ఠాకూరు గారింటి నుయ్యి

Spread the love

           జోఖూ లోటా ఎత్తి నోటి దగ్గర పెట్టుకునేసరికి, నీళ్ళు గుప్పుమని కంపు కొట్టేయి. అతను గంగిని అడిగేడు, “ అసలు ఇవేం నీళ్ళు? ఇంత కంపు కొడుతున్నాయి.‌ ఇవి తాగడం నా వల్ల కాదు.‌ నాకు గొంతెండిపోతోంది. నువ్వు తాగడానికి ఈ కంపు నీళ్ళు ఇస్తున్నావు.”

         గంగి ప్రతీ రోజూ సాయంత్రం నీళ్ళు తెస్తుంది.‌ నుయ్యి చాలా దూరాన ఉండటాన, అస్తమానూ వెళ్ళి తేవటానికి కుదరదు.‌నిన్నటి సాయంత్రం నీళ్ళు తెచ్చినప్పుడు ఏ వాసనా లేదు. మరిప్పుడు ఈ కంపు ఎక్కడ నుంచి వచ్చింది? లోటా ముక్కు దగ్గర పెట్టుకు చూసింది. నిజంగానే నీరు కంపు కొడుతోంది.‌ ఏదో జంతువు నూతి లో పడి, చచ్చి ఉంటుంది.‌ కానీ ఇప్పుడు వేరే నీళ్ళు ఎక్కడ నుంచి తేవాలి?

        ఠాకూరు గారింట్లో నుయ్యి ఉంది గానీ, తనని ఆ గుమ్మం కూడా ఎక్కనివ్వరే! దూరం నుంచే తిట్టి, తరిమేస్తారు. ఊరికి అటువైపున, షావుకారు గారింట్లో కూడా నుయ్యి ఉంది. కానీ వాళ్ళు కూడా తనని నీళ్ళు తోడుకోనివ్వరు. ఊళ్ళో ఇంకెక్కడా నూతులు లేవు.

       జోఖూ కి కొన్నాళ్ళుగా ఒంట్లో బాగులేదు.‌ కాసేపటి వరకు అతను దాహాన్ని తట్టుకుంటూ పడుకున్నాడు. కానీ, ఇక అతని వల్ల కాలేదు. “ ఇదిగో, చాలా దాహం గా ఉంది. ఇక నా వల్ల కాదు.‌ఏవో ఒక నీళ్ళు తే. ముక్కు మూసుకుని, ఒక గుక్కెడు నోట్లో పోసుకుంటాను.”

       కానీ గంగి అతడికి ఆ కంపు నీరు ఇవ్వలేదు.‌ ఆ నీళ్ళు తాగితే అతను మరింత జబ్బు పడతాడని తనకు తెలుసు.‌ అయితే నీళ్ళు మరిగిస్తే , అవి బాగు పడతాయని మాత్రం తనకి తెలీదు “ ఈ నీళ్ళు ఎలా తాగుతావు? ఏ జంతువు నూతిలో పడి చచ్చిందో ఎవరికి తెలుసు?  నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకు వస్తాను.”

          జోఖూ ఆశ్చర్యంగా తన వంక చూసేడు. “ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు?”

        “ ఠాకూరు గారింట్లో, షావుకారు గారింట్లో రెండు నూతులున్నాయి కదా! నన్ను ఒక లోటాడు నీళ్ళు తోడుకోనివ్వరా?”

        “ కాళ్ళు, చేతులు విరగ్గొడతారు,అంతే తప్ప ఏం లాభం లేదు. బాపనోళ్ళు నిన్ను శపిస్తారు.‌ ఠాకూరు గారు బడితె పూజ చేస్తారు.‌ షావుకారు ఒకటికి, అయిదు రూపాయలు తీసుకుంటాడు. పేదోళ్ళ గోడు ఎవరికి  పడుతుంది? మనం చచ్చినా, ఎవరూ మన గుమ్మం వేపు తిరిగి కూడా చూడరు.‌ శవాన్ని లేపడానికి భుజం సాయం చెయ్యడం సంగతి పక్కన పెట్టు.  వాళ్ళు మనని నూతిలో నీళ్ళు తోడుకోనిస్తారనుకుంటున్నావా?”

             ఇదే చేదు నిజం.‌గంగి ఏం మాట్లాడగలదు? అయినా కూడా గంగి జోఖూ కి  తాగడానికి ఆ కంపు నీళ్ళు ఇవ్వలేదు.

                                                             2

                  రాత్రి తొమ్మిది గంటల వేళ అలిసిపోయిన నౌకర్లు అందరూ నిద్ర పోతున్నారు.‌ కొంతమంది సోమరిపోతులు మాత్రం ఠాకూర్ గారి వరండాలో కూర్చుని, బాతాఖానీ కొడుతున్నారు.‌ కండబలం, ధైర్యం గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయేయి. ఇక ఇప్పుడు కోర్టు కేసుల్లో తమ తెలివి తేటల ప్రదర్శన గురించి గప్పాలు నడుస్తున్నాయి.  ఎంత తెలివిగా ఠాకూరు గారు ఒక వ్యాజ్యం లో ఇన్స్పెక్టర్ కి లంచం ఇచ్చి బయట పడ్డారో చెప్పుకుంటున్నారు. గుమాస్తా, ఆఫీసరు ఇద్దరూ నకలు ప్రతి తీసుకోవడం కుదరదని చెప్పినా కూడా,‌ఒక ముఖ్యమైన తీర్పు తాలూకు నకలు ప్రతిని ఎలా తెలివిగా సంపాదించిందీ గొప్పలు చెప్తున్నాడు.‌ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా! లోకం తీరు తెలిసి ఉండాలి.‌

     సరిగ్గా అప్పుడే, గంగి నీళ్ళు తోడుకోవడానికి నూతి వద్దకు వచ్చింది.

నూతి మీద దీపం వెలుగు పడింది. గంగి చటుక్కున నూతి చప్టా దిగి, వెనక్కి నక్కి, సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది.‌ ఊరు ఊరంతా ఈ నూతి నీళ్ళు తాగుతారు. ఎవ్వరికీ అడ్డు లేదు. కేవలం ఈ దురదృష్టవంతులు మాత్రం తోడుకోకూడదు.

               గంగి మనసులో ఈ ఆచారాలు,నిషేధాల పట్ల తిరుగుబాటు జ్వాల రగిలింది.‌వాళ్ళు ఎక్కువ ఏమిటి? తమ తక్కువ ఏమిటి? మెడ లో ఒక జందెప్పోగు వేసుకున్నంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోతారా?

ఇక్కడున్నవాళ్ళంతా ఒకడిని మించిన నీచుడు ఇంకొకడు. దొంగతనాలు, మోసాలు వాళ్ళు చేసి, తప్పుడు కేసులు బనాయిస్తారు.‌మొన్నటికి మొన్న ఈ ఠాకూరు పాపం, ఆ బీద వాడి గొర్రె ని దొంగిలించి, కోసుకుని తినేసాడు.‌ పూజారి గారింట్లో పొద్దస్తమానం పేకాట నడుస్తూనే ఉంటుంది. ఇక షావుకారు నేతిలో నూనె కల్తీ చేసి అమ్ముతాడు. గొడ్డు చాకిరీ చేయించుకుంటారు గానీ కూలీ డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం పోతుంది.‌ వీళ్ళంతా తమ కన్నా ఎలా పెద్ద వాళ్ళు?  నిజమే!మేం పెద్ద వాళ్ళం, మేం గొప్పోళ్ళం అని వాళ్ళ లాగా ఊరంతా తాము అరిచి చెప్పడం లేదు కదా! ఆ రకంగా వాళ్ళు పెద్ద వాళ్ళే ! నేను ఊళ్ళో కి వెళ్తే చాలు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని , ఆబ గా చూస్తూ ఉంటారు.‌ కళ్ళు కామంతో కప్పి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు పెద్దోళ్ళు!

      నూతి దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినపడింది.‌గంగి గుండె దడ,దడలాడింది.‌ ఎవరైనా తనని చూస్తే, కొంపలు అంటుకుంటాయి.‌ చితగ్గొట్టేస్తారు.‌

            గంగి తన చేద, తాడు తీసుకుని మెల్లగా వంగి,‌దూరంగా వెళ్ళి చెట్ల చాటున నక్కింది.‌ అసలు ఈ మనుషులకి  ఎవరి మీదైనా జాలి, పేగు ఉంటాయా? కూలీ డబ్బులు ఇవ్వకపోతే పని చెయ్యనన్నాడని మంగూ ని ఎంతలా కొట్టేరు! తరవాత నెలల తరబడి నెత్తురు కక్కుకుంటూనే ఉన్నాడు, పాపం! అందుకేనా వీళ్ళు పెద్దోళ్ళు!

            నూతి దగ్గరికి  ఇద్దరు ఆడాళ్ళు నీళ్ళు తోడుకోడానికి వచ్చేరు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగేరు.‌

   “ భోజనానికి కూర్చుంటూనే మంచినీళ్ళు తీసుకు రమ్మని పురమాయిస్తారు.‌ మరో కడవ తెచ్చినందుకు డబ్బులిస్తారా?”

       “ మనం  కాసేపు ఖాళీగా కూర్చుంటే చూడలేరు.‌ వాళ్ళ కళ్ళు మండుతాయి.”

     “ ఆ, అవును.‌ ఏం, వాళ్ళే కుండ తీసుకు పోయి, నీళ్ళు తోడి తెచ్చుకోవచ్చు కదా! అబ్బే, మంచినీళ్ళు తీసుకు రమ్మని పురమాయిస్తారు. అక్కడికి మనమేదో వాళ్ళ పని మనుషులం అయినట్టు!”

      “ మనం పని మనుషులం కాదా? వాళ్ళు మనకి తిండి, బట్ట ఇస్తున్నారు కదా!  అదీ కాక, ఎలాగో ఒకలాగ అయిదో, పదో  తీసుకుంటున్నాం కదా! మనకీ, పని మనుషులకీ తేడా ఏం ఉంది?”

    “ పుండు మీద కారం చల్లకు, చెల్లీ! అసలే ఒళ్ళు మండిపోతోంది.‌ ఒక్క గడియ తీరిక చిక్కితే ఎంత బాగుంటుంది! ఈ చాకిరీ ఇంకెక్కడైనా చేస్తే,‌ ఇంత కన్నా హాయిగా ఉండేది. అదీ కాక,‌వాళ్ళు మనకి ఋణ  పడి ఉండేవాళ్ళు కూడా! ఇక్కడ చూస్తే, నువ్వు చచ్చేదాకా చాకిరీ చేసినా, ఒక మెప్పూ లేదు, మెహర్బానీ లేదు.”

       వాళ్ళిద్దరూ తమ కడవలు నీళ్ళతో నింపుకుని వెళ్ళిపోయేక, గంగి మెల్లగా చెట్ల చాటు నుంచి బయటకు వచ్చింది.‌ అప్పటికి గుమ్మం లో కూర్చుని బాతాఖానీ కొడుతున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయేరు.‌ ఠాకూరు గారు కూడా తలుపు మూసి, లోపల వరండాలో పడుకోవడానికి వెళ్తున్నాడు.‌ గంగి ఒక్క క్షణం హాయిగా ఊపిరి పీల్చుకుంది.‌ ఎలాగోలా రంగం సిద్ధం అయింది.‌ పురాణాల్లో దేవతల వద్ద నుంచి అమ్రృతం దొంగిలించడానికి వెళ్ళేడని  చెప్పిన రాకుమారుడు కూడా గంగి అంత జాగ్రత్తగా వెళ్ళి ఉండడు.‌

     మెల్లగా, చప్పుడు చెయ్యకుండా గంగి నూతి చప్టా ఎక్కింది.‌ అంతకు ముందు ఎప్పుడూ ఆమె కి ఇలాంటి విజయగర్వం కలగలేదు.‌

            ఆమె చేద కి తాడు కట్టి,  ఏదో  సైనికులు  దాగి ఉన్న శత్రువు కోసం చూసినట్టు జాగ్రత్తగా  చుట్టూ చూసి,  చేదని నూతి లో వదిలింది.‌ ఇప్పుడు కనుక తను దొరికిపోతే, తన మీద జాలి చూపించేవాళ్ళెవ్వరూ లేరు.‌ చివరకు వెయ్యి దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ, చేద ని నూతిలో కి వదిలింది.‌ చేద మెల్లగా చప్పుడు చెయ్యకుండా నీటిలోకి మునిగింది.‌ గంగి గబగబా తాడు ని పైకి లాగింది.‌ చేద నూతి పైకి వచ్చింది. ఇక చేత్తో పైకి తియ్యడమే తరువాయి. కుస్తీ వీరులు కూడా అంత వేగంగా నీళ్ళు తోడలేరేమో!

       గంగి చేదని అందుకుని, నూతి చప్టా మీద పెట్టడానికి ముందుకి వంగిందో, లేదో అకస్మాత్తుగా ఠాకూరు గారి ఇంటి తలుపు తెరుచుకుంది.  పులి నోట్లో పడ్డా కూడా అంత భయం వెయ్యదు!

     గంగి చేతిలోంచి తాడు జారిపోయింది. ధడేల్మని శబ్దం చేస్తూ, చేద నూతి నీళ్ళలో పడింది. కాసేపటి వరకు ఆ శబ్దం ప్రతిధ్వనించింది.

      “ ఎవరక్కడ? ఎవరక్కడ?” అని అరుస్తూ ఠాకూరు నూతి వైపు వచ్చేడు.

             గంగి  చప్టా మీంచి ఒక్క గెంతు గెంతి, పరుగు లంకించుకుంది.

         ఆమె ఇల్లు చేరేసరికి, జోఖూ లోటా నోటి దగ్గర పెట్టుకుని, ఆ కంపు నీళ్ళే తాగుతూ కనిపించేడు.

రోసి
Aruna Prasad

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *