చీకటిపడుతున్న వాన ముసురులో కంగారుగా ఇళ్ళకు పరుగెడుతున్న జనం ఎగిరే గబ్బిలాల మాదిరి కనిపించారు రాజేందర్‌కి. ప్యాంటుపైకి బురద చిమ్ముతున్నా లెక్క చెయ్యకుండా గుంతలు పడిన ఇరుకురోడ్డును దాటి ముందుకు వెళ్ళాడు. వీధి చివరన కరెంటు స్తంభంపైన మెరుస్తున్న లైట్ వెలుతురు వర్షంలో కారుతున్న కోడిగుడ్డు సొనలా వుంది. దాని పక్కన ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోకి అడుగు పెట్టాడు.
“వర్షం ఆగే వరకు కాస్త బయట ఎక్కడన్నా ఆగొచ్చు కదా! ఎందుకు కంగారు” విసుక్కుంది అమ్మ.
“చూస్తా ఉంటే ఈ వాన రోజంతా కురిసేట్లు కనపడింది. అందుకే తడిస్తే తడవనీ అనుకుని వచ్చేశా” అన్నాడు అమ్మ ఇచ్చిన టవల్ తో ఒళ్ళు తుడుచుకుంటూ. కాస్తంత తల తుడుచుకుని బయట బాత్రూంకి వెళ్ళి తడి బట్టలను అక్కడే పడేసి, లుంగీ మార్చుకుని గదిలోకి వచ్చి కూర్చున్నాడు.
బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎప్పుడూ సీరియళ్ళతో హోరెత్తే ఇల్లు పొద్దున్నుంచి కురుస్తున్న వాన మూలాన కరెంటు పోయినందుకు చీకట్లో వెలవెలబోతూ ఉంది. వంటగదిలోంచి చిన్న చిమ్నీ దీపాన్ని తీసుకువచ్చి స్టూలుపై పెట్టింది అమ్మ. దీపపు మసక వెలుతురులో నేత చీరలో పిన్ని కనిపించింది.
రోజు ఆ సమయానికి అమ్మ మాత్రమే ఉండే ఇంట్లో హఠాత్తుగా పిన్ని ఎదురుపడడంతో మొదట కాస్త ఆశ్చర్యపడి, ఆ తరవాత తేరుకుని సన్నగా నవ్వి
“బాగున్నావా పిన్ని, ఇదేనా రావడం” అన్నాడు.
పిన్ని విన్నదో లేదో కాని అమ్మ మాత్రం కల్పించుకుని
“ముందు తినేసి పడుకో, మిగిలిన సంగతులన్నీ రేపు తీరికగా మాట్లాడుకుందురు” అంది.
తినేసి చేతులు కడుక్కుంటూ, ‘వేళకాని వేళలో ఇంతకీ పిన్ని ఎందుకు వచ్చిందబ్బా’ అనుకుని ‘సర్లే ఇప్పుడు అడిగితే బాగోదులే. ఉదయం తెల్లారక తాపీగా మాట్లాడుకోవచ్చు’ అనుకున్నాడు.
ఉన్నది రెండు గదులు. బయట ఒక గది, దాని లోపల వంటగదిని ఆనుకుని కాస్త జాగా. బయట గదిలో నలుగురైదుగురు పడుకునేందుకోవచ్చు. వంట గదిలోనే కొన్ని సామాన్లు ఉన్నాయి.
నులక మంచంలో అమ్మను హత్తుకున్నట్టే పడుకున్నాడు. అంత వయసొచ్చిన ఇప్పటికీ తానింకా తల్లిచాటు బిడ్డనే. ఎందుకో నవ్వొచ్చింది అతడికి.
ఆ పక్కనే పిన్ని నేల మీద చాపా దిండు వేసుకుని పడుకుంది.
సమయం పన్నెండున్నర మించిపోయింది. బయట దబ్… దబ్… దబ్ మని ఎడతెరిపి లేకుండా తలుపులు బాదుతున్న చప్పుడు.
సమయంకాని వేళలో తలుపు బాదుతున్న శబ్దానికి లేచి లుంగీని సరిచేసుకుని ఆవలింతలతో బయటకెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా అడ్డపంచెను మడిచి కట్టుకుని చేతిలో ఒక సంచితో, చెదిరిన జుట్టు, వర్షానికి కారుతున్న నీటితో ఏదో తెలియని కంగారు కలగలిపిన ముఖంతో ఎదురుగా చిన్నాన్న కనబడేసరికి అంతవరకువున్న నిద్రమగత అంతా చెదిరిపోయింది.
ఇద్దరూ లోపలి వచ్చారు. ఏమీ మాట్లాడకుండా తన పాతలుంగీలో ఒకదానిని చిన్నాన్నకి అందించాడు. లుంగీ మార్చుకుని, బాత్ రూములో ముఖం కడుక్కుని దిండు తీసుకుని పిన్ని పక్కన వేసి పడుకున్నాడు చిన్నాన్న. తను కూడా యథాలాపంగా అమ్మ మీద చెయ్యేసి నిద్రకు ఉపక్రమించాడు.
ఒకవైపు గడియారంలో చిన్నముల్లు భారంగా టిక్ టిక్ మని కదులుతున్న శబ్దం. సమయం అర్ధరాత్రి రెండు కావొస్తోంది. ఒకవైపు బయట చీకట్లో వీధికుక్కలు మొరిగే శబ్దం, మరోవైపు లోపల కీచురాళ్ళ చప్పుడు. వీటికి తోడు కరెంటు లేకపోవడం వలన గుయ్ గుయ్ మంటున్న దోమల రొద. ఫ్యాను లేకపోవడం వలన ఉక్కపోత.
ఎందుకనో నిద్ర పట్టలేదు. ఇంతలో సన్నగా ఏవో మూలుగుల శబ్దం చెవిలో పడ్డాయి. పక్కకి చూస్తే పిన్ని చీర కొంగు అడ్డం పెట్టుకుని కంటతడిని అదుపు చేసుకుంటూ ఉంది. కాసేపు గడిచాక ఆవిడకు దుఖం ఆపుకునేందుకు ఇక వీలు కాలేదు. చిన్నాన్న ఎప్పట్లానే తన చేతివాటం మొదలు పెట్టాడు. ఆమెను కాళ్ళతో గట్టిగా తొక్కుతున్నాడు. రొమ్ముల మీద, ముఖంమీద బలంగా పిడిగుద్దులు గుద్దుతున్నాడు. మెడలోని తాళిబొట్టును పదేపదే గట్టిగా లాగుతున్నాడు. దానితో ఆమె మెడ ఒరుసుకు పోసాగింది.
ఏం జరుగుతుందో ఆ పసుపు రంగు చిమ్నీ మసక వెలుతురులో అంచనా వెయ్యిగలిగాడు తను. కాసేపు ఓపిక పట్టాడు. ఇక తన వలన ఎంతకూ కాలేదు. ముచ్చెమటలు పడుతున్నాయి. చిన్నాన్న ఆఖరికి ఇక్కడ కూడా ఇలా చేస్తాడని ఊహించలేదు. సర్రున లేచి కక్కలేక మింగలేక అన్నట్టు రోదిస్తున్న పిన్ని మీద పడి కొడుతున్న అతడిని బనియన్ పట్టుకుని ఈడ్చి రెండు చెంపలు ఫట్…ఫట్…మని వాయించి, పొత్తి కడుపుపై కాలితో ఒక్కతాపు తన్నాడు. ఆ దెబ్బకి చిన్నాన్న గోడ పక్కన నీళ్ళు లేని గంగాళంలో పడి బల్లిలా అతుక్కుపోయాడు.
“తోలు చీరేస్తాను, ఏమనుకుంటున్నావో నా కొడకా! పోనీలే రాత్రిపూట గొడవ ఎందుకులే, ఏదైనా ఉంటే తెల్లారాకా చూసుకుందాం అనుకుంటే, ఓ తెగ మిడిసిపడితున్నావు, నీ యాషాలు మీ ఇంట్లో దొబ్బిచ్చుకో. నాకాడ కాదు. ఇంట్లో బాధ పెట్టింది చాలదని, మనశాంతిగా రెండు రోజులు ఉందామని వస్తే, ఇక్కడ కూడా ఆమెను మనశ్శాంతిగా ఉండనీవా. ఇక్కడ కూడా నీ కుక్కబుద్ది పోనిచ్చుకున్నావు కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి ముందు దొబ్బేయ్, ఇంకెప్పుడు జీవితంలో ఆవిడ మీ ఇంటికి రాదు. నాకు కన్నతల్లితో పాటు నాకు మరో అమ్మవుంది అనుకుంటాను. రేపటి నుండి ఆవిడ కూడా మాతోనే ఉంటుంది. మేం తినే నాలుగు మెతుకుల్లో ఆవిడకి ఒక ముద్దెడతాము. జీవితంలో ఇక చచ్చినా ఆవిడ నీ గడప తొక్కదు, ఇంకెప్పుడైనా నా కంట్లో పడ్డావో పగిలిపోద్ది చూసుకో.”
ఈ మాటలకు ఠారెత్తిపోయిన చిన్నాన్న మూటాముల్లే సర్దుకుని ఒక్కసారిగా పరుగందుకున్నాడు. మరిది సంగతి ముందే తెలిసి ఉండడంతో అమ్మ ఉలిక్కిపడి నిద్ర నుండి లేచినప్పటికీ అక్కడ జరిగేదాన్ని అంచనా వెయ్యగలిగింది.
ఎదురుచూడని సమయంలో కరెంటు వచ్చింది.
అమ్మ గబగబా లేచి చెల్లెలి ముఖాన్ని తడిమిచూసింది. పిన్ని ముఖం కందగడ్డలా ఎర్రగా కమిలిపోయింది. కుడికన్ను వాచిపోయింది. స్టవ్ వెలిగించి వేడినీళ్ళు మరిగించి తెచ్చి చెల్లెలికి కాపడం పెట్టింది. ఈ అలజడితో ముగ్గురం నిశ్శబ్దంగా కూర్చుండిపోయాం.
నమ్మివచ్చిన ఆడదాని మనసు అర్ధం చేసుకోలేని వెధవలు అసలు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకొని తగలడతారో అర్ధం కాదు. పరమ అసహనానికి గురయి చిరాకు పడుతుంది మనసు.
ఇటువంటి విషయాలు బొత్తిగా మింగుడుపడవు తనకి. అసలు కొంతమంది మగవాళ్ళు ఎందుకు ఇలా ఉంటారో మాత్రం అంతుబట్టలేదు. గదిలో నలువైపులా చట్రాలు బిగించిన దేవుడిపటాల పక్కన తండ్రి ఫొటో చుట్టూ సీరియల్ బల్బులు మిణుకు మిణుకుమంటున్నాయి. ఆ బల్బుల వెలుతురులో నాన్న…మమ్మల్ని చూసి నవ్వుతున్నట్లుంది.
తండ్రి ఫోటో వంక చూస్తుండిపోయాడు. బయట ఇంకా వర్షం.
***
తన ఐదవఏట కొన్ని పాతబట్టలతో చెన్నైకి వచ్చాడు అమ్మతో పాటు. అమ్మ అమాయకురాలు, బొత్తిగా ప్రాపంచికజ్ఞానం లేని మనిషి. ప్రపంచపు పోకడ గురించి ఏ మాత్రం తెలియదు. తనని మొదట అక్కడ ఒక మెట్రికులేషన్ స్కూలులో వేయించింది. అయితే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో చదువుకు చుక్కెదురైంది.
అప్పుడు చెన్నైలో ఏకైక దిక్కూమొక్కు మేనమామ విశ్వం మాత్రమే. ఆయన పరిస్థితీ అంతంత మాత్రమే. ఆయనకూ ఓ కుటుంబం ఉంది. అత్త చూసేందుకు మూగదానిలా ఉంటుంది కానీ నోరు తెరిస్తే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తుంది.
అమ్మ మొదట్లో అమ్మమ్మ వాళ్ళింట్లోనే కొద్దిరోజులు గడిపినప్పటికీ పుట్టింటిలోను ఆమెకు వెట్టి చాకిరీ తప్పలేదు. అప్పటికింకా ఇంకా తను చేతికి అందిరాలేదు.
ఆత్మభిమానమనే ఒక్క విషయం ఎటువంటి అరమరికలు లేకుండా మధ్యతరగతి మనుష్యులందరిని నడిరోడ్డుపై నిట్టనిలువునా నిలబెడుతుంది. పుట్టెడు దుఃఖం ఉన్నా పుట్టింటిని వదిలివచ్చి ఎవరి దగ్గరా చేతులు చాపి నిలబడకూడదు అనుకొంది అమ్మ. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును ఇంటికి జమాన చెల్లించి, ఒక చిన్నఇల్లు అద్దెకు తీసుకుంది. అడపాదడపా పనులకి వెళ్ళసాగింది, కానీ ఎందులోనూ స్థిమితం లేదు. తల్లి పడుతున్న బాధను చూసి తను ఒక పక్క స్కూలుకు వెళుతూనే, అమ్మకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు.
స్వర్ణకారుల కుటుంబం కావడం వలన బంగారం షాపు పనుల్లోనే వెదికిపెట్టాడు మేనమామ విశ్వం. అలా తను ఒక సేటు నగల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడ చిన్నాచితక పనులు చేసేవాడు. బడి అవ్వగానే అక్కడ మునక వేస్తే సేటు కొట్టులో తేలేవాడు. కొట్టును శుభ్రంగా చీపురుతో తుడవడం, అక్కడ అద్దాలను తుడవడం, షాపుకు వచ్చిన కస్టమర్లకు టీలు, కాఫీలు అందివ్వడం వగైరా పనులు చేసేవాడు.
వంట్లో నలతగా ఉండి ఒకరోజు షాపుకు వెళ్లకపోవడంతో దానిని మనసులో పెట్టుకున్నాడు సేటు. ఒకరోజు తెచ్చిన టీ వేడి తగ్గడంతో అది తీసుకుని తన ముఖాన పోశాడు. దానికితోడు ‘టీ ఏంట్రా వేడి లేదు, లంజాకొడకా’ అని చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా బూతులు తిట్టడంతో తను అక్కడున్న సుత్తితో సేటు నెత్తి మీద రక్తం కారేలా గట్టిగా కొట్టి అటునుంచి అటు ఇంటికి ఉడాయించాడు.
ఈసారి ఇంకో పెద్ద నగల దుకాణం జి.ఆర్.టి.లో పనికి కుదిర్చాడు మావయ్య. షాపులో చిన్నాచితకా పనులు చెయ్యడం పోను ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి చేతులో కాస్త డబ్బులు ఆడేవి. దానికి తోడు షాపు తుడిచి, షాపు మూసేముందు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తే మరో ఐదు రూపాయలు అదనంగా దొరికేవి. అక్కడ కొద్ది రోజులు అంతా సవ్యంగానే సాగింది. చదువు మెల్లగా అటకెక్కింది. దానికితోడు ఇక్కడ పనివేళలు పోనూ మిగిలిన సమయాల్లో మావయ్య డిజైనింగ్ పనిలో మక్కువ చూపేవాడు. తనకు ఆ బంగారం పనులు బొత్తిగా వంటబట్టలేదు. తన మనసంతా రంగురంగుల డిజైనుల మీదనే ఉండేది. అందుకు కారణం తాతయ్య కృష్ణమూర్తి సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఆర్టిస్ట్. ఆయన పేరొందిన సినిమా పోస్టర్ డిజైనర్ శంకరం దగ్గర పనిచేసినవాడు. అప్పట్లో తెలుగు సినిమా పోస్టర్ డిజైనర్లలో శంకరం ఎవరూ అందుకోలేనంత ఎత్తుండేవాడు. మావయ్యకి ఆర్ట్ అబ్బనప్పటికీ, పోస్టర్ల డిజైనింగ్ పని మాత్రం భేషుగ్గా అబ్బింది. దానితో ఆ పనిలోనే కొనసాగాడు. ఇలా ఆర్ట్‌కు సంబంధించిన అవశేషామేదో అతని మూలాలలోనే వుందేమో బహుశా. దానితో చేసే గత్యంతరం లేక ఆఖరికి మావయ్య డిజైనర్ పనిలోనే చేర్చుకున్నాడు.
ఆర్ధికంగా అంతంత మాత్రమే కావడంతో ఆదివారాల్లో ఎపుడైనా మావయ్య ఇంటి బయట పడిగాపులు పడేవాడు. భోజనం చేసే వేళకు వెళితే కనీసం ఒక పూటయినా కడుపు నిండా సంతృప్తిగా తినొచ్చేమో అనే ఆశతో. అయితే, అతడికి ప్రతిసారి ఆశాభంగమే ఎదురయ్యేది. నెలయ్యేసరికి రెండువందల యాభై రూపాయలు ఇంటి అద్దె కట్టడానికి ముక్కోటి దేవతలందరూ వరుసపెట్టి కనిపించేవారు. ఇంట్లో వరన్నం వండి వార్చిన రోజు నిజంగా పండుగ వాతావరణమే. వారంలో ఆరురోజులు పని పోనూ, మిగిలిన ఒక రోజు మాత్రమే ఖాళీగా ఉండేవాడు.
అప్పటికింకా ఫోటోషాప్ అంత అడ్వాన్స్‌డ్ కాలేదు. మొదట నటీనటుల ఫోటోలు తీసి వాటిని ప్రింట్ వేయించి కత్తిరించి, అతికించి వాటి ద్వారా పోస్టర్లు రూపొందించేవారు. పోస్టర్ల తయారీలో ఆర్టిస్ట్ శంకరం, శ్రీధర్ అందెవేసిన చెయ్యి. అప్పటికింకా ఆ శాఖ అంతవేగం పుంజుకోలేదు. తాత కృష్ణమూర్తి దగ్గర నేర్చుకున్న పనితో మావయ్య కూడా పోస్టర్ల డిజైన్ రంగంలోకి కాలు మోపాడు. ప్రముఖ దర్శకుడు అరవింద్ కుమార్ రూపొందించిన ‘భామ సత్యభామ’ అనే సినిమాకి పోస్టర్ల డిజైనర్ గా ఎంపికయ్యాడు. అతని కింద పని చేసే పరివారమంటూ పెద్దగా ఎవరూ లేరు. తన పనిలో తనే రాజూ, మంత్రి. తనే అతడికి నమ్మినబంటు. పోస్టర్ల డిజైన్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా డిజైనులో ఏ చిన్న పొరబాటు జరిగినా నష్టమేర్పడుతోంది. ఎప్పటిలానే పోస్టర్లు ప్రింట్ తీసి వాటిని కత్తిరించి పోస్టర్లు అతికించాలి. తను చిన్నపిల్లాడు కనుక కంగారులో భామ వేషం ధరించిన కమలహాసన్ ముక్కు కత్తిరించేశాడు. పోస్టర్ తప్పుగా ప్రింట్ అయ్యి కూర్చుంది. దానితో దర్శకుడు అరవింద కుమార్ చెడామడా చీవాట్లు పెట్టాడు.
“చిన్న కుర్రోడు ఏదో తెలియక చేశాడు సార్” అన్నాడు మావయ్య ఆరోజు.
“నేను పని నమ్మి ఇచ్చింది నిన్ను చూసయ్యా … ఆ చిన్నపిల్లాడిని చూసి కాదయ్యా”.
సరే…సర్లే…ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ కాకూడదు” అన్నాడు అరవింద కుమార్.
ఫొటోషాప్ అప్పుడే కొత్తగా రాసాగింది. దానికి తోడు కోరల్ డ్రా కూడా. ఇవే అప్పటి డిజైనర్లకు ఆయువు పట్టు. అయితే వీటి కోసం ప్రత్యేక శిక్షణాతరగతులు ఇచ్చేవారంటూ ఎవరూ లేరు. నయనోభయానో అందరి కాళ్ళావేళ్ళా పడి నేర్చుకోవలసిందే. అప్పట్లో కేవలం సాఫ్ట్‌వేర్ మాన్యువల్స్ చూసి నేర్చుకునేవారు అంటే అతిశయంగా ఉండొచ్చు. కంప్యూటరులోనే నేర్చుకుని కొంచెం కొంచెం తన పనిని మెరుగు పరుచుకున్నాడు. మావయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు.
అంతవరకు నేర్చుకున్న పనితో ఒక చోట పనికి కుదిరాడు. రెండువేల ఐదువందల వరకు అడిగి చూసాడు. కానీ అటుతిరిగి ఇటుతిరిగి అతడికి రెండువేల రెండువందలకు బేరం కుదిరింది. మొత్తమ్మీద ఆ పనిలోనే కుదురుకున్నాడు. మొదటి జీతం రాగానే అతడు ముందుగా చేసిన పని బజారుకు వెళ్ళి కేజీ బియ్యం, పావుకేజీ కోడి మాసం కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. కనీసం ఈరోజైన నోటికి రుచిగా వండుకుని తిందామని. అమ్మ పొయ్యిపై ఎసరు పెట్టింది. ఈలోగా ఇంటి ఓనర్ వాకిట్లో నిలబడి అది గమనించి, వెంటనే ‘ఇంటి అద్దె మూడు నెలలు బాకీ అది కట్టేందుకు తికనా లేదు గానీ, ముద్దా ముక్కా మాత్రం కావాల్సి వచ్చింది నోటికి, సిగ్గు లేకపోతే సరి’ అన్నాడు. పొయ్యి మీద ఎసరు మాత్రమే కాదు, తనకు కూడా లోలోపల కుతకుత లాడింది. ఆరోజు అమ్మ దేవుడిపటం దగ్గర పెట్టిన డబ్బులు లెక్కగట్టి అతనికి బాకీ డబ్బులు ముట్టజెప్పింది.
తన ఈడువారందరూ ఎంచక్కా స్కూల్, కాలేజులు అని తిరుగుతుంటే తను మాత్రం ఆ వయసుకు కష్టపడటం చూసి పట్టరాని కోపం వచ్చేది. తన తండ్రిని చూసిన ప్రతిసారి చిదిమివేసిన తన బాల్యం కళ్ళముందు మెదులుతుంది. తాము ఈరోజు అనుభవిస్తోన్న ప్రతి కష్టానికి కారణం ముమ్మాటికీ నాన్నే అన్న కోపం నిలువెల్లా దహించివేసేది.
కొన్నిసార్లు చిన్న విషయాలు, చిన్న పరిచయాలు జీవితంలోని అతిపెద్ద మలుపుల్లో కీలకపాత్ర వహిస్తాయి. తన జీవితంలో అటువంటి మార్పేదో చోటు చేసుకొంది. ఒకరోజు అనూహ్యంగా శ్రీలంక నుండి వచ్చిన ఓ వ్యక్తికి ఒక విజిటింగ్ కార్డును డిజైన్ చేసి ఇచ్చాడు. అది అతడికి ఎంతగానో నచ్చింది. మెల్లమెల్లగా అతడు కొన్ని పనులు తనకి ఫ్రీలాన్స్‌గా ఇవ్వసాగాడు. ఆ చిన్నపనులు తనలో కొండంత ధైర్యాన్ని నింపాయి. మొత్తమ్మీద పని మానేసి మెల్లమెల్లగా అతడు కొన్ని పనులు ఫ్రీలాన్స్‌గా చెయ్యసాగాడు. పనితనం మెచ్చి అతడికి ఫారిన్ నుండి కూడా పనులు రాసాగాయి. కొంతమంది క్లైంట్స్ నుండి అక్కడికే వచ్చి పని చెయ్యమని ఆహ్వానం కూడా అందింది.
ఇప్పుడు ఆర్ధికంగా కాస్త మెరుగయ్యారు. అమ్మ పాత ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన నాన్న ఫోటోను తీసుకెళ్ళి పెద్ద ఫోటో కడిగించి ప్రేమ్ కట్టించింది. ఒక రోజు పని నుండి బయటకు రాగానే గోడకు వేలాడుతున్న నాన్న ఫోటోను చూడగానే ఆవేశం తట్టుకోలేక ఫోటోను నేలకు విసిరికొట్టాడు. గాజుముక్కలు భళ్ళున చెదిరి పడ్డాయి.
“ఇంట్లో ఆ మనిషి గుర్తులేవి ఉండకూడదు, తీసుకెళ్ళి మర్యాదగా బయట పడేయ్, ఇంకెప్పుడు ఇంట్లో ఆ మనిషి ప్రస్తావన రాకూడదు. నన్ను ఇంకేమి అడగకు, ఇంట్లో ఆ మనిషి ఊసెత్తకూడదు, ఆ మనిషి తాలూకా గుర్తులేవి ఉండకూడదు, అంతే” అన్నాడు ఆరోజు తను.
అయినప్పటికీ మళ్ళీ అతడి తండ్రి ఫొటో దేవుడి పటం దగ్గరే తిష్ట వేసుకుని, సీరియల్ లైట్ల ముందు నవ్వుతూ దర్శనమిస్తుంది అమ్మ చొరవ వలన.
***
వాళ్ళది భీమవరం. అక్కడ వాళ్ళకి బంగారం షాపు ఉండేది. పెళ్ళినాటికి తన తండ్రికి ఇరవై ఏడేళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు తోబుట్టువులు. పెళ్ళైన రెండేళ్ళకు ఒక తను పుట్టాడు. విశ్వబ్రాహ్మణులు కావడంతో షాపులో నగలపనితో పాటు, గుడిలోని దేవతామూర్తుల శిలాప్రతిమలకు ఆభరణాలు కూడా ఆయనే స్వయంగా చేసి ఇచ్చేవాడు. ఊరిలో వాళ్ళ కుటుంబానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఊరి శుభకార్యాలు అన్నిట్లో వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చేవారు. ఆ కుటుంబం ప్రభావం ఎంత ఉండేదంటే ఆ ఇంట్లో ఒక చావు పడితే ఒక్కుమ్మడిగా ఊరంతా కొట్లకు సెలవు ప్రకటించేంతగా.
ఉదయం షాపులో పని, సాయంత్రం కాగానే ఇంటికి తిరిగివచ్చే తండ్రి ఇంటికి రాగానే ఎప్పుడూ మందు తాగేవాడు. ఇంట్లో చెల్లెళ్ళ చెప్పుడు మాటలు విని అమ్మపై తరుచూ చెయ్యి చేసుకునేవాడు. దెబ్బల బాధ తట్టుకోలేక కొన్నిసార్లు ఎదురింట్లో ఉన్న చర్చి ఫాదర్ ఇంట్లో తల్లీకొడుకులిద్దరూ దాక్కునేవారు. ఆయన వారికి మంచిచెడులు చెప్పిపంపేవాడు. మద్యంమత్తులో అతడు స్పృహ కోల్పోయి చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టేవాడు. భర్త ఎప్పుడు ఇంటికి వచ్చినా గుండెలు అరచేతుల్లో పెట్టుకుని దాక్కునేది తల్లి.
‘ఎందుకో రానురాను తన తండ్రిలో అనూహ్యమైన మార్పు వచ్చింది’ అని చెప్పింది అమ్మ. తను పెద్దయ్యాక. భార్యాబిడ్డలను చెప్పుడు మాటలు విని తనే హింసకు గురిచేస్తున్నానేమో అనే దిగులు అతడిని రోజురోజుకీ తీవ్రంగా కలచివేసిందేమో అన్నది. మెల్లగా తాగుడు కూడా మానేశాడట. తాగుడు అయితే మానేశాడు కానీ, పశ్చాత్తాపం మాత్రం అతడిని తీవ్రంగా వెంటాడింది. జీవితంలో మనిషికి పశ్చాత్తాపమే మోయలేని శిక్షాభారం. వాటి ఇరుసుల కింద అనునిత్యం నలిగే నలుగుడు కంటే, మరణమనే మజిలీ ఏమీ అంత మోయలేని భారం కాదేమో బహుశా.
ఒకరోజు మధ్యాహ్నం తనని నెత్తిన ఎక్కించుకుని మ్యాట్నీ ఆట తనకు ఎంతో ఇష్టమైన చిరంజీవి సినిమాకు తీసుకువెళ్ళాడు. సాయంత్రం సినిమా అయ్యాక కొట్టుబయట ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. పొద్దుపోతుంది. తనని భుజాన వేసుకొని ఊళ్ళోని మావుళ్ళమ్మ జాతరకీ వెంటేసుకువెళ్ళాడు. ఊళ్ళో తిరునాళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. ఊరి చిన్నాపెద్దా అంతా అక్కడే గుమిగూడారు. ఊక వేస్తే రాలనంత జనసందోహం. “పీ…పీ…పీ” అంటూ ఊదే బూర, ముదురు ఎరుపురంగు కళ్ళద్దాలు, గిలిగిచ్చకాయలు కొనిచ్చాడు. ఆ కళ్ళద్దాలు తొడుగుకుని, నాన్న భుజాలపై ఎక్కి బూర ఉదుతున్నాడు తను అమాయకంగా. తిరనాళ్ళలో ఏం కావాలో అడిగాడు నాన్న. ఏం అడిగినా కొనిస్తాను అన్నాడు. తను వచ్చిరాని మాటలతో “రేయ్…నాన్నా…బిర్యాని…కావాలి” అని నాన్నను అడిగాడు. బిర్యాని పార్సెల్ కట్టించుకుని మునుపటిలానే తండ్రి తనని భుజాలు ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు.
టీ పాయ్ మీద బిర్యాని పొట్లం విప్పి కొసరి కొసరి తినిపించాడు తన గారాల కొడుక్కి మురిపెంగా. కాసేపటి తరువాత తనే అందులో చెయ్యిపెట్టి తన చిట్టి లేతవేళ్ళతో తినసాగాడు. తన కళ్ళెదుటే నాన్న గదిలోకి వెళ్ళాడు. పక్కనేవున్న అమ్మ పాతచీరను అందుకొని ఫ్యానుకు బిగించాడు. ఇంట్లోవాళ్ళు అందరూ పక్క ఊరిలో పెళ్ళికి వెళ్ళారు. ముందుగా అమ్మే ఇంటికి వచ్చింది. తను నిండు ముత్తైదువగా ముస్తాబు అయిన చివరిరోజు అదే కాబోలు. ఫ్యానుకు ఉరిపోసుకొని శరీరం బరువుగా గాల్లో మెదులుతోంది. బహుశా నాన్నకు తన చివరి మజిలీ ముందే తెలిసిందేమో.
మెల్లమెల్లగా సాయంత్రానికి ఇంటిలో జనం పోగయ్యారు. చావు ఇంటికి మిఠాయిలు తేవడం అక్కడి ఊరి ఆనవాయితి. ఇబ్బడిముబ్బడిగా ఇంట్లో మిఠాయిలు పోగయ్యాయి. తను కేరింతలు కొడుతూ ఆ మిఠాయిలను తనొక్కడే నోట్లో పెట్టుకుని చిందరవందరగా తినసాగాడు. మెల్లగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ నట్టింట్లో శవం దగ్గరకు వెళ్ళి
“రేయ్ నాన్నా, లే బిర్యాని ఇందా తిను, మిఠాయిలు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి తిను…తిను…ఇందా…తిను” అన్నాడు తన లేలేత చేతులతో తండ్రి శవానికి మిఠాయి అందిస్తూ.
ఇదంతా ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు? పిన్నిని చిన్నాన్న కొట్టినందుకా? లేదా చిన్నప్పుడు నాన్న అమ్మని కొట్టినందుకా? తండ్రి తన తప్పు తెలుసుకున్నాడు కదా…ఎవరూ చెప్పకుండానే. పశ్చాత్తాపపడ్డాడు మరి. ఇప్పుడు క్షమిస్తాడా తను తండ్రిని? ఏమో తెలీదు తండ్రి ఉంటే తెలిసేది. తండ్రి పశ్చాతాపపడ్డాడు కాబట్టి క్షమించేవాడేమో మరి. తన సంగతి సరే. అమ్మ క్షమిస్తుందా నాన్నని. క్షమించే ఉంటుంది. లేకుంటే మరి ఫోటో ఎందుకు పదిలంగా పెట్టుకుంటుంది.
మరి చిన్నాన్న సంగతి?
రాత్రి మూడవుతుంది. బయట వర్షం ఇంకా కురుస్తున్న చప్పుడు. మాసిపోయిన గోడల మీద ట్యూబులైట్ తెల్లటి కాంతిని ప్రసరిస్తుంది. పిన్ని కూర్చున్న చోటునే పక్కకు ఒత్తిగిల్లి నిద్రపోతూ ఉంది. చేతిలో తడిసిన చీరకొంగు. ఆమెని చూసి ఎందుకో జాలి కలిగింది. అమ్మ వంక చూసాడు. కుక్కి మంచంలో మునగదీసుకుని పడుకుంది. అమ్మ మీద చేయి వేసాడు. నుదుటి మీద పడిన తెల్ల వెంట్రుకలు. ముడతలు పడ్డ చర్మం. ముసలిదైపాయింది అమ్మ అనుకున్నాడు.
మళ్ళీ తండ్రి గుర్తుకు వచ్చాడు. తండ్రికి ఉన్నట్టే చిన్నాన్నకు ఏవో కారణాలు ఉంటాయి అనుకున్నాడు. ‘ఇలా భవిష్యత్తులో ఎప్పుడూ జరగనీయోద్దని చిన్నాన్నకు గట్టిగా సముదాయించి చెప్పాలి’ అనుకున్నాడు.
గదిలో మూలన పాతకాలపు చిరుగుల గొడుకు కనిపించింది. గొడుగు చేతబట్టుకుని తలపులు తీసాడు. లోపల ఆడవాళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయట టప…టపమని చినుకుల వర్షం. మనిషిని కదలనిచ్చేలా లేదు. అయినా చిన్నాన్నని వెతుక్కుంటూ చీకట్లోకి బయలుదేరాడు.
*****

శ్రీనివాస్ తెప్పల
శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.





















