సామాజికస్పృహ, సహానుభూతులకలయిక ‘కోర్ట్’ సినిమా

Spread the love

ఈ మధ్యే విడుదల అయి ప్రజాదరణ పొందిన సినిమా ’కోర్ట్’. భారీ బడ్జెట్లతో పెద్ద పెద్ద హీరోలతో దారుణమైన హింస, అశ్లీలత ప్రధాన వస్తువులుగా సినిమాలు తీస్తూ, వాటినే ప్రేక్షకులు కోరుకుంటున్నారని ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నేటి పరిస్థితుల్లో, అప్పుడప్పుడు ఇలా కథా బలం ఉన్న, అర్ధవంతం అయిన సినిమాలు వచ్చి విజయం సాధించి మంచి సినిమాల పట్ల కొద్దో గొప్పో మిగిలి ఉన్న అభిరుచికి, ఆశకి ఊపిరిలు ఊదుతాయి. 

        కోర్ట్ సినిమాలో, ఒక ప్రధాన స్రవంతి మాస్ సినిమా లో కనపడే ఏ అంశాలు లేవు. పెద్ద హీరోలు, గ్లామర్ ఉన్న హీరోయిన్లు, డాన్సులు, ఐటం సాంగులు, ఫైట్లు ఇవేవీ లేవు. కానీ సినిమాకు అతి ముఖ్యమైన అంశం ‘కథ ’ ఉంది. సమాజంలో కనపడే వాస్తవిక అంశాలు ఉన్నాయి. ప్రగతిశీల భావాలు ఉన్నాయి. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే తపన ఉంది.

        ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా, హీరో నాని సమర్పించిన చిత్రం ’కోర్ట్’. కథ, దర్శకత్వం రామ్ జగదీష్ చేశారు. స్క్రీన్ ప్లే  రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి రాశారు.

కోర్టు, చట్టం నేపథ్యంలో యుక్త వయసుకు వస్తున్న ఒక ఇద్దరు యువతి యువకుల ప్రేమ కథ, ఎలా మలుపులు తిరిగి పెద్దల చేతుల్లో నేరపూరితంగా మారి ఆ ప్రేమ జంటను ఏ రకంగా క్షోభ పెడుతుంది అనేది ఈ ‘కోర్టు’ సినిమా! స్కూలు, కాలేజీ వయసులో ప్రేమలో పడటం మీద మనకి అనేక సినిమాలు వచ్చాయి విజయవంతం అయ్యాయి కూడా! అయితే ఈ సినిమాలో ప్రత్యేకత… ఇది ఒక కమర్షియల్ సినిమా పరిధిని దాటి సమాజంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను, వర్గ వివక్షను ,అమ్మాయిలపై నియంత్రణను, అగ్రకుల ఆధిపత్య ధోరణులను, పోలీసు మరియు న్యాయవ్యవస్థలో పాతుకుపోయి ఉన్న లంచగొండితనాన్ని వీటన్నిటిని కూడా చర్చకు పెడుతుంది.

వినోదమే ప్రధానంగా సినిమాల్ని తీస్తున్న తరుణంలో, ఇలా ఒక సమస్యను తీసుకొని దానిని అనేక కోణాల్లో చర్చిస్తూ సినిమాను తీయడం అనేది ఒక సాహసం గానే చెప్పాలి. అలా చేయటానికి ఆ కథా వస్తువు పట్ల ప్రేమ, లోతైన అవగాహన… సినిమా మాధ్యమం పట్ల కూడా ప్రేమ బాధ్యత ఉన్నప్పుడే ఇలాంటి సినిమా తీయాలి అన్న ఉద్దేశం కలుగుతుంది.

ఈ సినిమా పోక్సో యాక్ట్ కింద అన్యాయంగా బుక్ చేయబడి, జైల్లో పెట్టబడి ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కథ. ఒక సీనియర్ న్యాయవాది దగ్గర జూనియర్ గా పనిచేస్తున్న కుర్ర లాయర్ ఈ కేసును టేకప్ చేసి ఏరకంగా కేసు వాదించి యువకుడిని రక్షించగలుగుతాడా లేదా అనేది ప్రధాన అంశం.

అసలు ఫోక్సో యాక్ట్ అంటే ఏమిటి ఇది ముందు మనం తెలుసుకోవాలి. పోక్సో (POCSO) ఏక్ట్ అంటే ‘ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్రెన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్’ ఏక్ట్.  దీని అర్థం ‘లైంగిక నేరాల నుండి పిల్లలను (ఆడైనా, మగైనా)  కాపాడే’ చట్టం. మనం నిత్యం వార్తలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, హింస గురించి చదువుతూనే ఉంటాము.

అయితే ఇలా చిన్నారుల పట్ల దారుణమైన లైంగిక హింసకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి రూపొందించిన చట్టం (POCSO) పోక్సో ఏక్ట్. పోక్సో ఏక్ట్ ప్రకారం మైనర్ బాల బాలికల ( పద్దెనిమిది ఏళ్ళ లోపు) పై జరిగే ఏ లైంగిక చర్య అయినా శిక్షార్హమే!  ఇది 2012లో అమలులోకి వచ్చింది.

అలాంటి నేరం కింద అరెస్ట్ అయితే బెయిల్ దొరకడం కూడా దాదాపు అసాధ్యం. అయితే ఈ సినిమాలో ఈ కేసు ఒక 19 ఏళ్ల యువకుడు పై పెడతారు. అతను ప్రేమించిన అమ్మాయి 17 సంవత్సరాల 10 నెలల వయసు గల మైనర్! అందుకని ఆమె ఇష్టపూర్వకంగా అతనితో వచ్చినా, ఆమె కు 18 సంవత్సరాలు నిండి మేజర్ కావటానికి ఇంకా కొన్ని రోజులు గడువు ఉండడంతో ఈ యువకుడు ఆమె అంగీకారంతో చేసినా, ఆ లైంగిక చర్య రేప్ గా పరిగణించబడుతుంది. సెక్షన్ నంబర్ 375 ప్రకారం 16 సంవత్సరాలల లోపు అమ్మాయితో  ఆమె అంగీకారంతో సెక్స్ లో పాల్గొన్నా అది నేరమే!

కొన్ని దేశాలలో టీనేజ్ యువతీ యువకుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని చట్టబద్ధం చేసేందుకు రోమియో జూలియెట్ క్లాజు అమలులో ఉంది. దీని ప్రకారం యువతీ యువకులు ఇద్దరూ ఏజ్ ఆఫ్ కన్సెంట్ దాటిన వారు అయి ఉండి, మరియు వారి  మధ్య వయసు తేడా మూడు నాలుగేళ్ళే ఉంటే ఈ క్లాజు వర్తిస్తుంది. వారు పరస్పర అంగీకారంతో శారీరిక సంబంధం ఏర్పరుచుకుంటే అది చట్టరీత్యా నేరం కాదు. అయితే ప్రస్తుతం మన దేశంలో ఇది వర్తించదు.

కోర్టు రూమ్ డ్రామా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధి పొందిన జోనర్! మనకి ముందే చెప్పుకున్నట్లు తెలుగులో ఇలాంటి సినిమాలు తక్కువగానే వచ్చాయి అక్కినేని నటించిన

‘సుడిగుండాలు’, ఎన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’, చిరంజీవి నటించిన ‘అభిలాష’, శారద నటించిన ‘న్యాయం కావాలి’, ఇటీవల కాలంలో వచ్చిన హిందీ సినిమా ‘పింక్’ ఆధారంగా తీసిన ‘వకీల్ సాబ్’…   మనకి కోర్టు ప్రధానంగా కనపడే చిత్రాలు. అయితే చాలా చిత్రాలలో ఆ లాయర్ పాత్రధారులు పెద్ద పెద్ద డైలాగులతో మితిమీరిన హావభావాలతో తమ వాదనలు చేస్తూ కేసులు గెలుస్తూ ఉంటారు.  నిజానికి కోర్టుల్లో అంత పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే అవకాశం ఉండదు. ఇరువురి లాయర్ల మధ్య రసవత్తరమైన వాదోపవాదాలు ఏమీ ఉండవు.

‘కోర్టు’ సినిమాలో కూడా కొంత అలాంటి ఉపదేశ పూర్వక ప్రసంగాలు, డ్రామా, ఎత్తుకు పై ఎత్తు వంటివి ఉంటాయి. ఇవి అక్కడక్కడ వాస్తవికత కు దూరంగా ఉన్నా కథలో అంతర్భాగంగా ఉంటాయి పైగా వాటితో కథ ముందుకు నడుస్తూ ఉంటుంది కాబట్టి సహజంగానే అనిపిస్తాయి. ఉత్కంఠ కూడా చేకూరుస్తూ ఉంటాయి.

పనిలో పనిగా న్యాయవ్యవస్థలో సీనియర్ జూనియర్ లాయర్ల మధ్య సంబంధాలు, కేవలం డబ్బు కోసం కేసులను వాయిదా మీద వాయిదా వేస్తూ కాలం గడిపే న్యాయవాదులు, లంచాలు తీసుకొని దొంగ కేసులు బనాయించే పోలీసులు, అమాయకులైన ప్రజలను విచారణ పేరుతో దారుణంగా హింసించటం, సాధారణ ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ లాయర్ల చుట్టూ దీనంగా తిరుగుతూ ఉండడం ఇలా రకరకాల అంశాలు చూడొచ్చు.

అలాగే డబ్బు పరపతి చేతిలో ఉన్న వాళ్లు ఏ రకంగా ఇదే వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటూ పై చేయి సాధిస్తూ ఉంటారో కూడా మనకు కనబడుతుంది.

ఈ సినిమా కాలం 2013 గా చూపించారు అంటే దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగిన కథగా దీన్ని చూపించారు. బహుశా నేటి కాలంలో ఉన్న స్మార్ట్ ఫోన్లు రకరకాల యాప్లు సామాజిక మాధ్యమాలు వీటి గొడవ లేకుండా కథను నడపడానికి వీలుగా వారు ఆ కాలాన్ని ఎంచుకున్నారు అని అనిపిస్తుంది. ఇటీవల ఆస్కార్ నామినేషన్ పొందిన ‘లాపతా లేడీస్’ సినిమా కూడా ఇదే రకంగా స్మార్ట్ ఫోన్ లకు ముందు కాలంలో జరిగిన కథగా తీశారు. బహుశా అలాంటి కాలాన్ని ఎంచుకోవడంలో కొన్ని సౌలభ్యాలు ఉంటాయి అని అనిపిస్తుంది.

ఈ సినిమాలో మనకు కనబడే ఇంకొక ప్రత్యేక అంశం అస్తిత్వ చైతన్యం!  సాధారణంగా మన సినిమాలలో పేద ధనిక వర్గాలు ప్రస్తావనకి వస్తాయి కానీ కుల ప్రస్తావన సామాన్యంగా ఉండదు. ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి పేర్లతో సినిమాలు రావటం, ఆ చిత్రాలలో ఆయా సామాజిక వర్గాల హీరోలను శౌర్య పరాక్రమాలకు మారుపేరుగా చూపించటం ద్వారా గ్లోరిఫై చేయబడడటం మనకి తెలిసిందే .

 కానీ ఒక సమస్యను కులం కోణంలో చర్చించటం అరుదు. అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఆ కోణం కూడా చూపించారు. అమ్మాయిది అగ్రకులానికి లేదా అధిపత్య వర్గానికి  చెందిన కుటుంబం గా చూపిస్తారు. ఇక ప్రేమలో పడ్డ యువకుడి కుటుంబం ఒక కింది వర్గానికి చెందిన వాచ్ మెన్ కుటుంబం గా చూపిస్తారు. ఇందులో యువకుడి తల్లి ఇస్త్రీ చేస్తూ చూపించటం ద్వారా వారి సామాజిక వర్గాన్ని చెప్పకనే చెప్తారు. ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఏ కులానికి చెందిన వాడో స్పష్టంగా చూపించటం జరుగుతుంది.

ఇటీవల కాలంలో తమిళ సినిమాల్లో, మరాఠీ సినిమాల్లో మనం ఈ రకమైన అస్తిత్వ స్పృహను, ఆ అంశాల మీద రాసుకున్న కథలను సినిమాలుగా చూస్తున్నాము. తెలుగులో మనకు అలాంటి సినిమాలు చాలా అరుదు. అయితే ఈ మధ్య ‘పలాస’ వంటి సినిమాలలో ఇది కనపడుతోంది.  ‘కోర్టు’  సినిమా కొంతవరకు ఆ అంశాన్ని చర్చకు పెడుతుంది. పూర్తిగా కాకపోయినా రేఖామాత్రంగా అయినా ఆ అంశాన్ని స్పృశిస్తుంది.

ఇవి మనం చాలాసార్లు వార్తలలో వినే నేరాలే! అసలు వీటిని పరువు హత్యలు అనడం తప్పు అని వాదించే వారు కూడా ఉన్నారు. ఈ పరువు హత్యలు అనేవి సాధారణంగా ఒక రెండు వేరువేరు కులాలకు గాని, మతాలకు గాని, రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతి యువకులు ప్రేమించుకోవడం లేదా ఒక సంబంధం పెట్టుకున్న సందర్భాలలో, ఆ ఇద్దరిలో అగ్ర కులానికి లేదా ఆధిపత్య వర్గానికి, మతానికి చెందిన వారు కింది వర్గానికి చెందిన వారిపై దాడి చేసి, కొన్ని సందర్భాలలో హత్య కూడా చేయటం అనేది జరుగుతుంది, చాలా కేసుల్లో అగ్రకులానికి లేదా అధిపత్య మతానికి చెందిన అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నారన్న  ఆరోపణతో యువకులను కొట్టడం హింసించడం చంపటం లేదా దొంగ కేసుల్లో ఇరికించడం వంటివి జరుగుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలకి వస్తే ఇలాంటి కేసులు అనేకం మనకి తెలిసినవే. అందులో మనకి వెనువెంటనే స్ఫురణకు వచ్చే కేసు అమృత- ప్రణయ్ కేసు! ఈ కేసులో అగ్రకులంగా చెప్పబడే సామాజిక వర్గానికి చెందిన అమృత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ప్రణయ్ అనే దళిత యువకుడ్ని అమృత కుటుంబీకులు దారుణంగా హత్య చేయించటం , మనందరం విన్న ఘటనే!

పరువు హత్యలు అనేవి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే నేరాలు. కానీ ఈ సినిమాలో , చట్టం లో లొసుగులని తమ స్వార్ధానికి వాడుకుని దొంగ కేసులు పెట్టి ప్రేమికులని హింసించటం జరుగుతుంది! ఇది అటు న్యాయ వ్యవస్థను , సామాన్యులను రెంటినీ మోసగించటం అవుతుంది.

        అలాంటి తరహా ఒక బాబాయి పాత్రే ఇందులో మంగపతి అని ఉంటుంది. నటుడు శివాజీ పోషించిన పాత్ర ఎప్పుడు ఇంట్లో ఆడపిల్లలపై నిఘా పెడుతూ వారిని నిరంతరం కనిపెడుతూ వారిని అన్ని విధాలుగా నియంత్రించాలని చూసే పాత్ర. ఇలాంటి పురుషులు దురదృష్టవశాత్తు మన చుట్టూ సమాజంలో చాలా అధిక సంఖ్యలో కనపడతారు .

ఎక్కడైనా ఒక రేప్ గాని హత్యాచారం గానీ జరిగినప్పుడు చాలాసార్లు చాలామంది ముందుగా చేసేది విక్టిం బ్లేమింగ్! అంటే ఎవరైతే రేప్ కి గాని హత్యకు గాని గురి అవుతారో ముందుగా ఆ బాధితులపైనే నిందలు మోపే ప్రక్రియే ఈ విక్టిం బ్లేమింగ్! అంటే నేరం చేసిన వాళ్లను కాకుండా, ఆ దాడికి గురైన బాధితులను వీరు టార్గెట్ చేస్తారు. అసలు వీరు ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? వీళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకొని ఉన్నారు? పొట్టి దుస్తులు డ్రెస్సులు వేసుకొని వీరే నేరస్థులను రెచ్చగొట్టారా? వీరి ప్రవర్తన ఎలాంటిది? వీరు మంచి నడవడికగలవారేనా? ఇలా అనేక ప్రశ్నలతో అసలు నేరం జరిగిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా బాధితులను అనేక రకాలుగా మాటలతో హింసిస్తారు. వారి పరిస్థితికి వారే కారణం అన్న తీర్పులు చెప్తారు.

ఇదిగో అలాంటి వ్యక్తి ఈ మంగపతి! 10- 12 ఏళ్ల పిల్ల తన పుట్టినరోజు నాడు ఒక స్లీవ్ లెస్ గౌను వేసుకుందని బాగా అరిచి గొడవ చేసి మొత్తానికి ఆమె డ్రెస్ మార్చి వేరేది వేసేటట్టు చేస్తాడు. అక్కడే ఈ మంగపతి పాత్ర ఎలాంటిదో, అతను ఎప్పుడూ ఎలా ఆడవాళ్ళని మోరల్ పోలీసింగ్ చేస్తూ ఉంటాడో, అంటే నైతిక నిఘాలో పెడతాడో దర్శకుడు చక్కగా విశదపరుస్తాడు. ఇతనికి తోడుగా దొంగ కేసులు పెట్టి అతనికి తోడ్పడే పాత్ర హర్షవర్ధన్ వేసిన లాయర్ పాత్ర. ఈ లాయర్ కూడా ఎప్పుడు స్త్రీల పరువు మర్యాదలు, వారి కుటుంబ గౌరవము వంటి ఉదాత్తమైన మాటలు మాట్లాడుతూ ,ఈ దొంగ కేసును ముందుకు తీసుకుపోతూ ఉంటాడు. చాలా మంది సంప్రదాయవాదులు సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము చెప్పుకునేవారు వాడే భాషగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది.

 ఈ సినిమా ఒక యువకుడు అన్యాయమైన నేరారోపణ ఎదురుకొని అరెస్ట్ అవడం, తర్వాత ఒక జూనియర్ లాయర్ ప్రియదర్శి ప్రయత్నం వల్ల విడుదలవటం అనేది ప్రధాన అంశంగా కనిపించిన, నిజానికి ఇది ఒక అమ్మాయి స్వేచ్చని, ఆమె ఎంపికని, ఆమె ఎదుగుదలని, ఆమె లైంగికతను నియంత్రించే కుట్రలో భాగమే! అంటే ఇక్కడ ప్రధాన అంశం ఒక అమ్మాయిని నియంత్రించటం అనేదే! అందులో భాగంగా అంటే ఒక ‘కొల్లేటరల్ డామేజ్’ లాగా ఈ యువకుడు అరెస్టయి జైలు పాలవుతాడు కానీ ప్రధాన లక్ష్యం లేదా గురి యువతులపైనే. అంటే ఇక్కడ అమ్మాయి తన జెండర్ వలన వివక్షకు అణచివేత కి గురి అయితే , అబ్బాయి తన కులం లేదా వర్గం వలన అణచివేతకు గురి అవుతాడు. అయితే అబ్బాయి పైన దాడి అమ్మాయి పై నియంత్రణలో భాగమే!  ఆడవాళ్లను నియంత్రించడం ద్వారా కుటుంబ పరువు మర్యాదలను కాపాడటం తద్వారా మన సమాజాన్ని ,సంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడతాము అని పితృస్వామిక సమాజం బలంగా నమ్ముతుంది.

.

అమ్మాయి తల్లి పాత్రలో రోహిణి చాలా చక్కగా నటించింది. ఆ పాత్ర సినిమా చివరికి వచ్చేసరికి మంగపతి మీద తిరగబడడం. తన కూతుర్ని అర్థం చేసుకుని ఆమెని మంచి కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్లటం ఇది ఆ పాత్ర పరిణితికి ప్రతీకగా కనబడుతుంది. అలాగే యువకుడు తల్లి పాత్ర మొదటి నుండి కూడా కొడుకుని వెనకేసుకొస్తూ సపోర్ట్ గా నిల్చుని, ఆ కొడుకు మంచితనాన్ని నమ్మి, అతని కోసం ఆరాటపడే పాత్రగా తల్లి పాత్ర కూడా బావుంది, ఇక ప్రియదర్శి సహోద్యోగిగా వేసిన అమ్మాయి పాత్ర కూడా చక్కగా కుదిరింది. అలాగే ప్రియదర్శి తల్లి పాత్ర తన కొడుకు ఒక అయోమయంలో ఉండి ఒక సంఘర్షణ ఎదుర్కొంటున్నప్పుడు. అతనికి ధైర్యం ఇచ్చి ప్రోత్సహించే పాత్రగా ఆ తల్లి పాత్ర కూడా బావుంది. మొత్తానికి ఈ సినిమాల్లో మహిళల పాత్రలన్నీ కూడా కొంచెం ఆలోచించి శ్రద్ధగా తీర్చిదిద్దారు అనిపించింది. అది మన తెలుగు సినిమాల్లో ఈ రోజుల్లో అరుదైన విషయం!

ఈ సినిమాలో మనకు భిన్నంగా కనపడే మరొక అంశం , ప్రేమలో పడ్డ ఇద్దరు యువతి యువకుల మధ్య చిత్రించిన సున్నితమైన భావోద్వేగాలు కల సన్నివేశాలు. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’, ‘పుష్ప’ వంటి సినిమాలలో చిత్రించిన శృతి మించిన శృంగారం ప్రభావంతో కొట్టుకుపోతున్న నేటి తరంలో, ప్రేమలో ఉండే స్వచ్ఛత అమాయకత లను హృద్యంగా చిత్రించిన తీరు ఒకరకంగా ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేస్తుంది. ఈ తరం పిల్లలు తమ అమాయకత్వాన్ని, సున్నితత్వాన్ని కోల్పోయారు అన్న అపోహను కూడా  ఇది బద్దలు కొడుతుంది.

ఈ సినిమాలో నచ్చిన ఇంకొక అంశం… లాయర్, అమ్మాయి తల్లి రోహిణిని ‘అసలు మీరు మీ అమ్మాయిని ఏం జరిగిందో అడిగారా’ అన్నప్పుడు ఆమె నివ్వెర పాటుకి గురి అయ్యి ‘లేదు’ అని తల అడ్డంగా ఊపుతుంది . అది ఒక రకంగా ప్రేక్షకులకు కూడా ఒక ప్రశ్న. చాలా సందర్భాలలో ఒక విషయం బయటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు… పెద్దలు, పిల్లలను కూర్చోబెట్టి వివరంగా అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకోకుండా, తాము విన్నదే నిజమని నమ్మేస్తారు, ఇక్కడ రోహిణి పాత్ర కూడా అలాగే చేస్తుంది, ఇంకొక విషయం వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా కలుసుకున్నారు అంటే అది ఖచ్చితంగా శృంగారం కోసమే అని కూడా అందరూ గుడ్డిగా నమ్మటాన్ని కూడా ఈ సినిమాలో ప్రశ్నిస్తారు.

అనేక దుష్ప్రభావాలకు లోనై 90 శాతం జనాలు ప్రతికూల అంశాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి అబ్బాయి చాలా అమాయకంగా తమ ప్రేమను ఒక సున్నితమైన పద్ధతిలో వెలిబుచ్చుకోవడాన్ని ఈ సినిమా చక్కగా చిత్రిస్తుంది.

      అయితే ఈ సినిమా గురించి ఇన్ని అనుకూల అంశాలు చెప్పుకున్న మనం కొన్ని ప్రతికూల అంశాలు కూడా చెప్పక తప్పదు. 

నిజానికి మన దేశంలో చాలా నేరాలకు తగిన చట్టాలు శిక్షలు ఉన్నా కూడా, ఆ నేరాలు రుజువయి శిక్షలు పడడం అనేది చాలా తక్కువ శాతం కేసుల్లోనే సాధ్యమవుతుంది. మిగతా అధిక శాతం కేసుల్లో సరైన సాక్ష్యాలు లేక రుజువులు దొరకక ఆ నేరం అనేది రుజువు కాక నేరస్థులు చట్టం పరిధి నుండి తప్పించుకుపోతూ ఉంటారు. చాలా సందర్భాలలో అసలు పోలీసు కేసే రిజిస్టర్ కాదు. అందుకని వరకట్న నిషేధ చట్టం గానీ, గృహహింస చట్టం గానీ, ఇప్పుడు చెప్పుకుంటున్న చట్టం గానీ అసలు అమలు అయ్యి శిక్ష పడే సందర్భాలే తక్కువ. ఇక దురుపయోగం అయ్యే సందర్భాలు ఇంకా తక్కువ. అలాంటి ఘటనలు ఉండవు అని చెప్పలేము కానీ నిజంగా నేరం జరిగే సంఘటనలే ఎక్కువ. అన్యాయంగా నేరారోపణ జరగడం అనేది తక్కువగా జరిగే సందర్భం.

వాస్తవానికి దేశంలో పిల్లల పై సర్వత్రా పెరుగుతున్న లైంగిక దాడిలు, నేరాలు , చిన్న పిల్లలను నీలి చిత్రాలకు వాడుకోవటం, పిల్లల ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల నేపధ్యంలో తయారు చేసిన చట్టం పోక్సో! ఈ చట్టం అమలులోకి వచ్చి పదమూడేళ్ళు అవుతున్నా,   ఒక నివేదిక ప్రకారం 31  జనవరి 2023  జనవరి నాటికి 2.43 లక్షల పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఒకొక్కటి  ఏటా 28 కేసులు మాత్రమే పరిష్కరిస్తున్నాయి . ఇదే గతిన చేస్తే ఇప్పటి వరకూ ఉన్న పాత కేసులు అన్నీ క్లియర్ కావటానికే పాతికేళ్ళ పైన పడుతుంది. అంటే బాధితులకు న్యాయం ఎంత దూరంలో ఉందో ఆలోచించండి.

        దొంగ పోక్సో కేసు గురించి చర్చించిన ఈ చిత్రం, ఆ దారుణమైన నేరాలు, వాటి తీవ్రత, వాటికి గురి అయిన చిన్నారుల వేదన, లక్షల కొలదీ పెండింగ్ లో ఉన్న పోక్సో కేసులు ఇవేవీ మాట్లాడదు. అతి స్వల్ప శాతం జరిగే దుర్వినియోగం గురించి మాట్లాడుతుంది.  బహుశా అందుకే యువకుడి పాత్ర చిత్రణలో చాలా జాగ్రత్తగా, అతడి వైపు నుండి ఏ చిన్న తప్పు జరగకుండా ఉదాత్తంగా, ఆదర్శంగా తీర్చిదిద్దారు.

        ఈ సినిమాకు పెట్టిన ట్యాగ్ లైన్ ’స్టేట్ వెర్సస్ ఎ నోబడీ’ అంతగా సరిపోలేదు అనిపించింది. ఆ యువకుడు హోదా, పరపతి లేని వాడు కాబట్టి ’నోబడీ’ అంటే అనామకుడు అనేది సరిపోయినా, అతను పోరాడేది దొంగ కేసు పెట్టిన వారితో. వారికి పోలీసులు , లాయర్లు అండగా ఉన్నారు కాబట్టి ఆయా వ్యవస్థలను స్టేట్ తో పోల్చినట్టు ఉన్నారు. కానీ ఆ యువకుడికి న్యాయం చేసేది కూడా అదే వ్యవస్థలోని లాయర్, జడ్జి కదా! అందుకే ఆ ట్యాగ్ లైన్ పెద్దగా పొసగలేదు!

మన సినిమాలలో తొంభై శాతం సినిమాలు యువత కోసం , అందునా పురుషుల కోసం తీసేవే! అవి పురుష ప్రధాన పాత్రలతో, పురుష దృష్టికోణం నుండి చెప్పబడ్డ కథలే ఉంటాయి. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాల అని, మహిళలు మెచ్చిన చిత్రం అని కొన్ని వచ్చేవి. టీవీ ల లో డెయిలీ సీరియళ్ళు వచ్చాక, ఆ మహిళా ప్రేక్షకులు అటు మారిపోయారు. కాబట్టి ఆ కొన్ని మహిళా చిత్రాలు కూడా కరువు అయ్యాయి. ఇప్పుడు అన్ని సినిమాలు,పురుషుల చే, పురుషుల పై, పురుషుల కై అన్నట్టు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా అవి చూడటానికే అలవాటు పడ్డారు. ఈ ’కోర్ట్’  కొంత భిన్నంగా ఉన్నా అందుకు మినహాయింపు ఏం కాదు. అందుకే తొంభై అయిదు శాతం అసలు పోక్సో కేసులు వదిలిపెట్టి ఆ అయిదు శాతం కొసరు కేసులపైన దృష్టి పెట్టింది. 

ఏది ఏమైనా వయసులో ఉన్న యువతీ యువకులు ప్రేమించడం సహజమే. అయితే  ఆ వయసులో వారు చక్కగా చదువుకొని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని తమ కాళ్ళపై నిలబడడం, తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం. సినిమా చివర్లో అమ్మాయి ఇంజినీరింగ్ లో చేరటం , అప్పటి దాకా ఇంక చదువు అక్కరలేదన్న  అబ్బాయి మళ్ళీ పుస్తకాల సంచితో బయలుదేరినట్టు చూపించటం బాగుంది.

        సినిమా స్క్రీన్ ప్లే గాని, కథనం, దర్శకత్వం, సంగీతం ఇలా అన్ని అంశాలు బాగున్నాయి, నటీనటులు కూడా చాలా సహజంగా చక్కగా చేశారు. మూస పాత్రలతో, వెకిలి హాస్యంతో హింస , అశ్లీలత మసాలా దినుసులతో తయారయ్యే నేటి భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, సున్నితమైన భావోద్వేగాలతో, మంచి సామాజిక చైతన్యంతో యువతకు అవసరమైన ఒక అంశంతో నిజాయితీగా తీసిన సినిమా అని చెప్పవచ్చు.

             ***

సింగరాజు రమాదేవి

సింగరాజు రమాదేవి గత పాతికేళ్ళుగా అనేక సాహితీ ప్రక్రియల్లో సృజన  చేస్తున్నారు. వరంగల్ వాస్తవ్యులైన వీరు, ముప్ఫై ఏళ్ళ పాటు భారతీయ జీవిత బీమా సంస్థలో పని చేశారు.
పలు ప్రముఖ దిన,వార,మాస పత్రికలలో,వెబ్ పత్రికలలో వీరి కథలు, కవితలు, వ్యాసాలు, అనువాద కథలు ప్రచురితం అయ్యాయి. అనేక కథలు, కవితలకు పోటీలలో బహుమతులు లభించాయి. పలు నాటికలు, గేయాలు, పుస్తక సమీక్షలు కూడా రచించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *