రసిక సంపాదకుడు

Spread the love

        ‘నవరస’ పత్రిక సంపాదకుడైన పండిట్ చోఖేలాల్ శర్మ గారి ధర్మపత్ని మరణించిన దగ్గర్నుంచీ, అతనికి స్త్రీల పట్ల అనురాగం ఎక్కువైంది.‌కాస్త రసికత కూడా ముదిరింది.‌ పురుష రచయితలు పంపే మంచి, మంచి రచనలు కూడా చెత్తబుట్టలో పడేసి, స్త్రీలు రాసినవి మాత్రం ఎంతో క్రృతజ్ఞతతో స్వీకరించేవాడు.‌ కేవలం వాటిని స్వీకరించడం మాత్రమే కాక, ఈ విధంగా వాటిని ప్రశంసించడం కూడా జరిగేది, ‘ మీ రచన చదివి, నా గుండె ఒక్క క్షణం పాటు ఆగిపోయింది. నా గతం నా కళ్ళ ముందు మెదిలింది,’ ఇలా.‌ లేదా ఇలా రాసేవాడు, ‘మీ భావాలు సాహిత్య సాగరంలో ఉజ్వల రత్నాలు, వాటి ప్రకాశం ఎన్నటికీ తరగదు.’ ఇక వారి కవితలైతే హ్రుదయాంతరంగంలో ఉవ్వెత్తున ఎగసి పడే అలలు, విశ్వ వీణ యొక్క అమర రాగాలు, అనంత మధుర వేదనలు, నిశ్శబ్ద నిశీధి గీతాలు.‌ ఈ ప్రశంశలతో పాటు వారిని దర్శించాలనే అభిలాష కూడా వ్యక్తం చెయ్యబడేది.  ‘ ఇటువైపు గా వెళ్ళడం సంభవిస్తే నన్ను మర్చిపోవద్దు. ఈ కవితాస్రృష్టి చేసిన వారిని దర్శించడం నా సౌభాగ్యం గా భావిస్తాను.’

      ఇలాంటి అనురాగంతో కూడిన జవాబులు అందుకున్న రచయిత్రుల ఆనందానికి అవధులు ఉండేవి కాదు.‌ భిక్ష దొరకని నిర్భాగ్య భిక్షువు ల మాదిరిగా ఎన్నో పత్రికా కార్యాలయాల నుండి నిరాశతో వెనక్కి తిరిగి వచ్చిన రచనలకి ఇంత ఆదరణ దొరకడం అంటే మాటలు కాదు.‌ కళ తాలూకు అసలైన విలువ తెలిసిన సంపాదకుడు మొదటి సారి జన్మించేడు.‌ తక్కిన సంపాదకులంతా అహంకారులు. వాళ్ళ కళ్ళకి ఎవరూ కనిపించరు.‌ చిన్న సంపాదక పదవి దొరికేసరికి, ఏదో రాజ్యం లభించినట్టు భావిస్తున్నారు. కొంపదీసి, వీళ్ళకి కనుక ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా దొరికితే, ఇక అంతా సర్వనాశనం చేసి వదులుతారు.‌దేవుడు చల్లగా చూసి,‌ప్రభుత్వం వీళ్ళ మాట వినలేదు. ఆ ఆర్డినెన్సు పాస్ చేసి, మంచి పని చేసింది. ఆడవాళ్ళని ద్వేషిస్తే,‌ ఇలాంటి శిక్షే పడుతుంది. శర్మ గారు కూడా సంపాదకులే కదా! అతనేమీ గడ్డి కోసుకోవటం లేదు. అది కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఒక పత్రిక కి సంపాదకుడు. ‘ నవరస’ పత్రిక పత్రికలలో రాజు మరి!

         చోఖేలాల్ గారి పత్రిక కి ఖాతాదారులు  ఇబ్బడి ముబ్బడిగా పెరగసాగేరు.‌ క్రృతజ్ఞతలు తెలుపుతూ రాసే ఉత్తరాలు వరద లా ముంచెత్తేవి. రచయిత్రులు అతడిని ఆరాధించసాగేరు.‌ పుట్టుకలు, చావులు, పెళ్ళిళ్ళు, నామకరణాలకు సంబంధించిన వార్తలు కుప్పలుతెప్పలుగా రాసాగేయి.‌ కొందరు అతని ఆశీర్వాదాలు కోరితే, కొందరు అతడి నుంచి సాంత్వన వచనాలు కోరుకునేవారు. మరికొందరు కుటుంబ కలహాలకు సంబంధించి అతని సలహా అడిగేవారు.  ప్రతీ నెలా అయిదు నుంచి పది మంది మహిళలు స్వయంగా అతడిని చూడటానికి వచ్చేవారు.  వారి రాక గురించిన వార్త తెలియగానే, శర్మ గారు స్టేషన్ కి పరుగెత్తుకు వెళ్ళి, వారిని ఆహ్వానించే వారు. వాళ్ళకి అతిధి సత్కారాలు చేసి, ఒకటి, రెండు రోజులు ఉండమని బలవంతం చేసేవారు. సినిమాలకు ఫ్రీ పాసులు అతని వద్ద ఉండనే ఉండేవి. వాటిని అతను చక్కగా వినియోగించేవాడు.

            మహిళలంతా అతని మంచితనానికి ముగ్థులౌతూ, శలవు తీసుకునే వారు.‌ చాలా మంది రచయిత్రులతో శర్మ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరిగేది. కానీ  ఈ విషయంలో మనం కచ్చితంగా ఏమీ చెప్పలేం.‌ ఒక్కటి మాత్రం చెప్పగలం. ఒక్కసారి అతడిని దర్శించిన మహిళామణులు ఎవరైనా సరే, అతనికి భక్తులుగా మారిపోయే వారు.‌ ‘ పాపం, అతను సాహితీ కుటీరంలో ఒక తపస్వి. ఒంటరి జీవితం లోని దుఃఖాన్ని తన గుండెల్లో అదిమి పెట్టి,‌మూగ వేదనలో ప్రేమ రసాస్వాదన చేస్తున్నాడు.’  ఈ ప్రముఖ సంపాదకుని జీవితంలో ఏర్పడిన శూన్యత ని భర్తీ చెయ్యడాన్ని రచయిత్రులు తమ బాధ్యతగా భావించేరు. షడ్రసోపేతమైన  విందు నుంచి ఒక్క మిఠాయిని ఒక అన్నార్తుడికి ఇచ్చినా అది ఆ విందు కే శోభాయమానంగా ఉంటుంది.‌ ఒక మహిళామణి ఊరగాయ జాడీ పంపితే, మరొకామె లడ్డూలు పంపేది.‌ మరో మహిళామణి  పూజ కి కూర్చునే ఆసనాన్ని తన స్వహస్తాలతో అల్లి పంపింది .‌ ఒక మహిళ ప్రతీ నెలా వచ్చి అతని బట్టలు మరమ్మతులు చేసి వెళ్ళేది.‌ మరో మహిళ నెలకి రెండు, మూడు సార్లు వచ్చి, అతనికి రుచికరమైన పదార్థాలు వండి పెట్టేది.‌ ఇప్పుడతను ఎవరో ఒకరికి సొంతం కాదు. అందరివాడు.‌ మహిళల హక్కులను ఇతని కంటే బాగా రక్షించే వారు ఎక్కడా కానరారు. పురుషుల వద్ద నుంచి శర్మ గారు ఎప్పుడూ తీవ్ర విమర్శలు  ఎదుర్కొనే వారు. కేవలం మహిళల వద్ద మాత్రమే అతనికి ఎంతో సానుభూతి లభించేది.‌

       ఒక రోజున శర్మ గారికి అందిన ఒక కవితలో కవయిత్రి  ఎంతో దూకుడు గా తన  ప్రేమను వ్యక్తం చేసింది.‌ ఇతర సంపాదకులు ఆ కవిత ను అశ్లీలంగా ఉందనేవారు. కానీ పాపం శర్మ గారు  ఇక్కడ చాలా ఉదారంగా వ్యవహరించేరు. కవిత ఎంతో అందమైన పదాలలో లిఖించబడింది.‌కవయిత్రి పేరు కూడా ఎంత సమ్మోహనం గా ఉందంటే, శర్మ గారి మనోనేత్రం ముందు ఒక ఊహా సుందరి కదలాడింది.‌ భావుకురాలు, కోమల శరీరం,‌ వేడుకునే కళ్ళు, దొండ పండు లాంటి పెదవులు, బంగారు వర్ణం,‌ తనువంతా ఉల్లాసం, మొదట స్ఫటికంలా గట్టిగా, ద్రృఢంగా ఉండి, కాస్త ఆర్ద్రమవగానే కరిగి, మెత్తబడి అతుక్కుపోయే  ఒక సుందరి చిత్రం అతని మది లో మెదిలింది.  అతను ఆ కవితలను రెండు, మూడు సార్లు చదివేడు.  ప్రతీ సారీ అతని మనసు  ఉద్విగ్నంగా మారింది.‌

               నువ్వు నన్ను విడిచి పారిపోగలననుకుంటున్నావా?

                   అసలు నన్ను విడిచి వెళ్ళగలవా?

                 నిన్ను నా బాహువుల్లో బంధిస్తాను;

                నీ నడుం ని నా చేతుల్తో చుట్టేస్తాను;

               నీ పాదాలను చుట్టుకుని నిన్ను వెళ్ళకుండా ఆపేస్తాను;

               అప్పుడు ఆ పాదాల మీద నా తలని ఉంచుతాను.

          నన్ను విడిచి నీవు పారిపోగలననుకుంటున్నావా?

           అసలు నన్ను విడిచిపెట్టగలవా?

      నేను నీ పెదవులపై నా చెక్కిలి ని ఉంచుతాను;

       నువ్వు నా ప్రేమ రసామ్రృతం తాగి, ఉన్మత్తుడవై

     నా పాదాల మీద తల ఉంచుతావు.‌

   నువ్వు నన్ను  విడిచి పారిపోగలననుకుంటున్నావా?

                                                              కామాక్షి.

   శర్మ గారికి చదివిన ప్రతిసారీ ఈ కవితలో ఒక కొత్త రసం కనిపించసాగింది.‌ అతను ఆ క్షణమే కామాక్షి దేవి పేరిట ఇలా జాబు రాసేడు:

             ‘ మీ కవిత చదివేక నా హ్రుదయం పరిస్థితి ని నేను వర్ణించలేను.‌ నా హ్రుదయం కోరికతో రగిలిపోతోంది.‌ దీన్ని ఎలా శాంతింపచెయ్యాలో నాకు తెలియటం లేదు.‌ ఈ కోరిక ఎలా ఉద్భవించిందో , అలాగే ఈ కోరికను చల్లార్చే అమ్రృతం కూడా దొరుకుతుందని నా ఆశ.‌ నా మనస్సు మదపుటేనుగు మాదిరిగా శ్రృంఖలాలు తెంచుకుని పరిగెత్తాలని ఆరాట పడుతోంది.‌ ఈ కవిత ఏ హ్రృదయం లో పుట్టిందో, ఆ హ్రృదయం ప్రేమ భాండాగారం. అటువంటి ప్రేమ కి ఆత్మ సమర్పణలోనే అపరిమిత ఆనందం దొరుకుతుంది.‌ నేను నిజం చెప్తున్నాను.  నేనింత వరకు ఇటువంటి కవిత చదవలేదు.‌ ఈ కవిత నా మనసులో రేపిన తుఫాను కారణంగా నా ఏకాంత ప్రశాంతత ఛిన్నాభిన్నం అయిపోయింది.‌ తమరు ఒక పేదవాడి తాటాకు గుడిసె కి నిప్పు పెట్టేరు.  కానీ ఇది కేవలం క్రీడా వినోదం అని నా మనస్సు అంగీకరించడం లేదు.‌ ఈ కవిత లో నాకు ప్రేమ లో  వేదన పొంది, కోరిక తో రగులుతున్న ఒక హ్రృదయం కనిపిస్తోంది.‌ మీ దర్శన భాగ్యం కలిగితే, అది నా అద్రృష్టం గా భావిస్తాను.  ఈ కుటీరం ప్రేమ తో తమరిని స్వాగతించడానికి , ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

                                                                                                                  ప్రేమ తో…

       మూడవ రోజునే జాబు వచ్చింది. కామాక్షి ఎంతో భావుకత తో తన క్రృతజ్ఞతలు తెలియజేస్తూ, తాను వచ్చే తేదీ ని కూడా తెలిపింది.

                                                          2.

                   ఆ రోజు కామాక్షి ఏతెంచే శుభ దినం.‌

          శర్మ గారు పొద్దున్నే గడ్డం గీసుకుని, నలుగు పిండి, సబ్బు పెట్టి, చక్కగా స్నానం చేసేరు.  సన్న ఖద్దరు పంచె, దానికి సరి జోడు అయిన వదులైన మెరిసే కుర్తా ధరించి, పైన పాల మీగడ రంగు పట్టు శాలువాను కప్పుకున్నాడు. ఇవాళ  తన రోజు. ఎంత డాంబికంగా కార్యాలయానికి వచ్చేడంటే,‌మొత్తం కార్యాలయం  ఉలిక్కి పడింది. కార్యాలయ ఆవరణ అంతా కూడా చక్కగా శుభ్రం చెయ్యబడింది.‌ వరండాలో పూల కుండీలు అమర్చబడ్డాయి. బల్లల మీద పుష్ప గుచ్ఛాలు అలంకరించడం జరిగింది.

                   రైలు బండి తొమ్మిదింటికి వస్తుంది. ‘ ఇంకా ఎనిమిదిన్నరే అయింది. ఆమె ఇక్కడికి తొమ్మిదిన్నర కి చేరుతుంది.’ ఈ ఆత్రృత లో అతను పని చెయ్యలేకపోయేడు.  క్షణక్షణం గడియారం వంక చూడడం, అద్దం  లో తన ముఖారవిందాన్ని మాటిమాటికీ చూసుకోవడం,‌గదిలో అంటూ,ఇటూ పచార్లు చెయ్యడం.. ఇదీ వరస.‌ మీసం లో ఒకటి, రెండు పండు వెంట్రుకలు కనిపించేయి. గానీ, వాటిని పీకి అవతల పారేసే సాధనం ఏదీ ప్రస్తుతం తన వద్ద లేదు. మరేం ఫర్వాలేదు.‌ ‘వాటి వలన నేను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాను,’ అనుకున్నాడు.

          ఆరాధన తో కూడి వచ్చే ప్రేమ బహుమతి తీసుకుని వచ్చే అతిధి లాంటిది.‌ యువకుల ప్రేమ చాలా విలాసవంతమైనది కాగా మహాత్ములు లేదా మహాత్మ్యం పొందడానికి దగ్గరలో ఉన్న వారి ప్రేమ  తిరిగి ఏదో ఇచ్చే విధంగా ఉంటుంది. యువకులు ఖరీదైన బహుమతులతో తమ ప్రేమను వ్యక్త పరిస్తే, మహాత్ములు దీవెనలతో పని కానిస్తారు.

         సరిగ్గా తొమ్మిదిన్నరకి బంట్రోతు ‘ కామాక్షి’ అని ముద్రించి ఉన్న కార్డు నుంచి తెచ్చేడు.‌ శర్మ గారు ఆమె ని లోపలికి తీసుకు రమ్మని బంట్రోతు కి చెప్పి,  తన మొహాన్ని అద్దంలో మరోసారి చూసుకుని, ఒక లావాటి పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, అందులో తన్మయం చెందినట్టు నటించేడు.‌ ఒక్క క్షణంలో ఆ మహిళామణి గదిలో అడుగు పెట్టింది. కానీ ఆమె రాకను శర్మ గారు గుర్తించలేక పోయేరు.

      ఆ మహిళ బెరుగ్గా సమీపించినప్పుడు, ఉలిక్కిపడి, శర్మ గారు ఏదో  సమాధి లోంచి పైకి లేచినట్టు తల ఎత్తేరు.‌  లేచి, నిలబడి ఆ మహిళను స్వాగతించేరు.‌ కానీ ఈమె  తన ఊహా సుందరి  కాదు.

        ఒక నల్లటి, లావాటి, మధ్య వయసు మహిళ శర్మ గారి వంక మింగేసేటట్టు చూస్తూ నిలబడి ఉంది.‌ పాపం శర్మ గారి ఉత్సాహం అంతా ఆవిరైపోయింది.‌ తను ఎన్నో నెలలుగా కంటున్న తియ్యటి కలలు అతడిని  ఒక బల్లెం మాదిరిగా గుచ్చసాగేయి. అతనికి  నోట మాట రాలేదు.‌ ఎలాగో కష్టం మీద గొంతు పెగుల్చుకుని, ఇలా చెప్పగలిగేడు: ‘ సంపాదకుల బతుకు పశువుల బతుకులాంటిది.‌ కాగితాల్లోంచి బుర్ర ఎత్తే సమయం ఎక్కడ?  అదీ కాక, ఈ పని ఒత్తిడి కారణంగా నా ఆరోగ్యం దెబ్బ తింటోంది.‌ నిన్న రాత్రి నుంచి తలనొప్పి గా ఉంది.‌ మీకు నేను ఎలా సాయపడగలను?’

              కామాక్షి చేతుల్లో ఒక పెద్ద మూట ఉంది.‌దాన్ని బల్ల పైన పెట్టి, మొహాన్ని రుమాలు తో తుడుచుకుని,‌ఆమె ఎంతో మధుర స్వరం తో ఇలా అంది, ‘ అయ్యో! ఎంత చెడ్డ వార్త చెప్పేరు!  నేను నా స్నేహితురాలిని కలుసుకోవడానికి వెళ్తూ, దారిలో  మిమ్మల్ని కలవడానికి ఆగేను.‌ కానీ మీ ఆరోగ్యం బాగా లేనందున నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండి, మీకు సపర్యలు చెయ్యాలి.‌నేను మీ సంపాదక కార్యంలో కూడా మీకు సాయం చేస్తాను.‌మీ ఆరోగ్యం మహిళాలోకానికి చాలా ముఖ్యం.‌ ఇలాంటి పరిస్థితి లో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేను.’

        శర్మ గారి మొహంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు. అతనికి నిస్త్రాణ గా తోచింది. ఈ దెయ్యం తో కలిసి జీవించడం అంటే ప్రత్యక్ష నరకమే! ఈవిడ గారు కవిత్వం రాయడానికి బయలుదేరింది. అది కూడా ఎలాంటి కవిత్వం? అశ్లీల కవిత్వం. అశ్లీలమైనదే కాక, ఉత్తి చవకబారు, చెత్త కవిత్వం.‌  ఒక అందమైన యువతి చేతి లోని కాలం నుంచి వస్తే,  ఆ కవిత ఒక మన్మధ బాణం అయి ఉండేది.‌ కానీ ఈవిడ కలం నుంచి అది ఒట్టి చెత్త! అసలు అలాంటి కవిత్వం రాయడానికి ఈవిడకి ఏం హక్కు ఉంది? అసలు ఈవిడ ఆ కవిత ఎందుకు రాసినట్టు?  ఒక మూల కూర్చుని రామా, క్రిష్ణా అని ముక్కు మూసుకుని భజన చేసుకోకుండా! అసలు ఆ తెంపరితనం చూడు, ‘ నువ్వు నన్ను విడిచి పారిపోగలననుకుంటున్నావా?’ అని అడుగుతోంది. ఒక్క మాట! అసలు ఎవరైనా, నీ దగ్గరకు ఎందుకు వస్తారు? నిన్ను చూడగానే, భయపడి పారిపోతారు.‌ ఛ, ఏం కవిత్వం! తలా, తోకా లేకుండా! ఎక్కడ చూసినా అక్షరదోషాలే! కవిత్వం రాస్తుందిట, కవిత్వం!

        ఈ విగ్రహం లో కవిత్వం నివాసం ఉండగలిగితే,‌గాడిద కూడా పాడగలదు, ఒంటె కూడా నాట్యం చెయ్యగలదు.‌ కవిత్వం రాయాలంటే అందం, యవ్వనం, కోమలత్వం ఉండాలని కూడా ఈ దెయ్యానికి తెలీదు లా ఉంది.‌  అబ్బ! ఎంత భయంకరమైన మొహం! ఎవరైనా రాత్రి పూట చూస్తే జడుసుకుంటారు.‌ ఈవిడ కవ్వించే కవితలు రాస్తోంది! పస్తులున్నా కూడా మనిషి  పేడ తినడు కదా!  ఈ దెయ్యం ఇంత పెద్ద మూట పట్టుకుని వచ్చింది. ఇందులో కూడా అలాంటి చెత్తే ఉండి ఉంటుంది.

         ఆమె చేతుల్లో ఉన్న లావాటి కాగితాల కట్ట వంక చూస్తూ అతను ఇలా అన్నాడు: ‘ అబ్బెబ్బే,‌నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. ఇదేమంత పెద్ద జబ్బు కాదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.‌ మీ స్నేహితురాలు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.’

      ‘ అయ్యో, మహాశయా! మీరు ఊరికే మొహమాటపడుతున్నారు.‌ నేను అయిదు, పది రోజుల తరవాత వెళ్ళినా పెద్ద ఇబ్బందేమీ లేదు.’

      ‘ అయ్యో, అమ్మా! అదంతా ఏమీ అవసరం లేదు!’

     ‘ ఇది పొగడ్తగా కనిపించొచ్చు. కానీ, నిజంగా మీ మంచితనం అనితరసాధ్యం.‌ అసలు నా కవిత్వాన్ని మెచ్చుకున్న మొదటి మనిషి మీరే! ఇంతకాలం నేను ఎంతో నిరుత్సాహంగా బ్రతికేను.‌మీ ప్రోత్సాహం కారణంగా ఈ కవితలన్నీ రాయగలిగేను.  మీరు వీటిల్లో ఏవైనా ఉపయోగించుకోవచ్చు. నేను ఒక నాటకం  కూడా రాయడం  మొదలెట్టాను.‌ నేను దాన్ని మీ సమీక్ష కోసం పంపుతాను.  మీరు కోరితే, నేను కొన్ని కవితలు చదివి, వినిపిస్తాను.‌ నాకు మళ్ళీ ఈ సువర్ణావకాశం ఎప్పుడు లభిస్తుంది? నేనెలా రాస్తానో నాకైతే తెలియదు గానీ,  వీటిని విని, మీరు తప్పకుండా ఆనందిస్తారు.  ఇవి కూడా అలాంటివే!’

      ఆమె అతని అనుమతి కోసం ఎదురు చూడలేదు.‌ ఆమె తన కట్ట విప్పి, ఒక కవిత చదవడం ప్రారంభించింది.‌ శర్మ గారికి తనని ఎవరో చెప్పుతో కొడుతున్నట్టుగా ఉంది.‌అతనికి కడుపులో తిప్పినట్టయింది.‌వెయ్యి గాడిదలు ఒక్క సారిగా ఓండ్ర పెట్టినట్టుగా తోచింది.‌

     కామాక్షి గొంతు ఎంతో మధురంగా ఉంది. కానీ, ఆ సమయంలో శర్మ గారికి అది చాలా విసుగ్గా తోచింది.‌ అతనికి నిజంగానే తలనొప్పి ప్రారంభం అయింది.‌ ‘ ఈ మూర్ఖురాలు ఎప్పుడైనా ఆపుతుందా? లేక అలా చదువుతూనే ఉంటుందా? నా మొహంలోని భావాలు పసిగట్టలేదు కానీ కవిత్వం రాస్తుందిట!  ఈ నోట్లో మహాదేవి,సుభద్రా కుమారి ల కవిత్వం కూడా  రోత గా వినిపిస్తాయి.‌ అతను ఇక ఆట్టే సేపు భరించలేక ఇలా అన్నాడు:  ‘ అబ్బ, ఏం కవిత్వం! మీ కవితలను ఇక్కడ వదిలి పెట్టండి.‌ఇప్పుడు నాకు కొంచెం అవసరమైన పని ఉంది.‌ నాకు తీరిక ఉన్నప్పుడు నేను వాటిని చదువుతాను.’

         కామాక్షి ఎంతో సానుభూతి తో ప్రతిస్పందించింది. ‘ పాపం, అనారోగ్యంతో కూడా ఎంత పని చేస్తున్నారో! నాకు మిమ్మల్ని చూస్తే బాధ గా ఉంది.’

      ‘ మీరు చాలా దయామయుడు.’

   ‘ రేపు మీకు కొంత తీరిక ఉంటుందా? నేను నా నాటకాన్ని మీకు చదివి, వినిపిద్దామనుకుంటున్నాను.’

       ‘ అయ్యో, క్షమించండి! నేను రేపు ప్రయాగ వెళ్ళాలి.’

      ‘ నేను కూడా మీతో రానా? నేను మీకు దారి లో చదివి, వినిపిస్తాను.’

      ‘ నేనింకా ఏ బండి కి వెళతానో నిశ్చయం అవలేదు.’

      ‘ మీరెప్పుడు తిరిగి వస్తారు ?’

      ‘ అది కూడా తెలీదు.’

       ఇలా అంటూ టెలిఫోన్  తీసి, ‘ హల్లో , నెం.77,’ అన్నాడు.‌

       కామాక్షి అక్కడ అర్ధగంట పాటు ఎదురు చూసింది గానీ, శర్మ గారు ఒక ముఖ్యమైన సంభాషణ లో ఎంతగా మునిగి పోయేరంటే ఆమెని అసలు పట్టించుకోలేదు.‌

       ఆమె పాపం చిన్నబుచ్చుకుని వెళ్ళింది. కానీ మళ్ళీ వస్తానని చెప్పింది. శర్మ గారు హాయిగా నిట్టూర్చి,‌ఆ కాగితాల కట్ట ని చెత్తబుట్టలో పడేసారు.‌పాపం మనసు విరిగిపోయిన అతను ఇలా అనుకున్నాడు:’  మళ్ళీ నీ మొహం కనపడకుండా దేవుడు నన్ను రక్షించాలి. ఛ, ఈ సిగ్గులేని దెయ్యం నా రోజంతటినీ పాడు చేసింది.’

      అతను మేనేజర్ ని పిలిచి ఇలా చెప్పేడు: ‘ కామాక్షి కవిత ప్రచురణ కి వెళ్ళకూడదు.’

     నిర్ఘాంతపోయిన మేనేజర్ ఇలా అన్నాడు: ‘ కానీ, ఆ ప్రతి ఇప్పటికే ప్రింటింగ్ మెషీన్ మీద ఉంది.’

    ‘ మరేం ఫర్వాలేదు. దాన్ని తీసేయండి.’

 ‘ కానీ, దాని తో చాలా ఆలస్యం అవుతుంది.’

    ‘ అయినా, ఫర్వాలేదు. ఆ కవిత ప్రచురణ కి వెళ్ళదు.’

రోసి
Aruna Prasad

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *