తీసుకో నా గుర్రాన్ని ! తీసుకొని, దాన్ని బలితీసుకో!
నువ్వు — నా "గెలుపు పిచ్చి" కాదు నా జీవన సర్వసం!
నీ సౌందర్యపు నిరంకుశ ఆకర్షణ ముందు నా ఆత్మను నిర్భయంగా నిలబెట్టాను. నీ అభీష్టానికి తలొగ్గాను.
నా గుర్రాన్ని తీసుకో! దాన్ని వధించు... ఓడినా, యోధుడిలా ఏ స్వప్నమూ లేని భావరహితుడినై సాగిపోతా
నీ కోరిక మేరకు ఈ బందీ రాకుమారుడు మోస్తున్న అలసటకు సలాం! వేసవి వేడుకలో కన్యల మెడలో మెరిసే నీ బంగారు కానుకలకు సలాం! మనుషులూ... మానవాతీతులూ... అందరూ కోరుకునే నీకు సలాం! నీ దుందుడుకు స్వయం నిర్ణయాలకు సలాం! .
నీ జడలోని హెయిర్‌పిన్ సైతం నా కత్తినీ, కవచాన్నీ ముక్కలు చేస్తుంది. నీ వస్త్రాల గుండీ మెరుపుల్లో పక్షుల రహస్య భాషల లిపి దాగుంది గిటార్ స్పర్శకి గాలిని ఎలా స్వరపరుస్తుందో అట్లా— నా ఊపిరిని కోరిక వేలికొసలతో మీటుకో!
నా ‘ఆదిమ అండలూసియా*’ నేలంతా నీ చేతుల్లోనే పెట్టిన.. ఇక నా ఆత్మ రక్షణకు ఆఖరి తీగను కూడా మిగల్చకు
బహుశా ఎప్పటికో... ఈ నిరాశే నన్ను గెలిపించిందనీ నా బతుకు నా గతంలో ఉందనీ నేను తెలుసుకుంటాను!
నా గుర్రాన్ని తీస్కో.. దాన్ని చంపెయ్! సజీవంగానైనా... శవంగానైనా... నా భుజాల మీద నన్ను నేనే! మోసుకు పోతా!
మూలం : (Take My Horse and Slaughter It”) - - - - - మహ్మూద్ దర్వీష్ స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
*పుట్ నోట్: అండలూసియా (Andalus): ఇది నేటి స్పెయిన్ దేశంలోని ఒక ప్రాంతం. క్రీ.శ. 711 నుండి 1492 వరకు దాదాపు 800 ఏళ్ల పాటు ఇక్కడ ముస్లింల పాలన సాగింది. ఆ కాలంలో అండలూసియా ప్రపంచానికే విజ్ఞానానికి, కళలకు, మరియు మత సామరస్యానికి (గంగా-జమునా తెహజీబ్ వంటి సంస్కృతికి) కేంద్రబిందువుగా విరాజిల్లింది. 1492లో ముస్లింల పతనం తర్వాత, అక్కడి అరబ్బులు తమ మాతృభూమిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. మహమ్మద్ దర్వీష్ కవిత్వంలో 'అండలూసియా' అంటే పాలస్తీనా.
*******
ఇంటి పనుల్లో...
1
ఎన్నిసార్లు ! ఉదయాన్నే ఆ గురువారం సంతకు వెళ్లాను! నిత్యావసర సరుకులు కొంటూ నీ చిరునవ్వులాంటి ఒక ఆర్కిడ్‌ను చేతుల్లోకి తీసుకున్నాను!
నా హృదయాన్ని ఉత్తరాలుగా నీకు పంపుతుంటే నీ తలపుల చినుకులు నన్ను తడిపేశాయి! నీ ఊపిరుల నారింజ సువాసనలు నా ఊహల్లో నిండాయి !
రేపటి మన కలలను దాల్చిన ఖర్జూరపు చెట్టునని నువ్వైప్పుడైనా అన్నావా? నేనే ఊహించుకున్నానా!
నిద్రపోయే వేళ నీకు గాలి విసిరే నేను కనిపించకపోతే, కదిలే గాలి లేదని భయపడకు! నిద్రపో, నా ప్రేమా! నిశ్చింత నిద్రలోకి జారుకో!
2 ఎన్ని మధ్యాహ్నాలు నా అద్దాలను మెరిపించుకున్నాను! నిన్ను కలిసే వేడుక కోసం నన్ను నేను ఆశలతో అలంకరించుకున్నాను!
నీ రాత్రుల పసిపావురాల వంటి నా ప్రేమ కలశాలు నిన్నటి తియ్యని వేదనతో నిండిపోతున్నాయి. పాలరాతి సిరల్లో ప్రవహించే నిన్నటి మాటల మకరందం కవులను చూసి - రిట్సోస్* లా నన్ను కవిత్వం చెయ్యమని అరుస్తోంది
నిన్ను నువ్వు ఎక్కడ దాచుకున్నావు? నా ఆకాంక్షలకు అందని ఏ ఏకాంత ప్రవాసంలోకి తోసావు? అద్దంలో నా ప్రతిబింబం లేదు... ఏ ఏథెన్స్ స్త్రీ రూపమో ఇది !
3
ఎన్నిసార్లు? సాయంత్రం సినిమాకు వెళ్లాను! యుద్ధమూ శాంతీ చెలగాటాల్లో ఆ మూలవాసులు నీలా! నాలా! ఉల్కల్లా రాలిపడడం చూసాను!
యూకలిప్టస్ చెట్ల చాటున మనిద్దరి రెక్కల ఒక పిట్టను చూసాను
నది కోతను తట్టుకున్న మట్టి రేణువుల్లా మనమిక్కడ మిగిలి ఉన్నాము నువ్వో.. నేనో... ఎవరెక్కువ గాయపడితే వారే ఇక ఎక్కువ కలలు కనాలి! 4
ఎన్నిసార్లు! అర్ధరాత్రులు మన నెత్తురులో సూర్యుడు ఉదయించాడో! . నువ్వే నేనై నాలో ఎంతగా నిండిపోయావు! నా ప్రేమా! ఎన్నిసార్లు !
*ఫుట్ నోట్: "యానిస్ రిట్సోస్(Yannis Ritsos)", గ్రీస్ దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రఖ్యాత మహాకవి వామపక్ష కార్యకర్త. దర్వీష్ పాలస్తీనా స్వేచ్ఛ కోసం ఎలా తపించారో, "యానిస్ రిట్సోస్" గ్రీస్ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం అలా పోరాడారు.
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
Spread the love వేప పువ్వు మెదిలే మా ఇంటి బావిలోఏడాదికోసారికనువిందుగా సాగేపూడిక తీసే వేడుకనీటిలోతుల్లో నాన్న మునకలు వేసే కొద్దీఅద్భుతాలు వెలికివస్తాయి.కొబ్బరి చెక్క, గోళి,గరిటేచెదపట్టిన చెక్క చట్రాలతో సహాతుప్పుపట్టిన గిలకపొరబాటున పనిమనిషి దొంగలించిందనుకునిఅనుమానించిన వెండిగ్లాసుఇలా బురదలో చెయ్యిపెట్టి గెలికిఇంకా మరెన్నిటినో వెలికి తీశాము. ఒకే బురదరా బురదరా చూసుకో అని అమ్మ భయంతో అదిలించినప్పటికీసంతోషాన్ని చెరిపేయడంఎవరికి మాత్రం ఇష్టం గనుకశత్రువుని జయించిన వీరుడిలాముంగురుల నుండి కారుతున్న నీటితోనాన్న పైకి లేచి […]
Spread the love నీ పేరు ప్రతి పూరేకు మీద నా వేళ్ళతో నీ పేరు రాస్తాను పువ్వు వాడిపోతుంది కానీ నీ పేరు పరిమళమై చుట్టూరా వ్యాపిస్తుంది *****దారి మలుపు తిరిగిన చోట ఒక దారి మలుపు తిరుగుతుంది ఒక వంకర సందు లోకి – దాని ఎడమ వైపున ఒక పెరిగిన రావి చెట్టు దాని ఎదురుగా ఒక మామూలు గుడిసె- రాత్రయినా పగలయినా ఆ ఇంటి కిటికీ […]
Spread the love 1..2..3.. చిధ్రమయిన నీ కొడుకు అవయవాలు శుభ్రం చేసుకో. చెదిరి తునకలైన నీ మొగుడి తల భాగాలు తెచ్చుకో. తొందరగా రా.. నీకు అరగంట సమయం వుంది. 3..2..1.. సమయం అయిపోయింది. పరిగెట్టు..పరిగెట్టు.. బాధపడటానికి సమయం లేదు. మేము బాంబులు వేసేస్తాం! పరిగెట్టు.. మేం మీకు అరగంట విరామం ఇచ్చాం! మేం మానవతావాదులం!! Spread the love