ఇఫ్తార్

Spread the love

స్టోరీ లైన్ : ఈ కథలో డా. రాశిద్ జహాన్ ముస్లిమ్స్ రంజాన్ పండుగ జరుపుకోవడంలో సమాజం లోని వర్గ విభజన పోషించే పాత్ర గురించి విశ్లేషిస్తారు. సమాజం లో అట్టడుగు వర్గ ప్రజలు జరుపుకునే బీద రంజాను  పండుగ స్వభావానికి., అన్నీ సౌలభ్యాలూ , వనరులు పుష్కలంగా ఉండే ఉన్నత వర్గ ప్రజలు జరుపుకునే రంజాను పండుగ స్వభావాన్ని పోలుస్తూ కథ చెబుతారు .అలాగే అప్పటి జాతీయోద్యమంలో తయారైన నకిలీ, అవకాశ వాద, దేశ భక్తుల గురించి అదే సమయంలో భర్త లోని నకిలీ దేశభక్తుణ్ణి మనసులోనే తిరస్కరిస్తూ తన ఆరేళ్ల కొడుకు  అస్లంలో సమసమాజ సాకార స్వప్నాన్ని చూస్తూ, కుటుంబ బాధ్యతల నడుమ అణిచివేతకు గురయ్యే  నసీమా లాంటి కమ్యూనిస్టు దేశభక్తురాలు  గురించి కూడా చర్చ ఉంటుంది.

***

‘పవిత్రమైన రోజా ఉపవాసాన్ని  విడిపించు ., అల్లాహ్  ఎప్పటికీ రంజాన్ ఇలా శుభప్రదంగా వచ్చేట్లు నిన్ను  ఆశీర్వదిస్తాడు’    ముందే డిప్యూటీ సాహెబ్ భార్య మహా చిరాగ్గా ఉంది. “ఈ దరిద్రులు రోజంతా ఎక్కడ చస్తారో ఏం పాడో .. రోజా కూడా సరిగా విడవనివ్వరు కదా” అనుకుంది గుమ్మం వైపుకి చూస్తూ . “ అల్లాహ్ నీకు సుఖ శాంతులివ్వనీ గాక” కంపిస్తున్న గొంతు మళ్ళీ వాకిట్లోంచి వినిపించింది . వెంటనే బేగం సాహెబ్ “నసీబన్ .,వో నసీబన్ అలమర తెరిచి మొన్నమిగిలిన  జిలేబీలు ఉన్నాయేమో చూసి ఫకీర్ కి ఇవ్వు కాస్త” చిరాకు నిండిన గొంతుతో అంది.

“అలాగే ఇంకా ఏమైనా ఇవ్వాలా ఇప్పుడే చెప్పండి” నసీబన్ అన్నది.  

“ఇంకా ఏమిస్తావేంటి .,ఇల్లు మొత్తం ఇచ్చేస్తావా  చెప్పు”? బేగం సాహిబా వెక్కిరింతగా అంది .

నసీబన్ బేగం సాహెబా వైపు అదోలా చూస్తూ  తల మీది  దుపట్టాని  సరి చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది .

బేగం సాహిబా వరండాలో పరుపు మీద కూర్చుని ఉంది .

ఆమె ముందు దస్తర్ ఖానా  {భోజనం చేసే వస్రం} పరిచి ఉంది.  దానిమీద సాయంత్రపు ఇఫ్తార్ విందు కోసం కావలసిన తిండి పదార్థాలు నోరూరించేట్లు పరిచి ఉన్నాయి . ఇంకొన్ని రసోయి ఘర్ లో {వంటింట్లో} తయారవుతూ ఉన్నాయి. బేగం నిమిష నిమిషానికి గడియారం వైపుకి చూస్తూ ఉంది . ఆమెకి ఎప్పుడెప్పుడు రోజా విడిచి రోజూ తినే తంబాకు నమలాలా అని మహా తహ., తహ గా ఉంది. మామూలుగానే ఆమెకు  చికాకు ఎక్కువే కానీ రంజాను మాసంలో ఆమె కొంత ఉల్లాసంగా కూడా ఉంటుంది.  ఆ విషయం ఆమె నౌఖర్లు అందరికీ ఒక పిట్ట కథలా  ప్రసిద్ధ మైపోయింది. అందరికంటే ముందు పాపం నసీబన్ కే ప్రమాదం  ముంచుకొస్తుంది. ఆ ఇంట్లోనే పెరిగిన అమ్మాయి మరి . బేగం సాహిబా కన్నా ఆమెకీ లోకంలో ఎవరూ లేరు. బేగం కూడా తన ప్రేమ నంతా నసీబన్ మీద వోలకబోస్తూ ఆమెని ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేసే పనిలోనే  ఉంటుంది

వేసవి కాలం ముగిసిపోయినా ఆమె పక్కనే ఒక పంఖా ఉంటుంది.  అది అవసరం ఉన్నప్పుడు  కేవలం నసీబన్ న్ని తన దగ్గరికి  పిల్చుకోవడానికి తన దగ్గరే  ఉంచుకుంటుంది బేగం. “అరే ఇంకా అక్కడే చచ్చావా  ఏం చేస్తున్నావ్”?బేగం గట్టిగా అంది . నసీబన్ దుపట్టాతో మొఖం తుడుచుకుంటూ జిలేబీలు తీసుకుని ఫకీరుకి ఇవ్వడానికి వాకిలి వైపుకి నడిచింది . “ కాస్త చూపియ్యు ఎన్నున్నాయేంటి” ? అంటూ  బేగం నసీబన్ న్ని ఆపింది . నసీబన్ కాస్త ముందుకొచ్చి బేగం ముందు తన చేతుల్ని చాపింది.  కేవలం రెండు జిలేబీలే  ఉన్నాయి ఆమె దోసిట్లో . “రెండేనా., అరే., దీన్లో రెండు కంటే ఎక్కువే  ఉండాలి.  నువ్వు కానీ తినేశావా” ? బేగం కోపంగా అరిచినట్లే అడిగింది. “లేదు , నేను తినలేదు” నసీబన్ గొణుగుతున్నట్లే అన్నది కానీ  బేగం ఎక్స్ రే కళ్ళు నసీబన్ పళ్ల మధ్యలో ఇరుక్కున్న జిలేబీ ముక్కలని పసిగట్టేసాయి . ఇంకేం ఉందీ ., బేగం ముందు వెనక చూసుకోకుండా పంఖా తీసుకుని నసీబన్ వెంట బడింది . “దిక్కు లేని దానా ఈ రోజు నీకు రంజాన్  రోజా ఉంది కదా .,ఒక్క అర్ధ గంట ఆకలికి ఆగలేకపోయావూ ? కుక్కా ., ఆగు ఈ రోజు నీ దొంగతనం మజా ఏంటో  నీకు రుచి చూపిస్తాను” అంటూనే ఉంది ఇంతలో బయట నిలబడ్డ ఫకీరు “ మీ పిల్లలు చల్లగా ఉండాలి. అల్లాహ్ దయ మీ పైన సదా ఉంటుంది.  ఏదైనా కొంచెం ఇచ్చి నా ఉపవాసం విడిపించండి” అన్నాడు . “ఇప్పుడొద్దు బేగం సాహెబా .. నువ్వు చాలా మంచి దానివి కదా  ఇప్పుడేమి చేయకు నన్ను. నా మీద దయ ఉంచు కాస్త” నసీబన్ దీనంగా బేగం ముందు నిలబడి బ్రతిమిలాడ సాగింది.  “ఓహో ఇప్పుడు వద్దేం ., చచ్చిన దానా ఈ రోజు నీ పని పడితే కానీ నా రోజా ఉపవాసం విడవడంలో మజా వచ్చేది” బేగం సాహెబా కోపంగా అంటుందో లేదో  “ ఈ ఇల్లు లేని గరీబుకు కాస్త దానం చేసి రోజా విడిపించండి తల్లులారా” ఫకీరు మళ్ళీ అరిచాడు . నసీబన్ మీద కోపంతో వణుకుతున్న బేగం నసీబన్ న్ని ముందుకు నెడుతూ “ఫో., పోయి ఆ ఫకీరుకి ఈ జిలేబీలు ఇచ్చిరా. పాపం ఎప్పటినుంచో  ఆకలితో అరుస్తున్నాడు.. ఆగు ఈ కొంచెం పప్పు కూడా ఇచ్చిరా” అంది నసీబన్ చేతుల్లోని గిన్నె లో గరిటె తో పప్పు పోస్తూ. నసీబన్ ఎందుకో నవ్వింది. తన ఆకలి అంటే లెక్క లేని బేగం కి .,ఫకీరు ఆకలి మీద మాత్రం ఎనలేని జాలి. అంతా తెచ్చి పెట్టుకున్నా వేషాలు కాకపోతే ఏంటిట అన్నభావం కనిపించింది బేగంకి. నసీబన్ నవ్వుకుంటూనే  పోయి ఆ ఫకీరు జోలె లో జిలేబీలు,పప్పు వేసింది.

===============                                                                    ఆమె చూపు ఆ వీధి ముగిసినంత మేరా పడింది. ఆ వీధి ఒకప్పుడు కొత్తదే., కానీ పాతగా అయిపోయింది . వీధికి రెండు వైపులా పాతవి,కొత్తవీ అయిన ఇళ్ళు ఉన్నాయి . కొన్నివొకే వరుసలో వొద్దికగా   అందంగా ఉంటే, మరికొన్ని ఎగుడు దిగుడు గా ఉన్నాయి. మరీ పాతవి అయిన ఇళ్ళు ఒకప్పటి ఆవీధి పరిస్థితిని పట్టిస్తున్నాయి. ఈ వీధి కొద్దిగా వెడల్పుగా ఉండి , ఒకప్పుడు చాకలి,బట్టలకి రంగులు వేసేవారు.,లోహపు పనులు చేసే వృత్తుల వాళ్ళు., అలావా మోసే వాళ్లు  సందడిగా తిరిగే వాళ్లు. వేసవి కాలం లో అయితే వొంటి గుర్రపు బగ్గీ కూడా ఆ వీధిలోనుంచి వెళ్ళ గలిగేది కాదు అంత రద్దీగా జనం తో నిండి  ఉండేదన్నమాట.ఆ వీధి ఎక్కువగా ముసలమాన్ల ఇళ్ళతో కళకళ లాడుతూ ఉండేది . అలావా మోసే వాళ్లకోసం అక్కడ మూడు మస్జిద్ లు ఉండేవి.వాటిలో ముల్లాలు ఉండేవాళ్లు. ఈ మస్జిద్ లలోని ముల్లాలలో  ఒక వింతైన పోటీ ఉండేది. ఎవరు ఎక్కువగా ఆ బీద ముస్లిమ్స్ ను మోసం చేద్దామా అనో.. లేక ఆ వొంటి గుర్రపు బగ్గీలు నడుపుతూ వాళ్ళు సంపాదించే డబ్బులో ఎవరు ఎక్కువ  కమిషన్ కొట్టేదామా అని ఎదురు చూసే పోటీ అన్నమాట. వాళ్లకెప్పుడూ ఇదే పని. ఈ ముల్లాలు ఆ బస్తీలోఖురాను చదవడంతో పాటు  భూత ప్రేతాలను దించడం, తావీజులు కట్టటం,మంత్రాలు చదవడం .. లాంటివి చేస్తూ ఆ అమాయక ప్రజలని మరింతగా దోచుకునేవాళ్ళు. ఈ మూడు ఇళ్ళ ముల్లాలు వీళ్ళ  ఇళ్ళ మధ్య ఉంటూ ., అడవిలో చెదపురుగు ఎలా అయితే మొత్తం అడవిని నిశబ్దంగా తినేస్తూ ఉంటుందో., అలాగే ఆ శ్రమజీవుల కష్టార్జితాన్ని దోచుకుంటూ ఉండడానికి అలవాటు పడిపోయారు. ఈ ముల్లాలు తెల్లటి ,శుభ్రమైన బట్టలు వేసుకుని ఆరోగ్యంగా.. నీతిమంతుల్లా  కనిపిస్తే., వాళ్ళను పోషించే కష్ట జీవులు మాత్రం మాసిపోయిన బట్టలతో ఆకలితో బలహీనంగా మోసం చేసే వాళ్ళుగా లెక్కించడేవారు.

ఇక ఆ వీధిలోనే ఒక సగం కూలిన ఇల్లు ఒకటి ఉంది. కింద వాటాలో కబాడీ దుకాణం ఉంది. పైన మాత్రం ఒక పదిహేను మంది ఖాన్ లు ఉంటారు .వీళ్ళు బోర్డర్ లో ఉండేవాళ్లు లాభం లేకుండా ఒక్క పనికూడ చేయరు. చాలా మురికిగా.,కర్కశంగా  ఉంటారు . వీళ్ళంటే ఆ మోహల్లా లో అందరూ భయపడుతూ ఉంటారు. అసలు విషయం ఏమిటంటే ఆ మోహల్లా లో చాలామంది పాపం ఆ ఖాన్ల దగ్గర అప్పు చేసే బడుగు జీవులు. ఇక వాళ్ళ చూపులు ఎంత నీచమైనవంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి మొహల్లా లోని  స్రీలు వంటరిగా వెళ్ళడానికి భయపడిపోయేవారు . రోజంతా ఖాన్ లు బయటకి వెళ్ళి పోతారేమో  ఇల్లు ఖాళీగా ఉండేది.సాయంత్రం అయితే చాలు వస్తూ వస్తూబోలెడంత  మాంసం తెచ్చు కుని ఒక పెద్ద డేగిశా  లాంటి గిన్నెలోమంచి ఘాటైన మాషాలాలు,నూనెలు వేసి  ఉడక బెట్టేవాళ్ళు. ఇక నాన్ రొట్టె తెచ్చుకుని అందరూ అందులోనే ముంచుకుని తినేసి.,నమిలిన ఎముకలు అన్నీ మొహల్లా లోని వీధుల్లో ఎక్కడంటే అక్కడ పడేసే వాళ్ళు . ఖాన్లు  రాత్రి భోజనం చేసే సమయానికి ఆ వీధిలో కుక్కలన్నీ వాళ్ళ ఇంటిముందు గుమిగూడి వాళ్ళు వేసే బొక్కల కోసం .. గుర్రు గుర్రు అంటూ ఎదురుచూసేవి. కడుపు నిండాక ఈ ఖాన్లందరూ ఖాతా పుస్తకాలు ముందేసుకుని ఎవరి అప్పులు ఎంతో, వడ్డీలు ఎంతో లెక్కలేస్తూ కూర్చొనే వాళ్ళు. లెక్కలవీ పూర్తయ్యాక తీరిగ్గా హుక్కా పీలుస్తూ., చంచలమైన నగరంలో వాళ్ళ ఆ రోజుటి అనుభవాల గురుంచి పనేమీ లేనట్లు ఒకరితో ఒకరు మహా రంజుగా ముచ్చటలాడుతూ ఎక్కడి వాళ్లక్కడ కంబళ్ళు పరుచుకుని పడుకునేవాళ్ళు.

విచిత్రం ఏంటంటే.,రోజా ఉపవాస దినాలలో., అలాగే మస్జిద్ లలో నమాజ్ కి సంబంధించి  మాత్రం., మోహల్లాలోని ధనవంతుల నుంచి, అంతెందుకు  గరీబుల నుంచి కూడా  ఫాయిదా లేకుండా ఒక్క పని కూడా చేయని  ఈ హృదయం లేని ఖాన్ మహాశయులు  భలే నియమ నిష్టల విషయంలో మాత్రం మహా ఖచ్చితంగా ఉంటారు. తమని తాము నిజమైన ముసల్మానుల మంటూ  విర్రవీగుతారు. నిజానికైతే లంచం తీసుకోవడం నేరమని మత గ్రంధాలలో చెప్పబడింది.  కానీ వీళ్ళు చాలా లౌక్యంగా  దాన్నితమ వ్యాపారానికి న్యాయంగా వచ్చే ఆర్థిక లాభాలకింద., ఒక ఫీసు కింద కొట్టి పడేస్తుంటారు.

సరే., ఇదిలా ఉండగా ఖాన్లు కూడా రోజా ఉంటూ సాయంత్రానికల్లా ఇఫ్తార్ విందు కోసం ఇంటికి త్వరగా వచ్చేసేవాళ్ళు.పండగ ఉల్లాసాన్ని తెచ్చుకోవడానికి తమ బాల్కనీ గోడల దగ్గర నుల్చుని ఆ వీధిలో వచ్చే పోయే ఆడవాళ్లను వంకరగా చూస్తూ ఈలలు వేస్తూ ..వీధి రౌడీలలా,పోకిరీ వెధవవల్లా  కేకలు వేసేవాళ్ళు. అందుకుని వాళ్ళ ఇంటి ముందు ఉండే ఇంటి తలుపులు,కిటికీలు ఎప్పుడూ తెరుచుకునేవి కావు. ఎప్పుడైనా తలుపుల సందులలోంచి కనపడే సన్నని లైటు వెలుతురుతో  ఆ ఇంటి లో మళ్ళీ ఎవరో కిరాయ దారులు వచ్చి చేరారని  తెలిసేది. కానీ చాలా తొందరగానే ఆ ఇంటి ముందు ఒక గుర్రపు బగ్గీ వచ్చి నిలుచునేది.  అర్ధ గంటలోనే ఇల్లు  ఖాళీ అయిపోయేది.

================                                         అలాంటి మోహల్లాలోకి  ఒక రోజు అస్గర్ సాబ్ అద్దె ఇళ్ళు వెతుకుతుండగా ఈ ఇల్లు  కనపడ్డది ఆయన దురదృష్టమో  ఏమో కానీ ఆ రోజు ఆ ఇంటి ఎదురుగా ఉండే ఖాన్లు బయటకు వెళ్లారు.ఇంటికి తాళం వేలాడుతోంది.అస్గర్ సాబ్ కి ఇల్లు చాలా  నచ్చేసింది. ముఖ్యంగా కిరాయి తక్కువగా ఉండడం నచ్చింది .కళాయి లాంటి ఇంటి మరమ్మత్తులు కాగానే ఆయన తన భార్యా పిల్లలతో ఇంట్లోకి దిగాడు. ఆయన భార్య నసీమన్  కి కూడా ఇల్లు  బాగా నచ్చింది.ఇంటి చుట్టుపక్కల అశుబ్రంగా చెత్తా చెదారం తో ఉన్నప్పటికీ నెలకి కేవలం ఇరవై రూపాయల అద్దె తో ఇల్లెక్కడ దొరుకుతుంది చెప్పండి?ఇక ఆమె వెంటనే ఆ ఇంటిని అలంకరించే పనిలో పడిపోయింది.

===================

                    ఒక రోజు ఆమె తన ఇంటి కిడికీ తెరిచి ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలను చూడసాగింది. వెంటనే ఆమె  ‘అమ్మో’ అనుకుంటూ కిటికీ చాటుకు వచ్చేసింది. “ఓహ్హ్  ఈ చెత్త ఖాన్ల దరిద్రం ఏంటసలు .,వీళ్ళ పొగరు దిగిపోనూ.,తన ఇంటివైపు చూస్తూ  ఎలా సైగలు చేస్తూ  వెకిలిగానవ్వుతున్నారో” మనసులోనే అనుకుంటూ చూపు తిప్పి మళ్ళీ అటువైపుగా చూసింది. ఆ ఖాన్లు అందరూ ఆమె ఇంటివైపే పళ్లికిలిస్తూ చూస్తున్నారు.నసీమా తమ వైపు చూస్తుందని తెలియగానే ఖాన్ల సైన్యంలో ఒక కదలిక వచ్చింది.ఆమను ఆకర్షించడానికి వాళ్ళు ఆమె వైపు చూస్తూ పెద్ద గొంతు తో మాట్లాడడం మొదలు పెట్టారు.వాళ్ళ ఇల్లు కొంచెం అటువైపుకి వాలి ఉన్నా కానీ వీధిలో మాత్రం బాగానే ఎదురు బొదురవుతుంటారు.ఇంతలో అక్కడికి నసీమన్ అత్త వచ్చింది.ఆమె దృష్టి కిటికీ దగ్గర ఉన్న కోడలి మీద పడింది. “అరె ., కొంచెం పక్కకి వచ్చేయి. అసలు పరదాలు లేని ఇల్లు ఎలా తీసుకున్నాడు ఈ అస్గర్? ముందా కిటికీ మూసేయ్. యా ఖుదా ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను”అంది కోపంగా. నసీమన్ ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అత్త  మాటల్ని పెద్దగా పట్టించుకోనూ లేదు.ఆమె చెవులు రిక్కించి కిటికీ అవతల గోల గోలగా వినిపిస్తున్న ఖాన్ల మాటల్నివాళ్ళ మొఖాల వైపు సూటిగా చూస్తూ వినసాగింది. “ఇక మగవాళ్ళనేం అంటాం ., ఆడ వాళ్ళకే సిగ్గు లేనప్పుడు”అంటూ అత్త అక్కడి నుంచి గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

=================                            అస్గర్,నసీమన్ మధ్యలో కొన్ని కారణాల వల్ల అగాథం ఏర్పడింది. అసలైతే వాళ్ళిద్దరి నిశ్చితార్థం చిన్నప్పుడే అయిపోయింది.అలానే పెరిగారు. మెల్లిగా వాళ్ళ  మధ్య పెద్ద వాళ్ళు పద్దతీ., సాంప్రదాయం అంటూ  ఏర్పరిచిన పరదా ఏర్పడింది. ఒకరినొకరు దొంగతనంగా చూసుకుంటూ., ఉత్తరాలు కూడా రాసుకున్నారు. అస్గర్ కా లేజి లో చదువుతున్నప్పుడు.. మహా ఉత్సాహంగా.,యువకుల్లో ఉండే ఉడుకు రక్తం తో ఉండేవాడు. దేశమంతా జాతీయోద్యమంతో రగిలిపోతున్న కాలం అది.  దేశ స్వాతంత్ర్యం కోసం యువకులు స్వచ్ఛందంగా ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెరవక, ముందుకు వురుకుతున్నఉద్యమాల కాలమది. అస్గర్ ఎప్పుడూ అలాంటి వాళ్ళతోనే దోస్తీ చేసేవాడు.               వాళ్ళ సంభాషణల్లో తరచూ  బ్రిటిష్ సామ్రాజ్య వాదుల పెత్తనం,శ్రమ జీవులు,రైతుల మీద జమీందారుల అణిచివేత,రైతుల కష్టాలు,భూస్వాముల,పెట్టుబాడీదారుల దోపిడీ, వాళ్ళని ఎదుర్కోవడానికి ఏర్పడ్డ రైతుల ఐక్య సంఘటన లాంటి అంశాలు వస్తూ ఉండేవి.ఈ విషయాలలో విద్యార్థులను చైతన్య పరిచే నాయకుడు గొప్ప జ్ఞానంతో ఉస్తాహంగా వాళ్ళ మధ్య తిరుగుతూ ఉండేవాడు. నిజానికి విద్యార్థులకి,దేశానికి అలాంటి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. దేశం ఆశలన్నీఊరకలేసే అస్గర్, అతని యువకులైన స్నేహితుల  మీదే ఉండేవి.ఇక నసీమన్ కి అస్గర్ ఎప్పుడూ తన కాలేజీ లో జరిగే విషయాలన్నీపూస గుచ్చినట్లు  ఉత్తరాల్లో  రాస్తూండే వాడు. తన నాయకత్వం గురుంచి కూడా తరచూ ప్రస్తావిస్తూ ఉండేవాడు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏ త్యాగమైనా చేయాలని ఉంది అంటూ రాసేవాడు. పత్రికల్లో అస్గర్ గురించిన వార్తలు వచ్చినప్పుడల్లా నసీమన్ గర్వం తో తల ఎగరేసేది. అవును మరి ఆమె స్నేహితురాళ్ళల్లో వాళ్ళ కాబోయే భర్తలు ఎవరూ కూడా అస్గర్ లా దేశ భక్తులు కారాయే! నసీమా కూడా తనను తాను అస్గర్ తో గడపబోయే కొత్త జీవితానికి తగ్గట్లుగా మలచుకోసాగింది.తెలివైన మనిషికి ఒక చిన్న ఇషారా  చాలన్నట్లు ఆమె తన చుట్టూ ఉన్న సమాజంలోని రోగగ్రస్తులను,సామాజిక చలనాలని  చాలా సులభంగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది.అలానే వాళ్ళని సంస్కరించే పద్దతులు కూడా తన మనసులో తయారు చేసుకొని సిద్దంగా ఉంచుకోసాగింది.దేశ స్వాతంత్ర్యం కోసం ఆమె తనను తాను ఎన్నిత్యాగాలు చేయడానికైనా సిద్దం చేసుకోసాగింది. దేశస్వాతంత్ర్యం  అనే భావనతో ఆమె పూర్తిగా ప్రేమలో పడిపోయింది. ఇక అస్గర్ బీ. ఏ పూర్తి కాగానే ఇద్దరికీ నిఖా అయిపోయింది. ఇద్దరూ కలిసి ఉండసాగారు. ఆ దగ్గరితనంలో నసీమాకి అస్గర్ లోని విప్లవ భావాలన్నీ ఒక మూసుకున్న గదిలో బందీ అయ్యాయని.,అవి వొట్టివే అనీ  అర్థమైపోయింది.  అస్గర్,నసీమాను తన దోస్తులు అందరికీ పరిచయం చేశాడు. నసీమా వాళ్ళతో చర్చల్లో పాల్గొనేది.కమ్మ్యునిస్టు పుస్తకాలు చదివేది.అస్గర్ స్నేహితుల్లో ముస్లిమ్స్ తో పాటు   హిందువులు కూడా ఉండేవాళ్లు. వాళ్ళు పుస్తకాలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అవి చదవడం వల్ల కూడా  ఆమె జ్ఞానం మరింతగా ఇనుమడించింది.అంతే కాదు ఆమెకు తాను కూడా స్వయం గా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలన్న  ఉత్సాహం కలిగింది. అది పెరుగుతూ పోయింది . అదే సమయంలో అస్గర్ మెల్ల మెల్లగా బలహీనపడుతూ వచ్చాడు.ఆయన చెప్పేది ఒకటి,చేసేది ఒకటిగా మారిపోయింది.ఉద్యమానికి దూరం అవసాగాడు.  స్నేహితులతో ఉన్నంత చనువుగా.,స్నేహంగా భార్య నసీమా తో ఉండకపోయేది. ఆమె ఉద్యమంలో పాల్గొనాలన్న ఆసక్తిని చూస్తూ ఖంగారు పడేవాడు.ఈ లోపల నసీమా గర్భం దాల్చింది. అయిన ఆమె ఉత్సాహం ఏమాత్రము తగ్గనే లేదు.   మెల్లిగా  “మనకి పిల్లవాడు పుట్టబోతున్నాడు ఇవన్నీ ఎందుకు అవసరమా చెప్పు  నువ్వు చేయలేవు ” అంటూ  మొదలు పెట్టి తరువాత ”పిల్లాడు చిన్నవాడు,వాడికి నీ అవసరం ఉంది, ఆ ఆలోచన తగ్గిస్తే మంచిది” అనేవారు. ఇక తరువాత తాను చేస్తున్న లా కోర్సు పూర్తి కావాలన్నాడు.అది కాస్తా పూర్తయ్యాక  “నౌఖరి చేయాలి పిల్లల అవసరాలెట్ల తీరతాయి చెప్పు”? అన్నాడు. ఆ నౌఖరి కాస్తా వచ్చింది.అదీ సర్కారు నౌఖరి. ఇంకేం.,ఇక మెల్ల మెల్లగా తన పాత విద్యార్థి దోస్తులకు దూరమవ్వసాగాడు.కానీ ఎప్పటిదాకా తనలోని మార్పుని భార్య నసీమా నుంచి దాచగలడని ? బయట స్నేహితులకి ఉద్యమంలో మునుపటిలా చురుగ్గా పాల్గొనలేక పోవడానికి భార్యాబిడ్డల సాకు చూపించేవాడు. కానే నసీమాకి ఏం చెప్తాడు? నసీమన్ కి అర్థం అయిపోయింది అతగాడి దొంగ నాటకాల ధోరణి. ఇక అతనేమీ చేయడని, అతగాడి మాటలన్నీ వట్టి బూటకాలనీను.ఎప్పుడైనా యాదృచ్చికంగా దోస్తులు కనిపిస్తే ఎప్పట్లా దేశం మీద ప్రేమ ఉన్నట్లు, తన సంసార బాధ్యతలే,ముఖ్యం గా నసీమానే అందుకు కారణం అన్నట్లుగా  మాట్లాడేవాడు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనలేక పోవడాన్నిఆ రకంగా  కప్పి పుచ్చేవాడు. అందరూ అతన్ని ఉద్యమానికి దూరం చేసింది నసీమానే అని నమ్మేవారు.నసీమాకి ఇదంతా అర్థం అవుతూనే ఉంది. అస్గర్ లోని అవకాశవాదం..బూటకపు ధోరణి  భార్యా భర్తల మధ్య ఒక దూరాన్ని సృష్టించింది.ఆమె తన భర్తని అంతకు ముందులా  ప్రేమించలేక పోతున్నది.ఆమె కళలు ధ్వంసమైనాయి. ఈ చెడు వాస్తవాన్ని ఆమె అతి కష్టం మీద మింగ సాగింది. అతనితో మాట్లాడడం తగ్గించేసింది. ముభావంగా ఉందా సాగింది.కానీ నసీమా మాత్రం తన మనసులోనే ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఇప్పుడు అస్గర్ దోస్తులు కూడా సర్కారీ  వకీలు నౌఖరీల్లో చేరిపోయారు. వాళ్ళల్లో సీ.ఐ.డీ  డిపార్ట్మెంట్ లో నౌఖరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిత్యం నసీమాతో ఉండే అస్గర్ .,ఆమెని సూటిగా చూడలేక పోయేవాడు. ఎందుకంటే అతనిలో ఒక దొంగ దాక్కొని ఉన్నాడు. ఆ దొంగని నసీమా పసిగట్టేసింది మరి.ఇది అతనిలో ఒక అసహనాన్ని పెంచసాగింది.ఆమె మంచు లాంటి మౌనం ,చాలాసార్లు ఆమె మాట్లాడే ప్రతీ మాటా అతనికి ఒక చెంప దెబ్బలా తగిలేది. మనసులోనే ఆగ్రహంతో,. ఆమెని చాచి చెంపమీద కొట్టాలన్నవాంఛతో లోలోన రగిలిపోయేవాడు.ఒక వేళ నసీమా అతనితో కొట్లాడుతూ,చీదరించుకుంటూ ఉంటే తాననుకున్నట్లే ఆమెను నాలుగు కొట్టి సంతృప్తి పడేవాడేమో., ఇంత బాధ పడేవాడు కాదేమో? కానీ.,ఆమె మౌనమే అతన్ని కాల్చి పడేస్తున్నది.

=================

సరే.,ఇదిలా ఉండగా.,ఇఫ్తార్ సాయంత్రం రానే వచ్చింది.అస్గర్ ఇంట్లో పిల్లలు,పెద్దలు,ముసలివాళ్ళతో పండగ సంబరం మొదలైంది.అంతా వంట గదిలో గుమి గూడారు. కొంత మంది పనేమీ లేకుండా ఉట్టిగా నిలబడి ఉంటే.,ఇంకొంతమంది చాయ్ చేస్తున్నారు.. వంటల వాసనతో ఇల్లంతా  ఘుమాయించి పోతోంది.  నసీమా మాత్రం మధ్య మధ్యలో ముందు గది లోని  కిటికీ లోంచి  బయటకి తొంగి చూస్తోంది. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండు నెలలు అయింది కావచ్చు. ఖాన్ ల సైన్యానికి నసీమా మొఖంలోని  నిర్లక్ష్యంతో కూడిన ధోరణి  బాగా అలవాటైపోయింది. ఇప్పుడిక ఆమె వాళ్ళ ముందు గంటల తరబడి నిలుచున్నా వాళ్ళిక ఆమె వైపుకి కూడా చూడరు గాక చూడరు. ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళు,చెవులూ  నసీమా మీయ కాకుండా., రెండూ దగ్గరలో ఉన్నమస్జిద్ మీదే ఉన్నయి.నసీమా వాళ్ళనంతగా దారిలో పెట్టింది మరి!                    సరే.,ఇఫ్తార్ విందుకింకా సమయం ఉంది. ఇంతలోనే ఆ వీధిలోకి ఒక ముసలి ఫకీరు వచ్చాడు. అతడు తడబడుతూ వేసే అడుగులు అతడు గుడ్డివాడన్న విషయాన్ని చెప్తున్నాయి. ఆయన వొంటి మీద ఏవో దద్దుర్లు,పుండ్ల లాంటివి కనపడుతున్నాయి.అతన్ని ఒక చిన్న పిల్ల నడిపిస్తున్నది. అయినా అతడు స్థిరంగా నడవలేక పోతున్నాడు. అతని గుప్పెట్లో ఏదో వస్తువు ఉంది. కానీ అతని చేతులు వణుకుతూ ఉండడం మూలాన్నఅదేంటో పూర్తిగా కనపడడమే లేదు. అతను మెల్ల మెల్లగా నసీమా ఇంటి ముందుకు వచ్చి అక్కడే వొక గోడకు ఆనుకుని నిలుచుండి పోయాడు. నసీమా కొడుకు ఆరేళ్ల అస్లం  ఆ ఫకీరుని చూడనే చూసాడు. “అమ్మీ ఆ ఫకీరు చేతిలో ఏముందంటావు”ఆసక్తిగా అడిగాడు. నసీమా పరీక్షగా చూస్తూ “ఇఫ్తార్ సమయం కదా  ఏదో తినే పదార్థం ఉండొచ్చు” అంది.

“మరి ఇంకా తినడెందుకు అమ్మీ” అస్లం. 

“ఇఫ్తార్ కి రోజా విడవడం కోసం పెట్టుకున్నాడేమో ., ఇంకా మస్జిద్ నుంచి అజా కూడా రాలేదు కదా” అంది నసీమా.               

“అమ్మీ నువ్వు రోజా చేయవా” అంటూ అస్లం  అడిగిన ప్రశ్నకి నసీమా నవ్వుతూ “లేదు ఉండను” అన్నది.

“ఎందుకు అమ్మీ ఎందుకు ఉండవు”? అస్లం.

నసీమా నిశబ్దం గా ఉండిపోయింది.

“మరి అబ్బా ఎందుకు టానేదార్ తో,తాను కూడా రోజా చేస్తున్నట్లు చెప్పారు”? అస్లం సందేహంగా అడిగాడు.

‘మీ అబ్బానే అడుగు బేటా  నాకు తెలీదు” అంది నసీమా కొంత ఆలోచనలోంచి తేరుకుంటూ.

“అబ్బా కాదు కానీ నువ్వెందుకు రోజా చెయ్యవు చెప్పు ముందు” అస్లం  జిద్దుగా అడిగాడు  మళ్ళీ.

“సరే ఒక విషయం చెప్పు నువ్వెందుకు రోజా చేయట్లేదు”  నసీమా అస్లం ని  అడిగింది.

“నేను చిన్నవాణ్ణి  కదా., చేయకూడదట కదా అమ్మీ. అయితే నానమ్మ నేను పెద్దయ్యాక రోజా చేయలేదనుకో నరకం లోకి పోతానని చెప్పింది. అసలు నరకం అంటే ఏంటి అమ్మీ”? అస్లం  కుతూహలంగా అడిగాడు.

“దోజఖ్.,అంటే నరకం. అదెక్కడో లేదు అదిగో నీ ముందే ఉంది చూడు” అంది నసీమా.

“ఎక్కడ అమ్మీ..”అస్లం తల్లి చూపించిన వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు.

“అదిగో.,ఆ గుడ్డి ముసలి ఫకీరున్నాడే అక్కడే., ఎక్కడైతే బట్టలు నేసే నేతగాళ్లు,దారాలకి,బట్టలకి రంగులేసేవాళ్ళు,లోహపు పనులు చేసే బీద వాళ్ళున్న చోట నరకం ఉంటుంది”నసీమా మెల్లిగా సమాధానం చెప్పింది.

“కానీ నానమ్మ నరకంలో మంటలుంటాయని చెప్పిందే”? అస్లం అయోమయంగా చూస్తూ అడిగాడు.

“హా.. ఉంటుంది కానీ మన పొయ్యిలో ఉన్న మంట లాంటిది ఉండదు. అక్కడి నరకంలో ఆకలి మంటలుంటాయి.ఎందుకంటే వాళ్ళకి అక్కడ తిండే దొరకదు.  దొరికినా చాలా తక్కువగా ఆకలి తీరనంత తక్కువగా,అదీ చెత్త,పాత ముక్కిపోయిన  తిండి   దొరుకుతుంది. ఆ కొంచెం తిండి కోసం వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ నరకంలో వాళ్ళకి వేసుకోవడానికి  బట్టలు కూడా  ఉండవు. ఉన్నాపాతవి , చిరిగిపోయి ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో.,పురుగూ పుట్రా .,పిల్లల తలల్లో వెంట్రుకలు  తైల సంస్కారం లేక ఎండిపోయి, పేన్లు తిరుగుతూ ఉంటాయి.ఇంకా అస్లం ., ఆ నరకంలో ఉండే పిల్లలకి

నీకున్నట్లు బొమ్మలు కూడా ఉండవు తెలుసా”? నసీమా అంటుంటే , “అయితే అమ్మీ నానమ్మ చెప్పిన ఆ నరకం లో ఉండే కల్లూ గాడి  దగ్గర కూడా నువ్వన్నట్లు  బొమ్మలు లేవు పాపం” అన్నాడు  అస్లం బోలెడంత జాలిని నింపుకున్న అమాయకపు మొఖంతో.

“అవునా అమ్మీ మరి రంజాన్ రోజా చేస్తే జన్నత్ కి{స్వర్గానికి} వెళతారు అంటారు కదా.,జన్నత్ ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది?” అస్లం అడిగాడు .

“జన్నత్ అంటే నరకం కాదు. నరకం లో ఉండే మంటలు,బాధలు జన్నత్ లో ఉండవు. దాన్ని స్వర్గం అంటారు.ఎక్కడ ఉందంటావా ., ఇదిగో మన ఇంట్లో ఉంది. ఎక్కడైతే నువ్వు,నేను,నానమ్మా,అబ్బా,బాబాయ్, అత్త ఉంటామో అక్కడే జన్నత్ ఉంది.ఇక్కడ మనకి పెద్ద విశాలమైన గదులు,స్వచ్చమైన గాలీ, వెలుతురు, నీళ్ళు ,తినడానికి మంచి తిండి,వెన్న,పండ్లు,పాలు,నువ్వు బడికి వెళ్ళడానికి డబ్బు, ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇదే జన్నత్ అంటే ”.నసీమా ఏదో లోకంలో ఉన్నట్లే మాట్లాడుతున్నది.

“అయితే అమ్మీ అందరూ ఎందుకు జన్నత్ లో ఉండరు”? అస్లం అడిగాడు .

“ఎందుకంటే చిట్టి తండ్రీ ., జన్నత్ లో ఉండే డబ్బున్న వాళ్లు .,దో జఖ్ లో ఉండే గరీబులని మన  ఇళ్ళల్లోకి రానివ్వరు. వాళ్ళతో ఎక్కువ పనులు చేయించుకుని,తక్కువ డబ్బులు ఇస్తారు. మళ్ళీ దోజఖ్ లోకి తోసేస్తారు.  వాళ్ళనసలు  ఎదగనివ్వరు ” నసీమా మెల్లిగా చెప్పింది.

“ఇంకా వాళ్ళు గుడ్డి వాళ్లయిపోతారు కదా”అస్లం.

“అవును దోజఖ్ లో గుడ్డివాళ్లు ఎక్కువగా ఉంటారు”నసీమా అస్లం మాటలతో అంగీకారం ఉన్నట్లే అంది.

“కళ్ళు కనపడకపోతే మరి వాళ్ళు ఎలా తింటారు అమ్మీ”  అస్లం.                                                                             నసీమా జవాబు చెప్పే లోపే మస్జిద్ నుంచి అజాన్ మధురంగా  గాల్లో తేలి వచ్చింది.,దాని వెన్నంటే గాల్లో నిప్పు బంతి పేలింది.యికంతే.,ఇళ్ళల్లో జనం అంతా చాయ్, రక రకాల తిండి పదార్థాల మీద పడ్డారు. వీధి లోని గుడ్డి ఫకీరు కూడా తన గుప్పిట్లో ఉన్న జీలేబీలను ఆకలితో ఉన్నాడేమో నోట్లో పెట్టుకుందామని చేతిని నోటి వైపుకి చాచాడు. ఇంతలోనే ఫకీరు వొంట్లో వొణుకు ఎక్కువపోయి,చేయి కదిలిపోయి,జిలేబీలు  జారి నేల మీద పడిపోయాయి. నిర్ఘాంతపోయిన  ఫకీరు వెంటనే మోకాళ్ల మీద కూలబడిపోయి నేల మీద జిలేబీల  కోసం వణుకుతున్న చేతులతో ఆత్రంగా వెతక సాగాడు. ఇంతలో అక్కడున్న కుక్క ఒకటి ఆ జీలేబీల మీద పడి లటుక్కున మింగేసింది.ఇంతలో వేరే కుక్కలు కూడా అక్కడ చేరాయి. ఫకీరు ఆ కుక్కల్ని తరిమే ప్రయత్నం చేశాడు. కుక్కలన్నీ   ఒక్కసారిగా గుర్రు గుర్రుమని ఫకీరుని భయ పెట్టాయి. ఫకీరు నిస్సహాయంగా అక్కడే నేల మీద కూలబడిపోయి చిన్న పిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడవసాగాడు.ఇంతలో అక్కడికి ఖాన్ల సైన్యం వచ్చింది.నోటి దగ్గరి తిండి పోయి  పొగిలి పొగిలి ఏడుస్తున్న  ఆ గుడ్డి ఫకీరుని చూసి ఆ ఖాన్లు అందరూ ఒక్కసారిగా  ఎగతాళిగా నవ్వసాగారు. ఇదంతా చూస్తున్న అస్లం “అమ్మీ” అంటూ నసీమాను కరుచుకు పోయాడు. ఆ చిన్నారి మొదటిసారి దోజఖ్ ఎలా ఉంటుందో చూస్తున్నాడు మరి. నసీమా వెంటనే ఫకీరుని చూస్తూ., వెకిలిగా నవ్వుతున్న ఖాన్ లని చూస్తూ “నీచులారా వెళ్లండిక్కడినుంచి” అని అరిచిందో లేదో వాళ్ళంతా అంతే వెకిలిగా ఆమెను చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. ముసలాయనతో ఉన్న పాప తాతని మెల్లిగా లేపి కన్నీళ్ళు తుడుచుకుంటూ ,. తాత కన్నీళ్ళు కూడా తుడిచింది. పాప చిన్నది కాబట్టి రోజా ఉపవాసంలో లేదు. నసీమా ఇచ్చిన రొట్టె,పండ్లు ఆ పాప తాతకిచ్చింది. “అల్లాహ్ కి దువా నీకు ఎప్పుడూ ఉండాలి”అంటూ ఫకీరు నసీమా ని దీవించాడు. ఇద్దరూ మెల్లిగా ఇంటి దారి పట్టారు.  ఇంటి ముందు తమని కోపంగా చూస్తున్న ఖాన్ల ని చూస్తూ అస్లం “అమ్మీ” అంటూ భయంతో మళ్ళీ తల్లినికరుచుకుపోయాడు.నసీమా వెంటనే వొంగి కొడుకుని ఎత్తుకుని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ  వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆవేశంగా  “నాయనా అస్లం  నువ్వు పెద్దైనాక ఈ దోజఖ్  ని పూర్తిగా మాయం చేయాలి అర్థం అయిందా అది నీ బాధ్యత ” అంది వీధి వైపు,వెళ్లిపోతున్న ఫకీరువైపు వేలు పెట్టి చూపిస్తూ .

“మరి నువ్వురావా నాతో ” అస్లం అమాయకంగా అడిగాడు తల్లిని.

“నేను ఈ ఖైదుని, సంసార జంఝాటాన్ని, చిన్న పిల్లలైన మిమ్మల్ని  వదిలి ఎక్కడికి వెళ్లగలను చెప్పు?మీ అబ్బా వెళ్లనివ్వలేదు నన్ను ”? నిరాశగా అంది నసీమా.

‘’ఎందుకు అమ్మీ నువ్వేమీ నానమ్మలా నడవలేని ముసలి దానివి కాదు కదా ఇల్లు  వదిలి బయటకి రాకపోవడానికి ”? చిన్నారి అస్లం అడిగాడు తల్లిని.

“నాతో నువ్వు కూడా రావాలి అమ్మీ. చెప్పు వస్తావు కదా”?

అస్లం తల్లి వైపు మారాము చేస్తున్నట్లు చూస్తూ గోముగా అడుగుతూనే ఉన్నాడు. నిరాశ కన్నులను దాచు కొంటూ నసీమా ఇంట్లోకి నడిచింది.

డా. రాషీద్ జహాన్

డా. రాషీద్ జహాన్ ప్రముఖ ప్రగతిశీల ఉర్దూ రచయిత్రి. డా. రాషీద్ జహాన్ ఆగస్ట్ 25, 1905లో ఆలీఘర్ లో జన్మించారు. రాషీద్ జహాన్ స్రీ వైద్య నిపుణురాలు.{gynaecologist } ప్రజాపక్ష మేధావి, కమ్యూనిస్ట్ నాయకురాలు. అభ్యుదయ కథా రచయత్రి.  తొలి  కమ్యూనిస్ట్ ముస్లిం డాక్టర్ & సర్జన్ గా ఎన్నో వైద్య సేవలు అందించారు .

గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.


Spread the love

One thought on “ఇఫ్తార్

  1. Iftar చాలా మంచి కథ. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ని ముస్లిం కుటుంబాలలో ఉన్న న భిన్న ధోరణులను రషీద్ జహాన్
    ఈ కథలో చక్కగా చిత్రించారు. సంపద ను పోగేసుకుని విర్రవీ గే ఖాన్ల వెకిలి వేషాలు, ఫకీరుల దీనావస్థ, అన్ గర్ లాంటి వారి అవకాశ వాదం, ఆరేళ్ల కొడుకు కు దిశ నిర్దేశం చేసే నసీమ వంటి ఆదర్శ మహిళ పాత్రల తో ఒక సజీవ చిత్రం Iftar. రచయిత్రి రషీద్ జహాన్ ఎంత అద్భుతం గా రాశా రో, తెలుగు సమాజంలోనే జరిగిన ట్టు అం తే అద్భుతం గా అనువాదం చేశారు గీతాంజలి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *