పురుషోత్తం మామ సన్యాసాశ్ర మం

Spread the love

దువ్వాడ శార్వాణి ఎప్పటిలాగే ఆ వేళ కూడా క్లాసుకి ఆలిస్యంగా వచ్చింది. ఈ సారి  మేష్టారు వూరుకోలేదు. గట్టిగానే అడిగేడు ఎందుకు ఆలిస్యమైందని.

“సారూ! మా నాన్న కోసం  ఆశ్రమానికి కేరేజీ ఇచ్చేసి వచ్చినప్పటికీ ఇంత లేటైపోతందండీ” అన్నది శార్వాణి.

వాళ్ల నాన్న ఆశ్రమం లో వుంటే కేరియర్ తీసుకెళ్లడ మేమిటీ? సన్యాసులు వారే వండుకోవాలి కదా! ఆ అమ్మాయితో మాట్లాడ టానికి ధైర్యం చాలక, తిన్నగా వెళ్లి మా నాన్నమ్మ నడిగా ఈ పురుషోత్తం సంగతేమిటని.

“దువ్వాడ పురుషోత్తం మన చుట్టమేరా! నీకు వరసకి మామ అవుతాడు” అంది.

ఇది ఎప్పుడూ ఆమె అనే మాటే. ఎవరు ఏవిధంగా మన చుట్టాలో చెప్తుంటుంది.  మా లక్ష్మి పురం లాంటి పల్లెటూళ్లో ఒకరి కొకరు చుట్టం కానివారుండరు. ఆమె ఏం చెప్పిందంటే –

“అతను చాలా సంవత్సరాల క్రిందట సన్యాసం తీసుకున్నాడు.  ఊరికి దూరంగా ఒక కుటీరం లేపి అందులో వుంటున్నాడు. సాంసారిక విషయాలేమీ పట్టించుకోడు. వ్యవసాయమంతా వదిలేస్తే అతని తమ్ముడే అన్నీ చూసుకుంటున్నాడు. పురుషోత్తం వాళ్లావిడ మాత్రం రోజూ భోజనం కేరియర్ కట్టి కూతురితో ఉదయం ఎనిమిది గంటలకే పంపిస్తుంటుంది. ఆయన మరి ఈ ఇంటి వైపు రాడు. పూజలు పునస్కారాలకి, పండగలకి గానీ రాడు.  వాళ్లావిడ ఎక్కడైనా తటస్థ పడ్డా, ‘ఏమమ్మా’ అంటాడట గానీ, అంతకు మించి మాట్లాడడట! శార్వాణి చదువు బాగోగులు అన్నీ ఆ పురుషోత్తం తమ్ముడే చూసుకుంటున్నాడు.” 

ఇదేమిన్యాయం! సన్యాసం ఆయన పుచ్చుకోవడమేమిటి, భోజనాలు ఇంటినుండి సప్లై ఏమిటి. మరలా అంతా శాకాహారమేనట. అదయితే మరింత కష్టం. ఏ ఎండు చేపో, ఆవకాయో అయితే చేసి పడేయగలరు గానీ, ప్రతిసారీ కాయగూరలు తెచ్చి వండాలంటే కష్టమే అనుకున్న. అప్పటికి పదో తరగతి తర్లా స్కూల్లో చదువుతున్నాను. నాకు స్వతహాగా సాధుసన్యాసులపట్ల ఉన్న ఆసక్తి, గౌరవం వల్ల ఆతగాని గురించి అతన్నే కలుసుకుని మరింత తెలుసుకుందామనుకున్నాను. 

మా ప్రాంతం లో ఇటువంటి సందర్భాలు అపుడపుడు తటస్థ పడుతుంటాయి. ఎక్కడో ఒక దగ్గిర ఒకతను హఠాత్తు గా నాకు వీటన్నిటిమీదా విరక్తి  కలిగిందని చెప్పేసి ఇల్లు వదలి వెళ్లి పోతాడు. కొంతమందైతే ఇంట్లో వాళ్లకి సన్యాసం పుచ్చుకుంటాను అని చెప్పి మరీ వెళ్లి పోతారు. వీళ్లల్లో సన్యాసం పుచ్చుకున్న తరువాత అటు ఇటూ మారిన వారున్నారు గానీ, కొంత మంది మరి వెనక్కి చూడరు. మా పెదనాన్న దాలయ్య – దాల పెదనాన్న – అనేవాళ్లం, ఓ రోజు నేను వెళ్లి పోతున్నాను అని చెప్పి, వాళ్ల ఇంటి వెనక మామిడి తోటలోకి మారిపోయి, అక్కడో గుడిసె వేసుకుని ఉండి పోయేడు. అప్పటికతనికి ఓ డెబ్బై సంవత్సరాలుండొచ్చు. మా దాల పెద్దమ్మ రోజూ అన్నం పంపించేసేది. వాళ్లావిడ, అంటే మా దాల పెద్దమ్మ,  దాష్టీకం భరించలేక అతను సన్యాసం తీసుకున్నాడని వూళ్లో అనుకునే వారు. ఏమైతేనేం, అన్నీ వదిలేసి వెళ్లిపోయినట్టే. దేన్లోనూ కల్పించు కోవడం మానేశాడు. మేమెవరమైనా వెళితే లోపలనుంచి బయటికి వచ్చేవాడు. “ఏం రా!” అని పలకరించే వాడు. ఆ తరువాత ఏం మాటలుండేవి కాదు. ఆ గడప తుడుచు కోవడమో, మొక్కలకి నీళ్లు పోసుకోవడమో మౌనంగా చేసుకునేవాడు మళ్లా మేం వెళ్ళిపోయేదాకా.

మా లక్ష్మి పురం లోనే, మరొకతను గోర్జి పక్కన వాళ్ల  కొబ్బరితోటలో ఓ గుడిసె వేసుకుని ఉండి పోయేడు. ఐతే, అతను మరలా ఇంటికి రావడం, వెనక్కి వెళ్లడం చేసేడట. చివరకు ఎక్కడా నిలకడగా వుండకుండానే పరమై పోయేడు.

ఇలా సన్యాసం పుచ్చుకున్న వాళ్లకి మిగతా సాధువులతో క్రమంగా సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళు  తెలుసుకుని వీరి దగ్గరకు వస్తారో, లేక వీరే వెతుక్కుంటో వారికోసం వెళ్తారో తెలీదు. రెండూ జరిగే అవకాశాలున్నాయి. దాంతో పాటే, సాధువుల సాంస్కృతిక లక్షణాలు వీరికలవడతాయి. కాషాయ వస్త్రాలు, జడలు కట్టిన జుత్తూ, కొన్ని సార్లు కమండలం, కరదండము. అయితే, అందరూ అన్ని లక్షణాలు అనుకరిస్తారని కూడా లేదు. మా ప్రాంతం లోనే, బారువా, కాశీ బుగ్గ, టెక్కలి, కవిటి, మహేంద్రగిరి లాంటి చోట్ల ఇలాంటి సాధువులు ఒక చోట చేరే ఆశ్రమాలు, కోవెలలు వున్నాయి. వీరు అక్కడికి వెళ్లి కొన్నాళ్లుండి, మరో చోటికి వెళ్లి, అక్కడనుండి మరలా స్వస్థలానికి (వారికంటూ ఓ స్థలం వుంటే) చేరుకుంటారు. ఇలాంటి ఆశ్రమాలలో వెళ్లి వుంటే ఎవరూ నిన్నేమీ అడగరు. సాధారణంగా సన్యాసులు దేశద్రిమ్మరులు కాబట్టి వీరు ఎక్కడా స్థిరంగా పాతుకుని పోరు. అక్కడున్నన్నాళ్లు ఆశ్రమం వారూ ఏమిస్తే అది తినటమే. ఈ సన్యాసుల్లో అందరూ మంచి వారుంటారని అనను గానీ, వాళ్లలో ఆత్మ శుద్ధి ఉన్నవారుండరు అంటే నేను వప్పుకోను. వీరంతా ఒకే స్థాయి లో ఉండక పోయినా, ఖరీదైన ఆశ్రమాల్లో, సిల్కు కాషాయ వస్త్రాలు, విలువైన రుద్రాక్షమాలలు వేసుకుని దర్శనమిచ్చే సద్గురువులూ, పీఠాధిపతులకన్నా చిత్తశుద్ధి ఉన్నవారిక్కడ కనపడగలరు. 

ఆ రోజు స్కూలు నుండి వచ్చిన తరువాత పురుషోత్తం సాధు దగ్గిరకు వెళదామని పించింది. మా ఊరికి ముందు రోడ్డు ప్రక్కనే అతని ఆశ్రమం. అక్కడికి వెళ్ళేటప్పటికి బయట ఎవరూ లేరు. కుటీరం ప్రక్కన నుయ్యి ఒకటి వుంది. దాని చుట్టూతా నాలుగయిదు గోలేల నిండా నీళ్ళు వున్నాయి. వరి గడ్డితో నేసిన చూరు, ముందు ఇరువైపులా రెండు అరుగుల్ని కప్పుతో తాటి కమ్మల పాక వుంది. రెండు గచ్చు అరుగులూ బాగా మెరిసిపోతున్నాయి. అంటే, చాలామంది ఆ ఆరుగుల మీద కూచుని లేస్తున్నారన్నమాట!

మెట్ల వద్దకి వెళ్లి నిలబడ్డాను. నా అడుగుల చప్పుడు వినబడిందో ఏమో, లోపల్నుండి పురుషోత్తం సాధు  బయటికొచ్చేడు. నేనెవరో చెప్పిన తరువాత, “నీవు మాలక్ష్మమ్మ మనవడివా?” అన్నాడు. “అంటే, మా సూరి కొడుకువన్నమాట!” అన్నాడు మళ్ళా. 

“కూకోరా అయ్య! ఏటిల గొచ్చేవు? “

కూర్చున్నాను. నేను ఊహించినట్లే, వొత్తైన తెల్లటి గడ్డం, పొడయైన జుత్తుని తల మధ్యకి దువ్వి వేసుకున్న ముడి, కాషాయ చొక్కా, పంచే, భుజం మీద తువ్వాలు తో ఉన్నాడు. దృఢమైన శరీరం, బలమైన చేతులు, పాదాలు, తేటైన కళ్ళూ – మనిషి మంచి ఆరోగ్యంగా వున్నాడు. అరవైఅయిదేళ్లకి పైన వయస్సు వుండొచ్చు.

ఆ మాటా ఈ మాటా అయిన తరవాత, అతన్ని అడిగి ఆ గది లోపలకి వెళ్లి చూసేను. అది చాలా చిన్న గదే. ఒక ప్రక్క జైలు గదిలో లా సిమెంటుతో కట్టిన అరుగు, రెండో వైపు ఒక మూలకి కాస్త ఎత్తున గోడకి కొట్టిన అటక పై శివుని ఫోటో, ఆ ఫోటో ముందు రెండు ప్రమిదల్లో వత్తుల దీపాలు వెలుగుతున్నాయి. సిమెంటు అరుగు మీద చాప, బొంత, తలగడ వున్నాయి. అంతకు మించి  అక్కడ  ఓ కుర్చీ గానీ, వేరే సామానులు గానీ లేవు. గదంతా అత్యంత శుభ్రంగా వుంది.

 కొంతసేపు మరలా మాటలైనాక, నెమ్మది గా అడిగేను, “నీవు సన్యాసం ఎందుకు తీసుకున్నావు” అని.

మఠం వేసుకుని నాకు అభిముఖం గా కూర్చున్నాడు. మొహం మీద ఒక చిన్న నవ్వు.  బయట రావి చెట్టుమీద కాకుల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడే సూర్యాస్తమయమై చీకట్లు ముసురుకుంటున్నాయి.

“మనసు విరక్తయిందిరా అయ్య. విరక్తయి మా వోళ్ళకి కూచోబెట్టి చెప్పేసేను, ఇక నా వల్ల కాదు అని.  ఇక నాపని నాదే, మీ పని మీదే. ఇంటినుండి ఏదీ పట్టికెళ్లను. ఏదీ తెచ్చివ్వను. ఊరికి రాను. చుట్టాలు బందుగుల దగ్గిర కి వెళ్ళను అని చెప్పేసేను.” అన్నాడు.

“మీ ఆవిడా ఏమన్లేదా?   నువ్విలగెలిపోతే నేనేమై పోవాలని బాధ పడ్లేదా?” అన్నాను.

“దేవుడన్న తరువాత మరేమంటారు? అదే నా జవాబు. ఇప్పటికీ పదిహేను సంవత్సరాలైంది. నా ప్రపంచం నాదే అయిపోయింది. ఎక్కడెక్కడో తిరిగేను. ఎవరెవరినో కలిసేను.  ఎక్కడి కెళ్లినా నాదొక్కటే ధ్యాస, దేవుడెలా వుంటాడు, ఎక్కడ వుంటాడు అనే.”

“దేవుడేమిటో తెలిసిందా?”

“నాకు తెలిసిందేమంటే, దేవుడని ఒక రూపం వుండదు. అది మనలోనే ఉంది. బయటంతా ఉంది. ఈ విశ్వమంతా అదే. రకరకాల దేవుళ్ళని పూజిస్తాం. దాన్ని తప్పనను. కానీ అంతా దైవమయం అని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే  దేన్ని పూజించినా అదే భగవంతుడు”

“నీకు రోజులెలా గడుస్తాయి? ఏం చేస్తుంటావు?”

 “వారానికి మూడు నాలుగు రోజులు సాధువులొస్తారు. వొండుకుని ఇక్కడే వుంటారు. అందరం ఎవరి అనుభవాలు వారు పంచుకొంటాం. రాత్రిళ్లు ఈ అరుగుల మీద నిద్రబోతారు. సాధువుల సమావేశాలకి నన్నెవరైనా పిలుస్తుంటారు. మాట్లాడమంటే ఆత్మజ్ఞానం గురించి ఓ గంట సేపు మాట్లాడ గలను. నేనేం భగవద్గీత, ఉపనిషత్తులు చదువుకోలేదు. కానీ ఈ విషయమేదో నాకు కొంత అర్థమైంది. నిజానికి ఈ బ్రహ్మవిద్య ఒక బ్రహ్మవిద్యేం కాదు. దాన్ని గురించి విపరీతంగా చర్చించడం వల్ల అది అర్థం కాకుండా అయిపోయింది. అది మానసికానుభవానికి అతీతమైన అనుభవం. చర్చ కాదు. పఠనం వల్ల రాదు. నేను మాట్లాడే తీరు కొంతమందికి నచ్చుతుంది. అంచేత వారు మాట్లాడమంటే నేను మాట్లాడుతుంటాను.” అని,  ఆగి  –

“ఇక మిగతా రోజులెలా గడుస్తాయంటావా? ఇదిగో ఇలానే” అని గోడకి  జేరబడి కూర్చున్న తనని చూపించుకున్నాడు.

“ఇక్కడి పనంతా నేనే చేసుకుంటాను. నాకంటూ వండు కోవడం ఎందుకో చేసుకోలేక పోయేను. నేనిక్కడ ఉంటే, శార్వాణి వాళ్లమ్మ, అన్నం పంపిస్తాది. నా శిష్యులో, భక్తులో అయితే నాకింత ముద్ద పెట్టరా. ఇదీ అంతే.”

“ఏ పనీ లేకపోతే ఇలా కూర్చుని బయటి ప్రపంచాన్ని చూస్తుంటాను – రోడ్డు మీద నడిచి వెళ్లి పోయే మనుషులూ, పశువులూ, గడ్డి మోసుకు పోయే ఆడవాళ్ళూ, గాలికి దోవ మీద ఎగిరే ధూళీ – ఆ నడిచిపోయే ప్రపంచాన్ని లోపల నిశ్చలం గా వున్న నేను చూస్తుంటాను. నా కాలం అలా గడిచిపోతుంది” అన్నాడు.

కొంత అర్థమయీ అర్థమవక,  ఏమనాలో తెలీక – అతని దగ్గర నుండి శలవు తీసుకున్నాను.


***

బమ్మిడి దేవీ ప్రసాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *