అది 1965 వ సంవత్సర ప్రాంత కాలం. నేను లక్ష్మీ పురం మా తాత గారింట్లో వుండి బ్రాహ్మణ తర్లా స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు. ఆ రోజు ఉదయమే లక్ష్మీ పురం ఊరు ఊరంతా అట్టుడికి పోతోంది. నిద్రలేచి కళ్ళు పాముకుంటో అంగటి వీధి లోకి వచ్చి చూస్తే, దార్లో ఎక్కడి కక్కడ ఆడవాళ్లు బుగ్గల మీద వేళ్ళేసుకుని మంతనాల్లో వున్నారు. కొంత మందైతే మా వీధి మొదటికి – అంటే రోడ్డు వీధి వైపు వెళుతున్నారు.
నేనూ వాళ్లతో చేరేను. అలా నడుస్తూ బిర్లంగి నారాయణ ఇంటి వద్ద ఆగిందా లైను.
ఇంటిముందు చాలా జనం చేరున్నారు. ఎదురుగా తలుపుకి – ‘బి. రంగా రావు, బి. ఏ., బియ్యీడి’ అని ఇంగ్లీషు లో రాసిన పలక వుంది. రంగా రావు మా క్లాసుమేటు కోదండ రావు వాళ్లన్న. తర్లా ఎలిమెంటరీ స్కూల్లో టీచరు.
సరే, ఈ జనం ఎందుకా అని పరికిస్తే, వాళ్లింటి అరుగు మీద ఒకామె – మఠం వేసుకుని కూర్చోనుంది. చిన్నావిడే! ముదురాకుపచ్చ రంగు నేత చీర, పెద్ద జుత్తు వదులుగా ముడి, నుదుట్న ఎర్రని కుంకుమ బొట్టు, చామన చాయ, అందమైన ముఖం – అక్కడి మాటల్ని బట్టి, ఆమె పేరు గరికమ్మట. వాళ్ల ఊరు బ్రాహ్మణ తర్లా. వారు దేవాంగులు.
ఆమే, రంగారావు చాన్నాల నుంచి ప్రేమించుకొంటున్నారు. ఇప్పుడు రంగారావు ఆమెని పెళ్లి చేసుకోనన్నాడట. రంగారావు కాలింగి. అతనికి వాళ్లింట్లో వేరే సంబంధం చేయటానికి పూనుకున్నారట. అందుచేత, ఆమె ఉదయాన్నే రంగారావు ఇంటిముందు కూర్చొని సత్యాగ్రహం మొదలెట్టింది.
‘పిల్ల బాగుందే’ అని ఒకరూ, ‘కులం కాని వాళ్ళతో ప్రేమేమిటీ’ అని మరొకరు కామెంట్లు. లోపల్నించి ఆడ నారాయణ ఏడుపులు, పెడబొబ్బలు. రంగారావు తలిదండ్రులిద్దరి పేర్లూ – ‘నారాయణే.’ అంచాత, భార్యా భర్తల్ని – ఆడ నారాయణ, మగ నారాయణ – అని వేరు వేరు గా పిలుస్తారు.
కోదండరావు క్లాస్మేట్ ననే చనువు తో తలుపు తట్టేను. చాలా సేపటి తర్వాత, ఆడ నారాయణ తలుపు తీసింది, కొంగుతో ముక్కు తుడుచుకుంటూ. నెమ్మదిగా లోనికెళ్లేను.
రంగారావు కుర్చీలో బుగ్గలేలాడేసుకుని కూర్చొనున్నాడు. మగ నారాయణ, బోని పెట్టెమీద ముడుకులకి తువ్వాలు కట్టేసుకుని గోడకి జేరబడి కూచునున్నాడు. రంగారావు తమ్ముళ్లిద్దరూ క్రింద కూర్చోనున్నారు. ఒకిద్దరు వూళ్లో వాళ్లూ వున్నారు. ఆడ నారాయణ మళ్లా ఏడుపు మొదలెట్టింది.
‘ఓర్నాయనో! ఏం బుద్దులు రా నీవి? ఆ కులం గాని దాంతో సరా గాలేట్రా నీకు? ఇంటిమీదికి ఈ తగువులేంట్రా అయ్య!’
‘ఓలమ్మో! వూరికోయే! ఏటి సెయ్యాలో ఆలోచించాలి గానీ, ఏడుపులేటి!’ అని ఎవరో గదిమేరు.
అక్కడ కాసేపు కూచుని ఏమీ తోచక బయటికొచ్చేశాను. బయట జనం అలాగే ఉన్నారు. గరికమ్మ గడ్డికుప్ప లాగ కదలకండా అలాగే కూచునుంది. గడ్డం పై చెయ్యి పెట్టుకునీ, కొంగుతో మూతి మూసుకునీ – ఆడవాళ్లు అక్కడ చుట్టూ నుంచోనున్నారు ఆమె వైపు చూస్తో.
శనివారం వొంటి పూట స్కూలుకి టైమవుతోందని నేను ఇంటికేసి దారి తీసేను. ఇంటికొచ్చి స్కూలుకి బయల్దేరుతుంటే నాన్నమ్మ కొత్త సమాచారాన్నందించింది. గరికమ్మ రంగారావు పనిచేస్తున్న స్కూల్లోనే టీచరు. గరికమ్మ వాళ్ళన్న చీరలు గొప్ప బాగా నేస్తాడట. వీరందరూ చీరలు అతని వద్దే కొంటారట. అంటే, వ్యాపార చుట్టరికముందన్నమాట మాతో అనుకున్నాను.
మధ్యాహ్నం ఒంటిగంట బెల్ కొట్టీసరికి, స్కూలొదిలి కాళ్లు ఎగరేసుకుంటో ఒక్క వుదుట్న ఊరు చేరేను. బల్ల మీద పుస్తకాల సంచి పడేసి నారాయణ వాళ్లింటి వైపు పరుగు పెట్టేను. నే వెళ్లేసరికి అక్కడ జనమంతగా లేరు. ఒక నలుగురు ఆడవాళ్ళు మాత్రమున్నారు. వారు మా వూరి వాళ్ళే! గరికమ్మ గోడకి జెరబడి కూచునుంది.
ప్రేక్షకుల్లోంచి ఒకామె – ‘పొద్దున్నించీ ఏమీ తిన్లేదు. తాగ లేదు. రెండు మెతుకులు తినమ్మా. నేను తెస్తాను’ అంది.
గరికమ్మ తిననని తల అడ్డంగా తిప్పింది.
నేను తలుపు తోసుకుని లోపలికెళ్ళేను. హాల్లో ఎవరూ లేరు. లోపల మంచం మీద రంగారావు నిద్ర పోతున్నాడు. ఆడ నారాయణ వంట కావిస్తోంది. మగ నారాయణ పొలం పనేదో పడి కొడుకుల్తో వెళ్లేడట. కార్యక్రమాలన్నీ పెరడు ద్వారం గుండానే కానిస్తున్నారని అర్థమైంది. అంగటి ద్వారానికి గడియ వేసి వుంచేశారన్నమాట.
రంగారావు ఇంటిమీదకి ఎంత ఉపద్రవం తెచ్చేడో నారాయణత్త నాకు చెప్పడం మొదలెట్టింది.
‘నీవు చిన్నోడవే గాని, నువ్వే చెప్పరా అయ్య, కులం గాని పిల్లని ఇంట్లోకి ఎలాగ తెచ్చి పెట్టుకుంటామో చెప్పరా?’ అంది.
‘చూట్టానికి మంచి అమ్మాయి లాగే వుంది గదే అత్తా! ఇద్దరూ ఒక దగ్గిరే పని చేసుకుంటున్నారు. వాళ్లన్న చీరలు బాగా నేస్తాడటగా. మీరంతా అతని వద్దే చీరలు కొంటారటగా?’ అన్నాను.
‘పిల్ల మంచిగున్నా – ఆళ్ల పిల్లని మనింట్లో ఎలా పెట్టుకుంటాం రా? కులం చూడమా?’ అంది. విషయం తెగదని పించింది. బయటికి నడిచేను.
సాయంత్రం మామిడి తోటకి వెళ్తో అటేపు చూసేను. గరికమ్మ నిశ్చలంగా ఆ అరుగుమీద అలాగే కూర్చునుంది. దారంబడి వెళుతున్న వాళ్లు ఆమెని చూస్తో సాగిపోతున్నారు. నారాయణ వాళ్ళ అంగటి ద్వారం అలాగే మూసి వుంది. ఆ ఇంటి ఎదురింటి అరుగుమీద నలుగురు మగాళ్లు చేరి కబుర్లాడుకొంటున్నారు, అపుడపుడూ ఈమె వేపు క్రీగంట చూస్తూ. చిన్న ఆవు దూడ ఆ ఇంటి ముందు అటూ ఇటూ గంతులేస్తూ పరిగెడుతోంది.
నేను తోట నుండి వెనక్కి తిరిగి వచ్చేసరికి సాయంత్రం చీకట్లు ముసురు కొంటున్నాయి. పగటిని నెమ్మదిగా ఆక్రమించుకుంటోన్న ఆ సంధ్యా సమయం మనసుని విచారంతో కప్పేస్తున్నట్లనిపించింది. ఆమె రాత్రంతా ఎలా ఉంటుందో? దుప్పటైనా లేదు. ఓ చాపైనా ఇస్తారా ఎవరన్నా….
తెల్లారింది. ఆదివారం. నేను ఇంట్లోంచి అంగటి వీధి కొచ్చినప్పటికి ఊరంతా అతలాకుతలంగా ఉంది. ఉదయమే పశువుల సాల వూడ్చుకోవటం, బయట వాకిలి తుడుచుకోడం లాంటి పన్ల మీద వుంటారు కాబట్టి – మాట్లాడుకోడానికి ఆ సమయం అనువుగా వుంటాదేమో – వీధంతా ఆడవాళ్లు ముగ్గురు, నలుగురు చర్చల్లో మునిగున్నారు. ప్రక్క వీధి వాళ్లు కూడా వచ్చి చర్చల్లో పాలుపంచుకుంటున్న దాఖలాలు కనపడుతున్నాయి.
బిర్లంగి నారాయణ యింటి వద్ద సీను కొంచం ఉద్రిక్తంగా వుంది. గరికమ్మ నిన్నంతా తినలేదు. నీరు ముట్టలేదు. రాత్రి నేలమీద చేర బడలేదు. కన్నుముయ్యలేదు. ఆమెది ఒకటే మాట – ‘నన్నెందుకు పెళ్లి చేసుకోడు, నేనేం తప్పు చేసేను’ – అనే.
తెల్లారినప్పటికి ఆమెలో నీరసం పెరిగి పోయింది. పెదాలు ఎండి పోయేయి. ముఖం పాలి పోయి నిద్ర లేని కళ్లు సగం మూతలు పడుతున్నాయి.
‘తిండి నేదు, రాత్రి నిద్దర్నేదు. ఏటై పోద్దో పిల్ల. ఎవురికీ ఏటీ పట్టదా? ఇది వూరా? వల్లకాడా?’ ఒకామె గట్టిగా అరుస్తోంది. గడియ పెట్టేసుకుని ఇంటిలోపల ఉన్న వాళ్ళ మీద జనం కోపం కనపడుతోంది.
‘ఆ రంగారావేటై పోనాడు ? మొగోడు బైటికొచ్చి ఏమాటో అనొచ్చు గదా?’ మరో స్త్రీ గొంతు.
చిత్రమేమంటే గరికమ్మ తరఫు వారెవ్వరూ అక్కడ లేరు. వాళ్లు రాకూడదనుకున్నారో, ఊరు కాని ఊరి కెళ్తే మాట చెల్లదనుకున్నారో? పరువు నిలదనుకున్నారో? ఐతే, ఆడపిల్లకి మా వూళ్లో అపకారం జరగదని వాళ్లకి తెలుసు.
మధ్యాహ్నమైంది. జనం పల్చబడ్డారు. గరికమ్మ నెవరూ ఓ మాటన్లేదు గానీ, కొంత మంది – రంగారావు తో చదువుకున్న వారు, అతని సీనియర్స్ – రంగారావు వాళ్లింటికెళ్లి అతనితో విషయం మాట్లాడేరని చిన్నమ్మ చెప్పింది. వాళ్ళ వెర్షన్ ఏమంటే –
‘ఆడ్ని ఏమడిగినా బెల్లం కొట్టిన రాయి లాగ ఆ మూల కూచుండి పోనాడ్రా! అవుననడు, కాదనడు. మరలాంటోడు ప్రేమ అనికోని దానెనక ఎందుకు పడాల? ఎలగైనా అన్నదమ్ములందర్లోన ఆడే మెతకోడు.’
విషయమెటూ తేలడం లేదు.
సాయంత్ర మైంది. తీరిక సమయం గదా? మరలా జన ప్రవాహం మొదలైంది. ఈ సారి మా ఇంటివరకూ లైను పెరిగింది. అంటే వీధి వీధంతా జనమే. ఊర్లో అందరూ అక్కడే వున్నట్లున్నారు. నేనూ, నా స్నేహితులూ రాంమంటపం అరుగు మీద కూచొని ఈ విషయమే మాట్లాడుకొంటున్నాం, మందిరం వెనుక రావి చెట్టు ఆకుల చప్పుడు వింటో.
ఇంతలో నారాయణ వాళ్ళింటి వద్ద ఏదో అలజడి – జనాలు తోసుకుంటూ ముందు కి వెళ్తున్నారు. మేం వాళ్ల భుజాలు, తలల మీదనుండి దూకుతో ఆ గడప వద్దకు చేరేం.
గరికమ్మ కళ్లు తిరిగి పడిపోయిందట. ఆమెని కూచోబెట్టి నీళ్ళతో మొహం తుడుస్తుందొకామె. మరో ఆమె త్రాగటానికి నీళ్లందిస్తే, చేత్తో తోసేసి మూతి తిప్పేసింది గరికమ్మ.
‘ఏమైపొద్దో పిల్ల! ఏటీ అన్నేయం’ ఒక ఆడ గొంతు గట్టిగా.
ఒక్క సారి గుంపులో ఉన్న వారు దూరం దూరం గా జరుగుతున్నారు. ఎదురింటి గడప మీద కూచున్న లుంగీ రాయుళ్లు గబ గబా అరుగు దిగి తువ్వాళ్లు భుజాల మీదికి విసురుకుని ఇటు వైపు వచ్చేరు. కారణం – దువ్వాడ కిష్టమూర్తి నాయుడు అక్కడికి రావడం.
అతను వూళ్లో పెద్ద. తగువు సంగతులు అతని చెవిన పడ్డట్టున్నాయి. విషయం దారి తప్పిపోతుందని అనిపించిందేమో – నారాయణ వాళ్ళింటి దగ్గరికి వచ్చేడు. మగ నారాయణ ఇంట్లోంచి కుర్చీ తెచ్చి వేసేడు. అక్కర్లేదని చేత్తో సైగ చేసి, అక్కడ నుంచొని గరికెమ్మని అడిగేడు విషయమేమిటని.
ఆమె కథని నాలుగు మాటల్లో చెప్పేసింది కరాకండిగా.
‘చాన్నాళ్లనుండి మేమిష్టపడ్డాం. నాకు రంగారావే కావాలి. నేనేమైనా తప్పు చేస్తే చెప్పమనండి. ఈ పెళ్లి కాక పోతే నేను బతకను’ అని.
జనం నిశ్శబ్దం గా వింటున్నారు. ఓ రెన్నిమిషాలు కృష్టమూర్తి నాయుడు కుర్చీలో కూర్చున్నాడు. చివరికి –
‘ఆ రంగారావుని బయటికి రమ్మనండి’ అన్నాడు. రంగారావు బయటికొచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు.
‘ఈమంటే నీ కిష్టమేనా?’ నాయుడు అడిగేడు. అవునని రంగారావు తలూపేడు.
‘ఓర్నాయనో! నా కొంప ముంచీసేవు గదరా కొడుకో!’ అని వెనక నుండి రాగాలు మొదలెట్టింది ఆడ నారాయణ.
‘నువ్వూరుకోయే’ అని గదమాయించేడు ఆమెని కృష్ణమూర్తి నాయుడు. రంగారావు కేసి చూసి –
‘సరే మీరిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి, మీరు బయటికెళ్లి పెళ్లి చేసుకోండి. ఐతే, ఈ వూర్లో మీరుండొద్దు, రావొద్దు’ అని చెప్పేసి వెళ్లి పోయేడు. ఆడ నారాయణ ఎందుకో మరి పెడబొబ్బలు పెట్ట లేదు.
కాస్త చీకట్లు కమ్ముతుంటే – చేతిలో సంచి తో, నెమ్మదిగా నడుస్తున్న గరికమ్మకి వూతమిస్తో – రంగారావు ఆ రోజే వూరునుండి వెళ్లేపోయేడు.
ఆ మర్రోజే తెలిసిన సమాచారమేమంటే – వారిద్దరూ రిజిస్టరు మేరేజీ చేసుకున్నారనీ, బ్రాహ్మణ తర్లాలో కాపురం పెట్టారనీ. మా ఊరికన్నా, బ్రాహ్మణ తర్లాలో చాలా రకాల కులాలున్నాయి. అందుకనేమో అక్కడ పెద్ద పట్టింపు వున్నట్టు లేదు. ఆ పిదప కొద్ది సంవత్సరాలకే రంగారావు, గరికమ్మ మా ఊరు చాలా సార్లు వొచ్చేరు. ఆడ నారాయణ తెల్లటి పుచ్చపువ్వులాంటి మనవరాల్ని ఎత్తుకుని వీధి వీధీ తిరిగిందిని నేను వేరే చెప్పక్కర్లేదు.
—
29 మార్చి 2026

