వాకిట్లో డ్రైవర్ కారు ఆపగానే సిక్త దిగి ముందు గది తలుపు తెరుచుకుని లోపలి వెళ్ళింది. డ్రైవర్ వెనుకగా సూట్ కేస్ తీసుకుని వచ్చి నేల మీద పెట్టి వినమ్రంగా నిలబడ్డాడు మేడమ్ ఇచ్చే ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ
“సార్ రేపు కానీ రారు. నువ్విప్పుడు వెళ్ళిపోయి రేపు వచ్చేయ్” అన్నది అన్నది సిక్త
“అయితే నేనిప్పుడు కారు తీసుకుని వెళతాను మేడమ్. రేపుదయం ఎయిర్పోర్ట్ కి వెళ్లి సార్ ను పికప్ చేసుకుని వస్తాను” అన్నాడు డ్రైవర్
ఆమె సరే అన్నట్టు చూసింది. డ్రైవర్ తన చేతివేళ్ళను నుదురు కి నమస్కరిస్తున్నట్టు తాకించి వెళ్ళిపోయాడు. ఆ సమయం లో ఇంట్లో ఎవరూ వుండరు అన్న విషయం సిక్త కి తెలుసు, వంటమనిషి కి కానీ, తోటమాలి కి కానీ రాంచీ నుండి తాను ఆరోజు వస్తున్నట్టు తెలియదు. పనిమనిషి రావడానికి అది సమయం కూడా కాదు. కనుక సిక్త కి తనకంటూ ఒక గంట టైమ్ దొరికింది.
చాలా కాలం క్రితమే సిక్త ఆ ఇంట్లోని ఒంటరితనానికి అలవాటుపడింది. ఆ ఇంట్లోని విలాసవంతమైన ఫర్నిచర్, ఖరీదైన కుడ్య చిత్రాలు, నేల మీది మందపాటి తివాచీలు, అందమైన పూలతోట, ఆ తోటను వెలిగించే దీపాలు, తోటలోకి ప్రత్యేకంగా పూరి నుండి తెప్పించబడిన గ్రానైట్ శిల్పాలను చూసిన ప్రతిసారీ సిక్త ఆ ఇంటికి ఒక అపరిచిత లాంటి భావనకు గురిఅవుతుంది. తన అద్భుతమైన, అద్వితీయమైన అభిరుచికి నిలువెత్తు ఉదాహరణ లా నిలిచే ఆ ఇల్లు తనను ప్రతిసారీ ఎందుకు ఒక లాంటి అనిశ్చితి కి గురి చేస్తుందో, తాను పరాయి అన్న భావనలో ముంచి తేల్చుతుందో ఎంత ఆలోచించినా సిక్త కి అర్ధం కాదు.
నిజంగా ఎందుకు?
ఎందుకు ఒక అశాశ్వతమైన నీడ ప్రతి దానిమీద వేలాడుతూ ఉంటుంది? ఎందుకు ఒక వేదన పదే పదే వెంటాడుతూ ఉంటుంది ? సిక్త దేనిని పోగొట్టుకున్న భావనకు గురి అవుతున్నదో కచ్చితంగాతెలుసుకోవడం సాధ్యం కాదు కానీ ఆమె మాత్రం దేని నుండి తాను విడివడి వచ్చిందో అక్కడకు వెళ్లాలని స్థిరంగా నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ తాను వెళ్ళవలసింది ఎక్కడికో ఆమెకే తెలియదు. కానీ ఒక సన్నని ఆశను మాత్రం ఆమె పోషిస్తూ వస్తోంది.
సిక్త కి తన జీవితం మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. నిజానికి సిక్త చాలాసార్లు తనతో తానే ఘర్షణ పడుతూ ఉంటుంది. జీవితం తనకేం తక్కువ చేసిందని? . జీవితం ఆమెకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. ఏ ఆర్కిటెక్ట్ కలలోంచో సరాసరి భూమి మీదకు నడిచి వచ్చినట్టుంటది ఆమె ఇల్లు. అయినప్పటికీ, ఆమె హృదయం మాత్రం చిన్నప్పుడు తానున్న ఇంటివైపే పరుగెడుతుంది. ఆమె చిన్ప్పటి ఇంటి చుటూ అందమైన ఒక తోట, ఆపైన దిగంతాల వరకు వ్యాపించిన వరి పొలాలు, ప్రతి ఉదయాన్నీ మంత్ర ముగ్ధం కావించే మార్మిక మంత్ర దండం లాంటి పరిసరాలు సిక్త విస్మృతి లోకి ఎప్పుడూ జారిపోవు.
కానీ ఆ అద్భుతం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు
సిక్త తండ్రికి భువనేశ్వర్ బదిలీ అయింది. దానితో అనివార్యంగా సిక్త కుటుంబం నాలుగు నాలుగు అపార్ట్మెంట్ లు ఉన్న ఒక బ్లాక్ లోని నాలుగో అపార్ట్మెంట్ పై ఫ్లోర్ లోని ఒక ఫ్లాట్ లోకి మారిపోవలసి వచ్చింది. రెండు చిన్న బెడ్ రూమ్ లు, మరొక చిన్న సిట్టింగ్ రూమ్, ఐరన్ గ్రిల్ తో బంధించబడిన మరీ చిన్న బాల్కనీ ఆ ఫ్లాట్ పూర్తి స్వరూపం
“ఇదొక అగ్గిపెట్టె లాగా వుంది. అంత పెద్ద ఇంట్లో ఉండి వచ్చి ఈ అగ్గి పెట్టెలో మగ్గి పోవాల్సి వచ్చింది. ఐదేళ్లు ఆ ఇంట్లో హాయిగా వున్నాము. మన ఖర్మ ఇలా వుంది. ఏం చేస్తాం?” అని సిక్త తల్లి చాలా సార్లు నసపెట్టేది ఎవరినీ ఉద్దేశించకుండా.ఆకాశానికి, నేలకు కాకుండా మధ్య లో గాలిలో వేలాడుతున్నటు వున్న ఆ ఫ్లాట్ సిక్త ను కూడా చాలా నిరాశపరిచింది. కలల ప్రపంచం లోనుండి ఎవరో బయటకు నేలమీదకు బలవంతంగా నెట్టేసినట్టు అనిపించింది
కింది ఫ్లాట్ లోని ముందు భాగమంతా మురికి మురికి గా కనిపించేది. ఆడవాళ్ళ లో దుస్తులు ఇంటిముందే నిర్మొహమాటంగా ఆరవేసి ఉండేవి. సిక్త బాల్కనీ నుండి కిందకు తొంగి చూస్తే ముందు కనపడేవి ఆ లోదుస్తులే. ఆ అపార్ట్మెంట్ కి ఎదురుగా వున్న మరొక అపార్ట్మెంట్ కూడా పూర్తిగా దీనికి జిరాక్స్ కాపీలా ఉండేది. సిక్త ఫ్లాట్ కు ఎదురుగా ఉన్న ఫ్లాట్ కిటికీలోనుండి రెండు కళ్ళు నిరంతరం సిక్త ఫ్లాట్ వంకే చూస్తూవుండేవి. ఆ రెండు కళ్ళు బహుశా ఏ వయసులో ఉన్న యువకుడివైనా కావచ్చు, మధ్య వయసు పురుషుడివైనా కావచ్చు లేదూ ఆ ఫ్లాట్ లోని మరొక స్త్రీవి అయినా కావచ్చు. స్పష్టంగా తెలిసేవి కాదు. ముందు విశాలమైన రహదారి ఎప్పుడూ వచ్చే వాహనం, పోయే వాహనం తో రద్దీగా ఉండేది. ఏ అర్ధ రాత్రి దాటినతరువాతో రెండు మూడు గంటలు నిశ్శబ్దం చోటువెతుక్కునేది ఆ రహదారిమీద.
ఈ ఫ్లాట్ లోకి వచ్చిన తరువాత ఇంతకుముందు ఉన్న విశాలమైన తోట, అందులో ఉన్న పండ్ల చెట్లు, అన్నిటినీ మించిన ఆటస్థలము పదే పదే గుర్తుకు వచ్చేవి సిక్త కి. ఇక్కడ ఆ ఇరుకిరుకు ఫ్లాట్ లో ఊపిరి ఆడక బయటకు రావాలి అనుకుంటే ఆ అపార్ట్మెంట్ లోని అన్ని కుటుంబాలు పంచుకునే టెర్రస్ మాత్రమే వుంది. అది కూడా ఏ మధ్యాహ్నం పూటో ఒంటరిగా దొరికేది. సిక్త తన ఊహలు అన్నిటినీ ఆ చిన్ని స్థలానికి మాత్రమే పరిమితం చేసింది. స్కూల్ కి వెళ్ళడమూ, హోమ్ వర్కూ, కొత్తగా అయిన స్నేహితులతో కబుర్లూ ఇవన్నీ పోను చాలా తక్కువ సమయం దొరికేది సిక్త కి కలల ప్రపంచం లో తేలిపోవడానికి. ఆ బ్లాక్ లో ఉన్న మిగతా అపార్ట్మెంట్ లలో ఉన్న ఆడపిల్లలు అందరూ దగ్గరలో ఉన్న చిన్న కల్వర్టు మీదకు చేరేవారు ఊసుపోని కబుర్లు చెప్పకోవడానికి. సిక్త మాత్రం ఆ గుంపులో కలిసేది కాదు. వీలు చిక్కితే టెర్రస్ మీదకు వెళ్ళేది. అప్పుడప్పుడు తల్లి కూడా సిక్త తో వచ్చేది . కానీ అది చాలా అరుదు. టెర్రస్ మీద పిట్టగోడను పట్టుకుని కిందకు పైకి తొంగి చూడటానికి బదులుగా టెర్రస్ మీద కూర్చునేది సిక్త. అలా కూర్చోవడం వలన మిగతా ప్రపంచానికీ, ఆమెకీ సంబంధం తెగిపోయి, తన ప్రపంచం లో తాను మునిగిపోయేది. రహదారి మీది రణగొణ ధ్వని, కింది ఫ్లాట్ వాళ్ళు ఆరేసిన లోదుస్తులు చూసే బాధ ఆమెకి తప్పేది. పైన విశాలమైన ఆకాశమూ, కింద సిక్త అంతే. అప్పుడప్పుడు తెల్లని మబ్బులు గుంపులు గుంపులు గా ఆమె యవ్వనోత్సాహపు కలలు లాగా
బహుశా, అప్పుడుఁ ఆమె హృదయం లో నీరసమైన వాతావరణం లో నుండి కూడా ఉత్సాహాన్ని నింపుకునే మంత్రజాలం ఏదో ఉండి ఉంటుంది ఆమె హృదయం లో. ప్రతి చిన్న విషయానికీ మంత్రముగ్ధ లాగా మారిపోయేది.
కానీ ఇప్పుడు అలా కాదు
ఇప్పుడామె ప్రకృతిలో తానొక భాగమని భావించడం లేదు. వెన్నెల రాత్రుల మార్మికత్వానికి, కాంతులీనే నక్షత్ర సమూహాలని పొదవిపట్టుకున్న చీకటి ఆకాశానికి, చెప్పాపెట్టకుండా వచ్చి ఉధృతంగా తడిపేసే అకస్మాత్తు వానల జలదరింపులకి ఆమె ఎందుకో స్పందించడం లేదు. ఆమె హృదయం సున్నిత భావనలకు ఇమ్యూన్ అయిపొయింది. ఆమె అంతలా స్పందనా రాహిత్యాన్ని కౌగిలించుకోవడానికి కారణం ఏమిటీ? కాలమా?చిన్నప్పటి తన్మయత్వం నుండి ఆమె ఎందుకు దూరమైపోయింది? తన కలల ప్రపంచం లో తాను విహరించడానికి ఆమెను అడ్డుకునేవి ఏవీ లేవు? కానీ ఆమే నీళ్లు లేని మేఘం లా, పరిమళం లేని పుష్పంలా
ఇదంతా , బహుశా ఆమె సహచరుడు అమర్ పక్కన లేకపోవడం వలననేమో! అమర్ వలన తన ఆనందం ఎన్నిసార్లు రెండింతలు, మూడింతలు అయిందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నం చేసింది సిక్త. హృదయానికి నచ్చిన వారి సాంగత్యం లో ఎక్కువ సేపు గడపడానికి మనసు ఆరాటపడే ప్రత్యేకమైన జీవన సందర్భం లోకి తాను అడుగుపెట్టాను అని సిక్త కి అర్ధం అయింది.
రాంచీ కి సిక్త ప్రయాణం, సాధు బాబా దగ్గర గడిపిన క్షణాలు ఆమె జీవితం లో ఇప్పటికీ ఒక అరుదైన అనుభవం . మొదటి సారి రాంచీ వెళ్ళినప్పుడు సిక్త లో చాలా సందేహాలు ఉండేవి. పైగా అది సిక్త ఒంటరిగా చేసిన ప్రయాణం కూడా. కానీ సాధు బాబా సమక్షం ఒక మరచిపోలేని ఈవెంట్ గా మారిపోయింది. ఆ అనుభవాన్ని వర్ణించడానికి ఆమె దగ్గర భాష కూడా లేదు. చాలా మంది ఆ అనుభవాన్ని ఒక Hallucination అని తృణీకరించవచ్చు కానీ ఆ అనుభవం సిక్త కి మాత్రం తాకి చూడగలిగిన ఒక Reality.
సాధు బాబా ఆమెను కళ్ళు మూసుకొమ్మని అడిగాడు. ఆమె కళ్ళు మూసుకుంది. అలా కళ్ళుమూసుకుని ఎంత సేపు ఉండిపోయిందో ఆమెకు తెలియదు. బహుశా ఒక మార్మికత లోకి ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. తనది కానీ భూమి మీద తనది కాని స్థల కాలాలలో ఆమె తిరగాడుతున్నది.వెన్నెలలో స్నానం చేస్తున్న సమస్త వస్తు సముదాయము వెండి లా ప్రకాశిస్తున్నాయి. మెత్తటి, చల్లటి గాలి నలుదిశలా మంద్రంగా వీస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. ఆమె ఒక్కతే. గాలిలో తేలుతున్నట్టు వున్నది. శరీరం బరువును కోల్పోయి తేలికగా అయిపోయింది. అకస్మాతుగా ఆమె కళ్ళు రజతం లా మెరుస్తున్న స్వచ్ఛ సుందర స్ఫటిక శిల మీద పడినాయి. ఆమె ఆ శిల ను చూస్తూ ఉండగానే అది కరగడం మొదలుపెట్టింది. ఆ శిలంతా కరగిపోయాక ఎదురుగా ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె వంక సిక్త చాలా పరిశీలనగా చూసింది. ఆ స్త్రీ ఎవరో కాదు . స్వయంగా సిక్తనే . స్ఫటిక శిల సిక్త లా మారింది.
మెల్లగా సిక్త కళ్ళు తెరచింది. ఎదురుగా సాధు బాబా! బాబా కళ్ళు ఒక అలౌకిక సౌందర్యం తో ప్రకాశిస్తున్నాయి. చుట్టూతా ఒక వినూత్న పరిమళం.
“నువ్వేమి చూశావు?” బాబా అడిగాడు సిక్త ని.
“నేను—-” అర్ధోక్తి లో ఆగింది సిక్త. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా వున్నాయి. “ఆ శిల స్త్రీ లా మారింది. ఆ స్త్రీ ఎవరు? నేనేనా?”
సాధుబాబా ఏ జవాబూ ఇవ్వలేదు. అతడి మొహం లో ఏ మార్పూ లేదు. కొద్దిసేపు నిరీక్షించి సిక్త వెనుతిరిగింది. రాంచీ నుండి ఇంటికి తిరిగి వచ్చినా ఒక ప్రశ్న ఆమెను వేధించసాగింది. ఆ అసాధారణమైన దృష్టికి కారణం ఏమై ఉంటుంది? ఆమె జీవితం లో ఇప్పటికే సగభాగం గడచి, మెల్లగా ఒక నిర్లిప్తత నింపుకుని ప్రతి వస్తువునూ, సందర్భాన్నీ, మనిషినీ డిటాచెడ్ చూసే పాయింట్ కి వచ్చేసింది. తన కోసం ఒక భిన్నమైన జీవితం ఎదురు చూస్తూ ఉంది అని తెలపడానికి ఇదేమైనా సంకేతమా? ఇన్నాళ్లుగా తను విస్మరిస్తూ వస్తున్న సత్యం ఏదయినా తన అనుభవం లోకి రానున్నదా? ఆమె ఇంటికి వచ్చేంతవరకూ సిక్త ఆ అనుభవం గురించే చాలా సీరియస్ గా ఆలోచిస్తూ కూర్చుంది.
ఆమె మళ్ళీ తన కళ్ళు తిప్పి ఇంట్లోని అద్భుతమైన ఫర్నిచర్ వంక చూసింది. మహోగని సోఫా సెట్, డ్రాయింగ్ రూమ్ లో ఎదురెదురు గా గోడలకు బింగిచి వున్న వున్న రెండు పెద్ద పెద్ద అద్దాలు, రవి వర్మ వర్ణ చిత్రాలు, కిటికీలకు బిగించిన రంగులద్దిన అద్దాల పలకలు, సీలింగ్ నుండి వేలాడుతున్న షాండ్లియర్. ఇవన్నీ ఆ ఇంట్లో మనుషులతో సమానం. సిక్త దుఃఖాన్ని, సంతోషాన్ని అవి పంచుకుంటాయి. సిక్త ఉద్వేగ నిమ్నోన్నతాలకు అవి మౌన సాక్ష్యాలు.
వంటయింటిలోనుండి వినిపిస్తున్న చప్పుళ్ళు సిక్త ను స్వప్నావస్థ నుండి బయటకు తీసుకుని వచ్చాయి. “తానొచ్చిన విషయం వంటమనిషి కి తెలిసి ఉంటుంది” అనుకుంది సిక్త. నిజానికి ఆమెకు పెద్దగా ఆకలిగా కూడా లేదు. అదీకాక ఆమె తన జీవితాన్ని రెగ్యులర్ ప్యాటర్న్ లో గడపాలి అనుకోవడం కూడా లేదు. డ్రాయింగ్ రూమ్ తలుపు తెరచుకుని వరండాకి అనుసంధానించిన ఐరెన్ గ్రిల్ వరకూ నడిచింది. ఆమెకు ఇష్టమైన రాధా తమాల చెట్టు తీగెలు గ్రిల్ ను అల్లుకుని వేలాడుతున్నాయి. ఇంకొంచెం అవతల ఆమె ఎప్పుడూ కనీసం పేరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించని చక్రాకారం లో ఉన్న ముదురు నీలం రంగు పూలు పూర్తిగా విచ్చుకుని పరిమళాన్ని గాలి పొరలనిండా నింపుతున్నాయి.
సిక్త గ్రిల్ డోర్ తెరచుకుని వెలుపలికి అడుగుపెట్టింది. తన సొంత తోటను మొదటి సారి చూస్తున్నట్టు చూసింది. తోటమాలి చాలా జాగ్రత్తగా, శ్రద్దగా తోటను పెంచుతున్నట్టున్నాడు. మృదువైన కార్పెట్ లాగా మెత్తటిగడ్డి. రకరకాల పువ్వులు, వాటిమీద వాలుతున్న సీతాకోక చిలుకలు, అవన్నీ చూస్తే ఏ చిత్రకారుడో తన ఊహాశక్తి కి పదునుపెట్టి అనితరసాధ్యం గా తీర్చి దిద్దిన ఉద్యానవన చిత్రం లాగా వుంది. సిక్త కొంతసేపు అటూ ఇటూ నడిచేసరికి ఆమెకు మొదటిసారి గ్రహింపులోకి వచ్చింది. తానెప్పుడూ తనకు ఇష్టమైన పువ్వులు, లతలు, ఇచ్చే ఆనందాన్ని ఈ తోటనుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదని. ఈ పరిమళంపు సాన్నిహిత్యాన్ని వదులుకుని అమర్ సమక్షం కోసం అర్రులు సాచిందని. ఆమె హృదయం లోని శూన్యాన్ని నింపే ఆ విలువైన వస్తువు ఏదో ఆమె చేతికి అందే దూరం లో వున్నదని. తానెంత సమయాన్ని వృథా చేసింది ఈ అన్వేషణ లో
అశోక చెట్టు దగ్గర ఒక పోర్టబుల్ టేబుల్ నాలుగు కుర్చీలు వేయమని తోటమాలి తో చెప్పింది. తరువాత ఒక కప్పు కాఫీ పంపించమని కూడా. కుర్చీలో నింపాదిగా, ప్రశాంతం గా కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నప్పుడు ఆమె కళ్ళు గేట్ దగ్గర నిలబడిన స్త్రీ వంక చూశాయి.
ఎవరు?
త్రిష్ణా బోస్ లాగా కనిపిస్తున్నదే!
త్రిష్ణా బోసేనా?
అవును
త్రిష్ణా బోస్. సమీర్ బోస్ భార్య. సమీర్ బోస్ స్టీల్ కంపెనీ లో హై రాంక్ ఎక్సిక్యూటివ్. ఏదో పార్టీలో ఒకసారి ఆమెను కలిసింది. త్రిష్ణా బోస్ మంచి కలుపుగోలు మనిషి. సిక్త కంటే ఐదారేళ్లు చిన్నది.
అప్పుడప్పుడు సిక్త కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడుసార్లు ఇంటికి కూడా వచ్చింది కానీ సిక్త ఎప్పుడూ త్రిష్ణా బోస్ ఇంటికి వెళ్ళలేదు. సిక్త మంచి హోస్ట్ అయినప్పటికీ ప్రోటోకాల్ ఫార్మాలిటీస్ పాటించడం అంటే చాలా కష్టం అంటుంది.
త్రిష్ణా బోస్ ఇంకా ముందుకు వచ్చి “నమస్తే అక్కా! ఒక్కరే ఒంటరిగా కూర్చున్నారేమిటి?” అన్నది
“ఇక్కడ చాలా ప్రశాంతంగా వున్నదని. రండి కూర్చోండి ” అన్నది సిక్త త్రిష్ణా బోస్ కూర్చుంటూ ఉండగానే తోటమాలి ని పిలిచి మరో రెండు కప్పుల కాఫీ తో పాటు కొన్ని బిస్కట్స్ కూడా తెమ్మని చెప్పింది.
“అన్నయ్య గారు ఇంట్లో లేరా?” అన్నది త్రిష్ణ
“లేరు! ఇంకా సింగపూర్ నుండి రాలేదు. రేపు రావచ్చు” అన్నది సిక్త
“ఏ మాట కామాటే చెప్పుకోవాలి అన్నయ్య రత్నం లాంటి మనిషి. నిజం చెప్పాలి అంటే అన్నయ్యని వజ్రం అని పిలుస్తాను నేను. మా వారైతే అన్నయ్యది మిడాస్ టచ్ అంటారు. ఆ వ్యాపారం లో అయినా అన్నయ్య చేయి పెడితే చాలు అది బంగారం అయిపోతుంది”
త్రిష్ణ మాటలు సిక్త మొహం లో ఏ భావాన్నీ పలికించ లేకపోయాయి .వంట మనిషి ప్లేట్ నిండా బిస్కట్స్ కాఫీ తీసుకుని వచ్చి టేబుల్ మీద సర్దాడు. సిక్త కాఫీ కప్ త్రిష్ణ కి అందించి ఆమె వంక పరిశీలనగా చూసింది. సిక్త ఏమీ మాట్లాడాలి అనుకోలేదు. కానీ మాటలు ఆమె స్వర సరిహాద్దులు దాటుకుని ఈ హెచ్చరికా లేకుండా ముందుకు దూకాయి.
“నాక్కావలసింది అంతా ఒక గుప్పెడు నేల. కోరిక అనే విత్తనాన్ని నాటి అది వృక్షం లా ఎదుగుతుంటే చూడాలని ఉంది” అన్నది సిక్త ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు మాట్లాడింది. హృదయం లో ఏ మూలో బందీలు గా ఉన్న మాటలు స్వేచ్ఛ పొందినట్టుగా అప్రయత్నంగా ఆమె స్వరం లో నుండి వెలువడినాయి.
త్రిష్ణ సిక్త వంక ఇబ్బందిగా చూసింది. సిక్త ఉద్వేగంగా మాట్లాడటం త్రిష్ణని ఆశ్చర్యం లోకి నెట్టేసింది. సిక్త వెంటనే తన నియంత్రణ లోకి తాను వచ్చేసింది. ఇదంతా నేను త్రిష్ణ కి ఎందుకు చెప్పాలి. ఆమెకు అర్ధం అవుతుందా అసలు?
“ఓహ్! సారీ త్రిష్ణా! మీరు వజ్రం అన్నారుకదా అందుకని ఏదో ఎమోషన్ లో అనేశాను” అని తన నవ్వుతో పరిస్థితిని తేలిక పరచాలని ప్రయత్నం చేసింది. మళ్ళీ స్వరం విప్పి “వజ్రం నిజంగా వజ్రమే! చూడు, ఈ వేలికి నేను వజ్రాన్నిపెట్టుకున్నాను. ఎలా మెరుస్తుందో చూడు. ఈ వజ్రాన్ని నేను అందరికీ చూపిస్తాను. ఇది ఎంత విలువైన వజ్రం అంటే వేలినుండి తీయడానికి కూడా భయపడతాను ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకుంటానో అనే భయం చేత.” సిక్త ఇంకా నవ్వుతూనే వుంది.
త్రిష్ణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాఫీ కప్పు వైపు తేరిపార చూస్తూ కాఫీ చప్పరిస్తోంది. అలా కాఫీ చప్పరిస్తున్న త్రిష్ణ ను చూస్తే సిక్త కి ఒక్క క్షణం లో పాపం అనిపించింది. తనను చూడటానికి, ఒక అకేషన్ కి వెళుతున్నట్టు తయారయి వచ్చింది. తానేం చేసింది?తనని ఇబ్బందిలోకి నెట్టేసింది. అలా చేసి వుండకూడదు. సిక్త ఇలా ఆలోచనలో ఉండగానే
” అక్కా! ఇక నేను వెళ్ళొస్తాను ” అని లేచి నిలబడింది త్రిష్ణ.
“సరే! నేను కూడా రేపొకసారి మీ ఇంటికి వస్తాను” అన్నది సిక్త. తానెప్పుడూ త్రిష్ణ ఇంటికి వెళ్ళదు అనే విషయాన్ని లోలోపల మననం చేసుకుంటూ కూడా త్రిష్ణ బ్యాగ్ సవరించుకోగానే, “పద నేను కూడా గేట్ దాకా వస్తాను” అని సిక్త కూడా లేచింది.
