అధ్యాయం 24
విచారణ- తీర్పు
పీటర్ గెరాసిమోవిచ్ ఊహించినట్లే జరిగింది. అధ్యక్షుడు చర్చా గదినుండి ఒక పత్రాన్ని పట్టుకుని వెనక్కి వచ్చి దాన్ని చదవడం మొదలుపెట్టాడు;
‘ఏప్రిల్ 28, 188*. చక్రవర్తి గారి శాసనం నెంబరు ** ప్రకారం, జ్యూరీ ఇచ్చిన తీర్పు ఆధారంగా క్రిమినల్ కోర్టు ఈ క్రింది విధంగా నిర్ణయిస్తోంది; సెక్షన్ 771లో 3వ నిబంధన ప్రకారం, అలాగే సెక్షన్ 770, 777 ప్రకారం- ముప్పై మూడేళ్ల రైతు సిమియన్ కార్టింకిన్ మరియు ఇరవై ఏడేళ్ల కేథరీనా మస్లోవా- వీరిద్దరూ తమ ఆస్తి హక్కులన్నింటినీ కోల్పోవడమే గాకుండా కఠిన కారాగార శిక్షకోసం సైబీరియాకు పంపబడాలి. కార్టింకిన్‌కు ఎనిమిది సంవత్సరాలు, మస్లోవాకు నాలుగు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తున్నాం. వీరికి ఆర్టికల్ 25లో పేర్కొన్న తదుపరి పరిణామాలు వర్తిస్తాయి. నలభై మూడేళ్ళ యుఫేమియా బోచ్‌కోవా తనకున్న వ్యక్తిగత మరియు ఆర్జిత హక్కులన్నింటినీ కోల్పోవాలి. ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నాం. ఈ కేసుకు అయ్యే ఖర్చులన్నీ ముగ్గురు ఖైదీలు సమానంగా భరించాలి. ఒకవేళ వారి దగ్గర తగినంత డబ్బు లేకపోతే, ఆ ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుండి తీసుకోవడం జరుగుతుంది. కేసులో లభించిన ఆధారాలను వేలం వేయాలి. ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయాలి. విషపు సీసాలను నాశనం చేయాలి.’
అలా బోచ్‌కోవాకు కారాగార శిక్ష విధించబడింది. సిమియోన్ కార్టింకిన్, కేథరీనా మస్లోవాలకున్న అన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు రద్దు చేసారు. సైబీరియాలో ఖైదీలుగా అతను ఎనిమిది సంవత్సరాలు, ఆమె నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించాలి. కార్టింకిన్ తన చేతులను గట్టిగా పక్కలకు ఆనించి, పెదవులు కదుపుతూ నిలబడ్డాడు. బోచ్‌కోవా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. మస్లోవా ముఖం మాత్రం ఆ తీర్పు వినగానే ఒక్కసారిగా ఎర్రబడిపోయింది.
‘నేను దోషిని కాదు, దోషిని కాదు!’
మస్లోవా హఠాత్తుగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె స్వరం ఆ గదంతా ప్రతిధ్వనించింది.
‘ఇది అన్యాయం! నేను నిర్దోషిని! నేనే తప్పూ చేయలేదు. ఎవర్నీ చంపాలనుకోలేదు! అసలు అలా ఆలోచించలేదు కూడా. నేను చెబుతున్నది నిజం. నిజం!’ అంటూ బెంచీ మీద కూలబడి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. కార్టింకిన్, బోచ్‌కోవా ఇద్దరూ బయటికెళ్ళిపోయారు. ఆమె మాత్రం ఏడుస్తూ ఇంకా అక్కడే కూర్చుండిపోయింది. చివరకు ఒక పోలీసు వచ్చి ఆమెను భుజం తట్టి లేపాల్సొచ్చింది.
‘లేదు. ఈ విషయం ఇలాగే వదిలేయకూడదు.’
తనలో తానే అనుకున్నాడు నెఖ్లుడోవ్.
అప్పటివరకూ అతని మనసులో తిరుగుతున్న చెడు ఆలోచనలన్నీ పూర్తిగా మర్చిపోయాడు. ఆమెను మరోసారి చూడాలన్న కోరిక ఎందుకు కలిగిందో అతనికే తెలియదు కాని గబగబా కారిడార్‌లోకి పరుగెత్తాడు. తలుపు దగ్గర జనం గుమికూడటంతో అక్కడంతా రద్దీగా ఉంది. పని పూర్తయిందన్న సంతోషంలో లాయర్లు, జ్యూరీ సభ్యులు బయటకు వస్తున్నారు. అతను కొద్ది క్షణాలు అక్కడే ఆగాల్సి వచ్చింది. ఆఖరికి అతను కారిడార్‌లోకి వచ్చేసరికి, మస్లోవా అప్పటికే చాలా దూరం ముందుకెళ్ళిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు తనను గమనిస్తున్నారని కూడా పట్టించుకోకుండా నెఖ్లుడోవ్ ఆమె వెనుక పరుగెత్తాడు. ఆమెను చేరుకున్నాక, కాస్త ముందుకు వెళ్ళి ఆగిపోయాడు. అప్పటికి ఆమె ఏడవడం ఆపేసింది కాని ఇంకా వెక్కిళ్లతో ఊపిరి ఎగపీలుస్తూ, ఎర్రబడిన తన ముఖాన్ని తల మీదున్న కర్చీఫ్ కొసలతో తుడుచుకుంటోంది. ఆమె నెఖ్లుడోవ్‌ని గమనించకుండానే పక్కనుండి వెళ్ళిపోయింది.
నెఖ్లుడోవ్ వెంటనే అధ్యక్షుడిని కలవడానికి వెనక్కి పరుగెత్తాడు. ఆయన అప్పటికే కోర్టురూమ్ వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన్ని వెతుక్కుంటూ నెఖ్లుడోవ్ లాబీలోకి వెళ్ళాడు. అధ్యక్షుడు అక్కడ తగిలించిన తన లేత బూడిద రంగు ఓవర్‌కోటు వేసుకుని, పక్కనున్న అటెండెంటు వెండిపిడి ఉన్న వాకింగ్ స్టిక్కుని అందిస్తుంటే తీసుకుంటున్నాడు.
నెఖ్లుడోవ్ గబగబా ఆయన దగ్గరకు వెళ్ళాడు.
‘సర్, ఈ కేసు విషయంలో నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. దాని గురించి మీతో రెండు నిమిషాలు మాట్లాడవచ్చా?’ అని అడిగాడు నెఖ్లుడోవ్; ‘నేను కూడా జ్యూరీ సభ్యుడినే’ అన్నాడు.
‘ఓ, తప్పకుండా మాట్లాడొచ్చు ప్రిన్స్ నెఖ్లుడోవ్. మనం ఇంతకు ముందెప్పుడో ఒకసారి కలిసినట్లు గుర్తు నాకు’ అన్నాడు అధ్యక్షుడు, నెఖ్లుడోవ్ చేతిని ఆప్యాయంగా నొక్కుతూ.
నెఖ్లుడోవ్‌ను మొదటిసారి కలిసిన ఆ సాయంత్రం, కుర్రాళ్ళందరికంటే తానే అత్యంత ఉత్సాహంగా డాన్సు చేసిన దృశ్యం ఆయన మనసులో మెదిలి చాలా ఆనందం కలిగింది.
‘చెప్పండి నెఖ్లుడోవ్, నేను మీకేం సహాయం చేయగలను?’
నెఖ్లుడోవ్ చాలా దిగాలుగా ఆందోళన పడుతున్న స్వరంలో అన్నాడు;
‘సర్, మస్లోవాకు సంబంధించిన తీర్పులో ఒక పొరపాటు జరిగింది. ఆమె విషం ప్రయోగించినట్లు ఎక్కడా రుజువు కాలేదు. అయినా ఆమెకు కఠిన కారాగారశిక్ష పడింది.’
‘మీరిచ్చిన సమాధానాల ప్రకారమే కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది. కాకపోతే మీ సమాధానాలన్నీ ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నట్లు నాకు అనిపించింది.’ అన్నాడు అధ్యక్షుడు, ముందున్న తలుపు వైపు నడుస్తూ.
అప్పుడే ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది.
ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యకు ‘దోషి’ అనే అర్థం వస్తుందనీ, ‘ప్రాణం తీసే ఉద్దేశం లేదు’ అనే మాట చేర్చకపోతే అది కావాలని చేసిన హత్యగానే పరిగణించబడుతుందనీ, ఈ విషయాన్ని తన వంతు బాధ్యతగా జ్యూరీకి చెప్పాలని అనుకున్నాడాయన. కానీ కేసు త్వరగా ముగించాలనే ఆత్రుతలో ఆ ముక్క చెప్పడం మర్చిపోయానని ఇప్పుడు గుర్తొచ్చింది.
‘అయితే మా పొరపాటును ఇప్పుడు మనం సరిదిద్దలేమా సార్?’ అని ప్రశ్నించాడు నెఖ్లుడోవ్.
‘పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి ఏదో ఓ కారణం దొరక్కపోదు. ముందు మీరో లాయరుతో మాట్లాడాల్సుంటుంది’ అన్నాడు అధ్యక్షుడు, తన టోపీని కాస్త పక్కకు పెట్టుకుని ఇంకా తలుపు వైపు నడుస్తూనే.
‘కాని ఈ తీర్పు మరీ దారుణం సార్!’
‘చూడండి నెఖ్లుడోవ్, ఇక్కడ పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది. ఇప్పుడు మస్లోవా ముందు రెండే రెండు మార్గాలున్నాయి. మొదటిది; ఆమె దాదాపు నిర్దోషిగా బయటపడి కొద్ది కాలం జైలు శిక్ష అనుభవించడం. లేదా ఇప్పటికే ఆమె అనుభవించిన రిమాండ్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే అసలు శిక్షే లేకుండా విడుదల కావడం. రెండోది; ఆమె నేరుగా సైబీరియాకు బందీగా వెళ్లడం. ఈ రెండు తప్ప మధ్యేమార్గం ఏదీ లేదు. మీరు కేవలం ‘చంపాలనే ఉద్దేశం లేకుండా’ అనే ఆ చిన్నమాటను తీర్పులో చేర్చి ఉంటే, ఆమె పూర్తి నిర్దోషిగా విడుదలయ్యేది.’
‘అవును, ఆ మాట చేర్చకపోవడం మా వల్ల జరిగిన ఘోరమైన పొరపాటు’ అన్నాడు నెఖ్లుడోవ్.
‘అసలు చిక్కంతా అక్కడే ఉంది.’ తన వాచీ వైపు చూసుకుంటూ నవ్వుతూ అన్నాడు అధ్యక్షుడు.
ఆయన ప్రియురాలు క్లారా ఇచ్చిన గడువు ముగియడానికి ఇంకా ముప్పావు గంట మాత్రమే మిగిలి ఉంది.
‘సరే, మీరు లాయర్లతో మాట్లాడాలనుకుంటే, అప్పీలు చేయడానికి ఏదో ఒక బలమైన కారణాన్ని వెతకాలి. అది పెద్ద కష్టమేమీ కాదు’ అంటూ ఆగాడు అధ్యక్షుడు.
ఆయన నెఖ్లుడోవ్‌తో వీలైనంత మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. తన కోటు కాలర్ మీదున్న మీసాలను సరిచేసుకుంటూ, నెఖ్లుడోవ్ మోచేయి కింద చేయి వేసి నెమ్మదిగా అతణ్ణి నడిపిస్తూ అడిగాడు;
‘‘మీరు కూడా బయల్దేరుతున్నారా?’
‘అవున్సార్’ అన్నాడు నెఖ్లుడోవ్, గబగబా తన కోటు తీసుకుని ఆయన వెంటే నడుస్తూ.
బయట ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఆహ్లాదకరమైన ఎండలోకి వచ్చారు ఇద్దరూ. రోడ్డుమీద వెళ్తున్న బగ్గీల చక్రాలు గట్టిగా గలగలమని శబ్దం చేస్తుండటంతో, వాళ్ళు గట్టిగా మాట్లాడుకోవాల్సి వచ్చింది.
అధ్యక్షుడు ఒక గుర్రపు బగ్గీవాడి వైపు తిరిగి అరుస్తూ చెప్పాడు;
‘ద్వోర్యాన్‌స్కాయా వీధికి వెళ్ళాలి. ముప్పై కోపెక్కులు ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఎప్పుడూ ఇవ్వను.’
‘సరే అయ్యా, ఎక్కండి’ అన్నాడు బగ్గీవాడు.
‘ఇక సెలవు. నేనేమైనా మీకు సహాయ పడగలననుకుంటే, ద్వోర్యాన్‌స్కాయా వీధిలోని ద్వోర్నికోవ్ బిల్డింగుకి రండి. నా అడ్రసు గుర్తుపెట్టుకోవడం చాలా సులభం’ అంటూ స్నేహపూర్వకంగా తలూపాడు.
తర్వాత బగ్గీ ఎక్కి వెళ్ళిపోయాడు.
***
అధ్యాయం 25
నెఖ్లుడోవ్ న్యాయవాదిని సంప్రదించడం
అధ్యక్షుడితో జరిగిన సంభాషణ, ఆరుబయట వీస్తున్న తాజా గాలి నెఖ్లుడోవ్ మనస్సుకి కొంచెం ఉపశమనం కలిగించాయి. రోజంతా గడిపిన ఆ వింతైన కోర్టు వాతావరణం, ఊహించని రీతిలో ఆశ్చర్యకరంగా మస్లోవా ఎదురుపడటం, వీటి వల్ల తన భావోద్వేగాలు అతిగా స్పందించాయని ఇప్పుడతనికి అనిపించింది. అయినా, మస్లోవాకు పడిన శిక్షను తగ్గించడానికి ఏదో ఒకటి చేయడం మాత్రం చాలా అవసరమనీ అది కూడా వెంటనే చేయాలని అతనికి అనిపించింది.
‘అవును, ఇప్పుడే చేయాలి! ఫనారిన్, లేకపోతే మికిషిన్ ఎక్కడుంటారో ఇక్కడే కోర్టులో అడిగి తెలుసుకోవడం మంచిది’ అని మనసులోనే అనుకున్నాడు.
నెఖ్లుడోవ్‌కు గుర్తొచ్చిన ఆ ఇద్దరు కూడా మంచి పేరున్న ప్రముఖ న్యాయవాదులే. అతను మళ్ళీ కోర్టు లోపలికి నడిచి తన ఓవర్‌కోట్ తీసేసి, పై అంతస్తుకు వెళ్ళాడు. మొదటి కారిడార్‌లోనే అతనికి ఫనారిన్ ఎదురయ్యాడు. నెఖ్లుడోవ్ అతన్ని ఆపి, ఒక పని మీద అతని కోసమే వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడు. ఫనారిన్‌కు నెఖ్లుడోవ్ పేరు, ముఖం ముందే తెలుసు. అతడికి తన వంతు సహాయం చేయడం చాలా సంతోషమేనని అన్నాడు.
‘కాస్త అలసిపోయాను. మీ పనికి మరీ ఎక్కువ టైము పట్టకపోతే అదేంటో ఇప్పుడే చెప్పొచ్చు. ఇట్రండి’ అంటూ నెఖ్లుడోవ్‌ను ఒక గదిలోకి తీసుకెళ్ళాడు.
బహుశా అది ఎవరో ఒక జడ్జి గది అయ్యుండొచ్చు. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు.
‘చెప్పండి, ఏంటి మీ పని?’
‘ముందుగా, నేను అడగబోయే విషయం బయట ఎవరికీ తెలియకూడదు. ఈ కేసులో నేను ఆసక్తి చూపిస్తున్నట్లు బయటకి తెలియడం నాకిష్టం లేదు.’
‘ఓ, ఖచ్చితంగా. చెప్పండి?’
‘ఈరోజు నేనో కేసులో జ్యూరీ సభ్యుడిగా వచ్చాను. మేమంతా కలిసి ఒక అమాయకురాలికి సైబీరియా శిక్ష పడేలా చేసాం. ఇది నన్ను చాలా బాధిస్తోంది.’
నెఖ్లుడోవ్ తడబడుతూ చెప్పాడు. అతనకి తెలియకుండానే సిగ్గుతో ముఖం ఎర్రబడింది.
‘అయితే?’
ఫనారిన్ ఒక్కక్షణం అతని వైపు తీక్షణంగా చూసి, మళ్ళీ చూపు కిందకు తిప్పుకుని వినడం మొదలుపెట్టాడు.
‘మేము ఒక స్త్రీకి శిక్ష పడేలా చేసాం. దానిపై నేను పై కోర్టులో అప్పీలు చేయాలనుకుంటున్నాను.’
‘అంటే సెనేట్‌కు అన్నమాట.’
నెఖ్లుడోవ్ మాటని సరిదిద్దుతూ అన్నాడు ఫనారిన్.
‘అవును, ఈ కేసు మీరు తీసుకోవాలని నా కోరిక.’
ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన భాగాన్ని కూడా ఇప్పుడే చెప్పి త్వరగా ముగించాలన్న ఉద్దేశంతో-
‘ఈ కేసుకయ్యే ఖర్చు ఎంతైనా సరే, నేనే భరిస్తాను’ అని మరో మాట జోడించాడు నెఖ్లుడోవ్.
‘ఓ, అవన్నీ తర్వాత చూసుకుందాం లెండి’ అన్నాడు ఫనారిన్ నవ్వుతూ.
ఇలాంటి విషయాల్లో నెఖ్లుడోవ్ అనుభవరాహిత్యానికి ఆయనకు కొంచెం జాలి కలిగింది.
‘అసలు కేసు ఏంటో చెప్పండి?’
నెఖ్లుడోవ్ జరిగిందంతా వివరించాడు.
‘సరే, నేను రేపు గాని ఎల్లుండి గాని ఈ కేసు వివరాలన్నీ చూస్తాను. లేదు లేదు- గురువారం అయితే బావుంటుంది. మీరు సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటికి వస్తే నేను మీకు సమాధానం చెబుతాను. సరే ఇక వెళ్దాం, నాకిక్కడ ఓ కేసులో ఆరాలు తీయాల్సిన పనుంది.’
నెఖ్లుడోవ్ అతని దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాడు. లాయరుతో మాట్లాడటం, మస్లోవాను కాపాడడానికి ఏదో ఒక ప్రయత్నం మొదలుపెట్టానన్న తృప్తి అతన్ని మరింత కుదుటపరిచాయి.
అతను వీధిలోకి వచ్చాడు. వాతావరణం అద్భుతంగా ఉంది. వసంత గాలిని గాఢంగా పీల్చుకుని ఆనందించాడు. వెంటనే చాలామంది గుర్రపు బగ్గీవాళ్లు బాడుగ కావాలా అంటూ అతని చుట్టూ గుమిగూడారు. కానీ అతడు నడిచే వెళ్ళాడు.
అయితే కొద్దిసేపటికే మళ్ళీ మస్లోవా జ్ఞాపకాలు, ఆమె పట్ల తాను ప్రవర్తించిన తీరు… ఒకదాని వెనుక ఒకటి అతని బుర్రలో గిరగిరా తిరగడం మొదలెట్టాయి. మళ్ళీ నిరాశ ఆవరించింది. చుట్టూ అంతా చీకటిగా, భారంగా అనిపించింది.
‘లేదు, వీటి గురించి తీరిగ్గా తర్వాత ఆలోచించొచ్చు. ముందు ఈ అసహ్యకరమైన ఆలోచనలన్నీ దూరం చేసుకోవాలి’ అని తనలో తానే అనుకున్నాడు.
కోర్చాగిన్‌లు విందుకి ఆహ్వానించిన విషయం గుర్తొచ్చింది. వాచీ చూసుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైముంది.
పక్కనుండి వెళ్తున్న ట్రామ్ శబ్దం వినిపించింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఎక్కేసాడు. మార్కెట్ దగ్గర దిగిపోయి, ఒక మంచి బగ్గీని బాడుగ తీసుకున్నాడు. పది నిమిషాల్లో కోర్చాగిన్‌ల భారీ భవనం ముందున్న వీధి తలుపు దగ్గర ఉన్నాడు.
***
అధ్యాయం 26
కోర్చాగిన్‌ల ఇల్లు
‘లోపలికి దయచేయండి యువరాజా…’
నెఖ్లుడోవ్‍ని ఆహ్వానిస్తూ, కోర్చాగిన్‌ల ఇంటి ముందు నిలబడిన భారీకాయపు నౌకరు ఒకడు గేటు తెరుస్తూ అన్నాడు. ఆ గేటు ఇంగ్లీషు పేటెంట్ హింజ్‌ల మీద నిశ్శబ్దంగా కదిలింది.
‘అందరూ భోజనానికి కూర్చున్నారు. మీ కోసమే ఎదురుచూస్తున్నారు. మిమ్మల్ని మాత్రమే లోపలికి పంపమని చెప్పారు’ అంటూ అతడు మెట్ల వరకు వెళ్ళి గంట కొట్టాడు.
‘బయటివాళ్ళు ఎవరైనా వచ్చారా?’ తన ఓవర్‌కోట్ తీస్తూ అడిగాడు నెఖ్లుడోవ్.
‘కుటుంబ సభ్యులు కాకుండా, కొలోసోవ్ గారు మైఖేల్ సెర్జీవిచ్ గారు మాత్రమే వచ్చారు.’
మెట్ల మీద నుండి తెల్లటి గ్లౌజులు వేసుకున్న ఒక అందమైన నౌకరు కిందకు చూస్తూ చాలా గౌరవంగా పిలిచాడు;
‘రండి యువరాజా, మీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.’
నెఖ్లుడోవ్ మెట్లెక్కి, తనకు బాగా పరిచితమైన విశాల నృత్యమందిరం దాటుకుని, డైనింగు హాల్‌లోకి వెళ్ళాడు. అక్కడ కోర్చాగిన్ కుటుంబ సభ్యులందరూ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. తల్లి సోఫియా వాసిల్యేవ్‌నా మాత్రం ఎప్పుడూ తన గదిలోనే ఉంటుంది కాబట్టి ఆమె అక్కడ లేదు. టేబుల్ చివరన ముసలాయన కోర్చాగిన్ కూర్చున్నాడు. ఆయనకు ఎడమ పక్కన డాక్టర్, కుడి పక్కన ఆయన స్నేహితుడు ఇవాన్ ఇవనోవిచ్ కొలోసోవ్ కూర్చున్నారు. ఆయన కోర్చాగిన్ స్నేహితుడు, లిబరల్. ఒకప్పుడు ‘మారెషల్ దె నొబ్లెస్’గా ఉన్నత పదవిలో ఉండి, ఇప్పుడు బ్యాంకు డైరెక్టరుగా పనిచేస్తున్నాడు.
ఎడమ పక్కన మిస్సీ చిన్న చెల్లెలికి పాఠాలు చెప్పే టీచరు మిస్ రేనర్, ఆ నాలుగేళ్ళ చిన్నారి ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా మిస్సీ తమ్ముడు- కోర్చాగిన్‌ల ఏకైక కుమారుడు,- పెటియా కూర్చున్నాడు. అతను పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. అతని పరీక్షల కారణంగానే కుటుంబమంతా ఇంకా పట్టణంలోనే ఉంది. అతని పక్కన అతనికి పాఠాలు చెప్పే యూనివర్సిటీ విద్యార్థి, మిస్సీ బంధువు మైఖేల్ సెర్జీవిచ్ టెలిగిన్ (అందరూ మిషా అని పిలుస్తారు) ఉంది. వారికి ఎదురుగా నలభై ఏళ్ళ కేథరీనా అలెక్సీవ్‍నా అనే ఆవిడ కూర్చున్నారు.
టేబుల్ చివరన మిస్సీ కూర్చుని ఉంది. ఆమె పక్కన ఒక కుర్చీ ఖాళీగా ఉంది.
‘ఆ! వచ్చావా! కూర్చో. మేం ఇంకా చేపల కూర దగ్గరే ఉన్నాం.’
ముసలి కోర్చాగిన్ తన కట్టుడు పళ్ళతో ఆహారాన్ని జాగ్రత్తగా నములుతూ, ఎర్రబడిన కళ్ళతో నెఖ్లుడోవ్‌ను చూస్తూ అన్నాడు. ఆ ఖాళీ సీటును కళ్ళతోనే నెఖ్లుడోవ్‌కు చూపిస్తూ తన నోటి నిండా ఆహారం పెట్టుకుని ‘స్టీఫెన్!’ అని బట్లర్‌ను పిలిచాడు.
నెఖ్లుడోవ్‌కు ఎప్పటి నుండో కోర్చాగిన్ బాగా తెలుసు. ఆయనతో కలిసి ఎన్నోసార్లు భోజనం చేసాడు. కానీ ఈరోజు- ఆ ఎర్రటి ముఖం, జిహ్వాచాపల్యంతో కదులుతున్న ఆ పెదవులు, రుమాలుతో కప్పబడిన కోటు కాలర్ మీద ఉబ్బిపోయి కనిపిస్తున్న లావుపాటి మెడ, బాగా తిని బలిసిన భారీ ఆకారం అతనికి చాలా వికారంగా అనిపించాయి. అతనికి తెలియకుండానే ఆయన క్రూరత్వం నెఖ్లుడోవ్ మనసులో మెదిలింది. అధికారం ఉన్నప్పుడు ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదన్న అహంకారంతో, ఆయన అకారణంగా మనుషులను కొట్టించడమూ, ఉరితీయడమూ చేసేవాడు.
‘వెంటనే సిద్ధం చేస్తాను దొరా’ అన్నాడు స్టీఫెన్.
వెండిపాత్రలతో అలంకరించిన అల్మారా నుండి ఒక పెద్ద గరిటె తీస్తూ, ఇందాకటి అందమైన నౌకరుకు సైగ చేసాడు స్టీఫెన్. ఆ నౌకరు వెంటనే మిస్సీ పక్కన ఉన్న ఖాళీ కుర్చీ ముందు ఫోర్కులు, చాకులను అమర్చాడు. కుటుంబ చిహ్నం పైకి కనిపించేలా, రుమాలును అందంగా మడతపెట్టి ఉంచాడు.
నెఖ్లుడోవ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ అందరితో కరచాలనం చేయసాగాడు. ముసలి కోర్చాగిన్, కుటుంబ స్త్రీలు తప్ప మిగలిన వాళ్ళందరూ అతను రాగానే గౌరవంగా లేచి నిలబడ్డారు. ఆ టేబుల్ చుట్టూ తిరగడం, పెద్దగా పరిచయం లేని వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం అతనికి చాలా అసహజంగా, ఇబ్బందిగా అనిపించింది. ఆలస్యంగా వచ్చినందుకు అందరికీ క్షమాపణలు చెప్పి, మిస్సీ-అలెక్సీవ్‍నా పక్కన కూర్చోబోయాడు. కానీ వృద్ధ కోర్చాగిన్ మాత్రం ఆకలి పెంచే ‘వోడ్కా’ కనీసం ఒక గ్లాసైనా తీసుకోమనీ, కనీసం పక్కనే చిన్న టేబుల్ మీదున్న రొయ్యలు, జున్ను, చేప ముక్కల్లో ఏదోటి రుచి చూడమనీ పట్టుబట్టాడు. తాను ఎంత ఆకలితో ఉన్నాడో తినడం మొదలుపెట్టేదాకా నెఖ్లుడోవ్‌కు తెలియలేదు. రొట్టె, చీజ్ తీసుకున్నాక అతడు ఆకలితో తహతహలాడుతూ వేగంగా తినడం మొదలుపెట్టాడు.
‘ఏమండీ, సమాజం పునాదులు కూల్చడంలో మీరు విజయం సాధించారా?’ అని కోలోసాఫ్ వ్యంగ్యంగా అడిగాడు.
జ్యూరీ వ్యవస్థపై దాడి చేస్తూ ఒక పాతకాలపు పత్రిక వాడిన మాటలను ఆయన ఇక్కడ ఎగతాళిగా వాడుతున్నాడు.
‘నేరస్థులను విడుదల చేసి, నిర్దోషులను శిక్షించారా ఏంటి?’
‘పునాదులు కూల్చడం… పునాదులు కూల్చడం…’ ప్రిన్స్ కోర్చాగిన్ నవ్వుతూ ఆ మాటలను వల్లెవేసాడు. తన ప్రియమిత్రుడు కొలోసోవ్ తెలివితేటల మీద, పాండిత్యం మీద అతనికి అచంచలమైన నమ్మకం.
అమర్యాదగా అనిపించే ప్రమాదం ఉన్నప్పటికీ, కొలోసోవ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, తన ముందున్న వేడివేడి సూప్‌ను ఆత్రంగా తాగడం కొనసాగించాడు నెఖ్లుడోవ్.
‘ముందు అతన్ని తిననివ్వండి’ అంది మిస్సీ నవ్వుతూ.
‘అతను’ అనే పదాన్ని ఆమె వాడిన తీరు, నెఖ్లుడోవ్‌తో ఆమెకున్న చొరవను ఇతరులకు గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. కొలోసోవ్ మాత్రం తన ఉత్సాహాన్ని ఉగ్గబట్టుకోలేక, జ్యూరీ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఆ పత్రికా వ్యాసం తనను ఎంత కోపానికి గురిచేసిందో బిగ్గరగా వివరిస్తూనే ఉన్నాడు. మిస్సీ బంధువు మైఖేల్ సెర్జీవిచ్ కూడా అదే పత్రికలో వచ్చిన మరో వ్యాసం గురించి చెబుతూ కొలోసోవ్‌కు వంత పాడాడు. మిస్సీ ఎప్పటిలాగే ఎంతో హుందాగా, ఆడంబరం లేని అందమైన దుస్తుల్లో మెరిసిపోతోంది.
నెఖ్లుడోవ్ నోట్లో ఉన్నదాన్ని మింగే వరకూ ఆగి, ఆ తరువాత అడిగింది మిస్సీ;
‘నువ్వు బాగా అలసిపోయినట్టు ఉన్నావు.’
‘అంతేం లేదు. మరి నువ్వు, ఆర్ట్ ఎక్జిబిషన్ చూడటానికి వెళ్ళావా?’ అని అడిగాడు నెఖ్లుడోవ్.
‘లేదు, దాన్ని వాయిదా వేసా. సలామాటోవ్ ఇంట్లో టెన్నిస్ ఆడాం. మిస్టర్ క్రూక్స్ నిజంగా అద్భుతంగా ఆడుతున్నాడు.’
నెఖ్లుడోవ్ తన మనసులోని ఆలోచనలను మళ్లించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు. సాధారణంగా ఈ ఇల్లు అతనికి నచ్చుతుంది. ఈ ఇంటి విలాసవంతమైన ఆడంబరాలు అతనిపై ఆహ్లాదకరమైన ప్రభావం చూపించేది. అలాగే, పైకి కనిపించకుండా అతన్ని చుట్టుముట్టే సున్నితమైన పొగడ్తల వాతావరణం కూడా అతనికి ఎంతో ఇష్టం.
కానీ ఈరోజు ఆ ఇంట్లోని ప్రతిదీ అతనికి వికారంగా అనిపిస్తోంది. ప్రతిదీ! ఆ ద్వారపాలకుడి నుండి మొదలుపెట్టి, విశాలమైన మెట్లదారి, పూల అలంకరణ, నౌకరు, ఆ టేబుల్ మీది అలంకారాల వరకూ… చివరికి మిస్సీ కూడా ఈరోజు అతనికి కృత్రిమంగా, ఆకర్షణరహితంగా కనిపిస్తోంది.
కొలోసోవ్ మాట్లాడుతున్న ఆ మిడిమిడి జ్ఞానపు లిబరలిజపు స్వరం అసహ్యంగా అనిపించింది; బలిసిన ఎద్దులా ఉన్న ముసలి కోర్చాగిన్ ఆకారం, ఆ అలెక్సీవ్‌నా వాడుతున్న ఫ్రెంచ్ పదాలు… అన్నీ అతనికి చిరాకు కలిగిస్తున్నాయి. అక్కడ మౌనంగా కూర్చున్న ఆ టీచరు, యూనివర్సిటీ విద్యార్థి ముఖాల్లో కనబడుతున్న సంకోచ ఛాయలు కూడా అసహ్యంగానే అనిపించాయి.
వీటన్నింటి కంటే అతనికి ఎక్కువ బాధ కలిగించింది- మిస్సీ ఉపయోగించిన ‘నువ్వు’ అనే ఏకవచనం.
నెఖ్లుడోవ్ చాలా కాలంగా మిస్సీని చూడటంలో రెండు రకాలైన ఆలోచనల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఒక్కోసారి వెన్నెల వెలుతురులో చూసినట్లు ఆమెలోని తాజాదనం, అందం, తెలివితేటలు, సహజత్వం మాత్రమే అతనికి కనిపించేవి. కొన్నిసార్లు మాత్రం మండుటెండలో అకస్మాత్తుగా చూసినట్లు ఆమెలోని లోపాలు స్పష్టంగా కనిపించేవి. అవి కనిపించకుండా ఉండటం అసాధ్యం అనిపించేది. ఈ రోజు అలాంటి రోజే. ఈ రోజు అతనికి ఆమె ముఖంలోని ముడతలన్నీ కనిపించాయి; ఆమె పళ్ళలో ఏవి నకిలీవో తెలిసాయి. ఆమె జుట్టు ఎలా మడతలు పెట్టి ఉందో, ఆమె మోచేతులు ఎంత మొనదేలి ఉన్నాయో చూసాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆమె బొటనవేలి గోరు ఎంత పెద్దదో, అది ఎంతలా ఆమె తండ్రిని పోలి ఉందో కూడా గమనించాడు.
‘టెన్నిసా, అది ఒక విసుగు పుట్టించే ఆట’ అన్నాడు కొలోసోవ్. ‘దానికంటే మేము చిన్నప్పుడు ఆడుకునే ‘లప్త’ చాలా బాగుండేది.’
‘లేదు లేదు, మీరు టెన్నిస్ ఎప్పుడూ ఆడలేదేమో. చాలా బాగుంటుంది’ అంది మిస్సీ.
ఆమె ఆ ‘చాలా’ అనే పదాన్ని పలికిన తీరు నెఖ్లుడోవ్‌కు చాలా కృత్రిమంగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ అందరి మధ్య ఒక చిన్న వాదన మొదలైంది. మౌనంగా, విసుగుతో కూర్చున్న పిల్లలు, టీచరు తప్ప మిగిలిన వారందరూ అందులో పాల్గొన్నారు.
‘ఈ అనవసరపు వాదనలు ఎప్పటికీ తెమలవు!’ అని నవ్వుతూ అన్నాడు ముసలి కోర్చాగిన్. తన కోటు నుండి రుమాలును లాగేసి, కుర్చీని చప్పుడయ్యేలా వెనక్కినెట్టి, పైకి లేచాడు. వెంటనే ఒక నౌకరు ఆ కుర్చీని పట్టుకున్నాడు.
ఆయనతో పాటే అందరూ లేచి, పక్కనే ఉన్న మరో టేబుల్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ సువాసన వెదజల్లే నీళ్ళ గ్లాసులు ఉన్నాయి. వాటితో నోరు పుక్కిలించి, మళ్ళీ ఎవరికీ ఆసక్తి లేని మాటలను కొనసాగించడం మొదలుపెట్టారు.
‘నీకు అలా అనిపించలేదా?’ అని నెఖ్లుడోవ్‌ను అడిగింది మిస్సీ. మనిషి స్వభావాన్ని అంతగా బయటపెట్టే టెన్నిస్ లాంటి ఆట మరొకటి లేదనే తన అభిప్రాయానికి అతని సమ్మతిని కోరుతోంది.
‘నిజం చెప్పాలంటే నాకు తెలీదు. దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు’ అన్నాడు నెఖ్లుడోవ్.
ఆలోచనల్లో మునిగిపోయిన అతని ముఖంలో కనిపిస్తున్న అసంతృప్తిని ఆమె గమనించింది. అది ఆమెకు భయం కలిగించింది. అసలు దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఆమె మనసు ఆరాటపడింది.
‘అమ్మ దగ్గరకు వెళ్దాం, వస్తావా?’ అని అడిగింది మిస్సీ.
‘సరే. వస్తాను’ అన్నాడు అతను.
కానీ అతని స్వరంలో అక్కడికి రావాలన్న మనసే లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
అతను ఒక సిగరెట్ తీసి వెలిగించాడు.
ఆమె ఏం మాట్లాడకుండా ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. అది చూసి నెఖ్లుడోవ్‌కు సిగ్గుగా అనిపించింది.
‘ఒకరి ఇంటికి వచ్చి ఇలా అందరి ఉత్సాహాన్ని నీరుగార్చడం సబబు కాదు’ అని తనను తానే నిందించుకున్నాడు. వెంటనే తన ధోరణి మార్చుకుని, ‘రాకుమారి గారు అనుమతిస్తే తప్పకుండా వస్తాను’ అని వినయంగా అన్నాడు.
‘ఓ, తప్పకుండా! అమ్మ చాలా సంతోషిస్తుంది. నువ్వు అక్కడ సిగరెట్ తాగవచ్చు; ఇవాన్ ఇవనోవిచ్ కూడా అక్కడే ఉన్నారు.’
ఆ ఇంటి యజమానురాలు రాకుమారి సోఫియా వాసిల్యేవ్‌నా ఎప్పుడూ మంచం మీద పడుకునే ఉంటుంది. గత ఎనిమిదేళ్లుగా అతిథులు వచ్చినప్పుడు ఆమె అలాగే లేసులతో, రిబ్బన్లతో అలంకరించుకుని, వెల్వెట్ దుస్తులు, బంగారం, దంతం, కాంస్య వస్తువులతో, పూల మధ్య పడుకునే ఉండేది తప్ప బయటకు ఎప్పుడూ రాలేదు. ఆమె మాటల్లో చెప్పాలంటే- కేవలం తన ‘ఆప్తమిత్రులను’ మాత్రమే ఆమె కలుస్తుంది. అంటే, ఆమె దృష్టిలో సాధారణ జనసమూహం కంటే భిన్నంగా ఉండేవారు అని అర్థం.
నెఖ్లుడోవ్ తెలివైనవాడు కావడం, అతని తల్లి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు కావడం, తన కూతురు మిస్సీని అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలనే ఉద్దేశం కూడా ఉండటంతో అతన్ని ఆ ఆప్తమిత్రుల జాబితాలో చేర్చారు.
సోఫియా వాసిల్యేవ్‌నా గది, పెద్ద డ్రాయింగ్ రూమ్, చిన్న డ్రాయింగ్ రూమ్‌లకు అవతల ఉంటుంది. పెద్ద డ్రాయింగ్ రూమ్‌లోకి రాగానే, ముందు నడుస్తున్న మిస్సీ అకస్మాత్తుగా ఆగిపోయింది. అక్కడే ఉన్న ఒక చిన్న పచ్చటి కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకుని, నెఖ్లుడోవ్ వైపు తిరిగింది.
మిస్సీకి వెంటనే పెళ్ళి చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. నెఖ్లుడోవ్ తగిన వరుడే కాకుండా, ఆమెకు ఇష్టమైన వ్యక్తి కూడా. అందుకే అతను తనవాడే (తాను అతనిది కాదు) అనే ఆలోచనకు ఆమె అలవాటుపడిపోయింది. అతడిని కోల్పోవడం ఆమెకు ఘోరమైన అవమానంగా అనిపించేది. అతన్ని కోల్పోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి మాటలు కలిపింది.
‘ఏదో జరిగిందని నాకు అర్థమవుతోంది. చెప్పు, ఏమైంది నీకు?’
‘అవును, ఏదో జరిగింది,’ అని నిజాయితీగా నిజాన్నే చెప్పాలనుకున్నాడు; ‘చాలా అసాధారణమైన, తీవ్రమైన సంఘటన ఒకటి జరిగింది.’ అన్నాడు.
నెఖ్లుడోవ్ కోర్టులో జరిగిన ఆ సమావేశాన్ని గుర్తు చేసుకున్నాడు; అతని నుదురు ముడుచుకుంది, ముఖం ఎర్రబడింది.
‘ఏమిటది? నాకు చెప్పవా?’
మానసిక ఆందోళనలో ఉన్నవారిలో ఒక మొండి పట్టుదల, చతురత ఉంటుంది. ప్రస్తుతం ఆమె కూడా అలాగే ఉంది. అతని నుండి నిజం రాబట్టాలని చూసింది.
‘ఇప్పుడు చెప్పలేను. దయచేసి నన్ను అడగవద్దు. దాని గురించి పూర్తిగా ఆలోచించడానికి నాకు ఇంకా సమయం సమయం పడుతుంది’ అన్నాడు నెఖ్లుడోవ్. అతని ముఖం మరింత ఎర్రబడింది.
‘అంటే నువ్వు నాకు కూడా చెప్పవా?’
ఆమె ముఖంలోని కండరాలు ఒక్కసారిగా కంపించాయి. పట్టుకున్న కుర్చీని వెనక్కి తోసేసింది.
‘సరే అయితే, రా!’ అంది.
ఆమె అనవసరపు ఆలోచనలను విదిలించుకుంటున్నట్లుగా తల విదిలించి, ముందుకంటే వేగంగా అతని ముందు నడుస్తోంది.
ఏడుపును ఆపుకోవడానికే ఆమె పెదవులను అంత గట్టిగా బిగబట్టిందని అతనికి అర్థమైంది. ఆమెను బాధపెట్టినందుకు అతనికి సిగ్గుగా ఉంది, కానీ తాను ఒక్క క్షణం బలహీనపడినా ప్రమాదకరమని, ఆమెతో బంధంలో ఇరుక్కుపోతానని అతనికి తెలుసు. ఈరోజు అన్నింటికంటే ఎక్కువగా అతను దానికి భయపడుతున్నాడు. నిశ్శబ్దంగా ఆమె వెనుకే రాకుమారి గదిలోకి వెళ్ళాడు.
***
