ఏ తూనికనూ కాదు!

Spread the love

నేనొక స్త్రీని
అంత కన్నా ఎక్కువా కాదు
ఎంత కన్నా తక్కువా కాదు
యథాతథంగా జీవితాన్ని స్వీకరిస్తాను

గాలిదారాలతో
కాకమ్మ కథలు అల్లను
పోగు వెంట పోగు
ఓపిక నూలుతో 
బతుకు వస్త్రాన్ని అల్లుకుంటున్న మహిళను

పాలేవో, నీళ్ళేవో
నా కళ్లతోనే పోల్చుకుంటాను
నిజాల నీడ పట్టుకొని
ఓటమి నాడిని  తెలుసుకుంటాను

నిన్నటి అనుభవం అద్దిన కాగితం మీద
రేపటి రూపం గీస్తాను
నిశ్శబ్దాల ప్రతిధ్వనులే తప్ప
నా దగ్గర ఏ శబ్ద ఆడంబరాలూ లేవు

ఎగిరే పక్షుల జాడ లేని రాత్రి నిశ్శబ్దంలో
ఊరి పైకప్పు మీదుగా
గాలి వాలుగా వినబడే
బాటసారి  అస్పష్ట పాటలను ఇష్టపడుతాను


మార్చి నెలలో మా  బాల్కనీలోకి
ఎగురుతూ వచ్చిన బాదం పూల సుగంధం
"నన్ను స్పృశించు
నీటి ఊటల దాకా నిన్ను చేర్చే
అశ్వాన్ని పంపుతాను" అంటూ
సుదూర సందేశాన్ని మోసుకొస్తుంది.

స్పష్టంగా తెలవదు గానీ
ఎందుకో ఏడుస్తాను
నిన్ను నిన్నుగానే  ప్రేమిస్తాను


గెలుపో గర్వమో కాదుగానీ
నా భుజాల మీదినుంచే
నీ కోసం పొద్దు పొడుస్తుంది
నిన్ను నేను హత్తుకున్న  చల్లదనంలోనే
సాయంత్రం అవుతుంది
అయినా నేను వేకువా కాదు
వెన్నెలనూ కాదు
నేను  ఓ కాంతను

నన్ను ఇష్టపడితే
ఈ అగాధాన్ని దాటే ఆశలకు
చిగురులా ఉండు
నన్ను నన్ను గానే చూడు
నేను కాగితమ్మీది కలర్ ఫొటోనో
కవుల ఊహల్లోని కావ్య నాయికనో కాదు

ఆ 'లైలా' సుదూర దుఃఖాన్ని
పడక గది నుంచి నేనిప్పుటికీ వింటున్నాను
నన్ను ఏ  ఎంకి పాటలోనో
లయబద్దంగా బందీని చేయకు
నలుగురి చెవుల్లో
నన్నో వార్త ను చేయకు
నేను ఒక వనితను

నీ లోపల ఉన్నట్లే
నా లోపలా ఒక మనసుంది
కావాలంటే నా మనసులో నువ్వు ఉండు
నీ మనసులో నేనూ ఉంటాను
ఈ ప్రేమ పదకేళిలో స్పష్టతను
ఇద్దరం ఇష్టంగా ప్రేమిద్దాం
నా లోంచి నేను ఉప్పొంగినప్పుడు
నేను నీ దానినే!
అయినా నేను దారినీ కాదు
ధరిత్రినీ కాదు
నేనో మగువను

అయినా నువ్వు అర్థం చేసుకోగలవా?
నెల నెలా
పునరావృత అరుణ జాబిలి చక్రంలో
నేను అలిసిపోతాను!
ఒక్కో తంత్రీ వదులవుతూ
నా వీణ దేహం జబ్బు పడుతుంది

నువ్వు అర్థం చేసుకోగలవా?
నేనూ ఓ అస్తిత్వాన్ని

అంతకన్నా ఎక్కువా కాదు
ఎవరికన్నా తక్కువా కాదు!

మూలం : ( Nomore and no less)
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *