రెండో పెళ్ళి

Spread the love

        నా నాలుగేళ్ళ కొడుకు రామ్ స్వరూప్ ని చూస్తూ ఉంటే, వాడిలో రెండేళ్ళ క్రితం కనిపించిన అమాయకత్వం,ఆకర్షణ నాకు కనిపించటం లేదు. వాడు నా వంక ఎర్రబారిన కళ్ళతో కఠినంగా చూస్తూ ఉంటాడు. వాడిని అలా చూస్తూ ఉంటే, నాకు భయం వేస్తుంది.వాళ్ళ అమ్మ మరణశయ్య మీద ఉన్నప్పుడు నేను తనకి చేసిన వాగ్దానం గుర్తుకి వస్తుంది.‌ మనిషి ఎంత స్వార్థపరుడు,‌ ఎంత ఇంద్రియలోలుడంటే కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అతనికి తన కర్తవ్యం గుర్తుకి వస్తుంది.

        ఆమె ఇక కోలుకోవడం అసంభవమని వైద్యుడు ఆశలు వదులుకున్న రోజున , ఆమె ఏడుస్తూ నన్ను అడిగింది, “ మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా? మీరు అలా చెయ్యకూడదు.” తరవాత హఠాత్తుగా తుళ్ళిపడి, ఆమె ఇలా అంది, “ నా రాముడి గతేమిటి? వీలైతే, వాడిని జాగ్రత్తగా చూసుకోండి.”

      “ అలాగే, అలాగే. నేను ఎన్నడూ మళ్ళీ పెళ్ళి చేసుకోనని నీకు ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు రామ్ స్వరూప్ గురించి ఆందోళన పడవద్దు. నువ్వు ముందు కోలుకోగలవా?” అన్నాను నేను.

    ఆమె వీడ్కోలు చెప్తున్నట్టుగా తన చేతులని నా వైపు చాచింది.

రెండు నిమిషాల తరవాత నా కళ్ళ ముందు ప్రపంచం చీకటి గా అయిపోయింది.‌ రామ్ స్వరూప్ తల్లి లేని వాడయ్యేడు. రెండు, మూడు రోజుల పాటు నేను వాడిని నా గుండెలకు హత్తుకుని వదల్లేదు.

     నా శలవు పూర్తి అయ్యేక, నేను వాడిని మా నాన్న దగ్గర వదిలిపెట్టి, నా విధి నిర్వహణకు వెళ్ళేను.

     సుమారు ఒక మూడు  నెలల పాటు నా మనసు మనసులో లేదు. దిగులు నన్ను కమ్ముకుంది. ఇంకో దారి లేదు అన్నట్లు నేను నా ఉద్యోగానికి వెళ్ళేవాడిని.‌రకరకాల తలపులు నా మదిలో కదలాడేవి.‌ డబ్బు కోసం ఒక రెండు, మూడేళ్ళు పని చేసి, నేను ప్రపంచ యాత్ర కి వెళతాను; నేను అది చేస్తాను, ఇది చేస్తాను.. ఇలా ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవి.  కానీ, దేని మీద శ్రధ్ధ ఉండేది కాదు.

     రకరకాల ప్రదేశాల నుంచి నాకు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయని తెలియజేస్తూ, నాకు ఇంటి నుంచి క్రమం తప్పకుండా ఉత్తరాలు వచ్చేవి. మనుషులు మంచి వాళ్ళు, పెళ్ళి కూతురు అందమైనదీ తెలివైనదీ;  అలాంటి  జాగా నుంచి అలాంటి అవకాశం మళ్ళీ, మళ్ళీ అందరికీ రాదు.‌ ఎలాగూ నువ్వు పెళ్ళి చేసుకోవాలి. కనుక ఇప్పుడే చేసుకో.‌ ప్రతీ చిన్న విషయానికీ నా అభిప్రాయం అడిగేవారు.

    కానీ, ప్రతీసారీ నేను నిరాకరించేవాడిని.‌ అసలు స్వర్గం నుంచి లభించిన బహుమతి లాంటి అందమైన,‌అంకిత భావం కలిగిన భార్య మరణిస్తే ఎవరైనా రెండో పెళ్ళి ఎలా చేసుకోగలరు అని నేను విస్తుపోయేవాడిని.

     కాలం గడుస్తోంది. స్నేహితులు నన్ను ఒత్తిడి చెయ్యసాగేరు.‌ వాళ్ళు ఇలా అనేవారు, “ అబ్బ, ఇక చాలించు. ఆడవాళ్ళు మనం కాలికి తొడుక్కునే చెప్పుల వంటివారు. ఒక చెప్పు చిరిగిపోతే, కొత్తది వేసుకుంటాం కదా!”

   “ ఛ, ఛ, మీరు స్త్రీ జాతిని ఎంత అవమానిస్తున్నారు,” అంటూ నేను వాళ్ళ నోళ్ళు మూయించేవాడిని.

        ఎంతో ఘనత వహించిన మన సమాజం విధవా పునర్వివాహాలకు అంగీకరించనప్పుడు, నేను మాత్రం ఒక  కన్య ను ఎలా పెళ్ళాడగలను? మన సమాజం తన తప్పుని సరిదిద్దుకునే వరకు నేను కన్యని కాదు కదా, విధవరాలిని కూడా పెళ్ళాడే ప్రసక్తి లేదు.‌అసలు నా ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇటువంటి లక్ష్యం కోసం ప్రచారం చెయ్యడం ఎంతో మంచి ఉద్దేశ్యం.

     కానీ నా గుండెలో చెలరేగిన భావాలను నేను ఎలా వ్యక్తపరిచేది? నా ఆలోచనలను ఆచరణలో పెట్టలేని నా నిస్సహాయతను నేను గుర్తించేను.‌ నేను నా వ్యక్తిత్వాన్ని దృఢపరుచుకోలేక పోయేను. నేను చెప్పిన వాటిని ఆచరించలేక పోయేను. ఆరు నెలలు గడిచేక, నేను ఒక కన్య ని పెళ్ళాడేను.

    ఎలాగో ఒకలాగ నేను ఒప్పుకున్నందుకు మా ఇంట్లో అంతా సంతోషించేరు.‌ ఆ రోజున విద్యాధికులైన నా బంధువులు ఒకరిద్దరు మాత్రం నన్ను మందలించేరు, “ నువ్వు కేవలం విధవరాలినే పెండ్లాడతానని ఏవో పెద్ద, పెద్ద మాటలు చెప్పేవు.‌ఆ ప్రతిజ్ఞలన్నీ ఏమయ్యేయి?  మేం నీ గురించి చెప్పుకోగలిగిన మంచి ఉదాహరణగా నువ్వు నిలబడలేదు.”

       ఆ మాటలు నా మీద మట్టి కుండలతో చల్లటి నీళ్ళు కుమ్మరించినట్టుగా అయి, నాకు తెలివి వచ్చింది.నా కళ్ళు తెరుచుకున్నాయి.‌ యవ్వనోద్వేగం లో నేను ఏం చేసాను? మళ్ళీ పాత ఆలోచనలు నన్ను చుట్టుముట్టేయి.‌నేను ఇవాళ్టికీ  వాటిలో  పడి,పొర్లుతూనే ఉన్నాను.

       నేను ఇలా ఆలోచించేను: నౌకర్లు నా కొడుకుని పెంచలేరు. ఆ పని కేవలం ఇంటి ఇల్లాలు మాత్రమే చెయ్యగలదు. నేను పెళ్ళి చేసుకుంటే ఒక స్త్రీ వచ్చి నా ఇంట్లో కాపురం ఉంటుంది; నేను రామ్ స్వరూప్ ని నా వద్దకు తెచ్చుకుని ప్రత్యేక శ్రద్ధ తో చూసుకోవచ్చు.‌ కానీ, సరిగ్గా రాయని అక్షరాలు తుడిచేసినట్టు  అలాంటి ఆలోచనలన్నీ తుడిచివెయ్యబడ్డాయి.‌ నేను మళ్ళీ రామ్ స్వరూప్ ని నా తండ్రితో నివశించడానికి ఊరికి పంపాల్సి వచ్చింది.‌ కారణం ఏమీ రహస్యం కాదు. ఏ ఆడదైనా తన సవితి కొడుకుని ఎలా ప్రేమిస్తుంది? పెళ్ళి సమయంలో ఆ అమ్మాయి చాలా మంచిదనీ, తన వాళ్ళందరినీ బాగా చూసుకుంటుందనీ నేను విన్నాను.‌ నా కొడుకుని కూడా తన స్వంత కొడుకులా చూసుకుంటుందని చెప్పడం జరిగింది. కానీ, అదంతా ఉత్త అబద్దం.‌ ఒక స్త్రీ ఎంతటి మంచితనం కలిగినదైనా, ఆమె తన సవితి పిల్లలను ఎన్నటికీ ప్రేమించలేదు.‌

        శీలవతి అయిన భార్య కి తన ఆఖరి ఘడియల్లో ఇచ్చిన వాగ్దానాన్ని తప్పినందుకు నాకు మిగిలిన గుండెకోత ఇది!

Aruna Prasad
రోసి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *