అండమాన్ దీవుల్లో .. 2

Spread the love

అండమాన్  – సెల్యూలార్ జైలు 

అల్లంత దూరాన నిలబడి ఊరించే అండమాన్ & నికోబార్ దీవులు చూడాలనే కోరిక ఈనాటిదా .. 

చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు అని చదివినప్పటి కోరిక.  అలా ఆ పేర్లు వినడం తప్ప తెలిసింది చాలా తక్కువ. 

సెల్యులార్ జైలు గురించి మాత్రం కథలు కథలుగా విన్నాను. ఆ జైలు తో పాటు చిన్న  చిన్న దీవుల్లో ప్రజలు ఎలా నివసిస్తారో తెలుసుకోవాలన్న కుతూహలం,  ఉత్సాహం, నాతో పాటు పెరుగుతూ వచ్చింది.  

యూత్ హాస్టల్స్ అసోసియేషన్  ఆఫ్ హైదరాబాద్ వారి మహిళా విభాగం విహంగ లో సభ్యురాలిగా చేరినప్పటి నుండి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లే ఔత్సాహికుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమ వివరాలు తెలుస్తూనే ఉన్నాయి.  కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదు. ఇదిగో ఇలా ఆ కోరిక నెరవేరే సమయం వచ్చి ముందు నిల్చుంది. ఇక ఊరుకుంటానా.. 

ఆరు రోజులు, 5 రాత్రులు గా ఉన్న  ప్యాకెజీ కి మేము ముందుగానే YHA  వారికి చెల్లించడం కంటే ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. మేము చూస్తుండగానే విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగి పొందడమే అందుక్కారణం. 

హైదరాబాద్ నుంచి సంధ్య (pow), నవరంగ్, భండారు విజయ, గిరిజ, జానకి, అన్నే అరుణ, అనిత, జూపాక సుభద్ర తో కూడిన 9 మంది బృంద సభ్యులం అండమాన్ నికోబార్ ఐదు రోజుల పర్యటనకు డిసెంబర్ 7వ తేదీ ఉదయం 6. 30 కి ఫ్లైట్ ఎక్కాం. 9 గంటలకు  కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో వాలిపోయాం. 

దిగేముందు ఫ్లైట్ లోంచి చూస్తుంటే నీలి సంద్రంలో అక్కడక్కడా పచ్చలు పొదిగినట్లు కనిపించే ద్వీపాల సౌందర్యం మాటల్లో చెప్పలేం.   

 బంగాళాఖాతంలో 572 ద్వీప సముదాయమే అండమాన్ & నికోబార్ దీవులు. అయితే మానవ జీవనం ఉన్నది 37 దీవుల్లోనే.  ఈ దీవుల విస్తీర్ణం 6400 చదరపు కిలోమీటర్లు. అండమాన్ భూభాగం చుట్టూ నీళ్లు కొండలు లోతైన లోయలు .. చదునైన భూమి చాలా తక్కువ

అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించడానికి ఉన్న ప్రవేశ ద్వారం పోర్ట్ బ్లెయిర్. తెలుగు రాష్ట్రాల వారు అక్కడికి చేరడానికి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాల నుంచి ఆకాశ మార్గంలో,  విశాఖపట్నం, చెన్నై నుంచి జలమార్గంలో వెళ్ళవచ్చు. జలమార్గంలో వెళ్తే మూడు రోజుల సమయం పడుతుంది. సమయం ఉంటే జల మార్గంలో ప్రయాణించి ఆ అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.  

అండమాన్ &  నికోబార్ ద్వీపాలకు మిగతా భారత భూభాగం కంటే థాయిలాండ్, మయన్మార్, మలేషియా భూభాగమే చాలా దగ్గర.  

దాదాపు 60 వేల ఏళ్ల  క్రితం అండమాన్ దీవుల్లోకి మొదటి మానవులు వచ్చి ఉంటారని అంచనా. ఒకప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న స్థానిక జాతుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.  అందుక్కారణం ప్రకృతి వైపరీత్యాలు, బయటి వ్యక్తుల రాకతో వచ్చిన వ్యాధులు. 

అండమాన్ & నికోబార్ దీవులు భారతదేశంలో అంతర్భాగం అయిన తర్వాత ప్రధాన భూభాగం నుంచి వలసలు మొదలయ్యాయి.  అండమాన్ లో మూడింతలు జనాభా పెరిగింది.  2011 లెక్కల ప్రకారం ఈ దీవుల జనాభా 3. 8 లక్షలు. 2019 ప్రకారం 4. 35లక్షలు. గత పదేళ్ల నుండి వలసలు మరింత ఎక్కువగా పెరిగాయి. 

గ్రేట్ అండమానీస్ తెగ వారు ఒకప్పుడు అండమాన్ దీవులన్నిటిలో ఉండేవారు. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఐలాండ్ కి మాత్రమే పరిమితం అయ్యారు.  

అండమాన్ నికోబార్ దీవుల  మొత్తం జనాభాలో స్థానిక జాతుల జనాభా 7. 3% మాత్రమే. 

ఈ దీవుల్లోకి వలస బ్రిటిష్ వారు నేరస్థులను తీసుకుని మొదట 1789 లో చతం ఐలాండ్  లో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1858లో రాజకీయ ఖైదీలను తీసుకురావడంతో ప్రారంభమైంది. జపాన్ ఆక్రమణలో మూడేళ్లు ఉంది.  రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ద్వీపాలు అధికారికంగా భారతదేశంలో భాగమయ్యాయి.  1956 లో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 

తూర్పు బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి  శరణార్థులుగా పునరావాసం కోసం వచ్చిన వారేకాకుండా, తమిళ, తెలుగు ప్రాంతాల తీరప్రాంత వాసులు అనేకులు అండమాన్ నికోబార్ ద్వీపాలకు చేరారు. 

 ప్రవాస ద్వీపంగా మారిన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ప్రధాన ఆదాయ వనరుగా కలప, మత్స్యసంపద, టూరిజం. ప్రపంచంలోనే అత్యంత విలువైన కలప ఇక్కడ లభిస్తుంది. సమీప దేశాల నుండి కలపను అక్రమంగా తరలించడం జరిగింది. 

అరుదైన జంతుజాలానికి ఆతిథ్యం ఇచ్చే సతత హరితారణ్యాలు వ్యాపారం కోసం విచక్షణారహితంగా ధ్వంసం చేయడం జరిగింది.  అందువల్ల ఎక్కువగా నష్టపోయింది గ్రేట్ అండమానీస్ , జార్వా తెగలు.  రెండు దశాబ్దాల నుండి జార్వాలకు, వలస వచ్చిన వారికీ మధ్య విబేధాలు వచ్చాయి.  భూ ఆక్రమణదారులకు జార్వాలు మధ్య హింసాత్మక చర్యలు, ప్రతీకార సంఘటనలు జరిగాయి. బహుశా అందుకేనేమో జార్వాలు నాగరిక మానవ సమూహాలకు దగ్గరలోనే ఉన్నప్పటికీ వారితో కలవడానికి ఇష్టపడనిది.   

వలసదారులు భూ ఆక్రమణ చేయడం వల్ల పర్యావరణ నష్టం, జీవవైవిధ్య నష్టంతో పాటు స్థానిక జాతుల జీవనం, సంస్కృతులకు తీవ్రమైన ముప్పు ఏర్పడింది. 

అండమాన్ అండ్ నికోబార్ దీవుల ప్రధాన భూభాగమంతా స్థానికేతరులైన వలసవాదుల ఆధీనంలో ఉంది. 

అండమాన్ అండ్ నికోబార్ దీవులు జల రవాణా ద్వారా వాణిజ్యానికి వ్యూహాత్మక మైనవి.  ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే వాణిజ్య మార్గాల మధ్యలో ఉంది . 

భారత ప్రభుత్వానికి చెందిన యుద్ధ నౌకల స్థావరాలు నికోబార్ దీవుల్లోనే ఉన్నాయి. 

***                    ***

హైదరాబాద్ లో చలి విపరీతంగా ఉన్న సమయంలో బయలుదేరాం మేం.  కానీ మేం శ్రీ విజయపుర (పోర్ట్ బ్లెయిర్  పోర్ట్ బ్లెయిర్ నగరాన్ని శ్రీ విజయపురగా గత సెప్టెంబర్ లోనే మార్చారు) వీరసావర్కార్ విమానాశ్రయంలో దిగేసరికి వెచ్చటి వాతావరణం మాకు ఆహ్వానం పలికింది.  

మాలో ఒకరైన జూపాక సుభద్ర గారి బంధువు డిఫెన్స్ లో పనిచేసే భద్రయ్య గారు వచ్చి మమ్మల్ని పలకరించారు. భద్రతా దళ నౌక చూపిస్తామని చెప్పారు.  చాలా మంచి అవకాశం వెళ్లి చూడాలని ఉబలాటపడ్డాం.  మేం హోటల్ కు చేరాక YHA వారితో పరిచయ కార్యక్రమం ఉంది.  ఆ తర్వాత వెళ్లొచ్చు అనుకున్నాం. 

 ఆ తర్వాత YHA, అండమాన్ శాఖ వారు ఏర్పాటు చేసిన వాహనంలో ఇన్ఫినిటీ హోటల్ చేరాం. YHA తరపున కలకత్తా నుంచి వచ్చిన అమితాబ్, అతని భార్య రూప  మా బృందంలో కలిశారు. 

ముందుగా నిర్ణయించిన ప్రకారం పరిచయ కార్యక్రమం జరగలేదు.  మధ్యాహ్న భోజన అనంతరం మూడు గంటలకు జాతీయ స్మారక చిహ్నం సెల్యులార్ జైలు కి వెళ్లడానికి హోటల్ నుంచి పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు.  

సెల్యులార్ జైలు 

ఇప్పటికీ ఎవరికైనా శిక్ష విధించాలంటే అండమాన్ జైలుకి పంపించాలని అనడం వింటూ ఉంటాం. అలాంటి చారిత్రాత్మకమైన సెల్యులార్ జైలు నిర్మాణం  1896లో మొదలు పెట్టి 1906 పూర్తిచేశారు. ఈ జైలుని కాలాపాని అని కూడా పిలుస్తారు.  ఇప్పడు ఒక యాత్రా స్థలం గా మారిన ఆ జైలు ముందు, లోపల యాత్రికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. 

భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది రాజకీయ ఖైదీల ఫోటోలు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ ఖైదీల్లో  బెంగాలీలు చాలా ఎక్కువగా ఉన్నారు.  తెలుగువారి పేర్లు నారాయణరావు మరో ఏడో ఎనిమిదో మాత్రమే కనిపించాయి. వారందరినీ బ్రిటిష్ వారు బంధించి ఈ జైలుకు తరలించారు. ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చింది అన్నీ వివరంగా రాశారు. 

బ్రిటిష్ సామ్రాజ్యం అండమాన్ లో జరిపిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు లండన్ నుండి తెప్పించి ప్రదర్శనలో పెట్టారు.  

 స్వాతంత్ర సమరయోధులు ఇతర ఖైదీలతో కలిసి ఉండకుండా ప్రత్యేక గదులలో ఉంచి వారి మధ్య సమాచార ఇచ్చిపుచ్చుకునే వీల్లేకుండా నిరోధించారు.  ఖైదీలకు తక్కువ ఆహరం , ఎక్కువ కఠినమైన శ్రమ చేయించే వారు. చిన్న తప్పు చేసినా తీవ్రంగా హింసించేవారు. ఆకలితో ఉంచేవారు.  కఠినమైన పరిస్థితుల్లో ఒంటరి నిర్బంధంతో పాటు శారీరక శిక్షలు వారిని మానసికంగా కుంగదీసేవి.  వారి ఆరోగ్యాన్ని దెబ్బతిసేవి.  ఆత్మహత్యకు పురిగొల్పేవి. భారత దేశ స్వాతంత్ర చరిత్రలో ఈ జైలు ఒక చీకటి అధ్యాయం అనొచ్చేమో!

ఏడు రెక్కలతో  నక్షత్రాకారం పోలి జాజు రంగులో కనిపించే ఆ  మూడు అంతస్తుల జైలు భవనం వలస పాలకుల  అమానవీయమైన, క్రూరమైన శిక్షలకు, ద్రోహపూరిత దౌర్జన్యాలకు మౌన సాక్షి.   

ఏడు రెక్కల్ని కలుపుతూ మధ్యలో వాచ్ టవర్ ఉంది.  బర్మా నుండి తెచ్చిన ఇటుకలతో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం 696 జైలు గదులు ఉన్నాయి. ప్రతి గది 2.7 వెడల్పు, 4. 5 పొడవుతో ఉన్న ఇరుకుగా ఉంది. ఖైదీలు ఉండే ఆ చిన్న గదికి వెంటిలేషన్ చాలా తక్కువ. ఆ గదిలో ఖైదీల కోసం ఒక చిన్న మట్టి కుండ, మట్టి మూకుడు, సత్తు పళ్లెం ఉన్నాయి.  ఇతర ఖైదీల శబ్దం వినిపించకుండా, తలుపు తీయడానికి వీలు లేకుండా ఉండేలా నిర్మించారు.  ఖైదీల కోసం  మల మూత్రశాలలు ఎక్కడా మాకు కనిపించలేదు. 

భారతీయ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి , త్యాగాలు మనసును కదిలిస్తాయి.  భగత్ సింగ్ మిత్రుడు మహావీర్ సింగ్, మోహన్ కిషోర్, మోహిత్ మొయిత్రా  వంటి అనేక మంది యోధులు ఈ జైలులో నిర్బంధానికి గురయ్యారు. ఖైదీలు అనేకసార్లు తిరుగుబాటు చేశారు. ఆకలి దాడులు చేశారు. నిరాహార దీక్ష చేసినప్పుడు బలవంతంగా పాలు తాగితే ఊపిరితిత్తుల్లోకి పోయి మరణించిన వారున్నారు. 

సెల్యులార్ జైలు టెర్రస్ పై నుండి చూస్తుంటే జైలుకు ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో సముద్రం ఉంది.  జైలు నుంచి  ఖైదీలు తప్పించుకునే వీల్లేకుండా నిర్మించారు. అయినప్పటికీ కఠిన పరిస్థితులు తట్టుకోలేక కొందరు తప్పించుకు పోయే ప్రయత్నం చేసిన ఘటనలు జైలు చరిత్రలో ఉన్నాయి. 

ఖైదీలతో చేయించే కఠినమైన శక్తికి మించిన పని, అది చేయలేని ఖైదీలకు పడే శిక్షలు, చిత్రహింసలు చూపే నమూనాలు, ఖైదీల దుస్తులు చూసినప్పుడు విన్నప్పుడు  భయంకరమైన వేదనను వాళ్ళు ఎలా భరించ గలిగారోనని మనసు మూగగా రోదించింది. ఆ శిక్షలు భరించలేక ఉరివేసుకున్న సంఘటనలు ఉన్నాయక్కడ. 

ఉరిశిక్షల గాడి ప్రత్యేకంగా ఉంది. ఏకకాలంలో ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేసే ప్రదేశాన్ని చూస్తుంటే లోపలి నుంచి తెలియని బాధ. 

కేంద్రంలో రాజ్యమేలుతున్న ప్రభుత్వమే అండమాన్ లో కూడా అధికారంలో ఉండడం వల్లనేమో హిందూ మతతత్వవాది వీరసావర్కార్ ఉన్న రెండవ అంతస్తులోని జైలు గదిని  ప్రత్యేకంగా యాత్రికులకు చూపారు. భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. 

ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా బ్రిటిష్ కబంధ హస్తాల నుండి బయటపడిన భారత ప్రజలు ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారా అని ప్రశ్న నాలో తలెత్తి  వెంటాడుతూనే ఉంది.  

ఈ జైలును మూసేయాలని స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ ప్రచారం చేశారు. దాని ఫలితమే 1937-1938లో 795 రాజకీయ ఖైదీలను భారత్ పంపింది. అందులో ఆరొందల పైగా బెంగాలీలు ఉన్నారు. 1939 నాటికి జైలు పూర్తిగా ఖాళీ అయింది. 

1979 ఫిబ్రవరి 11 తేదీన ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు.  1993 నుంచి ప్రజల సందర్శనకు ఏర్పాటు చేశారు. 

రామాయణ కాలంలో అండమాన్ నికోబార్ దీవులను హండుమాన్ అంటే హనుమంతుని పేరు మీద ఏర్పడిన ప్రాంతం అని, ఆ అది తర్వాత అగడెమోన్ , అంగడెమోన్ గా మారి కాలక్రమంలో అండమాన్ & నికోబార్ దీవులుగా మారిందని గైడ్ చెప్పినప్పుడు మౌనంగా నవ్వుకున్నా.  

సెల్యూలార్ జైలు ప్రవేశ రుసుము  30 రూపాయలు. పిల్లలకు ఉచితం . 

లైట్ అండ్ సౌండ్ షో

మా పర్యటనలో నాలుగోరోజు సాయంత్రం సెల్యూలార్ జైలు నేపథ్యంగా రూపొందించిన లైట్ అండ్ సౌండ్ షో కి ముందుగానే మాకు టికెట్ బుక్ చేశారు. మేం 10వ తేదీ  ఓపెన్ ఎయిర్ థియేటర్ లో మా సీట్ నంబర్ ప్రకారం కూచున్నాం. 

మేం కూర్చున్న ప్రదేశానికి 20 అడుగుల దూరంలో ఒక స్టేజి , దానికి వెనుక వైపు కట్టిన పలుచని తెర, దానిమీదే ప్రదర్శన ఉంటుందని అటువైపు చూస్తుండగా ఎడమ వైపు గోడలపై కాంతులు ప్రసరిస్తూ కథనం మొదలైంది. 

భారత స్వాతంత్ర్య సమరంలో భాగంగా ఈ జైల్లో జరిగిన సంఘటనలను , ఖైదీల జీవిత కథనాలు, వారి బాధలు , ఆశలు, ఆకాంక్షలు తెల్పుతూ చేసిన పోరాటం చూస్తుంటే భావోద్వేగాల్లో కొట్టుకుపోతాం. 

 కొన్ని కీలక ఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూపింది .  రాజకీయ ఖైదీలు అనుభవించిన నరకం, కష్టాలు, బాధలు , వారి ప్రతిఘటన చిన్న వాళ్లకు కూడా చాలా చక్కగా అర్ధమయ్యేలా చూపింది . భారత దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చూస్తుంటే మన హృదయంలో దేశభక్తి పెల్లుబుకుతుంది. 

ప్రతి దృశ్యం, ప్రతి క్షణం కళ్ళకు గడుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. త్యాగధనులకు మనసులో మౌనంగా నివాళి అర్పించాను. 

జైలు గోడల పైనే ప్రదర్శించిన ఆ షో  అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. కాదు కాదు చారిత్రాత్మక అనుభవం అనొచ్చేమో!

లైటింగ్ , సౌండ్ , సంగీతం వేటికవే పోటీపడుతూ  ఉండగా కథనం హృద్యంగా సాగింది. 

భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తెలుసుకోవడానికి అండమాన్ వచ్చిన ప్రతివారు చూడవలసిన షో.  

మా ముందు ఒకరు షో ని సెల్ ఫోన్టో లో రికార్డు చేస్తుంటే సెక్యూరిటీ వచ్చి ఆపించాడు.  షో జరిగినంత సేపు మనం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి.  జైలు ఫోటోలు తీసుకోవచ్చు కానీ షో ఫోటోలు తీయకూడదు.  

ఈ షో కి పెద్దలు 50 రూపాయలు, పిల్లలకు 25 రూపాయలు చెల్లించాలి.  అండమాన్ టూరిజం వారి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 

మొదటి రోజు సెల్యులార్ జైలు చూసిన తర్వాత బీచ్ కి, మెరీనా పార్క్ కి వెళ్లాం.   ప్రశాంతంగా ఉన్న సముద్రుడి తో కాసేపు ముచ్చటించి ఆటలాడాం.   

మెరీనా పార్క్ నుండి కాస్త  దూరంగా సముద్రంలో విద్యుత్ దీపాల వరుస కనిపిస్తున్నది.  అదేంటో అని కుతూహలం మాలో.   నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని గూగులమ్మ చెప్పింది. 

ఆటోలు, కార్లు కిరాయికి తీసుకుని నడిపినట్లు చిన్న చిన్న పడవలు కిరాయికి తీసుకోవడం  లేదా ఆ పడవల యజమాని వాటిని నడిపేందుకు రోజువారీ కూలీపై గాని , నెలవారీ జీతానికి గానీ మనుషుల్ని పెట్టుకోవడం గమనించాం.  ఇరవై ఏళ్ల లోపు అమ్మాయి అంత మంది అబ్బాయిల (పడవలు నడిపిన ) దగ్గర లెక్కలు తీసుకోవడం బాగా అనిపించింది. 

ఎనిమిది గంటల వరకు తిరిగి మా విడిదికి చేరుకున్నాం. 

మధ్యాహ్న భోజనంలో ఉన్నట్లే అన్నం, రెండు కూరలు , పెరుగు , ఆలుగడ్డలు సన్నని వాలికలుగా చీల్చిన వేపుడుపెట్టారు. 

ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల రేపటి గురించి ఆలోచిస్తూ త్వరగా నిద్రపోయాం. 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *