ప్రియమైన అమ్మకు

Spread the love

ఆ చల్లని చేతి వేళ్ల ప్రేమలోంచి పుట్టే రొట్టె కోసం 
నేను ఆశ పడుతున్నాను
వేకువ కప్పులో
వెలుగు రవ్వల్ని కలిపి ఇచ్చేకాఫీ,
అమ్మ వెచ్చని స్పర్శ
నాలో బాల్య జ్ఞాపకాల
పూల మొక్కల్ని పెంచుతున్నాయి

రోజు రోజుకు
నా జీవితం విలువను పెంచుకోవాలి
నా మరణ వేళ
అమ్మ ఒక్కో కన్నీటి బొట్టుకు
ఎంతో విలువనివ్వాలి!

ఏదో ఓ రోజు
ఒకవేళ తిరిగొస్తే...

అమ్మా!
నన్ను నీ కనురెప్పలను కాపాడే పరదాలా కప్పుకో!
నీ మెత్తని అడుగుల
దీవెనలు పొందిన పచ్చిక కింద
నా ఎముకలు దాచిపెట్టు!

నీడలాంటి
నీ తలవెంట్రుకల మూడు పాయలను ఒక్కటి చేసి జడ అల్లినట్లు
మన బంధాన్ని కలిపి ముడివేయమ్మా!

నీ చీరకొంగు చివరిదారాలు
నా ఆత్మను చుట్టేయని!

అమ్మా!
నీ అంతరంగ లోతుల్ని తాకగల్గితే
నేను మరణం లేని దేవుడినవుతాను!

అమ్మా! నేను తిరిగొస్తే
నిన్ను దహించే అగ్ని జ్వాలల ఆకలి తీర్చే
కర్ర ముక్కలుగా నన్ను మండనీ

పొత్తళ్ళలో నన్ను నిద్రపుచ్చిన
నీ మెత్తని బట్టలు ఆరేసే దండెంలా
మన కప్పు కింద నన్ను ఉండనీ

నీ దీవెనలు లేకపోతే
నేను బలాన్ని కోల్పోయిన యువకుడిని
కాలాన్ని పోగొట్టుకొన్న ముసలివాడిని


నా పసితనపు కొండ గురుతులను
తిరిగి పంపించమ్మా!
వాటి ఆధారంగా దారి వేసుకుంటాను

పక్షులతో పాటు రెక్కలు కట్టుకొని
నువ్వు ఎదురు చూస్తున్న
గూటికి చేరుకుంటాను


మూలం : (To My Mother)
--- మహమూద్ దర్విష్

స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *