అతని కళ్ళలో నిస్తేజమైన సుదూరాలను చూస్తున్న భావం. బాధాకరమైన, నిలకడైన స్వరం. పనివాడిలా చిన్నగా మాట్లాడే విధానం. అన్నీ కలగలిపి లోతైన బాధ అతని మొఖంపై ప్రతిబింబించింది. ఆయనే లెపర్డ్ మాన్. కానీ అతను ఆ పేరుకి తగ్గట్టు ఉండడు. చిరుతలతో పాటు బోనులో ఉండి తన ధైర్యాన్ని జనాల ముందు ప్రదర్శన చేయడం అతని జీవనోపాధి. వాటి ద్వారా అతను తన యజమానులను ఆశ్చర్యపరిచేవాడు. ఎంత ఉత్కంఠ పరిస్తే అతనికి అంత జీతం అందుతుంది.
కానీ.. నేను చెప్పినట్టు అతను కనిపించలేదు. చాలా సన్నటి దేహంతో, అంతకంటే సన్నటి భుజాలతో ఉన్నాడు. రక్తహీనతతో బాధపడేవాడు. ఆ బాధని కూడా సౌమ్యంగా భరించేవాడు. నేను అతని నుండి తన కథని రాబట్టడానికి ఒక గంట నుండి ప్రయత్నిస్తున్నాను. కానీ అతని జీవితంలో ఎలాంటి ప్రేమా, సాహసమూ, ధైర్యంగా తెగించి చేసిన పనులూ ఏవీ లేవు. కేవలం ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల వచ్చే అంతులేని విసుగు తప్ప.
అతను సింహాలతో కూడా పోరాడాడు, కానీ అది పెద్ద విషయం ఏమీ కాదు. మందు తాగకుండా నిలకడగా ఉంటే సరిపోతుంది. ఒక మామూలు కర్రతో ఎవరైనా సింహాన్ని చితకబాదొచ్చు. ఒకసారి అతను సింహంతో అరగంట పాటు పోరాడాడు. దాడి చేసిన ప్రతి సారీ దాని ముక్కుపై కొట్టాలి, అది తన తలను వంచి దాడి చేసినప్పుడు, కాలు బయటికి ఉంచాలి. అది కాలు పట్టుకునేందుకు వచ్చినప్పుడు, కాళ్ళు వెనక్కి తీసుకుని మళ్లీ ముక్కుపై కొట్టాలి, అంతే.
అతని కళ్ళలో ఉన్న ఆ దీర్ఘమైన చూపుతో, సుతిమెత్తని వాక్యాలతో అతను తన గాయాలను చూపించాడు. అవి చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి మాత్రం ఈ మధ్యే జరిగింది. ఒక ఆడ పులి అతని భుజం మీద పడి ఎముకకి గాయం చేసింది. అతని శరీరం మీద గాయాల వల్ల చినిగిన కోటుకి చక్కగా అతుకులు వేసి ఉంది. కోరల వల్ల, దంతాల వల్ల అయిన గాయాలతో అతని కుడి మోచేతి కింది భాగం నూర్పిడి మిషన్‍లో పెట్టినట్లుగా ఉంది .
ఒక్కసారిగా అతని ముఖం జ్ఞాపకాలతో నిండిపోయింది. చాలా ఆసక్తిగా నేను ఎదురుచుస్తున్న కథ చెప్పడానికి అతను సిద్దపడ్డాడు.
“సింహాలకు శిక్షణ ఇచ్చేవాణ్ణి. ద్వేషించే వాడి గురించి విన్నావా?” అని అడిగాడు.
ఒక నిమిషం ఆగి ఎదురు బోనులో జబ్బు పడి ఉన్న సింహం వైపుకి తీక్షణంగా చూశాడు. “దానికి పన్ను నొప్పి వచ్చింది” అన్నాడు.
మళ్లీ చెప్పడం ప్రారంభించాడు “ఆ సింహాలకి శిక్షణ ఇచ్చే వాడు సింహాల నోటిలో తలపెట్టి ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకునేది. అతనిని ద్వేషించే మనిషి అతని ప్రదర్శన ఎక్కడ జరుగుతున్నా, అక్కడికి వెళ్లి, సింహం అతని తలని ఎప్పుడు ఛిద్రం చేస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాడు. అతని ప్రదర్శనలు దేశంలో ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్లేవాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి అతను ముసలివాడు అయ్యాడు.ఆ సింహాలకు శిక్షణ ఇచ్చేవాడు కూడా ముసలివాడు అయ్యాడు. సింహం కూడా ముసలిదయిపోయింది. కానీ చివరకు ఒక రోజు అతను ముందు వరుసలో కూర్చుని ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అతను దేనికోసం ఎదురుచూసాడో అది జరిగింది. డాక్టర్‍ని పిలవాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. సింహం అతని తలని ఛిద్రం చేసింది”
“ఇప్పుడు నేను దాన్ని సహనం అని అంటాను” అని అలా కొనసాగించాడు. “అది నా స్వభావం. కానీ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి కాదు. అతను చాలా చిన్నగా సన్నగా, రంపపు చూపుతో , కత్తుల్ని మింగుతూ గారడీ చేసే ఫ్రెంచ్ వ్యక్తి. “డి విల్లే” అని అని తనకు తాను పిలుచుకుంటాడు. అతనికి ఒక మంచి భార్య ఉంది. ఆమె గాలిలో తాళ్లపై నడిచే ట్రాపీజ్ పని చేస్తుంది. అలా పైన నడిచి కింద వలలో పడి, మళ్ళీ ఆ వల నుండి తిరిగి వెనక్కి ఎగరడం ఆసక్తికరంగా ఉంటుంది.
“ డి విల్లేకి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత వేగంగా అతను చేయి కూడ లేస్తుంది. అతను చేతి వేగం ఎంత అంటే? పులి తన పంజా విసిరినంత. ఒకరోజు రింగ్ మాస్టరు అతన్ని కప్పలను తినేవాడా అని అవమానపరిచాడు. అది ప్రదర్శన జరుగుతున్న సమయం. స్టేజీ మీద, ప్రేక్షకులు చూస్తుండగానే ఆ కత్తులను రింగ్ మాస్టర్ మీదకి విసిరాడు. రింగ్ మాస్టర్ కి ఆలోచించుకునే సమయం కూడా లేదు. అవన్నీ అతని చుట్టూ ఉన్న చెక్కల్లోకి దిగేటట్టు చేశాడు. అవి మాస్టర్ కి ఎంత దగ్గరగా వెళ్ళాయంటే? కొన్ని బట్టల్లో నుండి, కొన్ని అతని చర్మంలో నుండి వెళ్ళాయి.”
ఆ గారడీలోని మనుషులందరూ మాస్టర్ ని బయటకు తీసుకురావడానికి ఆ కత్తులన్నిటినీ లాగవలసి వచ్చింది. ఎందుకంటే అవి అంత వేగంగా వచ్చాయి. అలా డి విల్లేతో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి అంతటా తెలిసింది. అతని భార్యతో కొంచెం చనువుగా ఉండటానికి కూడా ఎవరూ సాహసం చేయలేకపోయారు.
“కానీ వాలేస్ అని ఒక మనిషి ఉన్నాడు. అతను మాత్రం దేనికీ భయపడడు. అతను సింహాలకు శిక్షణ ఇచ్చేవాడు. సింహాల నోట్లో తల పెట్టడంలో అతనికి ఒక ప్రత్యేకమైన ఉపాయం ఉండేది. అలా ఏ సింహం నోట్లో అయినా తలపెట్టగలడు. కానీ ఎక్కువగా అగస్టస్ మాత్రమే కావాలనుకుంటాడు. అగస్టస్ అతని మీద ఆధారపడ్డ ఒక మంచి మృగం. వాలేస్‍ను అందరూ వాలేస్ రాజు అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే అతను వేటికీ భయపడడు. అతను ఖచ్చితంగా రాజే. దాంట్లో ఏ సందేహమూ లేదు. ఒకరోజు అతను తాగి ఉండటం చూశాను. అలానే సింహం బోన్లోకి వెళ్ళాడు. అది కూడా ఎదురు తిరిగింది. అతని చేతిలో కర్ర కూడా లేదు. కానీ అతను తన పిడికిలితో దాని ముక్కు మీద గుద్ది వచ్చాడు. డి విల్లే భార్య మేడం డి విల్లే ….” అని ఆపాడు.
వెనుక నుండి వస్తున్న శబ్దాలను విని లేపాడ్ మాన్ వెనక్కి తిరిగి చూశాడు. అది భాగాలుగా విభజించిన బోను. ఒక భాగంలో ఉన్న కోతి పాదాన్ని, పక్క భాగంలో ఉన్న బూడిద రంగు నక్క… ఆ బోనుకున్న ఊసల ద్వారా లాగడానికి తన బలాన్నంతా ఉపయోగించి ప్రయత్నిస్తుంది. ఎంతలా లాగుతుందంటే? ఒక గట్టి ఎలాస్టిక్ని లాగినట్లు. అది చూసి మిగతా కోతులు భయంతో గందరగోళంగా అరుస్తున్నాయి. వాటిని చూసుకునే వ్యక్తి కూడా అక్కడ లేడు. వెంటనే లియోపార్డ్ మనిషి అక్కడికి వెళ్లి, ఆ నక్క ముక్కు మీద గట్టిగా ఒకటిచ్చాడు. క్షమాపణ పూర్వకమైన నవ్వుతో వచ్చి, తన మిగిలిన వాక్యాన్ని ఏ ఇబ్బందీ లేకుండా ఇలా పూర్తి చేశాడు.
“మేడం డి విల్లే వాలేస్ రాజు వైపు చూసింది. అతను కూడా ఆమె వైపు చూశాడు. అప్పుడు డి విల్లే ముఖం నల్లబారిపోయింది. మేము వాలేస్ ని హెచ్చరించాం. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. అతను మమ్మల్ని చూసి నవ్వాడు. అంతేకాక, డి విల్లే తలని పేస్టు ఉన్న బకెట్లోకి తోసాడు. ఎందుకంటే అతనికి డి విల్లేతో గొడవ పడాలని ఉంది.”
డి విల్లే ఆ పేస్టుతో గందరగోళంగా తయారయ్యాడు. అదంతా వదిలించుకోడానికి నేను సాయం చేశాను. కానీ అతను చాలా ప్రశాంతంగా, ఏ బెదిరింపులూ చెయ్యకుండా ఉన్నాడు. కానీ అతని కళ్ళలో నేనొక మెరుపు చూశాను. అది ఎలాంటి మెరుపంటే? క్రూర మృగాల్లో ఉండే మెరుపు. వెంటనే నేను వాలేస్ దగ్గరకు వెళ్లి, చివరిసారిగా హెచ్చరించాను. అతను నవ్వాడు. కానీ దాని తర్వాత అతను మేడం డి విల్లే వైపు చూడలేదు.
చాలా నెలలు గడిచిపోయాయి. ఏమీ జరగలేదు. అప్పుడు నేను ఏమీ లేని దానికి ఇంత భయపడ్డానా? అని ఆలోచించడం మొదలు పెట్టాను. మేము అప్పుడు దక్షిణం వైపు ఉన్న ఫ్రిస్కోలో మధ్యాహ్నం ప్రదర్శన చేస్తున్నాము. ఒక పెద్ద టెంట్లో పిల్లలు, ఆడవాళ్లు అందరూ కూర్చొని ఉన్నారు. నేను ఆ ప్రదర్శన కోసం ప్రచారం చేసే హెడ్ రెడ్ డెన్ని కోసం వెళ్ళినప్పుడు నా జేబు కత్తిని తీసుకొని వెళ్ళిపోయాడు.
ప్రదర్శన కోసం బట్టలు మార్చుకునే టెంట్ల గుండా వెళ్ళేటప్పుడు దానిలోని చిన్న రంధ్రం గుండా అతను కనబడుతాడేమోనని చూశాను. అతను అక్కడ లేడు. కానీ నా ముందు వాలెస్ రాజు, బిగుతైన బట్టలతో బోనులోని సింహాలతో తన ప్రదర్శనకు సమయం కోసం ఎదురు చూస్తూ కనపడ్డాడు. అతను చాలా ఆనందంతో ఇద్దరు ట్రపేజ్ కళాకారుల మధ్య జరుగుతున్న గొడవను చూస్తున్నాడు. అతనితో పాటు అక్కడ బట్టలు మార్చుకునే టెంట్ లో ఉన్న అందరూ దాన్ని చూస్తున్నారు. కానీ డివిల్లే ఒక్కడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా వాలేస్ వైపు ద్వేషంతో చూడటం నేను గమనించాను.
నేను మాత్రం ఆ రంధ్రంలో నుండి చూస్తూ ఉన్నాను. డీ విల్లే తన జేబులోని రుమాల్ ని బయటకు తీసి తన ముఖానికి ఉన్న చెమట మొత్తాన్నీ తుడిచాడు. ఆ రోజు చాలా వేడిగా ఉంది. అదే సమయంలో వాలేస్ వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు. ఆ చూపు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే? దాంట్లో కేవలం ద్వేషం మాత్రమే కాకుండా, ఒకలాంటి విజయం కూడా కనిపించింది.
డి విల్లే ఆ సర్కస్ గ్రౌండ్ విడిచి బయటకు వెళ్లడం, ఎలక్ట్రిక్ కారులో టౌన్ కి వెళ్లడం చూశాక నేను ప్రశాంతంగా శ్వాస తీసుకున్నాను. కొన్ని నిమిషాల తర్వాత నేను పెద్ద టెంట్ లో ఉన్నప్పుడు రెడ్ డెన్నీ కనపడ్డాడు. వాలేస్ రాజు తన వంతు వచ్చినప్పుడు వెళ్లి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. అతను చాలా క్రూరమైన ఉద్వేగంతో ఉన్నాడు. అతను అన్ని సింహాలనూ రెచ్చగొట్టి ఉన్నాడు ఒక్క, అగస్టస్‍ని తప్ప. ఎందుకంటే అగస్టస్ చాలా లావుగా, సోమరితనంతో, వృద్ధాప్యంతో ఉంది.
చివరికి వాలేస్ ఆగస్టస్ మోకాళ్ళని కూడా వంచి, దాన్ని కూడా ప్రదర్శన స్థానంలోనికి తెచ్చాడు. ముసలి అగస్టస్ ఎప్పటిలానే మంచిగా నోరు తెరిచి ఉంచింది. వాలిస్ తన తలని అగస్టస్ నోట్లో పెట్టాడు. వెంటనే రెండు దవడలు దగ్గరకు వచ్చాయి. వాలెస్ తల ఛిద్రం అయిపోయింది.
లేపాడ్ మనిషి ఒక తియ్యటి నవ్వు నవ్వాడు. అతని దీర్ఘమైన చూపు వెంటనే కళ్ళలోకి వచ్చింది.
‘అదే వాలస్ రాజు యొక్క ముగింపు.’ అంటూ తన బాధాకరమైన స్వరంతో అన్నాడు. “అక్కడ ఉత్సాహం అంతా చల్లారిన తర్వాత నా సమయం వచ్చాక వాలేస్ తల వద్దకు వెళ్లి నేను వాసన చూశాను. వెంటనే నేను తుమ్మాను.”
“అది.. అదేంటి? .. అను నేను ఆత్రుతగా అడిగాను.
“ అది ముక్కు పొడుం …. బట్టలు మార్చుకునే టెంట్ వద్ద వాలేస్ తల మీద డీ విల్లే వేశాడు. పాపం ముసలి అగస్టస్ అలా చేయాలనుకోలేదు. కేవలం అది తుమ్మింది అంతే..”