ప్రదర్శనాత్మక అభ్యుదయం – ప్రతిఘటనాత్మక అస్థిత్వం కుప్పిలి పద్మ కథ సమీక్ష
-బి.తిరుపతిరావు
He wears a mask, and his face grows to fit it.
― George Orwell
సాధారణంగా కథలు ప్రేమ, కోపం, భయం వంటి భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ భావోద్వేగాలకు బదులుగా కేవలం తర్కం, విశ్లేషణ, సమస్యల పరిష్కారం, కార్యకారణ సంబంధాల (cause-and-effect) ఆధారంగా కూడా మంచి కథలను సృష్టించవచ్చు. వీటిని‘Idea Stories’ అంటారు. ఈ తరహా కథల్లో పాఠకుడికి కలిగే ఉత్కంఠ లేదా సంతృప్తి అనేది పాత్రల తాలూకు ఏడుపులు, నవ్వుల నుండి రాదు. అందుకు భిన్నంగా కథలో తర్కం ఎంత పకడ్బందీగా ఉంది?ఒక క్లిష్టమైన సమస్యను రచయిత మేధస్సుతో ఎలా పరిష్కరించారు?ముందుగా అనుకున్న సూత్రాల ఆధారంగా ముగింపు ఎంత తార్కికంగా (logically) వచ్చింది?అనే అంశాల నుండే ఆ కథ రూపొందుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ తరహా కథలు మనసుని కదిలించడం కంటేఆలోచనను రేకెత్తించేలా ఉంటాయి. కుప్పిలి పద్మ రాసిన సమీక్షకథ కూడా ఒక రకంగా ఈ తార్కిక కోణంలో సాగిందే.
కుప్పిలి పద్మ రాసిన సమీక్ష కథ ఒక కుటుంబంలో కనిపించే ప్రోగ్రెసివ్ భావజాలం, వాస్తవ జీవిత ఆచరణ మధ్య ఉన్న వైరుధ్యాన్ని గాఢంగా చూపిస్తుంది. స్రవంతి–శ్రీకర్ దంపతులు ఒకప్పుడు స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడినా, కాలక్రమేణా తమ సామాజిక స్థాయి, సౌకర్యం కోసం స్నేహితులను దూరం పెడతారు, ఒంటరి భర్త లేని స్త్రీలను , భిన్న జీవనశైలులలో జీవించే వాళ్ళని ప్రక్కన పెడతారు. ఈ కొత్త /కృత్రిమ విభజనను వాళ్ళ కూతురు సమీక్ష గమనించి ప్రశ్నిస్తుంది. నిజమైన ప్రోగ్రెసివ్ విలువలు అంటే విభిన్నతను ఆమోదించటం అని నిలదీస్తుంది. చివరకు ఆమె తన స్నేహితురాలు సుచరితతో కలిసి లివింగ్ రిలేషన్‌ను ఎంచుకుని, తన తల్లిదండ్రులు మాటలకి మాత్రమే పరిమితం చేసిన విలువలను ఆచరణలో చూపిస్తుంది. ఈ కథ తరాల మధ్య భావజాల ఘర్షణను, కృత్రిమ సామాజిక ప్రగతిశీలతను చూపిస్తుంది.
కుప్పిలి పద్మ రాసిన కథ సమీక్ష కథానాయిక పేరు మాత్రమే సమీక్షకాదు, వర్తమాన సమాజ పోకడ పై కూడా సమీక్షగా పనిచేస్తుంది. భారతదేశంలోని పట్టణ ప్రాంత, ఎదుగుతున్న, తమను తాము ప్రగతిశీల మార్గదర్శకులుగా చెప్పుకునే మధ్యతరగతి ప్రజల నిశ్శబ్ద కపటత్వాన్నివిడమర్చి చూపే ఒక చురుకైన సంభాషణలతో కూడిన కథనం. నగరాలలో సమకాలీన తెలుగు కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథ దాదాపు పూర్తిగా సంభాషణలలోనేనడుస్తుంది. అయినప్పటికీ, కథ భావోద్వేగ, తాత్విక బరువును కలిగి ఉంటుంది.
ఒక కుటుంబం తమ సెలవుల ప్రయాణం గురించి వాట్సాప్ గ్రూపులో జరిపే చర్చలను పద్మ ఒక సూక్ష్మ ప్రపంచంగా చిత్రీకరిస్తూ, సమాజంలోని లోతైన వైరుధ్యాలను బహిర్గతం చేస్తుంది. ముఖ్యంగా, ఇవ్వాళ్టిసమాజంలో వ్యక్తులు తమ ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు మాత్రమే సంస్కరణల గురించి మాట్లాడుతారని,తమ సౌకర్యం కోసం విలువలను ఎలా మార్చుకుంటారో ఈ గ్రూప్ చాట్ ద్వారా మనకు కనిపిస్తుంది. దీనితో పాటు, మానవ సంబంధాలు ఎలా వ్యాపారీకరణచెందుతున్నాయో, బంధుత్వాలను కూడా లాభనష్టాల కోణంలోనే చూసే ధోరణిని పద్మ చాలా స్పష్టంగా చూపించారు.
ఈ వాట్సాప్ సంభాషణల వెనుక ఉన్న మరో ముఖ్యమైన అంశం తరాల మధ్య ఘర్షణ లేదా అంతరం. పాత/ కొత్త తరాల ఆలోచనల మధ్య జరిగే ఈ సంఘర్షణ కేవలం కుటుంబ కలహం మాత్రమే కాకుండా, మారుతున్న సామాజిక విలువల ప్రతిబింబంగా కనిపిస్తుంది. వీటన్నిటి కంటే మించి, ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిన ఒక చేదు నిజాన్ని పద్మ ఇక్కడ ఆవిష్కరించారు. సమాజంలో ఆర్థికంగా పైకి రావాలని ఆశించేవారు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కంటే, ఉన్న వ్యవస్థలోని సామాజిక కట్టుబాట్లకు లొంగిపోవడమే సురక్షితమని భావిస్తారు. అంటే, ఆర్థిక అభివృద్ధి తరచుగా సామాజిక విధేయతను డిమాండ్ చేస్తుందే తప్ప, నిజమైన సామాజిక మార్పునుప్రోత్సహించదనే సత్యాన్ని కథ ఈ సందర్భంలో నొక్కి చెపుతుంది.
ఈ కథలోని చాలా సున్నితమైన వ్యంగ్యం కనిపిస్తుంది, అదే సందర్భంలో అది పదునుగా కూడా ఉంటుంది. స్రవంతి శ్రీకర్ అనే జంట ఒకప్పుడు విశ్వవిద్యాలయంలో రాడికల్స్. సామాజికంగా నిషేధంగా భావించే కాలంలోనే లేదా సమ్మతి లేని కాలంలోనే వాళ్ళు లివ్-ఇన్రిలేషన్‌షిప్‌ను ఎంచుకున్నారు. వాళ్ళు స్త్రీవాద సాహిత్యం చదివేవాళ్ళు. ప్రత్యామ్నాయ జీవనశైలులను సమర్థించేవాళ్లు. తమ స్వంత గుర్తింపును పాత నియమాలధిక్కారణపై నిర్మించుకున్నారు. అయితే, ఒకసారి ఆర్థికం గా బలపడినాక, ముఖ్యంగా నూతన ఆర్థిక విధానాల వల్ల వచ్చిన లాభాలు, కార్పొరేట్ పాఠశాల విద్య, ఆస్తుల విలువ పెరగడం,ప్రభావవంతమైన వర్గాలతో పరిచయాలు పెరిగాక — వాళ్ళు తమ సామాజిక సర్కిల్ నుండి తమ హ్యాపీ ఫ్యామిలీ ఇమేజ్‌కు సరిపోని వాళ్ళని క్రమంగా దూరం పెట్టటం ప్రారంభిస్తారు. ఒంటరి స్త్రీలు (కథలో సుష్మ ఆంటీ), విధవలు, పిల్లలు లేని జంటలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులు, ఎవరి జీవనశైలి అయితే తమ టీనేజ్ పిల్లలపై ప్రభావం చూపుతుందోఅని భయపడే వాళ్ళని ఒక పధకం ప్రకారం తమ ప్రత్యేకమైనహ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్ నుండి, ఇంటి వేడుకల నుండి దూరం పెడుతూ ఉంటారు. ప్రయాణ ప్యాకేజీలు, వేడుకలు, చివరకు సాధారణ కలయికలు కూడా ఇప్పుడు వివాహ హోదా, ఆర్థిక స్థితి, స్త్రీ-పురుష సంబంధాలు ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడతాయి.
కుప్పిలి పద్మ ఒక తరానికి ప్రతినిధులుగావున్న తల్లిదండ్రులను విలన్లుగా చూపించలేదు. అయితే, స్రవంతి ఆత్మరక్షణ ధోరణి (వాళ్ళు ఇబ్బంది పడతారు… అది సహజం),శ్రీకర్ సమర్థనలు (పిల్లలు సాధారణంగా సెటిల్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు) లాంటి ఆలోచనను వాళ్ళ సంభాషణాలద్వారా బహిర్గతం చేసి వాళ్ళ ద్వంద ప్రవృత్తిని తెలియజేస్తుంది. తాము ఏమిచేస్తున్నారోవాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళ పాత రాడికలిజం ఇప్పుడు ఒక జీవనశైలి బ్రాండ్‌గా,రోల్ మోడల్ ఫ్యామిలీఅని ఫేస్‌బుక్ పోస్టులుగా మారింది. కానీ ఆచరణలో మాత్రం అది సంప్రదాయవాదానికి పహారా కాస్తోంది. వాళ్ళమీద పదునైన విమర్శ వాళ్ళ కూతురు సమీక్ష నుండి వస్తుంది. సమీక్షవాళ్ళని ఇలా నిలదీస్తుంది, పెళ్లి చేసుకుని జంటలుగా వున్న వాళ్ళని తప్పా లివింగ్ లో వున్నవాళ్ళని, సింగిల్వుమెన్ని, లెస్పీబియన్స్, యెకనమికల్ గా మన స్థాయి కాని వాళ్ళనీ, మనంతపవర్ఫ్ ఫుల్ కాని వాళ్ళని నువ్వు దూరం పెడుతున్నట్టనిపించింది ఆ గ్రూప్ నిచూస్తే. యెందుకలా?అల్లాగే ,మీరు జీవితంతో ప్రయోగాలు చేశారు… కానీ మీరే స్నేహితులను ఇలా విభజిస్తున్నారు.ఈ రెండు సందర్భాలలోనూ వాళ్ళ ద్వంద ప్రవృత్తి బయటపడుతుంది. ఒకప్పుడు మార్పుకు దోహద పడినవాళ్ళు, ఏ సంప్రదాయ దృష్టినయితేవ్యతిరేకించారో అదే దృష్టిని ప్రదర్శించటం అనేది ఒకానొక అనైతిక రూపం.
సమీక్ష ఈ కథకు నైతిక కేంద్రం. ఆమె పేరుకి తగినట్లుగా తన తల్లిదండ్రుల జీవితాలను నిర్మొహమాటంగా సమీక్షించే వ్యక్తి ఆమె. కేవలం తిరుగుబాటు కోసం తిరుగుబాటు చేసే టీనేజర్ లాగా కాకుండా, సమీక్ష తిరుగుబాటు లేదా ధిక్కారం తన తల్లిదండ్రులు ఒకప్పుడు బోధించి, ఇప్పుడు విస్మరించిన ప్రగతిశీల విలువలపై ఆధారపడి ఉంటుంది. ఆమె మాటల్లో నిజాయితీ, నిబద్ధత కోరుకుంటుంది. తన తల్లి ఒంటరి స్త్రీలను , వితంతువులను , ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులను తన గ్రూపు నుండి తొలగించినట్లు తెలుసుకున్నప్పుడు, ఆమె వాట్సాప్ గ్రూపుపై తనదైన శైలిలో వాళ్ళని నిలదీస్తుంది. అందరు స్నేహితులు, సాంప్రదాయ, అసాంప్రదాయ, వివాహిత, ఒంటరి ఇంకా సంప్రదాయేతర లైంగిక సంబంధాలలో ఉన్న వాళ్ళను అప్రకటిత బహిస్కరణ చేయకుండా వాళ్ళను కూడా కలుపుకుంటే తాను ఫ్యామిలీ ట్రిప్‌కు వస్తానని ఆమె ప్రకటించడం ఆమె నిబద్ధతకి ప్రతీక.
సమీక్ష సుచరిత తో కలిసి జీవించాలని తీసుకున్న నిర్ణయం ఆకస్మికమైన తిరుగుబాటు కాదు. అది ఆమె నమ్మకాలకి సహజమైన కొనసాగింపు. కథలో ఆమె తల్లిదండ్రులు సమానత్వం, స్వేచ్ఛ, ప్రోగ్రెసివ్ ఆలోచనలు గురించి మాట్లాడుతూనే, భిన్న జీవనశైలులు ఉన్నవాళ్ళని దూరం పెడుతున్నారని ఆమె గమనిస్తుంది. ఈ మాటలు–ఆచరణ మధ్య ఉన్న వైరుధ్యం ఆమెకు అసహజంగా అనిపిస్తుంది. అందుకే తాను నిజాయితీగా జీవించాలనుకుంటుంది.
సుచరితతో ఆమె బంధం తాత్కాలికమైనది కాదు. పరస్పర అర్థం చేసుకోవడం, భావోద్వేగ అనుబంధం, తోడ్పాటు మీద నిర్మించబడింది. అందువల్ల కలిసి జీవించడం అనేది సాధారణంగా ఒక జంట తీసుకునే నిర్ణయంతో సమానమే. ఇది సమాజం వేసే ముద్రల కంటే తమ అనుభూతుల్ని ప్రాధాన్యంగా తీసుకోవడం. కథ చివరలో సమీక్ష తాను తన ఫ్రెండ్ సుచరితతో కలిసి లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నానని నిర్భయంగా ప్రకటించడం కథకి గొప్ప మలుపు. అది తాను చేసిన వాదనకు ఒక తార్కిక ముగింపులా ఉంటుంది.
ఇక సమీక్ష వ్యక్తిగత స్వేచ్చను కూడా ఇక్కడ ప్రదర్శిస్తుంది. కుటుంబం లేదా సమాజపు అంచనాలను అంగీకరించకుండా, తన జీవితం గురించి తానే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం వల్ల ఎదురయ్యే సవాళ్లు సమాజ విమర్శ, ఆమోదం లేకపోవడం తెలుసుకున్నప్పటికీ, తనకు సరైనదిగా అనిపించిన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఒకరకంగా సమీక్ష నిర్ణయం కుటుంబం అనే భావనను విస్తరించే ప్రయత్నం. ప్రేమ , నమ్మకం , పరస్పర గౌరవం ఉన్న ఎలాంటి బంధమైనా కుటుంబమే అని ఆమె చూపిస్తుంది. ఇలా ఆమె తల్లిదండ్రులు మాటల్లో చెప్పిన ప్రోగ్రెసివ్ విలువలను ఆచరణలో చూపిస్తూ, నిజమైన సమానత్వం వైపు నిలబడుతుంది. కథలో సమీక్ష, సుచరితల మధ్య ఉన్న లెస్బియన్ సంబంధం సహజమైన సంబంధంగా చూపించబడింది. ప్రేమ నమ్మకం, అనుబంధం వంటి అంశాల మీదే ఇది నిలబడింది. ఈ సంబంధం గురించి బయటనుంచి చేసే ఎటువంటి విమర్శ అయినా అప్రజాస్వామికమే. కథలో సమీక్ష, సుచరితల మధ్య ఉన్న లెస్బియన్ సంబంధం సహజమైన సంబంధంగా చూపించబడింది. ప్రేమ నమ్మకం, అనుబంధం వంటి అంశాల మీదే ఇది నిలబడింది. సమాజం ఒకే విధమైన సంబంధాన్ని మాత్రమే నార్మల్ గా అంగీకరించి, మిగతావాటిని అసాదరణమైనవిగా చూడటాన్ని ఆమె ప్రశ్నిస్తుంది. వీళ్ళ సంబంధాన్ని మానవ వైవిధ్యంలో (human diversity) సహజమైన భాగంగా అర్థం చేసుకోవాలీ. ఆ విభిన్నతని అంగీకరించాలి.
గతంలో వారు ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగినవాళ్ళు. ఫెమినిజం, స్వేచ్ఛ,సమానత్వం వంటి విలువలను నమ్మి, లివింగ్ రిలేషన్ వంటి నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకున్నారు. అప్పట్లో వాళ్ళు సామాజిక నియమాలకు వ్యతిరేకంగా నిలబడి, భిన్న జీవనశైలులను గౌరవించే వ్యక్తులుగా కనిపించారు.సమీక్ష తన తల్లిదండ్రులు పిల్లల పట్ల పెట్టుకున్న అంచనాలు తలక్రిందులయ్యాయన్న గ్రహింపు కలిగినప్పుడు వాళ్ళలో కనిపించిన స్పష్టమైన నిరాశ గమనిస్తే, వాళ్ళు ఇన్నాళ్లూ ఇతరులను ఏ ఇబ్బందికి గురిచేశారో, ఇప్పుడు సరిగ్గా అదే అసౌకర్యాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తున్నారని అర్థమవుతుంది. ఈ వైరుధ్యాన్ని, అంటే భావజాలనికి , ఆచరణ మధ్య ఉన్న గ్యాప్‌ను కథ స్పష్టంగా చూపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళు సమాజమార్పు కోరుకున్నవాళ్ళు , ఇప్పుడు సమాజం ఒత్తిడికి లోనై భిన్నంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రోగ్రెసివ్ భావజాలం కృత్రిమంగా, పైపైన మాత్రమే మిగిలి, లోతైన జీవన విధానంగా మారలేదు. నిజానికి, ఇది కేవలం వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు. మధ్యతరగతి జీవితంలో తరచూ కనిపించే ఒక సామాజిక ధోరణి . సామాజిక స్థాయి, భద్రత, హోధ, గౌరవం కోసం వ్యక్తులు తమ గత విలువలను వదులుకోవటం జరుగుతుంది. ఇది చాలామంది మధ్యతరగతి వ్యక్తులలో కనిపించే ఆచరణాత్మక సర్ధుబాటు. (pragmatic adjustment),అంటే ఆలోచనలు ఒకలా ఉండి, జీవన విధానం ఇంకొకలా మారటం. ఇది హిపోక్రసీ లేదా సెలెక్టివ్ ప్రోగ్రెసివిజం అని చెప్పడం సరైనది. ఈ మార్పు కేవలం వారి వ్యక్తిగత ఎంపిక కాదు. సమాజం మొత్తం ఆ దిశగా కదులుతున్న క్రమంలో నిబద్ధత కోల్పోవటం వల్ల వచ్చిన మార్పు. స్రవంతి–శ్రీకర్ మార్పు ఒక వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు. అది మారుతున్న సమాజంలో విలువలు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చూపించే ఉదాహరణ కూడా. వర్గ చలనం ( class mobility) అనేది ఎలా వ్యక్తుల విలువలను మార్చుతుందో ఈ సందర్భంలో తెలుస్తుంది. ఇంకొరకంగా ఇది వ్యక్తిగత సంబంధాల కథ మాత్రమే కాదు. వర్గం, భావజాలం, సామాజిక నిర్మాణాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలపై ఒక విమర్శనాత్మక చిత్రణ.
ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త లూయీ ఆల్తుస్సేర్ (Louis Althusser) ప్రతిపాదనలు భావజాలం (ideology), భావజాల రాజ్య యంత్రాంగం (Ideological State Apparatuses) ఎలా పని చేస్తాయో చూపించటానికి స్రవంతి- శ్రీకర్లు ఉదాహరణగా కనిపిస్తారు. ఆల్తుస్సేర్ ప్రకారం, సమాజం మనుషుల్ని ఒక నిర్దిష్ట సామాజిక పాత్రలోకి ప్రవేశపెట్టడం (interpellate) చేస్తుంది. అంటే మనం ఎవరో, ఎలా జీవించాలోబావజాలం ద్వారా నిర్దేశిస్తుంది.స్రవంతి–శ్రీకర్ లు ఒకప్పుడు ప్రోగ్రెసివ్ భావజాలంతో ఉన్నప్పటికీ, తరువాత కుటుంబం, విద్య, సామాజిక సంబంధాల ( social networks) భావజాల రాజ్య యంత్రాంగం ప్రభావంతో సాదరణ నార్మల్ అనే బావజాలాన్ని అంతరంగీకరించుకున్నారు (internalize). వాళ్ళు తమ పిల్లల్ని కూడా అదే నమూనాలో పెంచాలని ప్రయత్నించారు. ఇది బావజాల పునరుత్పత్తి (reproduction of ideology)కు ఉదాహరణ.ఇక్కడ కుటుంబం ఒక ముఖ్యమైన బావజాల యంత్రాంగంగా పనిచేస్తుంది. పిల్లలకి ఏది సరైనది (normal), ఏది తప్పు(deviant) అని నేర్పుతూ, అమలులో ఉన్న సామాజిక వ్యవస్థను కొనసాగించటానికి దోహదపడటం జరుగుతుంది. స్రవంతి–శ్రీకర్ తమ పిల్లలపై భిన్న జీవనశైలుల ప్రభావం పడకూడదని చూసే ప్రయత్నం ఈ బావజాలాన్ని కాపాడే ప్రయత్నమే. అయితే సమీక్ష ఈ సామాజిక పాత్రలోకి ప్రవేశపెట్టడం అనే క్రమాన్ని ప్రశ్నిస్తుంది. ఆమె తనకు ఇచ్చిన కర్తృత్వ స్థానాన్ని(subject position)—అంటే సంప్రదాయ కుటుంబంలో ఉండే అమ్మాయి అనే పాత్రను తిరస్కరిస్తుంది. సుచరితతో ఆమె ఎంచుకున్న సంబంధం ద్వారా ఆమె ఆ బావజాలనికి వ్యతిరేకంగా ఒక రకమైన ప్రతిఘటన (resistance) చూపిస్తుంది. అంటే సమీక్ష కొత్త రకమైన జీవన విధానంను ప్రతిపాదిస్తూ, పాత భావజాలాన్ని సవాలు చేస్తుంది. కధా రచయిత్రి ఇక్కడ తరాల అంతరాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. ఏ విప్లవాత్మక భావాలనైతే తల్లిదండ్రులు వదులుకుని, కేవలం సామాజిక గౌరవం, హోధ కోసం పాకులాడుతున్నారో, ఆ భావాలకు నిజమైన వారసులు ఇప్పుడు పిల్లలే అని చూపుతుంది.
క్లాస్ మొబిలిటీ, నైతిక రాజీ, ఆర్థిక ఎదుగుదల, సామాజిక సంకుచితత్వం మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కథ బలంగా చూపుతుంది. కథలోని ఈ వాక్యాలు ఇందుకు సాక్ష్యం:
వేదికలు యెక్కినప్పడు మాటాడే యే మాటా పిల్లలకి చేరకూడదనుకున్నారు. తాము చదివిన పుస్తకాలు కాకుండా పర్సనాలిటీ డెవలప్మ్మెం ట్ పుస్తకాలు మాత్రమే పిల్లలకి అందుబాటులో వుంచాలని నిర్ణయించుకున్నారు. పిల్లల కెరీర్… తమ ప్రాపర్టీ పెరుగుదల… పిల్లలకి పవర్ ఫుల్ సర్కిల్స్ నుంచి పెళ్ళుళ్ళు యివీ వారిద్దరూ వేసుకొన్న భవిష్యత్ రూట్ మ్యాప్. అయితే వాళ్ళిద్దరూ బయట ప్రపంచానికి చెప్పే విలువలు, వ్యక్తపరిచే ఆకాంక్షలూ వేరు.
స్రవంతి తన స్థాయిలో లేని వాళ్ళను దూరం పెట్టటానికి వాళ్ళకి అసౌకర్యం గా ఉంటుంది, హ్యాపీ కపుల్స్ ని చూసి వాళ్ళు బాధపడకూడదని తమ ఉద్ధేశ్యం అని చెప్పటం ఆమె ద్వంద ప్రవృత్తికే కాదు నిజాయితీలేనితనానికి, నిబద్ధతా రాహిత్యనికి నిదర్శనం.స్వలింగ సంపర్కంపై సుష్మ సెమినార్ నిర్వహించడం, యువత స్వలింగ భాగస్వాములను ఎంచుకుంటున్న డేటా గురించిన ప్రస్తావన, ధియరీలో… మాటల్లో వెరీ గుడ్… కానీ తను సింగిల్ వుమెన్ని కూడా ఫ్యామిలీగా కలుపుకోలేదు… కన్వె న్షనల్ మైం డ్ సెట్ అంటూ ప్యానెలిస్ట్ గా స్రవంతిని సుష్మ తిరస్కరించడం మొదలైయనవన్నీ సూడో ప్రగతిశీలతపై ఒక గట్టి ప్రతిఘటన. రచయిత్రి కథలో వాట్సాప్ గ్రూప్ ని కూడా ఒక మెటాఫర్ గా చూపుతుంది. కేవలం అనుమతించబడిన వాళ్ళు మాత్రమే ఉండే, వర్గం, కులం, వైవాహిక స్థితి, లైంగిక ఎన్నిక లాంటి అప్రకటిత సరిహద్దులతో నియంత్రించబడే సంకుచితత్వానికి సరైన చిహ్నం.
కథా శైలి చాలా సరళంగా కనిపిస్తుంది. కథ దాదాపుగా సంభాషణలు, అంతర్గత మథనంతోనే నడుస్తుంది. రోజువారీ భాషలో పదునైన విమర్శలను చేస్తుంది. కథలో దొర్లే ఇంగ్లీష్ పదాలు కాస్మోపాలిటన్ జీవనశైలిని సూచిస్తాయి. కథన వేగం ఎక్కడా తగ్గదు. అయితే కొన్ని చోట్ల సంభాషణలు didactic అనిపిస్తాయి. సమీక్ష కథ కేవలం ఒక కుటుంబ గొడవ కాదు. సరళీకృత ఆర్ధిక విధానాలు ముందుకు వచ్చిన నేపధ్యంలో మధ్యతరగతి తన ప్రగతిశీల దృష్టిని ఎలా తెలివిగా మార్చుకుందో, ఆ మార్పువెనుక ఉన్న అవకాశావాదాన్ని బహిర్గతం చేసిన కథ. రచయిత్రి పాత రాడికలిజాన్ని గానీ, కొత్త సంప్రదాయవాదాన్ని గానీ రొమాంటిసైజ్ చేయలేదు. దానికి బదులుగా, నిజాయితీతో కూడిన ప్రగతిశీలతకు ఆత్మవిమర్శ అవసరమని సూచిస్తుంది.
సమీక్ష తను సుచరితతో లివ్–ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నానని ఎంతో ప్రశాంతంగా ప్రకటించే క్లైమాక్స్ సన్నివేశం అత్యంత ఆసక్తికరం. దీనిని ఒక ఆశ్చర్యకరమైన రహస్యంగా కాకుండా, జరుగుతున్న వాదనలో ఒక తార్కిక ముగింపుగా చూపించడం మెచ్చుకోదగ్గ విషయం. ఆ సమయంలో సమీక్ష తల్లిదండ్రుల నిశ్శబ్దం, ముఖ్యంగా స్రవంతి విస్తుపోవడం చూస్టే, ఇన్నిరోజులుగా వాళ్ళు ఇతరుల పట్ల ప్రదర్శించిన వైఖరి, పక్క వాళ్ళ గురించి ఇచ్చిన తీర్పులే ఇప్పుడు వాళ్ళని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సన్నివేశం కథకి ఒక కొత్త ఒరవడిని వస్తుంది. తల్లిదండ్రులు తాము యువతి, యువకులుగా ఉన్నకాలంలో కీర్తించిన భావాలు, ప్రకటించిన నిబద్ధత కాల క్రమంలో సామాజిక హోదా కోసం విప్లవాత్మక భావజాలాన్ని స్వప్రయోజనాన్ని చూసుకుంటూ వదిలేసిన తీరుని కథ చూపిస్తుంది. అదే సందర్భంలో అభ్యుదయ భావాలు, లోపల పాతుకుపోయిన సంప్రదాయవాద ఆలోచనల మధ్య జరిగే ఘర్షణను కూడా ఈ కథ ప్రతిబింబిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఉంటూ తమను తాము liberalsగా చెప్పుకునే తల్లిదండ్రులు, సామాజిక గౌరవం కోసం తమ ఆదర్శాలకు ఎలా దురమయ్యారో కూడా ఈ కథ చూపిస్తుంది.
అద్భుతమైన గతమున్న తల్లిదండ్రులు వర్తమానంలో పర్ఫెక్ట్ జీవితాలను గడుపుతూ, తమగతాన్ని గుర్తుచేసే, ఇబ్బంది పెట్టే ఎవరినైనా నిశ్శబ్దంగా దూరం పెట్టటానికి వేనకాడటంలేదు. చైతన్యం అనేది కేవలం ఇతరుల్ని మెప్పించటానికో, ప్రధర్శనకో కాదు. జీవితంలో ఒక వ్యక్తి విలువలు వాటిని గురించి మాట్లాడటంలోనో, whatsup, Facebook లలో ఏ తరహా పోస్ట్లులు చేస్తున్నారనే దానిలో లేదు, నిజజీవితంలో ఏలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిమీద ఉంటుంది.
స్త్రీవాద కోణం నుండి చూస్తే, కుప్పిలి పద్మ కథ సమకాలీన భారతదేశంలోని మధ్యతరగతి వర్గాల ప్రదర్శనాత్మక అభ్యుదయపు డొల్లతనాన్ని బహిర్గతం చేస్తుంది. ఒకప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో లివ్-ఇన్ సంబంధాలను, స్త్రీవాద సాహిత్యాన్ని ఆదరించిన స్రవంతి, ఆర్థికంగా ఎదిగాక పితృస్వామ్య గౌరవ మర్యాదల కోసం తన సిద్ధాంతాలను నిశ్శబ్దంగా తాకట్టు పెట్టింది. “హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్” అనే ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి—అందులో సుష్మ ఆంటీ వంటి ఒంటరి మహిళలను, పిల్లలు లేని స్నేహితులను క్రమబద్ధంగా మినహాయించడం అనేది కేవలం సామాజిక ప్రాధాన్యత మాత్రమే కాదు; అది స్త్రీవాద విలువలనే అడ్డుకునే ఒక లోతైన పితృస్వామ్య చర్య. ఈ మినహాయింపులను, తమ పిల్లలను ప్రత్యామ్నాయ జీవనశైలి నుండి రక్షించుకోవటమనే సాకు ద్వారా, స్రవంతి ఒకప్పుడు సాంప్రదాయ కుటుంబాల్లో స్త్రీవాదం విమర్శించిన అదే సంరక్షణ (care) అనే భాషను ఇప్పుడు ఆయుధంగా మలుచుకుంది. కొంత మంది అగ్రవర్ణ/అగ్రశ్రేణి స్త్రీలు పితృస్వామ్య నిర్మాణాలను ఎలా తమలో ఇముడ్చుకుని, తిరిగి వాటినే ఉత్పత్తి చేస్తారో ఈ కథ వెల్లడిస్తుంది: సామాజిక కథనాలను నియంత్రించడం, స్త్రీల స్వయంప్రతిపత్తిపై పహారా కాయడం, సోదరీభావం (sisterhood) కంటే కుటుంబ గౌరవానికే ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో కనిపిస్తాయి. స్త్రీవాదం అనేది అధికార నిర్మాణాలను కూల్చివేసే నిబద్ధతగా కాకుండా, కేవలం ఒక లైఫ్ స్టైల్ యాక్సెసరీగా మారినప్పుడు, అది తాను వ్యతిరేకించిన సంప్రదాయవాదంలోనే కలిసిపోతుందని ఈ కథ నిరూపిస్తుంది.
ఈ కథలో సమీక్ష నిజమైన స్త్రీవాదిగా కనిపిస్తుంది. తన తల్లి వదిలేసిన విలువలను ఆమె తిరిగి రాడికల్ పద్ధతిలో పునరుద్ధరిస్తుంది. వాట్సాప్ గ్రూపుపై ఆమె చేసిన నిశితమైన విమర్శ , అలాగే ఒంటరి స్త్రీలు, విభిన్న లైంగిక ఎన్నికలు చేసుకున్న streelలందరినీ చేర్చుకుంటే తప్ప తాను ఆ ఫ్యామిలీ ట్రిప్‌లో పాల్గొననని చెప్పడం అన్ని వర్గాల స్త్రీల సమైక్యత కోసం ఆమె పెడుతున్న రాజీలేని డిమాండ్ ను తెలియజేస్తుంది. అలాగే సమీక్ష సుచరితతో తనకున్న లివ్-ఇన్ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా, తన తల్లి అసౌకర్యంగా భావిస్తారనే సాకుతో పక్కనపెట్టిన మిత్రులందరినీ ఆహ్వానించడం ద్వారా నిజాయితీ నిండిన తన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తుంది.
కుప్పిలి పద్మ సమీక్ష’ కథలోని పాత్రల అంతరంగాన్ని అమెరికన్ తాత్వికుడు థామస్ నాగెల్ (Thomas Nagel) తన’What is it to be a Bat?’వ్యాసంలో ప్రతిపాదించిన ఆత్మాశ్రయ అనుభవం (Subjective Experience) విషయగత చైతన్యం (Phenomenal Consciousness) అనే కోణాల నుండి విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతాయి. నాగెల్ వాదన ప్రకారం, ఒక జీవికి స్పృహ ఉందంటే, ఆ జీవిగా ఉండటంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. కథలో స్రవంతి, శ్రీకర్లు తమ అభ్యుదయ భావాలను కేవలం వస్తుగత సిద్ధాంతాలుగా మాత్రమే చూశారు తప్ప, సుష్మ వంటి సింగిల్ ఉమెన్ లేదా సమీక్ష వంటి భిన్నమైన లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆత్మాశ్రయ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. నాగెల్ చెప్పినట్లుగా, ఒకరు మరొకరి అంతర్గత అనుభూతిని కేవలం బయటి సమాచారంతో లేదా భౌతికమైన పోలికలతో పూర్తిగా గ్రహించలేరు. స్రవంతి తన సామాజిక హోదాను కాపాడుకోవడానికి సృష్టించిన వాట్సాప్ గ్రూప్ ఒక నిషిద్ధ వ్యవస్థ లేదా ఒక Closed System. ఇది ఇతరుల భిన్నమైన వ్యక్తిగత అనుభవాలకు చోటు ఇవ్వదు.
సమీక్ష తీసుకున్న నిర్ణయం నాగెల్ ప్రతిపాదించిన వ్యక్తి దృక్కోణపు ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. నాగెల్ దృష్టిలో మన అనుభవాలు కేవలం భౌతిక చర్యలు కావు. అవి అత్యంత వ్యక్తిగతమైనవి. సమీక్ష తన తల్లిదండ్రుల ‘కన్వెన్షనల్’ ముసుగును చీల్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని, సుచరితతో కూడిన కొత్త జీవితాన్ని ఎంచుకోవడమనేది, నాగెల్ చెప్పిన వ్యక్తి దృక్కోణా నికి నిదర్శనం. స్రవంతి తన సిద్ధాంతాలను కేవలం మేధోపరమైన చర్చలకే పరిమితం చేసి, ఆచరణలో ఇతరుల దృక్కోణాన్నిలేదా వాళ్ళ Subjectivity విస్మరించింది. అంటే, ఒంటరి స్త్రీ లేదా ఆర్ధికంగా వెనుకబడిన వాళ్ళ బాధను విస్మరించింది. చివరికి సుష్మ అన్నట్లుగా, స్రవంతి మాటల్లో పురోగామికగా కనిపించినప్పటికీ ఆచరణలో సాంప్రదాయకంగానే ఉండిపోయింది. అంటే, ఇతరుల అంతరంగాన్ని అర్థం చేసుకునే దృష్టి లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. నాగెల్ సిద్ధాంతం ప్రకారం, ఒక వ్యక్తి ఉనికిని లేదా ఎన్నికని గౌరవించడమంటే, వాళ్ళ స్థానంలో ఉండి ఆ అనుభూతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే, ఇది ఈ కథలో సమీక్షకు మాత్రమే సాధ్యపడింది.
హెలెన్ సిక్సస్ (Hélène Cixous) ప్రతిపాదించిన స్త్రీత్వ రచన (Ecriture Feminine) భావనను,ఆమె మౌలిక రచన The Laugh of the Medusa లోని భావనలను సమీక్ష కథకు అన్వయిస్తే, ఇందులో ప్రధానంగా పితృస్వామ్య చట్రాలను ఛేదించే ఒక కొత్త విషయం కనిపిస్తుంది. సిక్సస్ వాదన ప్రకారం, శతాబ్దాలుగా భాషతో పాటు ఆనేక సామాజిక నిర్మాణాలు పురుష కేంద్రితంగా (Phallogocentric) ఉన్నాయి, ఇవి స్త్రీల ఉనికిని కేవలం పురుషుడికి అనుబంధంగా లేదా ఒక నిర్ణీతమైన కుటుంబ చట్రంలో మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తాయి. కథలో స్రవంతి పాత్రను గమనిస్తే, ఆమె ఒకప్పుడు విప్లవాత్మక భావాలు కలిగినప్పటికీ, కాలక్రమేణా పితృస్వామ్య సమాజం నిర్దేశించిన ఆదర్శ కుటుంబం అనే భ్రమలో చిక్కుకుపోయింది. స్రవంతి తన స్నేహితులను వేరువేరు సాకులతో దూరం పెట్టడం అనేది, సిక్సస్ చెప్పినట్లుగా స్త్రీ తన సొంత జాతిని తానే అణచివేసే ఒక ‘సాంస్కృతిక కారాగారం’. స్రవంతి తన ఉనికిని సమాజం మెచ్చే ఒక మూసలో ఇరికించుకోవడం ద్వారా, తనలోని అసలైన స్త్రీ సహజత్వానికి స్నేహానికి గోడలు కట్టుకుంది. ఇది సిక్సస్ విమర్శించే పితృస్వామ్య తార్కానికి అద్దం పడుతుంది. సిక్సస్ ఇలా అంటుంది:
The future must no longer be determined by the past. I do not deny that the effects of the past are still with us. But I refuse to strengthen them by repeating them, to confer upon them an irremovability the equivalent of destiny, to confuse the biological and the cultural. — The Laugh of the Medusa, Signs: Journal of Women in Culture and Society, Vol. 1, No. 4 (Summer 1976), p.876
సిక్సస్ చెప్పినట్లుగా, స్త్రీ తన దేహాన్ని, తన కోరికలను, తన భాషను తానే రూపొందించుకోవాలి. సమీక్ష తన తల్లిదండ్రుల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించడమే కాకుండా, సుచరితతో తనకున్న సంబంధాన్ని నిర్భయంగా ప్రకటించడం ఆత్మాశ్రయ వ్యక్తీకరణకు ప్రతిరూపం. సిక్సస్ భావనలో స్త్రీ శక్తి అనేది కేవలం ఒక పురుషుడితో ముడిపడి ఉండదు. అది అనంతమైనది, వైవిధ్యమైనది. సమీక్ష తన తల్లి సృష్టించిన closed వాట్సాప్ గ్రూప్ బయటకు రావటం అనేది పాత సామాజిక ఒప్పందాల నుంచి, నియమాల నుంచి విముక్తి పొందడమే. ఆమె తనకంటూ ఒక కొత్త కమ్యూనిటీ ని నిర్మించుకోవాలనుకోవడం, లైంగికత, సంబంధాల విషయంలో పితృస్వామ్యం గీసిన గీతలను దాటడం ఒక విధమైన తిరుగుబాటుకు నిదర్శనం. చివరికి సుష్మ అన్నట్లుగా, సమీక్ష తన జీవితపు వెలుగుకు అడ్డుపడుతున్న ప్రతి అంశాన్ని నిలదీయగలిగే ఒక స్వతంత్రస్వరంగా ఎదిగింది, ఇది సిక్సస్ సిద్ధాంతాల్లోని ‘స్త్రీ తన స్వీయ కథను తానే రాసుకోవడం’ అనే అంశానికి నిర్దిష్ట అన్వయం.
ఈ కథలో సమీక్ష తన సంబంధం గురించి ఎంతో assertiveగా ప్రకటించడం అనేది సామాజిక చట్రాలను ధిక్కరించే చేసే ఒక చర్య. సమాజం దేనినైతే తప్పు అని ముద్రవేసి సిగ్గుపడేలా చేయాలని చూస్తుందో, దానిని సమీక్ష నిరాకరించింది. తన జీవితం పట్ల ఆమెకు ఉన్న స్పష్టత, ఆమెను ఆ సాంస్కృతిక కారాగారం నుండి విముక్తురాలిని చేసింది. ఇది పితృస్వామ్య వ్యవస్థ నిర్మించిన భావజాలంపై చేసిన దాడి. సిక్సస్ దృష్టిలోచి చూస్తే సమీక్ష కేవలం ఒక వ్యక్తి కాదు. ఆమె పాతకాలపు కట్టుబాట్లను తన గొంతుకతో, తన అస్తిత్వంతో బద్దలు కొట్టిన చైతన్యానికి ప్రతీక.
*

సమీక్ష – కుప్పిలి పద్మ
‘‘పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా… యెటైనా పోదామా’’ స్రవంతి తన ఫ్మామిలీ ఫ్రెండ్స్ వాట్స్ అప్ గ్రూప్ లో మెస్సెజ్ పెట్టింది.
వెంటనే నలుగురైదుగురు వెళదామని వుత్సాహంగా రియాక్ట్ అయ్యారు. యెక్కడికెళ్లాలాని అంతా మెస్సేజ్ ల్లో చర్చించుకుంటున్నారు.
స్విమ్మింగ్ నుంచి యింట్లోకి వచ్చిన కూతురు సమీక్షని చూస్తూ ‘స్మార్ట్ డోర్ లాక్ పెట్టి మంచి పని చేశాను. పొద్దుకులా యింట్లో కి బయటకి తిరిగే యీ పిల్ల కోసం చేస్తున్న పనాపి తలుపు తీసే శ్రమ తప్పింది’ అనుకుంటూ సమీక్ష కి టూర్ విషయం చెప్పి “యెక్కడికెళ్ళొచ్చు’’ అడిగింది స్రవంతి.
“మీ హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్ తోనా”, నవ్వుతూ సమీక్ష.
“అవును… పోయిన సారి యెగ్గొట్టావ్ … యీ సారి రావాలి” అంది స్రవంతి.
‘‘మా ఫ్రెండ్ సుచరితని కూడా రమ్మంటానంటే నువ్వు వద్దన్నావ్… అందికే నే రాలేదు… యీ సారి తనని కూడా తీసుకువెళడానికి వొప్పుకుంటేనే వస్తాను’’ అంది.
“ట్రావెల్ ప్యాకేజ్ యేవి బాగున్నాయో చూడు.” హాల్లో వాష్ బేసిన్ అద్దం ముందు నిలబడి షేవింగ్ క్రీమ్ గెడ్డానికి రాసుకుంటున్న శ్రీకర్ కూతురుతో అన్నాడు.
లాప్ టాప్ వోపెన్ చేసి చూస్తూ “వో… నార్త్ యీస్ట్ ప్యాకేజ్ సూపర్. సుష్మా ఆంటీనీ పిలమ్మా. వాటర్ ఫాల్స్ తన ఫేవరేట్ కదా ’’ సమీక్ష.
“యిది ఫ్యామిలీలుగా వుండే గ్రూప్ ట్రావెల్ కదా…”, స్రవంతి.
‘‘అయితే’’ కుతూహలంగా సమీక్ష.
‘‘తను సింగిల్ వుమెన్ కదా… యిక్కడ ఫిట్ కాదు’’
సమీక్ష మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయింది.
యేదో స్ఫురించినట్టు యింతకు ముందెప్పుడూ పట్టించుకోని వాట్స్ అప్ గ్రూప్ లో వారందర్ని పరిశీలనగా చూడటం మొదలు పెట్టింది సమీక్ష. పెళై పిల్లలున్న జంటలు మాత్రమే వున్నారు. పిల్లలు కూడా దాదాపు టీనేజ్ దాటిన వాళ్ళు. గత కొన్నేళ్ళు గా చేసిన రకరకాల ప్రయాణాల్లో యేవో కొన్నింటికి కొంత మంది మిస్ అయ్యారు. కానీ చాలా మంది కలిసి చాలసార్లు ప్రయాణించారు. అక్కడి మెస్సేజస్ ని… పంచుకుంటున్న ఫొటోస్ ని… వాళ్ళంతా యేయే విషయాలకి ప్రాముఖ్యత యిస్తున్నారో గమనిస్తూ కొంత సేపు ఆ గ్రూప్ ని చూసింది. యిక్కడంతా ఫర్ఫెక్ట్ గా భావించే ఫ్యామిలీ విషయాలు కలబోసుకుంటున్నారు. యిందులో భిన్న జీవితాలకి చోటు లేదు.
“అన్నయ్యా, నేనూ పుట్టినప్పటి నుంచీ మన యింటికొచ్చే వాళ్ళల్లో వొక్కరు కూడా యీ గ్రూప్ లో లేరు. ముఖ్యంగా సుష్మా ఆంటీ. మేం పుట్టక ముందు నుంచీ నీకూ, నాన్న కి ఆంటీ ఫ్రెండ్ కదా. స్ట్రేంజ్ …” అంది సమీక్ష.
“స్ట్రేంజ్ యేముంది… చెప్పానుగా తను సింగిల్ అని”, అంది స్రవంతి.
‘‘బై ఛాయిస్ సింగిల్ గా వుంది ఆంటి. అప్పట్లో డిఫరెంట్ లైఫ్ స్టయిల్స్ వుంటాయి… వాటిని గౌరవించాలని… సొపైటి వీటిని కలుపుకోవాలని స్టేజ్ లు యెక్కి మాటాడేవాళ్ళలో నువ్వూ వున్నావుగా… యిప్పుడేమో యిలా… ప్రోగ్రసీవనే కీర్తి కావాలి… ట్రెడిషన్ అందించే గౌరవం కావాలి. యే గట్టు’’ వెక్కిరింతగా అంటూ అప్పటి మీ గ్రూప్ లో వాళ్ళల్లో రాసేవారు…
సుష్మ ఆంటీని తమ యింట్లో జరిగే పార్టీల్లో… సెలబ్రేషన్స్ లో చూసి చాలా సంవత్సరాలయింది. వొక్క ట్రావెల్లోనూ లేదు. బయట జరిగే మీటింగ్స్ లోనో… పెళ్ళిళ్ళలోనో … మాత్రమే కలుసుకుంటున్నాం. వొక్క సుష్మ ఆంటీ నే కాదు… భర్త పోయినా నీరజా ఆంటీ, పిల్లలు లేని అమ్మ క్లాస్ మేట్ స్వాతి ఆంటీ … ఫైనాషియల్ గా యెదగని ప్రభావతి ఆంటీ యిలా అమ్మ నాన్న లకి దగ్గర స్నేహితులెవ్వరూ గత కొన్నేళ్ళు గా తమ యింట్లో జరిగే యే పార్టీ లోనూ చూడలేదు. యెందుకిలా… కొన్ని క్షణాలు ఆలోచించింది. అర్ధం కాక చివరికి –
‘‘పెళ్లి చేసుకుని జంటలుగా వున్న వాళ్ళని తప్పా లివింగ్ లో వున్నవాళ్ళని, సింగిల్ వుమెన్ని, లెస్పీబియన్స్ , యెకనమికల్ గా మన స్థాయి కాని వాళ్ళనీ, మనంత పవర్ఫ్ ఫుల్ కాని వాళ్ళని నువ్వు దూరం పెడుతున్నట్టనిపించింది ఆ గ్రూప్ ని చూస్తే. యెందుకలా’’ అడిగింది సమీక్ష .
‘‘ఫైనాషియల్ గా యెదగలేని వాళ్ళు యెదగలేకపోయామని బాధపడతారుగా. జంటలు జంటలుగా వెళుతున్నప్పుడు సింగిల్ వుమెన్ యీ జంటల్ని చూసి కలత చెందుతారుగా. అందుకే వాళ్ళను అమ్మ యీ గ్రూప్ లో కలప లేదు’’ అన్నాడు శ్రీకర్.
‘‘అందరితో కలవటం డిస్ కంఫర్ట్ గా వుందని వాళ్ళలో యెవరైనా చెప్పారా… ’’ అడిగింది సమీక్ష.
‘‘లేదు… అలా ఫీల్ అవ్వటం నేచరల్ కదా’’ స్రవంతి.
‘‘మీరే అలా డిసైడ్ అయ్యారా. పోనీ వీళ్ళల్లో కొంతమందినైనా అప్పుడప్పుడు మిక్స్ చేస్తున్నారాంటే అదీ లేదు…’’
‘‘ఆ గ్రూప్ లో చాలా మందికి టీనేజ్ పిల్లలున్నారు… వాళ్ళెవ్వరికీ డిఫరెంట్ లైఫ్ స్టయిల్ వున్న వారితో తమ పిల్లలు కలవటం యిష్టం లేదు. ఆ పిల్లలకి అటువంటి ఆలోచనలు వస్తాయేమోనని… పిల్లలు యిన్ఫ్లియన్స్ అవుతారని. ప్రతీ పేరెంట్ పిల్లలు నార్మల్ గా చక్కగా సెటిల్ అవ్వాలనుకుంటారు కదా… వేరే యిన్ఫ్లియన్స్ సెస్ పిల్లల మీద పడటం యిష్టం వుండదెవరికి’’ స్రవంతి.
సమీక్ష ఫోన్ లాప్ టాప్ ముందు లేచి ఫ్రిజ్ తెరచి డార్ఖ్ చాక్ లెట్ తీసుకొంది. కూతురు యెందుకంత రెస్ట్ లెస్ గా వుందాని స్రవంతి ఆలోచిస్తూంటే డోర్ బెల్. సమీక్ష తలుపు తీసింది. అమెజాన్ నుంచి పార్శిల్ . డెలివరి అతనికి వోటిటి నెంబర్ చెపుతూ సమీక్ష చేతుల్నుంచి పార్శిల్ అందుకొని ఆత్రంగా పార్శిల్ వోపెన్ చేసి వచ్చిన పుస్తకం చదవటంలో మునిగిపోయింది స్రవంతి.
హాల్లో అటూయిటూ పచార్తు చేస్తున్న సమీక్ష నిలువెత్తు బీరువాల్లో కిక్కిరిసి వున్న పుస్తకాల్ని చూస్తూ ‘‘మీ అందరికీ లిటరేచర్ కామన్ యిష్టం కదా. యెన్నెన్నో దేశాల కధలూ… నవలలూ చదివారు… ఆ యెసన్స్ మీ జీవితాల్లోకి ట్రాన్సలేట్ అయినట్టు లేదుకదా’’ అంది సమీక్ష.
చదువుతోన్న పుస్తకంలోంచి తలెత్తి స్రవంతి ‘యేమైవుంటుంది… ’ అనుకొంటూ శ్రీకర్ వైపు చూసింది.
అతను తలకి రంగు వేసుకొంటూ అద్దంలోంచే సమీక్ష వైపు, స్రవంతి వైపు మార్చిమార్చి చూస్తున్నాడు.
‘‘అర్ధం అయింది కనకే మీ జీవితాలు గాడి తప్పకుండా చూసుకున్నాం’’ వెటకారం… నవ్వు మిళితమైన గొంతుతో స్రవంతి.
సమీక్షకి జవాబులు చెపుతూ వున్నా మనసులో యింత సీరియస్ గా కుదురుగా యెందుకీ విషయాలు తను మాటాడుతుందని లోలోపల ఆలోచిస్తోంది స్రవంతి.
‘‘జీవితంతో యెన్నో యెక్స్పరమెంట్స్ చేసామన్నా మీరే యిలా డిఫరెంట్ రీజన్స్ తో సింగిల్ వుమెన్ అని క్లోజ్ ఫ్రెండ్స్ ని దూరం పెడితే మిగిలినవాళ్ళు యెలా ఆలోచిస్తారో… యిదంతా బాధేస్తుందమ్మా’’ అంది సమీక్ష.
స్రవంతి, శ్రీకర్ తెల్లబోయారు.
తన యవ్వన కాలంలో సిటీ కి చదువుకోడానికి వచ్చిన స్రవంతికి ఫెమినిజం పరిచయమయింది. అప్పుడే సుష్మ, స్వాతి, ప్రభావతి యిలా చాల మంది స్నేహితులయ్యారు. యూనివర్సిటీలో విధ్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా వుండే శ్రీకర్ తో స్నేహం. ప్రోగ్రసీవ్ సర్కిల్స్ లో అప్పటికే కొంతమంది యెంచుకున్న లివింగ్ రిలేషన్ వీళ్లిద్దరి ఛాయిస్ అయింది. అప్పటి సమాజంలో లివింగ్ రిలేషన్ కొత్త. వారివారి కుటుంబాలు వీరిని వదులుకోకపోయినా వీళ్ళ భవిష్యత్ గురించి కలత చెందారు. బెంగ పడ్డారు. బంధువులకి తెలిస్తే పరువుపోతుందని భయపడ్డారు. కానీ వొకే విధమైన భావాలూ… ఆలోచనలున్న స్నేహితులు వీరిద్దరిని వొప్పుకున్నారు. స్నేహంతో తోడుగా నిలిచారు.
న్యూ యెకనామిక్ పాలసీ మొదలైనప్పుడు వొక్క కుదుపుతో శ్రీకర్, స్రవంతి జీవితం ఆర్ధికంగా చకచకా యెదగటానికి అవకాశాలొ చ్చాయి. వాటి అందుకోవాలా వద్దానే అనేక సంశయాలుండేవి శ్రీకర్ లో. ఆర్ధికంగా యెదగడానికి వచ్చిన అవకాశాల్ని తాము వొప్పుకుంటే తామిప్పటి వరకూ మెలిగిన ప్రోగ్రసివ్ సమాజంలోని వారు తమని యెలా తీసుకుంటారోననే అనుమానం వారిద్దరిలో. యిద్దరూ చర్చించుకొని ఆ సమాజం వల్ల వచ్చే గుర్తింపుని… గౌరవాన్ని యెప్పటికప్పడు పెంచుకుంటూ… తాము ఆర్ధికంగా యెదగాలనీ నిర్ణయించుకున్నారు.
వేదికలు యెక్కినప్పడు మాటాడే యే మాటా పిల్లలకి చేరకూడదనుకున్నారు. తాము చదివిన పుస్తకాలు కాకుండా పర్సనాలిటీ డెవలప్మ్మెంట్ పుస్తకాలు మాత్రమే పిల్లలకి అందుబాటులో వుంచాలని నిర్ణయించుకున్నారు. పిల్లల కెరీర్… తమ ప్రాపర్టీ పెరుగుదల… పిల్లలకి పవర్ ఫుల్ సర్కిల్స్ నుంచి పెళ్ళుళ్ళు యివీ వారిద్దరూ వేసుకొన్న భవిష్యత్ రూట్ మ్యాప్. అయితే వాళ్ళిద్దరూ బయట ప్రపంచానికి చెప్పే విలువలు, వ్యక్తపరిచే ఆకాంక్షలూ వేరు.
పిల్లలిద్దర్ని కార్పరేట్ స్కూల్స్ లో చేర్పించింది స్రవంతి. తన పిల్లల క్లాస్ మేట్స్ తల్లులతో స్నేహం మొదలుపెట్టింది. శ్రీకర్ స్దాయి, సంపాదనా పెరిగేకొద్దీ పరిచయాల విస్తృతి పెరుగుతోన్న కొద్ది వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారుతూనే వుంది. తమ అనుకున్న సర్కిల్ ల్లో మరికొందరు గుభనంగా తమలానే అడుగులు వేస్తున్నారనే గమనింపు వీళ్ళిద్దరికి చాల రిలీప్ నిచ్చింది.
స్రవంతి తన పిల్లల మీద ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్స్ ఛాయిసస్ ప్రభావం పడకుండా ప్రొటెక్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీకర్ కూడా తన వంతు పూర్తి సహకారాన్ని అందించాడు. తమ టీనేజ్ నుంచి మిడిల్ యేజ్ వరకూ తాము నమ్మి మాటాడి అంతో యింతో ఆచరించిన వారితో స్నేహంగా వుండటం ప్రోగ్రసివ్ అనుకున్న వారిద్దరూ తమ పిల్లలిద్దరిపై మాత్రం ఆ ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
స్రవంతి, శ్రీకర్ తల్లితండ్రులు తమ పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్ణయించుకుంటారులేననే ధోరిణితో వుండేవారు. వారలా వుండటానికి తమ కుటుంబాల పేదరికం మాత్రమే కాక పిల్లల జీవితాలకి దారులు వేసే ఆ కొత్త పరికరమేదో వారు అందుకోలోకపోవటం మరో కారణం. ఆ విషయం స్పష్టంగా అర్ధమైన స్రవంతి, శ్రీకర్ లు తాము చేసే పనులు… నిర్ణయాల్ని తమ తల్లితండ్రులకి కేవలం యిన్ఫర్మే షన్ కోసం మాత్రమే చెప్పేవారు. అంతే… అంత వరకే. వాళ్ళ అభిప్రాయాల కోసమో… సంభాషించాలనో కానేకాదు. కొన్నిసార్లు యెప్పేవారు కూడా కాదు. కానీ స్రవంతి, శ్రీకర్ తమ పిల్లలు తాము చెప్పినట్టే వినాలని… తమ ఆకాంక్షలకి అనుగుణంగానే వాళ్ళ భవిష్యత్తులు తీర్చిదిద్దాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి విషయంలోనూ యిద్దరిదీ వొకటే మాట అనేకంటే స్రవంతి మాటే శ్రీకర్ మాట అయింది.
తమ పిల్లల పియర్ గ్రూప్ ని కాంషస్ యెఫర్ట్ పెట్టి తీర్చిదిద్దే ప్రోగ్రామ్ లో తమ పిల్లలు అడాల్సెంట్ యేజ్ లోకి వస్తున్నప్పుడు… అప్పటి వరకూ పిల్లల బారసాలకి, పుట్టిన రోజులకి తమ యింట్లో జరిపే సెలెబ్రేషన్ఫ్ కి పిలిచే అన్ కన్వెన్షనల్ లైఫ్ స్టయిల్ వున్న స్నేహితుల్ని సడన్ గా పిలవటం మానేసింది. అంతే కాదు స్నేహితులంతా వో బృందంగా వెళుతున్న ట్రావెల్ కి కూడా వాళ్ళని కలుపుకోవటం కూడా మానేసింది.
‘‘నువ్వొకప్పుడు చాలా యిన్స్పైరింగ్ గా వుండేదానివమ్మా. నువ్వు కూడా అందరిలానే స్నేహాల మధ్య గోడలు కడుతున్నావమ్మా… నువ్వే యిలా చేస్తే మామూలు మనుషులెలా బిహేవ్ చేస్తారో… ’’ బిట్టర్ గా అంది సమీక్ష.
‘‘నేనా…’’ ఆశ్చర్యపోతూ స్రవంతి.
‘‘అవును నువ్వే. పెద్దత్తయ్య, చిన్నత్తయ్యలు యిలా చేస్తే నేనేమి ఆశ్చర్యపోయేదాన్ని కాదు. పైగా అది నాకో విషయంగానూ వుండేది కాదేమో. బట్ నే చిన్నప్పుడు చూసిన మన యింటికీ యిప్పటి మన యింటికీ చాలా ఛేంజ్ వచ్చింది. మన స్థాయి… డబ్బులు పెరిగాయి. సొసైటీలో వొక యిన్ప్ ల్నెఫిషియల్ ఫ్యామిలీగా పేరొచ్చింది. హ్యాపీ ఫ్యామిలీగా గుర్తింపు. నాకు బాగా గుర్తు మన యింట్లో యే ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా మనతో వుండేవాళ్లు. వాళ్ళలో చాలామందిని నువ్వు వదిలేసావు’’.
‘‘వాళ్ళనెక్కడ వదిలేసాం… వాళ్ళిళ్ళకి వెళ్ళుతూనే వున్నాంగా నేనూ నాన్నగారు. అదే స్నేహం… అదే యెఫ్ క్షన్ మా అందరిలో’’ అంది స్రవంతి.
‘‘వారందరి స్నేహాల్ని వదులుకోలేదు. కానీ వాళ్ళు మనింటికి రాకుండా అన్ని జాగ్రత్తలూ పడతారు. మీరిద్దరూ క్రియేట్ చేసిన యీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్న వాట్స్ అప్ గ్రూప్ లో వాళ్ళని యింక్లూడ్ చెయ్యలేదు… మీకు యిప్పుడు యెక్స్లూడ్ చెయ్యటం ప్రోగ్రసీవ్ ’’ వెక్కిరింతగా అంది సమీక్ష.
కూతురు నిలదీతని అవాక్కయి చూస్తున్నాడు శ్రీకర్.
‘‘అందులో తప్పేముంది… అలా వుంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని… యిందాకట్నుంచి చూస్తున్నాను… చాలా చాలా అడుగుతున్నావ్… మేంమెవరిని దూరంగా పెట్టలేదు…’’ అంటూ శ్రీకర్ వైపు తిరిగి ‘‘ మాటాడవేం…’’ నవ్వుతూనే శ్రీకర్ మ్మీద గుర్రుమంది స్రవంతి.
స్రవంతిలా వెంటనే రియాక్ట్ కాలేని శ్రీకర్ చెవులకి అంటుకున్న రంగుని దూదితో తుడుచుకొంటూ తలాడించాడు.
‘‘సొసైటీ లో వుండే నామ్స్ కి వ్యతిరేకంగా నిలబట్టడం యెంత కష్టమో నీకు తెలుసా సమీ… ’’ అని ఆగి, శ్రీకర్ వైపు చూస్తూ ‘‘ఆ తలకి రంగు వేసుకోవడం అయ్యిందిగా… కాస్త నీ కూతురికి ప్రాక్టికల్ గా యెలా బతకాలో చెప్పు’’ తన ఆలోచనని పొరపాటు అని వొప్పుకోటానికి సంసిద్ధంగా లేని స్రవంతి, కన్న కూతురు నుంచి యింత డైరెక్టర్ అటాక్ ని భరించలేక శ్రీకర్ మీద విరుచుకుపడింది.
‘‘అసలు నీకిప్పుడొచ్చిన కష్టమేంటి’’ విసుగ్గా అడిగింది స్రవంతి.
‘‘సిగ్గుగా వుందమ్మా’’
‘‘ సిగ్గా …’’ ఆశ్చర్బపోతూ.
‘‘నాకేం యింజనీర్ న్ని కావాలని లేదు. కానీ నువ్వు నాన్నతో పోట్లాడి మరీ చదింవించావు. పైగా అందరికీ అదేదో నా ఛాయిస్ లా ప్రచారం చేసావ్. నాకు నచ్చిన చదువుని చదవనివ్వలేదు. ప్రపంచమంతా రకరకాలుగా మారిపోయినా మీరిద్దరూ యెప్పటికీ మానవీయంగా వుంటారనే బిల్డప్ పైకి. పైగా మన చుట్టూ వున్న వాళ్ళకి రోల్ మోడల్ ఫ్యామిలీ పోస్ట్స్ ఫేస్ బుక్ లో. కానీ రోజురోజుకీ వొకప్పుడు ఫ్యామిలీ ఫ్రేమ్ వర్క్ లో వుండే పేట్రియాటిక్ వ్యాల్యూస్ కి దగ్గరగా మారిపోతున్నారు. యెదుటి వాళ్ళ మీద నువ్వు చూపిస్తున్న పవర్ నాకు క్లియర్ గా అర్ధమవుతూ వున్నప్పుడు ‘మా అమ్మ నాకు రోల్ మోడల్’ అని నా చిన్నప్పుడు అనుకున్నట్టు యిప్పుడనుకోలేకపోతున్నానమ్మా… నా చిన్నప్పుడు చాలా యిన్స్పైరింగ్ గా వుండే దానివమ్మా. నువ్వే యిలా చేస్తే మామూలు వాళ్ళు యెలా బిహేవ్ చేస్తారో చెప్పు’’ బాధగా అంది సమీక్ష.
‘‘కలత చెందుతారని గ్రూప్స్ గా డివైడ్ చేసాం… విడివిడిగా కలుస్తున్నాం. పార్టీలు యిస్తున్నాం. అందులో తప్పేముంది… వాళ్ళ కంఫర్ట్ కూడా ముఖ్యమే కదా… ’’ అన్నాడు శ్రీకర్.
‘‘అది మీ కంఫర్ట్… వాళ్ళది కాదు. మీరే డిసైడ్ అయిపోయారు. పోనీ కన్వెన్షనల్ … అన్ కన్వెన్షనల్ స్నేహితుల్ని మిక్స్ చేస్తున్నారా అంటే అదీ లేదు. వేరే వాళ్ళు యిలా మారితే యేమోగాని యెంతో చదువుకొని… జీవితంతో యెన్నో యెక్స్పరమెంట్స్ చేసామన్నా మీరే యిలా మారిపోవటం బాధేస్తుంది. యిలా డివైడ్ చేసీచేసీ యెన్ని ముక్కచెక్కలగా చేస్తారమ్మా స్నేహితుల్ని… మనుషుల్ని… అసలు మనుషుల్ని కలిపేవారేలేరా’’ అని ఆగి కుదురుగా సోఫాలో కూర్చుని ‘‘మీరు చేసే ట్రావల్.. యిచ్చే పార్టీలు… జెండర్… కులం… మతం… మారిటల్ స్టేటస్… సెక్స్ స్టేటస్… యివి యేవి పట్టించుకోకుండా ప్ర్నెండ్స్ ని కలుపుకుపోతెనే వస్తాను. లేకపోతే రాను’’ ఖచ్చితంగా చెప్పేసింది సమీక్ష.
కూతురు ఖచ్చితనాన్ని బిత్తరపోయి చూస్తున్నాడు శ్రీకర్.
స్రవంతి తన ఆలోచనలో తన నడవడికలో తనెప్పుడూ కరెక్ట్ అనుకునే స్వభావమేమో యింత డైరెక్టర్ అటాక్ ని భరించలేక ‘‘అలా గోడకు కొట్టిన సున్నంలా నిలబడి చూడకపోతే నీ కూతురికి ప్రాక్టికల్ గా వుండటం యెంత యింపార్టెంటో చెప్పొచ్చుగా’’ శ్రీకర్ మీద విరుచుకుపడింది.
‘‘మాట్లాడింది చాలుకానీ… మెసేజ్ ల మీద మెసేజ్ లు వస్తున్నాయి… అంతా వెయిటింగ్… ఆ ట్రావెల్ ప్లాన్ విషయం చూడు సమీ’’ అంది స్రవంతి.
‘‘ఆఁ… అసలు స్నేహాల్లో యిలాంటి స్ర్కూటినీలేమిటమ్మా. ఆ ట్రావెల్ ప్లాన్ యేదో మీరే చేసుకోండి’’ అని సమీక్ష హాల్లో నుంచి బయటకి వెళ్లిపోయింది ‘వీళ్ళు మారరు’ అనుకుంటూ చికాకుతో.
అనేక పూలరాగ సౌరభాలు గాలికి చెదిరిన సమీక్ష జుట్టు సుచరిత మొహం నిండా కమ్ముకుంటోంది.
తామిద్దరూ కలిసిన ప్రతిసారి హృదయంలో మోగే మకరంద మువ్వల పరిమళల సవ్వడిని జీవితమంతా ప్రవహింప చేసుకోవాలని తమతమ మనసుల్లోని మాటని వొకరికొకరు చెప్పుకున్నారు సమీక్ష. సుచరిత.
‘‘మా యింట్లో వొప్పుకోరు” అంది సమీక్ష.
“మీ యింట్లో కూడా వొప్పుకోరా”ఆశ్చర్యంగా సుచరిత.
“వూ…”
“అదేమిటి వాళ్లెంతో ఫార్వర్డ్ కదా”
మౌనం .
“కొత్తగా ఆలోచించటం మా పేరెంట్స్ మానేసారని యిప్పుడిప్పుడే నాకర్ధమవుతోంది. అది కూడా మనిద్దరి స్నేహం తరువాతే. యెప్పుడైతే మన జీవితానికో మానసిక అవసరమోస్తుందో అప్పుడే మనం క్లోజ్ గా మన యింట్లో వారిని, సొసైటీ ని అబసర్వ్ చేస్తామనుకుంటాను… ” అంది సమీక్ష.
‘‘అసలు నువ్వు మీ వాళ్ళతో మాటాడావా’’
‘‘ఐ యామ్ ఫీలింగ్ నర్వస్… సింగిల్ వుమెన్ని కూడా వాళ్ళు యాక్స్ ప్ట్ చెయ్యటం లేదు. యింక మనల్ని వెల్కమ్ చేస్తారా?’’
“అంటే మనిద్దరం అలోన్ గా మన ఫ్యామిలీని లీడ్ చెయ్యాలా?”
“అలోన్ గా యెందుకుంటామ్… మనలా వున్నవాళ్ళమంతా వొక కమ్యూనిటిగా వుంటాం… కలిసి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ యెనీ ఫ్యామిలీలా మనం కూడా బతుకుతాం’’ అంది సమీక్ష.
‘‘అంటే యింటర్ క్యాస్ట్, యింటర్ రిలిజియన్ మ్యారేజస్ ని అంతో యింతో వొప్పుకోడానికి పట్టినట్టే మనల్ని కలుపుకోడానికి టైమ్ పడుతుందన్నమాట… ’’ అంది సుచరిత.
“ఫ్యామిలీ వాట్స్ అప్ నుంచి యెగ్జిట్ అయ్యావెందుకు” నిదానమైన స్వరంతో స్రవంతి.
“ఐ యామ్ నాట్ ఫిట్ ఫర్ థేర్ ” అంతకంటే నిదానంగా సమీక్ష.
“అంటే ”
“ఫ్యామిలీకి నువ్విచ్చే డిఫనేషన్ లో నా ఛాయిస్ ఫిట్ కాదని”
స్రవంతి తరువాతి మాటల కోసం తడుముకుంటూ మెల్లగా “పెళ్ళి చేసుకోవా… లివింగ్ రిలేషన్ వొకే కదా” అంది.
కొన్ని క్షణాల మౌనం తర్వాత – “యస్… లివింగ్ రిలేషన్ లో వుండాలనుకున్నాం నేనూ సుచరిత ” అంది సమీక్ష.
స్రవంతి కళ్ళల్లో తన అంచనా దెబ్బతిన్న పెంపకపు నిరాశ. వుక్రోషం.
శ్రీకర్ వులిక్కిపడ్డాడు.
స్రవంతి తదుపరి మాటల కోసం తడుముకుంటూ వుంది. స్టేజ్ మీద నాటకం వేస్తున్నప్పుడు మర్చిపోయిన డైలాగ్ ని అందించే ప్రాంప్ట్ కోసం యెదురు చూస్తున్నట్టు శ్రీకర్ వైపు చూసింది స్రవంతి.
‘‘సొసైటీ నామ్స్ కి వ్యతిరేకంగా నిలబట్డం యెంత కష్టమో నీకు తెలియటం లేదు సమీ’’ తడబడే గొంతుతో శ్రీకర్.
‘‘సుష్మ ఆంటీతో మాట్లాడాను… మార్పు మెల్లగానో… స్పీడ్ గానో వస్తుంది… కానీ నాకిదే కంఫర్ట్… త్వరలో మేమిద్దరం వొకే యింట్లోకి మారబోతున్నాం… కన్వెన్షనల్ అన్ కన్వెన్షనల్ అందర్ని పార్టీకి పిలుస్తున్నాం… రావాలో లేదో మీ యిష్టం’’ అంది సమీక్ష.
తామిద్దరూ యెలా అయితే యిన్షర్మేషన్ గానే తమ పేరెంట్ప్ కి తాము లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసామని చెప్పారో అచ్చు అలానే చెపుతున్న కూతుర్ని నిశ్చేష్గురాలై చూస్తోంది స్రవంతి.
కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చుని రకరకాల యిష్యుల మ్మీద యీ యేడాది చెయ్యాల్సిన వర్క్ షాప్స్… పెట్టాల్సిన కాన్ఫరెన్స్ లు… చెయ్యాల్సిన పనుల జాబిత క్యాలెండర్ ని తయ్యారు చేస్తు అనేక అంశాలకి సంబంధించిన డేటాని పరిశీలిస్తున్న సుష్మ “ సేమ్ సెక్స్ పార్టనర్స్ ని కోరుకుంటున్న వాళ్ళ డేటాచూసావా ప్రవీణ’’ అడిగింది.
“ఆ పర్సంటేజ్ అలర్మింగ్ గా వుంది కదా… యేమోనబ్బా… ఆ డేటా అనలైజ్ చేస్తున్నప్పుడంతా ఆ పిల్లల పేరెంట్స్ యెలా తట్టుకుంటారానిపించి మనసు వికలమైపోతుందనుకో… ” దిగులుగా అంది ప్రవీణ.
‘‘అందికే కదా శ్రుతి… మనం యీ డేటాని బేస్ చేసుకొని వొక మీటింగ్ కండెక్ట్ చెయ్యటం… సేమ్ సెక్స్ రిలేషన్ యింత మంది ఛాయిస్ అవుతున్నప్పుడు వీరి కుటుంబాలు, వీరిని చుట్టూ సమాజం ఆమోదించి తమలో కలుపుకోకుండా ఐసోలైట్ చేస్తే వచ్చే సమస్యలు యేంటో… యెలాంటివో… ఖచ్చితంగా మాటాడాలి. అలానే అవి వాళ్ళ ఛాయిస్ యెందుకు అవుతున్నాయో… వాటి చుట్టూ యేయే అంశాలు వున్నాయో… ఆ ఛాయిస్ కి యేమైనా తాత్విక భూమిక వుందా… యివన్ని అర్ధం చేసుకోవాలంటే యెంతో మాటాడుకోవాలి. అప్పుడే వీటిని కోరుకుంటున్న వాళ్ళకి… చుట్టూ సమాజానికి బోలెడన్ని విషయాలు అర్ధం చేసుకొనే స్పేస్ దొరుకుతుంది. ఫ్యామిలిలో వాళ్ళకి… వర్క్ ప్లేస్ లో … పబ్లిక్ ప్లేసెస్ లో వీరిని యెలా కలుపుకోవాలని సెంసిటైజ్ చెయ్యగలం… ’’ అంది సుష్మ.
‘‘ట్రూ… యే ప్యానలిస్ట్ లని తీసుకోవచ్చనే లిస్ట్ ని షేర్ చేసాను… వో సారి చూడు ’’ అంది ప్రవీణ.
లిస్ఠ్ ని చూస్తూ ‘‘ స్రవంతి వద్దు’’ అంది సుష్మ.
‘‘తను లైప్ స్టయిల్ యిష్యూల్లో యెక్సపర్ట్ కదా… యేం… యెందుకు’’
‘‘ధియరీలో… మాటల్లో వెరీ గుడ్… కానీ తను సింగిల్ వుమెన్ని కూడా ఫ్యామిలీగా కలుపుకోలేదు… కన్వెన్షనల్ మైండ్ సెట్ ’’ అంది సుష్మ.
‘‘యిలా అడుగుతున్నానని ఫీల్ కాకు… పర్సనల్ రీజన్స్ తో వద్దంటున్నావా’’ అడిగింది ప్రవీణ.
‘‘ స్రవంతి చాలా యేళ్ళుగా మన సర్కిల్లో అన్ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ ని… కన్వెన్షనల్ ఫ్యామిలీస్ స్నేహాల్ని డివైడ్ చేసి చూస్తోంది. అంత పెద్ద సెమినార్ లో తనకి పెద్ద పీట వెయ్యటమెందుకు… ఆ ప్లేస్ లో యంగ్ స్టర్స్ ని తీసుకొందాం… ’’ అంది సుష్మ.
’’నాకు తెలిసిన పేర్లన్నీ రాసాను. నీకెవరైనా తెలిస్తే సజెస్ట్ చెయ్యి’’ అంది ప్రవీణ.
సుష్మ రాసిన పేరు రాసిన పేరు చూస్తూ ‘‘సమీక్ష… పేరు భలే వుందే… యెవరు’’ కుతూహలంగా అడిగింది ప్రవీణ.
రూమ్ లో నుంచి బయటకు వెళ్ళబోతున్న సుష్మ ఆగి మెరిసే చూపులతో థీమగా చెప్పింది ‘‘తమ జీవితాల వెలుగుకి అడ్డుపడుతున్నాయనే అంశాల్ని గమనిస్తే యింట్లో వారి నైనా… బయట పరిస్ధితులనైనా నిలదీయగలిగే యీ జనరేషన్ ప్రతినిధి’’ .
***
అనేక సౌజన్యంతో …

