట్, సికింద్రాబాద్‌లలో అయితే ఒక మహాజనారణ్యంలో చిక్కుకున్నట్టు ఉంటుంది.
చాదర్‌ఘాట్ దాటి ఆజంపురా ముస్లిం హోటళ్ళ దగ్గరకు వచ్చారు. ఇవన్నీ పైపై మెరుగులే. హైదరాబాదు ఆత్మను చూడాలంటే మాత్రం ఇరుకిరుకు సందుగొందుల్లో తిరగాల్సిందే. రంజాన్‌కు సందడి సందడిగా కనిపించే ముస్లిం సెంటర్లు చాలా ఉన్నాయి. అందులో ఆజంపురా, డబీర్‌పురాలోని ఇక్బాల్ హోటల్, మదీనా సెంటర్, మక్కా మసీదు కొన్ని మాత్రమే. ఈ నెల్లోని నాలుగు జుమ్మా (శుక్రవారం) సాయంత్రాలూ ఆ ప్రాంతాల్లో కొడుకును తిప్పాలనుకున్నాడు. ఉపవాసదీక్ష విడిచే సమయాల్లో అక్కడి వాతవరణాల్లో ఒక హడావుడి ఉంటుంది. హైదారాబాద్‌లో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఈ ఉపవాసాలు ఉంటారు.
ఐదుపూటల నమాజేగాక అదనంగా తరావి నమాజులు చదువుతారు. తరావి నమాజులు అంటే మొత్తం ఖురాన్ అంతా హఫీజే ఖురాన్ చూడకుండా వినిపించడం మూజబాని అన్నమాట. రోజుచేసే ఐదు పూటల నమాజ్‌లో ఓ ఇరవై, ఈ తరావీలో ఓ ఇరవై, మొత్తం కలిపి సుమారుగా నలభై రకాతులు చదువుతారు. ఆ దెబ్బకి దేహంలోని సుస్తీ, నొప్పులు మొత్తం బైటకు వెళ్ళిపోతాయి.
ఆజంపుర పండ్ల దుకాణాల్లో, మిర్చీబండ్ల దగ్గర ఒక విధమైన కలకలం నడుస్తోంది. రోజ్‌దార్లందరూ అవీ ఇవీ కొనుక్కుని పొట్లాలు పొట్లాలు చేతుల్లో పట్టుకుని మసీదు వైపు పోతున్నారు. వాళ్ళిద్దరు కూడా ఖర్జూరాలు, తర్భూజ ముక్కలు, కీరదోస ముక్కలు, అరటిపళ్ళు, పైన్ యాపిల్ ముక్కలు కొనుక్కుని మసీదువైపు నడుస్తున్నారు.
“అబ్బబ్బా! అటు చూడు…. ఆ ఖర్జూరం నల్లనేరేడు పండులా ఎంత నిగనిగలాడుతుందో! ఇటు చూడు… ఈ ఖర్జూరం కొత్త చింతపండు రంగులో మెరుస్తోంది.
పాతబస్తీ గల్లీ గల్లీలో రాసులు రాసులు పోసి ఆ పళ్ళు అమ్ముతున్నారు.
“ఏంటా పళ్ళకు ముస్లిముల్లో అంత గిరాకి?” అమీర్ అడిగాడు.
కొడుకు ప్రశ్నలకు జవాబులివ్వటం హుస్సేన్ సాహెబ్ తన బాధ్యతగా తలుస్తాడు.
“అరబ్ దేశాల్లో ఖర్జూరం ఎక్కువ. ఆ దేశాల్నుండి ఎన్నో రకాలవి ఇక్కడకు వస్తుంటాయి. పైగా పైగంబర్ రెండు ఖర్జూరం పళ్ళతోనే రోజా విడిచేవారట. ప్రపంచవ్యాప్తంగా ముస్లిముల్లో చాలామంది పైగంబర్ జీవించినట్లు జీవించే ప్రయత్నం చేస్తుంటారు. అతని భాష అరబ్బీ. అందరూ అరబ్బీ నేర్చుకుంటారు. ఖురాను కూడా అక్కడి భాష అరబ్బీలోనే అవతరించింది. అక్కడ ఒంటెలెక్కువ. ఒంటె మాంసం తినటాన్ని ముస్లిములు ప్రత్యేకంగా భావిస్తారు. అటు చూడు, ఆ ఒంటెల్ని. రంజాన్ వరకు అవి అలా పాతబస్తీ మొహల్లాల్లో తిరుగుతూనే ఉంటాయి.”
అలా మాట్లాడుకుంటూ మసీదు చేరుకున్నారు. మసీదు లోపల దస్తర్‌ఖాన్లు పరచి వాటిమీద ప్లాస్టిక్ ప్లేట్లలో ఇఫ్తారి పెట్టి ఉన్నాయి.
వాటిముందు జనం కూర్చుని లోపల లోపల సూరాలు చదువుకుంటున్నారు. వాళ్ళు కొన్నవన్నీ వాటిల్లో ఉన్నాయి. అదనంగా ఉబ్లీహుయీ దాల్ ఉంది. వాళ్ళూ ఒక ప్లేటు తీసుకున్నారు. తాము తీసుకొచ్చిన వాటిని అందులో సర్దారు.
కొంతమంది పేపర్లు పరచి వాళ్ళు తెచ్చిన ఇఫ్తారి అందరూ తీసుకునే వీలుగా ఉంచారు. అందరూ ‘రోజా ఖోల్‌నే కి దువా’ చేసుకుని సైరన్ కొరకు సిద్ధంగా చూస్తున్నారు. పిల్లలంతా వెనుక వరుసలో కూర్చున్నారు. వారికి చివరి నిమిషంలో ఇఫ్తారి పంచారు. వాళ్ళెంతో ఉత్సాహంగా అవి అందుకుని ముందు పెట్టుకుని రెండు చేతులు కలిపి దువా చేస్తున్న ఫోజులో కూర్చున్నారు. రెండు ప్లేట్లు సంపాదించుకున్న పిల్లల చూపులు వెలిగిపోతున్నాయి. ఎవరికివారు పక్కవాళ్ళ ప్లేట్లలో ఏవి ఏవి లేవో చూసి నిశ్శబ్దంగా పెడుతున్నారు. ఒకరికొకరు ఎంతో ఉదారంగా, ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు. మసీదు స్థలంలో మహిమ ఉంటుందేమో, అక్కడున్నంతసేపూ మనుషులు ప్రేమగా, నిశ్శబ్దంగా ఉంటారు.
బై.. అని సైరన్ మోగింది. ఎవరో మసీదు మనిషి ‘పాతెహా’ అని పెద్దగా అన్నాడు. అందరూ నిదానంగా, నిశ్శబ్దంగా తినడం ప్రారంభించి క్రమేపీ గబగబా తినసాగారు.
రోజా ఖోల్‌నా చూడాల్సిన మంచి సన్నివేశం. సైరన్ ఇచ్చాక ఒక్క పది నిమిషాల సమయం ఉంటుంది, మగరిబ్ నమాజ్ చదవటానికి. అంత తక్కువ వ్యవధిలో తిని, తాగి, చేతులు కడుక్కుని జమాత్‌లో నిలబడాలి.
హుస్సేన్ సాహెబ్ చూపులు ఇద్దరు పిల్లలమీద ఉన్నాయి. వాళ్ళిద్దరూ చాలా దీనంగా కనిపిస్తున్నారు. చేతులు, కాళ్ళు నల్లగా ఆయిల్ మరకలతో కనిపిస్తున్నాయి. ఆటో మోటార్ కార్ఖానాలో పనిచేసే మెకానిక్ పిల్లలై ఉంటారు. వాళ్ళిద్దరూ గబగబ తిని, తినేసిన ప్లేట్లు, పొట్లం కాగితాలు ఎత్తుతూ, మిగిలిపోయిన పదార్థాలు అడిగి తీసుకుని ఒక పెద్ద కవరులో వేసుకుంటున్నారు. ఈలోపు అజా ఇవ్వటం, అందరూ జాని మాజ్‌ల మీదకుపోవడం జరుగుతూనే ఉంది. ఆ పేద మెకానిక్ పిల్లలు మసీదు వెనుకవైపుకు పోయి ఏదో చూసి వచ్చి నిరుత్సాహంతో మసీదు బయటకు వెళ్ళిపోయారు.
హుస్సేన్ సాహెబ్‌కు కూడా నమాజ్ చదవాలనిపించలేదు. అమీర్‌తోపాటు ఆ పిల్లల వెనగ్గా బయటకు వచ్చాడు. ఆ పిల్లలిద్దరూ ఒక నిర్జన ప్రదేశం చూసుకుని కవరులోనివీ పదార్థాలు తింటున్నారు.
వాళ్ళు నిలబడ్డ పక్కనే దహీకే బడే అమ్ముతున్నారు. హుస్సేన్ సాహెబ్ వాళ్ళిద్దరిని దగ్గరకు పిలిచి “దహీకే బడే తింటారా?” అని అడిగాడు.
వాళ్ళు మొహమాటపడ్డారు. హుస్సేన్ సాహెబ్ కొంచం బలవంతం చేసి ఇప్పించడంతో తీసుకుని తినసాగారు. అతను కూడా తింటూ “మీ పేర్లేమిటి? నమాజ్ కాకుండానే బయటకు వచ్చేశారేం?” అని అడిగాడు.
వాళ్ళిద్దరిలో చిన్నవాడు ఉత్సాహంగా ముందుకు వచ్చి “సాబ్ నా పేరు చాంద్‌పాషా. అయితే మా నానీమాకు అనరాక ‘బాద్‌షా’ బేటా అంటది. మా భయ్యా పేరేమో జహంగీర్. ఈరోజు మసీదులో ఖానే కీ దావత్ ఉందని ఏలాన్ చేశారట. మా నానిమా చెప్పి పంపించింది. అందుకే వచ్చాం. కాని ఇక్కడ అటువంటిదేమీ లేకపోయేసరికి నిరుత్సాహం వేసి బయటకొచ్చేశాం. బాగా ఆకలిగా ఉంది” అన్నాడు. చాంద్ మాటలు చాలా స్వచ్ఛంగా, మరెంతో అమాయకంగా ఉన్నాయి, వాడి లాగానే.
హుస్సేన్‌సాహెబ్‌కు వెళ్ళెంతో నచ్చారు. ఆ ఇద్దరు మెకానిక్ పిల్లల్ని తీసుకుని అమీర్‌తోపాటు, ఆటో ఎక్కి పిస్తాహౌస్ దగ్గర దిగాడు.
హోటళ్ళు, రోడ్లు విద్యుద్దీపాలతో, మనుషులతో వెలిగిపోతున్నాయి. రంజాన్ నెల్లో పాతబస్తీలో తిరగడం ఒక మంచి అనుభవం. అక్కడి రంజాన్ వంటకాలు తినడం ఇంకో మంచి అనుభవం.
పిస్తాహౌస్ హలీంలు నాలుగు తెప్పించాడు హుస్సేన్ సాహెబ్. లేత పొట్టేలు మాంసం, గోధుమలు, నెయ్యి ఇంకా ఏవేవో కలిపి ఏడెనిమిది గంటలు రాగి డేగిశాలో ఉడికించి ఆ హలీం తయారుచేస్తారు. సంగటిలా జావలా ఉండే ఆ ఇరాన్ వంటకం… అరబిక్ డిష్‌ను నలుగురూ ఎంతో ఇష్టంగా తిన్నారు. డబల్‌కా మీఠా, ఖుర్బానీ కా మీఠా, పర్ని, సేమ్యాలాంటి స్వీట్లు చిన్న చిన్న మట్టికుండల్లో అమ్ముతున్నారు. అవీ ఒక్కోటీ కొనుక్కుని తిన్నారు. తరువాత, ఆ ఇద్దరు పిల్లలు ఇన్ని డబ్బులు తమకోసం ఖర్చు చేసిన హుస్సేన్ సాహెబ్‌ని అనుమానంగా, కృతజ్ఞతగా చూస్తూ వెళ్ళిపోయారు.
తండ్రీకొడుకులు అఫ్జల్‌గంజ్ వరకు నడుచుకుంటూ వచ్చారు. దారిపొడుగుతా ఓ పెద్ద జాతర జరుగుతున్నట్టుంది. ‘ఆంటీనాడాలు’ అని అమ్ముకునే అబ్బాయి నుంచి ముత్యాలు అమ్ముకునే బడా వ్యాపారి వరకు దందాలు చేసుకునే ప్రతిఒక్కరికి ఈ నెలమొత్తం ఫుల్ సీజన్. జకాత్ కి సాడియా నుంచి జర్ కె సాడియా దాకా అమ్మే బట్టల షాపుల్ని, మనుషుల్ని చూస్తే మతిపోతుంది. అస్సలు నడవలేం. ఉర్సు జాతర జరుగుతున్నట్లు పాతబస్తీ మొత్తం ఎటుచూసినా మందే. తిల్ ఫేక్‌తో భీ నహీ గిరతా. ఇసుకేస్తే రాలనంత జనం. అఫ్జల్‌గంజ్‌లో దిల్‌సుఖ్‌నగర్ బస్సెక్కారు.
ఈ హంగామా అంతా చూశాక పాతబస్తీలో ఉండి ఇస్లాంను నమ్ముకుంటే రోజూ ఇవన్నీ అనుభవించవచ్చు కదా అనిపించింది అమీర్‌కు. అన్నీ అనుభవించాలనే తపన, అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి వాడికి ఎక్కువ.
“అబ్బా! రాత్రిళ్ళు ఇంత సంబరంగా తిరుగుతూ షాపింగులూ అవీ చేస్తుంటారు కదా. మరి పగటిపూటలు ఎట్లా గడుపుతారు? అసలు ఇంత ఆనందంగా ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు?” అని అడిగాడు. హుస్సేన్ సాహెబ్‌కు కొడుకుకు ఏదన్నా చెప్పాలన్నా, వాడితో మాట్లాడుతూ గడపాలన్నా ఎంతో ఇష్టం. వాడివైపు ముచ్చటగా చూస్తూ చెప్పాడు.
“రంజాన్ మాసంలో ఆకాశం నుంచి ఖురాను గ్రంథం భూమ్మీదికి దిగింది. అది ఇన్‌సాని కితాబ్ కాదు, ఆస్‌మాని కితాబ్ (దైవ గ్రంథం) ఖురాన్ భూమ్మీద అవతరించిన సంబరమే ఈ ఈద్ పండుగ. ఎంతో మితంగా తింటూ మరెంతో అపరిమితంగా అల్లా చింతన చేయడం రంజాన్. పగలంతా కనీసం ఉమ్మి కూడా మింగరాదు. సంపాదించిన ఆస్తుల్నించి, ఆదాయాల్నుంచి కొంతన్నా దానధర్మాలు చేయడం రంజాన్. హలీంలు తిని, షీర్ ఖుర్మా తాగి, ఈద్ ముబారక్ చెప్పుకోవడం రంజాన్ కాదు.”
సరియైన జ్ఞానం ప్రేమతో కలిపి ఇచ్చుకుంటూపోతే పిల్లలు నిజమైన మనుషులుగా మహాశక్తిమంతులుగా తయారవుతారని అతని నమ్మకం.
“ఇవన్నీ వింటుంటేనే లోపలికి ఏదో శక్తి చేరుతున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఆచరిస్తే జన్నత్ లభించకున్నా మనిషిలోపట మంచి పట్టు లభించేటట్టు ఉందే” అని, “ఇంకా చెప్పు” అన్నాడు అమీర్, ఉత్సాహం నిండిన గొంతుతో.
హుస్సేన్ సాహెబ్ తన గతంలోని విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ మరీ చెప్పసాగాడు.
“ఇప్పుడు కరెంటు సైరన్లు, అలారం గడియారాలు వచ్చాయి గానీ, గతంలో ఎక్కడివి పాతకాలంలో? ఇప్పటికీ కొన్ని కుగ్రామాల్లో కోడిపుంజు కూతలు, మసీదు అజాలే వారికి సమయాలు. ఉదయాన్నే కోడిపుంజు కొక్కొరొక్కో అని మూడుసార్లు కూస్తుంది. వాటి ప్రకారం వంటలు, ఒక్కపొద్దులు అయ్యేవి.
నా చిన్నప్పుడు మా అమ్మయితే ఫకీర్ ఖవ్వాలీతో లేచేది. లుంగీ, మెడ మీద రుమాలు తలకు గలప్ చుట్టుకుని వాస్కోటు వేసుకునే ఫకీరు చేతిలో డబ్బుండేది. ఫకీర్లు పైకి చూట్టానికి డాబుగా కన్పించే వాళ్ళుగాని, లోనంతా దరిద్రం డొల్లే. ఒక్క ఫకీర్లనే ఏంది మొత్తం ముస్లిం కమ్యూనిటీనే ఊపర్ షేర్‌వాని, అందర్ పరేశానీయే.
రోజూ అతనికి చారానో, ఆఠానో లేపినందుకు ఇచ్చేది. పండుగరోజు ఎక్కువ డబ్బులు ఇచ్చేది. అట్లా అందరూ ఇచ్చేవాళ్ళు. రోజూ ఒకళ్ళు అతనికి భోజనం పెట్టాలి. ఒక ఫకీరు ఒక ఊరి మొత్తాన్ని రంజాన్ కాలమంతా చూసుకునేవాడు. ఎంతోకొంత సంపాదించుకునేవాడు. ‘రంజాన్ నెల చందమామ’ నుంచి ‘ఈద్ కా చాంద్’ కనిపించే వరకు ఫకీర్లు, ఎంతోమంది పేదలు దండిగా సంపాదించుకుంటారు. జకాత్, ఫిత్రా, ఖైరాత్ పేరేదైతే ఏంది ఈ నెల మొత్తం పేదలందరికి డబ్బుకు డబ్బు, తిండికి తిండి దండిగొస్తయి. ఉపవాస దీక్ష విడిచే సమయానికి ఆకాశంలో అబాబిల్ చుడియా చీచీ అంటూ ఎగిరేవి.
సూరజ్ డుబ్‌తేచ్ అబాబిల్ ఉడ్‌తే, చీచీ బోల్‌కే పూకార్‌తే.
నిజాం జమానామే తోప్ ఉడాతే థే ఫిరంగి పేల్చేది. పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించేది. అప్పుడు రోజా విడిచేది” అమీర్లో ఇంకా ఆసక్తి పెరిగింది.
“ఇంకా చెప్పు, ఇంకా చెప్పు” అన్నాడు.
కొడుకు శ్రద్ధగా వింటున్నప్పుడు, ఓపిగ్గా తనకు తెలిసిన విషయాలు చెప్తుండటం ఆ తండ్రికి అలవాటే.
“ముస్లీం కుటుంబాల్లో ఈ నెల రోజులు నిద్రే ఉండదు. ఉదయం మూడు గంటలకే లేస్తారు. వంట చేసుకుంటారు. సూర్యోదయానికి ముందే తినేసి నియత్ చేసుకుంటారు. దాన్నే సైరీ కరనా అంటారు. ఆ సమయం నుంచి ఉపవాసం మొదలవుతుంది. ఫజర్ నమాజ్ చదువుతారు. యథావిధిగా సాయంత్రం వరకు నడుస్తుంది. మధ్యాహ్నము మూడు నుంచి తిరిగి వంట చేసుకుంటారు. సూర్యాస్తమయం అయ్యాక ఉపవాసదీక్షను పళ్ళతో విడిచి మగరిబ్ నమాజ్ చదువుకుంటారు. భోజనం చేస్తారు. ఇఫ్తారీ దావత్‌లు ఎక్కువగా అవుతుంటాయి. తరువాత యిషా నమాజ్ చదువుకుంటారు. ఆ తర్వాత తరావి నమాజు చదువుతారు. అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తారు. రోజ్‌దార్ల దినచర్య అలా ఉంటుంది. క్రమశిక్షణ, మనసును అదుపులో పెట్టుకోగలగటం లాంటి గొప్ప శక్తులు వస్తాయి.
హంగ్రీ ఈజ్ మై ఫుడ్. పావర్టీ ఈజ్ మై ప్రైడ్ అన్నారు ప్రొఫెట్. అన్నం కోసం, ధనం కోసం, కీర్తి కోసం, కామం కోసం మరిదేని కోసమైనా నిగ్రహంతో ఉండగలగాలి.”
అలా తండ్రి చెప్తూ, కొడుకు వింటూ ఇంటికి చేరారు.
తీసరా జుమ్మా

రంజాన్ మూడోవారం వచ్చింది. రోజ్‌దార్లకు ఖానేకి దావత్ ఇస్తూ ఆఫీసు కొలీగ్ పిలిస్తే హుసేన్ సాహెబ్ కొడుకుతో సహా వెళ్ళాడు.
హైదారాబాద్‌లో ఎన్ని దావతులు అవుతాయో లెక్కే ఉండదు. ఇళ్ళల్లో, మసీదుల్లో దావతులే దావతులు.
కొలీగ్ ఇంటిదగ్గర హుసేన్ సాహెబ్‌కు మళ్ళీ ఆ మెకానిక్ పిల్లలు కనిపించారు. వాళ్ళను దగ్గరకు పిలిచి పలకరించాడు. కొంతసేపు వాళ్ళతో మాట్లాడాక అతనికి ఒక విషయం అర్థం అయింది. ఆ ఇద్దరు పిల్లలకు ఎక్కడెక్కడ సైరి దావతులున్నాయి, ఎక్కడెక్కడ ఇఫ్తార్ దావతులున్నాయి అన్నీ తెలుసు. దాని ప్రకారం ఉదయం, సాయంత్రం హాజరౌతుంటారు. ఈ వివరాలన్నీ వాళ్ళ నానీమా సేకరించి అడ్రసులు చెప్పి ఇద్దరినీ పంపిస్తుంది.
దావత్ అయ్యాక తండ్రి కొడుకులు నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు.
“నాన్నా, నువ్వెందుకు నమాజులు చదవకుండా రోజా ఉన్నట్టు, అదీ బిన్ సైరీ (ఉదయం లేచి తినకుండా). అసలు నీకు ఇస్లాం అన్నా, అల్లా అన్నా విశ్వాసం ఉందా? నాకూ రోజా ఉండాలని ఉంది. నమాజులు చదవాలని ఉంది. కాని నువ్వు నన్ను ప్రోత్సహించడంలేదు. నువ్వు అనుకుంటే మన ఇంట్లో, మనలో ఇస్లాం వాతావరణం ఉండేది. ఇప్పుడైనా ఉంటుంది. నువ్వెందుకు ఈ విషయాల్లో నిశ్శబ్దంగా ఉంటావు?” అమీర్ తండ్రిని నిలదీసినట్లుగా ప్రశ్నలు గుప్పించాడు.
కొడుకు వైపొకసారి నింపాదిగా చూసి ఒకింత చిరునవ్వు నవ్వాడు. అంతలోనే సీరియస్‌గా తనని తను సమీక్షించుకుంటునట్లుగా బదులిచ్చాడు.
“నేను వీటి గురించీ ఎప్పుడు లోతుగా ఆలోచించలేదు. కొంత దూరమాలోచించి ఆగిపోయేవాడిని. మనసుకు ఎలా అనిపిస్తే అలా చేస్తుండేవాడిని. నా నైజంలో ఇన్‌స్టెంట్ నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుంటానని నా మిత్రులు అంటూ ఉంటారు. ఈ విషయంలో కూడా అదే జరుగుతున్నదేమో. ఉదయాన్నే లేచే అలవాటు లేనందున బిన్ సైరీ రోజాలుంటాను. మతం పట్ల మంచి అభిప్రాయం లేదు. మతాలవల్ల ఎన్నో నష్టాలు, ప్రమాదాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అల్లా అన్నా గుడ్డిగా నమ్మలేను. హేతువు నన్ను చాలావరకు నడిపిస్తుంటుంది. మతాలకు, దేవుళ్ళకు కారణాలు వెతకటం, ప్రశ్నించటం అసలే ఉండరాదు. అలా అని పూర్తిగా ఈ మతాలను, అల్లాను వదిలేయలేకపోతున్నాను. ఆలోచనలు, ఆచరణ చాలావరకు మన చేతుల్లో లేకుండా పోతున్నాయి. ఆధ్యాత్మికత, మతాలు అప్పుడప్పుడు అల్లా పట్ల విశ్వాసం నన్ను ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతున్నాయి. అందుకని అల్లా, రోజా, ప్రార్థనలాంటి విషయాల్లో నా ప్రవర్తన నాకే అసంగతంగా అనిపిస్తుంటుంది.
“ఇక నీ విషయానికి వస్తే నాకు భయం మతం, ఆధ్యాత్మికతలోని విషయాలు సరిగ్గా ఉపయోగించుకోకుంటే ఎట్లెట్లనో తయారవుతాం. అవగాహనా రాహిత్యం, చాదస్తం, మూర్ఖత్వం లాంటివి మనల్ని ఆక్రమించేస్తాయి. అందుకే నీ అనుభవాలతో, నీ ఆలోచనలతో నువ్వే నీ లైన్ ఏర్పాటు చేసుకోవాలని ఏమి చెప్పకుండా ఉంటాను.”
అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరాక కూడ, అతని మాటల ప్రవాహం సాగుతూనే ఉంది. అమీరు శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు.
“నా జీవితంలో నలభైమూడు రంజాన్లు వచ్చాయి. నాకే రంజాన్ సరిగ్గా గుర్తులేదు. చిన్నప్పుడు మా ఊరు బయటి స్మశానాన్ని ఆనుకుని ఉన్న ఈద్గాకు గుంపుగా ఏదో పెద్దగా చదువుకుంటూ పోయేవాళ్ళం. నా పెళ్ళయ్యాక నా మొదటి రంజాన్ మీ అమ్మమ్మగారి ఊరు సూర్యాపేటలో చేసుకున్నాను. అప్పుడు నేను కొత్తపెళ్ళికొడుకును. నీ పెద్ద మామయ్యతో కలిసి ఏదో చింతచెట్టు కింద కూర్చొని నమాజయ్యాక ఇంటికి వచ్చాం. ఇంట్లోవాళ్ళు ఈద్గాకు పోయొచ్చాం అనుకున్నారు. మీ మామయ్య కూడ నాకులాగే మసీదు మనిషి కాదు. ఆ కొత్తల్లోనే ఇంకో రంజాన్. మీ ఇంకో మామయ్యతో అక్కడక్కడ తిరిగి నమాజ్ అయిపోయే సమయానికి ఇంటికి చేరాం. అప్పుడుకూడ అందరు మేము నమాజుకు పోయొచ్చాం అనుకున్నారు. మా ఊర్లో అనుకుంటాను, ఇంట్లో ఆడపిల్లలు ఎర్రమన్ను కలిపిన నీళ్ళపళ్ళెంతో మా ముందుకు వచ్చేవారు. మేము చిల్లరడబ్బులు ‘ఈదీ’ ఆ పళ్ళెంలో వేసేవాళ్ళం. రూపాయి కాగితాలైతే వాళ్ళ చేతుల్లో పెట్టేవాళ్ళం. పిల్లలం ఒంగోలు సినిమాకి ఉరికేవాళ్ళం. చాలా అరుదుగా ఓ మూడు నాలుగు ఉండొచ్చు, మనం చేసుకున్న ఈద్‌లు. ఎందుకంటే మనం ఎప్పుడు హిందువుల మధ్యనే ఉన్నాం. ఈ సేమియా పాయసాలు ఎక్కువ మోతాదులో చేయడం మీ అమ్మకు పెద్ద సర్కస్ అయ్యేది. ఒక్కోసారి మాత్రం సేమియాలు కుదిరేవి. అప్పుడు ఇరుగుపొరుగుకు పంచేవారం. మనిద్దరం దగ్గరున్న ఈద్గాకు పోయివచ్చేవాళ్ళం. మీ చిన్న మామయ్య ప్రతి రంజాన్‌కు తన హిందూ దోస్తులందరికి షీర్‌కుర్మా తాగించి, బిరియాని తినిపించేవాడు. నేనేమో నా దోస్తులందరికి హోటల్లో హలీం తినిపించేవాడిని” అలా ఎన్నో రంజాన్ జ్ఞాపకాల్ని కొడుకుతో పంచుకున్నాడు చాలాసేపు.
ఆఖిరీ జుమ్మా
రంజాన్ నెల్లోని చివరి శుక్రవారపు ప్రార్థన (జుమాతుల్ విదా) కోసం అసంఖ్యాకంగా నమాజీలు వచ్చారు. మక్కా మసీదు లోపల స్థలం దొరకనందున చార్మినారు ముందు నడిరోడ్డు మీద పేపర్ జానిమాజ్‌లు కొనుక్కుని కూర్చున్నారు హుస్సేన్ సాహెబ్, అమీర్ లు. లాడ్‌బజార్, చార్‌కమాన్, మదీన, శాలిబండ రోడ్లన్ని శుభ్రంగా కడిగి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా అల్లా భక్తులతో నిండివుంది. మజ్లీస్ పార్టీకి సంబంధించిన ఎవరో ముస్లిం నాయకులు ఖురాను ప్రసంగం చేస్తున్నారు.
ఏ గొడవలు లేకుండా నమాజ్ అయిపోయి జనం ఇళ్ళకు పొయ్యేసరికి బందోబస్తు చూస్తున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మక్కామసీదులోనే ఉపవాసదీక్ష విడిచాక ఇంటికిపోదాం అనుకున్నారు తండ్రీకొడుకులు. చుడీబజారులో రంగురంగుల గాజులు చూసుకుంటూ మురగీ చౌక్ చేరారు. హలాల్ చేసి, తోలు తీసి రాసులుగా పోసిన కోళ్ళతో, పచ్చి నీసు వాసనతో ఆ ప్రాంతమంతా నిండివుంది.
అమీర్ కు అక్కడ చాంద్‌పాషా కన్పించాడు. సైకిల్ చక్రాల్లో గాలి నింపుతున్నాడు. పంపు కన్నా కొంచెం ఎత్తు, ఇంకొంచెం లావున్నాడు. పంపు హ్యాండిల్ పైకిలాగి గాల్లోకి ఎగిరి హ్యాండిల్ మీద బోర్లపడి పొట్టతో కిందకు నెడ్తున్నాడు. పక్కనే స్కూటర్ మెకానిక్ షాపులో వాడి అన్న పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరిని చూసి దగ్గరకు వచ్చి సలాం చేశారు. తమ ఇల్లు పక్కనే అంటూ వీళ్ళిద్దరిని తీసుకుపోయారు.
మక్కామసీదు వెనుక ఉన్న గరీబు గల్లీలో పడావు పడినట్లు కనిపిస్తున్న ఒక చిన్న రేకుల షెడ్‌లో అద్దెకుంటున్నారు. ఆ ఇలాక పూరా గరీబ్ బస్తీనే. వాళ్ళ నానీమాను పరిచయం చేశారు. ఎముకల గూడుకు చీరచుట్టినట్లుంది. ఓ రెండు నిమిషాలు నిలబడి వచ్చేశారు. తిరిగి మక్కామసీదు చేరారు.
ఆ పిల్లలు మసీదు గోడమీది ‘చోర్‌కా ముండి’ మక్కా నుండి తెచ్చిన నల్లటిరాయిని చూపిస్తూ వాటి వెనకనున్న విషయాన్ని అమీర్‌కు వివరిస్తున్నారు. మసీదు ప్రాంగణంలో ఉన్న అసంఖ్యాకమైన పావురాల్ని చూస్తూ చాంద్‌పాషా, జహంగీర్‌ను గురించి ఆలోచిస్తున్నాడు హుస్సేన్ సాహెబ్.
మసీదు పైన ఆకాశంలో నల్లటి చిన్న చిన్న పక్షులు చీచీ అని అరుచుకుంటూ, మునిగిన సూర్యుడి దిక్కు గుంపుగా పోతున్నాయి. విపరీతంగా వస్తున్న ఉపవాసుల తాకిడితో జొన్నలు తింటున్న మసీదు పావురాలు తమ తమ గూళల్లోకి ఎగిరి దూరుతున్నాయి.
మెకానిక్ పిల్లలిద్దరు ఆ సాయంత్రం ఏ దావత్‌కు పోకుండా వీళ్ళతోనే ఉండిపోయారు. వాళ్ళ నానీమా మసీదు మెట్ల దగ్గర ఒక చిన్న బగోనాలో ఉబ్లి హుయిదాల్, పానీకే పాకిటా అమ్ముతున్నది. చిల్లర లేదన్న వాళ్ళతో తర్వాత ఇవ్వండని ప్రేమగా చేతుల్లో పెడుతున్నది.
మక్కామసీదు ముంగటి ప్రాంగణమంతా వరుసగా, గుంపులుగా కూర్చున ఉపవాసులతో నిండి ఉంది. షాపింగ్‌కు వచ్చిన బురఖా స్త్రీలు, చిన్నచిన్న పిల్లలూ చద్దర్లు పరచుకుని కూర్చున్నారు. వాళ్ళు కూడా అక్కడే రోజా విడుస్తున్నారు. ఆ ఇద్దరు మెకానిక్ పిల్లలు “పానీ ఏక్ రూపయా, దాల్ దో రూపే” అని అరుస్తూ రోజ్‌దార్ల మధ్య తిరుగుతున్నారు.
మహా కళాకారుడు గీసిన అద్భుతమైన చారిత్రక, సాంఘిక మిశ్రమ చిత్రంలా ఉంది, మక్కా మసీదు ముంగిలి.
సైరన్ వినిపించగానే ఆ పిల్లలు కూడా దాల్ పొట్లాలు, నీళ్ళ పొట్టాలు తెచ్చుకుని వాళ్ళతోపాటు కూర్చుని రోజా విడిచారు.
నమాజు చదివే అలవాటు లేకున్నా, స్వయంగా నమాజు చదవటం రాకున్నా మక్కామసీదు వైపు వచ్చినప్పుడల్లా హుస్సేన్ సాహెబ్ జమాత్‌తో కలిసి నమాజు చదువుతాడు. అదో విధమైన అంతర్గత హాయిని పొందుతుంటాడు.
నమాజు అయ్యాక మసీదు ప్రాంగణంలో పండగ సందర్భంగా పెట్టుకున్న బండ్ల దుకాణాల్లో అవి, ఇవి కొనుక్కుని నలుగురు తిన్నారు. చాక్‌నా, బోటీ కబాబ్, సీక్ కబాబ్, కాలిమిర్చి గోష్, మచ్చీగరం ఇంకా ఎన్నో, ఎంతో చౌకగా అమ్ముతున్నారక్కడ.
పోతూ పోతూ పిల్లల నానీమా చేతిలో పండగ బట్టలు కొనుక్కోమని ఓ ఐదు వందలరూపాయలు పెట్టి, ‘ఖుదా ఆఫీజ్’ అన్నాడు హుస్సేన్ సాహెబ్. ఆమె ఏదో చెప్పటానికి తటపటాయిస్తుంటే సంకోచించకుండా చెప్పమని అడిగాడు.
“బేటా, కొడుకులాంటివాడివి తప్పయితే క్షమించు. నేనే పిల్లలిద్దరిని అక్కడిక్కడని చూడకుండా తెలిసిన అన్ని ఇఫ్తారి దావత్‌లకు, ఖానేకి దావత్‌లకు పంపాను. ఈ నెలంతా కడుపు నిండుగా మంచి బలమైన ఆహారం తిన్నారు బిడ్డలు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ సంవత్సరం పొడుగుతా రోజానే. ఈ రంజాన్ ఒక్కపొద్దుల నెలే వారికి మంచి తిండి. తల్లిదండ్రులులేని అనాథలు. నేను చేసే పాచిపనితో వాళ్ళకు ఖట్టా చట్నీల్తో అయినా పేట్ భర్ అన్నం పెట్టలేను. పైగా మొన్న మా చాంద్ తోటి పిలగాడు క్షయ బీమార్‌తో సచ్చిండు. మంచి తిండి, మాంసం తింటే బతికేవాడంట. అందుకే ‘రోజారఖయి’ రసం చేసి ఎక్కడబడితే అక్కడ తినమని వదిలేశాను. తప్పయితే అల్లా నన్ను దోజక్‌కు పంపినా సిద్ధమే. కానీ, ఈ పిల్లలు మాత్రం నకనకలాడుతూ, మలమల మాడుతూ రంజాన్ నెల్లో కూడా సూర్యల్ల మాదిరి మాడటాన్ని చూడలేను, బేటా” అని కళ్ళు వత్తుకుంటూ నెమ్మదిగా అడుగులు కూడదీసుకుంటూ వెళ్ళిపోయింది.
ఉపవాసుల రాకతో సాయంత్రం కడుపునిండా జొన్నలు తినని మసీదు పావురాలు కూడా రాత్రి పూటని కూడా చూడకుండా దిగొచ్చి గింజలు తింటున్నాయి.

