క్రిస్మస్ ముందురోజు సాయంత్రం చెప్పులు కుట్టే అల్సాహిన్ వద్ద పనిచేసే తొమ్మిదేళ్ళ కుర్రాడు వంకాఝుకోవ్ దిగులుగా కూర్చున్నాడు. యజమానీ, యజమానురాలూ, పనివాళ్ళూ అంతా ప్రార్థన కోసం చర్చికి వెళ్ళడం కోసం వాడు ఎదురుచూస్తున్నాడు. వాళ్ళంతా యింటి నుంచి నిష్క్రమించాక,మెల్లగా యజమాని అలమరాలోనుంచి సిరాబుడ్జీ, తుప్పు పట్టిన పాళీ పైకి తీసి, నలిగిపోయిన కాగితాన్ని సాపుచేసి తస ముందు పరుచుకుని, రాయడం ప్రారంభించాడు. కాగితం మీద మొదటి అక్షరం రాసేముందు, వాడు ద్వారం వైపూ, జోళ్ళ అచ్చులతో నిండి వున్న అలమరాల మధ్యలో వున్న నల్లని దేవుని ప్రతిమవైపూ బితుకు, బితుగ్గా ఒకటికి పదిసార్లు చూసి, భారంగా నిట్టూర్చి, అప్పుడు రాయడం ప్రారంభించాడు. కాగితాన్ని మేజాబల్లమీదపెట్టి, దానిముందు మోకాళ్ళపై కూర్చుని రాయసాగాడు.
“ప్రియమైన తాతయ్య, కోన్‌స్టాన్‌టిన్ మేకరిచ్‌కు” అంటూ ప్రారంభించాడు. “నేను నీకొక ఉత్తరం రాస్తున్నాను. నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. తల్లీ, తండ్రీ లేని అనాధనైన నాకు మిగిలిన పెద్దదిక్కువి నువ్వే”
వంకా తలెత్తి, క్రొవ్వొత్తి వెలుగులో ఎదురుగా వున్న నల్లని దేవుని ప్రతిమవైపు చూస్తూ, తన తాతయ్యను గుర్తుచేసుకున్నాడు. అతని తాత అరవై అయిదేళ్ళ కాన్‌స్టాన్‌టిన్ మేకరిచ్ ‘జవారెవ్’ల యింటికి రాత్రుళ్ళు కాపలా కాస్తాడు. మనిషి బక్కపలచగా వున్నా నవ్వుమొహం, మత్తెన కళ్ళతో ఎప్పుడూ మహా చురుకుగా ఉండేవాడు. పగటిపూట నౌఖరుల వంటిళ్ళలో నిద్రపోతూ, ల్రేదా నౌఖర్లతో పరాచికాలాడుతూనో కాలం గడిపేవాడు. రాత్రయ్యేసరికి, దళసరి గొర్రెతోలు కప్పుకుని, పొన్నుకర్రతో నేలను తడుతూ వీధుల్లో పహరా కాసేవాడు. తలలు వేలాడేసుకుని, తోకలూపుతూ ముసలి కాష్టంకా, నల్లగా, పాడవుగా వుండే ఈల్ అతని వెన్నంటే వెళ్ళేవి. దానిరూపం వల్లనే ఈల్‌కి ఆ పేరు వచ్చింది. అది చాలా మర్యాదగా, అభిమానంగా ఉండేది. తన యజమానులను, క్రొత్తవారినీ ఒకే మాదిరిగా దయతో చూసేది. అయినా సరే, దానికేమంత మంచిపేరు లేదు. నిజానికి దాని మర్యాద, అణకువల వెనక దాని వంచన దాగి ఉండేది. అదాట్న వెళ్ళి కాలు అందుకోవడం, పొరుగు వాళ్ళ గోదాములోకి దొంగచాటుగా దూరడం, యిరుగు పొరుగు రైతుల కోళ్ళను నొక్కెయ్యడం యివన్నీ దానికి వెన్నతో పెట్టిన విద్యలు. ఒకసారి కాదు గదా, చాలా సార్లుదాని వెనుక కాళ్ళు యించుమించుగా విరగ్గొట్టేసోరు. రెండుసార్లు దాన్ని ఉరేసిసంత చేశారు. ప్రతీవారం దానిని చావగొడుతూనే ఉంటారు. అయినా సరే, అది మళ్ళీ తేరుకుంటూనే వుంటుంది.
ఈ వేళప్పుడు తాతయ్య తప్పకుండా గేటు దగ్గర నిలబడి, ఎర్రటి చర్చి కిటికీల వంక కళ్ళు చికిలించి చూస్తూ, గుడ్డ బూట్లతో నేలని తంతూ, నౌఖర్లతో పరాచికాలాడుతూ ఉంటాడు. అతని పొన్నుకర్ర అతని నడుము పటకాకు వేలాడుతూ ఉంటుంది. బోసి నవ్వులు నవ్వుతూ ముందు పని మనిషినీ, తర్వాత వంటావిడనూ గిల్లుతూ ఉంటాడు.
“కాస్త పొడుం పీలుస్తారా?” అంటాడతను ఆ ఆడాళ్ళకు తన పొడుం డబ్బా యిస్తూ.
ఆ ఆడాళ్ళు ఒక చిన్న పొడుం పట్టు పట్టి తుమ్ముతారు. తాతయ్య పట్టరాని ఆనందంతో పకపక నవ్వుతూ “ముక్కు దిబ్బడేసింది. అంతా బయటకి రానివ్వండి.” అంటాడు.
వాళ్ళు కుక్కలకి కూడా పొడం పట్టిస్తారు. కాష్టాంకా తుమ్మేసి, మూతి మూడు వంకర్లు తిప్పి, నొచ్చుకుని అక్కడ నుండి పోతుంది. ఈల్ మర్యాద కొద్దీ తుమ్మదు గానీ తోకాడిస్తుంది.
ఈ వేళప్పుడు అక్కడ వాతావరణం కూడా ఎంత బాగుంటుందో! తాజా గాలి, చీకటి రాత్రి, మంచుతో కప్పబడిన యిళ్ళ పైకప్పులు, వంటిళ్ళ చిమ్నీలలోనుంచి రింగులుగా బయటకు వచ్చే పొగ, మంచుపడి తెల్లగా వెండిలా మెరుస్తున్న చెట్లు యులా ఊరు ఊరంతటినీ ఆ చిమ్మచీకట్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మెరిసే చుక్కల్ని చుట్టుకున్న ఆకాశం…. మంచుతో కడిగినట్టు మెరిసే పాలపుంత…. ఓహ్…. ఎంత బావుంటాయో!
వంకా దీర్ఘంగా నిట్టూర్చి, పాళీ సిరాలో ముంచి, రాయడం కొనసాగించాడు.
“నిన్ననైతే నాకు ముక్క చీవాట్లు పెట్టేరు తెలుసా? వాళ్ళ పిల్లోణ్ణి ఉయ్యాల్లో ఊపుతూ, అలానే కునికిపాట్లు పడ్డానని అయ్యగారు నన్ను జుట్టుపట్టి గొరగొరా పెరట్లోకి లాక్కెళ్ళి జోడు తీసి ఎడాపెడా వాయించేసాడు.”
“అలానే పోయిన వారం అమ్మగారు చేపని శుభ్రం చెయ్యమన్నప్పుడు నేను తోక దగ్గర మొదలెట్టేనని, ఆవిడ కోపగించుకుని చేప తలని నా మొహానికేసి కొట్టింది.”
“ప్రని వాళ్ళంతా నన్నుచూసి నవ్వుతారు. నాచేత వోడ్కా తెప్పించుకుంటారు. అయ్యగారి దగ్గర దోసకాయలు దొంగతనం చేయిస్తారు. దాంతో అయ్యగారు చేతికి దొరికిన దాంతో నన్ను చితక్కొడుతూ ఉంటాడు. తాతయ్యా, యిక్కడ నాకు తిండి కూడా సరిగ్గా పెట్టరు. పొద్దున్నపూట ఒక రొట్టెముక్క ,మధ్యాహ్నం కొంచెం జావ, మళ్ళీ సాయంత్రం చిన్న రొట్టెముక్క… అంతే. టీ నీళ్ళైనా పొయ్యరు. సూప్ సంగతి దేవుడెరుగు.ఎక్కడలేని తిండీ అమ్మ గారికీ, అయ్యగారికే చాలదు. నన్ను వరండాలో పడుకొమంటారు. వాళ్ళ రాకాసి పిల్లడు ఏడుపుకి లంకించుకుంటే నా నిద్ర హుష్‌కాకి. వెంటనే లేచి ఉయ్యాల ఊపాల్సిందే. మా మంచి తాతయ్యవి కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నన్నిక్కణ్ణుంచి తీసుకుపోవూ? ఇదంతా భరించడం యిక నావల్ల కాదు. నేను నీ కాళ్ళకు మొక్కుతాను. నన్ను మాత్రం యిక్కణ్ణించి ఊరికి తీసుకుపో, లేదంటే నేను చచ్చిపోతాను.
వంకాకి దుఃఖం తన్నుకొచ్చింది మసిబారిన పిడికిలితో కళ్ళు తుడుచుకుని వెక్కిళ్ళు పెట్టేడు.
“నేను నీకు పొడుం గుండ చేస్తాను”అంటూ కొనసాగించాడు. “నేను నీ కోసం దండం పెట్టుకుంటాను. ఒకవేళ నేనేదైనా తప్పుచేస్తే సిదోర్ మేకని కొట్టినట్టు నువ్వు నన్ను చావబాదు. నాకు తగ్గ పనేమీ లేదని అనుకోవద్దు. నేను వంటాయనని బ్రతిమాలి అతని బూట్లు తుడుస్తాను. లేదా ఫెడ్కా బదులు గొర్రెలు కాయడానికి వెళ్తాను. ఏదైనా చేస్తాను కానీ తాతయ్యా, యిక్కడ మాత్రం ఉండలేను. యిదంతా భరించడం నా వల్ల కాదు. అసలిది ఒక బ్రతుకే కాదు. అసలు నేను యిక్కణ్ణించి ఊరికి పారిపోయి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ నా దగ్గర బూట్లు లేవాయె. మంచుకి జడిసి ఆపని చెయ్యలేదు. నన్ను యిక్కణ్ణించి తీసుకుపోయావంటే, దానికి బదులుగా నేపెద్దయ్యాక నిన్ను జాగ్రత్తగా కనిబెట్టుకుంటాను. నిన్నెవరూ యిబ్బంది పెట్టకుండా చూస్తాను. నువ్వు చనిపోయాక, అమ్మకోసం ప్రార్ధన చేసినట్టే,నీ ఆత్మశాంతి కోసం ప్రార్ధన చేస్తాను.”
“తాతయ్యా, మాస్కో చాలా పెద్ద ఊరు, తెల్సా? యిక్కడంతా పెద్దపెద్ద వాళ్ళ యిళ్ళుంటాయి.. చాలా గుర్రాలు కూడా ఉంటాయి కానీ గొర్రెలెక్కడా కనపడలె. ఇక్కడ కుక్కలు కూడా చెడ్డవి కావు, తెల్సా? ఇక్కడ పిల్లలు కూడా అంత కలుపుగోలుగా ఉండరు. వాళ్ళ క్రిస్మస్ స్టార్ తో బయట తిరగరు. కొత్తవాళ్ళని ప్రార్థనలు పాడనివ్వరు నేనొకసారి ఒక షాపులో మంచిమంచి చేపల గాలాలు చూసేను. తెల్సా? అవి ఒక్కోటి నలభై పౌండ్ల చేపను కూడా లాగలవు. అంత మంచివి. ఊళ్ళో మన దొరగారి యింట్లో ఉండే లాంటి పెద్దపెద్ద తుపాకులు కూడా నేను దుకాణాల్లో చూసాను. అవి ఒక్కోటి వంద రూబుళ్ళన్నా ఆశ్చర్యం లేదు…. మాంసం కొట్లలో అయితే అడవికోళ్ళు, బాతులు, కుందేళ్ళు యింకా రకరకాల మాంసాలుంటాయి, తెల్సా? చేపలు కూడా అమ్ముతారు. కానీ యివన్నీ ఎక్కడ వేటాడేరో వాళ్ళు చెప్పరు.”
“ఇదిగో, తాతయ్యా మన దొరగారింట్లో క్రిస్మస్ కి నా కోసం ఒక గిల్డ్ వాల్నట్ అడిగి తీసుకోవా? తీసుకుని దానిని ఆకుపచ్చ ట్రంకుపెట్టెలో దాచిపెట్టేం? చిన్న దొరసాని ఓల్గా యిగ్నత్సెవ్నాని వంకా కోసం అని అడుగు, తప్పక యిస్తుంది.”
వంకా మళ్ళీ భారంగా నిట్టూర్చి, కిటికీవంక చూసాడు. దొరగారి కుటుంబం కోసం క్రిస్మస్ చెట్టు తేవడానికని తాతయ్య అడవికి వెళ్ళడం, తనని వెంట తీసుకెళ్ళడం అతనికి గుర్తుకొచ్చాయి. ఆ రోజులు ఎంత బాగుండేవో! తాతయ్య గర గొంతుక, మంచు వలన అడవి గరగర లాడడం, అదంతా చూసి తను కూడా కిచకిచలాడేవాడు. క్రిస్మస్ చెట్టుని కొట్టేముందు తాతయ్య తీరిగ్గా పైపు కాల్చి, ఒక పొడుం పట్టుపట్టి, చలికి కొయ్యబారిన వంకాని చూసి నవ్వేవాడు. మంచుతో కప్పబడ్డ ఫర్ చెట్లు తమలో ఎవరి వంతు వస్తుందా అని చూస్తున్నట్లు చలనం లేకుండా నిలబడి ఉండేవి. హఠాత్తుగా మంచుమీంచి ఒక కుందేలు పిల్ల సంధించి విడిచిన బాణంలా పరిగెత్తేది. “పట్టుకో, పట్టుకో, కుచ్చుతోక దయ్యాన్ని పట్టుకో,” అని అరిచేవాడు తాతయ్య.
తాతయ్య క్రిస్మస్ చెట్టుని కొట్టేక, దొరగారి బంగ్లాకి లాక్కెళ్ళి అక్కడ దానిని అలంకరించే పనికి పూనుకునేవాడు. వంకాకి ఎంతో ప్రియమైన దొరసానమ్మ ఓల్గా యిగ్నత్సెవ్నాని అందరి కంటే ఎక్కువగా పనిలో తలమునకలుగా ఉండేది. వంకా వాళ్ళ అమ్మ పెలాగెయా బ్రతికున్న రోజుల్లో అయితే దొరసానమ్మ ఓల్గా వంకాకి బోలెడు మిఠాయిలు అవీ యిచ్చేది. అంతేకాదు, ఆమెకి కూడా చెయ్యటానికి పనేం లేకపోవటం వలన వంకాకి చదవడం, రాయడం, వందవరకూ అంకెలు లెక్కబెట్టడం నేర్పేది. క్వాడ్రిల్లె నాట్యంకూడా నేర్పేది. పెలాగెయా చనిపోయాక వంకాని కూడా వాడి తాతయ్య దగ్గరకు నౌఖర్ల వంటింటికి పంపేసారు. అక్కడనుంచి వంకా మాస్కోలోని ఈ చెప్పుల వ్యాపారి వద్దకు వచ్చి పడ్డాడు.
“తాతయ్యా, నీకు పుణ్యం ఉంటుంది,” వంకా రాయటం కొనసాగించాడు, “దేవుని కోసం, ఈ అనాధ వెధవ మీద జాలి చూపించు, తాతయ్యా. దయుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళు, యిక్కడంతా నన్ను నెట్టేస్తూ ఉంటారు. నేను ఆకలితో నకనకలాడిపోతున్నాను. నేను చెప్పలేని బాధలో ఉన్నాను. రోజూ ఏడుస్తూనే ఉన్నాను. నిన్నటి రోజున అయ్యగారు నన్ను జోడు అచ్చుతో తలమీద కొట్టాడు. దానితో నేను మొహం తిరిగి పడిపోయాను. నా బ్రతుకు యిక్కడ కుక్కకంటే హీనంగా ఉంది. అల్సానాని, ఒంటికన్ను యెగోర్కాని, బండి తోలే వాడిని అడిగేనని చెప్పు. తాతయ్యా నా కన్సెర్టినా (సంగీత వాయిద్యం) ఎవరికీ యివ్వొద్దు. యిక ఉంటాను, యిట్లు నీ ప్రియమైన మనుమడు యివాన్ ఝకోవ్.
“తాతయ్యా, దయుంచి తప్పక రా.”
వంకా ఆ కాగితాన్ని రెండు మడతలు వేసి, క్రితం రోజు కోపెక్కు పెట్టి కొన్న కవరులో పెట్టేడు. కాసేపు బుర్ర గోక్కుని ఆలోచించేక, అతను సిరాలో పాళీ ముంచి చిరునామా రాసేడు.
ఊళ్ళో ఉన్న తాతయ్యకు.
మళ్ళీ కాసేపు బుర్ర గోక్కుని ఆలోచించేక, కొన్స్టాన్టివ్ మేకరిచ్, అని మరో ముక్క కూడా రాసేడు. ఏ అడ్డంకీ లేకుండా రాయగలిగినందుకు సంబరపడుతూ, నెత్తిన టోపీ పెట్టుకుని, కోటు వేసుకోకుండా చొక్కాతోనే వీధిలోకి పరిగెత్తాడు.
ఉత్తరాలను తపాలా పెట్టెలో వేస్తే, వాటిని గంటలున్న బగ్గీల్లో త్రాగుబోతులైన బండివాళ్ళు భూమ్మీద ఎక్కడికైనా చేరుస్తారని నిన్న మాంసం కొట్టాయన వంకాకి చెప్పాడు. అంచేత వంకా దగ్గరలో వున్న తపాలా పెట్టె వద్దకు పరిగెత్తి ఆ అపురూపమైన ఉత్తరాన్ని ఆ పెట్టెలో కుక్కేసాడు.
ఒక గంట తర్వాత ఆశల పల్లకిలో విహరిస్తూ, అతను గాఢనిద్రలోకి జారుకున్నాడు.అతనికి నౌఖరుల వంటిల్లు, వంటింట్లో వెచ్చటి పొయ్యి, పొయ్యి గట్టుమీద కూచుని కాళ్ళూపుతూ, తన ఉత్తరాన్ని నౌఖరులకు చదివి వినిపిస్తున్న తాతయ్య కలలో కొచ్చాయి. పొయ్యి ప్రక్కనే తోక ఊపుతూ ఈల్ కూడా ఉంది.
* * *