అనాహత నాదం

Spread the love

ముహూర్తపురోజు కావడంతో సీర్గాళి కొత్త బస్ స్టేషనులో బస్సులు శుభకార్యాలకు వెళ్ళే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్ స్టేషనులోని వేపచెట్టు కింద ఓ యువతి తన ఎదురుగా నిలబడివున్న వ్యక్తితో చేతులాడిస్తూ ఏదో చెబుతుంది. ఆకులు లేని నాదస్వరంలా ఆమె వాలుజడ, ఆమె ప్రతి కదలికకు తుళ్ళిపడుతోంది. దానిని కాలక్షేపంగా చూస్తున్న స్వామినాథన్‌ ధ్యాసను చెరిపేవిధంగా వచ్చిన హార్న్ శబ్దం విని ముఖం తిప్పి చూశాడు. చిదంబరం నుండి కుంభకోణానికి వెళ్ళే బస్సు అత్యంత వేగంతో బస్ స్టేషనులోకి ప్రవేశించింది. రద్దీ ఎక్కువ కావడం వలన కొద్ది క్షణాలు కూడా బస్సు, స్టేషనులో ఆగదు అని గ్రహించి బస్సు వైపు దూసుకువెళ్ళాడు.

బస్సు మెట్లపై పంచెలు, ప్యాంట్లు ఎక్కే దారికి అడ్డంగా నిలుచున్నాయి. స్వామినాథన్‌ పంజా విసిరే పులిలా పరుగున వచ్చి ఎక్కాడు. అతడు అలా అందుకోగానే అది సైడ్ మిర్రర్ నుండి గమనించిన డ్రైవర్, “ఏమయ్యా… నా బండి కిందపడి చావాలని నీకు ఏమైనా మొక్కుబడా?” అని అరిచాడు. అది స్వామినాథన్‌ చెవికెక్కలేదు. అయితే, అది విన్నవారందరూ ఒక్క క్షణం స్వామినాథన్ వైపు వెటకారం కలగలిపిన చూపుతో చూశారు.

బస్సు కదలడం మొదలవ్వగానే గుమిగూడిన జనాల నుండి వచ్చిన చెమటా, దుమ్మూ కలగలిపిన ఉక్కపోత కంపు ముక్కుపుటలను తొలిచేసింది. ఒకరి కాలుకు తగలకుండా ఇంకొకరు కాలు పెట్టుకోవాల్సిన తొక్కిసలాటలో తొడుగు ధరించిన నాదస్వరంతో నిలబడలేక తడబడుతూ నిలబడ్డాడు.

పైనున్న కడ్డీని గట్టిగా పట్టుకున్నాడు. కడ్డీలో రంధ్రాలు ఉన్నట్లు ఊహించుకుని ‘సరిగమపదనిస’ అని వేళ్ళతో నాదస్వరం పట్టుకున్నట్టుగా భావించి మనసులోనే ఒక రాగాన్ని ఆలాపన చెయ్యసాగినవాడు కాస్తా కరెంటు తగిలినవాడిలా ఒక్కసారిగా చేతిని వెనక్కి లాక్కున్నాడు.

వెనుక నుంచున్న పెద్దాయన అతడి భుజాన తగిలించిన తొడుగుతోనున్న నాదస్వరంతో, అంతక్రితమే పరిచయమున్న వాడిలా అధికారంగా అందుకుని లగేజీ పెట్టే చోట్లో ఎత్తి పెట్టాడు. “దిగేటప్పుడు తీసుకోవచ్చు, శ్రమపడమాకండి” అని అన్నాడు.

‘తన కుటుంబంలోని సకల సౌభాగ్యాలకు, వైభవానికి కారణమైన నాదస్వరం తనని వదిలి శాశ్వతంగా విడిపోవడాన్ని ప్రస్తుతం ఒక చిన్న ఎడబాటు ద్వారా ఒద్దిక చూస్తున్నాను…’ 

‘ఈ వంశంలో నాదస్వరాన్ని అమ్మిన ఏకైక వ్యక్తిని నేనే అన్న అపప్రధను మూట కట్టుకోవచ్చు. అయినాసరే, ఆ అపప్రధ కంటే కూడా పిచ్చిపట్టి చావకుండా ఉండటమే ముఖ్యం’ అని అనుకున్నాడు.

కండక్టర్ టికెట్ ఇచ్చి ముందుకు వెళ్ళాడు. రెండు స్టాపుల తర్వాత ముందు సీటు నుండి ఒక కుటుంబం దిగగానే, అతడికి కూర్చునేందుకు చోటు దక్కింది.

పైన పెట్టిన నాదస్వర తొడుగును చూస్తుంటే, దుప్పటిని దగ్గరకు లాక్కుని కప్పుకుని పడుకున్నట్టు నటించే పిల్లాడిలా అనిపించి, తనలో తను నవ్వుకున్నాడు. సెలవులకు వచ్చిన పిల్లాడు మెలకువలో ఉంటే ఊరుకు వెళ్ళేందుకు మొరాయిస్తాడని, పడుకున్నాక తీసుకువెళ్ళడం జరుగుతుంది అనే ఆలోచన అతడిని ఉద్విగ్నతకు గురి చేసింది.

అప్పటికప్పుడు తొడుగుతోనున్న నాదస్వరాన్ని తీసే అవకాశం లేదనిపించింది. రెండు స్టాపుల తర్వాత దించి ఒడిలో పెట్టుకోవాలనుకున్నాడు. పక్కనున్న వ్యక్తి సీటు నుండి కాస్త పక్కకు జరిగి కూర్చునున్నాడు. స్వామినాథన్ కూర్చున్న వైపునున్న కిటికీని పగులగొట్టుకుని బయటపడేట్టు మెలికలు తిరిగిన ఓ వ్యక్తి ఎదురుగానున్న సీటు కడ్డీని పట్టుకున్నాడు. నుంచున్నప్పటి కంటే కూర్చున్నప్పుడు మరో రెండింతలు రద్దీ ఎక్కువగా కనబడింది. కిటికీ గుండా బయటకు తొంగి చూశాడు. చల్లగాలి తలను నిమిరింది. తలవెంట్రుకలు నిక్కబొడుచుకుని గాలికి సలాం చేస్తున్నట్టు ఎగసిపడుతున్నాయి. అలసటతో నిద్రలోకి జారుకున్నాడు.

అతని తండ్రి, తాతయ్య సుప్రసిద్ధ నాదస్వర కళాకారులు. వేర్వేరు కాలమానాల్లో ఆరుగురు పిల్లలు స్వామినాథన్‌ కంటే ముందే పుట్టి చనిపోయారు. ఏడవ సంతతిగా స్వామినాథన్ జన్మించేనాటికి అతడి తండ్రికి యాభై ఐదేళ్ళ వయస్సు.

కంటికి అక్షరాలు కనబడకుండా పోయేలోపు తను నేర్చిన కళను కొడుకుకి నేర్పించాలనుకున్నాయన ముందుగా అతడికి స…ప…స…లు నేర్పించసాగాడు. ఒక వేకువజామున సరళి స్వరాలు నేర్పిస్తున్న ఆయన ఎడమవైపు గుండెను పట్టుకుని నేలపై ఒరిగినవాడు కాస్తా ఆ తరువాత తిరిగి లేవనేలేదు.

తండ్రి మరణాంతరం స్వామినాథన్ నాదస్వరం అభ్యసించేందుకు తలచంగాడ్‌లోని ఒక విద్వాన్ దగ్గరకు పంపిచబడ్డాడు. ఒకరకంగా అతడు స్వామినాథన్ తండ్రివైపు బంధువు కావడంతో స్వామినాథన్‍పై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని నేర్పించాలి అనుకున్నాడు. అయితే, స్వామినాథన్‍కి మాత్రం అది అభ్యసించడం భాష తెలియని ఊరిలో దారి వెదుకుతున్న తీరున వుంది.

తలచంగాడ్‌లోని ఆ విద్వాన్ నాదస్వరం నేర్పించడంలో నిపుణుడు. ఆయన విద్యార్ధులు ప్రపంచమంతటా ఉన్నారు. ‘ఆయన దగ్గర ఉంటేనే చాలు, పిల్లలు మేధావులయిపోతారు, అంతటి హస్తవాసి గలవాడు’ అనే పేరు కూడా ఆయనకు ఉండేది.

తలచంగాడ్‌ విద్వాన్ సరళి స్వరాలనే వేల సంఖ్యలో రూపొందించాడు. అభ్యసించే విద్యార్ధుల హస్తలాఘవానికి తగినట్టు నేర్పిస్తాడు. మిగిలిన విద్యార్దులు ఒక్కొక్క దశగా గ్రహించి మననం చేస్తుంటారు. స్వామినాథన్‍కి మాస్టారు నేర్పించిన దానిని చెప్పమని అడిగిన ప్రతిసారి అతడి మనసును ఒక నల్లని రాక్షస తెర కమ్ముకుంటుంది. అటువంటి వేళల్లో అతని చెమట పట్టిన అరచేతిలో ఎర్రని గీతలతో తట్లు తేలేలా మాస్టారి బెత్తంతో రోజూ ‘చళ్…చళ్’ మని దెబ్బలు పడుతూనే ఉంటాయి.

దెబ్బలు, తిట్లు ఒకడికి ఏదీ నేర్పించలేదు. అందుకు ప్రత్యమ్నాయంగా జిజ్ఞాస, అంతఃప్రేరణ మాత్రమే దేనినైనా పెంపొందిస్తాయని బాగా ఎరిగిన తలచంగాడ్‌ విద్వాన్, అతడి తల్లిని పిలిపించి, “ఈ పిలగాడికి సంగీతం అబ్బదు. ఇతడికి నాదస్వరం నేర్పిస్తే నేను ఆసుపత్రి పాలుకావడం ఖాయం. వాడిని ఇంకేదైనా పనిలో పెట్టండి…” అని అన్నాడు. తల్లికి అది భరించలేని శోకం.

గణిత పాఠాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆంగ్ల పదాలను గ్రహించగలిగితే, బడికి మళ్ళీ వెళతానని అనొచ్చు. కానీ బడి అన్న ఆలోచనే అతని శరీరాన్ని పట్టి కుదిపేస్తుంది.

ఇటువంటి పరిస్థితుల్లో ఊరికి రాగానే నాకిది వద్దు, కావాలి అని తల్లికి కరాఖండిగా ఏమీ చెప్పలేక అమ్మ తనంతట తానే ఒక నిర్ణయానికి రానివ్వని అని ఎదురుచూశాడు. పిల్లవాడు ఇలాగే ఉంటే పిట్టగోడమీద ఒదిగిన కోడిలా స్తబ్దుగా అయిపోతడేమోనని తల్లి కలవరపడింది.

అతని తండ్రి స్నేహితుడు ఒకరిని కలిసి అతడి పరిస్థితిని విడమరిచి చెప్పి సహాయం కోరింది. అతడు జాలిపడి, ఆ ఊరిలోనే గొప్ప విద్వాన్ అయినటువంటి వైద్యనాథ స్వామి దగ్గర సహాయకుడిగా చేర్పించాడు.

ప్రత్యేకించి పాఠాలు అంటూ ఏవీ లేవు. అతడి మనసు నొచ్చుకోకుండా నడుచుకోవాలి, కచేరీకి వెళ్ళి అతడు వాయించడాన్ని లోతుగా గమనించడం ద్వారా అభ్యసించవచ్చు. అతడి నడవడిక నచ్చితే ఒకవేళ అతడే ఇతడిని పక్కన కూర్చోబెట్టుకుని అనేక మెళకువలు నేర్పించవచ్చు.’ అని చేర్పించినాయన స్వామినాథన్ అమ్మతో చెప్పాడు. అందుకు ఆమె “మహాభాగ్యం” అని చెప్పి ఆయన కాళ్ళపై పడింది.

వైద్యనాథస్వామి కంటే ముందుగానే నిద్ర లేచి, అతడు కళ్ళు తెరిచేసరికల్లా నోరు పుక్కళించేందుకు చెంబులో నీళ్ళు పెట్టి, అతడు స్నానం ముగించుకుని వచ్చేలోపు కారును తుడిచి శుభ్రం చేసి, గుమ్మం మెట్లు దిగగానే తొడుగుకునేందుకు చెప్పులను తీసి పెట్టి, ఫ్లాస్కులో కాఫీ పోసి, శృతిపెట్టెను వెనుక సీటులో పెట్టి, వాయిద్యానికి తొడుగు తొడిగి సిద్ధం చేసి, నుదుట విభూతి ధరించి, భక్తిశ్రద్దలతో ఎదురుచూసేవాడు.

పట్టుపంచె, పట్టుజుబ్బా, చేతిలో, మెడలో బంగారు గొలుసులు, నుదుట తిరునాగేశ్వరం కుంకుమ, చెవిన ఎర్రరాయి పొదిగిన చెవిపోగు, గది నుండి బయటకు వెలువడే జవ్వాది వాసన, నోటి నిండా తాంబూలం, ఉబ్బిన చక్కెళ్ళపై విదేశీ పౌడర్ అని ఇంటి నుండి గుభాళింపుతో బయటకువస్తాడు. అతడి ఏర్పాటులో ఆయనకున్నటువంటి సంతృప్తిమేరకు నవ్వుతాడు.

వైద్యనాథస్వామి కచేరీకి అనువుగా రాగాలను వాయిస్తాడు. ఆలయ ఉత్సవాలకు కీర్తనలను, రాగాలను క్రమబద్దమైన ఆలాపనతో వాయిస్తాడు. వివాహాది వేడుకలైతే త్వరితగతి కీర్తనలను, కొన్ని సినిమా పాటలను వాయిస్తాడు. అభిమానులకు తగినవిధంగా వాయించడంచే చుట్టుప్రక్కల అతడే అందరికీ సుపరిచితమైన నాదస్వర విద్వాంసుడు.

స్వామినాథన్ కళ్ళకు మనసుతో సంబంధం ఉందే తప్ప అతని చెవులకు, మనసుకు మధ్య మాత్రం ఎంతో దూరముంది.

ఆలయ కచేరీలలో వాయిస్తున్నప్పుడు, స్వామినాథన్ అనేకమార్లు తాళం తప్పుగా వేసేవాడు. ఒకసారి దేవగాంధారి రాగంలో వైద్యనాథన్ నాదస్వరం నల్లని అగరాబత్తిలా కరుగుతుంటే, ఆయన ఎదురుగా కూర్చున్న వారందరూ అందులో తడిసి ముద్దవుతున్నారు. డోలు వాయిద్యకారుడు కూడా ఏదో నామమాత్రంగా వాయిస్తున్నాడే  తప్ప, నాదస్వరాని కంటే ధీటుగా శబ్దాన్ని రేకేత్తించలేదు. ఆలాపనను ముగించి పల్లవిని అందుకునేసరికి అక్కడ సభలోని వారందరూ నిటారుగా కూర్చున్నారు. అప్పుడు కండ గతి, తిరిపుడ తాళంలో ఆయన వాయిస్తుంటే, ఇతడి చేతులు మాత్రం ఆది తాళాన్నే తడుతున్నాయి. ముందు వరుసలోని సంగీతంలోని మెళకువలన్నీ స్పష్టంగా తెలిసిన వేడుక కమిటీ ప్రెసిడెంట్ ముఖం వంకర్లు పోయింది. ఆ విషయం వైద్యనాథన్ కూడా గమనించాడు. సన్నాయి ఆకును మార్చి తుండుగడ్డతో ముఖాన్ని తుడుస్తూనే ఎవరూ గమనించకుండా డోలు వాయిద్యకారుడి చిడతను అందుకుని స్వామినాథన్ని గట్టిగా చరిచాడు. పక్కటెముకలు పట్టుకుని కూలబడిపోయాడు. ఇదంతా కచేరీ మధ్యలో మెరుపు వేగంతో జరిగిపోయింది.

మరొక సందర్భంలో వైద్యనాథన్ డోలుకు థనియావర్తన సమయాన్ని ఇచ్చి ఆపై స్వామినాథన్ దగ్గర చేతిని చాచాడు. స్వామినాథన్ భయభక్తులతో తమలపాకులను తీసి ఇచ్చాడు. తమలపాకు మొదలును తుంచి సున్నాన్ని తడిమిచూస్తే మునివేళ్ళలో సున్నం వ్యత్యాసంగా ఎండిపోయుంటే, స్వామినాథన్ వైపు మిర్రున చూసి “వాసనా సున్నం ఎక్కడరా పనికిమాలినోడా” అని లోపల కాఠిన్యాన్ని, బయటకు నవ్వుతోను లోగొంతుకలో మెల్లగా అడిగాడు. స్వామినాథన్‍కి ఉచ్చ పడ్డంత పనైంది. “అన్నయ్యా, ఇంట్లోనే పెట్టీ…” అని అతడు చెప్పేలోపు తుండుగుడ్డతో ముఖాన్ని తుడుస్తున్నట్టు, గుడ్డ లోపల తమలపాకు పెట్టెతో ముంజేతిని గట్టిగా గుద్దాడు. స్వామినాథన్‍కి కళ్ళలో నీళ్ళు తిరిగి కళ్ళుమండాయి.

ఆ రోజు కచెరీ ముగిశాక కారులో వచ్చేటప్పుడు, దిమ్మతిరిగే ఒక చెంపదెబ్బ, కొన్ని తంజావూర్ బూతులు అతడికి దక్కాయి.

గురువు దగ్గర దక్కిన అనుభవాలు, వయస్సు ఎదుగుదల అతడిని ముందుకునెట్టాయి, అప్పుడప్పుడు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చినవాడిలా ఇంట్లోని నాదస్వరాన్ని తీసి, ఆనాడు గురువు వాయించిన రాగాన్ని ప్రయత్నించేవాడు. ఇరుగుపొరుగూ అనేకమంది వాయిద్యకారులే కావడంతో అతడు వాయించడం మొదలెట్టగానే వినేవారి ముఖం వంకర్లు పోయేవి. ఆ శబ్దాన్ని తట్టుకోలేక చెవులు మూసుకునేవాళ్ళు. “తండ్రి పేరు మంట కలపడానికనే నాదస్వరాన్ని చేతుల్లోకి తీశాడు” అని అతడు వీధిలో నడిచి వెళ్ళేటప్పుడు బహిరంగంగా దుమ్మెత్తి పోసేవారు.

కీర్తనలు, రాగాలు మనసులో మెదిలినప్పటికీ, చేతికి అందిరాలేదనే ఆరాటం కందిరీగలా మనసును తొలిచేస్తూనే ఉంది. ఆ సమయంలో “అయ్యో! నేనెందుకు పుట్టాను… నాకేది సరిగ్గా రావడంలేదే!” అంటూ లోలోపల కుమిలి కుమిలి ఏడ్చేవాడు. 

అనేక సందర్భాల్లో నాదస్వరాన్ని వాయించేందుకు చేతుల్లోకి తీసుకుంటే మణికట్టులో వణుకు మొదలయ్యేది. చేతుల్లో చలనం లేక మొద్దుబారిపోతున్నట్లు అనిపించేది. షడ్జత్ నుండి రిషభానికి వేళ్ళు రంధ్రాలపై ఒకదానితో ఒకటి కట్టిపడేసినట్టు పడున్నాడు. అతడికి ఒక పదాన్ని శ్రుతితో వాయించడమే దౌడు తీసే గుర్రంపై నిలబడి స్వారీ చేస్తున్నట్లుండేది.

వీధి ప్రజల ఎగతాళులకు భయపడి నగర శివారులోని కాళియమ్మన్ గుడికి వెళ్ళి తెల్లవారుజామున సాధన మొదలెట్టాడు. తెల్లవారకముందే వాయించడం మొదలెట్టి, ఊళ్ళోవాళ్ళు నిద్రనుంచి లేవడానికంటే ముందే ఇంటికి వచ్చేవాడు.

కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని గురువు దగ్గర రాగాలు, మెళకువల గురించి ప్రశ్నించసాగాడు. వైద్యనాథన్‍కి అతడు అడిగే ప్రశ్నలు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, అతడి ప్రశ్నలకు ఆసక్తిగా సమాధానమిచ్చేవాడు.

కొద్దిరోజులకు ఆయనే స్వయంగా అతని చేతికి వాయిద్యం ఇచ్చి వాయించమని అడిగాడు. వణుకుతున్న చేతుల్లో సెగలా తొణికిసలాడే నాదస్వరాన్ని, వేళ్ళను మనసుగా చేసుకుని గట్టిగా పట్టుకుని వాయించేవాడు. వైద్యనాథన్ అతడు పొరపాటుగా వాయించిన చోట్లను ఎత్తి చూపి మళ్ళీ వాయించేలా చేసేవాడు. రోజులు గడిచే కొద్దీ ఒకింత సంభాళించుకుని స్వామినాథన్ కొంత వరకు వాయించగలిగే స్థాయికి చేరుకున్నాడు.

కార్తీకమాస ఉత్సవాల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. రెండవ  నాదస్వరంగా స్వామినాథన్నే వాయించమన్నాడు. ఆరోజు భయమూ, ఆనందమూ స్వామినాథన్ని జతకూడి హత్తుకున్నాయి. దక్షిణ వీధిలోకి ఊరేగింపు ప్రవేశించింది. మాజీ కలెక్టర్, ప్రముఖుడైనటువంటి ప్రస్తుత ఆలయ ధర్మకర్త ఇంటిముందు దీపారాధన నిమిత్తం స్వామివారి వాహనం నిలబడింది. డోలు వాయిద్యకారుడు ఎడతెగకుండా వాయిస్తున్నాడు. ఆబేరీ రాగంలో నగుమోమును  వాయించవచ్చని స్వామినాథన్‌కి ముందే చెప్పుంచాడు వైద్యనాథన్. డోలు వాయిద్య కారుడు నడకను వాయించి నాదస్వరానికి అందించే చోటులో వైద్యనాథన్ సరిగ్గా నాదస్వరాన్ని నోటిలో పెట్టుకుని వాయించేందుకు సన్నద్ధమవుతున్నప్పుడే స్వామినాథన్ అతడి కంటే ముందే వాయించసాగాడు.

వైద్యనాథన్ తనను నియంత్రించుకొని అతడి వెంట అనుసరిస్తూ వాయించాడు. ఒంటికాలి బాటలో బండి నడపడం రానివాడి పక్కన సైకిల్ నడుపుతున్నట్టు ఎంతో ఒడుపుగా ఆయన దానికి సరిసాటిగా వాయిస్తూ వచ్చాడు. అకస్మాతుగా స్వామినాథన్ నాదస్వర శృతి అడ్డదిడ్డంగా పక్కకు జరిగి, దెబ్బతిన్న బాధ తట్టుకోలేని నెమలి క్రేంకారంలా, అపశృతిలా వినబడసాగింది. ధర్మకర్త అప్రయత్నంగా నవ్వడంతో ఒక టపాకాయ నిప్పురవ్వ ఎగురుకొచ్చి సీమటపాకాయలను వెలిగించినట్టు, చుట్టూ జనం వికటట్టహాసంగా నవ్వారు. స్వామినాథన్ చేతులు మరింతగా వణుకుతూ, పిల్లి ఏడుపులా వదిలొదిలి వాయిస్తూనే ఉన్నాడు. వైద్యనాథస్వామికి శరీరంలోని రక్తమంతా మెదడుకు ఎగపాకింది. చేతితో విసురుగా అతని చేతిలో ఉన్న వాయిద్యాన్ని విసురుగా పక్కకు తట్టాడు. నాదస్వర ఆకు చుబుకానికి తగలడంతో నొప్పి భరించలేక మూతిని పట్టుకున్నాడు స్వామినాథన్. నాదస్వరం భళ్ళున కింద పడింది. పిచ్చిపట్టినవాడిలా నిప్పలు కురిపిస్తూ దాడి చేశాడు. సభలోనివారంతా వాళ్ళ మధ్యన చేరి విడదీశారు. వైద్యనాథన్‍కు ఊపిరి సలపలేదు. అతడి ఊపిరి శబ్దం కంటే మరింత వేగంగా స్వామినాథన్ ఊపిరి శబ్దం వినిపించింది. అది విని మరింత కోపోద్రిక్తుడై పరుగున వెళ్ళి అతడిని ఒక్కతాపు తన్నాడు వైద్యనాథన్. “నువ్వు నిజంగానే ఒక వాయిద్యకారుడికి పుట్టిన వాడివేనారా… అప్రాచ్యపు వెధవ”  అని ఆవేశంగా అతని వైపు పరుగులు తీశాడు. ఆయనకు, అతడు అపస్వరంగా వాయించిన దానికంటే తన కనుసైగకు ముందే వాయించాడన్న కోపమే మరింత కోపోద్రిక్తుడిని చేసింది.

సభలోని జనం వచ్చి విడదీసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వైద్యనాథన్ ఆవేశం ఏమాత్రం తగ్గలేదు. మరో రెండు దెబ్బలు తన్నిన తర్వాతే అతని కాళ్ళు నేలను ఆనుకున్నాయి. అతడు తడబడి పడబోయినప్పుడు అతడి పంచె ఊడిపడి కింద పడింది. ఆ గుంపులోని ఎవరో వ్యక్తి దానిని అతని నడుముకు బిగించి కట్టాడు. స్వామినాథన్‍కి శరీరంలోని రక్తమంతా ఇంకిపోయినట్టు అనిపించింది. చుట్టూవున్న వారందరి దృష్టిలో అతడు గాయాన్ని, అవమానభారాన్ని తట్టుకోలేక తడబడుతూ నిలబడున్నాడు. ఏదో గుర్తుకు వచ్చి కింద పడినటువంటి నాదస్వరాన్ని చూశాడు. మట్టి అంటుకొని కిందపడినటువంటి నాదస్వరాన్ని చూసేసరికి తన తండ్రిని ఎవరో కొట్టి వీధిన పడేసినట్లు అనిపించింది. బెంబేలెత్తి పరుగున వెళ్ళి నాదస్వరాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

నాదస్వరాన్ని గుండెలకు ఆనించుకుని జనంలో నుంచి పరుగులంకించుకున్నాడు. నీడ కూడా తోడు లేని చీకటి కమ్ముకున్నప్పుడు, అవమానభారంతో చేతులు దాని పైనున్నటువంటి పట్టును కాస్త సడలించాయి.

ఆరోజు ఇంటికి రాగానే తీర్మానించుకున్నాడు. ఆరోజు మొదలు నాదస్వరాన్ని తాకి ఎరుగడు. అమ్మ కాళ్ళపై సాష్టాంగపడి “నాకు నాదస్వరం వాయించడం రావట్లేదు. నేను ఇంకేదైనా పనికి వెళ్తానమ్మా”  అని అన్నాడు. తల్లి కొడుకుని వారించలేక పోయింది.

సట్టైనాథర్ ఆలయానికి దగ్గరలోని ఒక హోటల్లో సప్లయర్ పనికి చేరాడు. కొద్ది రోజులు అన్నీ మరిచిపోయి పనికి వెళుతూపోతూ ఉన్నాడు.

ఒకరోజు కస్టమర్లకు భోజనం వడ్డిస్తుండగా ఆలయం నుండి నాదస్వర శబ్దం, డోలు శబ్దం అతనికి వినిపించింది. జుత్తును గట్టిగా పట్టుకుని పీకుతున్నట్టు ఉలిక్కిపడి నిలబడ్డాడు. విద్యుత్ ఫంకా కింద నిలబడినప్పటికీ శరీరం చమటలు పట్టి వణుకుతోంది. డైనింగ్ టేబుల్స్‌కు మధ్య సాంబార్ తూగుతో దబ్‌మని కళ్ళు తిరిగి కిందపడ్డాడు.

మరుసటి రోజు నుంచి ఆలయాన్ని దాటుతూ కొట్లోకి అడుపెట్టినప్పుడల్లా ఒక రకమైన వణుకు అతడిని ఆవహించేది.

బెంబేలెత్తిన చూపు, భయం కలగలిపిన మాటలతో ఉన్నవాడిని చూసిన అమ్మ మునీశ్వరున్ ఆలయంలో తాయత్తును మంత్రించి చేతికి కట్టింది. 

రోజులు గడిచే కొద్దీ, ఆలయం నుంచి వినిపించే వాయిద్యం అతని చెవులకు మరింత దగ్గరగా వినిపించ సాగింది. అటువంటి సమయాల్లో ఆ శబ్దం చెవినపడకుండా ఉండేందుకు వంటగదిలోకి వెళ్ళి నిలబడి వంట మనిషితో ఏదైనా పనిగట్టుకొని మరీ మాట్లాడేవాడు. వంటగదిలో పాత్రలు దొర్లించే శబ్దాలూ, కూరలు మరిగే శబ్దం తప్ప బయట నుంచి వచ్చే మరే శబ్దము వినిపించదు.

ఇంటికి వస్తే నడిమింటిలో ఓ మూలన గుడ్డ కప్పి నాదస్వరం నిలబెట్టి ఉంటుంది. అది చూసేందుకు రోజుల తరబడి పూజలు, పునస్కారాలు లేక గుడ్డతో మూసినటువంటి దేవుడి శిలా ప్రతిమలా అనిపిస్తుంది.

“ఏరా? తరతరాలుగా, రాగాలూ, కీర్తనలుగా కురిపించినటువంటి వాయిద్యాన్ని ఇలా మూలన గుడ్డ కప్పి పెట్టావేరా దుర్మార్గుడా?” అని నాన్న గొంతు నిలదీస్తుంది.

అందువలనే అది పెట్టినటువంటి దిక్కుగా తిరిగి చూడడు.

రోడ్డుపై నడుస్తున్నపుడు చిన్న పిల్లలు పిల్లనగ్రోవిని చేతిలో పెట్టుకొని ఉండటం చూస్తే, పొత్తికడుపులో చల్లగా ఏదో పైకి ఎగదన్ని శరీరంలో వణుకు మొదలవుతుంది.

ఏదైనా పనిలో నిమగ్నమయితే నాదస్వర శబ్దం వినిపించదు. శరీరానికి కాస్తంత విశ్రాంతి దొరికితే మనసులో నాదస్వర శబ్దం విశ్వరూపం దాల్చుతుంది. ఒక దశలో అంచలంచెలుగా ఎదిగి తనే నాదస్వరమైనట్లు అనిపిస్తుంది.

అతడు పుట్టినప్పుడు ఆ సంతోషాన్ని ఆస్వాదించేందుకు అతడి తండ్రి తోడి రాగాన్ని వాయించాడని అమ్మ చెబుతుంది. ఈ మధ్య అతడు పడుకుంటున్నప్పుడు తోడి రాగంలో నాదస్వరం ఏడుపు శబ్దంలా వినిపించసాగింది. ఒక్కసారిగా నిద్ర చెదిరి, లేచి చూసేసరికి నాదస్వరం మూలన పడుంది. ఒక్కసారిగా దానిని పాత సామాన్లు ఉంచే గదిలోకి మార్చాడు. ఆ మరుసటిరోజు కూడా ఆ గదిలో నుంచి శబ్దం రావడంతో నిద్రపట్టక అలా నిశ్చలంగా కూర్చుండిపోయాడు. చెవుల్లో దూది పెట్టుకుని పడుకున్నప్పటికీ నాదస్వర శబ్దం వినిపిస్తూనే ఉంది. చెవులను మూసుకున్నంత మాత్రాన మనసులో వినిపించే వాటిని ఆపగలమా ఏంటి? అనే మాటలు పదేపదే అతనిలో మెదులుతూ ఉన్నాయి. లోలోపల శబ్దం వినిపిస్తుంటే బయట చూసే వాటన్నిటి నుండి అతడు పక్కకు ఒదిగి పరుగులు తీస్తూనే ఉన్నాడు.

రోజురోజుకీ నాదస్వర శబ్దం అతడి మనసును కలవరపెడుతుంటే, నిద్రాహారాలు మానేసి తల్లడిల్లాడు. శరీరమూ, మనసూ అలసటనొంది ప్రశాంతతను కోల్పోయి బాధలో కూరుకుపోయాడు. అందుకు పరిష్కారం వెదికేందుకని కుంభకోణంలో తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి నాదస్వరాన్ని అమ్మేయడమే సబబు అని నిర్ణయించుకున్నాడు. తల్లికి తెలిస్తే కుటుంబ కులదైవంగా కొలిచే వాయిద్యాన్ని అమ్మేందుకు ఎంతగానో నొచ్చుకుంటుంది. జవసత్వాలుడిగిన వయసులో ఇల్లు వదిలి వెళ్ళినా వెళ్ళిపోతుంది. అందువలనే అమ్మతో, తనకు తెలిసిన ఒక వ్యక్తికి సహ నాదస్వర వాయిద్యకారునిగా కుంభకోణంలో కచేరీకి రమ్మన్నారని అబద్దం చెప్పి బయలుదేరాడు. తిరిగి రాగానే నాదస్వరం గురించి అమ్మ అడిగితే ఎక్కడో పోయింది లేదా దొంగలించారని చెప్పేందుకు మనసులో పథకం పన్నాడు.

“కుంభకోణం… కుంభకోణం… ఊరోచ్చేసింది, దిగవలసిన వాళ్ళంతా దిగండి” అని  పెద్ద గంగాళం నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంది. కళ్ళను నులుముకున్నాడు. పక్కనున్నటువంటి వ్యక్తి ఇతడిని గుద్దుకుంటూ దిగాడు. కిటికీ గుండా చూసేటప్పుడు అందరూ దిగుతూ కనబడ్డారు. తలను విదుల్చుకొని చటుక్కున లేచి నాదస్వరం పెట్టిన చోటును చూశాడు. అక్కడ కేవలం రెండు ఇనుప బోల్టులు మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప, ఆ చోటులో నాదస్వరం కనిపించడం లేదు. 

“అయ్యో… నాదస్వరం” అని నాదస్వరం అందుకున్న పెద్దాయన ముఖాన్ని గుర్తుచేసుకొని చూశాడు. కళ్ళద్దాలు, మావిచిగురు రంగు చొక్కా అని అన్నీ గుర్తుకు వచ్చినా అతడి ముఖం మాత్రం గుర్తుకు రావడం లేదు. దానికి బదులు అమ్మ ముఖమే గుర్తుకు వచ్చింది. ఒక అబద్ధం చెప్పబోయి ఆఖరికి అదే నిజమైందే! “ అవయంబా నన్ను క్షమించు!” అని పదేపదే తలుచుకున్నాడు.

అది స్వామినాథన్ తండ్రికి నాదస్వరంపై ఆసక్తి చిగురించినప్పుడు అతడి తాతయ్య నరసింగపేటకు చెందిన రంగనాథన్ ఆచారి దగ్గర చేయించుకుని, కొన్నటువంటి నాదస్వరం. నాన్న ప్రాణాలతో ఉన్నంతవరకు దానిని ముట్టుకోని రోజంటూలేదు. ఆ వాయిద్యం ప్రతి రంధ్రం చుట్టూ అలుముకున్న తండ్రి వేలిముద్రలకు రాగాలు “నా ప్రభో! ఇదిగో వచ్చేశా!” అని వినమ్రంగా తరలివస్తాయి.

డ్రైవరూ, కండక్టరు టీ తాగుతున్నారు. విచారించేందుకు వెళ్ళినవాడు అకస్మాత్తుగా తడబడి వెనుతిరిగాడు. “ఒకవేళ నువ్వేంటిరా నన్ను అమ్మేది? నేనే నిన్నువొదిలి వెళ్ళిపోతున్నాను అని గాని పోయిందా ఏంటీ?” అని నోటిలో సణుగుతూ బస్సు స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. అకస్మాతుగా శరీరం బరువును కోల్పోయి స్వేచ్చ పొందినవాడిలా నడిచాడు. ఈరోజు నాన్నా, తాతయ్య కలలోకి రావచ్చు. అదేపనిగా మనసునుపట్టి తొలిచేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు నాగేశ్వరన్ ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించినవాడు అక్కడి నుండి డోలు శబ్దం వినిపించడంతో, అకస్మాత్తుగా మనసు మారి, కొన్ని తప్పటడుగులు దూరంలోని ఒక సినిమా థియేటర్ వైపుకు వెళ్ళాయి. సినిమా మొదలై ఐదు నిమిషాలే అయ్యింది. చీకట్లో తడుముకుంటూ ముందు వరసలోని ఒక సీటులో కూర్చున్నాడు. పక్కవాడి నుండి మందు కంపు కొట్టింది.

తెరపై హీరో,హీరోయిన్లు మాట్లాడుకుంటున్నారు. వెనువెంటనే వాళ్ళ పెళ్ళి సన్నివేశం వచ్చింది. నేపథ్యంలో నాదస్వరం డోలు శబ్దం మొదలవ్వగానే స్వామినాథన్‍కి కాలి వేళ్ళ మధ్య మెత్తని దూదితో తడిపినట్లుంది. శరీరంలో ఒక్కసారిగా ఒక రకమైనటువంటి చల్లదనాన్ని అనుభూతి చెందినవాడిలా కాళ్ళను ఎత్తి సీటుపై పెట్టాడు. పాట మధ్యలో ఇద్దరు, ముగ్గురు థియేటర్ తలుపును తెరుచుకొని బయటకు వెళుతున్నప్పుడు కూలిపడిన తెల్లరంగు స్తంభం నిలబడినట్లు వెలుతురు వచ్చింది. స్వామినాథన్ లేచి థియేటర్ వదిలి బయటకు వచ్చాడు.

అతడు వీధిలోకి నడిచాడు. ఒక పొడవైన కంచె చుట్టూ మందార మొక్కలు మెడను వాల్చి తొంగి చూస్తున్నాయి. పొడవాటి వరుసలో మల్లారి వాయించేందుకు నిలబడ్డ నాదస్వరకారుల వలె కనిపించాయి ఆ మందారపువ్వులు. దాని రేకులు నాదస్వర ఆకుల్లా ఉన్నాయి. తొలిసారి పూలను చూసే పసివాడి సంభ్రమాశ్చర్యం అతడి కళ్ళలో గోచరించింది. దాని రేకుల నుండి బయటకు వచ్చే మకరందాలు రాగాలుగా అనిపించాయి. మెల్లగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళి ఒక పువ్వును మెల్లగా తాకాడు. ఎక్కడి నుండో ఒక తుమ్మెద ఝుంకారం మలయ మారుతానికి ఆలాపనలా వినిపించసాగింది. చిరుగాలి మందారపువ్వుల కాడలను కుదిపింది. ఒక్కసారిగా ఏకకాలంలో మందార పూవులన్నీ పైకి కిందకి ఊగేసరికి, ప్రపంచంలోని మందార పువ్వులన్నీ ఈవేళ ఇదెలా ఊగుతాయేమోనని అనుకున్నాడు. ఒక్కొక్క మందార పువ్వు ఒక నాదస్వరం. అన్నిటి నుండి నాదం పెల్లుబికింది. తనలో ప్రవేశించే గాలినంతటిని కళ్యాణిగా, తోడిగా, ఆభేరిగా, హుసేని అని వివిధ రాగాలుగా రూపాంతరం చెందిన పువ్వుల కదలికలను చూసి అతని శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇప్పుడు నాదస్వరాలన్నిటా ఏకకాలంలో ఒకే రాగం వినిపించేసరికి ఉన్నఫళంగా మందార మొక్కల కింద తట్టుకోలేక మోకరిల్లి “అయ్యో దేవుడా నాకు చేతకావడం లేదే… కావడం లేదే…”  అని అంగలార్చాడు. ఉన్నట్టుండి బస్ స్టేషన్ వైపుకు పరుగు తీశాడు.

నేరుగా సూపరిడెంటుతో తను వచ్చిన బస్సు వివరాలు చెప్పి, అది తిరిగి ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగి వేచి చూశాడు.

రెండున్నర గంటల తర్వాత అదే బస్సు తిరిగి వచ్చింది. కండక్టరుతో “సార్ పోయిన ట్రిప్‍లో సీర్గాళిలో ఎక్కాను. బస్సు రద్దీగా ఉండడంతో నాదస్వరాన్ని ఒక పెద్దాయనకు ఇస్తే లగేజ్ పెట్టే చోటులో పెట్టారు. కుంభకోణం వచ్చి చూసేసరికి నాదస్వరం కనిపించలేదు” అని అమాయకమైన గొంతుతో చెప్పాడు. “ఏంటీ? నాదస్వరం కనిపించలేదా? చిన్నవస్తువు అయితే కూడా ఎవరైనా పిల్లల కోసం ఎత్తుకెళ్ళిపోయారని అనుకోవచ్చు. దాన్ని ఎత్తుకెళ్ళి ఎవరేం చేసుకుంటారని ?” కండక్టరు బస్ టికెట్లను సరిచేసుకుంటూ చెప్పిన సమాధానంతో అతను తృప్తి చెందలేదు.

“సార్! ఎవరైనా తొడుగుతో నాదస్వరాన్ని పట్టుకుని దిగడం చూశారా?” స్వామినాథన్ ప్రశ్నకు కండక్టరు “ప్చ్” అన్నాడు.

“సార్! రోజుకి వందమంది పాసెంజర్లు వస్తూ పోయే బస్సులో ఎవరు చేతిలో పిల్లనగ్రోవి ఉందా అని చూడటమా నా పని?” ఇప్పుడు కండక్టర్ గొంతులో ఒక విధమైన విసుగు, అలసట తలెత్తేసరికి స్వామినాథన్ అతనితో “సార్! అది నాదస్వరం’  అని చెప్పదలుచుకొని వెనక్కి తగ్గాడు. కాస్తంత దూరంలో నిలబడున్న బస్సు డ్రైవర్ వాళ్ళనిద్దరిని చూస్తూ దగ్గరకు వచ్చి, “ఏమయ్యా? ఉదయం సీర్గాళిలో పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కిన మనిషివి నువ్వే కదా? ఇంతకీ ఏంటీ విషయం?  అని అడిగేసరికి స్వామినాథన్ గొంతు సవరించుకొని, “అన్నా! నా నాదస్వరాన్ని బస్సులోనే పెట్టేశాను…కుంభకోణానికి వచ్చి చూస్తే  కనిపించడం లేదన్నా.” ఈసారి స్వామినాథన్‍ గొంతు పూడుకుపోయింది. “ లేదే, మీరు ఒట్టి చేతులతోనే పరిగెత్తుకొచ్చి ఎక్కారు” అని బస్సు డ్రైవర్ బల్లగుద్దినట్టు చెప్పాడు.  స్వామినాథన్‍కి గుండెలపై తన్నినట్టు అనిపించింది.

“లేదన్నా! ఒక పెద్దాయన తీసుకొని అక్కడ పెట్టారు” అని మళ్ళీ మొదలుపెట్టేసరికి, డ్రైవర్ “ఏమయ్యా! ఏవీ లేకుండా ఒట్టి చేతులతోనే కదయ్యా ఎక్కావని చెబుతున్నాను…నాదస్వరంతో ఎక్కుంటే గనక వేగంగా బయటి నుంచి వచ్చే బస్సులో, పరిగెత్తుకొచ్చి ఎలా మెట్లపై ఎక్కి ఉండేవాడివి?”  అని చెప్పేసరికి, ఉదయాన ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి, బస్సు స్టేషన్‌కి వచ్చినప్పటి వరకు జరిగిన విషయాలన్నీ గుర్తుచేసుకొని చూశాడు. ఇంతకీ నాదస్వరాన్ని ఇంటి నుండి తెచ్చామా అని మొదటిసారి స్వామినాథన్‌కి సందేహం తలెత్తింది.

బుసలుకొడుతూ నిలబడ్డ సీర్గాళి బస్సులో ఎక్కి కూర్చున్నాడు. మావిచిగురు రంగు బట్టలు తొడుక్కుని నాదస్వరాన్ని అందుకున్న పెద్దాయన, తన పక్కన కూర్చున్నాయన అని ఇలా అందరిని గుర్తుచేసుకొని చూశాడు. ఎవరి ముఖము ఒక పట్టాన గుర్తుకు రాలేదు.

అలసిసొలసి వీధిలోకి ప్రవేశించినవాడు కాస్తా దూరాన గుమ్మం ముందు కరెంటు బల్బు వెలుగుతున్న తన ఇంటిని చూసేసరికి ఆవేశంగా నడిచాడు. అమ్మ పొయ్యి ఊదుతూ వుంది. ఆ శబ్దం నాదస్వర విద్వాన్ నాదస్వర ఆకును సరిచూసేందుకు ఊదుతున్నట్లు స్వామినాథన్ చెవిన పడింది. వేగంగా పరిగెత్తుకు వెళ్ళి ఇంటి మూలకు వెళ్ళి చూస్తే అది అక్కడ లేదు. స్వామినాథన్‌కి దిమ్మతిరిగింది. బస్సు హారన్ శబ్దం బుర్ర లోపల పదేపదే వినిపించేసరికి, తల గిర్రున తిరిగి నీరసంగా గోడకు కూలబడినవాడికి లోపల గదిలో ఉన్న దేవుడి పటం ముందు అమ్మ నాదస్వరాన్ని ఆనించి పెట్టి కనబడింది.

“ఏం బాబు? ఎక్కడికి వెళ్ళావు…? ఈరోజు పనికి వెళ్ళలేదా?” అని అమ్మ మంచినీటి చెంబును అతని చేతికి అందించింది.

“అమ్మా!… అదీ నాదస్వరమూ…” అని అతడు తడబడుతూ చెప్పే ముందరే, “నువ్వు రాత్రుల్లో భయంతో, వట్టి చేతులతో నాదస్వరం ఊదుతున్నావు…ఇది చాలదని ఏడుస్తున్నావు కూడా… అందుకే ఏమయిందో ఏటయిందో తల్లీ భవానమ్మా!….అని దేవుడి పటం ముందు తీసుకెళ్ళి పెట్టేశాను.”  అంది.

 స్వామినాథన్ ముఖంలో నెత్తురు చుక్కలేనట్లు గడ్డకట్టుకు పోయింది.

“బాబు…నా మనసులో పడిన విషయం నీకు చెప్పనా? నీకూ, నాదస్వరానికీ అచ్చురాలేదేమో…. నన్ను అడిగితే తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయ్ బాబు…” అంది.

అమ్మ అలా అనేసరికి స్వామినాథన్‌కి దుఃఖం ముంచుకొచ్చింది. కనుల చివరలు చెమ్మగిల్లాయి. అతడు దృష్టి నాదస్వరాన్ని నిశ్చలంగా చూస్తుండిపోయాడు.

దేవుడు గది వైపు వెళ్ళాడు. నాన్న, తాతయ్యలా పటం ముందున్న నాదస్వరాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడే పుట్టిన పసికందును చేతుల్లోకి తీసుకున్న తండ్రిలా నాదస్వరాన్ని చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. నాదస్వర ఆకును ఉమ్ముతో తడిచేసి ప్రాణం పోసి, కళ్ళు మూసుకుని నాభి నుండి శ్వాసను గట్టిగా ఎగపీల్చి ఊదసాగాడు. అతడి మెడ పొడవుగా సాగి, చెక్కిళ్ళు గాలినిండిన బుడగలా ఉబ్బిపోయాయి. ఆభేరి రాగంలో ఆలాపన పరవళ్ళు తొక్కింది. జోరైన పిచ్చుకల్లా అతడి వేళ్ళు కన్నాలపై కదలాడసాగాయి. ఎటువంటి వణుకు, బెరకు లేకుండా, అణుమాత్రం తప్పని శృతితో సరళంగా నాదం పరవళ్ళు తొక్కింది.

దూరాన వున్నవారిని చేయి చాపి పిలుస్తున్నట్లు, బట్టబయలులోని కీర్తనలన్నిటిని ఇంట్లోకి  సాదారంగా ఆహ్వానిస్తుంది అతని నాదస్వరం.

దట్టమైన వనంలో శబ్దాన్ని రేకెత్తించి ప్రవహించే నది, అడుగడుగునా ఎదురయ్యే బండరాళ్ళను మోది పులకరిస్తున్నట్లు సంగతులు ముంచుకొస్తున్నాయి. పొయ్యి మీద ఉన్నదానిని అక్కడికక్కడే వదిలేసి పరుగున వచ్చిన తల్లి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. తను ప్రసవం రోజున పొందిన సంతోషాన్ని మరొక్కమారు కలిగించిన తన కొడుకును సగర్వంగా చూస్తుండిపోయింది.

“నగుమోము” అని స్వామినాథన్ మొదలుపెట్టగానే, ఇంటిగుమ్మం ముందు జనం గుమిగూడారు. ఒక్కసారిగా ఆ ఇల్లంతా నక్షత్రాలు రాలిపడినట్లు నాదం ఇంటిని కమ్మేసింది.

మెలికలు తిరగని అతిపెద్ద నాగపాము నుంచి, మెలి తిరిగే పిల్ల నాగులు బయటకు వస్తున్నట్లు సంగతులు ముంచుకొస్తున్నాయి.

ఇంట్లోకి వచ్చిన వీధి జనమంతా దైవసన్నిధిలో కొలువు దీరినట్లు పరవశంతో నిలబడున్నారు. పిల్లలు స్వామినాథన్ని చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. వర్షాకాలంలో తడిమట్టిలో నేలరాలిన పన్నీటి పుష్పాల్లా సుగంధం గాలిలో అలుముకుంది. ఎటువంటి పరిచయం లేకుండా వర్షానికి ఒదిగినవారిలో అనిర్వచనీయంగా చిగురించే స్నేహపూరితభావం ఆ క్షణం అక్కడున్నవారందరి ముఖాన స్పష్టంగా కనబడింది. ఎవరి కంటా పడకుండా అల్లుకుపోయే తీగలా, వాయిద్యం నుంచి వచ్చిన నాదం అక్కడ నిలబడివున్న ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది.

‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు’ అనే వాక్యాన్ని స్వామినాథన్ హృదయం ద్రవించేలా వాయించేటప్పుడు అతడి కళ్ళలో అసంకల్పితంగా కన్నీరు కారి గుండెలపై స్రవించింది. ‘పరమాత్మ ఈ భువిలో నిన్ను తప్ప ఇంకెవరిని నేను కొలిచెదన్’ అనే అర్థం స్పురించే వాక్యానికి ఇంటిలో నిలబడినటువంటి అనేకమందికి కళ్ళు చెమ్మగిల్లాయి. తన రమ్యమైన వాయింపులో ఒక్కసారి వచ్చిన సంగతి మరొకమారు పునరావృతం కాకుండా సృజనను వెల్లువలా కుమ్మరిస్తూనే ఉన్నాడు. మనసులో తోచిన వాటన్నిటిని చేతులు మాయాజాలం చేయడం చూసేటప్పుడు అతడి మనసే, చేతులుగా మారిపోయాయేమో అని చూసేవాళ్ళకి అనిపించింది.

ఇన్ని రోజులుగా ఇవన్నీ ఇతనిలో దాగున్నాయా అన్నట్లు అక్కడికి వచ్చిన జనమంతా కళ్ళప్పగించి దిగ్బ్రాంతితో చూస్తుండిపోయారు.

సమయం గడుస్తున్నప్పటికీ, స్వామినాథన్ మాత్రం వాయించడం ఆపనేలేదు. మంట లేకుండా అంతర్ధహనమవుతున్న అగ్నిజ్వాలలా నాదం అతడి శరీరాన్ని పట్టి కుదిపింది. కన్నాలపై అలుముకున్న చేతివేళ్ళు చెక్కబెండులా మారి వేగం పుంజుకున్నాయి. చూపరులకు అతడు రగులుతున్న జ్వాలలా దర్శనమిచ్చాడు. అతడి శరీరం నుంచి చెమట జలపాతంలా కారింది. అతడి తల్లి ఒక తుండు గుడ్డతో శరీరమంతటిని అదేపనిగా తుడుస్తూ ఉంది. అతని కంఠంపై ఉదయం పెట్టుకున్న కుంకుమ చెమటతో కరిగి సింధూరంలా పారడం చూస్తే గొంతు చీలి రక్తం వస్తుందేమోనని అక్కడున్న జనాలకు అనిపించకమానలేదు. అమ్మ దానిని బెంబేలెత్తి తుడిచింది. పరవళ్ళు తొక్కే నది వెల్లువలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అతడు నాదస్వరం వాయించడాన్ని ఇవేవీ నిర్భంధించలేదు.

నాదస్వర కళానిధి “కారైకురిచ్చి అరుణాచలం” గారికి మనస్పూర్తిగా ఈ కథ సమర్పణం.

సెంధిల్ జగన్నాథన్

సెంధిల్ జగన్నాథన్ తమిళంలో విరివిగా రాస్తున్నటువంటి యువరచయిత. సినిమా రంగంలో పనిచేస్తున్నారు. తన మొదటి సినిమాకి దర్శకత్వం వహించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతవరకు తమిళంలో ‘మళైక్కణ్’, ‘అనాగద నాదం’ అనే రెండు కథా సంకలనాలు విడుదలయ్యాయి. తన కథలు కొన్ని ఇంగ్లీష్ మరియు మలయాళంలోకి అనువదించబడ్డాయి.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

2 thoughts on “అనాహత నాదం

  1. సెంథిల్ జగన్నాథన్
    కథను సంగీత సాగరంలో ముంచి తేల్చావు
    శ్రీనివాస్ కథను యధాతధంగా తెలుగులో నడిపించావు
    సంగీతం విని గుండె చెరువయింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *