మద్రాస్ మ్యుజిక్ అకాడమీ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణకి “సంగీత కళానిధి” పురస్కారం ప్రకటించగానే ఛాందసవాద సంగీత కళాకారుల నుండి పెద్దెత్తున విమర్శ, ప్రతిఘటన వచ్చింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో విదుషీ సిస్టర్స్ గా పేరొందిన రంజని, గాయత్రి తాము అకాడమీ సభని బహిష్కరిస్తున్నామని, ఆ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వబోవడం లేదని ప్రకటించారు. ఇలా ఈ జాబితాలో ప్రముఖ హరికథా కళాకారుడు దుష్యంత్ శ్రీధర్ వంటి వారు చాలామందే చేరారు. వైణిక విద్వాంసుడు చిత్రవీణ రవికిరణ్ తనకి 2017లో వచ్చిన అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీ అవార్డు గ్రహీత ఒకాయన కూడా ఈ నిరసనల జాబితాలో చేరారు. ఐతే ఈ పురస్కారం స్వీకరించేంత ప్రతిభ కృష్ణలో లేదని ఆయన వ్యతిరేకుల వాదన కాదు. అతని ప్రతిభా పాటవాల్ని ప్రశ్నించే సాహసం వారెవ్వరూ చేయలేదు. వారి వ్యతిరేకంత అంతా ఆయనకున్న సామాజిక అభిప్రాయాల మీదనే.
తెలుగు మూలాలున్న తమిళనాడుకి చెందిన 48 ఏళ్ల తోడూర్ మాడభూషి కృష్ణ తన 12వ ఏట నుండే కర్ణాటక సంగీతంలో ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని తీవ్రంగా ద్వేషించి, నిరసించి, దాని మీద పోరాడిన పెరియార్ భావజాల సమర్ధకుడు. పెరియార్ చేసిన సాంఘిక కృషి మీద పాట కూడా రూపొందించాడు. కృష్ణ తనని తాను ఓ సంగీతజ్ఞుడిగానే కాక ఓ రచయితగా, యాక్టివిస్టుగా చెప్పుకుంటారు. హిందూ ధర్మంగా చెప్పబడుతున్న దాని మీద, అయోధ్య మీద, రాముడి మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కర్ణాటక సంగీత ప్రపంచం నుండి ఎన్నో విమర్శలు వచ్చాయి.
సంగీతం “ఇంక్లూజీవ్”గా వుండాలని, ఐతే కర్ణాటక సంగీత వాతావరణం పూర్తిగా బ్రాహ్మణాధిపత్యం వల్ల అది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని, మిగతా సంగీత ప్రక్రియల్ని కలుపుకు పోవడంలేదని కూడా విమర్శించారు. ఇంక అన్నింటికంటే పెద్ద విమర్శ వంటి అననుకూల పరిశీలన ఆయన కర్ణాటక సంగీత పితామహుడు త్యాగరాజు మీదనే చేశారు. (త్యాగరాజుని కృష్ణ త్యాగరాజు అని మాత్రమే ప్రస్తావిస్తారు. మిగతా అందరిలా “త్యాగరాజ స్వామి” అనరు. తాను చేసే కచేరీలకు ఆయన పాంట్, షర్ట్ మీదనే వచ్చి కూర్చుంటాడు. ఇలాంటి విషయాలు కూడా ఆయన మీద సణుగుళ్లకి ఒక కారణం) నాకు సంగీతం గురించి అసలేం తెలియదు. విని ఆస్వాదించడమే తప్ప దాని సాంకేతికతల గురించి బొత్తిగా అవగాహన లేదు. ఐతే నాకు అర్ధమైన మేరకు టిఎం కృష్ణ ఏం చెప్పారంటే తనకి త్యాగరాజు కంపోజిషన్ కి అనుగుణంగా పాడుతుంటే తనకి రోమాంచితమైన అనుభవం అవుతుందని, అయితే త్యాగరాజు కృతులు ఆయన కంపొజిషన్ స్థాయిలో వుండదని, కంపోజిషన్ కి అనుగుణంగా పాడినప్పుడు కొన్ని గీతాల భావార్ధం ధ్వంసమవుతుందని, ముక్కలు ముక్కలుగా పాడాల్సి వస్తుందని…ఇలా వివరిస్తూ కొన్ని ఉదాహరణలు పాడి చూపించాడాయన. అంతేకాదు త్యాగరాజు కృతులలో కుల, జెండర్ ఆధిపత్య ధోరణులున్నాయని, ఆయన్నేదో ఒక దేవుడిగా భావించడం తప్పని అన్నారు. త్యాగరాజు కంపొజిషన్స్ అన్నీ ఇప్పటి కాలానికి పనికొచ్చేవి కావని కూడా అన్నాడాయన.
ఆయన గతంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద కూడా కొన్ని ప్రతికూల పరిశీలనలు చేశాడు. ఆమె గొప్పతనం కర్ణాటక సంగీతంలో ఒక పెద్ద “మిత్” (భ్రాంతి) అని, ఆమెకి వచ్చిన గొప్పతనమంతా ప్యాకేజింగ్, మార్కెటింగ్ వల్ల వచ్చిందేనని ఆమె స్వరం పెద్ద గొప్పదేం కాదనీ అన్నాడు. దేవదాసి కులంలో పుట్టిన ఆవిడ బ్రాహ్మణీకరించబడటం ఒక “ప్యాకేజింగ్”గా చెబుతూ టిఎం కృష్ణ ఆవిడ అలా కనబడకపోతే ఆవిడ అంత ప్రముఖమయ్యేవారా అని ప్రశ్నిస్తారు. ఆమెలోని దుఃఖమే ఆమెని సంగీతాజ్ఞురాలిని చేసింది అంటారు.సాంప్రదాయ పద్దతులతో కాకుండా సంగీత కళ సామాన్యులందరికి అర్ధం కావాలని ఎన్నో ప్రయోగాలు చేసినవాడు ఆయన. ఎన్నార్సి, సిఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నాడు. దేశ రాజధానిలో జరిగిన రైతు పోరాటాలకు మద్దతిచ్చాడు. ఆయన తన విమర్శలతో అధికార బీజేపీ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆయనవి అనేక అధికార కచేరీలు దేశభక్తుల దేశప్రేమకు రద్దు అయ్యాయి.
కర్ణాటక సంగీతం అందరిదనీ వాదించే ఆయన క్రైస్తవులు ఏసు మీద పాడే భక్తి గీతాలకి శాస్త్రీయ సంగీతాన్ని వాడుకోవడాన్ని ఎగతాళి చేసే వారి మీద టిఎం కృష్ణ విరుచుకు పడ్డాడు. తాను ఇకపై ప్రతి నెల ఒక పాటని కర్ణాటక సంగీత బాణిలో ఏసు మీదనో లేక అల్లాహ్ మీదనో కడతానని ప్రకటించారు. 2019 డిసెంబర్ 19న “కన్సర్ట్ ఫర్ పీస్” పేరుతో ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన అరబిక్ గీతాల్ని ఆనందభైరవి రాగంలో పాడారు. అంతేకాదు ఆ కార్యక్రమంలో ఆయన ముస్లీం టోపీ పెట్టుకొని కచేరీ చేశారు.
2016 సంవత్సరానికిగానూ టీయం కృష్ణకి, “సఫాయీ కర్మాచారీ ఆందోళన్ అధ్యక్షుడు” అయిన బెజవాడ విల్సన్ కి ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన “రామన్ మెగససే అవార్డు” ప్రదానం జరిగింది. ఆ సందర్భంలో తన సహ పురస్కార గ్రహీత ఐన బెజవాడ విల్సన్ చేసిన “అంటరాని వాళ్లమని అనిపించుకొనే మేము భ్రష్టులం. ఈ భ్రష్టులందరూ కులానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు. ఉన్నత కులాలవారికి కులాన్ని మర్చిపోయే సౌలభ్యం ఉంది కానీ మర్చీపోలేరు. నేను నా కులాన్ని గురించి ఒక్క సెకను మర్చిపోయినా సమాజం నాకు నేను అంటరాని వాడినని గుర్తు చేస్తుంది ఎక్కడైనా”అన్న ఒక వ్యాఖ్య కృష్ణలో అలజడి రేపినప్పుడు “ది స్క్రోల్” అనే ఇంగ్లీష్ మెగజైన్ కోసం ఒక వ్యాసం రాసారు. నా దృష్టిలో అదో గొప్ప వ్యాసం. నిజాయితీతో కూడిన ఆత్మావిష్కరణ, అత్యవసరమైన ఆత్మ శోధన అందులో కనబడతాయి. రెండు మూడు సార్లు చదివితే కానీ అందులోని లోతు మనకి అర్ధం కాదు. హృదయం లోతుల్లోంచి వచ్చిన భావ పరంపర అది. తనలో కుల భావనలు లేవని ఎంత అనుకున్నా బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల తనకి ప్రత్యేక అవకాశాలుంటాయని, ప్రయోజనాలు కలుగుతాయని, వాటిని గమనించకుండా, అంగీకరించకుండా తనలో కుల భావనలు లేవని అనుకోవడం ఆత్మ వంచన అని ఆయన చెబుతారు. “నాకు కులం పట్టింపు లేదు, నా స్నేహితుల్లో దళితులున్నారు, అనవసరంగా కులం ప్రస్తావన తెస్తుంటారు, అగ్ర కులాల్లోనూ పేదలున్నారు” అని మాట్లాడేవారికి సరైన దృష్టికోణం ప్రసాదించగల సత్తా ఈ వ్యాసంలోని ఆలోచనా స్రవంతికి వుంది.
సంగీతం తనని నిజాయితీగా వుంచుందని, ఒక రాగాన్ని అంతరీకరించుకున్న తరువాత తనలో అనవసర విషయాలకు తావు లేదని రాశాడాయన. వున్నది వున్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం, పైపై నగిషీలకు పోకపోవడం, సంగీతానికి తప్ప దాని చుట్టూ అల్లుకున్న మెరుగులను తిరస్కరించడం, సంగీతం సార్వజనీనం కావాలని ఆశించడం….టిఎం కృష్ణలోని ఈ సహజాంశాలు ఛాందసవాదులకు కంటగింపుగా మారాయి. ఆయన త్యాగరాజుని అవమానించాడని, ఎమ్మెస్ వంటి కళాకారుల్ని చిన్నబుచ్చాడని, సంగీత ప్రపంచంలో బ్రాహ్మణ ద్వేషాన్ని పెంపొందించాడని…ఇలాంటి ఆరోపణలతో ఆయన మీద దుమారం రేకెత్తిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుని, తమ అభిప్రాయాలకు అనుగుణంగా బతికే హక్కుని ఇస్తుంది. ఐతే ఆధునిక సమాజం ఇస్తున్న అన్ని రకాల వసతుల్ని, అభివృద్ధినీ వాడుకుంటూ కూడా సమాజాన్ని కుల, మత ప్రాతిపదికన విచ్ఛిన్నం చేసే పురాతన ఆలోచనా విధానంతో ఆలోచిస్తూ మనోభావాల ముసుగులో ఇతరుల హక్కుల మీద దాడి చేసే సనాతనులు మారాల్సిన సమయం వచ్చింది.