బహుమతి

Spread the love

సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట అయింది వాళ్ళా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి చేరేసరికి. పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరారు. మధ్యలో చైబాసా లో టీ,స్నాక్స్ కోసం ఆగడం తప్పిస్తే ఎక్కడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చైబాసా తరువాత దారి అడవిలోకి మళ్లింది. అడవిలో గుబురు చెట్ల మధ్యగా ఎగుడు దిగుడు ప్రయాణం అయినా దాని అందం దానికి ఉన్నదేమో, ఆ ప్రయాణాన్ని ప్రాచీ బాగా ఆనందించింది. ప్రకృతికి దగ్గరగా, సమూహం లో ఉండి కూడా ఏకాంత యానం చేయడం ప్రాచీకి బాగా నచ్చింది.

వాళ్ళెక్కిన ల్యాండ్ రోవర్ ఎగుడు దిగుడు దారి మీద పడుతూ లేస్తూ పరుగెడుతుంటే, ఆ ల్యాండ్ రోవర్ కి ముందు దారికి ఇరువైపులా నిల్చున్న పొడవాటి వృక్షాలు, వాటిని అల్లుకున్న లతలూ,తీవెలు కూడా ఒక్కడుగు ముందు పరుగెడుతున్నటుగా వున్నాయి. పక్షుల కిలకిలా ధ్వనులు ఆకాశాన్ని శబ్దమయం చేస్తుంటే, అడవి మల్లె పూల సౌరభం గగనానికి పరిమళాన్ని అద్దుతుంటే, కారో నదీ సంగమం కోసం వంకర,టింకర గా పరుగులు తీస్తున్న వాగులు ల్యాండ్ రోవర్ని అక్కడక్కడ పలకరిస్తున్నాయి. అడవి అద్భుత సౌందర్యానికి, పరమాద్భుతమైన పరిమళానికి మంత్ర ముగ్డ అయిన ప్రాచీ తనువంతా కళ్లుగా అడవిని వీక్షిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఫొటోలకోసం ఆగడం తో ప్రయాణం నెమ్మదించింది.

ముందుకు వెళ్లేకొద్దీ అడవి చిక్కబడుతోంది. రెండడుగుల దూరంలో తప్ప ఎక్కడ ఏమి వున్నదో ఎవరూ కనుగొనలేనంత దట్టంగా అడవి అల్లుకున్నది తనని తానే. ముందు రోజే వంటవాళ్లు. వంటకు కావలసిన సామగ్రి ఒక లాండ్ రోవర్ లో గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయాయి. వాళ్ళా గెస్ట్ హౌస్ కి చేరేసరికి చిన్న టెంట్ వేసి ఒక ముతక షత్రంజ్ పరచి వుంది గెస్ట్ హౌస్ ముందు.అరడజను ప్లాస్టిక్ కుర్చీలు ప్రయాణం లో అలసిసొలసి వచ్చేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

ల్యాండ్ రోవర్ దిగి అంతా ముందుకు కదులుతుంటే ప్రాచీ మాత్రం జ్ఞాపకాలతో లోపలికి  వెళ్ళింది.సరిగ్గా పది రోజుల క్రితం ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. ఆరోజు 24 వ తారీకు శుక్ర వారం మధ్యాహ్నం. ప్రాచీ ఫైల్ పట్టుకుని సంబిత్ ఛాంబర్ లోకి ప్రవేశించింది. ఆ క్షణం సంబిత్ పరధ్యానంగా ఉండి ఆమె రాకను పట్టించుకోలేదు.

“సర్!” అని పిలిచింది ప్రాచీ. సంబిత్ ఆ పిలువు కి తల ఎత్తి చూశాడు కానీ అతడి చూపు ఆమె మీద కాక ఆమె వెనుక దేనిమీదనో నిలచింది. తన వెనుక సంబిత్ దేనిని చూస్తున్నాడో తెలుసుకోవాలన్న కోరికను అతి కష్టం మీద ఆపుకుంది ప్రాచీ. వెంటనే తేరుకున్న సంబిత్

“రండి! కూర్చోండి” అన్నాడు కుర్చీ చూపిస్తూ. ప్రాచీ కూర్చున్న ఐదు నిమిషాలదాకా అతడేమీ మాట్లాడలేదు. ప్రాచీ ఇచ్చిన ఫైలు ను అటూ ఇటూ తిప్పి తిప్పి మరీ చూడసాగాడు. ఆ ఫైల్ ఎంత ముఖ్యమైనదో ప్రాచీకి తెలుసు. దాన్ని అత్యసరంగా పరిష్కరించవలసివున్నదని ఆమెకు తెలుసు. కానీ సంబిత్ అదేమీ పట్టించుకుంటున్నట్టు లేదు

“నేను నీతో ఒక విషయం మాట్లాడాలి?” అన్నాడు సంబిత్ ఎట్టకేలకు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ

ప్రాచీ కుర్చీలో సర్దుకుని కూర్చుని ఏమిటన్నట్టు చూసింది. “నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను” అన్నాడు సంబిత్ స్పష్టంగా, స్థిరంగా

ప్రాచీ కి ఆ మాట షాక్ తగిలినట్టుగా తగిలింది. నోట మాట రాలేదు. ఆశ్చర్యం తో కళ్ళు వెడల్పు అయినాయి. ఆ అకస్మాత్ ప్రతిపాదన ఆమెను నిర్ఘాంత పరచింది.

“ఏమి ఆలోచిస్తున్నారు?” నవ్వుతూ అడిగాడు సంబిత్.

మళ్ళీ అతడే “మీకు కొంచెం సమయం కావలి కదా!” ఈ సారి అతడి మాటలలో తన్యత లేదు కానీ ఆమె ఇబ్బందిని ఆనందిస్తున్నటు కనిపించాడు. ఆమె గొంతులో నుండి ఒకటి రెండు విరిగిన మాటలు

“మా అమ్మా! నాన్నా!……. ఏదీ ఇప్పుడే చెప్పలేను”

“సరే! మా అమ్మా నాన్నలను మీ అమ్మా నాన్న ల దగ్గరకు ఇవాళే పంపిస్తాను. కానీ ఈ విషయం రహస్యంగా ఉంచాలి” అని చెప్పిన సంబిత్ మామూలు ఆఫీస్ మూడ్ లోకి వచ్చేసాడు. ప్రాచీ మౌనంగా అతడిని అనుసరించింది

ఈ ఊహించని మలుపు ప్రాచీని అయోమయానికి గురిచేసింది. ఒక అందమైన మనిషి, అందునా జెంటిల్మన్ అని చెప్పడానికి కావలసిన అన్ని లక్షణాలు వున్నవాడు తన చేయి పట్టుకోమని ప్రాచీని అడగడం ఆమెను గందరగోళ పరచింది. నిజానికి ఆ క్షణం దాకా ఆమెకు పెళ్లి మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏవీ లేవు. పెళ్లి ఆమెకు సంబంధించినంత వరకు అదొక మార్మిక ప్రదేశం. ఇప్పుడా ప్రదేశం లోకి తనను చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళతానని అడుగుతున్నడొకఁడు. ఎలా స్పందించాలి? పెళ్లి   ప్రతిపాదన ఇలాగే చేయాలి అనే స్థిరమైన అభిప్రాయాలేవీ ఆమెకు లేవు కానీ అతడలా అడగడం ఆమెకు కొంత వింతగా, కొంత కొత్తగా, వుంది

ఆ రోజే సంబిత్ తల్లితండ్రులు, ప్రాచీ ఇంటికి వచ్చారు. ప్రాచీ తల్లితండ్రులు వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు. అమ్మాయి వాళ్లకు బాగా నచ్చింది. అబ్బాయి వీళ్లకు బాగా నచ్చాడు. వంక పెట్టడానికేమీ లేదు.  మామూలు మాటల తరువాత పెళ్లి ఏప్రిల్ లో చేయాలని నిశ్చయించుకున్నారు.

క్షణం లో ఆఫీస్ అంతా పాకిపోయింది వార్త. ప్రాచీ స్నేహితుల ఆనందం ప్రాచీ తల్లితండ్రుల ఆనందాన్ని, ప్రాచీ సంతోషాన్ని కూడా అధిగమించింది. ఆ బహుళ జాతీయ స్టీల్ పరిశ్రమ లో ఆరుగురు ఇంజనీర్లు వున్నారు సంబిత్ తో సహా! ప్రాచీ తో కలుపుకుని మొత్తం ఏడుగురు రీసెర్చ్ అసిస్టెంట్ లు వున్నారు ఇంజనీర్ల కింద. ప్రతి ఒక్కరూ ప్రాచీ దగ్గరకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. లంచ్ బ్రేక్ సంబిత్ ఛాంబర్ లో. అది లంచ్ బ్రేక్ లా లేదు. ఒకళ్ళకొకళ్ళు స్వీట్స్ తినిపించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట పాటు అక్కడ ఆనందం అవధులు దాటింది. యవ్వనోత్తేజం వెల్లివిరిసింది

ఆ రోజే ఒంటరిగా వున్నప్పుడు నిశ్చితార్ధం అయ్యేవరకు ప్రాచీని సెలవు పెట్టమని అడిగాడు సంబిత్. తన సహచరి తన కింద జూనియర్ గా పనిచేయడం బావుండదు అని వినయంగా చెపుతూనే ప్రాచీ వుద్యోగం చేయడం తన తల్లి తండ్రులకు, తనకు కూడా ఇష్టం లేదన్న విషయం కూడా స్పష్టపరచాడు సంబిత్. వచ్చే నెల రాజీనామా చేతున్నట్టు నోటిస్ ఇవ్వమని చెప్పాడు. ప్రాచీ కి కూడా వుద్యోగం పట్ల అంత ఆసక్తి లేకపోవడం తో ఆమె సంతోషంగా అంగీకరించింది

“ఏం ఆలోచిస్తున్నవే! అంత దీర్ఘం గా” ప్రాచీ పరధ్యానాన్ని గమనించిన ప్రజ్ఞ అడిగింది. ప్రాచీ మాట్లాడలేదు కానీ,ప్రజ్ఞే మళ్ళీ “నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు లే!” అన్నది ఆటపట్టిస్తున్నటు. ప్రజ్ఞ మాటలకు సంబిత్ వెనక్కు తిరిగి చూసాడు. అతడి పెదవుల మీద ఒక తుంటరి నవ్వు రేఖ. ఆ సమయం లో పెళ్లి గురించిన ఆలోచనలే చేయడం సహజం కదా. ల్యాండ్ రోవర్ గెస్ట్ హౌస్ ముందు ఆగింది. సంబిత్ ముందు దిగి ప్రాచీ దిగడానికి తన చేయి అందించాడు. అతడి స్పర్శకి ఆమె లో చిన్న వణుకు. సంబిత్ చూపిన కేరింగ్ గెస్చర్ ప్రాచీకి నచ్చింది

“ప్రాచీ! ఫుల్ షూస్ వేసుకుని వచ్చావా?లేదా అడవిలో ముళ్లపొదలు చాలా ఉంటాయి!” అన్నాడు సంబిత్ ప్రాచీ పాదాల వంక చూస్తూ. ప్రాచీ జీన్స్, తెల్ల టీ షర్ట్ వేసుకుంది. పాదాలకు ఫుల్ షూస్.

“అవునవును అడవిలో ముళ్ళు ప్రాచీని మాత్రమే ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. మావంక చూడనే చూడవు” అన్నది ప్రజ్ఞ ఏడిపిస్తున్నటు. ప్రజ్ఞ మాటలకూ ప్రాచీ మొహం ఎర్రబడింది. సంబిత్ పెదవుల మీద సిగ్గుతో కూడిన చిన్న నవ్వు.

ప్రీ లంచ్ డ్రింక్స్ కోసం టేబిల్ సిద్ధంగా వుంది. ఐస్ పెట్టెలలో తెచ్చిన బీర్ బాటిల్స్ టేబిల్ మీద సర్దారు. హాట్ డ్రింక్స్ అలవాటు లేని అమ్మాయిల కోసం థమ్స్ అప్ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ కూడా రెడీగా వున్నాయి. నంచుకోవడానికి చికెన్ పకోడా తన వంతు ఎప్పుడా అని ఎదురు చూస్తూ వుంది. ముగ్గురు అబ్బాయిలూ మందు నిండిన గ్లాసులు ఎత్తి చీర్స్ అన్నారు.

సంబిత్ ప్రాచీ వంక తిరిగి “నా కాబోయే భార్య అనుమతి తో ” అంటూ గ్లాస్ పెదవులకు అందుకున్నాడు. ప్రాచీ చిన్నగా నవ్వింది. మిగతా వాళ్లంతా చప్పట్లు కొడుతూ

 “ఇక నుండీ ప్రతి దానికీ సంబిత్ పర్మిషన్ తీసుకోవలసిందే” అని బిగ్గరగా నవ్వారు. మసాలా వేసి మండుతున్న ఆలుగడ్డల వాసన, ఉడుకుతున్న మాంసం వాసనా కలగలిసి అక్కడి గాలికి ఇదీ అని చెప్పలేని సువాసనని అద్దుతున్నాయి.

“భోజనానికి ఇంకా సమయం వుంది కనుక కాస్త అడవిలోకి నడుద్దామా?” అన్నారెవరో. ఆ మాటకు అందరూ వంత పాడారు. పెద్ద కాన్వాస్ బాగ్ భుజానికి తగిలించుకున్న స్థానిక పిల్లాడు ఒకడు దారి చూపిస్తుండగా అందరూ అడవి బాట పట్టారు. సంబిత్ ప్రాచీ పక్కనే నడుస్తూ ఆమెని వదిలిపెట్టడం లేదు. అదొక ఆహ్లాదకరమైన అనుభవం ప్రాచీకి

కిరకిర మన్న ధ్వని, హిస్ మన్న చప్పుడు ఎటు వైపు నుండో వినిపించింది. నడుస్తున్న వాళ్ళల్లా ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ ధ్వని ఎక్కడినుండి వస్తుందో తెలుసుకోవడానికి చెవులు రిక్కించారు కానీ అది ఎటు వైపు నుండి వస్తున్నదో అర్ధం కాలేదు. ప్రాచీ భయం తో సంబిత్ చేయిని గట్టిగా పట్టుకుంది.

ఒక్కసారిగా “ఓ గాడ్” అంటూ ఎగిరిపడ్డది ప్రజ్ఞ. అందరూ ఏమైంది ఏమైంది అంటూ ప్రజ్ఞ వంకే చూశారు. ఆమె నిలువెల్లా వణికిపోతున్నది. భయం తో నోట మాట రావడం లేదు. ఆమె చేయి చూపిన వైపుగా అందరూ చూసి భయం తో శిలా ప్రతిమలు లా ఒక్కక్షణం పాటు అలాగే నిలబడిపోయారు. ఎదురుగా కొద్దీ దూరం లో దట్టమైన వెదురు పొద. దాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్ద పైథాన్ ఆగ్రహం తో బుసలు కొడుతున్నది. ఆ కిరకిరామన్న ధ్వనీ, హిస్ మన్న చప్పుడూ ఆ పైథాన్ నుండే. వాళ్ళ గుండెలు జారిపోయాయి. సంబిత్ నోటి మీద వేలు వేసి ఎవరినీ మాట్లాడవద్దు అని సంజ్ఞ చేశాడు. వాళ్ళు అలాగే స్థాణువుల్లా నిలబడిపోయారు. వాళ్ళ చూపులన్నీ పైథాన్ పైనే. అది అలాగే కొన్ని నిముషాలు బుసలు కొడుతూ ఉండి  మెల్లగా తలదించుకుని వ్యతిరేక దిశలో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన పదినిమిషాలకు కానీ వాళ్ళు తేరుకుని మామూలు స్థితి కి రాలేదు

తేరుకున్న ప్రజ్ఞ “ఒక్క క్షణం పాటు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఆ ధ్వని కే  నేను ఎగిరి పడ్డాను. నా కాలు బెణికింది” అని బ్యాగ్ లో నుండి ఆయింట్ మెంట్ తీసి ప్రధమ చికిత్స గా బెణికిన చోట మెల్లగా మర్దనా చేసింది.

“మనమలా రాళ్ళలా నిలబడకుండా పైథాన్ పై తుపాకీ తో కాల్చి ఉండవలసింది.” అన్నాడు అవినాష్.

“దానంత తెలివితక్కువ పని మరొకటి లేదు. అదసలే ప్రమాదకరమైనది. తుపాకీ పేలిస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఊహించలేము. దాని దారిన అది వెళ్ళిపోయింది ఎవరికీ హాని చేయకుండా! దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి” అన్నాడు సంబిత్

“మనం చాలా దూరం వచ్చినట్టున్నాము. ఇక తిరిగి వెళితే బావుంటుందేమో!” అన్నది ప్రాచీ.

ప్రాచీ బాగా భయపడింది అనుకున్న సంబిత్ ఆమెకు భరోసా ఇస్తున్నట్టు “నేనుండగా ఏమీ ఫరవాలేదు. ఈ అడవి నాకు కొత్త కాదు. ఎక్కడ ఎప్పుడు  ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు

“నిజమే!” అనుకున్నది ప్రాచీ. మళ్ళీ అందరూ నడక మొదలుపెట్టారు. అర్ధగంట పాటు అడవి అందాలను ఆస్వాదిస్తూ నడిచాక ఒక విశాలమైన మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. బెణికిన తన కాలును పట్టుకుని “నేనిక నడవలేను బాబూ!” అంటూ  ప్రజ్ఞ కూలబడిపోయింది. దారి చూపించటానికి వచ్చిన పిల్లాడు షత్రంజ్ పరిస్తే ముగ్గురు ఆడవాళ్ళూ కూర్చున్నారు. పిల్లాడిని ఆడ వాళ్ళ దగ్గరే వదిలి ముగ్గురు మగవాళ్ళూ ముందుకు సాగారు.

“ప్రాచీ! నీ ప్రేమ కథ ఇప్పుడు చెప్పాల్సిందే. ఐ లవ్ యు అని ముందు నువ్వు చెప్పావా? సంబిత్ చెప్పాడా?” ముగ్గురిలోకి చిన్నదైనా సుపర్ణ అడిగింది ఆసక్తిగా ప్రాచీని.

 ప్రాచీ క్షణం పాటు ఏమీ మాట్లాడలేదు. నిజానికి ఐ లవ్ యు అన్న పదం ఒకరికి మరొకరు చెప్పుకున్నట్టు కూడా ఆమెకు గుర్తు లేదు. అంతా హఠాత్తుగా జరిగిపోయింది కదా!  పెళ్ళికి ఇంకా ఆరు నెలల సమయం వుంది కదా! ఇంటిమసీ పెరుగుతూ ఉండటం తో ప్రేమ కూడా మొదలవుతుందేమో. ఆలోచన తో ప్రాచీ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఉదయించింది

“నవ్వితే సరిపోదు. కథ మొత్తం చెప్పాల్సిందే!” సుపర్ణ తో ఈ సారి ప్రజ్ఞ కూడా గొంతు కలిపింది.

“నిజానికి ఇదంతా నాకొక పెద్ద ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది ఇంకా. అకస్మాత్తుగా సంబిత్ పెళ్లి చేసుకుందామా అన్నాడు” అని కాస్త ఆగింది ప్రాచీ

“మా అందరికి కూడా ఇది పెద్ద షాకే! మేమంతా సంబిత్ అపురూప కి ప్రపోజ్ చేస్తాడు అనుకుంటున్నాము.” అనాలోచితంగా అనేసింది ప్రజ్ఞ. అన్నాక ఎందుకు అన్నానా అన్నట్టు నాలుక కొరుక్కుంది. ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం అలుముకుంది కొంత సేపు ముగ్గురి మధ్యా!

సుపర్ణ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ “అపురూప కూడా మనతో వచ్చి ఉంటే బావుండేది! అపురూప ఉంటే చాలా ఫన్నీ గా,సందడిగా ఉండేది” అన్నది ప్రాచీ వంక చూస్తూ. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే, ముందుకు వెళ్లిన ముగ్గురు మగవాళ్ళూ వెనక్కు తిరిగి వస్తూ కనిపించారు. చెమట పట్టిన వాళ్ళ మొహాల నిండా చెప్పలేనంత ఎక్సయిట్మెంట్.

 సంబిత్ పరుగున వచ్చి ప్రాచీ చేయి పట్టుకుని “త్వరగా మాతో రండి. మీకో అద్భుతం చూపిస్తాను  కానీ ఎవ్వరూ శబ్దం చేయొద్దు” అన్నాడు. ఆరుగురూ గబగబా ఐదు నిమిషాల పాటు నడిచి సంబిత్ చూపించాలి అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు

ఎదురైన దృశ్యాన్ని చూడగానే ప్రాచీ ఉద్వేగానికి అంతు లేకపోయింది. నెమళ్ళ గుంపు ఈ ఆరుగురు ఉనికిని పట్టించుకోకుండా యధేఛ్ఛ గా విహరిస్తున్నాయి.

నెమళ్ళు అన్నీ పురులు విప్పి పరమాద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. అంత అద్భుతమైన దృశ్యాన్ని అంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రాచీ కి వొంటి నిండా కళ్ళే ఉంటే ఎంత బావుండును అనిపిస్తోంది. ఈ సకల చరాచర సృష్టి యావత్తూ అదృశ్యమై పోయి నెమళ్ళు నర్తిస్తున్న దృశ్యం ఒక్కటే ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్నది. నెమళ్ళ క్రీంకార ధ్వని వాటి నాట్యానికి సంగీతాన్ని అమరుస్తున్నటు వుంది. ప్రాచీ అప్రయత్నంగా సంబిత్ కుడిచేతిని పట్టుకుని గట్టిగా హత్తుకుంది.

ప్రాచీ చేతి నుండి తన చేతిని విడిపించుకుని సంబిత్ నాలుగడుగులు వెనక్కు వేసి చేతిలోకి  షాట్ గన్ తీసుకున్నాడు. క్షణం లో అక్కడ ఏం జరగబోతున్నదో ప్రాచీకి అర్ధం అయింది. ఆమె కళ్ళు భయం తో వెడల్పు అయినాయి. ఆమె నోరు తెరచేలోగానే, సంబిత్ ఎడమ చేయి ప్రాచీ మెడ చుట్టూ వేసి అర చేతితో ఆమె నోరు మూసేసాడు. మూగలాగా నిల్చున్న ప్రాచీని మోకాళ్ళ వరకు వంచి మెల్లగా చెప్పాడు సంబిత్ ప్రాచీ చెవిలో గుసగుసగా

“మేము పందెం వేసుకున్నాము. ఒక్క షాట్ కి వాటిలో మూడు నెమళ్లను కూల్చేస్తానని” ఆ మాటలకు ప్రాచీ పక్కనే బాంబు పేలినట్టు నిర్ఘాంత పోయింది. తమకు జరిగే ప్రమాదం తెలియని నెమళ్ళు స్వేచ్ఛగా పురులు విప్పి ఆడుకుంటున్నాయి. సంబిత్ పొజిషన్ తీసుకుని ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. ప్రాచీ భయం తో కళ్ళు మూసుకుంది. బులెట్ వేగంగా దూసుకుపోయింది. కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం.

మరుక్షణం లో గాలి ఉద్రిక్తంగా మారింది. బులెట్ దెబ్బను కు పడిపోయినమూడు ఆడనెమళ్ళు, ఏం జరిగిందో తెలియక గుడ్డిగా పరుగులు తీసిన మిగతా నెమళ్ళు. వాటి అరుపులతో అడవి ప్రతిధ్వనించింది.

ప్రాచీ కళ్ళు తెరిచేసరికి నేల మీద మూడు ఆడ నెమళ్ళు చావు దుఃఖం తో వాటి రెక్కలు టపటపా కొట్టుకుంటూ. వాటిని చూడగానే కొన్నాళ్ల క్రితం స్టీల్ ఫ్యాక్టరీ లో వ్యవస్థాపక దిన ఉత్సవాలలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది ప్రాచీకి. కార్నివాల్ గ్రౌండ్ లో జరిగే ఉత్సవాలను చూడటానికి చాలామంది జనం తరలి వచ్చారు. అకస్మాత్తుగా పోలీసులు ఎందుకో తుపాకీ పేల్చారు గాల్లోకి. జనం అంతా కకా వికలం అయిపోయారు. క్షణం లో కార్నివాల్ గ్రౌండ్ ఏనుగులు తొక్కిన నేల లాగా మారిపోయింది. క్షణం క్రితం వరకూ నెమళ్ళు నాట్యమాడిన నేల మీద నెత్తుటి ముద్దల్లా మూడు నెమళ్ళు.

ప్రాచీ చేయి వదిలి ముందుకు కదిలాడు సంబిత్. అతడి మొహం లో విజయం తీసుకుని వచ్చిన కాంతి. ప్రజ్ఞ, అవినాష్ పడిపోయిన నెమళ్ళవంక పరుగెత్తారు.

 “ఒక్క షాట్ కి మూడు నెమళ్ళు. వండర్ఫుల్!  సంబిత్ భాయ్. యు వన్ ది బెట్” అవినాష్ ఆశ్చర్యం, ఆరాధన నిండిన కళ్ళతో సంబిత్ వంక చూస్తూ పెద్దగా అరచి చెప్పాడు.

“ఈ చచ్చిపోయిన నెమళ్లను ఏం చేద్దాం? కొంతమంది నెమలి మాంసం తింటారట. మన వెంట తీసుకుని వెళ్లి వంట వాడికి ఇద్దామా?” అవినాష్ అడిగిన ప్రశ్నకి

“వద్దు. నెమలి మాంసం అంత రుచిగాఏమీ ఉండదు. పీచు పీచుగా ఉండి రబ్బరు లాగా సాగుతుంది. వీటిని ఇక్కడే తోడేళ్లకు ఆహారంగా వుంచేద్దాం.” అన్నాడు సంబిత్

“మనకు కావాల్సినంత ఎక్సయిట్ మెంట్ దొరికింది. అది చాలు. మనం ఇక వెళదాం” అన్నాడు అవినాష్ సంబిత్ ను బలపరుస్తున్నట్టు.

“మనకేమీ సమస్య రాదుకదా!” అన్నది ప్రజ్ఞ చనిపోయిన నెమళ్ళ వంక చూస్తూ.

 “వేట మీద నిషేధం వుంది కదా!” అన్నది తానే మళ్ళీ 

 “మీరేమీ భయపడకండి. ఫారెస్ట్ గార్డ్ లు నాకు బాగా తెలుసు. ఇంతకుముందు చాలా సార్లు మా నాన్న తో కలసి ఇక్కడకు వచ్చాను. సాయంత్రం కల్లా ఇక్కడ నెమళ్లని వేటాడిన దృశ్యాలు ఏవీ కనిపించవు” అన్నాడు సంబిత్ హామీ ఇస్తూ.

పది నిమిషాల పాటు కలసి నడిచాక దూరంగా నీటి చప్పుడు వినపడటం తో “మీరందరూ ఈ దారిన వెళ్ళండి.అక్కడ ఏదో  జలపాతం లాంటిది ఉన్నట్టుంది.   నేనూ ప్రాచీ ఆ అక్కడి   దాకా వెళ్లి వస్తాం” అన్నాడు సంబిత్ ప్రాచీ చేయి పట్టుకుంటూ

“సరే! సరే!” అన్నది ప్రజ్ఞ తన పెదవులమీద మెరిసే నవ్వుతో. ప్రాచీ,సంబిత్ నీటి చప్పుడు వినిపిస్తున్న వైపు నడక సాగించారు.

“ఈ పది రోజుల్లో నీతో ఏకాంతంగా మాట్లాడటానికి సమయమే దొరకలేదు. నీతో మాట్లాడవలసింది చాలా వుంది.” ప్రాచీ వంక చూస్తూ మెల్లగా నడుస్తూ చెప్పాడు సంబిత్.

“నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనుకున్నానో తెలుసా?” అతడా ప్రశ్న వేయగానే ఎందుకు అనే ప్రశ్న నే తన కళ్ళలో పలికించింది ప్రాచీ

 ” ఎందుకు అంటే,నీ ప్రవర్తన నచ్చి. భార్య అంటే అన్ని రకాల పరిస్థితులకు సర్దుకుని పోయేలా ఉండాలి. యారొగెంట్ గా కాక చాలా సాఫ్ట్ గా మైల్డ్ గా ఉండాలి. కుటంబం బరువు బాధ్యతలు అన్నీ తన భుజం మీద మోయగలిగి ఉండాలి. మనిద్దరం గౌరవ ప్రదమైన కుటుంబాల నుండే వచ్చాము. నేను తగినంత సంపాదిస్తున్నప్పుడు నా భార్య ఎందుకు వుద్యోగం చేయాలి. నా అభిప్రాయాన్ని మీ కుటుంబం కూడా అర్ధం చేసుకుంది. నా కెంత సంతోషంగా ఉందో తెలుసా?” అలా మాట్లాడుతూ సంబిత్ ఒక్క క్షణం పాటు ఆగాడు.

అతడికి ఇప్పుడు చాలా రిలీఫ్ గా వుంది. అప్పటిదాకా మోస్తూ వస్తున్న ఆలోచనల భారాన్ని ప్రాచీ కి చెప్పి వదిలించుకున్నాడు.

 ప్రాచీ మౌనంగా కొండల మీద నుండి పెద్దగా శబ్దం చేస్తూ కిందకి దూకి, అడవిలోకి మెల్లమెల్లగా ప్రవహిస్తూ వెళ్లిపోతున్న జల ప్రవాహాన్ని చూస్తూ ఉండిపోయింది. అడవి సౌందర్యం, జలపాత శబ్దం, ప్రాకృతిక నిశ్శబ్దం కలగలసిన ఒక అమృతపు సోన ను ఆమె హృదయం లోకి తీసుకుంటున్నట్టు ఒక అలౌకిక స్థితి లో వుంది.

“నువ్వు చాలా అందంగా వున్నావు.” సంబిత్ ఆమె చెవిలో గుసగుస లాడాడు. తన చేతిని ఆమె భుజం పై వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె కు మరింత దగ్గరగా వస్తూ “ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురుచూసానో తెలుసా?” అన్నాడు. ఆమె ఏదో జవాబు చెప్పేలోగా అతడి నోటి నుండి బీరు వాసన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరుక్షణం లో అతడి పెదవుల కింద ఆమె పెదవులు

తొలి ముద్దు అనుభవం ఇలానా? ఈ బీరు వాసన తోనా? ఈ భుజం తన జీవిత పర్యంతం తనను కాపు కాస్తుందా? ఆమె హృదయం లో చిన్న అనిశ్చితి.

వాళ్లిద్దరూ ఒకరికెదురుగా మరొకరు రెండు రాళ్ల మీద కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు నిశ్శబ్దంగా వున్నారు. ప్రాచీ అడవి మల్లెల సౌరభానికి అప్రయత్నంగా హృదయాన్ని ఇచ్చింది.

“నీ మనసులో ఏదో వుంది. అదేమిటో చెప్పేయి” అన్నాడు సంబిత్ ఆమె వంక సూటిగా చూస్తూ

“అపురూప…. ” ఆ పదం ఆమె పెదవుల నుండి అయిష్టంగా బయటకు వచ్చింది.

“ఓ అపురూపా!  తనొక మంచి స్నేహితురాలు మాత్రమే! ఆమెను పెళ్ళిచేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా అపురూప లాంటి అహంకారిని ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటారు? అపురూప లాంటి వాళ్ళు స్నేహితులుగా తప్పిస్తే మంచి భార్యలుగా పనికి రారు. పురుషుడితో సమానం అనుకుంటుంది అపురూప” చాలా నిర్లక్ష్యం గా చెప్పాడు సంబిత్

“నీతో వున్నది ఉన్నట్టు చెప్పేస్తాను ప్రాచీ! మా అమ్మను ఎంత అపురూపంగా చూసుకుంటానో నిన్నూ అంతే అపురూపంగా చూసుకుంటాను. నీ కోరికలు అన్నీ తీరుస్తాను. బదులు గా నిన్ను అడిగేది ఒక్కటే! మా కుటుంబ జీవన శైలి కి అనుగుణంగా నిన్ను నువ్వు మలచుకోవాలి. నువ్వొక మంచి భార్య గా, మంచి ఇల్లాలిగా అంటే ఐ మీన్ మంచి హోమ్ మేకర్ గా ఉండాలి” ప్రాచీ చేతులను ప్రేమగా తీసుకుంటూ ఆమెను పైకి లేపాడు.

 “ఇంక వెళదాం! వాళ్లంతా మనకోసం ఎదురు చూస్తూ వుంటారు” అన్నాడు. ప్రాచీ లేచి రెండడుగులు ముందుకు వేసేసరికి సంబిత్ అకస్మాత్తుగా వెను తిరిగి “ప్రియా! మరొక చిన్న ముద్దు ” అన్నాడు నాటకీయంగా

 ” మళ్లీనా?’ బీరు వాసన అప్రయత్నంగా ఆమెను చుట్టుముట్టింది. ప్రాచీ వెనక్కు తిరిగి చివరి సారి చూస్తున్నట్టు ఆ జలప్రవాహాన్ని చూసింది.

“అంతా నేనే మాట్లాడుతున్నాను. నువ్వేమీచెప్పవా? మన పెళ్లి గురించి” అన్నాడు సంబిత్ పిర్యాదు ధ్వనిస్తున్నస్వరం తో

“మీరు మాటాడుతూ ఉంటే వినడం నాకు బావుంటుంది ” చెప్పింది ప్రాచీ!

చేతిలో చేయి వేసుకుని వాళ్లిద్దరూ నడుచుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చారు. అప్పటికే వంటలు అన్నీ సిద్ధంగా ఉండటం తో, మాంచి ఆకలి మీద వున్న అందరూ రుచికరంగా చేసిన మాంసం కూర మీద యుద్ధం ప్రకటించారు. ప్రాచీ మాత్రమే అన్నాన్ని కెలుకుతూ కూచుంది.

“సంబిత్ భాయ్ ఏదయినా మత్తు నీ మీద చల్లాడా? ఏమిటీ?” ప్రజ్ఞ అల్లరిగా అడిగింది.

“అదే నేనూ అడగబోతున్నాను. సంబిత్ ఆకలి లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ ప్రాచీ …. ” అర్ధోక్తి లోఆగిపోయాడు అవినాష్. ఒక్కసారిగా నవ్వులు పువ్వులై పూశాయి పరిసరమంతా

పగటి కాంతి మెల్లమెల్లగా పలుచబడుతోంది. రాత్రి కావడం అనేది అడవిలో ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన విషయం. రాత్రీ, పగలూ ఒకదానికి మరొకటి స్వాగతం, వీడ్కోలు చెప్పుకోవడానికి చాలా ఆత్మీయంగా కలుసుకుంటాయి. కాంతీ, చీకటీ ఒకదానిలో మరొకటి ఒదిగిపోయే అద్భుతాన్ని ఏ మానవ నేత్రమూ పట్టుకోలేదు. కానీ ఆ అపురూప సంగమానికి అడవిలో అదృష్ట వశాత్తు ఉన్న మనిషి తానే సాక్ష్యం అనుకుంటాడు. అడవిలో సంధ్య ను చూస్తూ ప్రాచీ కూడా అలాగే అనుకుంటోంది.

మళ్లీ రెండు  ల్యాండ్ రోవర్లూ బయలుదేరాయి. అవినాష్, ప్రజ్ఞ పాటలు హమ్ చేస్తుంటే సంబిత్ కూడా స్వరం కలిపాడు. ప్రాచీ మాత్రం అడవిని కళ్ళలోనూ, హృదయం లోనూ నింపుకుంటోంది. కొద్దీ దూరం ప్రయాణించి, అడవి లోంచి రాళ్ల మార్గం లోకి మారాక ఒక  ప్రత్యేకమైన ప్రాంతం లో జీపులు ఆపమన్నాడు సంబిత్. తాను ముందు జీప్ లో నుండి కిందకి దిగి ఒక పెద్ద బండ రాయి ఎక్కి కిందకు చూస్తే అడవి అందంగా కనపడుతోంది.

 “అందరూ ఇక్కడకు వచ్చి అడవికి వీడ్కోలు చెప్పండి” అన్నాడు సంబిత్

అందరూ ఆ పెద్ద బండ రాయి ఎక్కేసరికి కింద అడవి పురి విప్పిన నెమలి లా కనిపిస్తోంది. ఒకే గొంతు తో అందరూ “గుడ్ బై ” చెప్పేశారు

“ఏదయినా చెప్పు ప్రాచీ!” అన్నాడు సంబిత్ ప్రేమనంతా స్వరం లోకి ఒంపుకుని. ప్రాచీ మాట్లాడలేదు. మళ్ళీ సంబితే

“నేను ఇవాళ చాలా హ్యాపీ గా వున్నాన. ఈ ఆనందం లో, ఈ సంతోషం లో నేను ఏదయినా ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను. నీకు నేనేమివ్వగలను.  ప్రాచీ! ఏదయినా అడుగు.”

ప్రాచీ చుట్టూ మిగతా ఐదుగురు గుమిగూడారు. ప్రజ్ఞ మరింత దగ్గరగా వచ్చి, ప్రాచీ చెవిలో సంబిత్ కి వినపడకుండా మెల్లగా “ఈ అవకాశాన్ని వదులు కోవద్దు ప్రాచీ! ఏదయినా సాలిడ్ గా అడుగు. నా సలహా అయితే మంచి వజ్రాల ఉంగరం అడుగు ” అన్నది

ప్రాచీ ఏమీ మాట్లాడలేదు

“ఏదో ఒకటి అడుగు ప్రాచీ! నువ్వు ఏది అడిగినా ఇస్తాను. అది ఎంత ఖరీదు అయినా సరే!” సంబిత్ కళ్ళలో గర్వం తో కూడిన సంతోషం

ప్రాచీ అతడి వంక ఒక్కసారి చూసి అడవి వైపు తిరిగింది. కళ్ళు మూసుకుంది. ఆకుపచ్చటి అడవి దృశ్యాలు, అడవి పూల మీద వాలుతూ సందడి చేస్తున్న పసుప్పచ్చటి శీతాకోక చిలుకలు, హిస్ మంటూ వెళ్ళిపోయిన పైథాన్, ఆమె కళ్ళ ముందు కదలాడాయి. గాలిలో ఒక అపరిచిత వాసన. అది బీరు దా? లేదా అడవిలో వాలుతున్న శీతాకాలపు సాయంత్రానిదా? ఆ వాసన ఏమిటో ప్రాచీ మాటల్లో చెప్పలేకపోతున్నది. నిర్వచించలేకపోతున్నది. ఆ వాసన ని గుర్తుపట్టడం కోసం బలంగా తనలోకి శ్వాస రూపంలో తీసుకుంది. మత్తుగొలిపే అడవిపూల పరిమళం మరొక బలమైన వాసన త కలగలిసింది.

సరిగ్గా అప్పుడు ప్రాచీకి తెలిసింది. అది నెత్తుటి వాసన

కలవరపడి ఆమె కళ్ళు తెరచింది ఒక నగ్న నిజం ఆమెను బలంగా తాకడం తో! ఆమె మనసులోని అనిశ్చితి తొలగిపోయింది.

ప్రాచీ స్పష్టంగా అడిగింది.  “చనిపోయిన ఆ మూడు ఆడ నెమళ్లను నువ్వు బతికించి ఇవ్వగలవా?”

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *