చోరీ!

Spread the love

బ్రహ్మముహూర్తపు వేళ దొంగ వొకడు ఆలయ గర్భగుడిలోకి దూరాడు.

అమ్మవారు ధగద్ధగలతో మెరిసిపోతోంది. ఆమె వంటిమీది ఆభరణాల వెలుగుతో ఆ ప్రదేశమంతా దీపాలు వెలిగించకుండానే కాంతివంతంగా వుంది.

రెండు చేతులతో అమ్మవారి పాదాల్ని ముట్టుకొని కళ్ళకు అద్దుకొని తాకిన తన చేతుల్ని ‘మ్చ్’ అంటూ ముద్దుపెట్టుకున్నాడు దొంగ.

అమ్మవారు చూస్తుండగా ఆమె వొంటిమీది వొక్కో నగ వొలిచి గుడ్డలో వేస్తున్నాడు, తప్పితే ఆమె కళ్ళలో కళ్ళు కలపలేదు.

దొంగ ఏకాగ్రతతో తన పనిలో తాను నిమగ్నమై వుండగా, ‘నీకు భయం లేదా?’ అడిగింది అమ్మవారు.

‘అమ్మ దగ్గర యెవరైనా భయపడతారా?’ అన్నాడు తప్ప, తను చేస్తున్నపని ఆపలేదు దొంగ.

‘మీ అమ్మ నగలైతే నువ్వు యిలాగే దొంగతనం చేస్తావా?’ అడిగింది అమ్మవారు.

‘లేదు, అమ్మ కదా అడక్కుండా యిస్తుంది, యివ్వకపోతే గొడవపడితే యిస్తుంది. కాదంటే పెళ్ళాం బిడ్డల్ని తంతే చూడలేక వున్న పిసరేదో పడేస్తుంది, నీ చావు నువ్వు చావు అంటుంది. అయినా నాకు అమ్మే లేదు…’ తేలికగా అన్నాడు దొంగ.

‘దేవుడి సొత్తు దొంగాలాడితే పాపం కదా?’ అంది అమ్మవారు.

‘ఈ సొత్తు పాపందో పుణ్యందో నాకన్నా నీకే యెరుక. భక్తుల పాపపుణ్యాలు లెక్కలుగట్టి తీసుకుంటే గుళ్ళన్నీ మా గుడిసెల్లాగ అయిపోతాయి, అప్పుడు దొంగతనానికి యిక్కడికి వచ్చుందునే కాదు…’ అని ఆగి, మళ్ళీ అన్నాడు. ‘పెళ్ళాం బిడ్డల్ని ఆకలితో పస్తులుంచినా పాపమే!’

‘అదికాదు, యెవరి యింటికో కన్నం వెయ్యడం మానేసి యిలా గుళ్ళో దూరితే, రేపు ప్రజలు యేమనుకుంటారు?’ అడిగింది అమ్మవారు.

‘అమ్మవారికి శక్తి లేదు అని మాత్రం అనుకోరు…’ అన్నాడు దొంగ, ఆమె కాలి వెండి పట్టీలు తీస్తూ.

‘రేపు నిన్ను పోలీసులు పట్టుకొని సొత్తంతా రికవరీ చేస్తే?’ అమ్మవారి మాటకు ‘నీ మహిమనుకుంటారో లేదో నాకు తెలీదు, కాని సొత్తంతా రికవరీ చేసినా నీకయితే పోయినదంతా అంతా తిరిగి రాదు,’ పాత అనుభవంతోనేమో నమ్మకంగా చెప్పాడు దొంగ.

ఆ మాటకు అమ్మవారు కొద్దిసేపు నిశ్శబ్దంగా వుండిపోయింది.

అప్పుడే దొంగ అమ్మవారి చెవిరింగులూ ముక్కుపుడకా చాలా నెమ్మదిగా తీస్తుంటే, ‘వేరే మనుషులెవరూ దొరకలేదా? నేనే దొరికానా?’ అని అడిగింది అమ్మవారు.

‘మనుషులైతే యిలా వొలిస్తే వూరుకుంటారామ్మా… ఆలు మీలా కదలకుండా బుద్ధిగా వుంటారా? అటు లాగుతారు. ఇటు లాగుతారు. ఆ కంగారులో చెవిలోవో ముక్కులోవో లాగితే కుట్లు తెగి రక్తమొస్తుంది. ఆ రక్తంచూసి యేడుస్తారు. మొత్తుకుంటారు. కళ్ళుతిరిగి పడిపోతారు. అప్పుడు మనమే ఆల మొకాన నీళ్ళు కొట్టాల. కాదంటే అరుస్తారు. కరుస్తారు. తిరగబడి పట్లు పడతారు. తెలుసా, అసలు దొంగతనం చేశామన్న ఆనందమే వుంచరు. అంత వయిలెన్స్ అవసరమా తల్లీ?’ అన్నాడు దొంగ.

అమ్మవారికి నోట మాట రాలేదు. బేలగా చూసింది.

నగలన్నీ మూటకట్టుకొని వెళ్ళబోతూ అమ్మవారిని చూసి ఆగిపోయాడు దొంగ. నిరాడంబరంగా వుండడం చూసి ‘యిప్పుడు నువ్వు అచ్చం మా అమ్మలాగ బోడిగా వున్నావు. నీలాటి తల్లులు భూమ్మీద యెంతోమంది వున్నారు. ఈ బంగారం నీ వొంటిమీద వుంటే యేటి… మా యింటిల్లిపాదీ కడుపులో వుంటే యేటి?’ దొంగ మాటకి అమ్మవారు మూగదానిలా చూసింది. ఒక్క క్షణం ఆగి ‘ఆడోళ్ళకి బంగారం అంటే ప్రాణం. నువ్వు దేవుడివైనా ఆడదానివి. బెంగెట్టుకోకు, భక్తులు నిన్నిలా మా అమ్మలా చూడలేరు. ఆల ఆమ్మకి ఆలు కొత్త నగలు చేయిస్తార్లే’ అనేసి వెళ్ళిపోయాడు దొంగ.

కొనమాట అమ్మవారి చెవుల్లో గింగిరాలు తిరిగింది.

నగలు లేని అమ్మవారికి భారం దిగినట్టయి వొళ్ళు యెందుకో చాలా తేలికగా అనిపించింది?!

బమ్మిడి జగదీశ్వరరావు

Spread the love

3 thoughts on “చోరీ!

  1. కథ చదువుతూ ఉన్నప్పుడు కలిగే ఆలోచనలు వేరు. కథ పూర్తయ్యాక వెలిగే ఆలోచనలు వేరు. ‘ చోరీ‘ కథ అలానే అన్పించింది.
    దొంగ అమ్మవారు సంభాషణ సమాజ చిత్రణకు దర్పణం.
    నగలు లేకుండా చూడలేరు. ఆళ్ళ అమ్మకు కొత్త నగలు చేయిస్తారు అనే వాక్యం ఎంతో ఆలోచన కల్పించింది. గుళ్ళో అమ్మవారికి అభరణాలు లేకపోతే చూడలేని వారు.. తోటి మానవులకు అన్నం లేకపోయినా పట్టించుకోని వైనాన్ని ఎత్తి చూపింది.
    రచయిత జగదీశ్వర రావు గారికి అభినందనలు

  2. చోరీ కథ చిన్నదే అయినా అనేక ప్రశ్నలు లేవనెత్తిన
    కథ. జగదీశ్వరరావుగారికి అభినందనలు.

  3. ‘ఈ సొత్తు పాపందో పుణ్యందో నాకన్నా నీకే యెరుక. భక్తుల పాపపుణ్యాలు లెక్కలుగట్టి తీసుకుంటే గుళ్ళన్నీ మా గుడిసెల్లాగ అయిపోతాయి, అప్పుడు దొంగతనానికి యిక్కడికి వచ్చుందునే కాదు…’ అని ఆగి, మళ్ళీ అన్నాడు. ‘పెళ్ళాం బిడ్డల్ని ఆకలితో పస్తులుంచినా పాపమే!’” ఈ వాఖ్యతో కథకుడు సారాంశం ఏం చెప్పాలనుకుంటున్నారో వివరం తెలుస్తోంది.
    రచనలో సూటిదనం స్పష్టత సంక్షిప్తత చాల ఆకట్టుకున్నాయి. చేయి తిరిగిన రచయితలు తమ కంటెంట్ ను విస్తృత పరచటం పకడ్బందీగా అల్లటం బాధ్యతగా భావించాలి. ఈ నిర్లిప్తత తెలుగు కథకులకు మూడు తరాలుగా వెంటాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *