తాకిడి

Spread the love

కారుణ్యం పొడచూపి అన్నవాహిక మూసుకుపోయి వారం రోజులవుతుంది. రేపోమాపో పోతాడని చుట్టూ నలుగురూ, కుటుంబం వారం రోజులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. చెల్లపెరుమాళ్ తాతయ్యకు ఇంకా జీవం విడిపోలేదు. కాళ్ళూచేతులు ఎప్పుడో ఎండుపుల్లల్లా ఎండిపోయాయి. అన్నవాహికలో ఏదో పురుగు చిక్కుకున్నట్టు ఏదో తెలియని కంగారు. కళ్ళు మాత్రం పోక చెక్కల్లా అటూ ఇటూ గుడ్లు మిటకరిస్తూ కదులుతుంటే, తొంభై రెండేళ్ళ వయస్సులో ఈ మనిషి ఇంకేం ఎదురుచూస్తున్నాడు? వారం రోజులుగా కుటుంబంలోని వారినందరిని ఈ ప్రశ్న తొలిచేస్తుంది.

“దిక్కుమాలిన గూట్లో ఇంకా ఆరిపోకుండా ఏం కోరిక మిగులుందని ఇంకా రగులుతోంది?” పాంజిపలం అవ్వ – ఆవిడే చెల్లపెరుమాళుకు ముద్దుల చెల్లెలు. వాకిట్లో కాళ్ళు ఆరజాపుకుని కూర్చుని అమందస్తాలో వక్కలు దంచుతూ గొణుగుతుంది. ముసలాయన జాతకమంతా ఆవిడ అరచేతుల్లోనే! అయినాసరే ఆవిడే ఏదీ ఒక పట్టాన అంచనాకు రాలేకుంది? అంతగా ఏమిటంట ఈయనకు ప్రాణం మీద మమకారం అలా వంటిని అంటిపెట్టుకుని వుండేందుకు?

పెద్దాయనకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్ళు. ముగ్గురు కూతుళ్ళకు పెళ్ళిళ్ళూపేరంటాలు అయ్యి, అందరూ పిల్లాపాపలతో వారివారి ఇళ్ళలో సుఖసంతోషాలతో బతుకుతున్నారు. పెద్దాయన కొడుకుతో, అతడికి చెందిన ముందు బంగళాలోనే అతన్ని వుంచారు. రేపోమాపో పోతాడు, కార్యాలను పూర్తి చేసుకుని, ఏకంగా ఊరు వదిలి పోవచ్చుననే ఆలోచనతో ముగ్గురు అమ్మాయిల మొగుళ్ళు, పిల్లలతో ఎదురుచూస్తున్నారు.

“నాన్న కార్యం ముగుస్తుంది, వెంటనే బయలుదేరిపోతారు,” అని అన్నయ్య కంగారు పెట్టి పిలవడంతో, “గుండెలు బాదుకుని ఇక్కడికి వస్తే, తీరా చూస్తే ఇక్కడ కార్యం ఇలా లాగుతుంది!  ఇంట్లో ఎక్కడివక్కడ వదిలేసి వచ్చిన పనులన్నీ అక్కడికక్కడే అలాగే పడున్నాయి. ఏం కర్మా?” ఒకరితో ఒకరు గొణుక్కుంటూ, ఇంటి బయట ఆవరణలోని పనసచెట్టు నీడలోని కుర్చీలలో విసుగ్గా ఆవళింతలు వదలడం, లేచి లోపలికి వెళ్ళి చూడటమని ఇంటి అల్లుళ్ళు అలసిపోయారు. ఇంటి ఆడపడుచులు తలా ఒక దిక్కున చాపపై కూర్చుని వాళ్ళ వాళ్ళ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంటి కోడళ్ళకు ఊపిరి పీల్చేందుకు తీరిక లేదు. పదిపదిహేను ప్రాణాలకు టంచనుగా వండివార్చడం అంటే మాటలా? ఎలాగో చనిపోతే ఇళ్ళకు చావుకబురు చెప్పి పంపుతాం కదా? ఇంటికెళ్ళి పడి ఏడొచ్చుగా అనే దిగులు ఆయనకు. పెద్దగా నిట్టూర్చి, ఇంటి వంటగదిలో కొరకంచులతో అతడు నిప్పును గెలికాడు.

పిల్లలకు ఒకే సందడి, కొలను దగ్గరికి వెళ్ళి చిందులెయ్యడం, తోటలోని చెట్లెక్కి మామిడి కాయలు తెంపడం, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి ఎగిరిదూకి, ముట్టుకుని ఆటలాడటం, సీతాకోకచిలుకలను వెంటాడటం… వాళ్ళకి అంతకు మించి ఏం కావాలి?

పెద్దాయన తొంభై రెండేళ్ళ వరకు సాదాసీదా బ్రతుకా బ్రతికాడు! చిన్న కోడలు అఖిలకు తన అన్నయ్య గొప్పలను చెప్పుతుంది ముసల్ది.

“ఆయనకంటే ధనవంతులు అనేకమంది ఉండనే ఉన్నారు. అయితే, ఆయనకు మల్లే జీవితాన్ని అణువణువు అనుభవించినవాళ్ళు ఎంతమంది వుంటారు? చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోయి, అమ్మ ఆలంబనలో గంగిగోవులా తిరిగినవాడు. ఆయన చెయ్యని తుంటరి పనులున్నాయా? చూడని ప్రపంచం వుందా?  అనుకున్నది అనుకున్నట్టు జరిగితీరాలి. చివరి రోజులవరకు ఆ పంతం ఆయన్ని వదిలిపోలేదు. ఇప్పుడు మనసులో ఏ ఆశ కొట్టుమిట్టాడుతుందో… పాడు ప్రాణాన్ని పోనివ్వకుండా అంటిపెట్టుకుని వుంది?”

“అలాగా అత్తయ్యా!”

“జమీందారు ఆటలు ఎన్ని ఆడినా, ఆస్తిపాస్తుల వ్యవహారంలో ఎంతో ఎరుకతో వుండేవాడు. ఎండనో, వానో, గాలో, మంచో, పెందలకాడి నక్షత్రం కొండెక్కేసరికి పళ్ళు తోముకుని తయ్యారయ్యేవాడు. మరదలు ఇచ్చిన ఉల్లిపాయను కొరికి, చద్దిగంజి తాగుతూ, కత్తీ, పార భుజానేసుకుని బయలుదేరితే, పొలం, తోపులని అన్నీ కలియ తిరిగేసి, మళ్ళీ ఇల్లు చేరుకునేసరికి పొద్దుపోతుంది. ఆపైన స్నానం, భోజనం, నిద్ర… సాయంకాలం ముప్పేట నీడలో ఊరి తగాదాలు, పులి మేక ఆట, పేకాట, పంటదిగుబడి రోజుల్లో అయితే విశ్రాంతి, నిద్రా వుండదు. వెరవకుండా పని చేస్తాడు.

“ఎన్ని తోపులు, పంటపొలాలు వున్నా, ఆయనకి ఇష్టమైంది పాము బోదె దగ్గరున్న మావిడి తోపే. రకరకాల మామిడి చెట్లు, అవన్నీ ఆయన వెతికి, వెతికి సేకరించి నాటి పెంచినవి.”

“మంచి మావిడి చెట్టని తెలిస్తే చాలు, ఏ ఢిల్లీ అయినాసరే వెళ్ళి, ఆ చెట్టుకి అంటు తీసుకుని వచ్చేసేవాడుగా.”

“ఒకవేళ ఆ తోట పేరుమీదున్న మమకారం వలనేనేమో ఇంకా ప్రాణం పోకుండా మిగులుందేమో?” అఖిలకి వున్నట్టుండి ఒక సందేహం తలెత్తింది. మరునిముషమే వెనుక గది మంతనాలు జరిపే చోటయ్యింది. భాస్కరన్ ఆ తోటవైపుకు పరుగున వెళ్ళి, కొంచెం మట్టిని తీసుకువచ్చి, నీటిలో కలిపి, తన పెద్దకొడుకు చేత్తో ఆయన నోట్లో మూడు చుక్కలు పోయించాడు, రెప్పవాల్చకుండా అందరూ చుట్టూ చూస్తూ నిలబడిపోయారు. నీళ్ళు నోటి చివరల్లోంచి బుగ్గ సొట్టల్లో కారిందేగాని, గొంతు దప్పిక తీరలేదు.

“ఏంట్రా ఇది, ఆశ్చర్యంగా వుంది? ఆయన ప్రాణంలో ఇంకేం కోరిక అంటిపెట్టుకునుంది?” అందరూ గుమిగూడి ఆలోచించారు.

రెండవ కూతురు శాంతి ఇలా అంది “నాన్నకి నా కొడుకు పేరు మీద వల్లమాలిన ప్రేమ? తన పోలికలతో వున్నాడని ఎత్తుకుని ముద్దాడేవాడు.” వాడి చేతులతో పాలు పోసి చూద్దామా?”

ఇలా చెప్పడంతో మిగిలిన కూతుళ్ళకి ఒళ్ళు మండింది. అయితే, ఇలాగైనా ఆయన ప్రాణం పోతే సరేనని ఒప్పుకుని, ఆ పిల్లాడిని వెతికి తీసుకువచ్చారు. అతడి చేతికి ఒగ్గుపాల గిన్నెను ఇచ్చి, ఆయన నోట్లో పాలు పోయమన్నారు. ఆయన గొంతులోకి పాలు దిగాయి. ఆయన కళ్ళు కూడా కాస్త వాడి వైపుకు తిరిగాయి. ఆపై కళ్ళు తేలేస్తూ కాసేపు ఒకలా ఆపసోపాలు పడ్డాడు. పోతారు అనే నమ్మకం దాదాపు అందరికీ ఖరారయ్యింది. అయితే, గాలి వీచి మేఘం చెదిరిపోనట్టు, కాసేపట్లో అంతా మారిపోయింది. అదే కంగారు, అదేవిధంగా గుడ్లురిమి చూడటం, అరె…ఛ… అని అనిపించింది అందరికీ.

ముసలాయన ఇలానే పడుంటాడు. ఏడాది అయినా చావడు. అందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోదామని ఆడవాళ్ళందరూ ఉపాయం పన్నారు. అలాగే మరుసటిరోజు సాయంత్రానికి వారి వారి ఊళ్ళకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. మూటాముల్లే సర్దుకుని, పిల్లలకు తలలు దువ్వి, పౌడర్ అద్దుతుంటే పెద్దకూతురు కళకి ఉన్నట్టుండి ఒక ఆలోచన తట్టింది. వదినతో ఇలా అంది “వదినా, చూసినకాడికి చూశాం, చివరి ప్రయత్నం… అందరం కలిసి మన కాళియమ్మన్‌‌‍‌కి ఒక పూజ చేసి, ఆ విబూది నీళ్ళలో కలిపి నాన్నకు పట్టిద్దామా?”

“దానికి బదులు ఇలా చెయొచ్చుగా” ద్వారబంధం పట్టుకుని లోపలికి తొంగి చూసింది ముసల్ది.

“ఈ అత్తయ్య ఏం చెప్పాలనుకుంటుంది?” అర్థంకాక బిక్కముఖాలేసారు లోపల నిలబడున్నవాళ్ళు.

“పూర్వం రోజుల్లో ఇలా పడున్నవాళ్ళను మంచినూనె రాసి, చన్నీళ్ళతో స్నానం చేయించి కోడికూరతో అన్నం కలిపి రెండు ముద్దలు తినిపిస్తే, ప్రాణానికి రెక్కలొచ్చి స్వర్గంలోకి ఎగురుకుంటూ వెళతాయి” అని అందావిడ కళ్ళు చికిలిస్తూ.

“ఓలమ్మో!” ఇంట్లో కోడలు వేసిన కేకలకు మిగిలినవాళ్ళంతా నోళ్ళెల్లబెట్టారు.

“ఆ తర్వాత ఆ పాపాన్ని ఏ గుళ్ళో కడుక్కోవాలి? అరటి పిందెల్లాంటి పిల్లలను కనెట్టుకుని, వద్దు తల్లీ ఈ విపరీతం.”

మిగిలిన వాళ్ళందరికీ లోలోపల అత్తగారు చూపిన మార్గం సమంజసంగానే అనిపించింది. అయినాసరే, ఇంటి యజమానురాలు ఇలా ఒక్కవేటు వేశాక ఆపై ఎవరు మాత్రం నోరు మెదపగలరు.

మంచానపడ్డ తండ్రిని, తోడుకి ముసలి అత్తయ్యను ఇంట్లో వదిలేసి, మరుసటిరోజు కుటుంబమంతా కలిసి వ్యాన్ పట్టుకుని కాళియమ్మన్ గుడికి బయలుదేరారు. పూల అలంకారం, మేళతాళాలు, మేక మాసం ఉపారం, పొంగలి అన్నీ పూర్తయ్యి వాళ్ళ మహిమ గల ఆ అమ్మవారి విబూది పొట్లం చుట్టి, ఉపారము తీసుకుని అనుకున్న కార్యంలో జయం కలగాలనే నమ్మకంతో చీకటితో ఇంటికి చేరుకున్నారు.

చచ్చిచెడి గుమ్మం ముందు నోరెళ్ళబెట్టి కూర్చునున్న అత్తయ్యను చూడగానే అందరికీ సంగతి అర్థమయ్యింది. “ఆహా! ఆ కాళికమ్మా మనల్ని చెయ్యి వదల్లేదు! కరుణించింది” ముసలిదాని కాళ్ళను పక్కకు జరిపి కొడుకు ముందుగా వెళ్ళాడు, విబూది పొట్లాన్ని విప్పి తండ్రిని చూసాడు. పళ్ళూడిపోయిన, గడ్డం బొచ్చుడిపోయిన బూడిద రంగు నోరును తెరిచాడు. మనసులో ఒకరకమైన కంగారు, నాన్న గొంతును తీక్షంగా చూశాడు. ఎటువంటి చలనం లేదు. వణుకుతో చేతిమడమ ముక్కు దగ్గరకి తీసుకువెళ్ళాడు. ఊపిరాడటం లేదు. ఇంతవరకు అతనిలో పొడచూపిన ఎదురుచూపులు చటుక్కున కనుమరుగై నాభి నుండి ఒక ఆక్రందన తన్నుకొచ్చింది.

“ఏయ్! నన్ను కన్న నా అయ్యా… మిమ్మల్ని కాళియమ్మ తీసుకెళ్ళిపోయిందే!”

ఒక ముసిముసి నవ్వు పెదవంచున చిగురించగా, తలను పైక్కెత్తింది ముసల్ది.

“ఇదేంటీ లేపుతున్నారు. నేను ఏంటీ అరుస్తున్నాను. ఈమేంటీ పళ్ళికిలిస్తుంది… ఛీ! కంగారు కంగారుగా బయటకురికాడు.

“అయ్యయ్యో, నాన్న పోయారు! కాళియమ్మ నాన్నను తనలో కలుపుకుంది… ఓ… ఓ…”

అంతే! ఎనిమిది రోజుల చికాకు ఒక క్షణంలో కనుమరుగై, మనసు అంచుల్లో దాగున్న తాపాలు, కోరికలు సర్రున పెల్లుబికాయి.

“ఏయ్! నన్ను కన్న నాన్నా, నన్ను ఒంటర్ని చేసి పోయావే!”

ప్రతొక్కరూ పోటీపడి మరీ దూసుకెళ్ళి పెద్దాయన మంచాన్ని చుట్టుముట్టి ఏడుపులంకించుకున్నారు.

ఊరంతా ఒకటి కూడి ఇక చెయ్యవలిసిన వాటి గురించి ఆలోచించి, మరుసటిరోజు ఉదయం పదింటికి అంతిమ సంస్కారాలని తీర్మానమయ్యింది. ముందురోజు రాత్రి ఆర్భాటాలు క్రమక్రమంగా తగ్గి, రాత్రి చిక్కబడేకొద్దీ ఇల్లు సద్దుమణిగింది. లోగొంతుకలో స్త్రీలు పెద్దాయన జీవితంలోని మంచిచెడ్డల లెక్కలు బేరీజు వెయ్యసాగారు.

“చూశారా! చూశారా! నాన్న గారి ప్రాణం దేనికోసమని ఇన్నిరోజులుగా ఈ ఎముకల గూళ్ళో అతుక్కుపోయిందని?” పెద్దకూతురు శాంతి తన సామర్థ్యాన్ని తనే మెచ్చుకుని తలాడించింది. “పూజ చెయ్యాలని ముందుగా నేనే కదా అనింది.”

“నాకూ అదే ఆలోచనే వుండిందక్కా.” అంది రెండో కూతురు.

అన్నయ్య ఏమన్నా తక్కువోడా? అత్తయ్యను తోడుకి పిలిచాడు. “నేనూ అప్పుడే అనుకున్నాను. నాన్నకు కాళియమ్మ గుడంటే ప్రాణమని. అంతేగా అత్తయ్యా!”

“అవునవును” నెరిసిన తలను లయగా ఆడించింది అత్తయ్య. అయినాసరే అతడి గొంతు, అంటుకుపోయిన పెదవుల్లోను ఒక వెకిలి నవ్వు తొంగి చూడటాన్ని దాచలేకపోయింది.

“ఏంటీ పిన్ని?” అని అత్త వైపు సరుక్కున చూపు తిప్పింది ఇంటి యజమానురాలు. “ఏదో రహస్యం మీలో దాచిపెట్టినట్టనిపిస్తుందే? మనసులో వున్నది నోరు తెరిచి అందరికీ చెబితే అందరికీ తృప్తిగా వుంటుందిగా.”

“అత్తయ్య ఎప్పుడూ ఇంతే” భార్యను సమాధానపరిచాడు భర్త, “అందరూ ఎడ్డెం అంటే ఆమె తెడ్డెం అంటుంది.”

ముసల్ది సమాధానమివ్వలేదు. చర్మం ముడతలుపడిన కుడి చేతితో తమలపాకును దంచే రాతి రోలును పక్కకు జరిపింది. తన మనసులోనిది ఆయన ఎవరికి చెప్పుకోగలడు?

నాలుగింటి కంటే ముందే, పగటిని రాత్రి ముసురుతున్న అధ్బుత సమయంలో దొంగపిల్లిలా అప్పటి లక్ష్మీ టీచర్ చటుక్కున ఇంట్లోకి ప్రవేశించి, ఒత్తిగిల్లి బెంచి మీద పడుకునున్న తనని పడుకుందనుకుని దాటి వెళ్ళి అన్నయ్య మంచం దగ్గరకెళ్ళి కూర్చుంది, వడలిపోయి, పండిపోయి, ఉయ్యాలలూగే తన కండరాలతో అన్నయ్య చేతిని అందుకుంది, అన్నయ్య ఆమె వైపు ముఖాన్ని తిప్పడం, ఆయన ఇన్ని రోజులూ ఇంత బలాన్ని తనలో ఎక్కడ దాచి పెట్టుకున్నాడో, టీచరమ్మ చేతిని లాక్కుని తన గుండెలపై అదిమిపట్టుకోవడం. ఆ చేతిని పెదవులతో ముద్దుపెట్టుకోవడం, ఓలమ్మో ఎనభయేళ్ళ టీచరమ్మ మామిడి పండులాంటి ముఖాన్ని అప్పుడు చూసుండాలి… సంకటమా, సంతోషమా, శాంతమా, ఆక్రందనా అది, ఆమె ముఖం అంతలా ఎర్రబడింది. కళ్ళలో రెండు ముత్యాలు ఒకటై మిరుమిట్లు గొలిపాయి. అరవైయైదేళ్ళ క్రితం అన్నయ్యతో తిరిగిందిగా. ఆ సంతోషంలో మెరిశాయా? ఆపై కులం సమస్యల్లో చిక్కుకుని పెళ్ళి ఆగిపోయిందిగా, ఆ వాంఛతో మెరిశాయా?

ఒక నీడలా ఆమె చీకట్లో కలిసిపోయేసరికి, ఆ చీకటినే రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాయే ఆ కళ్ళు, అందులో నిండిన ఆ కాంతా… వాంఛనా… ముప్పై ముప్పయైదేళ్ళ క్రితం ఇద్దరూ తోడు కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న సమయంలో, బదిలీ అయ్యి ఈ ఊరి బడికి ఇదే లక్ష్మీ టీచర్ వచ్చాక, తిరిగి ఇద్దరి మధ్యా అనుబంధం మంట అంటుకుంటే, ఆ మంట ఊరంతటికీ తెలిసి ఊరూవాడా ఏకమై ఆమెను దూరంగా తరిమేస్తే, పాపం ఆ మహాతల్లీ!… ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ మంట చల్లారలేదే? ఈ మనిషి ఇలా పడున్నాడని ఎలా తెలిసుంటుందబ్బా? ఎలా ఈ ఊరికి తెగించి వచ్చింది? మనుష్యులు లేని సమయం చూసుకుని ఇంట్లోకి ఎలా చొరబడింది? పువ్వులా ఆయన ప్రాణాన్ని తెంపి తన గుండెల్లో పొదువుకుని, ఎలా బయటపడింది? అప్పుడు అన్నయ్య కళ్ళలో ప్రకాశించిన కాంతి, నేనూ నా పెనిమిటితో యాభయేళ్ళు కాపురం చేశాను, ఒక క్షణమైనా ఆ కాంతిని ఎరుగుదునా?

“దేవుడా, దేవుడా, దేవుడా!” అని నోరు మెదపకుండా ఉన్నఫళాన బెల్లం కొట్టిన రాయిలా ముసల్ది కూలబడిపోయింది. అప్రయత్నంగానే ఆమె రెండు కళ్ళు ధారలను చెమర్చాయి.

***

శ్రీ కండేశ్వరన్ భక్త వచ్చలన్

1940లో నాగర్కోయిల్లో పొన్నీలన్ అనబడే కలంతో రాసే శ్రీ కండేశ్వరన్ భక్త వచ్చలన్ జన్మించారు. కోవిల్ పట్టీలో స్కూల్ టీచరుగా పని చేసారు. ఇంతవరకు ఎనిమిదికి పైగా నవలలు, తొమ్మిది కథా సంకలనాలు వెలువరించారు. యాభయేళ్ళగా రచనలు చేస్తున్న ఆయన సాహిత్యంలో సోషలిజ యదార్థవాద ఛాయలు వుంటాయి.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *