ప్రతిధ్వనించిన మౌనం

Spread the love

“చిన్ను, నీకు ఎన్ని సార్లు చెప్పాను, పెద్దవాళ్ల మాటల్లో తల దూర్చొద్దు అని.”

“చిన్ను, నోరు మూసుకో!”  

“చిన్ను, అసలు నీకెందుకు ఈ కబుర్లు అన్నీ? వెళ్ళి నీ పని చూసుకో.”

“చిన్ను” …. అవును, నలుగురు అక్కచెల్లెళ్లలో నేనే అందరికంటే చిన్నదాన్ని. అందుకే ఎవ్వరూ నా మాట చెవినపెట్టరు, పట్టించుకోరు. అందరూ నన్ను నోరు మూసుకోమనే వాళ్ళే. అందుకే నా గతాన్ని తలచుకుంటే, జ్ఞాపకాల పొట్లంలో తీపి కంటె చేదే ఎక్కువ!

ఆ రోజు అమ్మ, నన్ను పొద్దున్నే నిద్ర లేపి స్నానం చేయించి తనే స్వయంగా కుట్టిన గులాబి రంగు గౌను తొడిగింది. గౌనుకి కింద ఒత్తుగా కుచ్చిళ్ళు పెట్టి అక్కడక్కడ రెండేసి ఆకుపచ్చ రంగు ఆకులు కూడా కుట్టింది గౌను మీద. అమ్మ నా బుగ్గలు పుణికి – “ఇవాళ నా చిన్ని తల్లి పుట్టినరోజు. అప్పుడే నీకు ఐదేళ్లు నిండాయి” అంది. ఆ తియ్యటి జ్ఞాపకం ఇంకా నా కళ్ళముందు మెదులుతోంది.

చిన్న పల్లెటూళ్ళో పుట్టినరోజుకి ప్రత్యేకించి వేడుకలు అంటూ ఏం ఉండవు. పుట్టినరోజు కూడా క్యాలెండరులో మిగతా రోజుల్లాగానే వస్తుంది …. వెళ్ళిపోతుంది.

నేను కొత్త గౌను తొడుక్కుని మురుసిపోతున్నాను. ఆ సంతోషంలో గౌను బుట్టలా వచ్చేలా వాకిట్లో గుండ్రంగా తిరుగుతూ-కూర్చుంటూ ఆడుకుంటున్నాను. ఇంతలో నాన్న వచ్చారు. రోజూలాగ నాన్నకి భయపడకుండా, బెదిరిపోకుండా కొత్త గౌను చూపించాలి అన్న ఉత్సాహంలో ఉన్నాను. ఇంతలో నా నెత్తిమీద ఒక్కటేస్తూ – “భోగం వాళ్ళల్లా ఏంటి ఆ గంతులు-డ్యాన్సులు? ఇలాగే ఇంటి పరువు మంట కలపవే దరిద్రపు ముండ, నడు ఇంట్లోకి!” అన్నాడు.

నేను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరకు పరుగెట్టాను. అమ్మ తన చీర చెంగుతో నా కళ్ళు తుడుస్తూ – “పిచ్చి తల్లి, పుట్టినరోజు పూట ఎవరైనా ఏడుస్తారా? ఊరుకో. నా బంగారు తల్లి కదూ!” అని బుజ్జగించింది.

గంట తర్వాత అమ్మ నన్ను గుడికి తీసుకెళ్ళింది. పంతులుగారు నన్ను ఆశీర్వదించి అక్షతలు వేసారు.  దర్శనం పూర్తి చేసుకుని గుడిలో నుంచి బయటకి వచ్చి, అమ్మ-నేను గుడి మండపంలో కూర్చొన్నాం. అమ్మ నా చేతిలో చిన్న పటిక బెల్లం ముక్క పెట్టింది. మళ్ళీ నా పెదవుల మీద చిరునవ్వు విరిసింది.

“తిను చిన్ను, ఇదే నీ పుట్టినరోజు మిఠాయి.”  

ఆ పటిక బెల్లం రుచి ఇప్పటికీ నా నాలుక మీద అలాగే ఉంది.

ఆ క్షణాన నాకు ఆ పట్టిక బెల్లం తియ్యగా ఉన్నట్టు అనిపించినా, వయసు పెరిగే కొద్దీ ఆ తియ్యదనం కంటే తియ్యనిది నా తల్లి ప్రేమ అని అనుభవంలోకి వచ్చింది.

అమ్మ రోజంతా గడియారం ముల్లులా నిశ్శబ్దంగా తిరుగుతూ పనిచేస్తూనే ఉండేది. అమ్మ అలసిపోవడం నేను ఎన్నడూ చూడలేదు. తీరికగా ఆలోచిస్తే కాస్త విశ్రాంతిగా కూర్చోవడం, ఆమె జాతకంలోనే లేదు అని ఇప్పుడు అర్థమవుతుంది. తెల్లవారుఝామున లేచి, ఇళ్ళు-వాకిళ్ళు తుడుచుకోవడం, కళ్ళాపి జల్లి ముగ్గులు వేసుకోవడం, తళతళ మెరిసే ఇత్తడి బిందెలతో నీళ్ళు మోసుకొచ్చుకోవడం, పిల్లల స్నానాలు, ఇంటిల్లిపాదికీ వంట-వార్పు, మళ్ళీ గిన్నెలు తోముకోవడం …. ఇదే ఆమె దినచర్య. ఆమెకి ఎవరితోనూ ఎలాంటి తగవులు-కొట్లాటలు, ఎవరి పట్ల ఫిర్యాదులు ఉండకపోవడం నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆశ్చర్యమే!

అమ్మ తాను క్షణ క్షణం కరిగిపోతూ కూడా ఇంట్లో వెలుగులు నింపలేకపోయింది. సాయంత్రం అవుతూనే ఇల్లంతా ఒక రకమైన విషాదం పరచుకునేది. సారా వాసన గుప్పుమంటూ, తూలుతూ నాన్న ఇంట్లోకి వస్తూనే నోటికి వచ్చినట్టు వాగుతూ ఉండేవాడు. ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క తిట్టు ఇంటి మూలమూలలకి చేరి వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. మరి కాసేపటికి అమ్మ ఏడుపులు-అరుపులు మౌనంగా గోడల్లో లీనమయిపోయేవి. మెల్లమెల్లగా అమ్మ అరుపులు నాలోకి ఇంకిపోవడం మొదలయ్యాయి. నాన్న అలసిపోయేంత వరకు అమ్మని కొడుతూనే ఉండేవాడు. పక్క గదిలో నేను కోపంతో, పంజరంలో బంధించబడ్డ చిలకలా అటు-ఇటు తిరుగుతూ ఏం చెయ్యలేక ఏడుస్తూ ఉండిపోయేదాన్ని.

గులాబి రంగు అమ్మ శరీరం నాన్న చేతుల్లో దెబ్బలు తిని-తిని కమిలిపోయేది.

ఒక రోజు నేను అమ్మ బుగ్గలు నిమురుతూ – “అమ్మా, నీకు నొప్పిగా లేదా?” అని అడిగాను.

అమ్మ రెండు క్షణాలు మౌనంగా ఉండి – “నా చిట్టి తల్లి చెయ్యి తగిలింది కదా, ఇప్పుడు లేదు.” అని నవ్వేసింది.

ఎందుకో తెలియదు కానీ, అమ్మ చిరునవ్వు వెనక కూడా ఒక పలచటి తెర ఉన్నట్టు, ఆ తెర వెనుక అమ్మ బాధని, కన్నీళ్ళని నేను చూస్తున్నట్టు అనిపించేది.

నెలలో నాలుగు రోజులు అమ్మ ఇంటిల్లిపాదికీ ‘అంటరానిది’ అయిపోయేది. ఈ నాలుగు రోజులూ అమ్మకి ఒకపక్క ఎంత విశ్రాంతో మరొక పక్క అంత నరకం! అమ్మ ఆ నాలుగు రోజులూ మొదటి అంతస్తులో కట్టించిన ఒక చిన్న ‘ముట్టు గది’ లో మగ్గిపోయేది. అక్కడికి నాన్న చెయ్యి చేరగలిగేది కాదు. కానీ, ఆయన తిట్లు మాత్రం నిరాటంకంగా చేరేవి. ఆ నాలుగు రోజులూ వంట పని నాయనమ్మది. అయితే ప్రతిసారీ మర్చిపోవడం అనే వంకతో నాయనమ్మ, అమ్మకి భోజనం కూడా పంపేది కాదు. ఈ విషయంలో నాయనమ్మకి కొంచెం కూడా కనికరం ఉండేది కాదు. నేను చప్పుడు చెయ్యకుండా ఒక చిన్న గిన్నెలో అన్నం పప్పు వేసి తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేదాన్ని.

అమ్మ ఆ గిన్నె పక్కన పెట్టేసి, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ – “నా బంగారు తల్లీ! నువ్వు బాగా చదువుకోవాలి. ఎప్పుడూ క్లాసు ఫస్టు రావాలి” అంటూ ఉండేది.

అమ్మ మాటలు నా మనసు పొరల్లో ముద్రించుకుని పోయాయి.

నాకు పరీక్షల్లో పాసవ్వడం అంటే కేవలం ఒక క్లాసు నుండి మరొక క్లాసుకి వెళ్ళడమే కాదు, జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎప్పటికైనా అమ్మని ఆ ఇల్లు అనే నరక కూపం నుండి బయటకి తీసుకురావడమే నా ఆశయం. “ఎలాగైనా అమ్మని ఈ నరకం నుండి బయటకి తీసుకు వస్తాను” అని గట్టిగా నిర్ణయించుకున్నాను.

అమ్మకి ఆ ఇల్లు నిజంగానే నరకం. ఆమె జీవితంలో నాలుగు వైపులా అంధకారం. అమ్మ ఆర్తనాదాలు, ఆమె ఒంటికి, మనసుకు అయిన గాయాలు ఎప్పుడూ నెత్తురోడుతూనే ఉండేవి.

ఆ చీకటి రాత్రులు నన్ను ఎంతగానో భయపెట్టేవి. నేను, అమ్మ ఒకే చాప మీద పడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఉన్నట్టుండి తలుపు తెరుచుకునేది. నాన్న, అమ్మని బలవంతంగా తనతో వేరే గదిలోకి లాక్కుపోయేవాడు.

నేను నాన్న వెనకాలే పరుగెడుతూ – “అమ్మని వదులు.. వదులు” అని అరుస్తూ ఉండే దాన్ని.

కానీ నా గొంతు, ప్రాణం లేని ఆ గోడలను ఢీకొట్టి మళ్ళీ తిరిగి నా దగ్గరకే వచ్చేది.

మరొక పక్క నాయనమ్మ బలవంతంగా నన్ను లాక్కుని వెళ్ళి మంచం మీద పడేసేది. అయినా పెనుగులాడి నాయనమ్మని విడిపించుకుని వెళ్ళబోతే ఆమె తలుపు పై చిడత పెట్టేసేది. నేను ఏడుస్తూ కూర్చుండిపోయేదాన్ని. కాసేపటికి అలసిన, కమిలిపోయిన శరీరంతో గదిలోకి తిరిగి వచ్చిన అమ్మ గుండెలకి హత్తుకుని నేను వెక్కివెక్కి ఏడుస్తూ ఉండిపోయేదాన్ని.

స్కూలులోనే నేను మనస్ఫూర్తిగా సంతోషంగా గుండెల నిండా గాలి పీల్చుకునే దాన్ని. ‘శబ్ద బ్రహ్మ’ అన్న దానికి అర్థం మొట్టమొదటిసారి నాకు స్కూలులోనే తెలిసొచ్చింది. ఇంట్లో నాకు అది ఒక ఎండమావి! ఇంట్లో ప్రతిరోజూ, ప్రతి క్షణం ఎన్నో జవాబు లేని ప్రశ్నలు. ప్రతి పరీక్షలో నేనే ఫస్ట్ వస్తూ ఉండేదాన్ని. దానికి సంతోషించేది కూడా ఇద్దరమే – నేను, అమ్మ!

ఇలా పరీక్షల్లో ఫస్ట్ రావడం అంటే నేను నా కుటుంబ వాతావరణం మీద చేస్తున్న తిరుగుబాటులా ఉండేది. పరీక్షల పేరు చెప్పి సామాజిక మార్పు కోసం నడుం బిగించి విప్లవ శంఖం పూరిస్తున్నాను.  

నా పరీక్షా ఫలితాలు వచ్చే రోజున అమ్మ కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపించేది. నా తలమీద చెయ్యివేసి – “చూసావా? నా చిట్టితల్లికే ఎప్పుడూ ఫస్ట్ మార్కు” అని నుదుటిన ముద్దు పెట్టేది.

అమ్మ చేతి స్పర్శ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది.

కాలంతో పాటు వయసు, బుద్ధి కూడా కాస్త పెరగడంతో ఒక రోజు అమ్మని – “అమ్మా! ప్రతి ఇంట్లో తల్లుల పరిస్థితి ఇంతేనా? దెబ్బలు తింటూనే ఉంటారా?” అని అడిగాను. 

అమ్మ నేల చూపులు చూస్తూ, కాలి బొటనవేలుతో నేలమీద రాస్తూ – “చిన్ను, ఇది మగవాళ్ల జన్మహక్కు” అని మాత్రం అనగలిగింది.

ఆ రోజు నా మనసులో ఉన్న చిన్న సూత్రం ఏదో తెగిపోయిన భావన కలిగింది.  

కాలచక్రం మెల్లమెల్లగా తిరుగుతూ పోతోంది.

నేను పంతం పట్టి చదువు కొనసాగిస్తూ పోయాను. నాన్నని, నాయనమ్మని ఎదిరించి కాలేజీ చదువుకోసం పట్నానికి, మెల్లమెల్లగా వకీలు చదువు కోసం నగరంలో ఉన్న యూనివర్సిటీకి చేరుకున్నాను. అప్పటి నుండి కోర్టే నా కర్మభూమి. ప్రతిరోజూ కోర్టులో నా స్పష్టమైన, స్థిరమైన గొంతు ఖంగుమని ప్రతిధ్వనించేది.

ఇంట్లో నాలుగు గోడల మధ్య ఖైదీలుగా మగ్గిపోతున్న నిస్సహాయులైన ఆడవారి మౌనానికి నేను గొంతునిచ్చాను. నగరంలో నా న్యాయవాద వృత్తి జోరు అందుకుంది. నేను అమ్మని ఎలాగైనా ఆ నరక కూపం నుండి బయట పడెయ్యాలి అన్న నా నిర్ణయాన్ని ప్రతిరోజూ గుర్తుచేసుకుంటూనే ఉన్నాను.

కొద్ది రోజులుగా అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది.

ప్రతి రోజులాగనే ఆరోజు కూడా కోర్టుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మొబైల్ ఫోను మోగింది. చూస్తే ఊళ్ళో పొరుగింటి లావణ్య అక్క! 

“చెన్ను! పిన్ని మనకి అన్యాయం చేసి వెళ్ళిపోయింది” వెక్కిళ్ల మధ్య చెప్పి ఫోను పెట్టేసింది లావణ్య అక్క.   

ఒక్క క్షణం నా శరీరం చల్లబడిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే “అమ్మా! నువ్వు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు” అంటూ గట్టిగా అరచి కూలబడిపోయాను.

నేను చాలాసేపు వెక్కివెక్కి ఏడుస్తూనే ఉన్నాను. కాసేపటికి తేరుకుని, ఊరికి బయలుదేరాను. 

చాలా ఏళ్ళ తర్వాత ఇంటిముఖం చూశాను. మంచం మీద నాన్న తలదించుకుని కూర్చుని ఉన్నాడు. వాకిట్లో అమ్మ పార్థివ దేహం మోక్షం కోసం ఎదురు చూస్తున్నట్టు చలనం లేకుండా మౌనంగా ఉంది. ఊళ్ళో ఆడవాళ్ళు అమ్మని సాగనంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేను అమ్మ తల దగ్గర కూర్చుని అమ్మ ముఖం వైపే చూస్తూ ఉన్నాను. అమ్మ మూసిన కను కొనల్లో కూడా రెండు కన్నీటి బొట్లు దాగి ఉన్నాయి అనిపించింది. నీరసంగా కనిపిస్తున్న ఆమె ముఖం మీద ఎండిపోయిన పెదవుల చివర ఏవో ఆమె చెప్పలేకపోయిన మాటలు నాకు వినిపిస్తున్నాయి.

చిన్నప్పడు అమ్మ చీర కుచ్చిళ్ళు పట్టుకుని ఏడ్చినట్టే ఇప్పుడు కూడా ఆమ్మ ప్రాణం లేని శరీరాన్ని పట్టుకుని చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయాను.  

కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందరూ ఎక్కడివాళ్లు అక్కడికి సర్దుకున్నారు. ఇంట్లో మళ్ళీ అదే మౌనం. కాళ్ళు నాకు తెలియకుండానే ప్రతి నెలా అమ్మ ఆ నాలుగు రోజులు గడిపే ‘ముట్టు గది’ కి తీసుకెళ్లాయి నన్ను. కొన్ని సంవత్సరాలుగా వాడకంలో లేని ఆ గదిని మొదటిసారి శ్రద్ధగా గమనించాను. ఆ గది గోడల్లోకి ఇంకిపోయిన అమ్మ ఆవేదన, బాధ, ఓర్పు అన్ని కలిసి ప్రతిధ్వనిస్తున్నాయి.

నేను మెల్లగా కిటికీ తెరిచాను. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చింది. ఆ గాలితోపాటే అమ్మ స్పర్శ కూడా నన్ను తాకింది.

ఆ గదిలో ఒక మూల ఎర్రటి గులాబి పువ్వుల బొమ్మలు పెయింటు వేసిన నల్ల రంగు ట్రంకు పెట్టె కనిపించింది. అమ్మ తన సామాను అంతా అందులోనే దాచుకునేది. అమ్మ పెళ్ళి చీర, అమ్మకి ఇష్టమైన నెమలి కంఠం రంగు నేత చీర, నాలుగైదు జతల గాజులు, వెండి పట్టీలు …. ఇంకా ఏవేవో చిన్న-చిన్న సామాన్లు. ఎంతో ఉత్సాహంగా ఒక్కొక్కటిగా తీసి చూస్తున్నాను. 

నా మనసు బరువెక్కిపోయింది.

ఆ నేత చీర మడతల్లో ఒక చిన్న పొట్లం. దాంట్లో ఒక పెన్ను, రంగురంగుల పెన్సిళ్ళు, అంచులు నలిగిపోయిన, ఇంచుమించు వెలిసిపోయిన ఒక కాగితం. నేను కుతూహలంతో కాగితం తెరచి చూశాను.

“నా చిన్ను బాగా చదువుకుంటుంది. ఆమెకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.” అమ్మ చేతి వ్రాత చూసి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ చిన్న వాక్యమే ఆమె జీవితాశయం అనిపించింది. అమ్మ కన్నీటి చుక్కలు పడి అక్కడక్కడ ఇంకు పేపరు మీద పరుచుకుంది.

నేను చాలాసేపు ఆ కాగితం వైపే చూస్తూ ఉన్నాను. ఆ కాగితం, అమ్మ కన్న కలకి, నా జీవితానికి అర్థం చెబుతున్నట్టు ఉంది.  

ఆ ముట్టు గదిలోకి మెల్లగా గాలి వీస్తూంది. నేను చాలా సేపు ఆ కాగితాన్ని చేతిలో పట్టుకుని కూర్చొన్నాను. బయట రాత్రి చిక్కబడుతోంది. కానీ లోపల జ్ఞాపకాల్లో మిట్టమధ్యాహ్నం…. చేతిలో అన్నం-పప్పు వేసిన గిన్నెతో మెట్లెక్కుతున్న ఎనిమిది-పదేళ్ళ చిన్ను …. మెల్లగా తలుపు తెరుస్తున్న అమ్మ. ఆమె కళ్లల్లో పొంగిపొర్లుతున్న అనురాగం-ఆప్యాయతలు. ఆ గదిలోనే నాకు మొదటిసారి జ్ఞానోదయం అయ్యింది  – అమ్మ, అలసిపోతున్నది రోజంతా చేసే పని వల్ల కాదు, అవమానంతో, ప్రేమరాహిత్యంతో అని.  నేను కోపంతో, బాధతో విలవిల్లాడిపోయాను.

“అమ్మా!”

అమ్మని ఆ ఇంట్లో నుండి బయటకి తీసుకు వస్తాను అని నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేక పోయాను.   

“అమ్మా! నీలాంటి పరిస్థితి మరొకరికి రానివ్వను” – అని నాకు నేనే శపథం చేసుకుని మర్నాడు పట్నం తిరిగి వచ్చేసాను. నేను, నా ప్లీడరీ మళ్ళీ మొదలయ్యాయి. కోర్టుల్లో అవే కేసులు, అవే సాక్ష్యాలు …. ఇప్పుడు నేను చేసే ప్రతీ వాదనలో అమ్మ ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తోంది.”

ఒక రోజు, ఒక స్త్రీ తన భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి భయపడుతోంది. నేను చాలా సేపు ఆమె వైపే  చూస్తూ ఉన్నాను. ఆమె వణుకుతున్న శరీరం, బెదిరుచూపుల్లో నాకు అమ్మ కనిపించింది.

నేను మెల్లగా ఆమె భుజం మీద చెయ్యి వేసి – “భయపడకు. నీ మౌనమే వాళ్ళకి ఆయుధంగా మారుతోంది.”

ఆమె పెద్దపెట్టున ఏడ్చేసింది. ఆమె జీవితంలో మొట్టమొదటిసారి భయపడకుండా తన మనసులో మాట అందరి ముందు బయటపెట్టింది.

ఆ రోజు కోర్టు నుండి బయటకి వస్తూంటే అదే అమ్మ విషయంలో నా మొదటి విజయం అనిపించింది.

అమ్మ జ్ఞాపకాలు నన్ను మళ్ళీ ఊరికి లాక్కెళ్ళాయి. నేను గబగబా మెట్లెక్కి ఆ ముట్టు గదికి చేరుకున్నాను. ఆ జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళు తెరిచాయి –అమ్మ నవ్వు ముఖం, అమ్మ పమిట చెంగు సువాసనలు, అమ్మ చేతి స్పర్శ, అలసిన ఆమె చిరునవ్వు, ఆమె మౌనం…..

“అమ్మా!”  

అమ్మ నన్ను తాకిన అనుభూతి కలిగింది.

నేను కుర్తా జేబులో నుండి ఆ పాత కాగితం తీసి చూసుకున్నాను – “నా చిన్ను బాగా చదువుకుంటుంది. నా ఆశీర్వాదం ఆమెకు ఎప్పుడూ ఉంటుంది” ఆ అక్షరాలు నా కంటికి మెరుస్తూ కనబడ్దాయి.

కళ్ళు తుడుచుకుని మరొక్కసారి గది మొత్తం కలయజూసాను.

ఆ విరిగిన కిటికీ గుండా ఒక లేత సూర్య కిరణం ఆ గదిలోకి వచ్చి వాలింది. ఆ వెలుగులో అమ్మ మొదటిసారి నిర్భయంగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నట్టు అనిపించింది.

“అమ్మా! ఇప్పుడు నీ మౌనానికి మాటలు వచ్చాయి. ఆ మాటలు ఈ ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తాయి. ఆ ప్రతిధ్వనిని ఎవ్వరూ ఆపలేరు..! విజయం మనదే…!!!”  

డా. యశోధర భట్నాగర్

గ్వాలియర్ లో జన్మించిన డా. యశోధర భట్నాగర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్), డా. హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో ఎం.ఏ., పట్టాలు, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ హిందీ విద్యాపీఠం, బృందావనం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సెంట్ మేరీస్ కాన్వెంట్ స్కూలు నుండి హిందీ శాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన డా. భట్నాగర్ ఇప్పటి వరకు  మూడు లఘు కథానిక సంకలనాలు, మూడు కవిత సంకలనాలు, ఒక యాత్రా కథనాల పుస్తకం ప్రచురించారు. వీరి రచనలు ప్రముఖ జాతీయ స్థాయి పత్రికల్లో అచ్చయ్యి పాఠకుల మన్ననలు అందుకున్నాయి.

హిందీ లఘు కథానికల రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్న డా. భట్నాగర్ తమ సాహితీ సేవకు గాను సాహిత్య అకాడమీ, మధ్యప్రదేశ్ సంస్కృతి పరిషత్తు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రఖ్యాత ‘జైనేంద్ర కుమార్ జైన్ పురస్కారం’,
‘కృతి సమ్మాన్’, ‘డా. గాయత్రీ దేవీ సమ్మాన్’, ‘పండిత్ శివ శరణ్ ద్వివేదీ స్మృతి కవిత సమ్మాన్’, ‘కృతి కుసుమ్ సమ్మాన్’,
‘డా. ఎస్.ఎన్.తివారీ స్మృతి సమ్మాన్’, ‘శ్యామ్ సుందర్ వ్యాస్ సమ్మాన్’, ‘సుష్మా స్వరాజ్ అవార్డు’ సహా మరెన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.

వీరి లఘు కథానికలు, తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, బంగ్లా, ఒడియా, పంజాబీ, మరాఠీ, అవధీ, భోజపురీ, నేపాలీ వంటి పలు భాషల్లోకి అనువదించబడ్డాయి.

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *