తెల్లని మేఘం కరిగిపోయాక..
ఆకాశపు కానుకగా
ఏం మిగులుతుంది?
—నేల పై ఎల్డర్ బెర్రీ పూల సంతకం!
నీలి కెరటపు తుంపరలు
తీరాన కరిగిపోయాక..
ఏం మిగులుతుంది?
—అనంత కాలపు ..లయ!
పచ్చని ఆలోచన రక్తసిక్తమయ్యాక..
చివరకు ఏం మిగులుతుంది?
— మహా ఓక్ వృక్షపు నరనరాన
ప్రవహించే 'జీవద్రవం!
ప్రేమలో కన్నీళ్లు ఆరిపోయాక..
ఇంకేం మిగులుతుంది?
— గాయపడిన గుండెపై
చెరిగిపోని పచ్చబొట్టు!
అర్థం కోసం అన్వేషణ అలసిపోయాక..
ఆ ధూళిలో ఏం మిగులుతుంది?
— ఆశ నడిపించే ఒక 'కొత్త బాట'!
తెలియని తీరాలకు సాగే
మహా ప్రయాణంలో..
తోడుగా ఏం మిగులుతుంది?
— గుర్రానికి తోడుగా
ప్రయాణికుడు పాడే పాట'!
కలల ఎండమావి కనుమరుగయ్యాక..
ఏం మిగులుతుంది?
— వయోలిన్ తీగలపై
ఆకాశపు 'నీలి ఆనవాళ్లు'!
ఉనికి
శూన్యంలో కలిసిపోయాక..
మిగిలేది ఏముంటుంది?
— దైవత్వపు ఒడిలో దొరికే
ఒక 'నిశ్చల భద్రత'!
అరబ్ కవి మాటలు గాలిలో కలిసిపోయాక..
ఏం మిగులుతుంది?
— ఒక లోతైన అగాధం..
చివరగా మిగిలే ఒక 'పొగ రేఖ'!
మరి నీ మాటల నుండి..
ఏం మిగులుతుంది?
నేల జ్ఞాపకం పదిలంగా ఉండడానికి .
అవసరమైన ఒక 'మరుపు'!
మూలం : మాదా సయబ్ఖా (What will remain?)
- దర్వీష్ మహమూద్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
