ఐడి కార్డ్

Spread the love

డా. శశి భూషణ్ పేరున్న పశువుల డాక్టరు. ఆయనకి తన వృత్తి పట్ల ఎంతో గౌరవం పైగా గర్వం కూడా. మనుషుల డాక్టరు కంటే తన వృత్తి ఏమాత్రం తక్కువ కాదని ఆయన నమ్మకం. ఆయనకి ఇదంతా ఎంతో సహజంగా సర్వసాధారణ విషయంలాగానే అనిపిస్తుంది. తను పశువుల డాక్టరు అని చెప్పుకోవడానికి ఆయన ఇబ్బందిపడ్డ సందర్భాలు కూడా ఏమీ లేవు. ఆయన పశువులకు వైద్యం కూడా, వాటి బాధలు తీర్చడంలోనే అసలు సిసలు సంతోషం దాగిఉందా అన్నట్టు చేస్తాడు. పశువులకి చేసే వైద్యాన్ని ఏదో ఒక మొక్కుబడిగా కాకుండా సేవగా భావిస్తాడు. తమ పశువుల ఆరోగ్యం చక్కబడి, ఆవులు-బర్రెలు మళ్ళీ మంచిగా పాలిస్తూ, ఎద్దుల ఆరోగ్యం కుదుటపడి చక్కగా అరకు దున్నుతుంటే చూసి ఆ పేద రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అలా ఆ రైతుల ముఖాల్లో సంతోషం చూసి డా.శశి భూషణ్ ముఖంలో కూడా చిరునవ్వులు చిగురిస్తాయి. డా.శశి భూషణ్ కూడా ఒక పేద రైతుబిడ్డ. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో, ఆ పేద రైతులు ఇళ్ళు గడవడంలో ఈ మూగజీవాల పాత్ర ఎంతటిదో డాక్టరు తెలియనిది కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులు ఇంకా గొడ్డు-గోదాం అని ఈ మూగజీవాలని మేపుతున్నారు అంటే కారణం ఏమయ్యుంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు.    

            డా.శశి భూషణ్ దేశ రాజధానికి దూరంగా ఒక చిన్న జిల్లాలో సీనియర్ వెటర్నరీ సర్జన్ గా సేవలు అందిస్తున్నాడు. ఆ పట్నం, ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ డాక్టరు గారి నీతినిజాయితీలు, పనిపట్ల వారి నిబద్దత బాగా తెలుసు. డాక్టరుగారు గత రెండు సంవత్సరాలుగా ఇదే ఊళ్ళో పని చేస్తున్నారు. రోజంతా ఎంతో ఉరుకులు-పరుగులు పెడుతూ పశువులకోసం పడే తన శ్రమని తలచుకుని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు కూడా.  

ఎన్నికల సమయం అసన్నమయింది. అధికార పార్టీ తన సత్తా చూపిస్తోంది. ఎక్కడ చూసినా టెంట్లు, మీటింగులు, ఎత్తులకి పైఎత్తులు …. ఆ హడావుడి చూసి తీరవలసిందే. ఈ ఎత్తుల్లో భాగంగానే ఎక్కడో రాజధానికి దూరంగా విసిరేసినట్టు ఉండే ఈ జిల్లాకి ఒక చురుకైన కలెక్టరుకి పోస్టింగ్ ఇచ్చారు. పేరు – సంజయ్.  చామనఛాయ. నైస్ గా ట్రిమ్ చేసిన మీసం. ఆచితూచి మాట్లాడే మాటలు. నడకలో వేగం. కళ్ళల్లో ఒక మెరుపు. ఈ ప్రపంచంలో మేము చెయ్యలేనిది ఏమీ లేదు అని గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళ కళ్ళల్లోనే అలాంటి మెరుపు కనిపిస్తుంది. ఎన్నికల వేళ. కొంతమంది కొత్త కలెక్టరు గారి జాతకచక్రం కూడా తిరగేసే పనిలో పడ్డారు. అయితే పేరుకు ముందు-వెనక ఏమీ లేకపోవడంతో ‘పై’వాడా? లేక ‘కింద’వాడా? అన్నది అంతు చిక్కడంలేదు.

నెల రోజులు తిరగకుండానే కలెక్టరు గారు నీతినిజాయితీలకి మారు పేరు అని ప్రసిద్ధికెక్కారు. ప్రతీ విషయం తెలుసుకోవాలనే  జిజ్ఞాస…. ప్రతీ ఫైలులో ఒక క్వరీ, ఒక క్వశ్చిన్ మార్క్. ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లు, క్లర్కులు, సప్లయర్లు, కాంట్రాక్టర్లు మొదలు జిల్లాలో పనిచేసే అధికారులు, స్టాఫ్, టీచర్లు ఒక్కరేంటి అందరినీ మొదట ఒక అనుమానపు కళ్ళజోడుతో చూసిన తర్వాతనే మామూలుగా చూస్తారు కలెక్టరు గారు. ఆయన – మొండివాడు, లంచం తీసుకోడు ఇంకా ఎవ్వరినీ నమ్మడు – కలెక్టరు గారి గురించి ఈ మూడు విషయాలు నిర్ఢారణ అయ్యాయి. బయట జనాలకి మొదటి గుణం ఎలా ఉన్నా, చివరి రెండు లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అదే జిల్లాలో ఉండే ఒక సీనియర్ న్యాయవాది – “నిజాయితీపరుడే. కాదనను. కానీ, సాటి మనిషిని మనిషిలా చూడడు.” అన్నాడు. ఇంక గుమాస్తాలు అయితే – “కలెక్టరు గారికి ప్రతీ మనిషి దొంగలాగానే కనిపిస్తాడు. కలెక్టరు గారికి కాస్త దగ్గరగా ఉంటూ ఆయన్ని పొగడక తప్పని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మాత్రం – “అయ్యగారు పైకి ఎలా ఉన్నా, ఆయన ‘విజన్’ ఉన్న వ్యక్తి. హి ఈజ్ క్లియర్” అంటూ ఉంటారు.  అయితే వాళ్ళ ముఖాల్లో కూడా స్వామిభక్తి వల్ల కలిగే సంతోషానికి బదులు ఒక కఠినమైన అధికారి కనుసన్నల్లో పనిచేసే వాళ్ళ కళ్ళల్లో కనిపించే అలర్ట్ నెస్ మాత్రమే కనిపిస్తుంది.

చూస్తూచూస్తూనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. జిల్లా మొత్తం ఎన్నికలమయం. ఒక కాలేజీని ‘స్ట్రాంగ్ రూమ్’ చెయ్యాలని నిర్ణయించారు. ఎన్నికల తనిఖీల్లో దొరికిన వాహనాలని ‘సీజ్’ చేసి పెద్ద ఖాళీస్థలం ఉన్న గవర్నమెంటు గ్రౌండులో వరసగా నిలబెట్టడం మొదలుపెట్టారు. పెట్రోలు బంకులు ఖాళీ లేకుండా ఉన్నాయి. ఎన్నికల ‘స్టికర్’ వేసిన వాహనాలు జిల్లా మొత్తం పరుగులు తీస్తున్నాయి.  జిల్లాలో ఉన్న అధికారులు, ఉద్యోగస్తులు అందరినీ ఎన్నికల డ్యూటీకి డిప్యూట్ చేసేస్తున్నారు. జిల్లా మొత్తం అట్టుడిగిపోతోంది. లౌడ్ స్పీకర్లల్లో నాయకుల గురించిన ప్రచారం హోరెత్తిపోతోంది. డాక్టరు శశి భూషణ్ కి కూడా ఎన్నికల డ్యూటీ పడింది – ప్రిసైడింగ్ ఆఫీసరుగా. ఫలానా-ఫలానా తారీఖుల్లో ట్రైనింగ్ కి రావలసిందిగా లెటరు కూడా అందింది.

డాక్టర్ శశి భూషణ్ కి దిగులుగా ఉంది. ఆయన దిగులు తన గురించి కాదు. తనని నమ్ముకున్న ఆ పశుపాలకుల గురించి, వైద్యం మొదలుపెట్టి సగంలో ఉన్న ఆ మూగ జీవాల గురించి. అలా వైద్యం సగంలో ఆపడం ఎంతమాత్రం మంచిది కాదని డాక్టరు గారి అభిప్రాయం. ఎంతో వినయం ఉట్టిపడే వాక్యాలతో డాక్టరు గారు ఒక అర్జీ పెట్టుకున్నారు. అందులో – ఈ సీజనులో పశువులకి రకరకాల రోగాలు, అంటువ్యాధులు సోకుతాయన్న విషయం, చాలా గ్రామాల్లో పాలు ఇచ్చే పశువులకి వైద్యం సగంలో ఉన్న విషయం, తాను లేకపోతే పాపం ఆ పేద రైతులకి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం ప్రస్తావించారు. అందుకే మామూలు డాక్టర్ల మాదిరిగానే తను కూడా ఆసుపత్రిలో ఉండవలసిన అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వవలసిందిగా వేడుకున్నారు.  ఇది ప్రభుత్వం వారి ఆజ్ఞని ధిక్కరించడం కాదని, తన పరిస్థితిని అర్థం చేసుకుని మరొక్కసారి ఆలోచించవలసిందని మరీ మరీ వేడుకున్నారు.

కలెక్టరు గారి గురించి వాళ్ళు-వీళ్ళు చెప్పింది విని వారిపట్ల డాక్టరుగారికి గౌరవం రెట్టింపయ్యింది. అర్జీ తీసుకుని స్వయంగా కలెక్టరు గారిని కలవడానికి వెళ్ళారు. ఆయన వెళ్ళేసరికి కలెక్టరు గారి గదిలో భూముల నష్టపరిహారం కోసం వచ్చిన వాళ్ళూ, సప్లయర్లు, కాంట్రక్టర్లు, నలుగురు ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లు, ఇద్దరు-ముగ్గురు గుమాస్తాలు కూర్చుని ఉన్నారు. కలెక్టరు గారు అర్జీ చదివి ఒక్క నిమిషం తల వెనక్కి వాల్చి కళ్ళు మూసూకున్నారు. అటుపై ఫైలు మీద పెద్దపెద్ద అక్షరాలతో – “ఎన్నికల పని అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి ఎలాంటి మినహాయింపు లేదు” అని రాసేసారు.

డా. శశి భూషణ్ ఎంతో మర్యాదగా – “అయ్యా, నా ఆసుపత్రి పరిధి చాలా పెద్దది. నా పరిధిలోకి ఎన్నో గ్రామాలు వస్తాయి. పశుపాలకులు ఇబ్బంది పడిపోతారు. నేను ఎప్పుడూ డ్యూటీ చెయ్యకుండా తప్పించుకున్నది లేదు. అది నా నైజం కూడా కాదు. ఇది నా చిన్న విన్నపం అంతే!” అయితే కలెక్టరు గారు డాక్టరు మాటలని మధ్యలోనే తుంచేస్తూ – “చూడండి డాక్టర్! మీరు ప్రైవేటుగా ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పనులవల్లనే మొత్తం డిపార్టుమెంటుకు చెడ్డపేరు వస్తోంది. మీరూ, మామూలు మనుషుల డాక్టర్లూ ఒక్కటేనా? హహహ…. పశుపాలన శాఖ ఉన్నఫళంగా మూసేసినా ఎవడూ అడిగేవాడు కూడా ఉండడు. పైగా ప్రజలకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. ఆ కథంతా నాకు బాగా తెలుసు.”       

ఆ గదిలో కూర్చున్న వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. కొందరు తలలు దించుకున్నారు. ఇలాంటి మౌనాలు ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వసాధారణం. ఈ మౌనాన్ని పెంచిపోషించడం ఏళ్ళతరబడి జరుగుతూనే ఉంది.

డాక్టరు గారి ముఖం జేవురించుకుపోయింది. ఆయన మామూలుగా మెతక మనిషి. నెమ్మదస్తుడు. అయితే కొన్ని మాటలు చాలా బలంగా గాయం చేస్తాయి. డాక్టరు విషయంలో జరిగింది అదే! డాక్టరుగారు మెల్లగానే కానీ చాలా స్పష్టంగా – “అయ్యా! మీ చేతిలో అధికారం ఉంది. మీరు కావాలనుకుంటే కుక్క మెడలో ఒక ఐ.డి. కార్డు తగిలించినా అది మెజిస్ట్రేటు అయ్యి కూర్చుంటుంది. కానీ ఒక మెజిస్ట్రేటు మెడలో ఐ.డి.కార్డు వేలాడదీసినంత మాత్రాన నాలాంటి డాక్టరు కాలేడు.!”

ఒక్క క్షణం గది అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో అక్కడున్న నలుగురిలో ఒక వ్యక్తి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ చిన్న నవ్వు క్రమంగా అందరి ముఖాల్లోకి వ్యాపించింది. ఆ నవ్వు ఎవ్వరికీ నష్టం కలిగించేది కాదు. అది ఒక చిన్న చిరునవ్వు అంతే! అయితే మిస్టర్ సంజయ్ లాంటి అధికారికి కోపం కట్టలు తెంచుకోవడానికి ఆమాత్రం నవ్వు సరిపోయింది. కలెక్టరు గారు అగ్గిమీద గుగ్గిలం అయ్యిపోయారు. ముఖం మాడిపోయింది. అప్పటికి ఎలాగో తమాయించుకుని ‘యూ కెన్ గో నౌ’ అని మాత్రం అనగలిగారు.

డాక్టరు బయటకి వెళ్ళిపోయాడు. ఎండ మండిపోతోంది. తను చేసిన తప్పుకు కాకుండా నిజం మాట్లాడినందుకు దండించబడ్డ భావనకి లోనయ్యాడు. కోపం, ఎండ అన్నీ కలిసి ఒళ్ళంతా చిటపటలాడిపోతోంది. అయినా కోపాన్ని తమాయించుకుని మోటరు సైకిలు స్టార్ట్ చేసాడు.

2

డాక్టరుగారికి  ఎన్నికల డ్యూటీ ఎక్కడో మారుమూల గ్రామంలో వేసారు. అదృష్టంకొద్దీ ఆ ఊరి సర్పంచ్ డాక్టరుకి పరిచయస్థుడు. కొన్నేళ్ళ క్రితం ఆ సర్పంచ్ గారి చాలా ఖరీదైన గేదెకి సుస్తీ చేస్తే, రాత్రంతా వాళ్ళ ఇంట్లోనే ఉండి వైద్యం చేసి దాని ప్రాణాలు కాపాడాడు. ఆ కృతజ్ఞత ఇప్పుడు పనికొచ్చింది. సర్పంచ్ గారు ఎన్నికల నిర్వహణ సభ్యులు అందరికీ తిండి, వసతి విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అయితే ట్రాక్టరులో ఆ ఊరు చేరుకోవడమే చాలా ఇబ్బంది అయ్యింది. డాక్టరు ఎంత వేడుకున్నా ట్రాన్స్ పోర్టు ఇన్-ఛార్జ్ మాత్రం వీళ్ళకి జీపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసాడు. సామాన్లు అన్నీ తీసుకుని కలెక్షన్ సెంటరుకి వచ్చేసరికి చాలా అలసిపోయారు. మధ్యలో ట్రాక్టరు కూడా చెడిపోయింది. వాళ్ళనీ-వీళ్ళనీ బతిమాలుకుని అతికష్టం మీద ఎలాగో కలెక్షన్ సెంటరుకి చేరుకున్నారు. ఆ పేపర్లు జమ చేసే దగ్గర కూడా చాలా తతంగం నడిచింది. ఒక్క డాక్టరు గారి పేపర్లే శల్య పరీక్ష చేసి తీసుకున్నట్టు అనిపించింది. మొత్తానికి ఎలాగో ‘డిపాజిట్ స్లిప్’ చేతికొచ్చింది. ఇదంతా చూస్తున్న రిటర్నింగ్ ఆఫీసరుకి కూడా డాక్టర్ మీద జాలేసింది.

కొంత కాలం గడిచింది. కలెక్టరు గారు చెప్పాపెట్టకుండా పశువుల ఆసుపత్రికి తనిఖీ కి వచ్చారు. ఆ ఆసుపత్రి, క్వార్టర్స్ అన్నీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటివి. మరీ శిథిలావస్థలో ఉన్నాయి. స్లాబు కారుతోంది. గచ్చు పెచ్చులూడిపోయి గుంతలు పడిపోయింది. కానీ బయట వాకిట్లో మాత్రం చక్కగా శుభ్రంగా గడ్డి చెక్కి గోడవారగా చిన్న-చిన్న మొక్కలు వేసారు. ఒక పక్కన ‘ట్రివిన్’ ఉంది. దాన్ని లాక్ చేసి పశువులకి వైద్యం చేస్తూ ఉంటారు. అవసరం అయితే తాడు ముడివేసి చులాగ్గా పశువులని పడుకోబెట్టి వైద్యం చేసే నైపుణ్యం ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు. చిన్న-చిన్న ఆపరేషన్లు, పెద్ద-పెద్ద గాయాలకి కుట్లు వెయ్యాల్సి వచ్చినప్పుడు ఈ నైపుణ్యం ప్రదర్శిస్తారు అన్నమాట! కలెక్టరు గారు ఆసుపత్రి దీనావస్థ చూసి ముక్కున వేలేసుకున్నారు. మరమ్మత్తుల గురించి డిపార్టుమెంటు, కలెక్టరుకి డా.శశి భూషణ్ రాసిన ఉత్తరాలు, అర్జీలు అన్నీ తేదీలువారీగా ఫైలు చేసి ఉన్నాయి. ఆ ఫైలు కలెక్టరుగారి ముందు ఉంది. కలెక్టరు గారు మందుల సూచి, స్టాక్ తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యంకోసం పశువుల్ని తోలుకొచ్చిన నలగురైదుగురిని విడిగా పిలిచి ఎన్నో ప్రశ్నలు వేసారు. అయితే ఎవర్ని అడిగినా డాక్టరు గారిని వేనోళ్ళ పొగిడే వాళ్ళే. డాక్టరు గురించి ఫైలు మీద రాయదగ్గ విషయం ఏం దొరకక చిన్నబుచ్చుకున్న ముఖంతో వెనుదిరిగారు కలెక్టరు గారు. ఆఖరుకి డాక్టరు గారు తెప్పించిన ఫలహారం, పళ్ళరసం వైపు కూడా బేఖాతరుగా చూస్తూ “నేను డ్యూటీలో ఉండగా ఎవరు ఏం ఇచ్చినా తీసుకోను” అని ముఖం తిప్పుకున్నారు. అయితే ఆయనతో వచ్చిన బాడీగార్డు, డ్రైవరు, మిగిలిన స్టాఫ్ మాత్రం సుబ్బరంగా తిని బ్రేవ్ మని తేన్చారు.

కలెక్టరు గారు ‘ఒఠ్ఠి’ నిజాయితీపరుడు కాదు! ఆయన తెరవెనుక కథలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. సివిల్ సర్జన్, జిల్లా ఇంజినీర్, సప్లయర్ల ఆవలింతలు, త్రేన్పుల్లో నుంచి వచ్చిన దుర్వాసన మెల్లమెల్లగా జిల్లా అంతా వ్యాపించింది. కలెక్టరు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు భార్య, చంటిబిడ్డతో వచ్చారు. మెల్లమెల్లగా బంధుగణం అంతా దిగడం మొదలయింది. వీళ్ళ రాకపోకలుకి ప్రభుత్వ వాహనమే. వాళ్ళ తిండితిప్పలు, షికార్ల బాధ్యత అంతా సప్లయర్లు, కాంట్రాక్టర్ల మీద పడేది. దీనికి అంతటికీ కర్త, కర్మ, క్రియ – స్టెనోగ్రాఫర్. ఆ జిల్లాలో ఎవరి మాటైనా నెగ్గుతుంది అంటే ఒక్క స్టెనోగ్రాఫరుదే! జిల్లా కలెక్టరు గారు ఒక్క స్టెనోగ్రాఫరు మాటే వింటారు. చంటిపిల్లవాడి పాలకోసం అని, యావత్ బంధుజనానికి పెరుగు-వెన్న-నెయ్యి కోసం అని ఒక సప్లయర్ అవుట్ హౌస్ వాకిట్లో ఒక కపిలగోవును తోలుకొచ్చి కట్టేసిపోయాడు.

ఎన్నికల వేళ సప్లయర్లు, కాంట్రాక్టర్లకి పండగలా ఉంది. స్టెనోగ్రాఫరు గారి దయవల్ల జిల్లా అంతా క్షేమంగా ఉంది. కపిలగోవుకు కావలసిన మేత, దాణా బాధ్యత అంతా స్వయంగా స్టెనోగారే తలకెత్తుకున్నారు – “అయ్యా, నా ఇంట్లో ఐదు మూగజీవాలు ఉన్నాయి. పాల వ్యాపారం చేసుకోకపోతే వచ్చే నాలుగు జీతంరాళ్ళతో ఇల్లు గడిచేదెలాగ చెప్పండి? ఆ ఐదు జీవాల మేతలో తలొక గుప్పెడు తీసానంటే దీని కడుపు నిండిపోతుంది. మీరేం దిగులుపడొద్దు. ఈ ఒక్క జీవం కోసం ఆ తరివిట్లన్నీ మీరేం పడగలరు? అంతా నేను చూసుకుంటాను కదా!” అని ముక్తాయించాడు స్టెనోగ్రాఫరు.

ఇంతటి పరోపకారి, స్నేహశీలి అయిన స్టెనో మాట వినకుండా ఎలా ఉండగలరు చెప్పండి? కలెక్టరు గారు స్టెనో చెప్పిన మాటలన్నిటికీ తల ఊపుతూ ఉదయం వ్యాయామం ముగించుకుని స్వచ్ఛమైన ఆవుపాలల్లో కార్న్ ఫ్లాక్స్ వేసుకుని తిని అల్పాహారం ముగించి లేచారు.  

ఇంక ప్రత్యేకించి చెప్పేది ఏముంది? ఆవు అవుట్ హౌస్ లో అడుగుపెట్టింది మొదలు ప్రతీ వారం వచ్చి దాని బాగోగులు చూసుకునే బాధ్యత డా.శశి భూషణ్ మెడకి చుట్టుకుంది. మొదటివారం వచ్చి ఆవు పోషణకి సంబంధించిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆవుకు ప్రతీరోజూ పెట్టడానికి రెండు ప్యాకెట్ల మినరల్ మిక్చర్ కూడా తీసుకొచ్చారు. కలెక్టరు గారు ఇంట్లోనే ఉన్నా వచ్చి కలవడానికి ఉత్సాహం చూపించలేదు. పని పూర్తి చేసుకుని డాక్టరు కలవాలని అనుకున్నా తీరికలేదనీ, కలవడం కుదరదనీ కబురు పంపారు. పాతికేళ్ళ తన ఉద్యోగ అనుభవంలో
డా. శశి భూషణ్ కి తెలిసింది ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఉన్నతాధికారులు బూర్జువా ధోరణిలో ఉంటారు. అలాంటప్పుడు ఒక్కచిరునవ్వు నవ్వి వెళ్ళిపోవడమే మనం చెయ్యగలిగిన పని. ఒకరకంగా డాక్టరు దీనికి అలవాటు పడిపోయారు. అందుకే డాక్టరుకి ఇదేం పెద్ద బాధ అనిపించలేదు.

కపిల గోవు బాగోగులు చూసుకోవడానికి డాక్టరు మళ్ళీ వారం రాలేదు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇలా క్రమం తప్పకుండా ప్రతీ వారం రావడం కుదరదని కబురు పంపాడు. చుట్టుపక్కల గ్రామాల్లో జబ్బుపడ్డ మూగజీవాలను చూడటానికి వెళ్ళాల్సి ఉందన్న విషయం కూడా నిర్మొహమాటంగా చెప్పాడు.

ఈ విషయాన్ని స్టెనో కూడా ఎంతో మామూలుగా కలెక్టరుగారికి విన్నవించాడు. అంతే, కలెక్టరు గారికి కోపం వచ్చి ఆ డాక్టరుని జిల్లాలోని రకరకాల సమితుల్లో సభ్యుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అలాంటి ఏ సమితిలోనూ కూడా ఆ డాక్టరుకి ప్రత్యేకించి పనేమీ ఉండేది కాదు. పాపం సంతకం పెట్టి వాళ్ళు ఇచ్చిన టీ తాగి ఒక మూల కూర్చుని నిద్రకి జోగుతూ ఉండేవాడు. ఇంత జరుగుతున్నా మీటింగులకు వెళ్ళక తప్పేది కాదు. మీటింగులు ఎగ్గొడితే జీతం విరగ్గోసే అవకాశం కూడా లేకపోలేదు. ఆ సంగతి స్టెనో ముందుగానే చెప్పాడు కూడా. డాక్టరుకి జీతం సమయానికి అందడం కూడా తప్పనిసరి. ఎందుకంటే డాక్టరుగారి ఇద్దరు కొడుకులూ పట్టణంలో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగు చదువుతున్నారు. ఒకటో తారీఖుకల్లా ఇద్దరికీ డబ్బు పంపాలి. ఊరుకాని ఊరులో ఏదైనా ఆసరా అవుతుంది అంటే అది – డబ్బు ఒక్కటే!

ఇదంతా తెలిసి కూడా మూడవ మీటింగుకి వెళ్ళలేకపోయాడు డాక్టర్. కలెక్టరుగారి పి.ఏ. ఫోను చేస్తే తన ఆరోగ్యం అస్సలు బాగోలేని విషయం చెప్తూ మీటింగుకి వెళ్లడానికి కారు ఇప్పించమని వేడుకున్నాడు. అయితే ఇలాంటి మీటింగులకి అందరూ వాళ్ళ-వాళ్ళ కార్లల్లో వస్తారు. కారు లేనిదల్లా తన ఒక్కడికే. సొంత పెట్రోలు పెట్టుకుని ప్రభుత్వ సమావేశాలకి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్న కూడా లేవనెత్తాడు. 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉండే మీటింగులకి టి.ఏ. క్లెయిమ్ కూడా చేసుకోలేడు. ఆసుపత్రిలో ఏడాదికి ఉండే టి.ఏ. క్లెయిమ్ 5,000/-. అందులోనే తనకింద పనిచేసే స్టాఫ్ టి.ఏ. క్లెయిమ్ కూడా చూసుకోవాలి మరి!

ఎన్నికలు జరిగి ఏడాది కావొస్తోంది. కొత్త ప్రభుత్వం కొత్త కొత్త ప్రకటనలు చేస్తూ చాలా చలాకీగా సాగుతోంది. ఒకరోజు ఉన్నట్టుండి కలెక్టరు గారి బదలీ వార్త గుప్పుమంది. ఆయనకి దేశరాజధానిలో ఒక పెద్ద పదవి కట్టబెట్టారు.

వీడ్కోలు సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు జనాలు పాత కలెక్టరు గారి గురించి ఎలాటి బెరుకూ లేకుండా బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. వీరి నుండి లాభాలు పొందిన వాళ్ళంతా కొత్త కలెక్టరు ఎలాంటి వాడు అని ఆరా తీయడం మొదలుపెట్టేసారు.

పాత కలెక్టరు సంజయ్ సార్ వీలైనంత తొందరగా ఇక్కడి నుండి బయటపడాలని చూస్తున్నారు. ఎక్కడయినా ఉదయించే సూర్యుణ్ణే పూజిస్తారు కానీ అస్తమించే సూర్యుణ్ణి కాదని ఆయనకి బాగా తెలుసు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే! వచ్చిన చిక్కల్లా – ఆవు. దాన్ని ఏం చెయ్యాలో తోచట్లేదు. తమతో రాజధానికి తోలుకెళ్ళాలో లేక అయినకాడికి ఇక్కడే అమ్మెయ్యాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇంతలో స్టెనోగారు నిదానంగా ఆవలిస్తూ – “ఇందులో అంత ఆలోచించేది ఏముంది సార్! డా. శశి భూషణ్ సలహా తీసుకుంటే సరి” అన్నాడు.

డాక్టరుకి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి ఆవు ముందు-వెనక తిరిగి చట్ట మీద మెల్లగా చరిచి పరిశీలనగా చూసాడు. ఒక బకెట్టుతో నీళ్ళు, సబ్బు తెప్పించమని చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని ఆవు మలద్వారం లోపలకంటా చెయ్యి జొప్పించి పూర్తిగా ఒక నిమిషంపాటు పరిశీలించాడు.

“ఆవు సూడిది. ఇప్పుడు దీన్ని అమ్మడం తెలివితక్కువ పని. ఈనమోపయ్యాకనో లేక ఈనిన తర్వాతనో అమ్ముకుంటే ధర రెట్టింపు అవుతుంది. ఒకవేళ అమ్మకుండా అట్టేపెట్టుకున్నా ఇప్పటికన్నా మూడింతలు పాలు ఇస్తుంది.”

“మీరు చెబుతున్నది నిజమేనా?” మొట్టమొదటిసారి కలెక్టరు సంజయ్ డాక్టరు చేస్తున్న పనిని దూరం నుండి పరిశీలనగా చూస్తూ నోరుమెదిపారు.

“నా లెక్క ఒక్కనాటికి తప్పదు. మీకోసం నేను చేతికి కనీసం గ్లోవ్స్ కూడా తొడుక్కోకుండా చూసాను అంటే అర్థం చేసుకోండి. నాకు ఎలాంటి హాని జరిగిన ఫర్వాలేదని ఇదంతా చేసాను. అయితే ఒక్క విషయం. ఆవుని మాత్రం చాలా జాగ్రత్తగా తోలుకెళ్ళాలి.”

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? ఆవు క్షేమంగా దేశ రాజధాని చేరుకుంది. సంజయ్ సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన శాఖలో స్పెషల్ సెక్రటరీ. అయితే రాజధానిలో, మునుపు జిల్లాలో ఉన్నన్ని సదుపాయాలు లేవు. ప్రభుత్వం వారు ఇచ్చిన క్వార్టర్స్ లో ఆవుకి తగినంత వైభోగం దక్కలేదు. నెల తిరిగేసరికల్లా ఆవు చిక్కిపోయింది. సంజయ్ సార్ కి ఎందుకో అనుమానం వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ అనుమానం ముందుగా వచ్చినది ఆయన భార్యకి. నానా తిప్పలు పడి తోటి ఐ.ఏ.ఎస్. ఆఫీసరు సిఫార్సుతో ఒక ఆదివారం పశువుల డాక్టరుని ఇంటికి పిలిపించారు. ఆ వచ్చిన డాక్టరు ఆవుని బాగా పరిశీలించి ‘ఆవు సూడిది కాద’ని తేల్చి చెప్పాడు. “ఎవరో గానీ మిమ్మల్ని బాగా ఆటపట్టించారు సార్” అని పళ్ళు ఇకిలిస్తూ వెళ్ళిపోయాడు ఆ రాజధాని పశువుల డాక్టరు.

సంజయ్ సార్ కొయ్యబారిపోయాడు. డాక్టర్ శశిభూషణ్ అమాయకపు ముఖం కళ్ళముందు మెదిలింది. మెల్లగా విన్నవించుకున్న ఆ డాక్టరు మాటలు చెవుల్లో మారుమోగాయి. తన ఓటమికి ఒక జీవంలేని నవ్వు నవ్వి ఊరుకున్నాడు. భార్య ఆయనకేసి చూస్తూ అలాగే ఉండిపోయింది. భార్యతో – “నేను వాణ్ణి వదిలిపెట్టను. వాడి అంతు చూస్తాను. ఆ కొత్త కలెక్టరుతో చెప్పి వాణ్ణి ఏం చేస్తానో చూడు” అన్నాడు పళ్ళునూరుతూ.

ఈ విషయం ఆ నోటా-ఈ నోటా పాకి పశుపాలన శాఖ గుండా జిల్లా అంతా వ్యాపించింది. కొత్త కలెక్టరు ప్రమోటీ! నడివయస్సువాడు. కాస్త మందకొడి! కొన్నాళ్ళ తర్వాత కొత్త కలెక్టరు గారు డాక్టరుని పిలిపించారు.

కొత్త కలెక్టరుది ఏ కులమో ముందే తెలిసిపోయింది. కలెక్టరు గారి ఆఫీసుకు చేరుకున్న డాక్టర్ శశిభూషణ్ ఒక మూల మౌనంగా నిలబడ్డాడు. స్టెనో నవ్వి డాక్టరుకి స్వాగతం పలుకుతూ – “చాలా మంచి పని చేసారు డాక్టర్! అలాంటి పొగరుబోతుకి చక్కటి గుణపాఠం చెప్పారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ!”  

“మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ, కొత్త కలెక్టరు గారు ఇదంతా మనసులో పెట్టుకుంటే నా పని ‘ఇంతే సంగతులు, చిత్తగించవలెను’. కాబట్టి నేను వీలైనంత త్వరగా ఇక్కడి నుండి దూరంగా బదిలీ చేయించుకోవడం ఉత్తమం అనిపిస్తోంది.”

“నా మాట వినండి. మీరు అస్సలు కంగారు పడొద్దు. కొత్త కలెక్టరు గారిదీ, మీదీ ఒకటే కులం. సార్ కి ఈ విషయం ముందే చెప్పి ఉంచాను. ఈ ఐ.డి. కార్డు మిగిలిన అన్ని కార్డులకంటే చాలా స్త్రాంగ్. దీన్ని ధరించి ధైర్యంగా లోపలకి వెళ్ళి సార్ కి మీ, ఊరు, పేరు, కులం-గోత్రం అన్నీ విన్నవించుకోండి. ఈలోపు నేను కాఫీ పంపిస్తాను. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఇంకొకటి ఉంది డాక్టరు గారూ! ఈ కొత్త ఆఫీసరు కి కూడా వెళ్ళిపోయిన ఆ పాత ఆఫీసరు మీద ఏమంత మంచి అభిప్రాయం లేదు. ఛార్జి అప్పగిస్తూ ప్రమోటీ అని ఈయన్ని చులకనగా చూసి కాస్త తూలనాడాడు.”

ఒక వారం తర్వాత కొత్త కలెక్టరు గారికి సంజయ్ సార్ దగ్గర నుండి ఫోను వచ్చింది. కొత్త కలెక్టరు గారు లేని గాంభీర్యం తెచ్చిపెట్టుకుని – “ఆ డాక్టరుని పిలిపించి చివాట్లు పెట్టాను సార్. క్షమించమని కాళ్ళు పట్టుకున్నాడు. ఆవుకి మేత ఎక్కువయ్యి, బాగా బలిష్టంగా ఉండటంతో పొరపాటు పడ్డాడుట. ఇంక అంతకు మించి మనం మాత్రం చెయ్యగలిగింది ఏముంది చెప్పండి….?”

అటువైపు నుండి ఫోను పెట్టేసిన చిన్నపాటి శబ్దం.

ఆ అధ్యాయం అలా ముగిసింది!

సంతోష్ దీక్షిత్

ది. 08 డిసెంబరు, 1958 న బిహార్ లోని భాగల్ పూర్ లో జన్మించిన ప్రముఖ హిందీ రచయిత శ్రీ సంతోష్ దీక్షిత్ భాగల్ పూర్, పట్నా, రాంచీలో ప్రాథమిక మరియు ఉన్నత విద్యలు అభ్యసించారు. 1994-95 నుండి క్రమం తప్పకుండా తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న శ్రీ సంతోష్ దీక్షిత్ ఇప్పటి వరకు 5 కథ సంకలనాలు,
6 నవలలు, 5 వ్యంగ్య రచనలు ప్రచురించారు.

వీరి సాహితీ సేవకి గాను ‘బనారసీ దాస్ భోజపురీ సన్మాన్’తో పాటు ఎన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. 2026 సంవత్సరంలో వీరి సరికొత్త నవల ‘ఛాయా సచ్’ సేతు ప్రకాశన్ వారి ఉత్తమ పాండులిపి పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయం.

కథారచనలో కొత్త-కొత్త ప్రయోగాలు చెయ్యడంలో ఆసక్తి చూపించే శ్రీ సంతోష్ దీక్షిత్ ప్రముఖ హిందీ రచయిత అమరకాంత్ గారి ‘డిప్టీ కలెక్టరీ’, శ్రీ జ్ఞానరంజన్ గారి ‘ఫెన్స్ కె ఇధర్ ఔర్ ఉధర్’ కథలకి సీక్వెల్ రాసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

చాలా సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలు అందించి ఉద్యోగ విరమణ అనంతరం పట్నా లో నివసిస్తూ తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నారు.

మొబైల్ : 9334011214

ఈ-మెయిల్ : santoshdixit17@gmail.com

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *