కుటుంబీకుల్లో – భార్యో, భర్తో, కొడుకో, తల్లో, తండ్రో, కూతురో – నిర్వ్యాపారులు, పరాధీనులై పోతే, వాళ్లని ఎలా చూసుకుంటారు? వాళ్లకి సేవలెలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ‘నేను చెయ్యక పోతే మరెవరు చేస్తారు’ అనే భావనా? ఆ సేవలో విసుగూ, బాధా ఉంటాయా? వుంటాయి. ఎందుకుండవు? సరే, అంత కష్టమున్నా– ఆ సేవ చేయగలిగినందుకు సంతృప్తి, సేవ చేయించుకుంటున్న వారి పట్ల కృతజ్ఞత కూడా వుంటాయా? అంటే ‘నీ సేవే నా భాగ్యం’ అనే భావన ఉంటుందా?
ఓ మనిషి మన మీద కొంచం ఆధార పడి బరువైపోతాడనుకున్న స్థితిలో వారిని ఏ గోదాట్లో వదిలేద్దామా అనుకుంటోన్న ఈ కాలం లో, సంవత్సరాల తరబడి అటువంటి బాధ్యతని – దేవుడి కో దండం పెట్టి – నిర్వర్తించిన ఓ తల్లి కథ ఇది.
కరోనా కాటునుండి బయట పడి, సంవత్సరం తరవాత హరిపురమొచ్చిన నాకు ఊరంతా కొత్తగా కనిపిస్తోంది. సాయంత్రం బయట మెట్ల వద్ద నుంచున్న నన్ను గౌరమ్మ పలకరించింది. కొండపల్లి గౌరమ్మ మా చిన్నప్పుడు మాకు క్షవరాలు చేసిన నారాయణ కూతురు. మా చెల్లి రాజేశ్వరి తో కలిసి హరిపురం స్కూల్లో చదువుకుంది.
‘ఎప్పుడొచ్చేవు బాబూ? సాల్రోజులైంది నిన్ను చూసి. అల్లా జంక్షన్ నుండి నడిసొచ్చేను. ఒక సిటం కూకుంటాను’ అని మా అరుగు మీద సెటిలైంది. పిదప ఆ మాటా, ఈ మాటా కదిలి సంభాషణ ఆమె కుటుంబం వైపు మళ్లింది. ఏ మనోభారం తో కృంగి పోతోందో, అది దించుకోడానికి ఆమె ఆ రోజు ఎన్నుకున్న అవిఘ్న వాక్ప్రవాహంలో తెలిసిన విషయాలివి…
….
‘నాకు నలుగురు పిల్లలు బాబూ! మజ్జిన ఒకడు సచ్చిపోయేడు. ఆడపిల్లకి పెళ్లైపోయింది. దాని సంసారం బాగానే వుంది. చిన్నోడు, మా వృత్తి, మంగలి పనే చేసుకుంటాడు. అయితే, వాడికి స్థిరం లేదు. అటాత్తు గా ఎటో ఎల్లి పోతాడు. కొన్ని నెలలు కనపడడు. మల్లా వూర్లోకి దిగుతాడు.
పెద్దోడయితే – ఆడికి ఇరవై ఏళ్లు వొచ్చేసరికి నక్సలైట్ల పాల బడ్డాడు. వాళ్లేం చెప్పారో నేను కమ్మునిస్టునైపోయేనని వూర్లు తిరగడం మొదలెట్టేడు.
ఆడికదేమన్నా కూడెట్టిందా, బట్టిచ్చిందా బాబూ? వాళ్ల నాన్న మంగలి పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి మాది. ఆ పెద్దోడు అలా తిరుగుతున్నాడు, ఎటూ కాకుండా ఐపోయేడని, చిన్నోడికి ఒక సంబందం చూసి పెళ్లి చేసేము. ఆడొక సవత్సరం పాటు ఇంటి పట్టునే వుండి ఒకరోజు అఠాత్తు గా ఎటో ఎల్లి పోయేడు. ఆ పోవడం పోవడం ఒక పది సంవత్సరాలపాటు పత్తా లేడు.
ఆడిల్లు వొదిలి ఎలి పోయింతరవాత అన్ని వూళ్ళూ ఎతికేము. పోలీసు రిపోర్టిచ్చేము.
అన్నాళ్ళూ ఇంట్లో కోడలు పిల్ల వుండిపోయింది.
ఆడెలిపోయిన అయిదు సంవత్సరాల తరవాత, కోడలూ మా ఇంట్లో వుండ ఇచ్చగించు కోలేదు. దాని పెట్టి గట్రా సద్దుకోని అదీ పుట్టింటి కెళ్ళి పోయింది. ఏంచేస్తాం? కాదనగలమా? ఉంటే మాత్రం ఏం సుకం? దాన్ని కనిపెట్టుకోని వుండగలమా? అదెల్లి పోడమే మంచిదైంది.
ఈ లోపలేవైందీ…మా పెద్దోడు ఆ నక్సలైట్లతో వూళ్ళు తిరుగుతున్నాడా!
ఒక రోజు మా చుట్టమొకడు వొచ్చి చెప్పేడు –
‘ఓలమ్మ గౌరమ్మా! నీ కొడుకు పోటో పేపర్లో పడింది. పలాస దగ్గిర ఏదో బట్టి (చిన్న వాగు) లోన ఆడి బాడీ దొరికిందని, ఎవరి తాలూకా అయితే ఆళ్ళు పోలీసు స్టేషనుకి రావాలని వుంది’ అన్నాడు.
మాకు గుండెల్ల రాయి పడింది. ఎలగెళ్లడం? యెల్తే మమ్మల్నీ పోలీసులు మూసేస్తారు. ఆకరికి మా మరిది, మరొకతనూ, ముందెళ్లి ఆస్పటల్ లో వుంచిన బాడీ చూసేరు. ఆడు మా వోడే – చావు బతుకుల్లో ఉన్నాడట. తల విచ్చి పోయిందట. కాళ్ళు ఆడటం లేదంట. ధైర్యం చేసి నేను, నా పెనిమిటీ ఎల్లేము.
ఆస్పటల్ లో కొడుకు బాడీ చూసి నా గుండె సెక్కలై పోయింది. ఆడ్ని ఎవురు అలాగ కొట్టీసి ఆ బట్టిలో పడీసేరో మాకు తెల్దు. ఆడు మరి మడిసి లాగ తిరగలేడని మాత్రం మాకర్ధమై పోయింది.
ఒక మూటని మోసికొచ్చినట్టు ఆడ్ని ఇంటికి మోసికొచ్చేము. ఆడి నోటంట మాట నేదు. ఆడి పేన మంత కళ్ళల్లో వున్నట్టు – ఆ కళ్ళు నిల బెట్టి చూస్తన్నాడు.
వారం కొక్కసారి పోలీసులు వొచ్చేసే వారు. వీధికి ఆ చివరో పోలీసు, యీ చివరో పోలీసు. మా ఇంటిముందరొకడు. మా పెద్దోడు ఏం చెప్తాడో అని ఆడికి అడగడం. ఆడేం మాట్లాడ లేక కళ్లెళ్ల బెట్టి సూడటం. ఇలాగ ఒకార్నెల్లు గడిసేయి. ఆ ఇంస పడలేక వూర్లో పెద్దోళ్ళనడిగితే – ఆల్లు పోలీసులతో మాట్లాడి ఏదో కాగితం రాసిచ్చేరు.
దాంతో ఆ పోలీసులు రాడం మానీసేరు. మాకూ వొక పీడ వొదిలి పోయింది.
కొన్నాళ్లు, మందులూ, మాకులూ పెట్టి కష్ట పడితే నా కొడుకు బతికేడు. ఐతే నోట మాట మాత్రం నేదు. ఆ తరవాత రెండు సంవత్స రాలకో ఏమో నోట మాట పెగిలింది.
అప్పుడ్నించి బాబూ, పన్నెండు సంవత్సరాలు, పెతి వారమూ, పెతి దినమూ, పెతి గంటా – ఆడి పని నాదే అయిపోయింది.
నా కొడుకు కదల్లేక పోయే వాడు బాబూ! కాళ్లు పూర్తిగా సన్నమైపోయి, సచ్చు బడిపోయేయి. నేను, నా పెనిమిటి అతి కష్టం మీద నిలబెడితే నిలబడీవోడు. అలాగే బయటికి దొడ్డికి తీసికెళ్లే వాళ్ళం. స్తానం చేయించే వాళ్లం.
ముందు చేతుల్తో ఏమీ పట్టుకోలేక పోయే వాడు. మూడు పూట్లా తిని పించడం, రెండు పూట్లా టీ తాగించడం నా పనే. స్పూను తో టీ తాగించే దాన్ని.
నా పెనిమిటికి వూళ్లో పని. ఆ చిన్నోడు పత్తా లేకండా పోయేడు. కూతురు అప్పుడికే కాపరానికెల్లి పోయింది. నేనొక్కదాన్నే కొడుక్కి సేవ.
ఉదయం వాడిని దొడ్డికి బయటికి తీసికెళ్లడం. స్తానం. టీ నీళ్లు తాగించడం. టిఫిను. మద్దేనం తిండి తినిపించడం. సాయంకాలం టీ. రాత్రి మల్లా తినిపించడం. పక్క సరిది పక్క మీద పడుకో బెట్టడం. ఇదే తంతు. యిలాగ పన్నెండేళ్లు చేసానయ్యా!
నా కొడుకు మంచం మీద అలగ నిద్దర పోతుంటే, ఆడి మొకం చూస్తే జాలేసేది బాబూ! ఏ జనమ లో రుణపడిపోయేనో ఇప్పుడిలా తీరుస్తున్నాను. ఆ బగమంతుడే ఈడి రూపం లో నాతో సేవ చేయించుకుంటున్నాడేమో, ఇదీ ఒక అదురుష్టమే అనిపించేది. అలా అనుకున్నప్పుడల్లా నా కళ్ళమ్మట తిరిగిన నీళ్లు ఎన్ని సార్లు తుడుచుకున్నానో!
నేను కొట్టు నుండి జీడి పప్పు తెచ్చుకోని ఒలుచుకునే దాన్ని, పదో పరకో వొస్తాయని. నా వొంతు పిక్కలు ఒలిసీటప్పుడికి రాత్రి ఒకోమారు పది గంటలైపోయేది. వయసో ఏమిటో, కొన్ని సార్లు సరిగా నిద్ర పట్టేది కాదు.
ఆ పెద్దోడు మూడు గంటలికి లేచి పోయే వాడయ్యా! నాకు పాస్ కి బయటికి తీసుకెళ్ళు అని ఒకటే గోల.
‘ఒరే పెద్దోడా! రాత్రంతా నిద్ర లేదురా. ఇపుడిపుడే కంటికి కునుకు పడతంది రా! ఒక అర గంట ఆగురా అంటే –
‘అహ నేనాగను. ఇప్పుడే తీసికెళ్తావా లేదాని’ ఆడి హుంకరింపు.
ఆడ్ని పాసుకి తీసికెల్లి, మల్లా పడుకోబెట్టింతరవాత మరేదీ నిద్ర? ఆ రోజుకి తెల్ల వారి పోయేది. ఇలాగ యెన్ని రోజులో!
ఆ దేముడ్ని అపుడపుడూ దండాలు మొక్కీదాన్నయ్య. ‘దేముడా! నేనున్నాను గాబట్టి ఈడికీ సేవ సేస్తన్నాను. నాకే ఏ రోగమో వోస్తే వీడ్నెవరు సూస్తారు? ఈడి గతేమిటి’ అని.
ఒక క్షణం ఆగి, నా చెయ్యి పట్టుకుని కొంగు నోట్లో కుక్కుకుని ఏడ్చింది. బాధతో ఆమె చేతి వేళ్లు వణికేయి. నెమ్మదిగా తేరుకుని కళ్లొత్తుకుంది.
మా పెద్దోడొచ్చిన సుమారు ఎనిమిది సంవత్సరాలకి నా పెనిమిటి పోయేరు. నాకున్న ఆ చిన్న ఆదరువూ, సాయమూ పోయేయి. ఇక ఆ మిగతా కాలమంతా పెద్దోడి తోనే నాకు బతుకైపోయింది.
అది వాడు ఇంటికొచ్చి పన్నెండో ఏడు చివారి నెల –
ఒక రోజు పెద్దోడు ఆ మూడు చక్రాల బండేసుకుని అంబుగాం వేపు వెళ్ళేడు. ఆ మూడు చక్రాల బండో, సైకిలో – రెండు సంవత్సరాల కిందట ఎవరో సొసైటీ వాళ్లు మా కిచ్చేరు. ఆ బండోచ్చిన తరవాత ఇంట్లో ఎవరో – మా అల్లుడొ, మరిదో – వాడిని బయటికి తీసికెళ్ళి అలా తిప్పి తెచ్చే వారు.
ఒచ్చోచ్చి ఆడే ఆ బండి చక్రాలు తిప్పుకొని నడుపు కెలి పోయే వాడు. ఆ రోజు అలగే బైటికెళ్ళి – సాయంత్రం నాలుగవుద్డి బాబూ – ఇంటి కొచ్చేడు.
అప్పుడికి మా యమ్మి నిండు గర్భిణీ. మా ఇంట్లే వుంది. ఆ రోజే ప్రసవించింది. మాకు మనవడు పుట్టేడు.
మా వోడు ఇంటి ముందు బండి ఆపేడు. అది సలి కాలం సాయంత్రం. అప్పుడికే ఒకటొకటి ఆవులొచ్చేస్తన్నాయి. మా యావు సాలలోకొచ్చేసి ‘అంబా’ అని అరుస్తున్నాది.
చేతిలో వున్న పనొదిలీసి బండిని గడప మీదకి తోసేను. పెద్దోడు ఆ మూడు చక్రాల బండి దిగి, దేక్కొని వచ్చి, ఇంటి దువ్వారానికి జేరబడి కూకున్నాడు. నేను అటు తిరిగి ఒలిచిన జీడి పప్పులు చేట లోకి ఎత్తుతున్నాను.
‘చెల్లి డెలివరీ అయిందా?’ అనడిగేడు.
‘అవున్రా, మనవడు’ అన్నా.
‘సరే నాకు టీ చెయ్యి’ అన్నాడు. గంజాయి ఆకులు చేతిలో నలుపుకుంటున్నాడు. ఆడికీ మధ్య గంజాయి అలవాటైంది.
‘ఈ పప్పు లెత్తీసి చేస్తాన్రా’ అన్నా.
‘లేదు. ఇప్పుడే ఎల్లు’ అని హుంకరింపు. ఆడి ఆధార్టీ కేం తక్కవ లేదు.
ఆ పప్పులెత్తుకోని, ఏటీ యేచప్పుడూ లేదని అలా ఎనక్కి చూసేనయ్యా!
ఆడు దువ్వారానికి అలాగ జేరబడి పోయి కిందకి జారిపోతున్నాడయ్యా. ఆడి చేతిలో గంజాయి ఆకులు గాలికి ఎగిరిపోతన్నాయి. గబుక్కున నా పిల్లడ్ని పొదివి పట్టుకున్నాను.
అంతే! ఆడి కళ్ళు గాజు పెంకుల్లాగ అయిపోయేయి. ఆడి పేనం ఎగిరి పోయింది. ఆడు నా కళ్ల ముందే సచ్చి పోయేడు.
గుండి లోంచి ఒక మూలుగు మూలిగి, ‘ఓ మాదేవా!’ అని చేతులెత్తి దేవుడికి దండం పెట్టేను. ఆడికీ నాకూ రుణం తీరింది. ఆ సిటాన నా గుండి మీదనుండి పెద్ద బండ దిగి పోయినట్టయి పోయిందిరయ్యా!’ అన్నదామె.
27 ఏప్రిల్ 2026
