బుక్ ఫెయిర్‍లో భామాకలాపం

Spread the love

అంగ రంగ వైభవంగా బుక్ ఫెయిర్ మొదలైంది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమాత్యశేఖరులు పుస్తక పఠనంతో కలిగే వెయ్యిన్నొక్క లాభాల గురించి మైకులు అదిరేట్టు ఉపన్యాసాలు దంచి వెళ్ళారు.

చారుశీలగా పాఠక లోకంలో నాలుగు దశాబ్దాలుగా విఖ్యాతుడైన వెంకట్రావు ఈ సారి ధైర్యం చేసి ప్రత్యేకంగా తన రచనల అమ్మకాల కోసం స్టాల్ పెట్టాడు.తనకు సహాయకులుగా ఇద్దరు డిగ్రీ విద్యార్థులను పది రోజుల కోసం మాట్లాడుకున్నాడు.

బుక్ ఫెయిర్ ఓపెనింగ్ రోజే అయస్కాంతంలా పాఠక జనం చారుశీల స్పెషల్ స్టాల్ ముందు బారులు తీరారు.చారుశీల నవలల్ని, కథా సంకలనాల్ని ఎగబడి కొంటున్నారు.ఇద్దరు సేల్స్ బాయ్స్ నాలుగు చేతులకు పని చెప్పినా ఊపిరి సలపడం లేదు.వెంకట్రావుకు బిల్లులు రాయడం,డబ్బులు వసూలు చేసుకోవడంలో చెమటలు పట్టేస్తున్నాయి.

మొదటిరోజే తెచ్చిన స్టాక్ అంతా అయిపోయింది.మర్నాడు ఇంట్లోని అటకల మీద కార్టన్లలో గుట్టలుగా ఉన్న పుస్తకాలని ఆటో ట్రాలీలో బుక్ ఫెయిర్ ప్రాంగణానికి చేర్చాడు.
రెండోరోజు, మూడోరోజు ఇలా గడిచేకొద్దీ క్యూలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన సినిమా అనూహ్యంగా అట్టర్ ఫ్లాప్ అయింది.కారణాలు అంతు చిక్కని సినిమా పండితులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.చివరికి చారుశీల కారణమని తేల్చారు.
ఇకముందు బుక్ ఫెయిర్ జరిగే రోజుల్లో కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయకూడదని నిర్మాతల మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.చారుశీల స్టాల్ ముందు పాఠకులని అదుపులో పెట్టేందుకు ప్రత్యేకంగా పోలీసుల్ని రంగంలోకి దింపారు.
పదిరోజుల్లో పుస్తకాలన్నీ వేడి పకోడీల్లా అమ్ముడైపోయాయి. వెంకట్రావు వచ్చిన లాభాలతో కొత్త మోడల్ కారు కొన్నాడు. అర్థాంగి మీనాక్షిని తీసుకొని ఉత్తర భారత యాత్రలకు బయలుదేరాడు.
*
తొమ్మిదవుతోంది. ఇంకా నిద్రలేవరా! అంటూ మీనాక్షి కేకలు వినిపించేసరికి వెంకట్రావు మేల్కొన్నాడు. తను కలగన్నాడన్న చేదు వాస్తవం తెలియడానికి ఎక్కువ టైమేమి పట్టలేదు.

“మీనాక్షీ! తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు.అది నిజంగా నిజమేనా?” అని భార్య ముందు ధర్మ సందేహం వెలిబుచ్చాడు.
వెంకట్రావు కలను సవివరంగా తెలుసుకున్న మీనాక్షి ముఖంలో రంగులు మారుతూ వచ్చాయి.
చివరికి ఆమె ముఖం విప్పారింది. భర్త భుజం తట్టింది.
ఆవిడ ఇచ్చిన భరోసా ఏమిటో తెలుసుకోవడానికి ముందు చారుశీల అనబడే వెంకట్రావుకి ఆ కల రావడానికి బాట వేసిన పూర్వాపరాలు తెలుసుకోవాలిగా!

*
వెంకట్రావు చిన్ననాటి నుండి పుస్తకాల పురుగు.ఆ రోజుల్లో పుస్తకాలు మినహా మరొక కాలక్షేపం ఉండేది కాదు.క్లాసు పుస్తకాల మధ్య డిటెక్టివ్ నవలలు దొంగచాటుగా పెట్టుకుని ఎడాపెడా చదివేసేవాడు వెంకట్రావు.కాలం గడిచే కొద్దీ డిటెక్టివ్ నవలలు మొహం మొత్తాయి.ఇతర నవలలపైకి దృష్టి మళ్ళింది. వాటినీ ఒక పట్టుబట్టాడు. టెక్స్ట్ బుక్స్ కంటే నవలలే ఎక్కువ చదువుతూ కాలక్షేపం చేసిన వెంకట్రావు అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు.మీనాక్షి తండ్రి వెంకట్రావుకు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పించి కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు.

చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న వెంకట్రావు ఒక పుస్తకాల షాపులో అకౌంట్స్ రాయడానికి కుదురుకున్నాడు.అది అతడి జీవితాన్నే మార్చేసింది.ఆ పుస్తకాల షాపు యజమాని పబ్లిషింగ్ లో కూడా ఉండేవాడు.దుకాణానికి వచ్చి వెళ్ళే రచయితలతో నెమ్మదిగా పరిచయాలు, సాన్నిహిత్యం పెరిగింది.అప్పట్లో రచయితలు ఒక వెలుగు వెలిగేవారు.పబ్లిషర్లు అడ్వాన్స్ లు ఇచ్చి మరీ నవలలు రాసివ్వడానికి రచయితలతో అగ్రిమెంట్లు కుదుర్చుకునేవారు. వీక్లీల్లో సీరియల్స్ పూర్తి కాకముందే నవలలుగా ఎప్పుడు అచ్చేస్తున్నారని పాఠకులు ఆరా తీసేవారు.

ఈ వాతావరణంలో వెంకట్రావుకు ఒక శుభ ముహూర్తాన ‘నేనూ రాస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన మెరిసింది. వెంటనే ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టి ఒక డిటెక్టివ్ పాత్రను రూపకల్పన చేసి సాయంత్రానికల్లా నవల రాసేసాడు.

ఆ స్క్రిప్ట్ తీసుకెళ్లి తను పని చేస్తున్న పబ్లిషర్కి చూపించడం, ఆయన చదివి బాగుందని చెప్పి అచ్చేయడం జరిగిపోయాయి.

“రచయిత్రులు రాజ్యం చేస్తున్నారయ్యా! నీ పేరుతో వేస్తే ఎవరూ కొనరు. ఒక ఆడపేరు పెట్టుకో” అని పబ్లిషర్ సలహా పారేయడంతో వెంకట్రావు చారుశీలగా కొత్త అవతారం ఎత్తాడు.
ఇక ఆ తర్వాత చారుశీల చెలరేగిపోయాడు. డిటెక్టివ్ నవలలే కాకుండా సాంఘిక నవలల్ని సీరియల్‍గా పత్రికలకు రాయసాగాడు.

చారుశీల రచనలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. పబ్లిషర్లు వెంకట్రావు చుట్టూ తిరగడం మొదలెట్టారు. పేరుతో పాటు రెండు చేతులా డబ్బు సంపాదన పెరిగింది.మామగారు ఇప్పించిన ప్రైవేటు ఉద్యోగానికి, పుస్తకాల షాపులో పార్ట్ టైం ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి పూర్తిగా రచనా వ్యాసంగంలోనే మునిగి తేలసాగాడు. సొంతంగా భార్య పేరు మీద మీనాక్షి పబ్లికేషన్స్ ను మొదలుపెట్టి తన నవలల్ని స్వయంగా అచ్చేసుకుని మార్కెట్ చేయసాగాడు. మీనాక్షి చురుకైన ఇల్లాలు కావడంతో ప్రెస్ పనులు, మార్కెటింగ్ వ్యవహారాలను చక్కపెట్టేది. దీంతో రేయింబవళ్ళు రాత పనికే వెచ్చించేవాడు. సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. వెంకట్రావు నవలల ఆధారంగా సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు బారులు తీరారు.

వెంకట్రావు, మీనాక్షి దంపతులకు ఇద్దరు పిల్లలు. శ్రద్ధగా చదువుకుని కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికా అవకాశం తలుపు తట్టి ఇద్దరూ అక్కడే ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు.
క్రమంగా పాఠకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. టీవీల్లో డైలీ సీరియల్స్ మొదలవ్వడంతో మహిళాలోకం నవలల పైనుండి దృష్టి మళ్లించింది. మీనాక్షి పబ్లికేషన్స్ అప్పటికే 150కి పైగా నవలల్ని ప్రచురించి మంచి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుంది. ఒకప్పుడు అయిదువేల కాపీలు ఆరునెలల్లో అమ్ముడయిపోయి మళ్లీ రీప్రింట్ కి వచ్చేవి.


షాపుల్లో అమ్మకాలు పడిపోయాయి. దుకాణాల నుండి ఒకప్పుడు పుస్తకాల అమ్మకాల ద్వారా లక్షల్లో రాబడి వచ్చేది. క్రమంగా అమ్మకాలు వేలకు పడిపోయాయి. కొత్త పుస్తకాల ఎంక్వైరీలు తగ్గాయి. షాపుల వారు స్టాక్ వాపసు చేశారు.

చింత చచ్చినా పులుపు చావదన్నట్లు, వెంకట్రావు మాత్రం రాయడానికి బ్రేక్ ఇవ్వలేదు. ఏదో ఆశ ఊరించేది. మార్కెట్లో తను రాసిన పుస్తకం నెలకు ఒకటన్నా కనబడకపోతే ఎలా? అన్న ఆరాటం వెంకట్రావుది.

పబ్లికేషన్స్ వెనకబడుతున్నాయన్న వాస్తవాన్ని మీనాక్షి గ్రహించింది. పుస్తకాల పని తగ్గి తీరుబడి పెరగడంతో వేరే బిజినెస్ లోకి వెళ్ళడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది.
మీనాక్షి స్వగృహ ఫుడ్స్ వెలిసింది. మీనాక్షి పబ్లికేషన్స్ బోర్డు వెలవెలబోయి , మీనాక్షి స్వగృహ ఫుడ్స్ బోర్డు కళకళలాడసాగింది. మీనాక్షి చేతి కింద పది మంది హెల్పర్లు. వెంకట్రావు కూడా నవలలు రాయడం బాగా తగ్గించి భార్యకు చేదోడు వాదోడుగా నిలవసాగాడు. మార్కెటింగ్, ఎకౌంట్స్ బాధ్యతల్లో మునిగితేలసాగాడు.
కానీ అతడిని ఒకటే దిగులు వెంటాడుతోంది. అమ్మకాలు పడిపోయి వేల సంఖ్యలో స్టాక్ పోగుపడింది. ఇంట్లో రెండు గదుల నిండా పుస్తకాలు వెక్కిరిస్తున్నాయి.

*

నరకాసురుడి దెబ్బకు మూర్చపోయిన కృష్ణుడికి బాసటగా నిలిచిన సత్యభామలా ,మీనాక్షి చక చక ఆలోచనలు చేసింది.

‘ఈ సారి బుక్ ఫెయిర్ లో స్టాల్ పెడదాం’ అంది మీనాక్షి గంభీరంగా.
‘స్టాల్ అద్దెకు సరిపడా పుస్తకాలు అమ్మగలమంటావా? ‘నిస్తేజం, నిర్వేదం కలగలిపి ధర్మ సందేహం వెలిబుచ్చాడు వెంకట్రావు.
‘ చూద్దాం, ఎందుకు కొనరు!’ అంటూ మీనాక్షి శపథం పట్టింది.
బుక్ ఫెయిర్ లో మీనాక్షి పబ్లికేషన్స్ స్టాల్ ఏర్పాటు అయింది. వెంకట్రావు కల నిజమైంది.
పాఠకులు స్టాల్ ముందు బారులు తీరారు. తెచ్చిన స్టాక్ తెచ్చినట్లే అయిపోతోంది. వెంకట్రావు కోరుకున్నట్లే పది రోజుల్లో తుడిచి పెట్టినట్లుగా పుస్తకాలన్నీ అమ్ముడు అయిపోయాయి.

ఈ మహా అద్భుతం ఎలా సాధ్యమైంది? మీనాక్షి కిటుకు ఏమిటి?
మీనాక్షి దీర్ఘాలోచన చేసి ఒక పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది.
1500 రూపాయల పుస్తకాలు కొన్న వారికి , 500 రూపాయల విలువ చేసే కిలో స్వీట్లు ఉచితం.
“పుస్తకాలు కొనండి,స్వీట్స్ కూపన్ పొందండి. బుక్ ఫెయిర్ గేట్ వెలుపల ఉన్న మీనాక్షి స్వగృహ ఫుడ్స్ మొబైల్ షాపులో స్వీట్ బాక్స్ అందుకోండి. స్వీట్ మెమోరీస్ తో మీ ఇళ్ళకి చేరండి.”

ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా, ఇటు పుస్తకాలు, అటు స్వీట్ నిల్వలు చెల్లిపోయాయి.

సిటీలో మరో రెండు బ్రాంచీలకు మీనాక్షి ప్లాన్ చేస్తోంది.

గోవిందరాజు చక్రధర్‍

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *