నదికి కులం లేదు మతం లేదు
అంతం లేదు సరిహద్దులసలే లేవు
నిరంతర ఆత్మీయ ప్రవాహ వాహిని
మనుష్యుల ద్వేషాలకు అంతరాలకు
అతీతమైన ప్రేమమయి
అనురాగాల స్నేహమయి --------
దాహం తీర్చేను
సేద్యం చేయించేను
ఆకలి మాపేను
నాగరికతకు దారులు వేసేను --------
ప్రవాహంలో సాగేను
ఒడిదుడుకుల జీవిత నావ
ఆటుపోటులకు అలసినా
వయస్సుతో వంగినా
మిణుకుమిణుకుమనే ఆశతో
ఎదురు చూస్తూ ముందుకు సాగే నౌక ------
సుదూరంగా ----
వర్షపు అమృతధారలు
అనేకానేక ఇంద్రధనుస్సుల రంగులు
మెరుపులు వెలుగులు
అది సమ సమాజ తేజమా?
అసమానతలు కానరాని
విభేదాలు వైషమ్యాలు లేని
భూతల స్వర్గమా?
ఓం నదీమ తల్లీ!
నీ వ్యక్తిత్వానికి ప్రతిరూపమైన
ఆ ఒడ్డుకు పడవను చేర్చవా?
అదంతా భ్రమేనా?
తీరని కోరికేనా?
చేరుకోలేని ఒయాసిస్సేనా?
చరమాంకం లో కరిగిపోయే కలేనా?
తళుక్కున మెరిసి అదృశ్యమయ్యే మరీచికేనా?

శాంతిశ్రీ బెనర్జీ
శాంతిశ్రీ బెనర్జీ గుంటూరు లో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ., వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డిల్లీ లో ఎమ్.ఫిల్., చేసారు. తీన్ మూర్తి భవన్, డిల్లీ లో నెహ్రూ కి సంబంధించిన 'సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ' ప్రాజెక్టు లో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. అవి వివిధ ప్రింట్, వెబ్ పత్రికల్లో ప్రచురించ బడ్డాయి. 2022లో వారి కథా సంపుటి 'మానుషి', కవితా సంపుటి 'ఆలంబన' వచ్చాయి.


