ఎండపట్టున వెళ్ళి

Spread the love

మారియమ్మ తల్లి ఆమెను చూడగానే కాస్త ఉలిక్కిపడింది. ఓ పక్క గూరెండ వడగాలుపులతో పొడిచేస్తుంటే, ఈ గాడిదెందుకు ఆయాసంతో ఇలా లగెత్తుకొచ్చిందో అర్ధం కాలేదు.

“ఏంటే అల్లుడుగోరు రాలేదా” అని అడిగినందుకు ‘కాసేపు ఉంటావా’ అని  చెయ్యడ్డంచూపించి సర్రున లోపలికెళ్ళి, రెండు చెంబుల మంచి నీళ్ళు గడగడా తాగి ‘ష్… యమ్మా’ అని వచ్చి కూర్చుంది.

“హా..ఇప్పుడు సెప్పు…”

“ఏందే? అల్లుడుగోరు నీతోపాటు రాలేదా?”

“ఆయన..పొద్దుగూకాక, రేత్రి పొయ్యిమీద ఎసరెట్టే ఏళకి వత్తాడట. ఈ ఏళకే బయలుదేరితే ఆయన యాపారం సెడుతుందట” అని అంది.

“సరే… అయితే నువు కూడా ఎండ కాత్త సల్లబడి పొద్దుగూకినాక వచ్చుంటే సరిపోయేదిగా. ఎండ ఓ పక్క దంచేస్తుంటే, ఏదో కొంపలంటుకున్నట్టు ఈ ఎండపొద్దున కాళ్ళిడ్చుకుని ఇంతలా ఆయాసంతో లగెత్తుకురాపోతే ఏమయుద్ది సెప్పు” అంది మారియమ్మ తల్లి.

“అది సరేగానీ… అవును ఇంతకీ, ఈ పెద్దల పండగకి బావ వచ్చేడట గదా…” అంది మారియమ్మ.

అమ్మకి అసలు విషయం ఇప్పుడు అర్ధమయ్యింది.

ఆమె బావ – అమ్మ తమ్ముడి ఒక్కగానొక్క కొడుకు ‘తంగరాసు’. పెద్దల పండగకి, కాళియమ్మ గుడి సంబరాలు చూసేందుకు టౌన్ నుండి వచ్చాడు. అది తెలిసే ఈ గాడిద ఇలా కంగారు కంగారుగా కాళ్ళిడ్చుకుని లగెత్తుకొచ్చింది.

“మద్దాహ్నం ఇంట్లో గంజితాగి వచ్చావా” అనేసరికి ఆ గాడిద ‘లేదు’ అనేసరికి తల్లి కూసింత గంజి పోసి తాగమని చేతికిచ్చింది.

ఒళ్ళంతా బక్కగా, డొక్కెండుపోయి, ముక్కులోకి, మూతిలోకి ఏవి లేకుండా, మెడంతా బోసిపోయి, నల్లబడ్డ శరీరంతో ఆమెను చూసేసరికి మారియమ్మ తల్లి కంట్లో కడవల కొద్దీ నీళ్ళు ముంచెత్తాయి. చిన్నప్పటినుండి తంగరాసుకే, మారియమ్మనిచ్చి కట్టబెడతారని ఊరే కోడై కూసేది. దొంగా-పోలీసు ఆట ఆడటం నుండి, అడివిలో నాగజేముడు పళ్ళు కోసుకునేంతవరకు ఇట్టాఇద్దరూ అన్నిట్లో సెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అయితే చివరాఖరికి ఆమె బతుకు ఇలా అయ్యిందే అని అమ్మ లోలోపల ఎంతగానో కుమిలిపోయింది. కూతుర్ని ఎలాగెలాగో చూడాలని, ఎన్నెన్నో కలలు కనింది.

మధ్యలో మాట మారుస్తూ “అవును ఇంతకీ అన్నయ్యగాడేడి?” అని అడిగింది.

“మీ మొగుడుపెళ్ళాలిద్దరూ కలిసొత్తారూ, ఇయ్యాలా వరన్నంతో వండి వార్సాలని, బియ్యం, ఉప్పులుపప్పులు కొని తేడానికని టౌను వరకు ఎళ్ళాడు” అంది అమ్మ.

మారియమ్మ కాస్త గంజినీళ్ళు తాగేసి సీనియమ్మను కలిసేందుకు బయలుదేరింది. సీనియమ్మే, మారియమ్మకు తన తంగరాసు బావ ఊర్లోకొచ్చిన సంగతి టౌనుకు అగ్గిపెట్టెలు అంటించేందుకు వచ్చిన అమ్మాయిల ద్వారా చేరవేసింది. ఆ వార్త విన్న దగ్గర నుంచి ఆమె మనసు మనసులో లేదు. వెంటనే ఊరుకు వెళ్ళాలని ఒంటి కాలి మీద నిలబడింది. అయితే భర్త ఆమె అడగ్గానే పంపలేదు. రేపు సంకురాత్రి పండగ పెట్టుకుని ఈరోజు ఎందుకు ఇంత గాబరా అనేశాడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు ఆమె అస్తమాను ఊరికి వెళ్ళడం అతడికి ఎంతమాత్రము ఇష్టం లేదు. ఆమె ఊరు ఏదో పక్కన మూడుమైళ్ళు దూరాన వున్నంత మాత్రాన చీటికీ మాటికీ ఊరంటే ఎట్టా? సమస్య ఆమె వెళ్ళడం కాదు. వెళ్ళిన ప్రతిసారి దుకాణంలో నుండి పప్పు, బెల్లం అదీ ఇదని ఏదో ఒకటి చుడాయించుకుని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంత చిన్న ఊరిలో యాపారం జరగడమే తలకుమించిన భారం. పైగా ఇప్పుడు గుడి సంబరాలకు వెళ్ళాలని ఒంటి కాలిపై నిలబడిందని అతడికి కడుపు మండింది. అలాగని ఒకేసారి మూతి మాడ్చుకుని కూర్చోలేడు. ఏదో అలా ఇలా కాస్త నసిగి, ఆ తర్వాత పంపిస్తాడు.

మారియమ్మకు ఈ విషయాలేం అంతగా పట్టవు. ఆమె అనుకున్నదే తడవుగా ఊరుకెళ్ళాలి. పైగా తన బావ ఊరొస్తే కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు వెళ్ళకుండా, ఇంకా ఇంటిపట్టునే ఉండటమెలా సాధ్యమవుతుంది తనకి?

ఆమె పుట్టి, ఈడుకొచ్చిందే తంగరాసు బావ కోసం అన్నటు పెరిగింది. ఆమె నాలుగో తరగతి చదివే రోజుల్లోనే ‘తంగరాసు’ వాళ్ళయ్యకు పని బదిలీ కావడంతో, కుటుంబంతో పాటు పుదుకోట్టైకు వలస వెళుతుంటే, ఆమె అరిచిగీపెట్టి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సంగతి ఇప్పటికీ ఊరిలో ముసలమ్మలు కథలు కథలుగా చెప్పుకుని నవ్వుకుంటారు. ‘నేనూ మీతో వత్తా’ అని  వీధిలెమ్మట పడి దొర్లి, కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుని, గింజుకుని ఒకే గోలగోల. అది దెప్పి పొడిచేలా ఈడొచ్చిన ఊరి అమ్మాయిలు ఆమెతో “ఏంటే పిల్లా? ఇంతకీ నీ మొగుడు ఎప్పుడొత్తాడేటి ఊరి నుండి” అని పరాచీకాలాడేవారు. అయితే ఆమె అవేవి ఎగతాళిగా తీసుకునేది కాదు. నిజంగానే అంటున్నారేమో అని నమ్మేది. ఊరు అమ్మాయిలందరూ కాలువ గట్లెమ్మట ఎగిరిగెంతుతుంటే, ఈమె మాత్రం ఆ కాలువ పక్కకు కూడా వెళ్ళేది కాదు. ఊరికే అస్తమాను నీట్లో గెంతితే, చర్మం దురద పట్టి, బొరుసు కట్టేస్తుంది. టౌనులో చదివే తన బావకు అలా ఉంటే గిట్టదు. అదేలా గంజి తాగి  డొక్కెండుపోతే బావ ‘నిన్ను పెళ్ళి సేసుకోను పో’ అంటే రేపు తన పరిస్థితేంగాను? మాటకి మాట బావ అని పలవరించే మారియమ్మ, పెద్దమనిషి అవ్వగానే బావను తలుచుకుంటేనే ఒకే సిగ్గు, బిడియం ముంచుకొచ్చి తెగ మెలికలు తిరిగేది. కొద్ది రోజులుగా బావ జ్ఞాపకాలు, ఆపై కలలు ఇలా ఆమె గుండె వేగంగా కొట్టుకునేది. టౌనుకు అగ్గి పెట్టెలు అంటించేందుకు వస్తూపోతున్నప్పుడు, వాటిని అంటించేటప్పుడు ఇలా ఎల్లప్పుడూ బావ ఆలోచనలే మనసులో మెదిలేవి. కరువుతో వాళ్ళయ్యకు విరోచనాలు వచ్చి సచ్చిపోకుండా ఉండివుంటే గనుక, బావతో పాటు సరిసమానంగా ఆమె కూడా చదువుకుని ఉండేది. ఆ ఒక్క లోటు మాత్రం ఆమె మనసును ఎప్పుడూ వెంటాడేది. బావ చెల్లెలు అయినటువంటి గోమతి పెళ్ళికి శుభలేఖ ఇద్దామని వచ్చినప్పుడు ఆ కాస్తంత లోటుపాటు కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఎటువంటి తారతమ్యాలు చూడకుండా అమ్మను, అన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించిన బావను తలుపు సందులో నుంచి చూసి, మారియమ్మ మేని పులకరించింది.

బావకు సంబంధించిన ప్రతి చిన్నవిషయాన్ని ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చేర్చి, మనసున పదిలంగా తాళం వేసుకునేది. ఏళ్ళు గడిచినా, కరువు కాటకాలొచ్చినా, అయ్య చచ్చి, రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో కూడా బావ గురించిన ఆమె ఆలోచనల్లో మాత్రం ఎటువంటి మార్పురాలేదు. అందువలనే, తంగరాసు బావ తనకు దక్కనప్పటికీ, ఆమె తన అమ్మా, అన్నయ్యల్లా, పూర్తిగా అతన్ని దూరం పెట్టలేకపోయింది.

ఆమెకింకా బాగా గుర్తుంది. అత్తమావయ్యలకు ఊరువైపుకు గాలి మళ్ళడానికి కారణం తంగరాసు బావ పెళ్ళికి పిల్లను చూడడం కోసమే. ఇంకో చోట్లో వేరొక పిల్లను చూసేసి వచ్చినోళ్ళళ్ళా వచ్చినట్టు ఉండకుండా, అన్నయ్యతో “పెళ్ళికి ఒక వారం ముందుగానే వచ్చేయ్ అబ్బాయ్. గోమతి పెళ్ళి పనులు నువ్వే దగ్గరుండి చూసుకున్నట్టు, ఈ పెళ్ళికి కూడా నువ్వే పెద్దరికంతో ముందుండి, పనులన్నీ సక్కబెట్టాలి అబ్బాయ్” అని చెప్పేసి మరీ వెళ్ళాడు మావయ్య. వాళ్ళిలా వెళ్ళగానే అన్నయ్య, అమ్మ మీద శివాలెత్తి చిందులేశాడు.

“నన్ను వెఱ్రి బాగులెధవ అనుకున్నారా ఏటి? ‘గోమతి పెళ్ళిలో పనులన్నీ మీదేసుకుని మరీ సేశాను అంటే, రేపు మనింటి పిల్ల కాలెట్టబోయే మెట్టినిల్లు, మనం సెయ్యకపోతే ఇంకెవరు సేస్తారు అని చేసింది. అయితే కేవలం నగానట్రాకి, కట్నకానుకలకి ఆశపడి, మరీ ఇంత అన్నాయం సేత్తాడని ఎవలనుకుంటారేటి? ఏం మేనమావమో? బావో? ఏందో ఈళ్ళ కథ?’ అని చిర్రెత్తుకొచ్చి పెడసరంగా మాట్లాడాడు. అయితే అన్నయ్య ఇంతగా చిందులేస్తుంటే, అమ్మ అందుకు కేకలు మాత్రమే వేసింది.

“ఏట్రా! ఊరుక ఓ తెగ ఎగిరెగిరి పడతున్నావ్? ఏవన్నా మతుండే మాట్లాడుతున్నావా? ఏరా సదివి ఉద్దోగం సేసేటోడు, అగ్గిపెట్టె యాఫీసుకు పోయి, వొళ్ళంతా ఆ మందు కంపుకొట్టుకుంటా తిరిగే ఈ గాడిదను కట్టుకుంటాడని నువ్వెట్టా అనుకుంటావు. నువ్వు అనుకున్నంత మాత్రాన ఆళ్ళు ఎందుకు సేత్తారు” అని ఆవేశంగా మాట్లాడింది. అప్పటికప్పుడు అలా మాట్లాడిందే కానీ, ఆ రోజు రేత్రి సచ్చిపోయిన అయ్య పటానికి మొక్కుకుని ఏడ్చి నెత్తీనోరు బాదుకుంది. ‘ఏమయ్యో! నా దైవమా! నా తండ్రీ! నన్నిట్టా నట్టేట్లో వదిలేసి, ఒంటరిని సేసిపోయినావు గదయ్యా… పెళ్ళి పీటల మీదకెక్కి, మేనల్లుడు నేనుండంగా, దాని మేడలో తాళి కట్టే మొగోడు ఎవడూ అని నన్ను ఆ రోజు ఆ సెర నుండి తప్పించి తీసుకొచ్చినోడివి… ఈ రోజు నన్నిట్టా ఒంటరిని చేసి ఒగ్గేసి పోయేన్దుకా నన్నా సెర నుండి యిడిపింసినావు. నా సామి! ఓ తమ్ముడు..తమ్ముడూ అని ఓ తెగ ఎత్తుకు తిరిగాను…ఆడ్ని ఈ సేతులతో ఎత్తుకు పెంసినా గదయ్యా.. నా సామి.. ఈ రోజు నాకంటూ ఈ భూమ్మీద ఎవరూ లేకుండా పోయారే!” అంది మారియమ్మ తల్లి.

సుట్టుపక్క అమ్మలక్కందరు నలుగురు నాలుగు సీవాట్లు పెట్టారు, “ఏం, ఈమె ఆడది అయినంత మాత్రాన… ఇట్టానే ఏడుపులు, పెడబొబ్బలు పెడుతుందా” అని.

కాసేపోయినాక అన్నయ్య గాడొచ్చి, “కాసేపు నోరు మూత్తావా లేదా?” అని అరిసేసరికి ఏడుపాపింది.

మరుసటిరోజు అన్నయ్యగాడు, “ఈ పెళ్ళికి ఏ ఒక్కరూ పోకూడదు” అనగానే ఎదురు మాటాడక అమ్మ కూడా అట్టానే అంది.

‘ఆడి కుటుంబానికీ, మనకీ ఇయ్యాల నుంచి ఎటువంటి సంబంధం లేదు?’ అంది అమ్మ. అయితే మారియమ్మకు మాత్రం అలా వదిలేసుకోబుద్దికాలేదు. అనేక మార్లు అన్నయ్యతోనూ, అమ్మతోనూ నచ్చజెప్పి చూసింది. వాళ్ళలో ఎటువంటి చలనం లేకపోవడంతో,

“మీరెవరూ బావ పెళ్ళికి పోకుంటే, నేను ఈడే ఉరిపోసుకు సత్తాను’ అని గట్టిగా బెదిరించేసరికి, మరొక దారి లేక అన్నయోక్కడే పెళ్ళికెళ్ళి వచ్చాడు. ఎంత అడిగి చూసినప్పటికీ అమ్మతోనూ, మారియమ్మతోనో పెళ్ళి గురించి ఊసెత్తలేదు. ‘అన్నీ బాగానే జరిగాయి’ అని సరిపెట్టుకున్నాడు.

తనకెంతో ఇష్టమైన బావ పెళ్ళి ఎలాగెలాగో అయ్యుంటుంది అని మారియమ్మ రోజూ అనేకమార్లు అగ్గిపెట్టెలు అతికించుకుంటూ కలవరించేది.

‘ఏడ ఉంటే ఏంటీలే? నిండు నూరేళ్ళు సల్లంగా ఉంటే సాలు’ అని కంటి నిండుగా, మనస్పూర్తిగా వేడుకునేది. తంగరాసు పెళ్ళికి వెళ్ళివచ్చిన అన్నయ్య ఊరికే ఉండలేదు. నాలుగూళ్ళు తిరిగి, ఆ తరువాతి ముహుర్తంలోనే మారియమ్మకు పెళ్ళి చేసేందుకు మావిల్‌పట్టిలోనే నాన్న తరుపు బంధువుల కుర్రాడితో పెళ్ళి సంబంధం కుదిర్చాడు. కుర్రోడు బాల్యంలోనే నాగలాపురంలోని ఒక కోమటి దుకాణంలో జీతానికి పని చేసి, మద్రాసుకు బ్రతుకుతెరువుకు వెళ్ళి వచ్చినోడు. మారియమ్మ పెళ్ళికి చేర్చిన నాలుగు తులాల నగానట్రా అమ్మి, మావిల్‌పట్టిలోనే అతనితో సొంతంగా ఒక దుకాణం పెట్టించాడు.

ఇంత రభస జరిగాక కూడా, గుడి సంబరాలకు బావ వచ్చాడని తెలియగానే వెంటనే చూడాలని ఉరకలు పరుగులతో  కాళ్ళిడ్చుకుని ఆడికి వచ్చేసింది. ఆయన ఎట్టా ఉండాడు? ఆ యక్క ఎట్టా ఉండాది? బావా, ఆ యక్కా అనోన్యంగా ఉండారా అని చూస్తే చాలు ఆమెకు.

అయితే, వచ్చీ రాగానే బావను, ఆ అక్కను చూసేందుకు పోలేదు. మధ్యాహ్నం వేళ, కాస్త ఎంగిలి పడి, కాస్త కళ్ళు జోగుతూ ఉన్నాయని ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రంగా అక్కడకు వెళ్ళింది.

మంచం మీద పడుకుని పాట్టయ్యతో బావ ఊసులాడుతున్నాడు.

“నమస్కారం బావ” అని గలగలా మాట్లాడుతూ మారియమ్మ లోపలికెళ్ళింది. తంగరాసు అమ్మ, ఆ అక్క వంటగదిలో ఏదో పనిలో ఉన్నారు. పొన్నాత్త ఆమెను ఆప్యాయంగా పలకరించింది. ఆ అక్క చూసేందుకు మాహలక్ష్మిలా లక్షణంగా ఉంది.  వొంటి మీదకి నగానట్రా ఏవో బాగా వేసుంటారు అనుకుంటే అటువంటివి ఏవి లేవు. ఒకవేళ పక్కన విప్పి పెట్టేసిందేమో అనుకుంది. ఎంతో ఆప్యాయత నిండిన చూపుతో ఆ అక్కతో ఎంతో ఇష్టంగా మాట్లాడింది మారియమ్మ.

‘మాట్లాడుతుండండి, కాసేపట్లో వచ్చేస్తాను’ అని  పొన్నాత్త కొట్టుకు ఏదో కొనేందుకు వెళ్ళేసరికి మారియమ్మ ఆ అక్కతో మరింత దగ్గరకెళ్ళి కూర్చుని చేతులను ప్రేమగా ఒడిసిపట్టుకుంది. రహస్యంగా, అదే సమయం ఎంతో ఆప్యాయత నిండిన గొంతుతో “అక్కా.. ఇంతకీ మీరు నీళ్ళోసుకున్నారా?” అని ఆసక్తిగా అడిగింది.

టక్కున ఆ అక్క దీర్గంగా, “ఆ…అవును ఈ బతుక్కీ ఇప్పుడు అదొక్కటే తక్కువ” అంది.

అది విని మారియమ్మ తట్టుకోలేకపోయింది. ఆ ముక్క ఆమె చిన్నగా నవ్వుతూ చెప్పినప్పటికీ, ఆ మాటల్లోని చికాకు, సెగను ఆమె తట్టుకోలేనిదిగానూ, ఇంతవరకు ఆమె కనీవినీ ఎరుగనదిగానూ ఉంది. అంట్లు తోమే వంకతో, ఇంటి దొడ్డిగుమ్మం వైపుకెళ్ళి ముక్కలైన మనసును కాస్త అదుపు చేసుకుంది. గదిలో బావ మాటలు వినిపించాయి.

“అవును, మారియమ్మ వెళ్ళిపోయిందా” అని లోపలికి వచ్చిన బావ ఆ అక్కతో అని, మళ్ళీ

“కాఫీ తాగావా జాను” అని ప్రేమగా అడిగేసరికి టక్కున ఆ అక్క,

“అబ్బో ఎంత శ్రద్ధో, చూసీ మరీ బొక్కబోర్లా పడమాకండి” అని అంది.

“ఎంతో నెమ్మదిగా మాట్లాడినప్పటికీ, ఆ గొంతు కఠినత్వం, చిరాకుతో నిప్పులు చెరుగుతోంది.

బయట నిలబడున్న మారియమ్మకు తలనొప్పిగానూ, జ్వరం వేస్తున్నట్టు గుండెలు అదిరాయి. కడిగిన వంట సామాన్లను, అక్కడికక్కడే వదిలేసి దొడ్డిగుమ్మం వైపు నుండి గడగడమని నడుచుకుంటూ ఇంటికొచ్చి పడుకుంది.

అమ్మ, అన్నయ్య అడిగితే ‘తలనొప్ప’ గా ఉంది అంది. బాల్యంలో నాగజేముడు పళ్ళు కోసేందుకు వెళ్ళి పొద్దుపుచ్చి తిరిగి వచ్చే దారిలో వెదుక్కుంటూ వచ్చిన మావయ్యకు అడ్డంగా దొరికిపోయిన తంగరాసు బావ అమాయక ముఖం ఆలోచనల్లో మెదిలి ఆమెను మరింతగా కలవరపెట్టింది. నీళ్ళు తాగినా సరే, ఎంతోసేపుగా గుండె మంట పెడుతున్నట్టు అనిపించింది. ఆ అక్క ఇంట్లో నగానట్రా తక్కువగా వేశారని తంగరాసు అమ్మ హింస పెడుతుందట అని సీనియమ్మ అన్నమాట, ఆ అక్క చిరాకుగా మాట్లాడటం పదే పదే గుర్తుకు వచ్చి ఆమె మనసు చిత్రహింసకు లోనయ్యింది.

అన్నిటికి మించి, ఆ లోతైన మాటల్లోని చిరాకు, తట్టుకోలేని వేదనను కలిగించింది. రాత్రి ఊరితో పాటు గుడి దగ్గర పొంగలి పెట్టేందుకు వెళ్ళకుండా ఆమె మాత్రం ఇంటిపట్టున అలా పడుకునేవుంది. బాల్యంలో అతనితో ఏళ్ళ తరబడి కలిసిగడిపిన జ్ఞాపకాలు…అయ్య గురించి, అమ్మ గురించి, అన్న గురించి అందరూ పడుతున్న ఇక్కట్ల గురించి, ఆఖరికి ఆ అక్క గురించి అని ఇలా అందరి గురించి తలుచుకునేందుకే ఎంతగానో బాధవేసింది. ఆ జ్ఞాపకాల దొంతర ఆమె మనసులో మెదిలి ఒక్కసారిగా ఏడుపు ముంచుకువచ్చింది.

రాత్రి అయ్యేసరికి ఆమె భర్త ఇంటికొచ్చాడు. రెండు రోజులుగా యాపారం బాగుంది అని, ఈ రోజు కొబ్బరికాయలే ముప్పై రెండుకు పైగా అమ్ముడయ్యాయని, చనగ పప్పు ఖాళీ అయ్యిపోవడంతో అందరికి లేదని చెప్పాల్సివచ్చిందని ఎంతోసేపటి నుండి ఉత్సాహంగా ఆమెతో చెబుతూవచ్చాడు. ఆమె ఒక్క ముక్క కూడా మారుమాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి, తిక్కరేగి “ఏంటే గాడిదా! ఇందాకట్నుండి నేను గొంతు చించుకుని అరుస్తూ ఉన్నాను. నువ్వేమో బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నావు” అని జుత్తు పట్టుకుని ఒక్క కుదుపు కుదిపాడు.

ఒక్కసారిగా మారియమ్మ గట్టు తెగిన ఏరులా గుక్కపెట్టి ఏడ్వసాగింది. అతను బెదిరిపోయి, అరేయ్, ఏదో తెలియక జుత్తు పట్టుకున్నాను, తప్పై పోయింది అని పదే పదే చెప్పి చూశాడు. అయినా ఆమె ఏడుపు ఆగలేదు. ఇంకా మరింతగా గుక్కపెట్టి, మనసు ముక్కలై, శరీరం వణికిపోతుంటే ఆమె కళ్ళ వెంబడి ఏడుపు తన్నుకువచ్చింది.

తను అన్నమాటలకే ఆమె అంతగా ఏడుస్తోందనుకుని కంగారుపడి, అతడు ఎంతోసేపటి నుండి ఆమెను అనవసరంగా ఓదారుస్తున్నాడు.

S Tamilselvan

1954లో తూత్తుకుడి జిల్లాలోని, నాగలపురంలో రచయిత S. తమిళ్ సెల్వన్ జన్మించారు. ఉద్యమకారుడిగా కొనసాగడంతో తన రచనా రచనావ్యాసంగానికి 25 ఏళ్ళ క్రితమే స్వస్తిపలికారు. ఇంతవరకు ఆయన 30 కథలు, దాదాపు ముప్పై పుస్తకాలు రచించారు. ఆయన ‘పూ’ అనే చిత్ర కథనానికిగాను 4 అవార్డులు అందుకున్నారు. ఆయన కథలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, మలయాళంలోకి అనువదించబడ్డాయి.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

One thought on “ఎండపట్టున వెళ్ళి

  1. చాలా బాగుంది కథ… ఎక్కడా ఆగకుండా ప్లో పరుగెత్తించింది…. ఇది అనువాదం అని రాయకపోతే అచ్చ తెలుగు కథే అనుకుందును…అనువాదకుడుకి భాష మీద ఉన్న పట్టు, శ్రద్ద ప్రస్పుటుంగా కనిపిస్తున్నాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *