ఆ ఈ-మెయిల్ స్పామ్‌లో కనిపించింది.
దాన్ని నేను అనుకోకుండానే చదవాను.
—
గౌరవనీయులైన ప్రొఫెసర్ విమల్ కర్కాటకం గారికి,
మహారాజు జోసెఫ్ బెర్నార్డ్ ఇమ్మానుయేల్ XXV గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు మేము ఈ ఈ-మెయిల్ రాస్తున్నాము.
గౌరవనీయులైన మా మహారాజు గారు కలుషితం లేని ప్రకృతి ప్రాంతంలో నెమ్మదైన ఉదయపు నడకను ఇష్టపడతారు. ఈ నడకలో ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తితో కలిసి నడవాలని ఆయన కోరుకుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాలనుండి ప్రతిరోజూ ఒకరిని నడకకు తోడుగా ఎంపిక చేస్తారు. అలా మీరు ఎంపికయ్యారనే సంతోషకరమైన వార్తను మీతో పంచుకుంటున్నాము.
మీకు మా రాజుగారితో కలిసి నడవడానికి సమ్మతమైతే మీకు ప్రత్యేక శిక్షణ ఇస్తాము. మా ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తే, మీ విమాన ఖర్చులు, వసతులు, ఇతర సౌకర్యాలు మేమే ఏర్పాటు చేస్తాము. ఏప్రిల్ 28న రాజుగారితో నడవడానికి మీరు ఎంపికయ్యారు. కావున పది రోజులు ముందే మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది.
రాజుగారితో నడకకు తోడుగా వెళ్తున్నందుకు ప్రత్యేక వేతనంగా ఆరు వేల డాలర్లు ఇవ్వబడుతుంది. ఈ లేఖ అత్యంత గోప్యమైనది. కాబట్టి దీనిని ఎవరితోనూ, ఎక్కడా పంచుకోకూడదు. ఈ ఆహ్వానం గురించి మీడియాలో గానీ, వ్యక్తిగతంగా గానీ చెప్పకూడదు. మీ సమ్మతిని తెలియజేస్తే మేము అవసరమైన ఏర్పాట్లు చేస్తాము
ఇట్లు.
మెలిండా బెర్గ్
—
నేను దీన్ని మామూలుగా వచ్చే మోసపూరిత స్పామ్ ఈ-మెయిల్‌లలో ఒకటిగానే భావించాను. చోళుల కాలం నాటి శిల్పాలు, కళాఖండాల గురించి ముప్పై ఏళ్ళకు పైగా పరిశోధన చేస్తున్న వ్యక్తిగా నాకు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు, జర్నలిస్టులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రసిద్ధ మ్యూజియంలకు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నందున అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు తరచుగా వెళ్తుంటాను. ఈ మెయిల్ ఎవరో నన్ను మోసం చేయడానికి రాశారని చదవగానే అర్థమైంది. అందుకే ఆ మెయిల్‌ను డిలీట్ చేసి బిన్‌లో పడేశాను.
అయితే, మరుసటి రోజు ఆ మెయిల్ పంపిన మెలిండా ఫోన్ చేసి అవే వివరాలు చెప్పింది.
“మీ రాజుగారు ఎక్కడ ఉంటారు… నడక తోడు అంటే ఏమిటి?” అని అడిగాను. “దీనికి మీ అంగీకారం వచ్చిన తర్వాతే మేము వివరాలను పంచుకోగలము. మాపై మీకు నమ్మకం కలగాలంటే వెంటనే వెయ్యి డాలర్లు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అంది మెలిండా.
”నన్ను ఎలా ఎంపిక చేశారు? నేను మీ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి” అన్నాను.
”మీ సమ్మతి వచ్చాకే ఏ సమాచారమైనా పంచుకోగలం” అని ఖరాఖండిగా చెప్పేసింది.
రెండు రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను.
ఆ మెయిల్‌లో ఉన్న సమాచారం నిజమేనా అని స్నేహితుల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా పరిశోధించాను. అలాగే ఇలాంటి మోసం ఏదైనా ఇదివరుకు జరిగిందా అని ఇంటర్నెట్‌లో గాలించాను. ఉపయోగకరమైన సమాచారం ఏదీ దొరకలేదు. అయినప్పటికీ సందేహిస్తూనే నా సమ్మతిని తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపాను.
కొద్ది గంటల్లోనే ధన్యవాదాలు చెప్తూ రిప్లై వచ్చింది.
దాంతో పాటు నా బ్యాంక్ ఖాతా వివరాలు అడిగారు. భద్రతా కారణాలు దృష్టిలో పెట్టుకుని నా అకౌంట్ ఇవ్వకుండా ఊర్లో ఉన్న మా చిన్నాన్న బ్యాంక్ ఖాతా వివరాలు పంపాను. అందులో చాలా తక్కువ డబ్బే ఉంది. చిన్నాన్న ఆ అకౌంట్‌ను ఎప్పుడో గానీ వాడరు. ఆ రోజు సాయంత్రం చిన్నాన్న ఫోన్ చేసి, తన అకౌంట్‌కు లక్ష రూపాయల డబ్బు వచ్చిందని చెప్పాడు.
అది వాళ్ళు పంపించిన డబ్బే అని ఖచ్చితంగా తెలిసింది. ఆ తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఏమి చేయాలి అనే విషయంపై ఈ-మెయిల్ రాశాను. ఆ తర్వాత జరిగినవన్నీ తేదీల వారీగా డైరీలో రాసి పెట్టుకున్నాను. చరిత్రలోని ఖాళీల్ను, రహస్యాల్ను ఇన్నేళ్ళుగా పరిశోధిస్తున్న నాకు, అకస్మాత్తుగా సమకాలీన జీవితంలోని వీడని చిక్కుముడులు, వాస్తవాల మీద ఆసక్తి, ఆశ్చర్యం కలగడానికి ఈ ప్రయాణమే కారణం.
••
ఏప్రిల్ 11
మహారాజు జోసెఫ్ బెర్నార్డ్ ఇమ్మానుయేల్ గురించి సంక్షిప్త సమాచారం వచ్చింది, అందులో ఆయన ఫోటో లేదు. రాజు ఎక్కడ నివసిస్తున్నారు అనే వివరాలు కూడా చెప్పలేదు. ఆయన వయసు 54. తత్వశాస్త్రం చదివారని, సంగీత ప్రియుడని, సాహిత్యంపై అమితాసక్తి అని, పదమూడు భాషలు తెలుసని, గుర్రపు స్వారీ వచ్చని, చైనీస్ గాలిపటాలు చేయగలరని, చిత్రకారుడనీ వివరాలున్నాయి. ఎందుకోసం ఇలా ప్రతిరోజూ ఒక మనిషిని ఆయన నడకకి తోడుగా ఎంపిక చేస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఇంటర్నెట్‌లో వెతికినంత వరకు అలాంటి ఒక రాజు ఏ దేశంలోనూ లేడు. ఒకవేళ ఇది కొత్త రకం మోసపువలేమో అని లోలోపల భయంగానే ఉంది.
ఏప్రిల్ 12
‘రాజుల కాలం ముగిసిపోయింది, రాచరికాలు పోయాయి. కానీ నేటికీ రాజులు జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాలు రహస్యమైనవి. ఆ విషయం మీకు తెలిసే ఉంటుందని నమ్ముతున్నాము. మా రాజుగారు కూడా అలాగే రహస్యంగా జీవిస్తున్నారు. రాజుగారు ఎప్పుడూ బంగారు పసిడి రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు కాబట్టి, ఆయనతో నడిచేవాళ్ళు కూడా బంగారు పసిడి రంగు దుస్తులే ధరించాలి. అందువల్ల మీ దుస్తుల కొలతలు, ప్రత్యేక షూల తయారీకి అవసరమైన వివరాలను వెంటనే పంపండి’ అని మెలిండా నుండి మెయిల్ వచ్చింది. దాంతో పాటు శిక్షణ రోజుల్లో వేసుకోవాల్సిన బట్టలు, ఇష్టమైన ఆహారాల జాబితా పంపమని అడిగారు. గత నెల రోజులపాటు ఏయే రోజు ఎన్ని గంటలకు పడుకుని ఎప్పుడు నిద్రలేచానన్న వివరాలు కూడా అడిగారు. అది ఎందుకో అర్థం కాలేదు. దీనికి సమాధానం పంపుతూనే, రాజుగారితో నడిచేటప్పుడు ఏదైనా మాట్లాడాలా? ఎలాంటి విషయాలు మాట్లాడాలి? అని కూడా అడుగుతూ రాశాను. మెలిండా నుండి జవాబు వచ్చింది. రాజుగారు మాత్రమే మాట్లాడతారు. మీరు ఆయన అడిగే వాటికి సమాధానం చెబితే చాలు, మీ అంతట మీరు ఆయనతో ఏమీ మాట్లాడకూడదు. ముఖ్యంగా నడిచేటప్పుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినడం రాజుగారికి నచ్చదు. ఆయన మాట్లాడేది మీరు ఏకాగ్రతతో వినాలి. మిగిలినవి శిక్షణ సమయంలో వివరించబడతాయి అని ఉంది.
ఏప్రిల్ 13
మెలిండా ఈరోజు వివరంగా ఈ-మెయిల్ పంపింది. అందులో రాజుగారితో నడవడం అనేది అరుదైన అవకాశం. కాబట్టి మీరు ఆ నడకలో పూర్తిగా నిమగ్నమయ్యి ఆ నడక అనుభూతిని మీలోకి నింపుకోవాలి. రాజుగారికి మీకు మధ్య నిర్ణీత దూరం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మీరు ఎప్పుడూ ఆయనకు ఎడమ వైపున మాత్రమే నడవాలి. ఆయన అడుగులు వేసే వేగాన్నే మీరు కూడా అనుసరించాలి. ఇదిరకే తెలిపినట్టు రాజుగారు ప్రకృతి ప్రేమికులు. కాబట్టి ఆయన ఏ పక్షి కూత వినో, చెట్టు కొమ్మ అందాన్ని చూసి మైమరచో ఆగిపోతారు. అలాంటప్పుడు మీరు ఆయనకు దూరంగా ఒకటిన్నర అడుగు వెనుక నిలబడాలి. రాజుగారు ఆస్వాదించే విషయం గురించి మీ అంతట మీరు ఏమీ మాట్లాడకూడదు. రాజుగారి మౌనం ముఖ్యమైనది. వివరించలేనిది. కాబట్టి ఆయన ఏదైనా చెప్పే వరకు వేచి చూడాలి. మీరు, రాజుగారు నడవడాన్ని మేము డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తుంటాము. ఆ దారిలో మీరు తప్ప ఇంకెవరూ తిరగరు. కాబట్టి రెండు మేఘాల లాగా మీరు వెళ్ళాలి. అనూహ్యంగా వర్షం కురిసినా, గాలి వేగం పెరిగినా రాజుగారి నడక రద్దు చేయబడుతుంది. మీకు మరో రోజు కేటాయించడం సాధ్యం కాదు కాబట్టి మీరు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. రాజుగారితో నడవకపోయినా మీ ప్రత్యేక వేతనం మాత్రం మీకు ఇస్తామని హామీ ఇస్తున్నాము.
ఏప్రిల్ 14
మెలిండా పంపిన ఈ-మెయిల్ నోట్స్‌లో కొన్ని ఆహార పదార్థాల పేర్లతో పాటు కొన్ని టాబ్లెట్లు కూడా ఉన్నాయి. వాటిని ఎలా, ఎప్పుడు వేసుకోవాలన్న సూచనలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలన్నీ టిన్‌లలో ప్యాక్ చేయబడినవి. ఆ పదార్థాలను, టాబ్లెట్లను వాళ్ళే పంపుతామని చెప్పారు. ఇవి ఎందుకు వాడాలి అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఏప్రిల్ 15
రాజుగారు కొన్నిసార్లు తమతోబాటు నడిచేవాళ్ళని సంతోషపెట్టడానికి హాస్యభరితమైన సంఘటనలు ఏవైనా పంచుకుంటూ ఉంటారు. అవి విని మీరు నాజూగ్గా, చిన్నగా నవ్వాలి. అప్పుడు మీ పళ్ళు బయటకు కనిపించకూడదు. ఆ హాస్యసంఘటనను చెప్పినందుకు మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. మీరు కారణం లేకుండా నవ్వడం అస్సలు చేయకూడదు. అది అవమానంగా భావించబడుతుంది.
ఏప్రిల్ 16
మీ ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్, విమానాశ్రయం నుండి మిమ్మల్ని తీసుకువచ్చే వ్యక్తి వివరాలు దీనికి జతచేస్తున్నాము. ఈ ప్రయాణ కాలమంతా మీరు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు.
విమాన టికెట్‌లు బట్టి నేను స్విజర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల ప్రాంతంలో ఉన్న మాన్లిచెన్ అనే చోటుకు ప్రయాణించబోదున్నానని తెలిసింది. వెంటనే అక్కడ ఎవరైనా రాజు నివసిస్తున్నారా, కోటలు ఉన్నాయా అని ఇంటర్నెట్‌లో వెతికాను. అలాంటివి ఉన్నట్టు ఏ రకమైన సమాచారమూ దొరకలేదు. నా లైబ్రరీలో ఉన్న పుస్తకాల ద్వారా మాన్లిచెన్ గురించి సమాచారాన్ని చదవడం మొదలుపెట్టాను.
ఏప్రిల్ 17
రాత్రి విమాన ప్రయాణం. బెర్న్ విమానాశ్రయం వరకు రెండు విమానాలు మారి రావాల్సి వచ్చింది. బెర్న్‌లో కరోల్ నెస్‌బిట్ అనే వ్యక్తి కారుతో వచ్చాడు. అతను పోలాండ్ దేశానికి చెందినవాడు కావొచ్చు. అతని రూపం అలా ఉంది. అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో చెప్పలేదు. కానీ మా కారును ఒక సెక్యూరిటీ వాహనం అనుసరించడాన్ని గమనించాను. ఖచ్చితంగా అది కూడా రాజుగారి ఏర్పాటే అయి ఉంటుందని అనిపించింది.
దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాల్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిని ఇలా తీసుకొస్తారు, వాళ్ళకు అన్ని సదుపాయాలూ చేసి ఆదరిస్తారు. రాజభోగం అంటే ఇదేనేమో. పార్కులో వాకింగ్‌కు వెళ్ళేటప్పుడు తోటివాళ్ళని ఎప్పుడూ పట్టించుకోము. ఇక్కడేమో రాజుగారితో నడవడానికంటూ రోజుకొకర్ని విమాన టికెట్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు. జీవితం ఎంత వింతైనదో.
ఏప్రిల్ 18
మూడు పెద్ద భవనాలు ఉన్న ఒక పెద్ద కాంప్లెక్స్ అది. మధ్యలో ఉన్న ఒక భవనంలో నాకు బస ఏర్పాటు చేశారు. ఆ భవనంలో వందలాది గదులు ఉన్నాయి. నా లాగే రాజుగారి ఆహ్వానం మీద వచ్చిన వాళ్ళు వేర్వేరు గదుల్లో ఉన్నారు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోవడానికి అనుమతిలేదు. సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయుండటంతో గదిలోకి రాగానే నిద్రపోయాను. రాత్రి ఏడు గంటలకు క్రిస్టోఫర్ గ్యారీ అనే డాక్టర్ నా గదికి వచ్చి నా ఆరోగ్యగూర్చిన కొన్ని పరీక్షలు చేశారు. గది లోపలే కొంచెం నడిచి చూపించమన్నారు. నడిచేటప్పుడు ఊగే నా చేతులు ఎంత దూరం ముందుకు వెళ్తున్నాయి అనే కొలతలు తీసుకున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు, ప్రతిరోజూ రాత్రిపూట ఒక టాబ్లెట్ వేసుకోవాలని ఐదు టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళారు. ఆ రాత్రి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను చాలా అసంబద్ధమైన పని చేస్తున్నానని అనిపించింది. ముఖం తెలియని వ్యక్తితో, ఆయన డబ్బు ఇస్తున్నాడనే కారణంతో ఎందుకు నడవాలి? అది కూడా ఇన్ని ఆంక్షలతో. రాజుగారు ఎందుకు నాతో నడవాలనుకుంటున్నారు? ఎక్కడినుండి ఎక్కడికి నడవబోతున్నాం? నిజానికి ఇదంతా నాటకమా? రాజల జీవితాల్లో రకరకాల వింతల గురించి విన్నాం. కానీ అలాంటి వింతలు కళ్ళముందు నిజంగా జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదు. ఇన్ని అయోమయాల మధ్య, ఊరినుండి బయలుదేరి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండే ఈ సమయంలో ఇలాంటి ఆలోచనలు అనవసరం అని మనసులో మరో గొంతు వినిపించింది.
ఏప్రిల్ 19
ఉదయం ఐరీన్ పామర్ అనే యువతి వచ్చింది. నారింజరంగు జుట్టుతో ఎర్ర రంగు దుస్తులు వేసుకుని ఉంది.
గది కిటికీ తెరిచి బయట కనిపిస్తున్న మంచు పర్వతం ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది అన్నాను. ఈరోజంతా మీరు ఆ పర్వతాన్నే చూస్తూ ఉండాలి. చీకటి పడి ఆ పర్వతం మీ కళ్ళకు కనిపించకుండా పోయినా మీరు సీటు నుండి లేవకూడదు. మీ ఆహారం, కాలకృత్యాల కోసం మధ్యలో ఐదు నిమిషాలు తీసుకోవచ్చు. మిగిలిన సమయమంతా ఈరోజుకు మీ శిక్షణ ఈ మంచు పర్వతాన్ని చూడటమే అని చెప్పింది.
ఇది ఎందుకోసం అని ఐరీన్ పామర్‌ను అడిగాను. దేన్నీ మీరు ప్రశ్నించకూడదు అన్నది మీకు చెప్పిన మొదటి నియమం. దేనికీ సమాధానం చెప్పకూడదు అనేది మాకిచ్చన ఆదేశం అని నవ్వింది.
మంచు పర్వతాన్ని రోజంతా చూస్తుండటంలో ఏముంది అని అర్థం కాలేదు. అయినా కిటికీనుండి మంచు పర్వతాన్ని చూడటం మొదలుపెట్టాను. ఆశ్చర్యం! సంగీతం వింటున్నట్టుగా కొంచెం కొంచెంగా, సూర్యకాంతి మెల్లగా అలముకుంటోన్న ఆ మంచు పర్వతం నాలోకి ఇమిడిపోతోంది. ఆ పర్వతం మీదుగా ఎగురుతూ దాటి వెళ్ళే పక్షుల్ని ఆసక్తితో చూడటం మొదలుపెట్టాను. పర్వతం ఒక క్రమ పద్ధతిలో కదులుతున్నట్టూ, దాని విధులను అది నిర్వహిస్తుూ సాగుతున్నట్టూ అనిపించింది. ఎంత కరగాలో అంత కరుగుతోంది. మంచు పర్వతం నిశబ్దం నిర్మించుకున్న బ్రహ్మాండ రూపం. మంచు అనే రూపానికి పొదిగిన అందమైన ఒంటి కన్నే పర్వంత అని ఏవేవో మనసులో మెదిలాయి.
సమయం గడిచేకొద్దీ ఆకర్షణీయమైన ఆ మంచు పర్వతం నెమ్మదిగా వేదన కలిగించేదిగా మారింది. ఎందుకనో మనసులో గడ్డకట్టుకున్న గాఢమైన వేదన కరగసాగింది. నిట్టూరుస్తూ పర్వతాన్ని చూస్తూ ఉండిపోయాను. అంతులేని నిరీక్షణే ఆ పర్వతంగా మారిందా? మధ్యలో లేచి భోజనం చేశాను. రెండు సార్లు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాను.
కదలికల్లేని దేన్నైనా ఎక్కువ సేపు చూసినప్పుడు అది మన అంతరాత్మలోకి చేరి నిండుతుందని గ్రహించాను. సాయంత్రమైంది. అప్పటివరకు నాలోపలే ఉన్న మంచు పర్వతం ఇప్పుడు నానుండి చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపించింది. మనసులో ఏదో కోల్పోయిన అనుభూతి. చీకటి నిండిపోయింది. పర్వతం కనిపించలేదు. గదిలో లైట్లు వేయలేదు. చాలా సేపటి తర్వాత శరీరం బరువుగా మారిన భావనతోనే లేచి గదిలో లైట్ వేశాను. బాగా నీరసంగా అనిపించింది. పక్క మీద వాలగానే నిద్రలోకి జారుకున్నాను.
ఏప్రిల్ 20
ఈరోజు జిమ్మెర్‌మాన్ అనే వృద్ధుడు వచ్చాడు. ఆయన రకరకాల పండ్లను చూపిస్తూ వాటి పేర్లు చెప్పి, రుచిని పరిచయం చేశాడు. ఈ పండ్లు మీరు నడిచే దార్లో రాలిపడి ఉంటాయి. ఒకవేళ రాజుగారు వీటి గురించి అడిగితే మీరు వాటి పేరు చెప్పడానికి, వాటి రుచి గురించి చెప్పడానికి ఈ శిక్షణ అవసరం అన్నాడు.
ఆ రోజు మధ్యాహ్నం ఒక వాహనంలో పర్వత శిఖరానికి తీసుకువెళ్ళారు. మేఘాల గుంపుపు అలలు అలలుగా దాటుకుని వెళ్తున్నాయి. వంకర్లు తిరిగుతూ సాగుతున్న దారుల్లో జన సంచారమే లేదు. రాజులాగా దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన ఒక బండరాతి మీద నిలబడి ఉన్నాడు. ఆయనతో కలిసి నడవాలని చెప్పారు. రాజు ఈయన లాగే ఉంటారేమో అని అనుకున్నాను. అది మొత్తం అయిదున్నర మైళ్ళ దూరమున్న నడక. రాజు వేషం వేసుకున్న ఆ వ్యక్తి నడచినంత సేపూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్ని చోట్ల ఆగి చెట్టు నుండి రాలిన పండ్లను ఏరుకున్నాడు. కొన్ని చోట్ల గాల్లో ఏదో రాశాడు. ఒక చోట ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వాడు. ఆ నడకలో ఆయనతో సమానంగా నేను నడవలేకపోయాను. ఒక చోట దార్లో పడున్న ఒక రాయి నా కాలికి తగిలింది. ఇంకో చోట రాజును ఢీకొట్టుకున్నట్టు నడిచాను. మరో చోట మంచు గొర్రె ఒకటి నిలబడి ఉంటే దాన్ని తల తిప్పి చూస్తూ నడిచాను.
ఏప్రిల్ 21
నిన్నటి నా నడకనంతా వీడియో తీశారు. దాన్ని గదిలోని స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తూ, ఏ ఏ చోట ఏం తప్పులు చేస్తున్నానో ఇయాన్ జే మెగ్నీల్ వివరించాడు. ఆ రోజు సాయంత్రం ఆయనతో మళ్ళీ అదే నడక శిక్షణకు వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి రాజు వేషం వేసుకున్న వ్యక్తి లేడు. ఆయన ఉన్నట్టు ఊహించుకుని నేను నడవాల్సి వచ్చింది. మొదటి రోజు చేసిన తప్పుల్ను నేను సరిదిద్దుకున్నాను. కానీ ఈరోజు నాకు తెలియకుండానే మరి కొన్ని కొత్త తప్పులు చేశాను. ఇయాన్ జే మెక్నీల్ వాటిని ఎత్తి చూపి మెరుగుపరచుకోడానికి సలహాలు ఇచ్చాడు.
ఒకరితో కలిసి నడవడం అనేది సులభం కాదు. ఇది రెండు సంగీత వాయిద్యాలను ఏక శ్రుతిలో వాయించడంవంటిదేనని గ్రహించాను.
ఏప్రిల్ 22
ఈరోజు కూడా అదే నడక శిక్షణ. కానీ కొత్త దార్లో – మహా సౌందర్యంతో తొణికిసలాడే ఈ ఆల్ప్స్ పర్వతశ్రేణి దార్లో నడవడమన్నది ఆకాశంలో తేలిపోతున్నట్టుగానే ఉంది. ఒంటరిగా నడుస్తూ నడుస్తూ నన్ను నేను ఒక చీమలా భావించుకోవడం మొదలుపెట్టాను.
ఏప్రిల్ 23
ఈరోజు డాక్టర్ క్రిస్టోఫర్ గ్యారీ గదికి వచ్చాడు. ఆరోగ్యాన్ని పరీక్షించడంతో పాటు మీకు కుడి భుజాన నొప్పిగా ఉంటుందా అని అడిగారు. అవును, అది స్కూల్ రోజుల్లో ఫుట్‌బాల్ ఆడేటప్పుడు జరిగిన ఫ్రాక్చర్ అన్నాను. మీరు నడిచేప్పుడు కొన్నిసార్లు సన్నగా ఆ నొప్పి మీకు తెలుస్తుంటుంది. అప్పుడు మీ కళ్ళలో, ముఖంలో చిన్న మార్పు కనిపిస్తోంది. రాజుగారితో నడిచేవాళ్ళు తన నొప్పిని బయటకు చూపించకూడదు అన్నారు. ఆ నొప్పి ఉన్నట్టుండి వస్తుంది అన్నాను. అలా నొప్పి వచ్చినప్పుడు దాన్ని మీరు బయటకు చూపించుకోకూడదు అని సలహా ఇచ్చాడు.
ఏప్రిల్ 24.
రాత్రి ఎవరో నా గది తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి బయటకు వెళ్తే ఒక వ్యక్తి పాలిపోయిన ముఖంతో నిల్చుని ఉన్నాడు. నాకు తెలియని ఏదో ఒక భాషలో మాట్లాడాడు. అతను ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. ఆ మనిషి కుడిపక్కనున్న మెట్లవైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉండిపోయాను. ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఏప్రిల్ 25
గది ఖాళీ చేసి బయలుదేరాలి, సిద్ధంగా ఉండమని ఐరీన్ చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు.
ఏప్రిల్ 26
ఈ ప్రదేశం ఎక్కడుందో తెలియదు. కానీ దూరాన వందలాది లైట్లు వెలుగుతున్న ఒక రాజభవనం కనిపించింది. అందులోనే రాజుగారు నివసిస్తారు. ఆయన ఎలా ఉంటారు? ఎందుకు ఈ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు అని అర్థం కాలేదు. ఖచ్చితంగా జోసెఫ్ బెర్నార్డ్ ఇమ్మానుయేల్ XXV అన్నది ఆయన అసలు పేరు అయి ఉండదు. అది కూడా ఒక కల్పనిక పేరేననే అనిపించింది.
ఏప్రిల్ 27
మిషెల్ ఆష్బీ డాజెన్ అనే వ్యక్తి గదికి వచ్చాడు. రేపటి రాజుగారి నడకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూసుకునేది అతనే. తనలాగే ప్రతిరోజూ ఒకరు నడక కావాల్సిన ఏర్పాట్లను చేస్తూ పర్యవేక్షిస్తుంటారు అని చెప్పాడు.
భద్రతా కారణాల దృష్ట్యా రాజుగారు ఇక్కడ రహస్యంగా నివసిస్తున్నారు. ఆయన గురించి పూర్తి వివరాలు పంచుకోలేనందుకు క్షమించమని కోరుకున్నాడు. రాజుగారికి శాశ్వతమైన నడక తోడంటూ ఎవరూ ఉండరు. అలా ఉండటం ప్రమాదకరం అన్నాడు.
మీరు కూడా ఆయనను కలిసిన ఈ విషయాన్ని మీ జీవితంనుండి తొలగించేయాలి అన్నాడు.
అంతేకాకుండా ఈ రోజంతా మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషం కోసం ఇక్కడ అన్నీ ఏర్పాటు సిద్ధం చేశాము. సంతృప్తిగా నిద్రపోయి, పొద్దున లేచి సిద్ధంగా ఉండండి. అయిదున్నర గంటలకు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చేస్తాను. మనం కొంచెం దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ రాజుగారు మీతో కలుసుకుంటారు అన్నాడు.
ఎందుకని ఇలా రాజుగారు ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తితో నడుస్తారు అని అతడిని కూడా అడిగాను. అది రాజుగారి ఇష్టం. దాన్ని ప్రశ్నించలేము, నెరవేర్చడం మా బాధ్యత అన్నాడు. ఆ రోజంతా రకరకాల ఆహార పదార్థాలు, వైన్, షాంపెయిన్, స్వీట్లు అందించారు. అద్భుతమైన సంగీతాన్ని వినగలిగాను. రాత్రి నిద్రపోయే ముందు రాజుగారి రూపం ఎలా ఉంటుందోనని నేను రకరకాలుగా ఊహించుకున్నాను.
ఏప్రిల్ 28
ఉదయం అయిదున్నరకు మిషెల్ ఆష్బీ గదికి వచ్చాడు. రాజుగారితో నడవడం కోసం తయారు చేసిన ప్రత్యేక దుస్తుల్ను వేసుకోమన్నాడు. ప్రత్యేకంగా తయారు చేసిన షూలు వేసుకుని, బంగారు పసుపు రంగు దుస్తులతో ఉన్న నన్ను నేను అద్దంలో చూసుకోవడం విచిత్రంగా అనిపించింది. కారు ఎక్కాను. ఆయనే కారు నడిపాడు. ఇంకా చీకటి వీడలేదు. పర్వత మార్గంలో కారు సాగుతోంది. తెల్లవారుజాము వెలుగులు చిమ్మడం మొదలైనప్పుడు కొంచెం కొంచెంగా కళ్ళముందు మంచు పర్వతం, పైన్ చెట్లు నిండిన పరిసరాలు కనిపించసాగాయి. ఎత్తుగా పోతబోసినట్టున్న ఒక బండరాళ్ళ రాశి ముందు నన్ను కారునుండి దింపిన మిషెల్, రాజుగారు అక్కడే ఉన్నారని కొండెం దూరంగా ఒక చోటును చూపించారు. అక్కడ పసుపు పచ్చగా ఒక చుక్క కనిపించింది. అటు వైపుకు నడవడం మొదలుపెట్టాను.
రాజుగారు బంగారు పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు. తల మీద నలుపు రంగు టోపీ, ప్రత్యేక పాదరక్షలు. యాభై ఐదు ఏళ్ళ లోపు వయసు ఉండొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళాను.
”ప్రొఫెసర్ విమల్ కర్కాటకం… మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది, చోళులనాటి కళలగురించి మీరు చేసిన పరిశోధనలు చదివాను. కర్కాటం అంటే పీత… నేను చెప్పింది సరైనదేనా” అని రాజు అమెరికన్ యాసతో కూడిన ఇంగ్లీష్‌లో అడిగారు.
“అవును” అని తల ఊపాను.
”మీరు నాతో నడుస్తున్న 14,602వ వ్యక్తి. ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తితో నడవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను ప్రపంచం వైపుకు ప్రయాణించలేను. కాబట్టి ప్రపంచాన్ని నా వైపుకు రప్పించుకుంటున్నాను. ఒక మనిషిని తెలుసుకోవడం అంటే ఒక నక్షత్రాన్ని తెలుసుకోవడంలాంటిదేనని చదివాను” అన్నారు రాజు.
”నిజం. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు” అన్నాను.
వంకర్లు తిరిగుతూ సుదీర్ఘంగా సాగుతున్న పర్వత దారుల్లో ఇద్దరం నడవడం మొదలుపెట్టాం. వాళ్ళు నాకు ఇచ్చిన శిక్షణ ప్రకారమే నడుచుకున్నాను. దార్లో ఒకటి రెండు చోట్ల రాజుగారు గాలిని ఆస్వాదిస్తున్నట్టు చేతులు చాపి నిలబడ్డారు. ఒక చోట కింద రాలిపడి ఉన్న పండును చేతిలోకి తీసుకుని ఆకాశానికి బహుమతి ఇస్తున్నట్ఠు విసిరారు. గుసగుసగా పాడుకుంటూ సరస్సువైపుకు సాగిపోతున్న సెలయేటి పక్కన ఆగి నీటి రహస్యాన్ని వింటున్నట్టు నిలబడ్డారు. జతగా ఎగురుకుంటూ వెళ్ళే పక్షి తన పక్కనే వస్తున్న పక్షిని తలతిప్పి చూస్తున్నట్టు కొన్నిసార్లు రాజుగారు నా వైపుకు తల తిప్పారు. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన చర్యలో నిమగ్నమైనట్టుగా ఆ నడకను అనుభవిస్తూ నడిచారు. చలి గాలిని ఆస్వాదించారు.
గంటన్నర సమయం సాగిన ఆ నడకలో ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు. నడక ముగిసే చోట ఆయన కోసం పసుపు రంగు కారు సిద్ధంగా ఉంది. సెక్యూరిటీ బలగాలు మరో వాహనంలో వేచి ఉన్నారు.
రాజుగారు కారు ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఒక సీతాకోకచిలుక ఆయనను రాసుకుంటూ వెళ్ళింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు చేతుల్ని గాలిలోకి ఊపినప్పుడు ఆయన టోపీ జారి కింద పడింది. దాన్ని సెక్యూరిటీ గార్డు వంగి తీసి అందిస్తున్నప్పుడు, రాజుగారు దాన్ని అందుకోవడానికి చేతుల్ని మరో వైపు చాచడం గమనించాను. అప్పుడే రాజుగారు అంధుడన్న విషయాన్ని గ్రహించాను. నడకలో దాన్ని ఆయన అస్సలు బయటపడనివ్వలేదు. నేను కూడా గుర్తించలేదు. ఉన్నఫలాన ఆయనతో ఇంతసేపు కలిసి నడిచిన నడక ప్రయాణమంతా ఒక విచిత్రమైన అనుభవంగా మారిపోయింది.
వెయ్యేళ్ళ క్రితంనాటి కళాశిల్పాల కంటే కళ్ళముందు తిరుగుతున్న మనుషులు నిగూఢమైన వాళ్ళు! అంత సులభంగా అవగాహనకు అందిపుచ్చుకోలేనివాళ్ళు అని అప్పుడు అనిపించింది.
రాజుగారి కారు బయలుదేరి వెళ్ళిపోయింది.
నా కారు రావడం కోసం వేచి చూస్తున్నప్పుడు, మంచు పర్వతం మీద సూర్యుడు అత్యంత సౌందర్యవంతమైన వెలుగు నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.
•••
మూలం: నడైత్తుణై, 19 ఏప్రిల్ 2026.
రచయిత గురించి:
ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
