ఓ చెప్పీ చెప్పని కథ

Spread the love

ఒక సాయంత్ర వాన దీర్ఘ దేహం తో ఓదారుస్తున్నప్పుడు కనిపించని ఓ పురుష శత్రవు చేసిన హత్యలా

సూర్యుడి ఎర్రబడ్డప్పుడు ఆమె బయలుదేరినా … అంతలోనే  నల్లని బట్ట ధరించి  శోఖ ముద్రలోకి మారి చనిపోయిన తన ఆత్మ కోసం ఏడ్చే స్త్రీ లా … ఆకాశం పొగతో చిక్కబడి.. ఒక్కసారిగా మొదలైన వర్షం… అది మరో సంతాప గారడీ…

ఆమె ఒక ఫుల్ బాటిల్ … కొన్ని వైట్ పేపర్లు తో వచ్చి … నేను ఓ కథని తీసుకొచ్చా అంటుంది. మంచం పక్కగా తన చాపని పరుచుకొని దాని పైకి ఒరిగి మొదలుపెడుతుంది. వాన కాస్త తన సందడి తగ్గించుకొని … మరింత చల్లని సముదాయ క్షేత్రంలో పడి తలమునకలై నిండా చెప్పుకొన్న నివాళి మూర్తులని కడుగుతూ … నిద్రని వదిలి మృత్యు నిందలని తీసుకొని

వేళ కానీ వేళలో సముద్ర సమ్మోహవ కలల రాత్రుల్ని మూటకట్టుకొంటూ …

కొన్ని నెలల క్రితం;

పేరు ప్రతీక్ష అన్నప్పుడు … వినయ్ నవ్వి … దేనికైనానా ? అన్నాడు .

ఆమెని చూసిన ఎవరికైనా శతాబ్దాల దుఃఖ వర్ణ సముదాయాలు గడ్డ కట్టినపుడు ఏర్పడిన పర్వతాలు.. తమ నివాళి క్షేత్రంలో వింటున్న పాటని ఎవరో దొంగిలించాక… దిగులు తుడిచినా తనని చూసి… గొంతులోకి… లోయల రహస్య మాత్రని మింగించి … చలన కీర్తన చేసిన దృశ్య బిగువుని వడపోసిన శరీరం తో గాజుల జతని తాగి… మరింత నల్ల నాజూకూ సందడి మోసిన వీధిలో … పలుకుకి చుట్టిన దీర్ఘ నిద్రలో … మంచు కునుకులా …. తను… ఎటో తప్పిపోయినట్లుగా అనిపిస్తుంది.

కుంకుమ వర్ణపు పాలలో లేత చంద్రుడిని ముక్కలు చేసి కలిపి… వాన గొడుగు కింద వెలిగించిన దీపం లా చాలా అలవాటు లేని కొత్త నవ్వుతో… దర్శన జరిగాక… మనం వెనక్కి రాలేదని రోజుల తర్వాత అర్ధమౌతుంది.

దేనికీ కాదు అంది సీరియస్ గా… పౌర్ణమికి పుట్టిన ఆపిల్ తోటలా ఉన్నావ్  అన్నాడు.

ఆమె సారీ చెప్పింది. నాకొక ముద్దు కావాలి అంది.. అతను ఒప్పుకోలేదు.

నా పెదాలకి ఈ రోజు సంతాప దినం.. ఉపిరి చనిపోవచ్చు… ఫర్వాలేదా ? అన్నాడు.

నాన్న ఎప్పుడో చంపేశారు… బ్రష్ వదిలి ఈ స్టెతస్కోప్ ని ఆయనే పట్టించింది..

చనిపోయాడు. నాకు చావుని మొదటగా పరిచయం చేసింది ఆయనే … పెద్ద సర్జరీ successfulగా కంప్లీట్ చేసి … రిలాక్స్ గా  కుర్చీలో కూర్చునే 86 ఏళ్ళ వయసులో చనిపోయాడు.. అది ఆయన మాత్రమే చేయగల బ్రెయిన్ సర్జరీ… ఆఫ్-ది రికార్డ్స్ చేశారు.

తనేం చెప్పదల్చుకొన్నాడో అది చెప్పకుండానే చెప్పాడా? అనిపిస్తుంది.. అప్పటికి అమ్మ ఆయనని వదిలేసి 35 ఏళ్లయింది. వదిలేయడమనేది .. బుద్దుడి అర్ధరాత్రి నడక లాంటిది కాదు అమ్మకి… చాలా మంది బంధువులని.. స్నేహుతులని…అతని ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిన జాబ్ ని అన్ని వదిలేసి.. ఓ ఆడపిల్ల తో లైఫ్ ని రీస్టార్ట్ చెయ్యడం. అదీ చాలా గొప్ప జ్ఞాన దర్శన … నలుగురికి పైకి కనిపించనిది.

ఇప్పుడు నాక్కావలిసింది… ఆయన అజ్ఞాపకంగా మారడం.. అది నువ్వు చేయగలవా?

వినయ్ జ్ఞానాన్ని పొందిన రాత్రే అడివిలో తప్పుకు పోయి ఏళ్ళకి ఏళ్ళు ఒంటరిగా తిరిగి భాషని మర్చిపోయిన వాడిలా ఎక్కువ మాట్లాడడు… తడుముకుంటూ… పదాలని పేర్చుకోవడానికి కష్టపడుతూ … అప్పుడప్పుడు అంతే… ఇప్పుడు తల మాత్రమే సగం ఊపాడు.

సమాధి కి ఎప్పుడు వెళ్లిన… కాగడాల జాము లోంచి చనిపోయిన నది పెళ్ళికి ముస్తాబై వెళ్ళుతున్నట్లు . ఓ కోర్స్ మెడిసిన్ అక్కడ పెట్టి వస్తుంటాను…. అంతే …

  ఐతే మనముద్దు అక్కడే అన్నాడు. అప్పుడు  వర్ష రాత్రిని మింగిన దీపంలా అతని కళ్ళు మెరుస్తున్నాయి.

 మర్నాడు వెళ్ళాం.. తను నా తలని మెడ ఒంపు లోకి దాచుకోవాలని… మా దేహాల మధ్యలో ఒక రహస్య వాసి … తన దుఃఖ తెరని విప్పుకొని .. లేవలేని నిస్సుత్తుతో నింపుకున్న.. హఠాత్ తూఫాన్ కమ్మిన నరాల్లో మరో చింతని మింగిన అలజడిని జల్లిస్తూ … తను చురుగ్గా చూసిన .. ఒరిపిడి రాగ దర్శనాన్ని కప్పుకున్ననొప్పి తో… పెదాలు గుహల సంతర్పణకి నూనె పోసి కాగడాలని వెలిగించే తొందరలో తడుముకొంటూ….

 ఈ లోపు పైనుంచి చెట్టు పెద్ద కొమ్మ విరిగి అతని తల మీద … వెంటనే కోమాలోకి… ఓ కలలో నాన్న కనిపించి … షవర్ కింద ఏడుస్తున్నాడు. అమ్మ వదిలిపెట్టి వెళ్లిన మొదటి రోజు రాత్రి ఏడ్చినట్టు…..

నేనూ పరుగున వెళ్లి … వినయ్ తలని ఒడిలోకి తీసుకొని … అతని కలలోకి తప్పిపోయి … మూడు ఏళ్ళ తర్వాత ఇద్దరం బయటపడ్డాం.  మళ్ళీ స్మశానం .

దుఃఖం ఓ అనంతర దర్శన .. మూసుకుపోతున్న కొండవాలులో … ఓ సాయంత్ర నిర్దేశకుడి శ్వాస సంధిని వద్దని కూల్చుకొన్న చివరి సందేశంలా లోపల తిరిగి .. కొంచెం అమాస కరిగించిన మెళుకువని మూస్తూ … పడిపోయిన దీప స్తంభం కిందుగా తను ఏడవడం … మరెవరూ ఓదార్చడానికి  మిగలకపోవడం … దీనిని మించి … విషాద గోళం దొరకదని తప్పిపోయాక … నిస్త్రంతా గర్వం సద్దుమణిగిన ఘోషని తడుముతుంది .

 స్మశానం లో ఈసారి చెట్లే లేవు… ఓ కాంక్రీట్ జంగల్ అంతే … మెడిసిన్ kitని  వినయ్ విసిరి కొట్టి.. సమాధిని పగలగొట్టాడు.

నేనప్పుడు అసలు ఏంచేయాలనుకొన్నానో ఇప్పటికీ తెలియడం లేదు..అదొక  ఆకస్మిక ఒత్తిడి … పెద్దగా ఊహించడానికి లేని ప్రవ్రుత్తి … అదేo అసంకల్పితం  కాదు… అలోచించి చేసిందే అని అతనంటాడు అనుకోలేదు..కానీ అతనలానే అన్నాడు.

 అప్పుడు అలానే … రాత్రికి abortion జరిగినట్లు వర్షం.

ప్రస్తుతం;

అతను ఆమె వేపు విసుగ్గా చూసి .. నాకు నీ మీద ఎటువంటి ఇష్టము లేదు. ఇక ఆ కథని అంగీకరించలేనేమో… ఆమె కళ్ళలో నీళ్లు. పోనీలే .. ఈ ఒక్క రోజేగా … ఆ తర్వాత ఎలానూ ఇద్దరి దారులు వేరు వేరు..

సమయం నల్లత్రాచు పై పాకుతున్న గుప్పెడు ఇసుక గుండెల శ్వాస గగుర్పులా కదులుతుంది.  ఒక్క కథని వినగలవా ? కనీసం ఓ అపరిచితుడిలా …..

నాకు రేపటి భయం ఎలానూ లేదు. నాకు తెల్సు.. నేను ఫిక్స్ అయ్యిపోయా…

అతను ఒక్కసారిగా.. తన దుప్పటిని పడవగా మార్చుకొని వెళ్లడం మొదలుపెట్టాడు. ఆమె ఓ సీతాకోకచిలుకగా  మారి ఆ పడవ పై వాలింది… పడవ ఒక్కసారిగా ఆగిపోయింది  . నీళ్ళలోకి దిగబడిపోయింది. మునిగిపోతున్న   అనుమానం అతనిలో…

కొన్ని మంచుపూలు ఆకాశం నుంచి రాలాయి. అతను ఆ సీతాకోకచిలుక ను పట్టుకొని అందులో లోపలి పెట్టాయాలనుకొన్నాడు. కానీ పట్టుకోవడం అతనివల్ల కాలేదు. ఒక్కో మంచు పూవును మెట్ల చేసుకొని ఆకాశంలోకి చేరుకొంది.

ఇప్పుడిక మహా వాక్కుగా మారే … నా గొంతుని  నువ్వు నొక్కేయలేవు.

ఇప్పుడది లక్ష శంఖాలు ఏకధాటిగా  కాలుతున్నప్పుడు జరిగిన యజ్ఞంలా ఆ గొంతు.. గంభీరాన్ని మించి .. ఇంకేదో బ్రహ్మాండం లోంచి పగులుతూ…. ముంచేస్తున్నట్లు…

నా కథ ఇక నీతో పాటు .. ఈ ప్రపంచం వింటుంది.

అతను పైకి చూసి … ముందులా ఉందాం … ఇలా అందరికి ఎందుకు? గర్భం లోంచి … మళ్ళీ సృష్టి గర్భంలోకి వెళ్లిపోయేవాళ్ళం … ఎందుకీ హడావుడి ……

ఆమె నవ్వింది… కానీ మండుతున్న బొగ్గు ముక్కలు  అతనిపై  రాలుతున్నాయి. అతను కాలడం మొదలుపెట్టాడు. ఏడుపు లేదు.. వద్దనడం లేదు.. అదేం శిక్ష కాదన్నట్లే ఉన్నాడు. ఆమె అల్లాడి పోయింది… కళ్ళలోంచి నీరు ఆగడం లేదు. ఆమె ఏడ్చే కొద్దీ మరిన్ని నిప్పులు రాలి … ఇంకా మండుతున్నాడు.

             *  * *

ఆమె ఇంట్లో రెడీ అయ్యే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది.

అద్దం లో ఓ సరస్సు నిండా వాలిన కొంగలని నమిలి తినేస్తున్న కలువలా కనిపించింది నా ముఖం నాకు నేనే నవ్వుకొన్నాను.. తనిలాగే కోరుకొంటాడు….

అపశృతే  రాగ అలంకారమని తనెప్పుడూ అనేట్లుగా…  

పార్టీ హోటల్ నుంచి కాల్స్ వస్తున్నాయి.. వచ్చినప్పుడల్లా ఆమె మనోహర్  ఫోన్ కి ట్రై చేస్తుంది … అతను లిఫ్ట్ చెయ్యడం లేదు. కాసేపటికి కాల్స్ ఆగిపోయాయి.

శౌముఖి ఫోన్ చూసి ఇప్పుడు ఎట్లా ఉంది హెల్త్… Vinay చాలా కంగారు పడుతున్నాడు. ఆ భాధ లో ఎక్కువ తాగేసాడు.. ఈ రాత్రి కి మా ఇంట్లో ఉండిపోతాడు. కార్ డ్రైవింగ్ మంచిది కాదు.

ఆమె గొంతులో ఏళ్లగా ఫ్రిడ్జ్ లో దాచి పెట్టిన కాగడాలు వెలగడానికి మారాం చేసినట్లు … ఓ కంగారు… మళ్ళీ విసుగు .. దేనినో కప్పిపుచ్చే ప్రయత్నం..

Abhay ఉన్నాడుగా ? అంది ఆమె …

Abhay నన్నెప్పుడో వదిలేసాడు … నేను సింగల్.. సరే … డ్రైవింగ్ లో ఉన్న … తర్వాత చేస్తాలే…

పుస్తకం అంతా చదివేసాక ఇంకా వెనక కవర్ పేజీ చదవాలని ఎందుకు తాపత్రయం … ఉక్కపోత

 ఒక రాత్రి ని మనమెలా ఉహించుకొంటాం ..

పెద్దగా కన్నుని నూరేంత భయం నా లోపల కదలదు. అది కాస్త పైకి కిందికి ఒదిగి చనిపోవడానికి సిద్దపడుతుంది. ఐనా ఇది కాంక్ష అనే ఓ చిన్న పదం లో ఒదగనప్పుడు ప్రేమని ఆ నిర్వచనం దగ్గరే ఎందుకు వదిలేయాలి.

తనకి ఏది ఇష్టమో అది చేస్తూనే నన్ను చేరలేడా?

అనుమానాన్ని మించి ఆశా ఘాడత … కొంచెం నిరూహ తరిమిన నుదుటిని రుద్దుకొని … జాము పొద్దులో కౌగిలిని మర్చిపోయిన నిద్ర తవ్వకాలు… ఇంకాస్త చోటు కావాలని బోరున తెర్చుకొన్న గడువు.

                                                                     ***

ఈరోజుని శకః పూర్ణిమ అంటారు…

మహోగ్ర సంధిని ఎక్కుపెట్టాక … ఆయుధం లేని ఏకాంత యుద్ధం … దేనిని మారిపోనివ్వదు.. ఊరికినే కదిలిన మాయలో ముంచి తోసేస్తుంది… తిరిగి రావడం ఎవరికి తెల్సు.. గురుత్వపాయ సముద్రంలో కలుస్తుంది.  ఇంతకంటే మంచి రాత్రి లేదు… స్వలిఖి (ఈ పేరుతో ఎందుకు పిలుస్తాడా ఎప్పుడూ చెప్పలేదు.) .. ఒక్కటవడానికి …అన్నాడు .

అగరు రాల్చిన సంక్షోభ క్షామము… ఇదే భయము కాదు… మృత్యువు అడ్డం పడదు.లేలేత చల్లని విసుగు మర్దనలు ఒళ్ళు విరుచుకొని … దీర్ఘ నిద్రలో కలని మరెవరో తీసుకుపోతూ నవ్వారని…

ఇసుక శిల ఏడ్చిన నీరు తో కనపడని మోతాదులోని క్షోభకి

 గురిపెట్టి … అంతలోనే మాట మార్చి వేరే దారిలోకి వెళ్ళిపోతుంది.

ఆమె ఏం అనలేదు.

అగ్రిమెంట్ నీ ఇష్టం… ఎన్ని clauses  ఐనా నాకు ఓకే అన్నాడు.

ఆమె నవ్వింది. ఆ భయం నాకేం లేదు. కానీ నా శరీరం ఎంతవరకు సిద్ధమయ్యిందో నాకు తెలియదు. ఇదింకా ఆ పాత శిధిలాలని మోస్తూనే ఉంది. నా పొట్ట … ఓ బస్తాడు మెడిసిన్ మోస్తున్న సంచీలా ఉంటుంది.

సగం సమయాన్ని గ్రైండ్ చేస్తూ … నిరాశ గతాల నిప్పుని ఊదుకొంటూ మరింత తెల్లనికౌగిలి పుట్టిన లీలా ముద్ర తన లోపలి శత నిద్రల పూడికని తవ్వి తీస్తూ … హోరు పెడుతున్న రసనీల కౌగిలి సృష్టిని తిరిగి ప్రశ్నిస్తూ ఆయాసం తీర్చుకొంది.

సరే … నే వస్తాను అని వెళ్లి పోయాడు తన కార్ వేసుకొని … సముద్రం దగ్గర అర్ధరాత్రి ఒంటరిగా వదిలేసి… బుద్ధుడు గయలో ఆమె కాళ్ళ గజ్జెలని పట్టుకొని ఏడ్చినట్లుగా ఉన్న పెయింటింగ్ ముందు ఆర్టిస్టులా … లోపలి చీకటిని అంత తొందరగా చదవలేం.

అప్పుడే ఇంత ఎత్తుకి  లేస్తున్న కెరటాల మధ్యలో పడవ లోంచి దిగాడు.. త్రిభువన్ … నల్లని నలుపు … తీర్చి దిద్దిన దేహం …స్పటిక శిల పై మంచుకురిసినప్పటి అందంతో నవ్వాడు.

పడవ ఎక్కేసింది.. అతను పాడుతున్నాడు… కొండలు మైధునకార్యంలో ఉన్నప్పుడు ఓ కొండ చనిపోయి సముద్రం లోకి కూలినట్లు… అతని గొంతు…

ఆమె ఏడ్చి జత కలిపింది.

పాట ఏం చెబుతుంది .. అదొక పురాతన విభ్రాంతిక జరిగిన గర్భ దోషం లోని … హద్దులులేని నొప్పి.. తెల్లగా పాలిపోయిన కన్నుని తీసుకొని … కొంచెం మట్టి సనానికై .. ఒక దేహం … రెండు నిర్వాణ క్షణాలు ఖాళీ చేసుకొన్నా రాజీల నిద్ర కథని ….

తెల్లారింది…

బోర్డు మీటింగ్ ఉంది … I  can ‘t  స్కిప్ అంది.

ఆ బిజీ రోడ్లు … అపార్టుమెంట్ల మధ్యలోంచి తప్పించుకొని… పడవ ఇంటి ముందు ఆగింది.

                                                                          ***

మళ్ళీ ఎన్ని రోజులో … లెక్కపెట్టలేదు. నా లోంచి టైం సైకిల్ ని ఎవరో మింగేసినట్లుగా … ఆ పాత ఇంటికే మళ్ళీ వెళ్లి … ఆ కాన్వాస్ ని రంగుల చెట్టు చేసి… దానికే ఉరి వేసుకొని… ఆ ఆత్మ నాలోకి మరల మింగేసి .. ఓ కొత్త దేహం తో పుట్టాలని… అలా ఎన్ని రోజులు గడిచిందో… వినయ్ చెప్పలేనన్నాడు.

కానీ చెబుతున్నప్పుడు ఒక సముద్రాన్ని కప్పుడుతున్న హోరు … పడవల నివాళికి ఉపిరి లేని చేపలు గుట్టలుగా పోగుపడి .. వాసనతో కమ్మేస్తున్నట్లు…

తనని  సౌముఖి తనలోకి కలుపుకొని … గర్భ మాత్రలతో లాక్కెళ్లి కలలో కట్టి పడేసిందని …

 వినయ్ … రోడ్ మీద ఒంటినిండా గాయాలతో కనిపించాడు. అటు … ఇటు చూసింది… ఏం కనిపించలేదు. వినిపించలేదు … కానీ … శబ్దం కన్నా భయం కలిగిస్తూ

త్రిభువన్ … ఎద్దుల బండిలా ఉన్న మోటార్ కారులో వచ్చాడు. అతనిని అక్కడున్న ఓ టెంట్ లోకి మోసుకెళ్లి … తన గుండె దగ్గర కత్తిని గుచ్చి రక్తం తీసి.. అతని గాయాలపై పూసాడు. అతని గాయాలన్నీ నయమయ్యాక … నేనటూ చూస్తే … Tribuvan గుండెల నుంచి ధారలుగా రక్తం…

హాస్పిటల్ కి వెళదామా అన్న … అతను నవ్వాడు… అది కొరికేస్తున్న మృత్యువు ముందు గజ్జె కట్టి ఆడుతున్న పిల్లలా ….  మొత్తం నగరం ఉలిక్కి పడేలా… రక్తం ఆగిపోయింది … అతను ఆ వచ్చిన బండితో ఆకాశంలోకి వెళ్తూ కనిపించాడు.

ఆ రాత్రి కొంచెం కొరుక్కుతిన్న భూమి నిర్యాణ సంతకంలా… ఓ పక్కకి ఒరిగినప్పటి నది పెట్టిన గుర్రులా.. ఉపిరి ఆరిపోయిన హిమాలయంలా వణుకుతూ … అనుభవానికి వస్తూంది.

                                                                               ***

 ఇది ఒక గ్లోబల్ విషాదం… ఆర్టిఫిషల్ అమావాస్య… తప్పని సరై… ఆకాశంలోకి ఉద్గారాలని వదిలిపెట్టె రోజు. అతని షర్ట్ buttons  ఊడాయి … అతని బొడ్డులోంచి నల్ల పొగ బయటకి వచ్చి చుట్టూ కమ్మేస్తుంది… విశ్వధారకి సముద్రం నుంచి బయటపడ్డ అగ్నిపర్వతం లా…

మనం కలుద్దామా ? ఇంత దుఃఖాన్ని భరించాలంటే నీ శరీర ఆలంబన కావాలనుకొంటా … అదోరకమైన అధికార స్వరంతోనా… కాదా అన్నది తెలియడం లేదు… ఒకవేళ అడిగినా చెప్పడు. నాకు మాత్రమే తెలియాలని లేదుగా ? అంటాడు.

నీ మైండ్ AI క్రియేటివ్ డాల్స్ ఉన్నాయిగా… మనోహర్  ? అంది.

నా శరీరమొక స్వక్రతువుల అగ్ని గుండం … బహుశా.. నీ ఆలంభనకి పనికి రాదు….అన్నాను

స్వలిఖి … నీ మాట నిజమే … సత్యమైనంత మాత్రాన మనలని అనుసరించాలనేం లేదు.. వదిలేద్దాం …  కొంచెం ముద్ద కట్టిన మగతని మింగి ఈ చోటుని వదిలిపెట్టేద్దాం.

మనోహర్ వేగంగా కదిలాడు.. కత్తి నా పొత్తికడుపులో దిగిందా ? అనుకొన్నాను. కానీ త్రిభువన్ అరుపు… నువ్విక్కడనుంచి పారిపో… అని… పరిగెత్తుతూనే  వెనక్కి చూస్తే … రోడ్ మీద నిలబడ్డ ట్రైన్… అతను రైల్లోనే … సిటీ నడి బొడ్డు రోడ్ జంక్షన్ కి ఎలా వచ్చాడు.

కేవలం నమ్మడం కోసమే ఎవరో మొబైల్ లో వీడియో రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు.

కాపాడటం అనే ఓ నిర్యాణ అవధి … పైకి కొంచెం జరిపిన మధ్య స్థలపు ముద్దు తో ఒరిపిడి యుద్దాన్ని మరిగించి ఆ మూల సరిహద్దుల చావులు రాల్చుకొని … అక్కడే మరో మృత్యు ముహూర్తం రాసిపెట్టుకొన్న కొండల మధ్య నిలువుగా కదులుతున్నాం.

                                                                                 ***

ఓ చెప్పీ చెప్పని కథ గా అమ్మ ప్రశ్న వేసిన ప్రతిసారి ఓ సన్నని మేకు పెదాలపై దిగబడుతుంది.

త్రిభువన్ తన బిడ్డ ఐనా తనకెప్పుడూ కనిపించడని చెప్పింది.

అతను ఎలా ఉంటాడో పొత్తిళ్ళలో ఉన్నప్పుడే తెల్సు. పాలు తాగుతున్నప్పుడు… మెత్తని ఆ పెదాల కదలికలో … ఆడుతున్న ఆ అరికాళ్ళు … నా స్తనాళ్ళలోంచి పుట్టినట్లు…  ఇప్పుడేమీ గుర్తులేదు. చంద్రుడు తెల్లకలువలని పూయించినట్లు ఉండేవాడు. ఇంకేమీ గుర్తు లేదు. నే వెళ్ళాలి అన్నాడు.. ఇంకా చిన్నోడేగా రాత్రయ్యేసరికి వచ్చేస్తాడులే అనుకొన్న … కానీ అదే అతని చివరి మాట. చూపు…

నా చూపులు ఇప్పుడు పక్ష వాతంతో బరువెక్కాయి.. లోపలి లోలకం శ్వాసని కొడుతుంది… కొంచెం బెంగ … కొంచెం రాలిపోయిన నమ్మకం తేలికపడటం లేదు.

అంతా తెల్సు… నాకేమి తన గురించి తెలియదని….

నా సమాధి ముందు వాడికోసం గర్భసంచీని అలానే వేలాడదీసి ఉంచుతాను.. వీడు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన వాడని నాకు తెల్సు.

తన మాట ఎప్పుడు విన్నా బరువెక్కుతాను… ఉరికంభం ముందు నిలబడి వాడు కనిపిస్తాడు. ఏన్నోసార్లు అతని చావుని… ఆ పైన ఒప్పుకోక కిందికి వస్తూ ఉంటాడని.

                                                                             ***           

ఆమె హ్యాండ్బ్యాగ్ లో శానిటోర్ నాప్కిన్ తో మొదలుపెట్టి  … చిన్న బటన్ నైఫ్ వరకు అన్నీ ఉన్నాయి.choclate చప్పరిస్తూ వినయ్  కడుపులో కత్తిని దించింది. గిరా గిరా తిప్పింది.

కానీ రక్తం రాలేదు… దీపావళి చిచ్చి బుడ్డిలా వెలుగు … ఓ నెల రోజుల పాటు ఆ వెలుగు అలానే ఉండిపోయింది.ఇద్దరూ ఒకే రూమ్ లో .. ఊరికి దూరంగా … సముద్రానికి దగ్గరగా…

త్రిభువన్ తల్చుకొంది… కానీ రాలేదు.. వినయ్  కడుపులో మళ్ళీ దించింది… ఈ సారి ఓ పిండం రాలింది. ఆమె చెయ్యి కాలింది… అరిచింది.

ఇది ఇలా మళ్ళీ చెప్పుకోవడానికి లేని నిరూప దోషం … కొంచెం మెలుకువ .. కొంచెం దాచి పెట్టిన కల .. లిపిని మోగిస్తున్న గడపలో … ఇరుక్కున్న మెరుపు ధారలుగా కలిసిపోయి వాళ్ళు ఇంకో దిశా మూర్తిని లేపి పెద్ద చప్పుడుతో మూసేస్తారు .

అతనొక తెల్లని దుప్పటిపై ఎగురుకొంటూ వచ్చాడు. కట్టు కట్టాడు. మనం ఇక్కడనుంచి వెళ్తే .. సౌముఖి వస్తుంది.వినయ్ లోకి చూసి తానూ -నేనూ ఒకటి కాదా అంది. అతను నగ్నంగా మారి … ఆమె కి అంత్యక్రియలు చెయ్యడానికి వెళ్తున్న … ఆ తర్వాత నీతోనే..

అదేమీ శ్వాస తెర  తెరిచిన ఒప్పందం కాదు. మూసిన కళ్ళ వెనుక ఇంకా చెప్పుకోని ఖాళీలని   ఓదార్చుకొని తలుపుల వెనుక ఇష్టపడే నిద్ర భోగాన్ని చిత్రించి … మరి కనిపించని చోటికి వెళ్ళిపోతారు.

స్మశానం చేరాక … త్రిభువన్ కాగడగా మారాడు. వినయ్ కడుపులో దించామన్నాడు. సౌముఖి లేచి ఆమె ని పట్టుకుని … పద … వినయ్ గాడి  శవాన్ని కాలనియ్యి అంది.

సౌముఖి నవ్వి … కాగడగా ఉన్న త్రిభువన్ ని తీసుకొని ఆమె కడుపులో పొడిచింది. అంతే ఓ అప్పడే పుట్టిన బిడ్డ ఆమె చేతుల్లో పడింది.

త్రిభువన్ మరింత నల్లగా మారి ఆమె ముందు… చేతుల్లో బిడ్డ..

ఈ చెప్పీ చెప్పని కథని అతడు చెబుతూనే చనిపోయాడు. ఒక వాక్యము కూడా మిగిలిలేదని తన సత్యం లోని దేహ కణం దాచుకొని … నేనా గర్భ నిందనే మోస్తాను… ఇంకేం వద్దు.

అతను నవ్వి … ఆమె నీ బిడ్డ … సౌముఖి నిన్ను మోసం చేసి తన కడుపులో దాచుకొంది. వినయ్ కి జరిగింది తెలిసిందని ఇంట్లోంచి బయటకు రాకుండా కట్టేసింది. అదే మాట నీకెప్పుడు చెబుదామన్న నువ్వు వినలేదు. త్రిభువన్ అతని ఆత్మే … దేవుడు తో గొడవపడి … తన ఆయుస్సుని … నీ ముందు ఉండడానికి ఒక నిమిషాన్ని ఓ year గా చేసుకొని తన ఆయుస్సు అంతా ఖర్చు చేసుకొన్నాడు.  

చివరికి తన అంత్యక్రియలు కూడా తానే చేసుకొన్నాడు.

బి.ఎస్.ఎం.కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *