మగువ చెవి

Spread the love

“ఇక్కడ అడైక్కలరాజ్..అంటే” అని గొంతు వినిపించేసరికి తలెత్తి పైకి చూశాను.

“మీరూ?”

“నేను పూరణి, ఉదయం ఫోనులో మీతో మాట్లాడాను. మీరు కూడా ఆఫీస్‍‍‍కు రమ్మన్నారు..”

“యా..అవునవును..”

పైకి లేచేందుకు ప్రయత్నించాను. వెన్నులో సన్నని వణకు మొదలయ్యింది. కేవలం కనుసైగతో ఎదురుగా ఉన్న చెక్కకుర్చీలలో ఒకదానిని చూపించి “కూర్చోండి” అన్నాను. కాస్త సహజంగా ఉన్నట్లు నవ్వేందుకు ప్రయత్నించాను.

కూర్చున్న చోట్లో నుండే “పేపర్లో ప్రకటన ఇచ్చారుగా” అంది. దానికి ఆమోదించినట్టు తలాడించి “అవును నేనే ఇచ్చాను. ఒక్క నిముషం.. కాస్త ఇవి అక్కడ పెట్టేసి వస్తాను” అని ఫైల్ లను కట్టకట్టడం మొదలుపెట్టాడు. ఒక రెండు నిముషాల పాటు గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

చెక్కమేజా మీద పేపర్లు గాల్లోక్కి ఎగరకుండా పెట్టిన నీలపు చెక్క కింద కాగితాలు అనూహ్యంగా సరసరమని కిందకు జారేసరికి, అప్రయత్నంగా ఆ కాగితలపైన ఉన్న నీలపు చెక్కను, దాని మీదున్న ‘అడైక్కలరాజ్, అసిస్టెంట్ మేనేజర్’ అని తెల్లరంగులో చెక్కిన నా పేరును కొద్ది క్షణాలపాటు తదేకంగా చూస్తూ ఉంది. టేబుల్ మీద ఉన్న ట్రోపీలు, నా వీపు వెనుక వార్నిష్ దగదగలు పూర్తిగా అంతరించిపోయి, దుమ్మెత్తి పోయిన రెండు చెక్క బీరువాలు, కొక్కెం తగిలించిన చెక్క కిటికీ, బద్దకంగా ఒళ్ళు విరుచుకు తిరిగే ఒక పాత సీలింగ్ ఫ్యాన్ ఇలా  ఒక్కొక్క దానిని గమనిస్తూ ఉంది.

“ఒక సోకాల్డ్ గవర్నమెంట్ ఆఫీస్ కదూ?” అన్నాను. ఒక్కక్షణం ఆమె అదిరిపడి, బదులు చెప్పకుండా తనలో తను నవ్వుకుంది.

ఆమెను ఇప్పుడే పరిశీలనగా చూస్తున్నాను. సుమారు ముప్పైయేళ్ళ వయసుంటుంది. ఎలిమెంటరీ స్కూల్లో టెంపరరీ టీచర్‍గా పనిచేస్తున్నటువంటి ముఖఛాయలు. కాస్త నమ్మదగిన ముఖమే. డైట్ వలన కాకుండా, శ్రమజీవనం వలన సన్నబడినట్టుండే శరీరాకృతి. అంచుల్లో చిన్నచిన్న తెల్లరంగు పూలు పొదిగిన లేత నీలంరంగు చీరను కట్టుకుంది. బహుశా అది మన్నిక తక్కువైన చీర అయ్యుండొచ్చు. అయితే దానిని కూడా ఆమె ఎంతో పొందికగా కట్టుకుంది. భుజాన ఎటువంటి డిజైనింగ్‍లు లేని బ్రౌన్ రంగు హ్యాండ్‍బ్యాగ్ ధరించింది.

“కింద క్యాంటీన్ ఉంది…అక్కడ వరకు వెళ్ళొద్దామా?” అన్నాను.

“సరే” అని అందుకు తలాడించింది.

గోడ తేమకు సున్నం పెచ్చులూడిపోయి రేపో, మాపో అన్నట్లున్న బిల్డింగ్ మేడ మెట్లు దిగి ఇద్దరం క్యాంటీన్లోకి అడుగుపెట్టాం.

“మీరేం తీసుకుంటారు?” అన్నాను.

కాస్త సంకోచంగానే ‘కాఫీ’ అంది.

కౌంటర్ కెళ్ళి రెండు కాఫీలు తీసుకువచ్చాను, ఈసారి మాట్లాడటం నా వంతయ్యింది.

అన్నట్టు మీ పేరేంటన్నారు ‘పూరణి’ కదా.

“అవును”

“ఇంతకీ మీకిది సెకండ్ మ్యారేజా?”

“అవును”

“డైవోర్సా?”

“లేదు యాక్సిడెంట్, తప్పతాగి రోడ్డు మీద బండి నడపడం వలన.. అప్పటికీ పెళ్ళయి ఐదునెలలే అయింది.”

“పిల్లలు గట్రా ఏమైనా?”

ఆమె లేదన్నట్లు ఎడమవైపుకు తలాడించింది. తర్వాత కాఫీని ఒక గుటకేసింది.

“మీతో పాటు పెద్దవాళ్ళెవరూ రాలేదా?”

“అమ్మ ఒక్కర్తే, ఆమె నాతో పాటే ఉంటుంది. ఆవిడ పెద్దగా బయటకి రాదు. బాగా వయసైపోయింది. ఈ విషయాలన్నీ అటుంచితే మనమిద్దరం మాట్లాడుకుని ఓకే అనుకుంటే అమ్మతో మాట్లాడాలి. అడయార్లోనున్న ఒక ఆడిటింగ్ ఆఫీస్‍లో అకౌంటెంట్‍గా పనిచేస్తున్నాను.”

కాసేపు గదంతా నిశ్శబ్దం అలుముకుంది.

“మరి మీ సంగతేంటి డైవోర్సా?” అని పూరణి అడిగింది.

“అవును, ఆరు నెలలవుతుంది. మూడేళ్ళ బాబు ఉన్నాడు. బాబు ఆమెతో పాటే ఉండాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అందుకు నేను కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.” అన్నాను.

మళ్ళీ కాసేపు మౌనం.

“మరేమైనా ప్రాబ్లమ్? లేదు..ఎందుకిలా అడుగుతున్నానంటే పేపర్ ప్రకటనలో ‘చెవులు బాగా వినపడే అమ్మాయి కావాలి’ అని తప్ప మరేవిధమైన ఎక్స్‌పెక్టేషన్స్, కండిషన్స్ అంటూ అందులో మెన్‍షన్ చెయ్యలేదు. అందుకే..” అంటూ పూరణి కాస్త సంకోచంగానే అడిగింది. “కొంపదీసి ఆమెకి చెవులు సరిగ్గా వినపడవా ఏంటి?” అంది.

“లేదు, అదేం కాదు బాగానే వినిపిస్తాయి,అయితే నాకే..”

ఈ సారి కాఫీ తాగడం ఆపేసి కాస్త కలవరపాటుతో తదేకంగా నన్ను చూసింది.

“చెవులెంత ముఖ్యమో నాకు పెళ్ళి తర్వాతే అర్ధమయ్యింది.”

ఈ సారి కాఫీని గడగడా తాగి ఖాళీ గ్లాసును టేబుల్ మీద పెట్టింది. అయితే ఈ సారి మాత్రం చూపు తిప్పుకోకుండా నన్నే తదేకంగా చూసింది.

“బాల్యంలో తెన్కాశీలో కొన్నేళ్ళపాటు అమ్మమ్మ గారింట్లో ఉండేవాళ్ళం. తాటిమొద్దును అడ్డదూలం వేసిన పాత ఇల్లు. అన్నభాగ్యం అవ్వ అక్కడే ఉండేది. ప్రతిరోజూ రాత్రి కథ చెబుతున్నప్పుడు “అడైక్కలరాజు…మనిషి నిద్రపోతున్నపుడు అతడి చెవులు మాత్రమే చివరగా పడుకుంటాయి.  చెవి,నోరు ఒకదానికొకటి తోబుట్టువులు. అవి రెండూ ఒకదాన్ని వదిలి మరొకటి ఉండలేవు. చెవి శబ్దాలను వింటూంటేనే, నోరు ‘ఊ’ కొడుతుంది. చెవి నిద్రపోతే, నోరు కూడా నిద్రపోతుంది. అందువలన నువ్వు ‘ఊ’ కొట్టేంతవరకేరా నేను కూడా నీకు కథ చెబుతాను సరేనా” అనేది.

కాస్త వయసొచ్చాక, నేను ఈ విషయాన్ని స్వయంగా చూశాను. మా తంగమణి పిన్నికి చెవుడు. దీనికి తోడు ఆమె మూగ కూడా.

పూరణి చాలా సుతారంగా తలను పైకి కిందకి ఆడిస్తూంది. మధ్య మధ్యలో ‘ఊ’ కొడుతుంది.

‘ఊ’ కొట్టడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? మరియం ఈ ఒక విషయం తప్ప మిగతావన్నీ చేస్తుంది. చాలాసార్లు ఆమెతో మాట్లాడేటప్పుడు కనీసం నావైపు కన్నెత్తి కూడా చూడదు. ఇంకేదో ఆలోచిస్తూ లేదా ఎటువంటి స్పందనా లేకుండా నన్ను దాటివెళ్ళి పక్కగదిలోకెళ్ళి తలుపేసి గొళ్ళెం పెట్టుకుంటుంది. మొదట్లో నేను ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఉదాసీనంగా చూస్తుందేమో అనుకున్నాను. దానితో చాలా సార్లు మాటల మధ్యలో ఒక క్షణం నెమ్మదించి,  అరిచి కొట్టడానికి ఆమె మీదకి కోపంతో విరుచుకుపడేవాడిని.

ఆఫీస్‍లోని రోజువారీ సంఘటనలు, సమస్యలు, అరుదైన జోకులు చెబుతూ ఉండేవాడిని. ఆమె ముఖంలో ఎటువంటి ఉద్వేగం తొణికిసలాడేది కాదు. ఒక నల్లరాతిలా ఉలుకూపలుకు లేకుండా ముఖం మాడ్చుకొనుంటుంది. ఆ ముఖంలో ఒక ‘ఊ’ కొట్టడం,తలాడించడమంటూ ఏది ఉండదు. ఇక వీటిని తట్టుకోలేక ఏ రోజైనా అసలు నేను చెప్పేది నిజానికి వినబడి చస్తుందా? లేదా అని నేను గట్టిగా అరిస్తే కొంతసేపటి తర్వాతనో, లేదా కొంత దూరం వెళ్ళగానో “అన్నట్టు తమరింతకీ నా నుండి ఏ సమాధానం ఎదురుచూస్తున్నారేంటి?” అనేది. ఆ సమాధానంలో అణుమాత్రమైనా చికాకు, ఉదాసీనత ఏమాత్రం కనబడేవి కావు. అది ఒకరకంగా చెప్పాలంటే, ఏమాత్రం హెచ్చుతగ్గులు లేని నిట్టనిలువు గీతలా సూటిగా  ఉండేది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఉప్పూకారం లేని చప్పిడి మెతుకులు తినడంలా అనుకోండి.

అలాగే ఒకరోజు మా మేనమామ అరుళానందం ఊరు నుండి ఇంటికొచ్చాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో  నన్నెంతో ఆప్యాయంగా చూసుకునేవాడు.  నెలక్రితం ఆల్ఫోన్స్ అత్తయ్య చనిపోవడంతో మానసికంగాను,ఆర్థికంగాను ఆయన ఎంతో చితికిపోయాడు. దినం రోజున దుఃఖం విచారించడానికి వాళ్ళింటికి వెళితే, నా అంతట నేనే ‘మా ఇంటికొచ్చి కొన్ని రోజులు ఉండెళ్ళు మావయ్యా’ అన్నాను. ఓరోజు ఉదయం మాసిపోయిన బట్టలతో, చేతిపిడి తెగిపోయిన పాత బట్టల సంచితో మా ఇంటికొచ్చాడు. మరియం తనే వెళ్ళి తలుపు తెరిచి ఆయన్ని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది. మమ్మల్ని చూసీచూడంగానే చిన్నపిల్లాడిలా ఏడ్వసాగాడు. ఎప్పటిలానే ఆమె ముఖం ఎటువంటి ఉద్వేగం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా చూస్తుండిపోయింది. పాపం ఆయన ఎంతోసేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకు మరియం నుండి ఎటువంటి స్పందన, ఓదార్పు మాట, అంతెందుకు కనీసం మాటవరుసకు కూడా తను ‘ఊ’ కొట్టేది కాదనుకోండి. ఇన్ని సమస్యల మధ్యన ఆమె చేసిన ఒకింత మంచి విషయం ఏమిటంటే ఆయన్ను కూర్చోబెట్టి కాఫీ కలిపివ్వడమే. ఇంట్లోకి చేతిలో పాల ప్యాకెట్‍తోనూ,న్యూస్‍పేపర్‍తోను ఎవరైనా కొత్తవ్యక్తులు అడుగుపెడితే ‘ఊరికే ఒకసారి మా వాడ్ని కాస్త చూసిపోదామని ఇటువైపు వచ్చాను’ అని పదే పదే చెప్పేవాడు. ఈ విషయంగా ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. అయితే ఆయన తేలికగా మనుష్యుల్లో కలిసిపోయే రకం కాదు. కాస్త స్వతహాగానే మునగచెట్టులా తేలికగా మనసు విరిగిపోయే నైజమున్న మనిషి. ఆ రోజు బయట ఏదో పనుందని చెప్పి అప్పటికప్పుడే మా ఇంటి నుండి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు.

మాకు బిడ్డ పుట్టాకా కూడా ఆమె  ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. పూర్తి సమయం బిడ్డతోనే గడిపేది. రోజంతా ఆ పసిబిడ్డతో గడిపే సమయం కూడా నాలుగైదు మాటలకు మించి వెచ్చించేది కాదు. అదేపనిగా బయట విన్న మాటలన్నింటిని పోగేసుకుని వాటన్నిటినీ మరలా బయటకి వ్యక్తీకరించకుండా అంతలా ఏం చేస్తుందో ఏమో మరీ? అనిపించేది.

నేను మొదట్లో మరియం వినికిడి స్థాయిని పరిక్షిద్దామని సిల్వర్ గ్లాసులు,గాజు గ్లాసులను కావాలనే చేజార్చేవాడిని.

ఆ శబ్దాలు చెవినపడగానే ఒక్కసారిగా ఆమె లోపల గది నుండి, వంటగది వైపు పరుగున వచ్చేది. తర్వాత చెయ్యి జారి కిందపడిందని ఏదో సర్ది చెప్పి, క్షమాపణ అడిగేవాడిని. ఆమె పగిలిన గాజు పెంకులను ఏరి చెత్తడబ్బాలో పడేసి అక్కడి నుండి పక్కకు జరిగేది. ఎన్నోసార్లు నేనామె తండ్రితో ఆమె వ్యవహార శైలి గురించి పదే పదే వాదించేవాడ్ని. అందుకాయన సర్వసాధారణంగా “ఆమె స్వభావం చిన్నప్పటినుండి అంతే బాబు, మాకెలాగు అలవాటైపోయింది. మీరు కూడా కాస్త పెద్దమనసుతో  ఓర్చుకుని సర్దుకుపోండి అల్లుడు గారు” అని మేము కలుసుకున్న ప్రతిసారీ ఇదే బదులిచ్చేవాడు.

అంతకుమించి ఈ విషయం గురించి నేను ఆయనతో కటువుగా మాట్లాడి ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. ఎందుకంటే ఆయన నేను చదువుకున్న స్కూల్ హెడ్ మాస్టర్. మరియం అమ్మ తెరెసా కూడా ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసి రిటైరయ్యింది. ఇంటికి ఒక్కగానొక్క కూతురు కావడమే బహుశా ఈ సమస్యలన్నిటికి కారణం అయ్యుంటుందని మరియం తల్లి ప్రతిసారీ అదొక లోటుపాటుగా నాతో వల్లె వేసేది. “ఇక ఆ ప్రభువే దారి చూపించాలి” అని మేరీమాత ఫోటో వైపు తలెత్తి చూస్తూ, చేతితో శిలువ వేసుకుని జపమాలను లెక్కించడానికి వెళ్ళిపోయేది.

నేను పరిపరివిధాల ఆలోచించి చూశాను. బహుశా ఆమె తన బాల్యమంతా మితిమీరిన ఒంటరితనంలో పెరగడమే ఈ సమస్యకు కారణమైయుండొచ్చు.

ఒకానొక క్రమంలో వేరే గత్యంతరం లేక గది తలుపులు మూసేసుకొని, నాలో నేనే ఒంటరితంలో పిచ్చిగా మాట్లాడుకునేవాడిని. ఆ మాటల అలికిడి బహుశా గది బయటున్న మరియం కూడా వినే ఉండాలి. మేమిద్దరం తెగతెంపులు చేసుకోవడానికి ఆమె ఈ విషయమే కారణమని ఎత్తిచూపింది.

కుక్క బంతిని నోటితో కరుచుకుని తన యజమాని చేతిలో పదే పదే కుక్కుతున్నట్లు, నా నోటి నుండి వెలువడ్డ మాటలు, తిప్పి తిప్పి నా చెవులకే వచ్చి చేరేవి. నా బుర్ర పూర్తిగా శబ్దాలు, మాటలతో నిండిపోయింది. వీటన్నింటినీ నా బుర్ర లోంచి బయటకు నెట్టలేక ఉక్కిరిబిక్కిరయ్యేవాడ్ని. నా గోడును వెళ్ళగక్కేందుకు, వాటిని వినే చెవులు లేక ఒకానొక క్రమంలో నోరు కూడా పూర్తిగా మూగవోయింది.

“ఎందుకలా? ఇంటాబయటా, ఆఫీసులోనూ మీకంటూ స్నేహితులెవరూ  లేరా” అని పూరణి అడిగింది.

నేను మాట్లాడే విషయాలను ఆలకించడానికి, నాకొక ఆడదాని చెవే అవసరమనిపించింది. నా మాటలకు ‘ఊ’ కొట్టేందుకు ఒక మగువ గొంతే కావాలి అన్నదాంట్లో నా మనసు రూఢిగా ఉంది. ఈ మగవాళ్ళందరూ ఇంచుమించు అదే ఎదురుచూస్తారు కాబోలు.

బాల్యంనుంచి మన జీవితంతో పెనవేసుకున్న సంఘటనలు, ఆసక్తిదాయక విషయాలు,సుఖదుఃఖాలు, విచారం, దిగులు, ముచ్చట్లు ఇలా నోటి ద్వారా వ్యక్తమయ్యే అనంతమైన మాటలన్నిటిని పోగేసి అమ్మ, అక్క, చెల్లి, స్నేహితురాలు, ప్రియురాలు, భార్య, కూతురు ఇలా ఎవరైనా ఒక ఆడదాని చెవులకు మళ్ళించడాన్నే ఇష్టపూర్వకంగా కోరుకుంటాం. కచ్చితంగా ఏదో సందర్భంలో, ఏదో విధంగా ఈ విషయాలన్నీ బయటపడతాయని తెలిసినాసరే ఆ ఆడవాళ్ళ చెవులకే ఈ రహస్యాలన్నిటినీ చేరవేస్తుంటాం.

దానివలనేనేమో ఆడవాళ్ళ చెవులకు మాత్రమే ఆభరణాలెన్నిటినో తొడిగి పరవశించిపోతాము.

యవ్వనంలో జూకాలు, బుట్టలు, దుద్దులు, మకర కుండలాలు. వృద్ధాప్యంలో జైనమునుల్లా కింద వరకు వేలాడే చెవులకు ఈడుపులు, గంటీలు. చెవిపై గోపురంలా ధరించే తటాకాలు ఇలా శరీరంలో మరే సున్నితవయవానికి బహుశా ఇన్ని ఆభరణాలు లేవేమో. దరిద్ర్యం వెంటాడుతున్న రోజుల్లో తాకట్టు పెట్టడానికి కూడా ఆ స్త్రీ చెవి పోగులనే విప్పి తీసుకుంటాము….కదు? అన్నాను.

పూరణి అతను మాటలను ఆమోదిస్తున్నట్టు తలాడించింది.

“ఇంతవరకు నేను పత్రికల్లో ఆరేడుసార్లకు పైగా ఇటువంటి ప్రకటనలు ఇచ్చాను. ఇంతవరకు ఇంకో అమ్మాయి, మీరు తప్ప మరెవ్వరూ  నన్ను సంప్రదించలేదు”. అన్నాను

“ఓ అలాగా…ఇంతకీ ఎవరా ఇంకో అమ్మాయి?” అని అడిగింది పూరణి.

“ఆ అమ్మాయి ఒకసారి నన్ను ఫోన్లో సంప్రదించింది. సహజంగానే ఆమెది కాస్త విషాదంతో జీరపోయిన గొంతు. ఆమె భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాడట. ఆమెకొక విచిత్రమైన సమస్య ఉంది. ఆమెకు వాసనాశక్తి అణువంత కూడా లేదట. ఆమె ఏ వస్తువు వాసనను పసిగట్టలేదట.” అన్నాను.

“నిజంగానే అలాంటి ఒక వ్యాధి ఉందా ఏంటి?” అంది.

“అవును, మొదట్లో నాక్కూడా ఈ విషయం వినడానికే కాస్త ఆశ్చర్యమేసింది. ఎన్నోసార్లు ఆమె వంట చేసేటప్పుడు అన్నం, కూరలు అడుగంటి పోయేదాకా వదిలేసేదట. ఒకసారి గ్యాస్ సిలిండర్ లీక్ అయిన విషయం కూడా తెలియకుండా ఆదమరిచి నిద్రపోయిందట.” అన్నాను.

ఆ సమయంలో ఆమెతో పాటు తన ఐదునెలల పసిబిడ్డ కూడా ఉందట. ఆమె భర్త ఈ విషయాన్ని సీరియస్‍గా తీసుకుని, రెండు కుటుంబాలతో మాట్లాడి సంప్రదింపులు జరిపాక, ఆమెతో తెగతెంపులు చేసుకొని ఇల్లొదిలి వెళ్ళిపోయాడట.

“బాల్యంలో అందరి ఆడపిల్లలా రకరకాల పూలను వాసన చూడటం నాకు ఎందుకో ఏ‍మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఇప్పటి వరకు నేను వాసన చూడాలనుకుని ఇష్టపడే ఏకైక వాసన అంటే అది కేవలం ఉచ్చ వాసన మాత్రమే. బెడ్ మీద నీళ్ళు పోస్తే కూడా ఒక దెబ్బ కొట్టని అమ్మ, ఎందుకో మరి ఉచ్చ పోస్తే మాత్రం అంతలా కొట్టేది? బెడ్‍నంతటిని ఉతికేటప్పుడు ఎందుకు అంతలా దుమ్మెత్తిపోస్తుంది? అది కూడా ఒకరకమైన నీరేగా. అందరూ మూతి ముడుచుకునేంత ఏముంది గనక ఆ ఉచ్చ వాసనలో?” అని అందామె.

“అయితే, అదే అమ్మ ఏడునెలల పాటు మంచంపట్టి, కాటికి కాళ్ళు చాచిన అవసానదశలో నా యీ చేతులతో నేనే స్వయంగా ఆమె మలాన్ని ఎత్తి బయటపడేసేదాన్ని. బహుశా ఒకవేళ నాకే గనుక అందరిలా ఆ వాసనాశక్తే గనుక ఉండుంటే, ఒకవేళ నేను కూడా ఆ పనిని  అంత శ్రద్ధగా చేసేదాన్ని కాదేమో. ఏదో ఒకరోజున మూతి ముడుచుకునేందుకు అవకాశం ఉండేదేమో” అంది.

ఆసాంతం నాలాగే బాల్యపు జ్ఞాపకాలెన్నింటినో పెనవేసుకుందనుకున్నాను. ఆల్మోస్ట్ ఇక ఆమెనే పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను.

సరిగ్గా అప్పుడే ఆమె నన్ను విచారించసాగింది. మీలాగే ప్రకటనలో ఉన్న అదే లైన్‍ను ఎత్తిచూపి వివరణ అడిగింది. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆమె అవతలి వైపు నుండి ఊకొడుతూ ఉంది, నేను కోరుకుంది కూడా అదే.

“నేను టూకీగా చెప్పేందుకు సన్నద్ధమవుతున్న కాసేపట్లోనే ఆమె ‘ఊ’ కొట్టడంలో ఒక తిరకాసు కనిపించింది. ఆపై ఒకట్రెండు మాటల తర్వాత అవతలివైపు నుండి ఆ ఊ కొట్టడం కూడా పూర్తిగా ఆగిపోయి, ఫోను కట్ అయిపోయింది.”  అన్నాను.

“నిజమే చెవులూ, శబ్ధాలూ ఎంతో ప్రధానమైనవి. మా నాన్న కూడా తన చివరిరోజుల్లో ఎటువంటి శబ్ధాలు లేకపోవడం వలన లోలోపల ముడుచుకుపోయి కృంగి కృశించి చనిపోయారు. విరుదునగర్‍లో పత్తి కర్మాగారంలో ఫోర్‍మెన్‍గా పనిచేసేవాడు. బాల్యంలో స్కూల్ సెలవు రోజుల్లో నాన్నకి నేనే ఇత్తడి తూగులో భోజనం తీసుకెళ్ళేదాన్ని. ఖాకీరంగు ప్యాంటు, చొక్కాను  యూనిఫామ్‍గా   తొడుక్కునేవాడు. మా నాన్న బట్టల  మీద అక్కడక్కడ మంచుకురిసినట్లు తెల్లని దూది పింజలు అంటుకొని ఉండేవి.

అంతటి భారీ శబ్ధాలను అంతవరకు కనీవిని ఎరుగను. వేగంగా వెనక్కి ముందుకి కదిలే ఆ యంత్రాల రణగొణ ధ్వనులను వింటే నాకు కళ్ళు తిరిగేవి. అక్కడ మూగవాళ్ళు, చెవిటివాళ్ళు ఎవరూ లేనప్పటికీ లోపల యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య పనిచేసే అనేకమంది కార్మికుల చేతులు మాత్రమే సైగలతో మాట్లాడుకునేవి.

నాన్న పని నుండి రిటైరయ్యాక కూడా మా పూర్వీకుల ఇంట్లోనే ఉండేవాళ్ళం. మేము ఉన్నటువంటి ప్రాంతం నుండి ఒక ఫర్లాంగు దూరంలో ఒక ఫ్యాక్టరీ ఉండేది. రాత్రంతా నాన్న నులకమంచం మీద పడుకొని ఉండేవారు. రాత్రుల్లో ఆయన చెవులు, పిల్లలు పెట్టిన పాము ఎరకోసం గాలిస్తున్నట్లు, ఫ్యాక్టరీ యంత్రాల ధ్వనులను తీవ్రంగా గాలించి ఆయన చెవిని చేరుకునేవి. బాగా గమనిస్తే గనక ఆయన తల కూడా ఆ యంత్రంలానే ముందుకి వెనక్కి తూగుతుండేది. తలలోను, దవడలోనూ మాత్రం తెల్లని దూది పింజలు పేర్చినట్లు ఉండేవి. ఆయనకు వయసు బాగా పైబడింది. పని నుండి రిటైరయ్యాక ఎన్నో రోజుల తరబడి తనకు నోరుందన్న విషయమే పూర్తిగా మర్చిపోయి కేవలం చేతిసైగలతోనే మాట్లాడుతుండేవాడు.

ఒకానొక క్రమంలో పూర్వీకుల నుండి సంక్రమించిన ఇంటిని కూడా అమ్మేసి ఇంకో చోటికి మకాం మార్చాం. అది ఎటువంటి అలికిడి లేని నిశ్శబ్దమైన ప్రాంతం. ఆ రోజు మొదలు ఆయన సరిగ్గా నిద్రపోలేకపోయేవాడు. ఆయన చెవులు దూరం నుండి వచ్చే పత్తి కర్మాగార యంత్రాల నుండి వెలువడే భారీ శబ్ధాలను గాలించి అవి చెవిని చేరకపోయేసరికి విసిగి వేసారిపోయేవి. దానితో చెవులు పూర్తిగా నిద్రించడం మానేశాయి. ఇవన్నీ ఒకెత్తైతే బహుశా చెవులు శబ్ధాలను కళ్ళతో పాటు, శరీరానికి కూడా అలవాటు చేసుంటాయనుకుంటాను. ఎటువంటి శబ్ధాలు వినబడకపోయేసరికి శరీరం పూర్తిగా సాంత్వన పొందలేక విసిగి వేశారేవాడు. దానితో ఒకట్రెండు నెలల్లోనే ఆయన  చనిపోయారు. నాన్న చనిపోతున్నపుడు అమ్మ ఆయన ఆలనాపాలనా చూసుకుంటూ ఆరోగ్యం క్షీణించి ఉలుకూపలుకు లేకుండా పోయింది. కళ్ళ వెంబడి కన్నీరు ధారాపాతంగా వచ్చేది. కొంతకాలం మతిభ్రమించిన దానిలా ఉండేది. బహుశా నాన్న లేని ప్రపంచంలో ఆమెకు అన్నీ గాఢాంధకారంతో నిండిపోయాయేమో. ఇప్పుడు కూడా ఆమె బలవంతం వలెనే ఈ పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది.” అంది పూరణి.

అమాంతం ఒక కాఫీ గ్లాసు భళ్ళున నేల మీద పడి, శబ్ధాన్ని రేకెత్తించింది.

సమయం గడుస్తుందనే స్పృహ ఏ మాత్రం లేకుండా పూరణితో నేను గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాను.

నేను ఇపుడే టేబుల్‍ని నిశితంగా గమనించాను. అక్కడ మా ఇద్దరి ముందు ఆరేడు కాఫీ గ్లాసులు వరుసగా పేర్చి ఉన్నాయి. కంగారుగా మణికట్టు పైకెత్తి టైమ్ చూశాను. సమయం నాలుగు దాటింది. ఆ విషయాన్ని నేను పూరణితో చెప్పాను.

ఆమె కూడా “అవును” అంది.

“చివరగా ఏం చెప్పాను?” అని పూరణిని అడిగాను.

“నాలుగేళ్ళ క్రితం ఒకరోజు అర్ధరాత్రిలో మీ నాన్నగారు చనిపోయారని ఏడ్చుకుంటూ, మరియాన్ని నిద్రలేపి మరీ ఆ విషయం చెబితే ఆమె ఎప్పటిలానే నల్లరాతిలా ముఖం మాడ్చుకుని, మళ్ళీ తన గదిలోకెళ్ళి పడుకుందని చెప్పారు” అంది.

అవును… అన్నట్టు “నేను ఇంతసేపు నాలుగేళ్ళ క్రితం జరిగిన సంఘటనలే చెప్పుకొస్తున్నానా? ఆమెతో పంచుకోవడానికి బుర్ర నిండా మరెన్నో శబ్దాలు,విషయాలు దాగున్నాయి. వాటిని కూడా మీతో పంచుకోవాలి” అన్నాను.

పూరణి తలాడిస్తుంది. ఆమె ‘ఊ’ కొట్టడం గమనించాను. ఆమె ‘ఊ’ కొట్టడంలోనయితే ఎటువంటి తొట్రుపాటు, తిరకాసు కనబడలేదు.

*****

నరన్

‘నరన్’ అనే కలం పేరుతో రచనలు చేసే ‘ఆరోగ్య సెల్వరాజ్’ హాట్‍స్టార్ ఓటీటీలో పని చేస్తున్నారు. నరన్ నూతన తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి. తమిళ సాహిత్యంలో కథలు, కవిత్వం, నవలలు విరివిగా రాస్తున్న వర్ధమాన తమిళ రచయిత. అతని కవిత్వం,కథలలో సర్రియలిజం, మాజికల్ రియలిజం, ఫాంటసీ, జెన్‍తత్వం వంటి అంశాలు చోటుచేసుకుంటాయి. కేశం, వారణాసి అతడికి గుర్తింపు తెచ్చిన కథలు. సాల్ట్ అనే పబ్లికేషన్ సంస్థను స్థాపించి ఆ ప్రచురణా సంస్థ ద్వారా దాదాపు 60 కి పైగా పుస్తకాలను, పేరెన్నికగన్న సమకాలీన తమిళ యువ రచయితలను తమిళ సాహిత్యానికి పరిచయం చేశారు. ఇంతవరకు సాహిత్యరంగంలో తన రచనలకై 11 అవార్డులు అందుకున్నారు. ‘కేశం’ అనే తమిళ కథా సంకలనానికి 4 అవార్డులు లభించాయి.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

3 thoughts on “మగువ చెవి

  1. కథ చాలా బాగుంది… అనువాదం కూడా సరళంగా తొట్రుపాటు లేకుండా సాగింది…ఉదయని మంచి కథలు అందిస్తోంది..భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను..విపుల లేని లోటుని తీరుస్తూ … ధాంక్యూ

    సూర్య ప్రకాష్ జోశ్యుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *