1
గతేడాది ఇదే నెలలో కాశీ ఆత్మహత్యకు పాల్పడి తృటిలో బ్రతికి బయటపడ్డాడు. పెళ్ళి చేసుకున్న నాలుగు నెలలకే, క్షవరపు బ్లేడుతో మెడను లోతుగా కోసుకున్నాడు. గడ్డకట్టిన రక్తపు పడక మీద స్పృహ లేకుండా పడున్నవాడిని కాస్తా తలుపు బద్దలుకొట్టి లోపలికి చొరబడి మోసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
ఊళ్ళో నలుగురూ కాశీని ‘క్రాక్’ అనుకుంటుంటే, నేను అలా అనుకోలేకపోయేవాడ్ని. అందరిలా తనకీ, ఈ నలుగురికీ మధ్యనున్న ‘షాక్ అబ్సార్బర్’ ను మరమ్మతు చేసి సరిగ్గా పెట్టుకోలేక, వీళ్ళు బంధుత్వమని కొనియాడే గతుకుల రోడ్డులో తరుచూ దెబ్బ తింటున్నాడనే చెప్పబుద్దేస్తుంది.
నిన్న కాశీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో, ‘డబ్బే స్వేచ్ఛ, డబ్బే స్వేచ్ఛ, డబ్బే స్వేచ్ఛ’ అని రామకోటిలా ఇన్‍లాండ్ కవర్ మొత్తం నింపేశాడు. ఆరు నెలల క్రితం కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఒక టీ కొట్టు ఎదురుగా కాశీని యథేచ్చగా కలిశాను. ఉద్వేగపూరితంగా చేతులు పట్టుకున్నాడు. తనతో ఎక్కువసమయం గడపాలని బ్రతిమిలాడాడు. మా నాన్నకు మరుసటిరోజు సంవత్సరీకం. రాత్రికల్లా గూడేంలోని నా తోటకు వెళ్ళాల్సివుంది. అసలు సంగతి చెప్పాను. వెలవెలపోయాడు. ఇక సరేనని పార్కు వైపుకు వెళ్ళాం.
నాకు ఏ పనీ దొరకని రోజుల్లో ఎవరైనా నన్ను చూసి ‘ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని అడిగితే ఇరకాటంలో కుచించుకుపోయి సర్దు చెప్పేందుకు ఏదోకటి చెప్పేవాడిని. ఆ వేదన వర్ణనాతీతం. కాశీ దగ్గర కూడా అదే ప్రశ్నను చూచాయగా అడిగాను. “ఇంకా…? ఇప్పుడేంటి సంగతి…?”
“ఒక స్నేహితుడితో కలిసి, చిన్నమొత్తంలో మెడిసిన్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నాం. నాన్న దగ్గర ఇక ఇంటి పత్రాలు మాత్రమే మిగిలాయి. అవి కూడా ఇస్తానన్నారు. అవి పెట్టి బ్యాంకులో లోన్ ప్రయత్నం. దొరికితే ఓ మోస్తారుగా కొనసాగుతుంది…”
గేట్ తాళం వేసుంది. పార్కులోకి గోడ దూకి వెళ్ళాం. మరుగుగా ఉండే గడ్డిపొదల చాటుకి వెళ్ళి కూర్చునేసరికి గుర్తుకొచ్చింది. సిగరెట్లు కొనలేదన్న సంగతి. ‘ఉన్నాయి’ అని తన జోలె సంచిలోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసి గడ్డిపై పరిచాడు.
“వ్యాపార ప్రపంచం బాగా కష్టపెడుతుంది. ఎన్నో చేదు అనుభవాలు. పరోక్షమైన శిస్తులా, మెడిసిన్ వ్యాపారంలో అజ్ఞాత వాటాదారులై ఉన్నారు డాక్టర్లు. ఎలాగంటే, ఒక టానిక్ బాటిల్ ప్రిస్క్రిప్సన్ రాయించాలంటే, ఒక డాక్టరుకి మూడు రూపాయల లంచం ఇవ్వాల్సి వస్తుంది. వంద బాటిల్స్ టానిక్కులు అమ్మడానికి ఎలా లేదన్నా నెలకి మూడువందలు లంచం. ఇది కాకుండా పెద్ద కంపెనీ మందులకయియితే కంపెనీయే నేరుగా వెళ్ళి టీవీ, గ్రైండర్, ఫ్రిడ్జ్ బహుమతులని…. కడుపులో దేవేస్తుందిరా గుణా…”
కాశీ ముఖాన ముద్దుగా పొగ వలయాలు ఊదాను.
“దీనిలో ఎన్నిరోజులు తట్టుకు నిలబడతానో తెలియదు. పరిస్థితి ముందులానే ఉందిరా గుణా. తరువాతి నిముషం కాలు తీసి కాలు పెట్టడానికి లేదురా.” కాశీ ఒక సిగరెట్టును వెలిగించుకున్నాడు. అతడి జోలె సంచిపై ‘చప్’ మని తెలుపు, గోధుమ రంగు కలగలిపిన ఉమ్మి వచ్చిపడింది.
“అయితే, మునుపటిలా నన్ను లాగి తుంచి అవతల పడేసి వాంతిలో పడిదొర్లి అసహ్యం చేసుకోవడం లేదురా. కష్టపడి దిగమింగుతున్నాను. నాన్న కోసమే. ఆయనపోతే ఏమవుతానో అంతుబట్టడం లేదు. దేన్ని ఆధారం చేసుకుని ఈ కొరివిదెయ్యం లాంటి మనసును నిభాయించుకోగలనో తెలియలేదురా…”
కాశీకి ఏడాది వయసున్నప్పుడు వాళ్ళ నాన్న భార్యను కోల్పోయాడు. కాశీకి తనకంటే నాలుగేళ్ళు వయస్సులో పెద్దదైన ఒక అక్క ఉంది. అంతకుమించి తోడబుట్టినవాళ్ళు ఇంకెవరులేరు. కాశీ వాళ్ళ నాన్న మరో పెళ్ళి చేసుకోలేదు. ఇద్దరి పిల్లలతో కాశీ పెద్దనాన్న – తన అన్నయ్య – కుటుంబంతో సహా అల్లుకుపోయాడు. మిల్లులో పని. నెమ్మదైన మనిషి.
“నాన్న ఎలా ఉన్నారు కాశీ?”
“నాన్నా, నేనూ ఒక ఇంట్లో ఉంటున్నాం. అక్కయ్యకు ఇంట్లో సగం వాటా వీలునామా రాయడం జరిగింది. వీలునామా చేతికి మాత్రం ఇవ్వలేదు అంతే. అడ్డంగా గోడ లేపి ఇల్లూవాకిలి రెండు వాటాలు వెయ్యడం జరిగింది. బావతో పెద్దగా ఇబ్బంది లేదు. నాన్న, అక్కయ్య ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. నాకేమో పదిరోజులకు ఒక హోటల్, ఆ పదిరోజులకే ఏ హోటల్ అయినా ముఖం మొత్తుతుంది. నెలకి మూడు వందలు నుండి మూడువందల యాభై వరకు చేతికొస్తుంది. ఆత్మను, మనసును, కడుపును, శరీరాన్ని అన్నిటిని దానితోనే నింపుకోవాలి…” పక్కనున్న సిమెంటు బెంచీపై పడుకున్న కుక్క లేచి ఒళ్ళు దులుపుకుంది.
“నువ్వు ఆడపిల్లై పుట్టుండకూడదా అనిపిస్తుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నువ్వే ఆడపిల్లగా మారిపోకూడదా అనిపిస్తుంది. నీతో ఉంటే సురక్షితంగానూ, ధైర్యంగానూ ఉన్నట్టు వుంటుందిరా గుణా. జ్ఞానపు సూదులతో తూట్లు పొడవడం లెక్కచెయ్యకుండా చెబితే, దేవుడి ఒడిలో సేద తీరుతున్నట్లు ఉంటుంది. అది కూడా ఆడ దేవత. నేను ఒక మగాడిని దేవుడిగా ఏ మాత్రం ఊహించుకోలేకున్నాను. ఆట మైదానంలా ముళ్ళ కంచె లేని మనసు నీకు.”
“లేదు కాశీ, నా మనసు నీకు అలా అనిపిస్తుంది అంతే. అయితే, నిజానికి అక్కడ కూడా కొందరి కంటికి కంచె ఉంటుంది. ఉంది. సరేగానీ, ఈ మధ్య ఏమన్నా రాస్తున్నావా?”
“లేదు, డైరీ మాత్రమే. కవితలు, కథలని రాస్తుంటే ఏదో సొంత పైత్యంలా ఉంది.”
ఎదురుగా ఒక కుక్క కాలు పైకెత్తి బెంచీ మీద ఉచ్చ పోసింది. కాశీ నోట్లో పావువంతు సిగరెట్టు బూడిదగా మిగులుంది. కాసేపు మౌనం.
“నేను ఎంత ప్రయత్నించినా ఈ సిగరెట్టును వదలలేకపోతున్నాను కాశీ.”
“నేనునూ… దానితో పాటు ఈ మాస్టర్‌బేషన్ కూడా… ఎంత ప్రయత్నించినా ఈ రెండింటిని వదలలేకపోతున్నానురా గుణా. సిగరెట్టు వలన నాకు ఏం లేదు… నికోటిన్ గుండెల్లోకి చొచ్చుకుపోయి ఏమైనా చేస్తుందేమోనని తెలియడం లేదు. నాకది పాలు రాని చనుమొనను చప్పరిస్తున్నట్లే ఉంటుంది. మాస్టర్‌బేషన్లో కూడా ఒక విషయం దాగుంది. అనేకమందిలా చేతితో కాదు. తలగడను దగ్గరకు హత్తుకుని… తల్లైనా ముప్పై, ముప్పై అయిదేళ్ళ వయస్సున్న ఆడోళ్ళను మనసులో తలుచుకుని.”
కాశీకి ఇరవై తొమ్మిదేళ్ళే వుంటుంది అనుకుంటున్నాను. చటుక్కున మరేదైనా కాజువల్గా మాట్లడదాం అన్న కాశీ, నా గురించి అడిగాడు. మా అమ్మ గురించి విచారించాడు. నాకూ, వాడికీ పరిచయమున్న ఒక స్వామిజీ గురించి అడిగాడు. స్వామీజీతో పాటు ఉన్న అందమైన అమ్మాయి గురించి అడిగాడు.
“స్వామీజీ ఆర్. ఎస్. ఎస్. లో చేరిపోయాడు. అందుకు కారు కూడా బహుమతి ఇచ్చారు. ఆ శిష్యురాలు ‘రంభ’ ఇప్పుడు సత్యమంగళంలో ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్.”
కాశీ సిగరెట్టును దూరంగా విసిరాడు. గడ్డిపై కాస్త పొగ రాజుకుంది. నేను మళ్ళీ ఒక సిగరెట్టు కోసం ఎదురుచూశాను. లేదు. నిజానికీ నన్ను పీకేస్తుంది. నేను కూడా కాశీలా ఊరికినే సిగరెట్టు తాగుతున్నాను అనిపించింది. కొన్నిసార్లు తోటవైపు గుమ్మ చీకట్లో నిలబడి తాగేవాడిని. తాగిన తృప్తే ఉండదు. బహుశా పొగను ఊది కంటితో చూడటంలోనే తృప్తి వుంది కాబోలు. ఖాళీ పెట్టెను నలిపి దూరంగా విసిరేశాడు కాశీ. ఒంటి గంటా పదవుతుంది అన్నాను. వెళ్దామా అన్నాడు కాశీ అర్ధమనస్సుతో. నడిచివెళుతున్నప్పుడు కాశీని అడిగాను.
“T.M. (భావాతీత ధ్యానం) గట్రా ఈ మధ్య ఏమీ చెయ్యడం లేదా?”
“ఏదీ ఒక పట్టాన చెయ్యలేకున్నాను… కాఫీ స్పూనుతో జీవితాన్ని కొలిచిచూశానంటాడు ఎలియట్. దేనితో కొలుస్తున్నాడనే నేనింకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను…”
కాఫీనా, టీనా అని అడిగితే చటుక్కున ఒక నిర్ణయానికి రాలేనివాడు కాశీ. అయితే, చావును మాత్రం అరచేతుల్లోకి తీసుకుని కొలిచి చూశాడు.
గోడ దూకి వచ్చేశాం.
“పడుకున్న తృప్తే ఉండటం లేదు. అడ్డూఆపూ లేకుండా కలలు. పగలంతా దొంతర్లుగా ముసిరిపడుతున్నట్లు ఆలోచనలు… నాలో నేను అలుపెరగకుండా సంచరిస్తున్నట్లు… కొన్నిసార్లు నాలో వుండే ‘నేను’ మాత్రమే నిజం – ఈ బయటనున్న ‘నేను’ సూక్ష్మమమా అని ఒకే గుబులుగా వుందిరా…”
“న్యూస్ పేపర్ గట్రా చదవటం లేదా కాశీ?”
“ఎప్పుడన్నా చదువుతాను. వార్తలు, చిత్రాలుగా మాత్రమే అన్నీ నాలో నిక్షిప్తమై ఉంటున్నాయి. దేనిమీద పెద్ద ఆసక్తి లేదు. వట్టి రోలూ, రోకలిలా మనసూ బుద్దీ కొట్టుమిట్టాడుతున్నాయి…”
గ్రంథాలయాన్నీ దాటి తారురోడ్డును చేరుకున్నాం. “గుణా నువ్వు ఇటువైపు వస్తే రాకుండా పోమాకు. ఇంటికి రా. నా పెళ్ళి విషయంలో నువ్వింకా గిల్టీగా ఫీల్ అవుతున్నావని ధనరాజ్ అన్నాడు” అని చేతులు పట్టుకున్నాడు కాశీ.
2
నాకు తెలిసిన కాశీ ఎనిమిదేళ్ళుగా అలానే ఉన్నాడు. గర్భం నుండి బయట పడగానే అతని జ్ఞాపకాల మార్గంలో మొదటి అడుగు గురించి ఒకసారి కాశీ చెప్పాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన ఆరవ నెలో ఏడవ నెలో, ఎండలో కలబంద దట్టంగా పేరుకుపోయిన ఒక ఎండిపోయిన కాలిబాటలో అవ్వ చంకెక్కి ఏడుస్తూ వస్తున్నాడు కాశీ. వాడి పెద్దనాన్న ఇంటి గుమ్మం ముందు తీసుకువచ్చి దిగబెట్టి తిరిగి చూడకుండా వెళ్ళింది ఒక తెల్లచీర కట్టుకున్న ముసల్ది. ఆవిడ కాశీ అమ్మమ్మ. మేనమామ పగటినిద్రను చెరిపేసి బిడ్డ ఏడిస్తే ఎవరు మాత్రం సహించగలరు.
కాలేజీ రోజుల్లోనే కాశీ నాకు స్నేహితుడయ్యాడు. ‘హిపోక్రసీ’ ని అమలుపరిచి మనుష్యులను, మమ్మల్ని పరిహసిస్తూ కిల్లాడీలుగా భావించి కుతుహలించి తిరిగిన మా స్నేహం పుస్తకాల ద్వారా మరింత బలపడింది. భిన్నమైనవారిగా ఒకరినొకరు మార్చి మార్చి మెచ్చుకుంటూ ముందుకుసాగాం. ‘ఆధవన్’ ని ఆస్వాదిస్తూ చదివాం. ‘భువియరసు’ ను నేరుగా వెళ్ళి కలిసాం. కాశీనే తీసుకువెళ్ళాడు. మెల్లమెల్లగా జానకీరామన్, లా.సా.రా., బిచ్చైమూర్తి, అశోకమిత్రన్, సుందర రామస్వామి పైన ఆసక్తి నెలకొంది. ‘మౌని’ అర్థం కాకున్నా ‘అరాచకం’ అనే భావనతో నింపుకొని కొనియాడాం. మధ్యలో నేను చదవడంలో ఎందుకో వెనుకపడ్డాను. స్త్రీ వాంఛ. తగిలించుకున్నాక వివేకానందుడు, పిత్తుకుళి మురుగదాస్, రజనీష్ అన్నిటిని ఒక్కుమ్మడిగా కంకరరాళ్ళతో సిమెంట్ మిశ్రణం కలపడం మొదలెట్టాను. ప్రస్తుతం జె.కె. ని తరుచూ చదువుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కడలూరికి వెళ్ళాకనే కాశీ సాన్నిహిత్యాన్ని కోల్పోయాను. ‘ఆవేశంలో విరుచుకుపడి, సగం నుయ్యి దాటే స్వభావం’ చిన్నతనం నుండే కాశీకి వున్నట్లేం అనిపించదు. వాడి స్కూల్ లైఫ్ గురించి వాడు ఎక్కువగా మాట్లాడిందిలేదు. నాలుగవ తరగతి చదివేటప్పుడు ప్రేమవైఫల్యమని, హై స్కూల్లో ప్రేయర్ సమయంలో ఉదయాన, పళ్ళు లేదా ఐజక్ న్యూటన్ గురించి వ్యాసం చదివి స్కూలునే రంపపుకోత కోసేవాడినని ఏవేవో చెప్పాడు. ఎస్. ఎస్. ఎల్. సి. లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నాడని నాకు తెలిసింది.
1976 లో కాలేజీ నుండి బయటపడ్డాడు. రెండు పేపర్లలో ఫెయిల్. ఆపై అవి తిరిగిరాయనేలేదు. కొద్దిరోజులపాటు పోస్టల్లో తమిళం ద్వారా హిందీ నేర్చుకున్నాడు. ఆపై అదీ అటకెక్కింది. కొద్దిరోజులు మాతృభాషపైనున్న మక్కువతో తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు మాష్టారి ఇంటిపిల్ల రోజూ కాఫీలో కూసింత ప్రేమను కూడా కలిపి ఇచ్చేది. ఆ రోజుల్లోనే ఇంటిపక్కనున్న ఒక ఇంజినీరింగ్ కంపెనీలో టైం కీపర్‌గా పని చేసేవాడు. వాడు ఒకేచోట్లో నిలకడగా ఏడాది పాటు చేసిన పని అదే. షటిల్ కాక్ ఆటలో ఓ మోస్తారు ఆటగాడు కాశీ. కాలేజీ రోజుల్లో వాడు ఎక్కువ ఆసక్తికనబరిచే విషయాలు కవిత్వం, ఆటలు మాత్రమే. ఎన్.టి.సి. మిల్ ఒకదాంట్లో స్పోర్ట్స్ కోటాలో పని దొరికింది. ఈ పనే… దీని నుండే ‘కాశీ’ బయటపడ్డాడు. ఎన్.టి.సి. మిల్లులో ఆరు నెలలే పని. మనోవికారం, మానసిక చికిత్స, అప్పుడు నేను కడలూరిలో ప్రభుత్వ ఉద్యోగిని.
కాశీ తిరునళ్ళారు వెళ్ళి గుండు కొట్టించుకుంటానని ఆ నాయాలు నాన్న దగ్గర డబ్బులు పట్టుకుని ఉడాయించి వచ్చాడు. రెండురోజులు నాతోపాటు ఎంజాయ్ చేసాడు. నిజంగానే ‘తిరునళ్ళారు’ మీద నమ్మకం కలిగున్నాడేమో అనుకున్నాను. ఒకరోజు వెళ్ళి గుండు గీయించుకుని మధ్యాహ్నం కారైక్కాల్ వచ్చి ఒక లాడ్జీలో బీర్ కొట్టేసి పడుకున్నాం.
సాయంకాలం గాలివాటుగా బయటకువచ్చి నడుస్తున్నప్పుడు ఒక అవాక్కయ్యే నిజం కక్కాడు కాశీ. “నిజానికి నేనొక దొంగముండాకొడుకుని రా గుణా. ప్రేమించే నాన్నను ఏమారుస్తున్నాను. నాకే బాదరాబందీ లేదు. డాక్టర్లను సైతం కళ్ళుగప్పి నటిస్తున్నాను. నాకు పనికి వెళ్ళాలంటే భయమేస్తుందిరా… ‘ఫియర్ ఆఫ్ రెస్‌పాన్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ రా…’
‘ఏ పుస్తకంలో చదివావు ఈ ఇంగ్లీష్ లైన్, బాధ్యత గురించిన పిరికితనం సరే. అదేంట్రా స్వేచ్ఛ గురించిన భయం? స్వేచ్ఛ కోసమే తప్పుగా అర్థం చేసుకున్న నువ్వు… మేధావి అనే బింబాన్ని పెంచి పోషించుకుని, ఆ ఇమేజ్ గర్వానికి భంగంగా ఉందా పని చేసే చోటు? నువ్వు మూర్ఖుడివి!”
“లేదురా గుణా… నాకు వచ్చిన జాబ్ నచ్చలేదురా… ఏ జాబూ సరిరాదు. నేను గడియారం బెదిరింపును సహించలేకున్నాను. రోజురోజుకి ఒకే సమయానికి అవీ ఇవీ పనులు చెయ్యడం, యాంత్రికంగా టపీమని గంట కొట్టే ఒకే సమయానికి నిద్రలేవడం, యాంత్రికంగా రోజుకీ ఒకే టైం పట్టుకుని దొడ్డికి కూర్చోవడం, గన్ పాయింట్ సమయానికి స్నానం… క్రమశిక్షణారహితమైన రోజు రోజు రోజుకి రోజులు నాకు చిర్రెత్తిస్తున్నాయి. విసుగొచ్చి, వికారమై…. అంతకుమించి బాధ్యతలంటే పైగా భయం కూడా. అధికారుల అదిలింపులు… ఓవర్ టైమ్… ఓరినాయనో!
“దుర్మార్గుడా!”
“నాకు లోలోపల నిజంగానున్నా ఆశ ఏమిటో తెలుసా?”
“చెప్పు”
“ఎక్కడయినా అడవిల్లోకి… కొండాకోనల్లోకి పారిపోవాలి.”
“వెళ్ళి”
“ఆదివాసుల మధ్య ఆదివాసిగా బ్రతకాలి.”
“మూర్ఖుడా! ఆదివాసుల్లో మాత్రం బాధ్యత, స్వేచ్ఛ గురించిన గుబులు ఉండదంటావా? అక్కడ కూడా లయ వుంది రా… నియంత్రణ వుంది…”
కాశీ బదులు మాట్లాడలేదు. నేను ఎదురుచూడలేదు. ఉన్నట్టుండి చొక్కా విప్పాడు. నడుముకున్న లుంగీని లాగి చేజార్చుకున్నాడు. డ్రాయర్ తొడుక్కోలేదు. దుర్మార్గుడి ఎడమ భుజం ఉబ్బిపోయి పలకలా వుంది. నెట్టలేకపోయాను, బరువు. లుంగీని బలవంతంగా చుట్టి మెల్లగా హత్తుకున్నట్టు తోసుకుంటూ వెళ్ళాను. బడ్డీకొట్టులో సోడా కొని ముఖాన చిలకరించాను. కాస్త నోట్లో పట్టించి లాడ్జీకు తీసుకువెళ్ళాను.
రాత్రి పదకొండింటికి మేల్కొన్నాడు. రాత్రి భోజనం చెయ్యలేదు. నేను కలవరపడి దిగులుగా కుర్చున్నవాడి దగ్గరకు వెళ్ళాను. బోడి గుండు ఒక్కచోటా బొల్లు లేకుండా చెమటతో తడిసింది. భుజాన్ని తడిమి ఆర్తిగా, మంచం దగ్గర కూర్చున్నాను. నడుముకు లుంగీ వుంది. ఉండలేనన్నట్లు. ముఖం ఉబ్బిపోయుంది. ‘ఆకలి వేస్తుందా?’ అని వాడి చేతులు పట్టుకున్నవాడినే – ఎదురుచూడలేదు. మూతి అష్టవంక్రలు పోయేటంతటి ఒక ఏడుపు. మంద్రమైన గొంతుతో ముఖం కన్నీరు కారుస్తూ. నాకు చికాకుగాను, భయంగానూ, బాధగానూ వుంది. పక్క రూములో అందరూ లేచి వస్తే… వాడి ముఖాన్ని నొక్కి అదుపు చేసేందుకు ప్రయత్నించాను. వీలు కాలేదు. ఊ…ఊ…ఊ… అని అరగంటసేపు ఆగలేదు. పైగా వర్షం వెలిస్తే వచ్చే ఎక్కిళ్ళ శబ్దం లాంటిది కూడా…. నేను లైటును ఆర్పేశాను.
“బాగా పడుకున్నావా?”
“పడుకున్నాను” అన్న కాశీ సమాధానంలో నిరుత్సకత. ఉదయం ఎనిమిదింటికే తినేందుకు వెళ్ళాం.
“ఏంటీ కాశీ చెప్పరా…”
“రాత్రి ఒక కల… మనసు భారంగా వుందిరా.”
“ఏంటీ విషయం చెప్పు!”
“వనాలలో మధ్యాహ్నంపూట. వర్షం కురిసి వెలిసింది. బ్రహ్మాండమైన శిల ఒకటి… వక్షాలపై పడి ఆవురావురుమని పాలు తాగుతున్నాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏమిటంటే, రమిస్తున్నట్టు…. ముఖం సరిగ్గా కనబడలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్వప్నంలోని ముఖం మనసును ఇబ్బంది పెట్టింది.”
“ఏదైనా సినిమాకి వెళ్దామా?” అని మాట మార్చాను.
3
కాశీకి పెళ్ళి అనే ఒక విషయం జరిగిందంటే దానికి నేను కూడా ఒక ముఖ్యకారణం. మొదటి కారణం కూడా. స్త్రీలతో తనకున్న అనుభవాలను కాశీ ఏ ఒక్కటి నా దగ్గర దాచిందిలేదు. పి.యు. సి. చదివే రోజుల్లో పక్కవీధిలోని బడ్డీకొట్టువాడి కూతురితో ప్రేమ. పదిహేడేళ్ళ అమ్మాయి. అప్పటి కాశీ పరిబాషలో దేవత. బడ్డీకొట్టు మరమరాలే మధ్యహ్న భోజనం, పల్లీలనే రోజుల తరబడి తిని పెరిగిన ఆ దేవతకు ఉన్నట్టుండి పచ్చకామెర్లు. ఒక రోజు బూడిదయ్యింది. కాశీ ఈ దేవత పేరును తనతోపాటు చేర్చి కలంపేరు పెట్టుకుని ‘దాగుడు మూతలు’ అనే ఒక చిట్టి కవితా సంకలనాన్ని ఆ తర్వాతి రోజుల్లో, వేలు విడిచిన అన్నయ్య ప్రెస్సులో పని చేస్తున్నప్పుడు విడుదల చేశాడు. ‘పని’ అని అంటే వాస్తవానికి సంకలనాన్ని అచ్చు వేసేంతవరకు మాత్రమే ఆ పని!
కాలేజ్ మొదటి సంవత్సరం నాటి రోజుల్లో కవితతో పాటు రెండు చిట్టి ప్రేమలు కూడా. ఒక అమ్మాయి ము.వ. అభిమాని (ము. వరదరాజన్ అనే తమిళ రచయిత). చదువు కెమిస్ట్రీ. ఎదురిల్లు. అదనపు సబ్జెక్ట్ ‘మాథ్స్’ సాకుతో కాశీ తరుచూ ము.వ. అభిమాని ఇంటికి వెళ్ళేవాడు. ఒక సాయంత్రం స్నానం చేసేటప్పుడు గోడ దూకి విరహతాపంతో పేరు పెట్టి బిగ్గరగా అరిచేశాడు. జన్మలో మళ్ళీ ముఖం చూపించకు అని ముఖాన భళ్ళున తలుపేసింది ‘తామర.’ మరొక అమ్మాయి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు తనంతట తానుగా వచ్చి గుండెలపై వాలింది. పని లేని పట్టభద్రురాలు. పని దొరికి పొళ్ళాచ్చికి వెళ్ళిపోయింది. ఎటువంటి రాకపోకలు లేవు. ఉత్తరాలకు ఎటువంటి బదులు లేదు. కాశీ ఎన్.టి.సి. మిల్లులో పని పోగొట్టుకుని ఊర్లు పట్టుకుతిరుగుతున్న రోజుల్లో నాన్న జేబులో నుండి పది రూపాయలు తస్కరించి ఒక రోజు పొళ్ళాచ్చికి వెళ్ళే బస్ ఎక్కాడు. జత రోల్డ్ గోల్డ్ చెవి రింగులను కొనుక్కుని వెళ్ళి, సాయంత్రం పోస్ట్ ఆఫీస్ వాకిట్లో ఆమెను కలిశాడు. ఆమె తలెత్తలేదు. మనోడు రింగులతో చెయ్యి చాపాడు. ‘నన్ను కలిసేందుకు రామాకు! మా అనయ్యకు లెటర్ రాస్తాను. నీకు మరేం పనీపాటా లేదా. మెంటల్’ అనగానే కర్ణాభరణాలను మురికికాలువలో పడేసి నీళ్ళు నములుతూ సిగ్గుతో కుచించుకుపోయి ముందుకు నడిచాడు కాశీ.
మరో ప్రేమ రెండు ఇళ్ళలోనూ బట్టబయలయ్యింది. కాశీ బలవంతం మీద వాళ్ళ నాన్న పిల్లను అడిగేందుకు వెళ్ళాడు. పని ఏదైనా చూడమనండి. తర్వాత ఆలోచించవచ్చుని చెప్పి పంపారు. కాశీ వేరే దారి లేక అయిష్టంగానే పని వెతికాడు. పెళ్ళికి ఎటువంటి ఖర్చులు వద్దు, ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేస్తాను అని బ్రతిమాలి చూశాడు. కాశీ సంగతి పూర్తిగా తెలిసి కూడా ఆ పిల్ల మంకుపట్టు పట్టింది. ఆయన పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నాలుగు గేదెలు కొనయినా పాలు పితికి పొట్ట పోసుకుంటాం అని చెప్పిందట. ఆర్థికస్థితిగతుల రూపురేఖలు ఏ మాత్రం తెలియని ఆ అమయాకపు అమ్మాయి. చివరికి ఒక పోలీసోడికి భార్య అయ్యింది.
ఆ తర్వాత కాశీ ఇంకెక్కడ పనికి వెళ్ళలేదు. ‘బిజినెస్’ అన్న పేరుతో ఎవరెవరితోనో కలిసి ఊర్లు పట్టుకుతిరిగాడు. మద్రాస్, బెంగుళూరులో జాబ్ ‘ఇంటర్వ్యూ’ అని చెప్పి అమాయక తండ్రిని మోసం చేసి డబ్బులు లాక్కువెళ్ళి ఖర్చు పెట్టి వచ్చి తిరిగివచ్చాడు. రేడియో స్టేషనులో రోజూ వెళ్ళి బడాయిలు పోయేవాడు. “రోజుకో సమాచారం’, ‘మీ గమనింపుకు’ అని అడ్డమైనవి రాసి డబ్బులు అందుకునేవాడు. నెలకి డబ్బైయైదు, వందా అని వచ్చే వాటన్నిటిని టీ, సిగరెట్, కల్లు అని ఖర్చుపెట్టి తిరిగేవాడు. బిజినెస్ మిత్రులకోసం ఎక్కడికైనా పంపితే బసెక్కి వెళ్ళి కార్యం చక్కబెట్టేవాడు. ఖర్చులకి ఇచ్చి ఎక్కడికైనా పంపితే చాలు ఒకే ఖుషినే. ఇంటిముఖం పట్టేవాడు కాడు. బావ లేని సమయంలో వంటగదిలోకి చొరబడేవాడు. బావకు హాఫ్ నైట్ (మిల్లు) షిఫ్ట్ అంటే మూడింటికి ఇంటికి వస్తే, రెండుసార్లు భోజనం. నాన్న మిల్లు పని మానేయడంతో వచ్చిన డబ్బుల్లో సగానికి పైగా కరిగిపోయింది. బావకి పుట్టిన నలుగురు పిల్లల్లో, ఇద్దరు ఆడపిల్లలు. దీనికి తోడు సంరక్షణకు మూడు ఆవులు. ఆయన తిప్పలు ఆయనవి. మానవత్వాన్ని ఇసుమంతయినా సంరక్షించుకునేందుకు ఆయన శ్రమించే షిఫ్ట్‌లో సమయం దొరికేదికాదు. బావ నాలుక ఝళిపించే కొరడా దెబ్బలు తట్టుకోలేక కొయ్యబారిపోయి కాశీ తడబడ్డాడు. కాశీని అదుపు చెయ్యలేని బావ కోపం, కాశీ తండ్రి మీద, నిస్సహాయత కాలువ అంచును మెల్లమెల్లగా చేరుకుంది. ఆ నాలుక ఉధృత నాన్నకు కూడా చెళ్ళుమని తగలడంతో, కొరడాను ఒకరోజు ఎగిరి పట్టుకుని దుమ్ముదులిపేశాడు కాశీ, దాని ఫలితం దూరంలోనున్న పెద్దమ్మ ఇంట్లో ఆశ్రయం. ‘బావ అయితే ఏంటీ! పెద్ద పోటుగాడివి అయితే ఏంటీ! ఇవ్వరా ఇంటి అద్దె!’ అని నెలకి నాలుగు వందల రూపాయల అద్దెను అడిగేశారు అబ్బాకొడుకులిద్దరూ. అన్నీ కాశీ కోసమే. నిజానికి కాశీ వాళ్ళ నాన్నకి కూతురు మీద అతీతమైన ప్రేమ. కాశీపై అతని అక్కయ్యకు కూడా! కాశీ బావ మరెవరో కాదు, స్వయానా కాశీ మేనత్త కొడుకు.
పెద్దమ్మ ఇంట్లో కాశీకి పరిస్థితి ముంచుకువచ్చింది. మనోవ్యాధిగ్రస్తుడిలా నటించి తిరుగుతున్న కాశీకి నిజంగానే కాస్త మనోవ్యాధి తాకింది అనే అనుకుంటున్నాను. ‘ఒక పిచ్చివాడీకీ, నాకూ మధ్యనున్న వ్యత్యాసం, నేను పిచ్చివాడిని కాదన్నది మాత్రమే’ అని ఎవరో ఒక పాశ్చాత్యుని పేరు చెప్పినట్లు చెప్పుకు తిరిగిన కాశీ స్వీయ పరిధులను దాటి మెల్లగా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. అయినాసరే అక్కడ ఇంట్లోనున్న రోజుల్లో ఎక్కువగా చదివాడన్నది మాత్రం తెలుస్తుంది. (నాకు) అర్థం కాని కవితలు అనేకం రాశాడు. నేను బదులు రాయలేదు.
ఒక క్షణం కూడా కాలు మోపలేక విరుచుకుపడ్డాడు కాశీ. తన శరీరంలోనే ఉచ్చులో చిక్కుకున్న ఒక ఎలుకలా మారింది అతడి పరిస్థితి. ఒక తెలివి తక్కువ మానసిక వైద్యుడు నాలుగు వందల రూపాయల కోసం కక్కుర్తిపడి నాలుగుసార్లు ‘షాక్’ ట్రీట్ మెంట్ చేసాడు. కరివేపాకు మాడే వాసన తలలో నుండి ప్రతి సెకనుకి ఒకసారి వీస్తున్నట్లు మానసిక భ్రమలో (?) పరితపించిపోయాడట కాశీ. లెక్కలేనన్ని మాత్రలు… మనసు కట్టుబడడం లేదు. ‘చంచల మనస్కుడిని’ అన్నాడు కాశీ. పదడుగులు వేసే లోపు ఆలోచనలు తలోదిక్కుకి వెళతాయి. ఈ గూడేనికి వస్తున్నాను నాయాలా అని నాలుగుసార్లు బస్సు ఎక్కినవాడు ఒకసారి నలభై కిలోమీటరులు వచ్చేసి తిరిగి, రెండు సార్లు వంద కిలోమీటర్లకు టిక్కెట్ కొనుక్కుని ఆరవ కిలోమీటర్లోనే వెనుతిరిగివెళ్ళి పోయాడట. ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలో దూది వేరు చేసే పనికి వెళ్ళే బంధువుల అమ్మాయితో పెళ్ళి కుదర్చమని వాళ్ళ నాన్నతో వాదించాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు. పెద్దనాన్న మనవరాలు. పెద్దనాన్న చనిపోగానే ఆస్తి పంపకాలలో ఒకగానొక్క అన్నయ్యతో, జన్మ పగ చేరిపోవడంతో సంబంధాలు తెగిపోయిన కాశీకి, వేలు విడిచిన అక్కయ్య కూతురు. పెద్దమ్మకి ఈ వ్యవహారంలో రహస్య సమ్మతం. బాహుశా, ఆస్తి కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. తెలియదు. నాన్న కూడా ఎవరినో కలిసి అడిగాడు. ‘పిల్లను అడిగేందుకు ఎన్ని గుండెలు’ అని తాగుబోతు పిల్లతండ్రి రాయబారిని తిట్టి పంపేశాడట. “ఏదో ఒక పిల్ల నాన్నా, పెళ్ళి అయితే నాకు అంతా సర్దుకుంటుంది. ఇక్కడ బంధువుల ఇంట్లో ఇంకెన్ని రోజులని ఇలా? తలుచుకుంటే భయమేస్తుంది నాన్న.” అని పచ్చిగా గగ్గోలు పెట్టాడు కాశీ. దిగాలుగా వున్నవాడు కాస్తా ఒక సాయంత్రంపూట కొబ్బరి బరిఫీని కొరుకుతూ రెండు బాటిళ్ళ టిక్ 20 (పురుగుల మందు) ని ఖాళీ చేసేశాడు. విషయం తెలిసేసరికి, పెద్దమ్మ హడావిడిగా కుక్కపియ్యను కరిగించి నోట్లో పోసింది. మళ్ళీ ఈ సారి మరో మానసిక వైద్యుడు, మాత్రలు.
హఠాత్తుగా ఒక సాయంకాలం ఈ గూడేంలోని తోటకి వచ్చాడు. ఒళ్ళు ఊరిపోయి, నల్లబడి మనిషి చూసేందుకు వికారంగా ఉన్నాడు. రెండవరోజు పోరుపెట్టసాగాడు. ఎవరైనా అమ్మాయి కావాలని. ఒక రోజంతా ఒక అమ్మాయితో ఒంటరిగా గడపాలని. ఏర్పాటు చెయ్యి అని మంకుపట్టు పట్టికుర్చున్నాడు. ముప్పై మైళ్ళు ప్రయాణం చేసి, ఆ శివారులోని చిన్న టౌనుకు వెళితే నాకు తెలిసిన ఒక అమ్మాయి వుంది. సమయానికి ఆమె కూడా ఊరిలో లేదు. ఆ సమయంలో నేను పనిలో కూడా లేను. నాన్న హఠాత్తుగా చనిపోవడంతో కడలూర్ ప్రభుత్వవుద్యోగం వదిలి ఇక్కడ తోటకి వచ్చి రెండేళ్ళు అయ్యింది. అమ్మా, చెళ్ళెళ్ళకు తోడుగా వ్యవసాయంలోకి దిగాను. దానితో పాటు ఎల్. ఐ.సి. ఏజెంట్ పని. ఒక స్వామీజీతో నాకు బాగా పరిచయం. మా గ్రామంలో చిన్న గుడిసె ఒక దాంట్లో ఉండేవాడు. కొద్దిరోజులకే తెలిసింది, తోడుకి ఒక అందమైన శిష్యురాలు వుందని. మేము సొంత గుడిసెగా ఆశ్రమం కట్టేందుకు వసూలు చేసాం. ‘వివేకానందుడి మరో అవతారం’ అని చెప్పుకు తిరిగే స్వామీజీకి నేనే ప్రథమ శిష్యుడ్ని. కొండ కిందకు దిగి స్వామీజీ నగరాలకు వెళ్ళాడు. కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆయన ఇంగ్లీష్ స్వామీజీ. ఫార్మర్ లైఫ్‌లో ఎమ్.బి.ఎ., ఎన్నో ఏళ్ళుగా సినిమాల్లోనున్న నిర్మాతకు దగ్గర బంధువు. భార్యేమో గడప దాటింది. మొగుడేమో ఇల్లే దాటొచ్చి ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ తర్వాతిరోజుల్లోనే నాకు అన్నీ తెలిసొచ్చాయి.
స్వామీజీ దగ్గరకు కాశీని వెంటబెట్టుకు వెళ్ళాను. జరిగినవన్నీ చెప్పాను. పదేళ్ళ కుర్రాడికి కూడా మనసుని తీసి చేతిలో పెట్టి, ‘చూసి జాగ్రత్తగా తిరిగి ఇచ్చేయ్ రా’ అనే తీరులో కాశీ వుండటం స్వామీజీ మెదడు గ్రహించింది.
‘నలుగురిలా లైఫులో సెటిల్ అవ్వాలి అనే ఆశే అడుగంటిపోయింది స్వామి వీడికి.’
‘దేవుడి మీద నమ్మకం వుందా?’
కాశీయే బదులిచ్చాడు “లేదు స్వామీ… అయితే ‘దేవుడు’ అనే వాడు ఒకడు వుంటే కూడా పర్వాలేదని అనిపిస్తుంది!”
“బాగా మాట్లాడూతున్నారే; ఇంతకుముందు మరెవరైనా స్వామీజీ దగ్గరకు వెళ్ళారా?”
“వెళ్ళాను స్వామీ. సహజ చైతన్య స్వాములు దగ్గరికి వెళ్ళాను. ధ్యానం నేర్చుకునేందుకు వెళ్ళాను. మంత్రదీక్ష ఇచ్చారు. మంత్రాన్ని బయట చెప్పకూడదని చెప్పారు. ‘ఐం’ అనే దానిని బయటకు చెప్పాను. మళ్ళీసారి కలిసినప్పుడు అలా చెయ్యడం గురించి చెప్పాను. పర్వాలేదు. కొనసాగించమని చెప్పారు. కలలు ఇబ్బంది పెట్టడం గురించి చెప్పాను. గతజన్మలో కట్టడి చేసుకున్న ఆశలు కూడా ఈ జన్మలో కలలుగా వస్తాయన్నారు. భయపడిపోయాడు స్వామీ… ఇక ఆ రోజు నుంచి వెళ్ళడం మానేశాడు…”
చివరికి స్వామీజీ ఒకే మాటలో కాశీకి దివ్యవాక్కుగా తీర్పునిచ్చారు. నేను అవాక్కయ్యాను. “కాశీ… సెక్సే నీ సమస్య… యు హావ్ సెక్స్ విత్ హర్” అని రంభని తీసుకొచ్చి చూపించారు.
కాశీ రెండు రోజులుగా అయోమయానికి గురై, నిర్ణయించుకోలేక పోయాడు. కుదరదని మొత్తానికి తెగేసి చెప్పాడు. తనకు చూసేందుకు చెల్లెలిలా వుందని, తను కోరుకునేది పిల్లల తల్లినని స్వామిజీ దగ్గరే నోటికి వచ్చినట్లు వాగాడు. “నో అదర్ గో… లీవ్ హిమ్… ఇలా మెంటల్లా వుండాల్సిందే అని. ట్రై ఫర్ సప్లిమేషన్ నాట్ ఫర్ సెంటిమెంటల్ ఇన్ సెక్సువాలిటీ విత్ చాయిస్! నిన్న గురుజీ దగ్గర నీ గురించి అడిగాను. నీకు ఇంకా మరో పదేళ్ళకు గడ్డురోజులు బాకీ ఉందన్నారు అన్నాడు. ముందు నువ్వు శరీరంతో వుండటం అలవర్చుకోవాలి” అని కాశీ ముఖం మీద చెప్పేశాడు స్వామీజీ, అతడిని ఆశ్రమానికి తీసుకురావద్దని నాతో రహస్యంగా చెప్పాడు.
4
కొండ కిందకు వెళ్ళిన కాశీ నుండి ఒక నెల వరకు ఎటువంటి సమాచారం లేదు. కొండ కింద కోయంబత్తూరులో స్వామీజీ ఒక ధనవంతుడి ఇంట్లో తరుచూ వెళ్ళి ఆశీర్వదించేవాడు. ఒకసారి నేను కూడా వెంట వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక వయస్సులోనున్న అమ్మాయి. భర్తను వదిలేసి, పుట్టింటికి వచ్చేసిన అమ్మాయి, ముగ్గురు ఆడపిల్లల్లో మధ్య అమ్మాయి. ‘మగవాడి’ లా స్వేచ్ఛగా ఎదిగిన అమ్మాయి. కట్టుకున్న మొగుడు రాయి కాదు, గడ్డీ కాదు. అయితే, ‘ఇంపొటెంట్’ అని తాళిని పక్కన విసిరి పడేసి వచ్చేసింది. పెద్దామె – చిన్న చెల్లెలు ఇద్దరూ వసతిగా జీవించినవాళ్ళు. ఆ కుటుంబం, స్వామిజీని ఎంతో భక్తిప్రపత్తులతో వేడుకుంది. కాశీకి తెలిసిన కుటుంబం అని తెలిసింది. నేను కాశీ స్నేహితుడ్ని అని, కాశీ గురించి ఏదో మాటల మధ్యలో స్వామిజీ, యథేచ్చగా తన దగ్గరకు వచ్చిన కేసు హిస్టరీలలో ఒకటిగా చెప్పుంచారు. కాశీని కలిసినప్పుడు నేను కూడా యథేచ్చగా ఆ అమ్మాయి దైన్యమైన పరిస్థితి గురించి చెప్పి తగలడ్డాను. కాశీలో సిద్ధంగానున్న విధి, కాశీ పరిభాషలో ‘క్యారెక్టర్’ కట్టలు తెంచుకుని పొంగుకు వచ్చింది.
కాశీ పెళ్ళి చేసుకుని ఒక నెల కూడా కలిసుండలేదు. రెండవనెల ఒకరోజు సాయంత్రం వేళలో ఈ గూడేంలోని తోట వాకిట్లోకి వచ్చి నిలబడ్డాడు. ఆరోజు రాత్రంతా ఊరంతటిలో మేము ఇద్దరమే పడుకోకుండా తెలివేసి ఉండివుంటాం. అల్లుడి కళ రవ్వంత కూడా లేదు. ముఖం గేదె పేడలో ముక్కినట్లుంది.
“మా మామగారు అరకిలో బాదం కేకుకి, మీ ఏ కవితను కొట్టుకు తీసుకెళ్ళాలి అని అడుగుతున్నాడు రా. పుస్తకాలను కట్టకట్టి తూకానికి వేసేసి, మెదడును డబ్బు చేసుకోవడానికి వాడండి అంటున్నాడు రా. ఇల్లరికం అల్లుడిలా అక్కడే ఉండాలట. మధ్యతరగతి కుటుంబాలు బ్రతికే మా లైనుకి వచ్చి ఆమె కాపురం చెయ్యలేదంట. మాది డబ్బున్నవాళ్ళను చూస్తే అసూయపడే లొకలిటీ అంట. నాన్నను కూడా మామగారి ఇంట్లోనే వచ్చి వుంటే వుండొచ్చు అంటున్నారు… ముగ్గురికీ, ఇద్దరు పనిమనుష్యులు ఉన్నారిప్పుడు, మరో ఇద్దరు వుంటే వాళ్ళకి పని ఇవ్వడానికి సబబుగా వుంటుందంట. రోజూ స్కూటర్ సవారీ, ఐస్ క్రీం బార్, ఖచ్చితంగా సినిమా, విడుదల కానీ కొత్త తమిళపాట, ఇదే ఆ అమ్మాయి రోజువారీ జీవితం. అల్‌సెషన్ కుక్కకీ, వీధీకుక్కకి మధ్యనున్న వ్యత్యాసం. నేను సహించలేక పోతున్నాను. నా ‘తల్లి’ ఇమేజ్ గాడిద గుడ్డు కూడా వద్దు. ఒక ‘ఆడది’ లా అయినా ఉండుండవలిసింది. లెక్కేసి చూస్తే ఒక పదిపన్నెండు సార్లు సంభోగించుంటాం. నువ్వు నమ్మగలవా గుణా. ముద్దు పెట్టేందుకు కూడా అనుమతించింది లేదు. కొంతమందికి నచ్చదు. పర్వాలేదు. అయితే, ఇక్కడ ‘లిప్స్’ అందగత్తె మంజుల కంటే కూడా ఒక మెట్టు తగ్గకూడదనే లక్ష్యం. జాగ్రత్త. అందమైన పెదాలు. అయితే, అబద్దపు పెదవులు.
ఒంటరిగా భయం, ఒంటరితనం. క్షణాలన్నీ చిటుక వేస్తున్నాయి. నా వలన కావడం లేదు. మళ్ళీ పాత పైత్యమేదో తిరగతోడిందిరా గుణా. నాన్న దగ్గరకు వచ్చేశాను. నాన్న నా మీద ఆశలు వదిలేసుకున్నాడు. ‘ఈ పుస్తకాలవీ చదవకుండా, వీటిని వదిలి ఉండలేను నాన్న… నేను ఆ ఇంట్లో సంభాళించుకోలేక పోతున్నాను నాన్న. వాళ్ళ గౌరవానికి మనం తులతూగలేం నాన్న… నాకు భయమేస్తుంది… ‘అక్కడుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను నాన్న’ అని ఏడ్చానురా. ‘పోను పోను అదే సర్దుకుంటుంది. ముందు నువ్వు ఏదైనా పనికి వెళ్ళు’ అని అక్క అక్కరతో చెప్పింది… ‘మూసుకుని వెళ్ళు’ అని అక్క మీద మండిపడ్డాను రా. ‘నిన్ను కలిసి వస్తే మనసు కాస్త కుదుటపదుతుంది’ అని నాన్నతో అన్నాను. కట్నం చదవాయింపుల్లో వచ్చిన డబ్బుల్లో వంద రూపాయలు ఇచ్చి పంపారురా.”
ఒక వారం పాటు ఉన్నాడు. నేను కూడా ఈ మధ్య స్వామీజీ దగ్గరకు వెళ్ళడం మానేశాను. కొద్దిరోజులపాటు నిదానంగా ఊరికే ఉండమని చెప్పి పంపించాను. కార్యానికి తగినట్లు తీర్మానంగా నేనూ ఏదీ ఆలోచించి చెప్పలేకున్నాను. పైగా మనిషికి ఒక వైపు నుంచి అపరాధభావం వేరే. వాడితో కలిసి ప్యాకెట్ల కొద్దీ కాల్చి పడేసిన సిగరెట్ బూడిదే చివరకు మిగిలింది.
కిందకు వెళ్ళిన కాశీ గురించి రెండు నెలలుగా ఎటువంటి సమాచారం లేదు. ధనరాజ్ రాయడంతోనే అసలు సంగతి తర్వాత తెలిసింది.
కాశీ ముందులాగే మళ్ళీ మొదలుపెట్టేశాడు. అడ్డమైన నిద్రమాత్రలు. సగం నటన, మిగిలిన సగం పిచ్చెక్కినట్లు కుర్తాను చింపి పోగులు పెట్టాడు. స్కూటర్ని కావాలనే గోడకేసి గుద్దాడు. అది కాస్తా మామగారి పేరు మీద వుంది. ఆయనకు కోపం రాదా మరీ? మత్తు మాత్రల వ్యసనపరుడని చెప్పు తీసుకుని కొట్టడానికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒకరోజు ‘ఇకపై బుద్దిగా ఉంటాను’ అని హఠాత్తుగా కంకణం కట్టుకుని ఆ అందమైన పెదవులకు ఐస్ క్రీం, కొత్త సినిమా, స్కూటర్ మీద ఊరేగడం, పట్టుచీరకు మాట ఇవ్వడం ఇలా పూజ చేశాడు. రాత్రిళ్ళలో మెడ కింద మాత్రం ఒకే ఒకసారి మాత్రమే, సంభోగించాక, నిద్రమాత్రలు లేకుండానే సుఖ నిద్ర. తెల్లారకముందే ఐదు గంటలకే నిద్రలేసి స్కూటరులో తరుముకువచ్చి మరీ నాన్నను నిద్ర లేపాడు. దీనికి ‘చదవాయింపులు’ లలో వచ్చిన వంద కాస్తా ఊడ్చుకుపోయింది. ఈ రకంగా నాలుగైదు సార్లు పూజ జరిగింది. పిల్ల ఇంట్లోనే కాశీ రెండు వారాలు అవిరామంగా తిష్ట వేసుకుర్చున్నాడు. అంతగా చదువు జ్ఞానం లేని నాన్నకు ఇవేమి అంతుబట్టలేదు. ఆయన చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చారు. మళ్ళీ నిద్రమాత్రలు మొదలయ్యాయి. ఒక సాయంత్రంవేళ ఎలాగోలా నాలుగు కొట్లు ఎక్కిదిగి, నలభై మాత్రలు ఏకబిగిన మింగేశాడు. మనస్ఫూర్తిగా ఆత్మహత్యాయత్నం. పైగా ఉత్తరం రాసి పెట్టి మంచమెక్కాడు. తలుపుకి గొళ్ళెం పెట్టుంది. నమ్మకంతో కళ్ళు మూసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం కళ్ళు తెరుచుకున్నాయి. ఘోరమైన నిరాశ ఎదురైంది. మనస్ఫూర్తిగా ఎదురైన నిరాశ. ఆవేశం కట్టలు తెంచుకుని చేతుల్లోకి క్షవరం బ్లేడును తీశాడు. తడబడుతూ అడుగులు వేసుకుంటూ…
గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు వారాలు ఉన్నాడు కాశీ. అందులో ICU లో మొదటివారం. మెడలో ఒక చిన్న ఆపరేషన్. కాళ్ళ దగ్గర కేస్ నోటీస్. Personality disorder, Affection seeking phenomenon, advised psycho theraphy.
5
కాశీ ఇన్‌లాండు లెటరుని మేజా కింద పెట్టి బయటికొచ్చాను. మేఘావృతం. లేగదూడను ‘బలవంతం’ గా పక్కతోటలోకి తీసుకువెళ్ళవలసిన పని పడింది. అమ్మా, చెల్లాయిలు పాదులో నుండి చిక్కుడుకాయలు కోస్తున్నారు. లేగదూడను విప్పి పట్టుకున్నాను. కాశీ గురించిన జ్ఞాపకాలు, మేఘావృతంలా చెదరక ముందుకు సాగాయి.
సాహిత్యపరంగా ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు చదివి కూడా కాశీ ఇంతగా బాధకు గురైయ్యాడన్నది తలుచుకుంటే కాశీ చదువుకున్న చదువు మీదే నాకు సందేహమూ, కాస్త చిరాకు కలిగింది. దేనినైనా ఎదుర్కొనేలోపే ముందుగానే భయపడిపోయే స్వభావం వాడిలో సహజ స్వభావంగానే ప్రవహిస్తున్నట్టు – రక్త ప్రవాహం గుండా నీటి బుడగలు వస్తూ ఒక అపనమ్మకంగా, తెలియడం లేదు.
ఉన్నట్టుండి ఏకబిగిన పది ఇరవై రోజులు రాత్రిళ్ళలో మెలుకువగా వుండీ ఎన్నో చదువుతాడు కాశీ. అప్పట్లో రోజుకి నాలుగు ఉత్తరాలు చదివేవాడిని. కోయంబత్తూరిలో కాశీకి మరో మంచి స్నేహితుడు కూడా ఉండేవాడు. అతడిది యుక్తప్రాయం. పిల్లనగ్రోవి, చిత్రలేఖనం, ఆధునిక కవిత్వం అని కళాభిరుచి వున్నవాడు. అతడూ, కాశీ రాత్రిళ్ళలో రోడ్డు వారన ఒక టీ కొట్టు ముందు, ప్రతి అరగంటకు ఒక టీ తాగుతూ, తెల్లవారుజాము నాలుగు, ఐదు గంటలవరకు ఊసులాడుకుని ఆపై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేవారట. తనకు కళ – సాహిత్యపరమైన విషయాలలో ఎన్నో నేర్పించి, అభిరుచిని పెంపొందించడంలో అతడికి కీలక పాత్ర వుందని కాశీనే అతడి గురించి చెప్పేవాడు. పర్యవసనాలు గురించి భయపడని కాశీ లొడలొడమనే నోటి దూల బలహీనత అనేక సున్నిత హృదయాలను కొన్ని తరుణాలలో గాయపరిచేది. అలా గాయపరిచిన ఒకనొక తరుణంలో ఆ యువకవి స్నేహాన్ని కూడా కోల్పోయాడు కాశీ. ఇంత లోతుగా కాశీ దిగజారిపోయినందుకు, కొనసాగకుండా పోయిన ఆ స్నేహం కూడా ఒక రకంగా వున్న కారణాలలో ఒకటయ్యుంటుందని నాకు అనిపిస్తుంది.
కాశీ ముప్పావు వంతు చంద్ర గ్రహణంలో ఒకసారి పుట్టానని చెప్పాడు. కొద్దిరోజులు జోతిష్యంపై కూడా నమ్మకముంచాడు. తన మనసు అలవాటు ప్రకారం దానిని కూడా మధ్యలోనే వదిలేశాడు. తనవరకు వాడు దేని మీద గురి లేకుండానే పోతుండేవాడు. దాస్తొయెవ్‌స్కీ రాసిన ‘The House of the Dead’ ని తమిళంలో చదివేసి నాకు ఒక ఉత్తరంలో రాశాడు: ‘ఒక్కో ఖైదీ కారాగారంలో అతిథిలా ఈ చోటుకి వచ్చిపోతున్నామనే మనోభావంలోనే ఉన్నారు. అందువలనే యాభైయేళ్ళ వయస్సులోను ముప్పైయైదేళ్ళ వయస్సువాడిలా అనుకుంటూ నడుచుకుంటారని కథ చెప్పే వ్యక్తి పెట్రోవిచ్ అంటాడు… ఒక అతిథిలా నేనూ నన్ను తలుచుకుని, ఇక్కడ కార్యసాధన చేసేసి పోగలిగితే ఎంత బాగుంటుంది?”
ఆసుపత్రి నుండి వచ్చినవాడు, మూడోవారం నాకో ఉత్తరంలో రాశాడు: విలియం కార్లోస్ విలియమ్స్ చదువుతున్నాను. ఎన్నో కవితలు నాకు నచ్చాయి. మధ్యలో ఒక తమాషా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్ చీటీ, పాత డైరీలో వున్నది కాస్తా కంట్లో పడింది. ‘మళ్ళీ కలిసేందుకు… రోజున సాయంత్రం రెండు గంటలకి రండి. ఈ చీటీని పదిలంగా పెట్టుకోండి’ అని నోట్స్ అచ్చు వేసిన చిన్న కేస్ నోట్ చీటీ అది. అందులో Diagnosis అనే చోటులో పెన్నుతో పెద్దగా రాసుంది: CUT THROAT – Psychiatric అని cut throat అంటే నమ్మక ద్రోహం కదా? ఎవరిద్దరి మధ్య ఎవరికెవరు బహుమతినిచ్చిన నమ్మకద్రోహం రా అది? కొంపదీసి డాక్టరులోకి పరకాయ ప్రవేశం చేసి మా మావగారు రాసేసినట్టున్నాడు కాబోలు…
ఆ ఇన్‌లాండ్‌లో ‘రామకోటి’ కి బదులుగా కాశీకి మరేదీ రాయలేదు. వాడి దగ్గర నుండి కూడా గత సంవత్సరంన్నరగా ఎటువంటి సమాచారం లేదు. అయితే, పోయినవారం నాకొక మధురమైన సంభ్రమాశ్చర్యం, అనుహ్యంగా బెంగుళూరిలో ఒక మదుపాన ‘బార్’ లో కాశీని కలిశాను. కాస్త చిక్కిపోయాడు కాశీ. నవనాగరీక దుస్తులు, హెయిర్ స్టైయిల్. కంటి కింద నల్లని వలయాలు మెల్లగా పొంగుకు వస్తున్నట్లు.
ఇద్దరి పరస్పర అవగాహనతో మ్యూచువల్ డైవర్స్ దొరికిందని చెప్పాడు. మొదట విడాకులు తీసుకున్నట్టే తన అదే ‘కుటుంబ లాయర్’ ద్వారానే తన కూతురుకి ఈసారి కూడా అది చెయ్యాలని నా మాజీ మావగారు మంకుపట్టు పట్టి లాగడంతో కాస్త ఆలస్యంగానే దొరికిందని అన్నాడు. ఆ వార్తలో చిన్నపాటి ఆశ్చర్యంగాని, పూర్తి సంతోషంగాని నాకు లేదు. రమ్ము ఒక క్వార్టర్ తాగేసి కూర్చోనున్నాడు. నోట్లో సిగరెట్ కాలుతుంది.
ఆశ్చర్యకరమైన కలయికే అని అతిశయం తన్నుకొస్తుంటే అతడి ఎదురుగా కూర్చున్నాను. ‘ఇంకా…. ఏంటీ ఇటువేపు’ అన్నందుకు తన విజిటింగ్ కార్డును పై జేబు నుండి తీసి చూపించాడు. మార్కెటింగ్ డైరెక్టర్. అయ్య బాబోయ్! నాకు ఎంతో సంతోషం కలిగింది. మునుపటిలా కాకుండా ఎలాగో ఒకే ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని, పాత స్నేహాన్ని తెంచుకోకుండా చాలా నేర్పుగా ఎదిగాడు కాబోలు. వెయిటర్ దగ్గర మరో గ్లాస్ అడిగాడు కాశీ. ఒకవేళ అభయ హస్తాన్ని ఏమైనా పట్టుకున్నాడా ‘డబ్బు, డబ్బు’ అని, అయితే రామకోటి మహిమా ఇదంతా!
‘ఎలా ఇదంతా?’ అన్నాను ఉత్సాహంగా.
‘ఏది ఏది ఎలా జరగాలనుందో దానికది అలానే జరుగుతుంది’ అన్నాడు వేదాంతిలా. సాయంత్రం మొదలైంది కాస్తా రాత్రి పదిన్నర వరకు మాట్లాడుతూనే ఉన్నాం. తన వేలు విడిచిన అన్నయ్య దగ్గర వడ్డీకి కాస్త డబ్బు తీసుకుని డిపాజిట్ చేసినట్టు చెప్పాడు. వెంటనున్న స్నేహితుడు మంచి టైపు, ఆర్థిక విషయాల్లో ఎంతగానో తోడ్పాటు ఇస్తున్నాడు అన్నాడు. ‘ఇక కాశీ బ్రతికేస్తాడని ధీమా’ అని నోటి దాకా వచ్చింది. నోటి నిండా నవ్వాడు. ‘నువ్వేంటీ…ఇటువేపు’ అని నన్ను అడిగాడు. జీవితభీమా ఇన్సురెన్స్ ఆఫీస్ పని నిమిత్తంగా అని పొడిగించి చెప్పాను. నవ్వాడు. ‘నో ప్రొబ్లెం’ అన్నాడు.
బారులో జనం రద్దీ ఎక్కువగా వున్నప్పటికీ, ఏసీ కావడం వలనో ఏమో ప్రశాంతత అలుముకుంది. ఎవరు గట్టిగా మాట్లాడినా తక్కువగానే వినిపిస్తుంది. అడిగేందుకు, చెప్పేందుకు ఎన్నో ఊసులున్నా, ఇద్దరి మధ్యా ఏదో చిన్న సంశయం అడ్డుగా నిలబడింది. ఒక దశలో మత్తు బాగా ఎక్కాక సంశయం కాస్తా సద్దుమణిగింది. ఐస్ అడిగాడు కాశీ. నా గ్లాసును త్వరగా ఖాళీ చేసిమ్మన్నాడు కాశీ. సిగరెట్టును చూపించి తీసుకోలేదా అన్నాడు. మానేయడం జరిగింది! – ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో మాత్రమేనని, ఒకటి తీసుకుని నోటి దగ్గర పెట్టుకున్నాను. పగలబడి నవ్వడంతో రమ్ పొలమారింది.
నేనూ నవ్వుతూ అడిగాను.
“ఎందుకురా కాశీ ఇలా నవ్వుతున్నావు?”
‘నో ప్రోబ్లం! లేదురా గుణా… ఈ మధ్య ‘Confessions of Zeno’ అని ఒక ఇటాలియన్ నవల చదివాను. అందులో ఇరవై పేజీలకు రెండవ అధ్యాయం ఉంది, ‘The Last Cigarrette’ అని. సిగరెట్ వదలడం గురించి. వదిలేయాలని తీర్మానించుకుని, వదలలేక పడే అవస్థ గురించే ఇరవై పేజీలూ…”
నేను మళ్ళీ పాత కాశీని చూసేసాను. పైగా ఆత్మచరిత్ర బాణీలో రాయబడ్డ ఆ నవల గురించే ఎంతోసేపటి నుంచి రోమాంచితంగా మాట్లాడుతున్నాడు. నవలలో దాని రచయిత Italo Sevevo కూడా తన లాగే ‘పిల్ల ఈగ’ మీద కవిత రాయడం గురించి వివరించి బ్రహ్మాండంగా సంతోషపడ్డాడు. ఒక పఫ్ లాగి దేశ కాల జాతి స్థితిగతుల వివరాలు పక్కనపెట్టి చూస్తే ఆ ఏడు అధ్యాయాల నవల ఒక రకంగా తన సొంత జీవిత చరిత్రలానే వుందన్నాడు. నేను దానిని ఖచ్చితంగా చదివి తీరాలి – వెళ్ళగానే పంపిస్తాను అన్నాడు. పైగా వదలకుండా నవల అధ్యాయాల హెడ్డింగులు విను అని విస్మయంగా చెప్పాడు:
Introduction
The last cigarette
The Death of my father
The story of my marriage
Wife and mistress
A business partnership
Pshchoanalysis
కాశీ మరో చిన్న పెగ్గు పుచ్చుకున్నాడు. నేను చాలు అని వదిలేసాను. ఉన్నట్టుండి తనేమీ పూర్తిగా మారిపోయాడని నేను అనుకోవద్దని కాస్త మార్దవంగా, చిన్నగా హెచ్చరిక జారీ చేసే ధోరణిలో, కళ్ళతో మాట్లాడాడు కాశీ. ఒక చిన్న ఉదాహరణ చూడు అని చెప్పాడు. ఆరు నెలల క్రితం జరిగిందట ఇది:
YWCA విడిదిలో బస చేసి, క్రైస్తవమత సంస్థ నియంత్రణలో నిర్వహించబడే ఒక విమెన్స్ కాలేజీలో పనిచేస్తున్న ఒక ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, కాశీకి ఒక మిత్రుని ద్వారా ఒకట్రెండు సంధర్భాల్లో పరిచయం అయ్యింది. చాలా అందమైన యువతి అంట. దురదృష్టం – ఒక పసిబిడ్డతో ఆమె విధవయ్యి ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు. తనను పెళ్ళి చేసుకునేందుకు సమ్మతం కావాలని విడిది చిరునామాకి ఆమెకు ఉత్తరం రాసి అడిగాడు. నాలుగు ఉత్తరాలు. అందులో చివరి రెండు ఉత్తరాలు రిజిస్టర్డ్ పోస్టు. నాలుగూ వార్డెన్ చేతితో చింపబడ్డాయి. ఆ స్నేహితుడు, కాశీని వీధిలో అడ్డగించి ఇంగ్లిషులోని పచ్చి బూతులతో ఉతికారేశాడు; ఆ అమ్మాయి అన్నగారి ముందు ఇరికిస్తానని బెదిరించాడు. పైగా ఆ అమ్మాయి మూడు రోజులుగా ఏడుస్తుందని చెప్పేసి వెళ్ళాడు. ఒక నెల తర్వాత కాలేజీ ప్రాంగణంలో ఆమె కాళ్ళపై పడడం ఒకటే తక్కువా అన్నంతగా క్షమాపణ అడిగి వచ్చాడట – క్షమాపణ అడిగేందుకు వెళ్ళి ఆ రకంగా ఆ అమ్మాయిని భయపెట్టి వచ్చేశాడట! అయినాసరే ఇప్పటికీ ఆ అమ్మాయి జ్ఞాపకాలు తన శరీర రక్త ప్రవాహంలో ఒక నీటి బుడగలా ప్రవహిస్తూ ఉండడం కావ్యశోకం అన్నాడు.
నిముషంలో కావ్యశోకాన్ని అలుముకునే కాశీ మానసికస్థితి మరింతగా – మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఇంకా ఏమాత్రం మారలేదని అనుకున్నాను. వాడి దగ్గర ఈ రొమాంటిక్ చూపు నాకు ఒక వ్యాధి లక్షణంలానే అనిపిస్తుంది. అయితే, మరెన్నో మిగిలిన విషయాల్లో నయమవ్వడం మాటల మధ్యన తెలిసింది. ‘ఆశ పట్టాను పొందాక కూడా ఒక గుంత మిగిలి అందులో పసుపునీళ్ళ స్నానం కూడా ఒక శోకం, దానిని అనుభవిస్తే తెలుస్తుంది ఆశ గుణం ఏమిటని’ – వెనుకకు వెళ్ళేటప్పుడు ఎందుకో ఇలా అన్నాడు.
ఈ మధ్య తిరుపతికి వెళ్ళి వచ్చాడట. తోడుకి జాలీగా ఉండేందుకు ఒక మిత్రుడితో వెళ్ళినవాడు ‘కంపెనీ సేక్’ కి గానూ తను కూడా గుండు కొట్టించుకున్నాడట. కంపెనీ సేక్ కోసం మిగిలిన గుళ్ళకు అటు నుంచి అటు వెళ్ళి వచ్చి, తిరువణ్ణామలై వచ్చినప్పుడు రామ్ సూరత్ కుమార్ అని ఒక యోగిని కలిశానని చెప్పాడు. ‘నువ్వు తలుపు తట్టే విధానం సహించే విధంగా లేదు’ అన్నదానినే కోపం తగ్గాక కూడా తనదైన ఏకైక ఆశీర్వచనంగా ఆయన ఇచ్చి పంపినట్లుగానూ, అందులో పరిపూర్ణ అర్థమున్నట్లుగానూ చెప్పాడు.
నేను మరొక సిగరెట్ వెలిగించాను. వాళ్ళ నాన్న గురించి అడిగాను. ‘నో ప్రోబ్లం’ అన్నాడు. తరుచూ ‘నో ప్రోబ్లం’ అన్నమాటనే, అన్నిటికీ సమాధానమిస్తున్నట్లు గమనిస్తూ వచ్చాను. అడిగాను, అందుకు నవ్వుతూ ‘నో ప్రాబ్లెం’ అన్నాడు. నాకు ఆ సమాధానం జుగప్సగానూ, చిరాకుగాను అనిపించింది. కార్యాలను కార్యాల కోసం మాత్రమే చెయ్యడంలో ఒక స్వేచ్ఛానుభూతి, హడావిడి లేని అమితాసక్తి దాగివుండటాన్ని కనుగొనడం వలన, ఏ కార్యమైనా తనకు మహదానందాన్నిస్తుందని అన్నాడు. నేను ఒక నిముషం ఏమి మాట్లాడలేదు. చెప్పేటప్పుడు వాడికి నాలుక లాఘవం కాస్త కోల్పోయి, మాటలు తలెత్తడంలో శ్రమపడటాన్ని గమనించాను. నా నలుగురు చెళ్ళెళ్ళను కడ తేర్చడంలో ఎదురైన కష్ట అనుభవాలు నాలో ఒకే తలంపుగా, ఒక మెరుపు తునకలా రూపు దాల్చి చెళ్ళుమని తాకింది – ఈగను తరిమే బల్లిలా అది వేగంగా పరిగెత్తడం వలన, బల్లి తోక తెగిపడి తలపులలో అడ్డంగా వచ్చి పడింది. ‘ఏంటీ ఆలోచిస్తున్నావు?’ అన్నాడు. ‘నో ప్రాబ్లెం’ అన్నాను. నవ్వుతూనే తటాలున గట్టిగా వాడు వంద దోమలవత్తులు ఇచ్చి, రెండు రెండుగా అంటుకుని వున్నవాటిని, ఒక్కొక్కటిగా, విడివిడిగా విడదియ్యమంటే నేను నిదానంగా చెయ్యగలనా అని అడిగాడు. మరుసటి నిముషం కూడా నేను మౌనం వహించాను. ముఖం తాకి ‘ఏంటీ?’ అన్నాడు. కూలీ ఎంత అన్నాను. లేచి నా ఎదురుగా తల బాదుకుని నవ్వాడు. ఆగలేదు. బయట చీకటి అలుముకుంది. ఏసీ లోనూ కాశీకీ ముచ్చెమటలు పట్టాయి.
వయసైన ముసలి బిచ్చగాళ్ళను వీధిలో చూస్తే, మనసు లోతుల్లో వాళ్ళను తన నాన్నతో ఒక కోణంలో పోల్చుకుని అపరాధభావం – తనపై తనకే జాలి – నిస్శహాయత – భయం అన్నీ ఒకటి కూడి తక్షణ కరుణగా పనిచేసిన రోజులల్లా ఇప్పుడు లేవు. వాళ్ళను వాళ్ళగానే చూసి, వాళ్ళకై చూడగలుగుతున్నానని, వారి వంటి ఇంకా అనేకమంది స్థితిని మార్చేందుకు సమాజంలో కార్యదీక్షకు కొన్ని మంచి మనసుల మధ్య తను మసులుతున్నట్టు చెప్పాడు. ‘మనసు’ గా దానిని కుదించి చెప్పడాన్ని వాళ్ళే ఒప్పుకోనప్పటికీ, తన మనసులో పడింది ఇంతేనని నాకు అర్థంకానట్టు ఏదో చెప్పుకుంటూ పోయాడు. పైగా నా కనుబొమ్మలు బరువెత్తి పెట్టినట్టు అనుభూతి చెందాను. బయటకు వెళితే బాగుంటుందని అనిపించింది. కాశీ మరో సిగరెట్టును, కొత్త ప్యాకెట్టులో నుండి చింపి బయటకు తీశాడు.
అయినాసరే, తనని పెళ్ళి ఆశ ఇంకా హింస పెడుతుందని తటాలున అన్నాడు. ఒంటరితనం, బట్టలు ఉతకడం, హోటల్ వీటిని పెళ్ళికి చెందిన గోనె సంచుల్లో ఒకటిగా పెట్టి ఆలోచించడంలో తప్పుందా అని నాతో ఒక చిన్నపిల్లాడిలా అడిగాడు. పిచ్చోడు! కురిసిన వాన వెలిసిన కొన్ని సాయంకాల వేళలుగా, కొన్ని రోజులు తరగడం నుండి, తన జీవితానికి పోషణను సేకరిస్తున్నట్టు చెప్పాడు. కొన్నిసార్లు జాతీయ రహదారుల్లో ఎక్కువ దూరం కూర్చుని వెళ్ళేటప్పుడు, బస్సులో రీతిని పెంచే విధంగా నడిపే వేగం సంగీత దారం కలిసేటప్పుడు జీవితాన్ని ఒక బహుమతిగా అనుభూతి చెందుతున్నట్లు చెప్పాడు. నాకూ వినేందుకు ఉత్సాహం ఉరకలేసింది. మాటలు ఆపి ఫ్రైడ్ రైస్ తిందామా అని ఆసక్తిగా అడిగాను. నాకు వాడు అడిగిన విధానం ఎంతగానో నచ్చింది, నాకు ఫ్రైడ్ రైస్ నచ్చకున్నాసరే. తను ఎంత నెమ్మదించినా, కొన్నిసార్లు అన్నీ తన్నుకొచ్చేస్తాయి. సింగల్ రూములో అర్దరాత్రి మౌనంలో తనకు నచ్చిన కవిని చదువుతున్నపుడు, గుమ్మంలో మంచం నుండి నాన్న తనకు చెందిన ఏదో ధ్వని కలిపి గట్టిగా ఆవలింత పెడితే తట్టుకోలేకపోయాను; లేచి వెళ్ళి ఆ నోటికి అడ్డం పెట్టి నొక్కాలి అనిపిస్తున్నట్లు వుంది. ఒక ఆవలింత ఆ విధంగా వస్తే చాలు, ఆ అర్దరాత్రి అంతా తనకు వృధా అని చెప్పి అలసిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత కూడా తాను జీవితాన్ని కొనసాగించవచ్చు అనేందుకు గల నమ్మకం క్రమక్రమంగా ఇనుమడించింది అన్నాడు. స్వతహాగానే ‘సెల్ఫ్‌లెస్’ ను వదిలేసిన నలుగురైదుగురు మిత్రులు, అక్షరం, చదువు ఇవన్నీ మాత్రమే ఇందుకు ప్రాథమిక కారణం అన్నాడు. ఏంటీ ఇంకా అదేపనిగా చదువుతునే వున్నావు కదు? అని అడిగేసి చివరి ‘సిప్’ ను ముగించాడు. సిగరెట్టును పెట్టుకున్నాడు.
చటుక్కన తను ఈ మధ్యకాలంలో కన్న కలలను గురించి మాటను మళ్ళించాడు. అందమైన గాజు గిన్నెలో మెదలిన మిరపకాయ నీటిని సిల్వర్ గరిటెతో తిప్పుతూ మాట్లాడాడు. మునుపటిలా కలలు వచ్చినా, నో ప్రాబ్లెం అన్నాడు. రమణమహర్షి చిద్విలాస ముఖం ఒకసారి మెదిలింది అన్నాడు. ఒకసారి కలలో కాలి బొటనవేలుని పాము కరిచి రక్తం వచ్చిందట. పాడెమీదకు ఎక్కించి ఒక కలలో తనని చూసుకున్నాడట. తీవ్రవాదిలా పోలీస్ వాళ్ళతో వెంబడించబడి ఒక కలలో పరుగులు తీశాడట. ఒకరోజు పొడవైన గోడను దాటి, కొండలు దాటి, నింగిలో ఎగురుతున్నట్టు, మహదానందంగా చిలికి చిలికి రెక్కలు విదుల్చుతూ ఉన్నాడట. ఈ ఒక్క కల మాత్రం మళ్ళీ రాదా అని వాంఛగా ఎదురుచూస్తున్నట్లు చెప్పినవాడు కాస్తా, పదే పదే వచ్చే చిరాకు తెప్పించే ఒక కల అని, పరీక్షకు చదవకుండానే వెళ్ళి వచ్చి హాలులో తడబడటాన్ని చెప్పాడు.
కలలను నాలుగు రోజులకు గమనించి, తెల్లవారగానే ఒక క్వయర్ రూల్డ్ నోటులో రాయడం మొదలుపెడితే, ఐదవరోజు రాదని అన్నాడు. అదేపనిగా గమనిస్తుంటే కల వెన్ను చూపించి పారిపోతుంది అన్నాడు. అదీ మీరి, నిశ్చయంగా కల రాదా అంటే పెనుజీవితంలో అనేక పొడుపుకథల్లా దీనికీ నిశ్చయంగా చెప్పలేం కదా అని అడిగాడు.
కత్తి, కటారులు, ఫోర్క్ అలంకారాలతో పొగలు కక్కుతూ మేజా మీదకి వచ్చి చేరాయి ఫ్రైడ్ రైస్ ప్లేటులు. నాకు తెలిసి నా వాటాలో సగం కంటే ఎక్కువగా కాశీనే తినాల్సి వస్తుందేమో.
***
రచయిత గురించి:
‘పాదచారి’ అనే కలం పేరుతో రాసే విశ్వనాథన్ తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందినవారు. స్వతహాగా కవి అయిన ఆయన కైజర్ అనే పేరుతో వచనాలు కూడా రాస్తుంటారు. ఇంతవరకు ఆయన కవిత్వం, వ్యాసాలు అన్నీ కలిపి దాదాపు పదిహేను పుస్తకాలు రాసారు. తన జీవితకాలంలో రెండంటే రెండే కథలు రాసిన ఆయన ‘కాశీ’ కథకు వందేళ్ళ తమిళ కథల్లో విశిష్ట స్థానముంది.
