“నాకూ వొక పువ్వు” అని ప్రాధేయపడ్డాను. వెలిసిన చీర చుట్టుకున్న బక్కపలచటి స్త్రీ లేదన్నట్టుగా చేతులు తిప్పింది.
“కావాలంటే ముప్పయి రూపాయలు తీసుకో…” అన్నాను.
ఆవిడ పెదవివంపు తిరుగుతూండగా వంకర నవ్వొకటి విసిరేసి “అయిపొయినయ్యి..” అంటూ గుడిసె లోపలికి వెళ్ళిపోయింది.
లాంచీలోంచీ దిగిన జనమంతా మిట్టపైకెక్కి మట్టిబాటగుండా పేరంటాలపల్లి ఆశ్రమం దగ్గరికి నడుస్తున్నారు. చాలామంది చేతుల్లో వెదురు పువ్వులున్నాయి. వాళ్ళందరూ లాంచీ దిగీదిగకమునుపే గుడిసెల దగ్గరికి పరిగెత్తి, అక్కడి ఆదీవాసీ ఆడవాళ్ళు అమ్ముతున్న వెదురుపువ్వులనంతా అదేదో పైత్యం ప్రకోపించినట్టుగా కొనిపారేశారు. నేను తాపీగా దిగివచ్చేసరికి వొక పువ్వయినా మిగల్లేదు.
పాపికొండలు చూట్టంకోసం బయలుదేరగానే “నాకేం తెస్తావని” అడిగింది చంచల.
“నన్నే నీకిచ్చేశాను. యిక నీకివ్వడానికి నా దగ్గరేం మిగిలిందని?” అన్నాను దోరగా చూస్తూ.
“వట్టి మాటలకేంలే ? నిజం చెప్పు… యేం తెస్తావు ?” అందామె విసుగ్గా. “అక్కడ మాత్రమే దొరికేది, మరెక్కడా దొరకనిదీ, చూసినప్పుడల్లా నీ లాంచీ ప్రయాణం గుర్తుకొచ్చేదీ- అటువంటి బహుమతి కావాలి నాకు” అంటూ వెంటనే కవ్వించేలా చూసింది.
“నువ్వుగూడా నాతో రావచ్చు కదా? అక్కడ నీకేది నచ్చితే దాన్ని కొనిచ్చే పూచీ నాదీ” అన్నాను ఆశగా
“నేను కూడా రావాలని వుంటే యీ ప్రయాణానికి అంత ప్రచారం యిచ్చేవాడివా నువ్వు? యెవరికీ తెలియకుండా వుంటే రహస్యంగానైతే వచ్చేదాన్ని గదా నేను!” అందామె కోపంగా. వెంటనే నవ్వేసి “ముందుగా ఆ యాత్ర లోతుపాతులు తెల్సుకుని రా! తర్వాత యిద్దరమూ వెళ్ళాం” అంది.
పచ్చి వెదురును దబ్బలుగా చీల్చి, వాటిని రేకుల్లా కోసి లావుపాటి పుల్లకు చేసిన రంద్రాల్లో వరసగా గుచ్చి, పువ్వులా తయారు చేశారు. దూరం నుంచీ చూడ్డానికి పారిజాతాల్లాగా, గందమాగధాల్లాగా కనిపిస్తున్న లేత పసుపు రంగు పూలవి. పొడవాటి కాడతో ఆంధ్ర మహావిష్ణువు చేతిలోని పుష్పలావికను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆశ్రమాన్ని చుట్టి వస్తున్న వాళ్ళందరి చేతుల్లోనూ రకరకాల వెదురు పువ్వలున్నాయి. పిల్లలు కొందరు వాటిని తలలపైన పెట్టుకుని గెంతుతున్నారు. అందరికీ దొరికిన వెదురుపువ్వులు . . నాకు మాత్రం వొక్కటంటే వొక్కటి దొరకలేదు.
నిస్సహాయంగా నీరసంగా నడుస్తున్న వాడినల్లా దారితప్పాను. కాలిదోవ నన్ను గుడిసెలకు దూరంగా యేదో లోయలోకి తీసుకొచ్చింది. యెవరో మంత్రం వేసినట్టుగా అక్కడ మనుషులెవరూ కనిపించడం లేదు. పెద్ద చింతచెట్టు కింద, వో రాతిపైన కూచున్న వ్యక్తి తదేకంగా తన చేతిలోని వెదురు పువ్వునే చూస్తున్నాడు. దుబ్బుగా పెరిగిన తలవెంట్రుకలతో అతగాడి గడ్డం గూడా కలిసిపోవడంతో అతడి తల పగిలిన బూరగకాయలా కనబడుతోంది. బాగా నలిగిన పాతచొక్కాపైన జేబులతో నిండిన చేతుల్లేని కోటు తొడుక్కుని వున్నాడు.
నేను గబగబా అతడి దగ్గరికి గెంతి “పువ్వెంత?” అని అడిగాను. అతను చూపుల్ని మరల్చకుండా “కొంటావా ?” అన్నాడు.
“అవును. కావాలి. యెంత?…”
“యాభై రూపాయలు…”
“కాదు యిరవయ్యే! అందరూ యిరవైకే కొన్నారు…” అని బేరం చేశాను.
“అయితే యిప్పుడు దీని వెల డెబ్బయ్యి” అన్నాడతను.
అన్ని పువ్వులూ అమ్ముడైపోయాయని తెలియడంతో యీ ఆశపోతు ధరను అమాంతంగా పెంచేస్తున్నాడు. యీ ఆదిమవాసులను గూడా వ్యాపార లక్షణాలు కబలిస్తున్నాయి. కోపంతో పెదవి కొరుక్కుంటూ వెనుతిరిగాను. అయిదు నిముషాల తర్వాత మళ్ళీ దారి తప్పినట్టు తెలుసుకున్నాను. మళ్ళీ పక్కకు తిరిగి మిట్ట పైకెళ్కాను. నది పక్కన ఆగిన లాంచీలు కనిపించాయి. “అందరూ వచ్చేశారా? యెవరైనా గల్లంతయ్యారా?” అని అడుగుతూ సరంగు నాకేసి కన్నుగీటాడు.
లాంచీచెక్క పైకెక్కబోతుండగా యిసుకపైన గడ్డంవాడు కనిపించాడు. బహుశా నాకు పువ్వునమ్మడం కోసమే వాడు మళ్ళీ అక్కడ తచ్చాడుతున్నాడేమోననిపించింది.యెంత డబ్బయినా వెచ్చించి, దాన్ని కొని చంచలకు కానుకగా తీనుకెళ్తే బాగుండుననిపించింది. జేబులోంచీ యాభెతీసి “పువ్వనిచ్చేయి” అన్నాను.
అతను నాకేసి తలతిప్పకుండా “నూరు” అన్నాడు.
“లాంచీ పైన చూడు. యెందరి చేతుల్లో పువ్వులున్నాయో గమనించు. అన్నీ యిరవయ్యే!” అని గదమాయించాను.
“యిది వాటిలా మామూలు పువ్వుకాదు” అన్నాడతను.
“కాక… దేవలోకంలోంచీ దిగొచ్చిందా?” వెటకారంగా అడిగాను.
“అవును. మంత్రాల వెదురుతో చేశాను దీన్ని… యిది భవిష్యత్తును చెప్పే పువ్వు… యే కోరికతో దీన్ని కొంటారో ఆ కోరిక తీరేదైతే యిది రేకులు విప్పుకుని పుప్పిస్తుంది. లేకపోతే యెప్పటికీ మొగ్గగానే ముడుచుకుని వుండిపోతుంది యిలా..” అతడి చూపులు సూటిగా నన్నే గుచ్చుకుంటున్నాయి.
“వెదురు పువ్వేమిటి? వికసించడమేమిటి?” అని నవ్వేశాను.
అతను వెనక్కు తిరిగి “నిన్నెవరు నమ్మమన్నారు? యిప్పుడు దీని వెల నూట యాభై” అన్నాడు.
“త్వరగా పైకిరా… ఆలస్యమైంది” అని అరుస్తున్నాడు సరంగు.
గడ్డంవాడు పువ్వనెత్తుకుని నాట్యం చేస్తున్నట్టుగా నడుస్తున్నాడు. అతడి తలవెంట్రుకలు
గడ్డంతో బాటూ గాల్లో యెగరసాగాయి. వాటి వెనక యేదో తేజస్సు వెలుగుతున్నట్టుగా అనిపించింది. వున్నట్టుండి వాడు మామూలు మనిషి కాడేమోనన్న అనుమానం వచ్చింది. లేకపోతే యితగాడు లోయలో నాకు మాత్రమే యెందుకు కనిపించాడు? యిప్పుడు మళ్ళీ నన్నే యెందుకు సంధించాడు? పెద్ద వంబాలువేసిన తాటిచెట్టులా వుందిగదా అతడి ఆకారం! చొక్కా పాతబడి ఆదివాసీ వాడిదిలా కనబడుతోంది. పైనుండే కోటు మాత్రం అధునాతనంగా వుంది. పైలోకం నుంచీ నన్ను కరుణించడం కోసం దేవతలెవరో పంపిన అసాధారణమైన మనిషా యితను! బహుశా యిది మంత్ర పుష్పమే గావచ్చు. జేబులోంచీ నూటయాభై తీసి “నాపువ్వును నాకిచ్చేయ” అని శరీరమంతా గొంతయినట్టుగా అరిచాను.
గడ్డంవాడి మీసాల చాటున నవ్వేదో కదలాడినట్టు తోచింది. అతడి కళ్ళల్లో నక్షత్రాలు వెలిగినట్టుగా అనిపించింది.
పువ్వును నాకిస్తూ “అయితే వొక షరత్తు” అన్నాడతను. “నీక్కావల్సిన చోటు చేరేవరకూ దీని రేకు గూడా నలగకూడదు. యెంత జాగ్రత్తగా గమ్యాన్ని చేరుస్తావో నీ కోరికలో అంత నిజాయితీ వున్నట్టు లెక్క! దారిలో యిది నిన్నెలా చూసుకుంటుందో దూరంగా వున్న గమ్యం నిన్నలా భావిస్తున్నట్టు తెలుసుకో! గమ్యం చేరాక నన్ను తల్చుకుని ప్రార్ధన చెయ్యి. నీ కోరిక తీరేదయితే యిది నీ చేతుల్లోనే పుష్పిస్తుంది. యీ లోపల దీన్ని బలవంతపెడితే వున్నది గూడా జారిపోతుంది…” గడ్డంవాడు చెబుతూనే వెను దిరిగి, గాలిలో తేలిపోతున్న మేఘంలా నడవసాగాడు.
నేను సంభ్రమంతో బొమ్మలా మారిపోయి నిలబడిపోయాను. సరంగు కేకేయడంతో వులిక్కిపడి, మరబొమ్మలా లాంచీ టాపు పైకెక్కి షామియానా కింద కూర్చున్నాను. గట్టుపైన గడ్డంవాడి జాడకనబడడం లేదు. అవతల ఆగిన లాంచీపైన యాత్రికులు పువ్వులపైన మూగే కంతిరీగల్లా తిరుగుతున్నారు. దూరంగా కనబడుతున్న అడివీ, కొండచరియలూ పటంలోని బొమ్మల్లా నిశ్శబ్దంగా నిలబడిపోయి వున్నాయి.
లాంచీ నదిని కోసుకుంటూ ముందుకు కదిలింది.
రేకుల్లా చెక్కిన వెదురుదబ్బలు పలచగా వున్నాయి. వాటిని కొమ్మలోకి దూర్చిన రంద్రాలు చిన్నవిగా వున్నాయి. పెద్దగా గాలివీస్తే రేకులు వూడిపోతాయేమోననీ, గట్టిగా పట్టుకుంటే నలిగి పోతాయేమోననీ భయం కలుగుతోంది. సంచిలో వుంచితేగూడా నలిగిపోతుంది. యెంతసేపని దీన్నిలా చేతుల్లోనే పట్టుకోవడం?
అవతల కూచున్న చిన్నపిల్లాడొకడు వెదురుపువ్వు రేకులనంతా విరగ్గొట్టి, తుంపలనంతా నదిలోకి విసురుతూ, పెద్దగా నవ్వుకుంటున్నాడు. నా పక్కన కూచున్న యువకుడొకడు రేకులనంతా విడగొట్టి సంచిలోపల సర్దుతూ “యింటికెళ్ళాక మళ్ళీ పెవికాల్‌తో అతికించేస్తాను. దీన్ని పట్టకెళ్ళే పద్దతిదే!” అని తన తెలివి తేటలకు తానే పరవశమైపోతున్నాడు. మరో పెద్దాయిన “బొమ్మ అన్నాక విరగకుండా వుంటుందా? నలిగిపోకుండా వుంటే యింటికి తీసుకెళ్తాను. లేకపోతే యిక్కడే పారేసిపోతాను” అంటూ తన వెదురుపువ్వును సూట్‌కేసులోకి దూర్చేశాడు. నేనుమాత్రం భయంగా పువ్వును నలిగిపోకుండా భద్రంగా గుండెలకత్తుకుని కూచున్నాను. యెవరో “తినండి” అంటూ రెండు తేగలను నాకేసి విసిరాడు. రెండు చేతులతో తేగలు వలిస్తే పువ్వు నెక్కడ పెట్టాలి? నాముందు పడిన తేగలకేసి నిస్సహాయంగా చూశాను. దాహమేస్తోంది. చుట్టూ గోదావరి పొంగి పారుతోంది. సరంగు గదిలో డ్రమ్ములకొద్దీ మినరల్ వాటరుంది. కిందికి దిగి తాగి రావాలంటే పువ్వునెవరిచేతికైనా యివ్వాలి. నా అంత జాగ్రత్తగా దీన్ని పట్టుకునే వ్యక్తి నాకెవరు దొరుకుతారు? పోనీ పువ్వుతో బాటూ నిచ్చెన దిగుదామా అంటే యీదురుగాలికి అది విరిగిపోతుందేమోనని కంగారుగా వుంది. మరి యిది మామూలు పువ్వా? మంత్రపుష్పం! నా ప్రేమలో యెంత నిజాయితీ వుందో నేను దీన్నంత పదిలంగా పట్టుకోవాలి గదా!
మిగిలిన వాళ్ళందరికీ సునాయాసంగా, తక్కువ ధరకు దొరికిన పువ్వ! వాళ్ళేం చేసుకున్నా యిబ్బంది కలిగించని పువ్వు! నాకు మాత్రం పరీక్షలా తయారయ్యిందెందుకు? నా చేతుల్లో క్రమంగా బరువెక్కుతున్నట్టుగా అనిపిస్తున్న వెదురుపువ్వుకేసి కోపంగా చూడసాగాను.
యేడుస్తున్న పిల్లాడినొకడ్ని చంక నెత్తుకున్న స్త్రీ నాముందుకొచ్చి “పిల్లాడేడుస్తున్నాడు. ఆ పువ్వు యివ్వండి” అని అడిగింది జబర్దస్తీగా.
“దీనివెల రెండువేల రూపాయలు” అన్నాను కచ్చగా.
ఆవిడ పక్కున నవ్వేసి “పోదురూ బడాయి! యిదిగో యిరవై… పిల్లాడేడుస్తున్నాడు. యిచ్చేయండి పాపం!” అంది.
“డబ్బుతో దీన్ని కొనలేరు!” అని అరిచాను కోపంగా.
ఆవిడ మరింత పెద్దగా నవ్వేస్తూ “పోనీ వూరికేనే యివ్వండి . . . వీడు యిల్లుపీకి పందిరేస్తున్నాడు. పువ్విస్తేగానీ వూరుకోడు” అంది,
“యిది పిల్లలకోసం కాదు. యిది మామూలు పువ్వగాదు అని వుక్రోశంగా దబాయించాను. చంచలను మామూలు స్త్రీగా భావించిన వాళ్ళెందరో వున్నారు. ఆమె సాధారణ స్త్రీ గాదు. చంచల మూర్తీభవించిన ప్రేమ అనే భావన. ఆనంద తీరాలకు చేర్చే కాల్పనిక నావ…
“కాకపోతే బంగారుపువ్వా యిది? వీడప్పుడు వూరుకున్నాడు. యిప్పుడు ప్రాణం తీస్తున్నాడు. లేకపోతే పదికొని పారేసేదాన్ని… మిమ్మల్ని గాదు అనాల్సింది. యీ పిచ్చిపువ్వుల్ని అమ్మిన పిచ్చిగుంట్ల వాళ్ళని…”
“వూరుకోండి” పెద్దగా గొంతు చించుకున్నాను. “దీన్ని అమ్మినవాడు ఆదివాసీగాడు… వాడు.. వాడు ఆయన… ఆయన…”
ఆవిడ కళ్ళార్పడంసైతం మరచిపోయి నాకేసి విస్తుపోయి చూస్తూ “కొందరికి వయస్సొస్తుంది గానీ…” అని సాగదీస్తూ వెళ్ళిపోయింది.
డబ్బుతో చంచల ప్రేమను కొనగలమనుకున్న వాళ్ళు నాకు గుర్తుకొచ్చారు. అదెందుకో, ఆమె వాళ్ళందరినీ కాదని నాకు దగ్గరయ్యింది. కానీ అప్పుడప్పుడూ వాళ్ళ దగ్గరినుంచీ ఆమెకు వుత్తరాలూ, సందేశాలూ అందుతున్నాయని నాకు అనుమానంగా వుంది. వాళ్ళురాసిన వుత్తరాలు కొన్నినా కళ్ళబడ్డాయి గూడా! అయితే వాటిని నేను చూసే లోపల చంచల తీసి దాచేసింది. యింతకూ ఆమెకు మరెవరితోనూ స్నేహం లేదా? ఆవిడకున్న యేకైక ప్రేమికుడ్ని నేనొక్కడినేనా ? యిప్పుడీ పువ్వును వేరెవ్వరూ కొనకుండా జాగ్రత్తపడుతున్నాను గదా! కాబట్టి ఆమె ‘పేమను దక్కించుకున్న యేకైక వ్యక్తిని నేనే! వెదురుపువ్వుకేసి ఆపేక్షగా చూడసాగాను.
పిల్లాడి తల్లి అన్నట్టుగా ఆ గడ్డం వాడు సాధారణమైన ఆదివాసీ కాడుగదా! లేకపోతే మరో లాంచీలో వచ్చిన యాత్రికుడేమో! పువ్వును కొనాలనుకునే నా ఆత్రుతను చూసి నాతో యిలా ఆట్లాడుకున్నాడేమో! యిప్పుడు నేనుగూడా ఆ పిల్లాడి తల్లితో ఆడుకున్నాను గదా! మళ్లీ నా చేతిలోని వెదురు పువ్వు రాతిదిమ్మెలా బరువెక్కుతున్నట్టుగా తోచింది. వెంటనే గడ్డం వాడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. దారిలో యిది నన్నెలా పరీక్షిస్తుందో దూరంగా వున్న గమ్యం నన్నలా గమనిస్తున్నట్టు లెక్క! బహుశా నేను చంచల ప్రేమను పట్టించుకోవాల్సినంత గౌరవంగా పట్టించుకోవడం లేదేమో! నేను
ప్రేమించిన స్త్రీలు కొందరు లేకపోలేదు. కానీ వాళ్ళెవరూ నన్ను ఆదరించలేదు. చంచల కాస్త చనువివ్వడం చేత నా ప్రేమకొక ఆలంబన దొరికింది. లేకపోతే… కంగారుపడుతూ వెదురుపువ్వును గట్టిగా పట్టుకున్నాను.
నదినీళ్ళను వెనక్కు నెడుతూ లాంచీ ముందుకెళ్తోంది. గోదావరి రెండుగట్లపైనా కొండలూ, అడవులూ వెనక్కు పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. లాంచీ టాపు రకరకాల మనుషుల్ని ప్రదర్శించే జంతు ప్రదర్శనశాలలా తయారయ్యింది. నలుగురు కుర్రాళ్ళు పరిసరాల్ని మరచిపోయి పేకాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు గుంపుగా చేరి చీరల ధరవరలు తెలుసుకుంటున్నారు. నడివయస్సు మగవాళ్ళు కొందరు నిన్నటి దినపత్రికలోని వార్తల్ని చర్చించుకుంటున్నారు. యిదేమీ పట్టించుకోకుండా చిన్నపిల్లలు కొందరు అంత్యాక్షరి ఆడుకుంటున్నారు. నా మనస్సంతా పువ్వు చుట్టే తిరుగుతోంది.
నాకోసారి టాయిలెట్ కెళ్ళాల్సిన అవసరం వస్తోంది. టాపుదిగి, పైనుండే కమ్మీని పట్టుకుని, లాంచీ సన్నటి అంచుపైన జాగ్రత్తగా పాకుతున్నట్లుగా నడిస్తేగాని బాత్రూం చేరడం సాధ్యంగాదు. వెదురుపువ్వుతో బాటూ వెళ్ళడం కష్టం. దాన్ని మరెవరికైనా అప్పగించడం యిష్టంలేదు. అంతకంటే కాస్సేపు టాయ్‌లెట్ కెళ్ళకుండా కూచోవడమే మంచిది. పకృతి పిలుపు యిబ్బందికరంగానే వుంది. బహుశా చంచల మరేదో ఆకర్షణ వైపుకు మళ్ళకుండా వుండడానికి తెగప్రయత్నం చేస్తూ వుండివుంటుంది. అందుకే నాకీ యాతన! యిక్కడ నేనెంత పట్టుదలగా వుంటానో, అక్కడ ఆమె అంత నిజాయితీగా వుంటుంది. చుట్టూవున్న నదీ, అడివీ, పర్వతాలూ, సర్వప్రపంచమూ మాయమై పోయినట్టుగా అనిపించసాగింది నాకు. యిప్పుడు నాకు నిజాలుగా కనబడుతున్నవి రెండే! వొకటి వెదురుపువ్వు, రెండోది టాయిలెట్… వేదిస్తున్న మెలకువలా టాయిలేట్… వూరిస్తున్న కలలా వెదురుపువ్వు… ఆగని కాలంలా నది… దాన్ని కొలుస్తున్న కొయ్యలోలకంలా లాంచీ…
నా చేతిలోని పువ్వు కేసి చూపెడుతూ పిల్లాడింకా యేడుస్తున్నాడు. చంచల ప్రేమ కోసం అర్రులు చాస్తూ తంటాలు పడిన కారుషోకిలా గుర్తుకొచ్చాడు. వాడికి గూడా చంటిపిల్లాడికిలా కావాలన్నది దొరకలేదు. నాకు మాత్రమే దొరికిందది. మళ్లీ వెదురుపువ్వు దూ తేలికవుతున్నట్టు తోచింది.
భోజనాలు తినడం కోసం లాంచీని గట్టుకు తీసుకెళ్తున్నామని సరంగు ప్రకటించాడు. పకృతి పిలుపు వినడంకోసం అందరికంటే ముందుగా పైకిలేచి ముందుకు పరిగెత్తాను. లాంచీలోంచీ గట్టుపైకి చెక్కను వేయగానే దానిపైకి గెంతాను. తొందరలో తూలి నీళ్లల్లోకి పడ్డాను. పువ్వు తడవకుండా చేతిని పైకెత్తి పట్టుకునే మూడు మునకలేశాను. సరంగు పెద్దగా అరుస్తూ దూకి, చొక్కాపట్టుకుని నన్నుపైకి లాగాడు. పడవలోని వాళ్ళంతా నన్ను మందలించసాగారు. చలిగాలికి తడిసిన వళ్ళంతా వణకసాగింది. నేను యెవరినీ పట్టించుకోకుండా, తడవని పువ్వునలాగే పైకెత్తుకుని, యిసుకదిబ్బలకేసి పరిగెత్తాను.
తప్పనిసరై వెదురుపువ్వును కాస్సేపు యిసుకపైన పెట్టాను. పొరబాటున నేలపైన పెట్టినప్పుడు అలాగే పాతుకుపోయిన శివలింగం కథ గుర్తుకొచ్చింది. పరుగునా వెళ్ళి చేతికి తీసుకోగానే వూడివచ్చిన వెదురు పువ్వుపైన చెప్పలేనంత ప్రేమ పుట్టుకొచ్చింది. నేనోసారి తమాషాకేదో అంటే చంచల ముఖం ముడుచుకుని వెళ్ళిపోయింది. రెండురోజులు వెతికినా కనిపించలేదు. యిక నా ముఖం చూడదేమోనని బాధపడసాగాను. తిండీతీర్థాలు మరచిపోయి పిచ్చివాడైపోయి తిరగసాగాను. మూడోరోజు కనిపించినప్పుడు ఆమె నవ్వుతూ పలకరించింది. యేదో పనిపైన వూరెళ్ళిందట! చెప్పకుండా వెళ్ళినందుకు బాధపడసాగింది. అనవసరంగా యేవేవో వూహించుకుని బాధపడిన నాపైన నాకే కోపం వచ్చింది.
“యింతమెల్లగా తింటే చీకటి పడిపోతుంది. భద్రాచలం చేరలేం!” అని కసిరాడు సరంగు.
నేను గబగబా రెండు ముద్దలు మింగి, యెంగిలి పళ్ళాన్ని లాంచీలోపలి వంటగదిలోకి విసిరేశాను. పువ్వును జాగ్రత్తగా పట్టుకుని లాంచీటాపుపై కెక్ళాను. అక్కడ కూచున్న వాళ్ళంతా నన్నూ, నా చేతిలోని పువ్వునూ వింతగా చూస్తున్నారు. బహుశా నన్ను పిచ్చివాడనో, వున్మాదనో అనుకుంటున్నారేమో! చంచల ప్రేమను పొందడంకోసం నేనెన్ని వింతవింత సాహసాలు చేశానో జ్ఞాపకం చేసుకున్నాను. వూళ్ళోవాళ్లంతా నన్ను చూసి యెగతాళి చేసేవాళ్ళు. అంతమాత్రానికే నీరు గారిపోతే చంచల దక్కుతుందా? లాంచీలోని ప్రయాణికులంతా నన్ను వెలివేసినట్టుగా పలకరించకుండా కూచున్నారు. నేనుగూడా వాళ్ళను గమనించకుండా పువ్వుతో మాట్లాడుతున్నట్టుగా కూచున్నాను. గాలికి వెదురు పువ్వు రేకులు మెల్లగా కదులుతున్నాయి, కనిపించీ కనిపించకుండా దొర్లే చంచల నవ్వులా.
చంచల యేవిషయమూ స్పష్టంగా చెప్పదు. ‘ప్రేమించమంటే పెళ్ళి చేసుకోవాలని లేదా అని రెట్టిస్తుంది. పెళ్ళిచేసుకుందామంటే ప్రేమ అవసరం లేదా అని కళ్ళెర్రజేస్తుంది. ఆమె నాది అవుతుందా, కాదా అన్న ప్రశ్నతో యిన్నాళ్ళూ వేగిపోయాను. యిప్పుడీ పువ్వు మహిమ పుణ్యమా అని నిజం తెలుసుకోబోతున్నాను. నీళ్ళల్లో తప్పించుకునే జెళ్ళపిల్లలా ఆమె యిన్నాళ్ళూ జారుకుంది.
యికపైన నా ప్రేమపంజరంలోకి వచ్చి చేరుకుంటుంది.
ఆలోచనల్లో పడివేగుతూ పడవ ఆగడాన్ని గమనించలేకపోయాను. యాత్రీకులంతా లాంచీ పైన్నుంచీ వొడ్డుపైకి దిగి, కొండచరియలాగున్న పెద్దమిట్టపైకి చీమల్లా పాకుతున్నారు. అందరూ దిగాక, సూట్‌కేసునెత్తుకుని, మరో చేత్తో పువ్వును పట్టుకుని టాపుపైన్నుంచీ దిగాను. కొయ్యపైన్నుంచీ వస్తూండగా జారి వారిగిపోతున్న నన్ను చివాలున పట్టుకున్న సరంగు “పాడుపువ్వు! పడిపోతున్నా వదలవా దాన్ని నువ్వు” అని గదమాయించాడు.
రెండు చేతులతోనూ రెండు వస్తువుల్ని పట్టుకుని మిట్టపైకెక్కడం చాలా కష్టంగా వుంది. ఆదివాసీ వొకతను దగ్గరికి రాగానే “యిరవై” అన్నాను. అతను “యాభై” అన్నాడు. మారుమాటాడకుండా సూట్‌కేసును అతడికిచ్చి పువ్వుతోబాటూ పైకి నడచాను.
కొండవాలుపైన బాటలో రెండు బస్సులున్నాయి. బస్సులనిండా జనాలు బస్తాల్లా కూరుకుపోయివున్నారు. “లాంచీలు భద్రాచలం వరకూ వెళ్ళవు. యీ రెండు బస్సులూ వెళ్ళిపోతే రాత్రికి యిక్కడే వుండాలి. అందరూ సర్దుకోండి” అని వో యాత్రికుడు హెచ్చరిస్తున్నాడు. నేను కాస్సేపు తటపటాయించాక సూట్‌కేసును బస్సు టాపుపైకి చేర్పించాను. డ్రైవరు తలుపు ‘దగ్గరికెళ్ళి “ఆ దారిలో యెక్కే చోటులేదు. మీరు దయచేసి కాస్త తలుపుతీస్తే యిలాయెక్కి ఆ బాయినెట్ పక్కన నిల్చుంటాను” అన్నాను వీలయినంత దయనీయంగా. డ్రైవరేమనుకున్నాడో తెలియదుగానీ, మౌనంగా తలుపు తెరిచాడు. ఆ తలుపు బాగా యొత్తులోవుంది. పువ్వును డ్రైవరు చేతికిచ్చి గబగబాపైకి యెగిశాను. నల్లగా మొరుటుగావున్న అతగాడి చేతుల్లో నా పువ్వు నలిగిపోతుందేమోనని హడలిపోయాను. పెద్దగా అరుస్తూ దాన్నిలాక్కున్నాను.
“భలే పువ్వును చూశావులే! యిక్కడి ఆదివాసీలు పదిరూపాయలకు రెండిస్తారి లాంటివి” అని డ్రైవరు విసుక్కున్నాడు.
నా వెదురుపువ్వును యితగాడు మామూలు పువ్వని అనుకుంటున్నాడు. చంచలను గూడా సాధారణమైన స్త్రీ అని చాలామంది అనుకున్నారు. అయినా, నా కళ్ళతో చూస్తేగదా వాళ్ళకు నిజం తెలిసేది!
బస్సోసారి వెనక్కూ ముందుకూ వూగింది. నేను విసురుకుపోయి గేర్‌రాడ్‌పైన పడ్డాను. తలపైన్నుంచీ రక్తం బొటబొటా కారసాగింది. పక్కనున్న ప్రయాణీకుడు గొల్లుమన్నాడు. మరో యాత్రికుడు తన రుమాలును తడిపి నా తలకు కట్టుగట్టాడు. నవ్వుతూ నిల్చున్న నాకేసి విస్తుపోయి చూస్తూ “ఫస్టెయిడ్ బాక్సు ఖాళీగా వుంది. భద్రాచలంలో డ్రస్సెంగ్ చేయించి, యింజెక్షను వేయించుకోండి” అన్నాడు. డ్రయివరు. యింతజరిగినా నా చేతుల్లో నలగకుండావున్న పువ్వుకేసి సంతృప్తిగా చూస్తూ నేను బాయినెట్‌పైన కూచున్నాను.
అప్పుడప్పుడే పరచుకుంటున్న చీకటి తెరల్ని దీపాలతో చీల్చుకుంటూ బస్సు బయల్దేరింది. బస్సులోపల జనం పెద్దగా గగ్గోలు చేస్తున్నారు. డ్రైవరుముందు దేవుడి ఫోటోలోంచీ వెలుగుతున్న దీపపు వొంటరి కాంతిరేఖ వెదురుపువ్వుపైన మాత్రమే పడుతోంది. బస్సును నడుపుతున్న డ్రైవరూ, బాయినెట్‌పైన కూచున్న నేనూ, నా చేతిలోని పువ్వూ మాత్రమే మౌనంగా వున్నాం. యీ పువ్వును చేతికి తీసుకోగానే మౌనంగా నవ్వే చంచల కళ్ళే నాముందు వెలుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. నా ఆలోచనలు కాలాన్ని సంకోచింపజేస్తున్నాయని తెలిసేలోగా బస్సు భద్రాచలం చేరింది.
బస్సు దిగుతూనే యాత్రికులు గుడికి పరిగెడుతున్నారు.
డ్రైవరు నన్ను పట్టించుకోకుండా దిగిపోయాడు.
బస్సుపైన్నుంచీ సామాన్లనందిస్తున్న కూలీ చేతుల్లోంచీ యెవడో నా సూట్‌కేసు తీసుకుని వుడాయిస్తున్నాడు.
“దొంగ…దొంగ” అంటూ పువ్వును చేతబట్టుకునే వాణ్ణి వెంబడించాను. వాడు జనాల్లో కలిసిపోయాడు.
సూట్‌కేసులో రెండుజతల దుస్తులూ, షేవింగ్‌కిట్టూ, శాలువా, మఫ్లరూ, తువ్వాలూ వున్నాయి. డబ్బుల్ని సూట్‌కేసులో పెట్టకపోవడం మేలయ్యింది. యీ ప్రపంచమంతా మునిగిపోయినా పర్వాలేదు. చంచల ప్రేమవొకటి దక్కితే నాకంతే చాలు! అది దక్కుతుందో లేదో చెప్పే యీ పువ్వొక్కటి మిగిలితే అదే పదివేలు!
గుడిముందున్న అంగళ్ళ దగ్గరికెళ్ళి పువ్వును పేక్ చేయడానికి అట్టపెట్టె కావాలని అడిగాను. అంగడివాడు వో చెక్కపెట్టె చూపెట్టి “యీ బొమ్మతో బాటూ అయితే యిది వూరికే యిస్తాను. పెట్టెమాత్రమే కావాలంటే రెండువందలు” అన్నాడు. అతడికి రెండు వందలిచ్చి వెదురుపువ్వును చెక్కపెట్టెలో పెట్టి జాగ్రత్తగా పేక్‌చేయించాను. “మీ తలకు గాయమై వుంది. పక్క వీధిలో డాక్టరున్నాడు. తొందరగా వెళ్ళండి” అన్నాడతను.
డాక్టరుగారి అనవసరపు సందేహాలకంతా జవాబులు చెప్పి, నూర్రూపాయలు వదిలించుకుని, తలకు కట్టుతో బాటూ బయటపడేసరికి గంట తొమ్మిదయ్యింది. గుడితలుపులు మూసేశారని తెలిసింది. దేముద్ని చూడకపోయినా పర్వాలేదు. యెంత త్వరగా వీలయితే అంత త్వరగా యీ వెదురు పువ్వును చంచలకిస్తే చాలు. నా ఆలోచనలను మన్నిస్తున్నట్టుగా స్టాండులో మా వూరికెళ్ళే బస్సొకటి కనిపించింది. వెదురుపువ్వు పాకెట్టును రాత్రంతా వాళ్ళోనే పెట్టుకుని, పువ్వును చేతికి తీసుకోగానే వెలిగిపోయే ఆమె ముఖాన్నీ, నా చేతుల్లో వికసించబోయే పువ్వునూ వూహించుకుంటూ రాత్రంతా ప్రయాణంలో కునికిపాట్లుపడ్డాను.
నాతో పోటీ పడుతున్నట్టుగా సూర్యుడు నాకంటే ముందుగా మావుూరికి చేరుకున్నాడు. బస్సుదిగుతూనే నేరుగా చంచల యింటికే వెళ్ళాను. “అమ్మగారు పనిపైన బయటికెళ్ళారు. యిప్పుడే వచ్చేస్తానన్నారు” అంది తలుపులు తెరిచిన పనిపిల్ల, నేను డ్రాయింగ్ రూంలోకెళ్ళి, వెదురుపువ్వు పాకెట్టును నాముందున్న టీపాయ్‌పైన పదిలంగా పెట్టి, సోఫాలో కూచున్నాను. చంచల యొప్పుడైనా రావచ్చు. వెదురుపువ్వు పదిలంగా గమ్యం చేరింది. యిక చంచల ప్రేమ దొరకదనే భయంలేదు. రాత్రంతా నిరీక్షిస్తూ, నిద్రో మెలకువో తెలియని స్థితిలో గడిపిన నాకు, అప్పుడు పెద్దగా ఆవులింత పుట్టుకొచ్చింది. విజయగర్వంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాను. యెప్పుడు నిద్రలోకి జారుకున్నానో,అలా యెంతసేపు నిద్రపోయానో నాకే తెలియదు.
స్పష్టాస్పష్టంగా మెలకువరాగానే, టీపాయ్‌పైన రేకులు విప్పుకున్న వెదురుపువ్వు ఆకృతిని పొందుతున్న వూహలా కనిపించింది. నా నిద్రంతా యెటో యెగిరిపోయింది. పువ్వు పక్కన దాన్నంతవరకూ కాపాడిన చెక్క పాకెట్టు కకావికలుగా పడివుంది. బహుశా పువ్వు విరియడంతో పాకెట్టు చిరిగిపడిపోయిందేమో! గమ్యం చేరిన తర్వాత కాస్సేపు తనను తలచుకుని ప్రార్ధన చేయమన్నాడు గదా గడ్డంవాడు? యీ లోగానే పువ్వెలా పుష్పించింది? బహుశా నాప్రేమ అంత తీవ్రమైందీ, బలవత్తరమైందీ అయివుండవచ్చు. లేకపోతే చంచల నన్నంత గాఢంగా ప్రేమిస్తోంది గాబోలు!
“అంతదూరం వెళ్ళి నాకోసం తీసుకొచ్చింది యీ వెదురుబొమ్మనా? దీనికేమైనా రంగూ వాసనా అయినా వున్నాయా?” చంచల గొంతు వెనకనుంచీ పిడుగులా వురిమింది.
నేను నవ్వడానికి ప్రయత్నించి “యిది మామూలు పువ్వగాదు” అన్నాను.
“మాయల మంత్రాలపువ్వా అయితే? కనీసం దాని రేకులు వంచి పుష్పించిన పువ్వుగానైనా తయారుచేయాలని తెలియదు నీకు! ఆపని గూడా నేనే చేయాలా?” ఆమె పెద్దగా కసురుకుంది.
“దాని రేకుల్ని బలవంతంగా వంచింది నువ్వా? యెంతపని చేశావు చంచలా?” గుండెలపైన దెబ్బ తగిలినట్టుగా విలవిలలాడి పోసాగాను. “దాన్నలా బలవంతంగా విప్పితే… వంచితే…”
“యేమవుతుంది? ఆ వికారమైన బొమ్మకు కొంచెమైనా అందం వస్తుంది”.
“అదిగాదు.. గడ్డంవాడేం చెప్పాడో తెలుసా?… మరి… మరి” నా మాటలు తడబడ్డాయి. పువ్వుతనంతట తానుగా పుష్పించేలోగా యెదురయ్యే పరిణామాలకంతా కారణమేమని చెప్పాడా గడ్డంవాడు? చంచల నాపైకి తెలివిగా వలవిసురుతోందా?
“ఆ గడ్డంవాడెవడు మధ్యలో? వెదురుబొమ్మను భద్రంగా యెలా తీసుకురావాలో తెలియదా నీకు? దాని రేకులు రెండు బాగా వంగిపోయివున్నాయి. అందుకే అన్ని రేకులనూ వంచి అందంగా తయారు చేశాను. .” అంది చంచల.
నా ప్రయత్నంలోనే లోపం వుందని చెబుతోందా ఆమె? లేకపోతే తాను చేసిన పనికి నా అజాగ్రత్తే కారణమని నిరూపించి, తాను తప్పుకోవడానికి ప్రయత్నిస్తోందా?
“అదిగాదు చంచలా! యిదంతా పెద్దకథ…” అన్నాను నీరసంగా.
“నువ్వెప్పుడూ కథలే గదూ చెప్పేవి? నీ మాటల్నెవరు నమ్ముతారు?” అందామె తియ్యగా నవ్వుతూ.
“కథంటే కథగాదు… నిజం…పచ్చినిజం…” అని గొంతుసవరించుకున్నాను.
“నువ్వు చెప్పే నిజాలకంటే ఆ కథలే మేలు… అవే చెప్పు…” అందామె వోరగా చూస్తూ. _ గడ్డంవాడ్ని గంధర్వుడే అని అనుకుంటే నా ప్రేమ సఫలంగాలేదని చెప్పవలసివుంటుంది. అతడ్ని మామూలు మనిషిగా భావిస్తే నా ప్రయత్నమంతా అవివేకంగా తయారవుతుంది. నేను తనను అనుమానిస్తున్నానని చంచల అనుకుంటే నా గతేంకాను? చంచలకేమని చెప్పాలి నేను?
మేమిద్దరమూ ప్రేమ అన్న భావనను మాత్రమే ప్రేమిస్తున్నామా? నిజానికి మా యిద్దరి ప్రేమల్లోనూ నిజాయితీ లేదా?
సత్యాసత్యాలతోనూ, నిజానిజాలతోనూ, కల్పనావాస్తవికతలతోనూ తయారుచేసిన బొమ్మలా బలవంతంగా విరిసిన వెదురుపువ్వు నాకేసి జాలిగా చూడసాగింది.
* * *
కథానేపథ్యం
మధురాంతకం నరేంద్ర
మధురాంతకం నరేంద్ర తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కథా రచయిత. కుంభ మేళా, అస్తిత్వానికి అటూ ఇటూ, వెదురు పువ్వు,, రెండేళ్ల పధ్నాలుగు మొదలైన కథా సంకలనాలతో పాటు 'కొండకింద కొత్తూరు', 'భూచక్రం', మనోధర్మ పరాగం వంటి నవలలు వెలువరించారు. 'మనోధర్మ పరాగం' నవలకి 'ఆటా' బహుమతి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు.
చాలా బావుంది
అపురూప కథగా ఎందుకు ఎన్నిక చేశారో ప్రతి కథకీ నిర్వాహకుడు కనీసం పది లైన్ల తన అభిప్రాయాన్ని కథ మొదట్లోనే రాస్తే పాఠకులు ఆసక్తిగా కథను చదివే అవకాశం వుంది. అంతే గానీ అపురూప కథ అని ఉత్తినే కథ ఇస్తే సరిపోదు. కథలోని పాత్రలను, ఇతివృత్తాన్ని.. సమకాలీన జీవితానికి ఆ కథ ఎలా ప్రతిబింబమయ్యిందో.. వగైరా విషయాలను క్లుప్తంగా రాస్తే మంచిది.
కథచాలా బాగుంది.