నా పద్నాలుగవయేట నా తల్లిదండ్రులు, నన్ను పంటచేలకు కాపలాదారుడిగా పెట్టారు. ఒక తగరపు డబ్బాను పుల్లతో కొట్టుకుంటూ, పొలంగట్లపై అరుస్తూ పరుగెత్తాలి. ఆ శబ్దానికి పిచ్చుకలు చెల్లాచెదురై, ఎగిరివెళ్ళి అయస్కాంతానికి ఆకర్షించబడినట్లు దగ్గర్లోని చెట్లపై వాలేవి. కొన్ని మంకుపట్టిన పిచ్చుకలు మాత్రం తోటలోని మరోచోటికి వెళ్ళివాలి, అక్కడ కంకులను కొరికేవి. కొన్ని పిచ్చుకలు మర్రిచెట్టు ఊడలతో మూసుకుపోయిన నూతిలోకి వెళ్ళి తలదాల్చుకునేవి. అక్కడ అనేక పక్షిగూళ్ళు మర్రిఊడలకు వేలాడుతూ మనుష్యులు అందుకోలేనంత దూరాన ఉండేవి.
ఆ రోజుల్లో నాకూ పక్షులకు మధ్య స్నేహమూ, శత్రుత్వము కలగలిపిన ఒక విచిత్రమైన అనుబంధం నెలకొంది. గూళ్ళను పైకిలాగి పరిశీలించడం నాకు ఉపవృత్తి. అది ఇంకో కథ లెండి.
కొద్దిరోజులకే ఆ పని, ఆ తగరడబ్బా శబ్దాలకు విసిగివేశారిపోయాను. దానితో ఆటోమేటిక్‌గా పనిచేసే డ్రమ్ములను తయారుచేశాను. అవి పని చెయ్యడం కోసం డ్రమ్ములను, ఇనుప రేకులతో తయారుచేసిన ఒక గాలిమరకు కలిపాను. వాటిని పంటచేలకు ఇరువైపులా ఉంచాను. గాలివీచినప్పుడల్లా అవి “డమ, డమ” అని మోగుతాయి. మొదట్లో ఆ శబ్దాలకు భయపడిన పక్షులు, పోనుపోనూ ఆ భయం కాస్తా పోయి, సావకాశంగా కూర్చుని కంకులను కొరికేవి.
దానితో వాటిని తరిమేందుకు నాకు ఒక తుపాకీ కావాలని నాన్నను అర్థించాను. బొమ్మల తుపాకీ కాదు; నిజమైన తుపాకీ. అందుకు ఆయనేమో కొబ్బరిమట్టతో తుపాకీలా ఒకదానిని తయారుచేసిచ్చి, “దీనిని చేతితో పట్టుకొని పొలంగట్ల మీద నడు, మళ్ళీ అవి ఇటువేపు తలెట్టుకుని కూడా పడుకోవు” అని సలహా ఇచ్చాడు. అది చేతుల్లోకి తీసుకోవడానికే నేను భంగపాటుకి గురయ్యాను. దీనికి తోడు ఆ కొబ్బరిమట్ట తుపాకీకి అవి ఏమాత్రం జంకలేదు. నిజమైన తుపాకీనే కావాలని మా నాన్నతో భీష్మించుకుని కూర్చున్నాను. నా పంతం చూసి, అమ్మ వ్యతిరేకతను కూడా లెక్కచెయ్యకుండా, ఆయన మా ఊరి వేటగాడు కౌండర్ దగ్గరనుంచి ఒక తుపాకీని కొనితెచ్చి ఇచ్చాడు. అది సాధారణ తుపాకీ కంటే కాస్త చిన్నదిగా ఉంది; అదేదో నాకోసమే చేసారన్నట్లు ఉంది. తుపాకీలో మందు కూరడం, గురి చూసి కాల్చడం అన్నీ నాన్నే దగ్గరుండి నేర్పించాడు. దానిని రహస్యంగా వాడుకోవాలని ఉత్తర్వు జారీచేశాడు. విషయం బయటకు పొక్కితే పోలీసులు పట్టుకుంటారట. అది వేటగాడైన కౌండర్ తండ్రికి, సుబ్రమణి కంసాలి చేసిచ్చిన తుపాకీనే. దానితోనే వేటగాడు కౌండర్ అతని చిన్నతనంలో వేట నేర్చుకున్నాడట. ఆ ప్రదేశానికి మొట్టమొదటగా తుపాకీని పరిచయం చేసిందే సుబ్రమణి ఆచారినే అని నాన్న చెప్పాడు. వేట నేర్చుకుంటున్న తొలిరోజుల్లో ఈ విషయాలతో పాటు, అతడి గురించిన ఎన్నో కథనాలు కూడా విన్నాను. ఎంతోమంది, ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. అది కేవలం సుబ్రమణి కంసాలి కథ మాత్రమే కాదు, అది ‘అక్రమ తుపాకుల కథ’ కూడాను.
అప్పట్లో ధర్మాపురం నాగరికత వాసన ఏమాత్రం ఎరుగని గ్రామంగా ఉండేది. జవ్వాదు కొండ దిగువభాగంలోని ఆ ఊరికి వెళ్ళేదారి, ఇరువైపులా చుట్టుతా పొదలతో, దారిలో చెరువులు, తెప్పలు, రాళ్ళు అడ్డుపడుతుండేవి. బయట ఊర్లకి ప్రయాణమన్నదే ఆ ఊళ్ళోవాళ్లకి ఒక సాసోపేతమైన ప్రయాణం వంటిది. మూడువైపులా కొండలతో నిండి, అడవి మధ్యన అడుగుకి కూరుకుపోయినట్లు కనిపించే ధర్మాపురం, కేవలం ఆ ఒక దారితోనే బయట ప్రపంచంతో సంబంధాలు కలిగుండేది. కొండపై నుంచి దిగి వచ్చే కొండ కౌండరులకు ఆ ఊరే ప్రధాన వ్యాపారస్థలం. ప్రతి శుక్రవారం జరిగే సంతకు కాయగూరలు తీసుకువచ్చి అమ్మి, కిరసనాయిలు, ఉప్పు, బట్టలు మొదలైన వాటిని కొనుక్కొని వెళ్ళేవారు.
ధర్మాపురంలో బ్రతికిన వ్యవసాయదారులను నమ్ముకుని ఒక కంసాలి కుటుంబం మనుగడ సాగించేది. ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ముళ్ళు. అందులో పెద్దవాడు నాగళ్ళు, ఎడ్లబళ్ళు, మంచాలు మొదలైన చెక్కపనులు చేస్తూ బతుకు వెళ్ళదీసేవాడు. ఆ తర్వాతివాడు ఇనుము పని చేసేవాడు. పలుగూపారలు, కొడవళ్ళు, నూలుమగ్గాలు, కత్తులు మొదలైన వాటిని తన కొలిమిలో తయారుచేసేవాడు. ఆ తర్వాతివాడు బంగారం పనిచేసేవాడు. పాత బంగారం, వెండి నగలను కరిగించి కొత్త నగలు చేయడం, పెళ్ళికి తాళిబొట్లు చేయడం, తెగిపోయిన కాలిపట్టీలను అతికించడం, మెరుగుపెట్టడం వంటి పనులు చేసేవాడు. వాళ్ళలో కడపటివాడి పేరు సుబ్రమణి. అతడు రెండవ భార్య కొడుకు. అయినాసరే, వాళ్ళ అన్నదమ్ములు అతడిని వెలివేయలేదు. అతడికి పని నేర్పించేందుకు ముందుకు వచ్చారు. అతడు మాత్రం ముగ్గురు అన్నయ్యల దగ్గర మార్చి మార్చి పనిచేసినప్పటికీ, ఏ వృత్తిని పూర్తిగా నేర్చుకోలేక పొద్దుపుచ్చుతూ వచ్చాడు. యవ్వనంలోకి అడుగుపెట్టాక కూడా వాళ్ళ చేతిలో దెబ్బలు తినేవాడు. అతడికి పిల్లనిచ్చేందుకు ఏఒక్కరూ ముందుకు రాలేదు. చూసేందుకు దృఢమైన శరీరాకృతి కలిగి ఉన్నప్పటికీ, అందరికీ అతనిపై ఒక రకమైన చులకన భావముండేది. అందువలనేమో యువతులు అతడి దరిదాపుల్లోకి కూడా వచ్చేవారు కాదు.
ఇలా రోజులు గడిచే కొద్దీ, ఒకరోజు సుబ్రమణి, తన రెండవ అన్నయ్య కొలిమిలో సమ్మెట వేస్తున్నాడు. అతడి అన్నయ్య ఆరిన ఇనుప ముక్కలను కొట్టి నాగలికి గొట్టాన్ని తయారుచేస్తున్నాడు. సుబ్రమణి మనసు పనిలో లీనంకాక కొలిమిలో పూచిన ఎర్రని నిప్పు కణికలనే గమనిస్తుంది. అది ఒక స్త్రీ హృదయాన్ని తలపిస్తుంది. అనవసరమైన వేడి ఎక్కువై, పని లాక్కుంటూ పోయింది. మండే ఆ ఇనుపముక్కను తీసి సుబ్రమణి కాలిపైకి లాగాడు అతడి అన్నయ్య. దానితో సుబ్రమణి లబోదిబోమంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు.
ఆరోజు ఊరు వదిలి వెళ్ళినవాడే, ఎన్నో ఏళ్ళుగా తిరిగి మళ్ళీ ఊరిలోకి అడుగుపెట్టలేదు. అతడి అన్నయ్యలు కూడా అతడి ఆచూకీ వెతకలేదు. పీడ విరగడయిందని వదిలేశారు. అతడు ఎడబాటు ఎవరికీ లోటుగా అనిపించలేదు. ఆ గ్రామమే అతడిని సమూలంగా మర్చిపోయింది.
ఒక రోజున ఎవరు ఎదురుచూడనప్పుడు అనూహ్యంగా మధ్యవయస్సులో సుబ్రమణి తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టాడు. ఒక వయస్సు మళ్ళిన పెద్దావిడ, ఆమె కూతురు అతడి వెంట వచ్చారు. అతడు పని నేర్చుకున్న కంసాలి దగ్గర నుంచి వాళ్ళను దొంగచాటుగా తీసుకువచ్చాడు. ఆ ఇద్దరి ఆడవాళ్ళలో అతడి తోడు ఎవరని ఊరిలోని వాళ్ళు ఊహించగలిగారు.
సుబ్రమణి వచ్చేటప్పుడు తనతో పాటు రెండు అరుదైన మందుపాతర సామగ్రిలను తీసుకువచ్చాడు. ఒకటి నల్లగానూ, మిగిలినవి ఆరెంజ్ రంగులోనూ ఉన్నాయి. ఏదో వైరాగ్యం కలిగినవాడిలా అన్నయ్యల ఇళ్ళలో ఉండకుండా, ఆ ఊర్లోనే ధనవంతుడైన ఒక జమిందారీ పశువులకొట్టంలో కాపురం పెట్టాడు.
అతడు అక్కడ ఏం చేస్తున్నాడని ఎవరికీ అంతుబట్టలేదు. వచ్చి కొద్దిరోజులు గడిచాక అతను పూర్తిచేసిన పరికరంలో మందును కూర్చి, మొదటి వేటకు బయలుదేరినప్పుడు, తూటాలు గోడపైన, శబ్దాలు కొండపైన చొచ్చుకువెళ్ళాయి. కాకులు మొదలైన పక్షులన్నీ గాల్లో పారిపోయాయి. అడవి జంతువులు ఆ మొదటి ప్రకంపనను వెన్నులో పాకిన వణుకు ద్వారా అనుభూతి చెందాయి. తుపాకీ అని పిలవబడే ఆ పరికరాన్ని సుబ్రమణి, జమీందారుకు కానుకగా అందించాడు.
ఒకరోజు సాయంత్రం వేళ, ఒక కాగడా ఒంటరిగా అడవిలో సంచరించడాన్ని ఆ గ్రామవాసులు ఆశ్చర్యంతో చూశారు. ఆపై రెండుమూడుసార్లు అడవివైపు నుంచి మందుసామాన్ల మోత వినిపించడం చేత వాళ్ళు భయంలో కూరుకుపోయారు. ఆతర్వాతి రోజుల్లో ఆ శబ్దం వాళ్ళకు మెల్లగా అలవాటైపోయింది. రాత్రిళ్ళలో నాలుగైదు మెరుపులను కూడా వాళ్ళు చూశారు. లేళ్ళు, కుందేళ్ళు, దుప్పులు, అడవి పందులు ఇలా వేటాడి, వాటా వేసిన మాంసం ఆముదం ఆకుల్లో మడిచి, ఊరిలో పంచిపెట్టారు.
సుబ్రమణి కొలిమిలో తయారుచేసిన తుపాకులతో వేటగాళ్ళు రెట్టింపు అయ్యారు. పక్క ఊరివాళ్ళు కూడా అతడి కొలిమివైపు దండెత్తి రాసాగారు. ఇలా రాత్రిళ్ళలో ఆ అడవి, తుపాకుల మోతతో దగ్ధమై, దాని ప్రతిధ్వనులతో హోరెత్తింది. తుపాకీ మాత్రమే కాకుండా, చిన్నసైజు నాటుబాంబులు తయారుచేసి, అడవిపక్కనున్న వ్యవసాయదారులకు ఇచ్చాడు. రాత్రిళ్ళలో అడవి నుండి దిగివచ్చి పైర్లను నాశనం చేసే పందులు ఆ నాటుబాంబులను కొరికి నోరు చీలి చనిపోయేవి. అతడు చేసిచ్చిన తుపాకీ గొట్టాల మోత విన్న తర్వాతనే ఉత్సవవిగ్రహం ఊరి నుండి బయలుదేరి వీధిలోకి ఊరేగింపుకి వచ్చేది. ఆ ప్రదేశం పేలుడుపదార్ధాల మందువాసనతో నిండిపోసాగింది. అది అక్కడివారిలో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
అతడి తుపాకీకి మొట్టమొదటిసారిగా ఒక మనిషి బలైనప్పుడే ఆ పరికరం మృగాలను మాత్రమే కాదు, మనుషులను కూడా హతమారుస్తుందని ఆ గ్రామస్తులు తెలుసుకున్నారు. తుపాకీ అనే మాట వాళ్ళలో భయప్రకంపనలను రేకిత్తించసాగింది. మృగాలు ఎక్కువగా సంచరించే అడవిమార్గంలో, తుపాకీకి కలిపిన తాడు ఉధృతితో అధిగమించి వెళ్ళి, ఒకడిపైన రవ్వలు దూసుకువచ్చి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ హత్య పంచాయతీ పెద్దలు కలుగజేసుకోవడంతో గుట్టుచప్పుడు కాలేదు. ఆ తుపాకీకి బలైన రెండవ వ్యక్తి ఆ ఊరి కౌండరు కొడుకు. అతడి మిండగత్తె భర్త వలన అతడు కాల్చబడ్డాడు. దానితో అక్కడికి అతడిని, తుపాకీ చేసిచ్చిన కంసాలిని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. సుబ్రమణి తప్పించుకుని కనుమరుగయ్యాడు. ఎన్నోరోజులుగా అతడు ఊళ్ళోకి అడుగుపెట్టలేదు. రాత్రిళ్ళు రహస్యంగా వచ్చి తుపాకీ పరికరాలు తయ్యారుచేస్తున్నట్లు ఊళ్ళో వదంతి పాకడంతో పోలీసులు రాత్రిళ్ళల్లోనూ వచ్చి వెతికి వెళ్ళేవారు.
ఈ సమయంలోనే అతడు వెంట వేసుకువచ్చిన వయసులోని అమ్మాయి, ఒక కుర్రాడితో లేచిపోవడం, ఆమె తల్లి జమిందారీ ఉంపుడుగత్తెగా మారడం జరిగింది. ఒకరోజు జొన్నచేనులో ఒక చోట్లో ఆమె మర్మంగా చనిపోయి పడునప్పుడు, అందరికీ స్పష్టంగా తెలుసు, ఆ హత్య చేసింది కంసాలి సుబ్రమణినే అని. అతడు ఎక్కడ ఉన్నాడనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కలేదు. ఆ తర్వాతి రోజుల్లో ఎక్కడెక్కడ అడవుల ప్రకంపన వినిపిస్తుందో, అక్కడల్లా అతడిని వెతుక్కుంటూ పోలీసు బృందం వెదకసాగింది. వాళ్ళ వ్యూహాలు ఏవి ఫలించలేదు. అతడు ఎక్కడా కనిపించలేదు. రోజుల మధ్యన అతడు జారుకుంటూ వచ్చాడు. అనేక పంటభూములలో అతడి కాలిముద్రలు దొరికినట్లు అనేకమంది చెవులుకొరుక్కున్నారు. ఎన్నో ఏళ్ళు గడిచాయి.
ఈమధ్యలో సుబ్రమణ్యం అన్నకొడుకు అక్రమ తుపాకులు తయ్యారుచేస్తున్నట్లు ఊరిలో వదంతి పాకింది. అతడికి సుబ్రమణినే రహస్యంగా వచ్చి పని నేర్పించేవాడట. ఆ విషయం నిజమేనని అతడు తన రెండు చేతుల్లోనూ మందు పేలిన ఘటనతో రుజువు చేశాడు. తుపాకులకు వినియోగించే ఆరెంజ్ రంగు మందు నింపిన డబ్బా మూతను తెరిచేటప్పుడు, అది చేతుల్లో పేలి, అతడి రెండు చేతులు నుజ్జయిపోయాయి. గాయం ఆరాక, చేతివేళ్ళు కోల్పోయిన ఆ చేతులతోనే అతడు చెట్లపై ఎన్నో విన్యాసాలు చేశాడనుకోండి, అది వేరే విషయం.
సుబ్రమణి ఒక కోయగూడెంలో తలదాచుకున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందింది. ఒక ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తే, కంటిచూపు కోల్పోయి ఒక ఇంటి అరుగుపై అతడు పడుకునున్నాడు. అతడి పక్కన చేతికర్ర మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అతడిని చూసిన ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎంతో అసంతృప్తికి లోనయ్యాడు. కళ్ళను చికిలిస్తూ సుబ్రమణి ఇలా చెప్పాడు. “ఫారెస్ట్ ఆఫీసరయ్యా! నేను తుపాకీలు సేసిన మాట నిజమే. నేను అడవిలోని మృగాలను సంపడం కోసమే అవి తయారుసేశాను. వాళ్ళేమో దాన్ని తీసుకెళ్ళి మనుషుల్ని కాల్చారు. ఆ ఆడమనిషిని కూడా నేను సంపనేదు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఒక పోలీసోడే ఆమెను సిత్రహింసలు ఎట్టి సంపాడు. ఆఖరికి ఆ హత్యానేరం కూడా నా మీదే మోపబడింది. అయ్యా! నేను బాగా అలసిపోయాను, ఇన్ని రోజులు అక్కడాఇక్కడా అని తలదాచుకుని బతుకు ఈడ్చుకువచ్చాను. ఇకపై అదికూడా ఈలుపడదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏటైనా సెయండి. అని అతడు చేతులు జోడించాడు. ఆ చేతులలో పొడుచుకువచ్చిన నరాల నుండి నిస్సహాయమైన కన్నీరు కారింది.
అతడిని నేరస్తుడిగాను, తనని చట్టంలోని ఒక పోలీసుగాను చూడటం అతడిని ఎంతో అసహనానికి గురిచేసింది. అతను ఊళ్ళోకి వట్టిచేతులతోనే అడుగుపెట్టాడు. ఆ కోయగూడెంలో సుబ్రమణి కంసాలి లేడని, ఎవరో తప్పుడు సమాచారం అందించారని అతడు డిపార్ట్మెంట్ అధికారులకు నివేదికను సమర్పించాడు. అతడు ఎక్కడో చనిపోయాడనుకుని అతడి కేసును క్లోజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ప్రభుత్వనివేదికకు ఊతమిచ్చేలా సుబ్రమణి నిజంగానే తుదిశ్వాస విడిచాడు. అతడి ఆత్మ ఆ అడవుల నిశబ్దంలో కలిసిపోయింది. అయితే, అడవిలో అక్రమ తుపాకులు మాత్రం ఎప్పుడూ అతడి పేరునే ఉచ్చరిస్తూ, ఇంకా హోరెత్తుతూనే ఉన్నాయి.
***
