70 ఏళ్ళ ఒంటరి ముసలి చేతి వృత్తి కళాకారుడు మిహైల్ పెట్రోవిచ్ జోతొవ్ కి చలి, కీళ్ళ నొప్పుల కారణంగా మెలకువ వచ్చింది. తన గది చీకటి గా ఉంది. కానీ, దైవ ప్రతిమ వద్ద దీపం వెలగడం లేదు. జోతోవ్ కిటికీ తెర పైకి ఎత్తి, బయటకు చూసేడు. ఆకాశం లో కమ్ముకున్న మబ్బులు మెల్లగా తెల్ల బడుతున్నాయి. గాలి పారదర్శకం గా మారుతోంది. అంటే, సుమారు అయిదు గంటలు అయి ఉండొచ్చు. అంతకు మించి కాదు.
జోతోవ్ గొంతు సవరించుకుని, చిన్నగా దగ్గి, చలికి ముడుచుకుంటూ, పడక మీద నుంచి లేచేడు . ఏళ్ళ తరబడి ఉన్న అలవాటు కారణం గా, అతను చాలాసేపు ప్రార్థనలు చేస్తూ, దైవ ప్రతిమ ముందు నిలబడ్డాడు. అతను, ” మన తండ్రి ” , అనీ ” మేరీ మాతకు జయము ” అనీ , మతం అనీ అంటూ చాలా నామాలు వల్లించాడు. ఆ నామాలు ఎవరికి చెందినవి అనే విషయం అతను చాలా కాలం క్రితమే మర్చిపోయాడు. కేవలం అలవాటు చొప్పున వాటిని వల్లే వేస్తూ ఉంటాడు. అలవాటు ప్రకారం అతను తన గది నీ, వరండా నీ, ఊడ్చి, శుభ్రం చేసి, తన లావాటి, చిన్న, నాలుగు కాళ్ళ, రాగి సమోవార్ నీ సిద్ధం చేసేడు. తన ఈ అలవాట్లే లేకపోతే, ఈ ముసలితనాన్ని ఎలా గడిపే వాడో , పాపం!
ఆ చిన్న సమోవర్ మెల్ల గా వేడెక్కుతూ, హఠాత్తుగా కూని రాగం తియ్యసాగింది.
” ఓహో, నువ్వు రాగం తీస్తున్నావన్నమాట!”విసుక్కున్నాడు జోటొవ్.” అలాగే కానీ, నీ ఖర్మ!”
సరిగ్గా అప్పుడే అతనికి తనకి క్రితం రాత్రి స్టౌ కల లో కి వచ్చిందని, అలా స్టౌ కల లో కనిపించడం చెడుని సూచిస్తుందని, గుర్తు వచ్చింది.
ప్రస్తుతం కలలు, శకునాలు మాత్రమే అతనిలో కాస్త ఆలోచనని రేకెత్తించగల విషయాలు. ఈ సందర్భంగా అతను మాంఛి ఉత్సాహం గా ఆలోచనా సముద్రం లోకి దూకి తన ప్రశ్నలకు జవాబులు వెతకసాగేడు. మొదటి ప్రశ్న:ఈ సమొవర్ ఎందుకు కూని రాగాలు తీస్తోంది? రెండవ ప్రశ్న:స్టౌ ముందుగా సూచించిన విషాదం ఏమిటి? తెల్లవారుతూనే, కల నిజం అవుతున్నట్టు గా అనిపించింది. జోటోవ్ టీ గిన్నె కడిగి, టీ కాచుకుందామని చూస్తే, డబ్బా లో ఒక్క చెంచాడు టీ పొడి కూడా లేదు.
” ఛ, చ, ఏమి జీవితం! ” అనుకున్నాడు అతను నల్ల రొట్టె ముక్కలను నోట్లో కుక్కుకుంటూ. ” కుక్క జీవితం. టీ కూడా లేదు. పోనీ, నేనేమైనా రైతు కూలీ నా అంటే, కాదే! హస్త కళాకారుడిని! పైగా ఇల్లు గల ఆయన నీ! ఛ, చ, ఎంత అవమానం!”
అలా తనలో తను విసుక్కుంటూ, గొణుక్కుంటూ, అతను క్రినోలినే మాదిరిగా బిరుసు గా ఉన్న తన ఓవర్ కోటునీ ధరించి, వికారం గా ఉన్న పెద్ద గొలోష్ బూట్ల లో పాదాలు కుక్కుకుని,( వాటిని 1867 వ సంవత్సరం లో ప్రోహోరిచ్ అనే బూట్లు కుట్టే మనిషి తయారు చేసేడు.)వాకిట్లో కి నడిచేడు. గాలి చల్ల గా, దిమ్ము గా ఉంది. అంతటా నిశ్శబ్దం గా ఉంది. పిచ్చి మొక్కల తోను, ఎండుటాకులతోను నిండి ఉన్న వాకిలి మంచు కారణం గ కాస్త వెండి రంగు లో మెరుస్తోంది. ఎక్కడా గాలి చడీ, చప్పుడూ లేదు. ఆ ముసలాయన వాలు గా ఉన్న వరండా మెట్ల పైన కూర్చున్నాడో, లేదో, వెంటనే, రోజూ పొద్దున్నే జరిగే తంతు జరిగింది:నల్ల మచ్చలతో ఉన్న అతని ముసలి, తెల్ల , గజ్జి కుక్క, లిస్కా అతని వద్దకు వచ్చింది. దాని కుడి కన్ను మూసుకు పోయి ఉంది. అది పాపం అతని వద్దకు బెరుగ్గా వచ్చింది. దాని కాళ్ళు నేలని కాక వేడి పొయ్యి మీద ఉన్నట్టు గా, భయం గా, వచ్చింది. దాని హీనత్వం దాని శరీరం అంతటి లోనూ కనిపిస్తూనే ఉంది. జోటోవ్ దాన్ని చూడనట్టు నటించాడు. కానీ అది నీరసం గా, తోక ఊపి, మెలికలు తిరుగుతూ, అతని గోలోష్ నీ నాకినప్పుడు, అతను కోపం గా చిందులు తొక్కేడు.
” ఫో, అవతలికి! దరిద్ర గొట్టు దానా! చావు!” అరిచేడు అతను.
లీస్కా పక్కకు జరిగి, కింద కూర్చుని, తన ఒంటి కంటి తో, తన యజమాని వంక చూడ సాగింది.
” దెయ్యాలు!నా మెడ కి గుది బండలు మీరు. దరిద్రపు పీనుగులు!” అతను తిడుతూనే ఉన్నాడు.
అలా తిడుతూ అతను విరిగిన పై కప్పు తో ఉన్న కొట్టం వైపు చూసేడు. అక్కడ కొట్టం తలుపు సందు లోంచి, ఒక పెద్ద గుర్రం తల అతని వంక చూస్తోంది. యజమాని తన వంక చూసినందుకు పొంగి పోతూ, ఆ తల కదిలి, ముందుకు వచ్చింది. మెల్లగా కొట్టం ద్వారం లోంచి మొత్తం గుర్రం బయటకు వచ్చింది. ఆ గుర్రం కూడా, కుక్క మాదిరిగానే, బక్క చిక్కి, ముసలి గా ఉంది. పుల్లల లాంటి కాళ్ళు, నెరిసిన జుట్టు, లోతుకు పోయిన కడుపు, ఎముకలు తేలిన వెన్ను..తో బెరుగ్గా ఉంది. పాపం అది షెడ్ లోంచి బయటకు వచ్చి, ఇబ్బంది గా, మొహమాటం గా నిలబడింది.
” మిమ్మల్ని దెయ్యం నోలెయ్య! అసలు మీకు చావు అంటూ వస్తుందా? దరిద్రపు పీనుగుల్లార! మీకు పొద్దున్నే ఫలహారం కావాలి కదూ!” అతను కోపం గ ఉన్న తన మొహాన్ని వంకర గా మార్చి, వెటకారం గా నవ్వేడు. ” తప్పకుండా, ఈ నిమిషమే తెస్తాను. నీ లాంటి జాతి గుర్రానికి ఖరీదైన ఓట్లు పెట్టాలి మరి! ఇదుగో, ఈ నిమిషమే తెస్తాను. ఇక ఆ జాతి కుక్క గారికి రొట్టె ముక్క ఏమి సరిపోతుంది? ఆవిడకి మాంసం పెట్టాలి!”
అలా జోటోవ అర్థ గంట పాటు కోపం గ సనుగుతూనే ఉన్నాడు.ఇక తన కోపాన్ని తమాయించుకొలేక, పైకి లేచిన అతను వాకిలి అంతా వినిపించేటట్టు బిగ్గర గా ఇలా అరిచేడు:
” మీకు తిండి పెట్టాల్సిన బాధ్యత నాకు లేదు. నేనేమీ లక్షాధికారి నీ కాదు. మిమ్మల్ని కూర్చోబెట్టి మేపడానికి ! నాకే తినడానికి తిండి లేదు. దిక్కుమాలిన సంత! రాగం వచ్చి పోయినా బాగుణ్ణు. మీ వల్ల నాకు దమ్మిడీ ఆదాయం లేదు. సంతోషం లేదు. మీ వల్ల నేను నాశనం అవడం తప్ప ఏమీ లేదు. మీరు నన్ను వదిలి పోరెందుకు? అసలు మీకు చావు కూడా రాదా? మీరు బతికితే, బటకంది. నాకెందుకు?కానీ, నేను మాత్రం మిమ్మల్ని పోషించలేను. ఇక నా వల్ల కాదు. అంతే!”
జోటోవ్ కి కోపం అంతకంతకీ పెరిగిపోతోంది. అతను అలా వింటూనే తిడుతూనే ఉన్నాడు. పాపం, ఆ గుర్రం, లిస్క వింటూనే ఉన్నాయి. పాపం ఈ రెండు ఆశ్రిత జీవులకీ, తాము అతని మీద పడి బతుకుతున్నందుకు అతను తిడుతున్నాడ ని అర్థం అయిందో, లేదో, నాకు తెలియదు గానీ, వాటి కడుపులున్ మరింత లోతుకు పోయేయి. శరీరాలు మరింత ముడుచుకున్నాయి. అవి మరి కొంచెం హీనం గా కనిపించే. వాటి వినయం జోతోవ్ కి మరింత గా ఊపిరి ఆడకుండా చేసింది.
” పొండి, ఇక్కడనుంచి!” అరిచేడు అతను మరింత ఉద్రేకం గా. ” మళ్ళీ నా కళ్ళకి కనిపించొద్దు. నా వాకిట్లో చెత్త, చెదారం, పనికి మాలిన వాటికి చోటు లేదు. పొండి!”
ముసలాయన గబ,గబా గేటు వద్ద వెళ్లి, నేల మీద నుంచి ఒక చిన్న కట్టే నీ తీసి, దానితో, ఆ జంతువులను తరమసాగేడు. గుర్రం తల అడ్డంగా ఊపి, భుజాలు కదుపుతూ, కుంటుకుంటూ, గేటు వైపు నడిచింది. కుక్క దాన్ని అనుసరించింది. ఆ రెండూ అలా గేట్ లోంచి బయటకు వచ్చి ఒక 20 అడుగులు నడిచి, కంచె వద్ద ఆగేయి.
” అదుగో, మళ్ళీ, ఈ సారి దెబ్బలు పడతాయి.” జోతోవ బెదిరించాడు.
అలా ఆ జంతువులని తరిమేసేక, అతను కొంచెం శాంతించి, తన వాకిలి ఊడ్చుకోసాగెడు. ఉండీ, ఉండీ, అతను వీధి లోకి తొంగి చూడ సాగేడు. కంచె వద్ద గుర్రం, కుక్క, మానుల మాదిరి నిలబడి గేటు వంక నీరసం గా చూస్తున్నాయి.
” నేను లేకుండా ఎలా బతుకుతారో నేను కూడా చూస్తాను,” గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్టుగా భావిస్తూ ముసలాయన సనుక్కు న్నా డు. ” ఎవరో ధర్మాత్ములు మిమ్మల్ని పోషిస్తారు, వెళ్ళండి. నేను పిసినారిని, కోపిష్టి వాడిని… నాతో జీవించడం కష్టం.. అంచేత వేరే మంచి వాళ్ళ దగ్గరకు వెళ్ళండి..ఆ..”
తన ఆశ్రితుల దీనమైన చూపులని తనివి తీరా ఆస్వాదించేక, కావలిసినంత సేపు మనసారా విసుక్కున్నాక, జోతోవ్ వాకిట్లోంచి బయటకు వెళ్ళి, భయంకరంగా ఇలా అరిచేడు:
” ఇంకా ఎందుకు అక్కడే దరిద్రం మొహాలు వేసుకు నిలబడ్డారు? ఎవరి కోసం మీ ఎదురు చూపులు?దారి మధ్యలో నిలబడి వచ్చే, పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకు?వాకిట్లో కి పొండి!”
తప్పు చేసిన వాళ్ళ మాదిరిగా గుర్రం, కుక్క తలలు వేలాడేసుకుని గేటు వైపుకి నడిచేయి. తను క్షమార్హురాలిని కాదని భావించిందో ఏమో, గానీ, లీస్క కుయ్యో, మొర్రో అని మూలిగింది.
” మీరు ఇక్కడ ఉండొచ్చు. కానీ తిండి మాత్రం పెట్టేది లేదు. మీరు చచ్చినా, నేను పట్టించుకోను.”
ఈలోగా, ఉదయపు మంచుని చీల్చుకుంటూ, సూర్యుడు రాసాగేడు. సూర్యుని ఏటవాలు కిరణాలు వర్షా కాలపు మంచుని తాకుతున్నాయి. మాటలు, అడుగుల చప్పుళ్లు, వినవస్తున్నాయి. జోతోవ్ చీపురుని యథా స్థానం లో పెట్టి,తన పొరుగింటాయన మార్క్ ఇవానిచ్ నీ కలవడానికి వెళ్ళేడు. ఈ ఇవనిచ్ గారికి చిన్న కిరాణా దుకాణం ఉంది. తన మిత్రుడి దుకాణాన్ని చేరేక, జోతోవ్ అక్కడ ఒక చిన్న బల్ల మీద కూర్చుని, మెల్లగా నిట్టూర్చి, గడ్డం నిమురుకుని, వాతావరణం గురించి ప్రారంభించేడు. వాతావణం నుంచి మిత్రుల సంభాషణ కొత్త డీకన్ మీదకు, అక్కడి నుంచి గాయకుల మీదకు మళ్లింది. అలా సంభాషణ కొనసాగుతూనే ఉంది. మాటల్లో పడి, వారు ఎంత సమయం గడిచిందో గుర్తించ నే లేదు. చివరకు పని కుర్రాడు పెద్ద గిన్నె తో ఉడుకు నీళ్ళు తెచ్చేక, వాళ్ళు టీ త్రాగడం ప్రారంభించారు. కాలం పక్షి లా ఎగురుతోంది. జోతోవ్ కి వెచ్చగా, హుషారు గా అనిపించింది.
” మార్క్ ఇవానిచ్ , నాకు ఒక చిన్న సాయం కావాలోయ్, ” అని ప్రారంభించాడు 6 వ గ్లాసు టీ పూర్తి అయ్యేక, గల్లా పెట్టె మీద చిన్న గా దరువు వేస్తూ.. ” మళ్ళీ ఇవాళ కూడా ఒక గాలన్ ఓట్లు ఇప్పించావంటే..”
గల్లా పెట్టె వెనుక మార్క్ ఇవనిచ్ కూర్చున్న చోటు నుంచి, ఒక భారమైన నిట్టూర్పు వినిపించింది.
” కాస్త పెద్ద మనసు చేసుకో,” జోతొవ్ కొనసాగించాడు; ” టీ ఇప్పుడు వద్దులే, ఇవాళ నువ్వు నాకు టీ ఇవ్వద్దు, కానీ, ఓట్లు మాత్రం ఇచ్చి పెట్టు. .. నిన్ను అడగడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, ఇప్పటికే, నా పేదరికం తో నిన్ను చాలా ఇబ్బంది పెట్టేను, కానీ, పాపం గుర్రం చాలా ఆకలితో ఉంది.”
” నేను నీకు వాటిని ఇవ్వగలను,” నిట్టూర్చాడు మిత్రుడు. ” ఇస్తాను, ఎందుకు ఇవ్వను?కానీ, నాకు ఒకటి చెప్పు. అసలు నువ్వు ఆ పీనుగులని ఎందుకు ఆట్టే పెట్టుకుంటావు? ధూ.. నాకు కొంచెం చెప్పు… అది మంచి జాతి గుర్రం అయితే, సరే, కానీ, థూ! అసలు దాని వైపు చూడాలంటేనే సిగ్గు వేస్తుంది. ..ఇక ఆ కుక్క.. అది ఒక అస్థిపంజరం! అసలు నువ్వు వాటిని ఎందుకు ఆట్టే పెట్టుకుంటావు?”
” మారి వాటిని నేను ఏం చెయ్యాలి?”
” నీకూ తెలుసు. తిన్నగా వాటిని మన గొడారి వాడు, ఇగ్నత్ దగ్గరకు తీసుకు పో… అసలు వాటిని ఎప్పుడో అక్కడకి పంపి ఉండాల్సింది. అదే వాటికి సరైన జాగా.”
” నిజమే, కానీ..”
” నువ్వే బిచ్చగాడి లా బ్రతుకుతున్నావు. ఇంకా నీకు తోడు జంతువులని పెంచడం ఒకటి, ” మిత్రుడు కొనసాగించాడు. ” నేను నీకు ఓట్లు ఇవ్వను అనటం లేదు. .దేవుడు నిన్ను చల్లగా చూడాలి. కానీ, సోదరా, భవిష్యత్తు లో నేను నీకు ప్రతి రోజూ ఇవ్వలేను కదా!నీ పేదరికానికి అంతు లేనే లేదు. ఎవరైనా ఇస్తూనే ఉండాలి. అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.”
ఆ మిత్రుడు నిట్టూర్చి, ఎర్రబడ్డ తన మొహాన్ని నిమురుకున్నాడు.
” పోనీ ఒక వేళ నువ్వు చచ్చిపోతే, ఈ సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటే, నీ ఆయుష్షు పెరుగుతూనే ఉంది. ఎందుకు బతుకుతున్నావో నీకే తెలియదు. .. నిజంగా! గానీ, నువ్వు మరణించాలని దైవేచ్ఛ కానప్పుడు, కనీసం ఏ వృద్ధాశ్రమం కో, శరణాలయానికో పోవచ్చు కదా!”
” నేనెందుకు వెళ్ళాలి? నాకు బంధువులు ఉన్నారు. నాకు ఒక మనవరాలు ఉంది. నా మేనకోడలు కూతురు..”
ఇక జోతొవ్ తన మేనకోడలు కూతురు గ్లాష గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఆమె అతని మెన కోడలు కత్రినా కూతురు. ఎక్కడో వ్యవసాయ క్షేత్రం లో ఉంటోంది.
” ఆమె నన్ను చూసుకోవాలి!” అన్నాడతను. ” నా ఇల్లు ఆమె కే వెళ్తుంది. అంచేత, ఆమె నన్ను చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆమె దగ్గరకు వెళతాను. ఆమె గ్లష, మా కాత్య కూతురు. నీకు కాత్యా తెలుసు కదా! మా అన్న పంతెలి సవితి కూతురు…. అర్థం అయ్యింది?ఈ ఇల్లు ఆమె కే వెళుతుంది. అంచేత ఆమె నన్ను చూసుకోవాలి. ”
” మంచిది. ఒక మాట చెప్పనా? ఇలా నీ లాగ ముష్టి వాడిలా బ్రతికే బదులు నేనైతే ఎప్పుడో ఆమె దగ్గరకి వెళ్లిపోయి ఉండేవాడిని.”
” వెళతాను. దేవుడు చల్లగా చూడాలి. తప్పకుండా వెళతాను. అది ఆమె బాధ్యత.”
ఒక గంట తరవాత పాత మిత్రులిద్దరూ వోడ్కా తాగుతూ ఉండగా,జోతొవ్ దుకాణం మధ్యలో నిలబడి ఉద్వేగంగా ఇలా అన్నాడు:
” నేను ఎప్పటి నుంచో ఆమె వద్దకు వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇవాళే బయలు దేరి వెళతాను.”
” తప్పకుండా. ఇలా ఆకలి తో మాడి చచ్చేకంటే, నువ్వు ఎప్పుడో వెళ్లాల్సింది.”
” ఇవాళే వెళతాను. అక్కడకి వెళ్ళేక, ఇలా చెప్తాను:అమ్మాయీ, నువ్వు నా ఇల్లు తీసుకో. కానీ, నన్ను మాత్రం గౌరవం గా చూసుకోవాలి సుమా! అది నీ బాధ్యత. నన్ను పట్టించుకోక పోతే మాత్రం, నీకు నా ఇల్లు దక్కదు, నా దీవెనలు ఉండవు. శలవు, మిత్రమా!”
జోతొవ్ మరో గ్లాసు తాగి, కొత్త ఆలోచన వలన వచ్చిన ఉత్సాహం తో,గబగబా, ఇంటికి వెళ్ళేడు. వోడ్కా అతన్ని ఇబ్బంది పెట్టింది. అతని తల తిరుగుతోంది. కానీ కస్పు నడుం వాల్చడానికి బదులు అతను తన బట్టలన్నీ మూట కట్టి, గబగబా ప్రార్థన చేసి, తన చేతి కర్ర తీసుకుని, బయటకు నడిచాడు. ఏదో గొణుక్కుంటూ, చేటికర్ర తో రాళ్ల పైన తడుతూ, అతను మెల్లగా వీధి అంతా నడిచి, ఊరి శివార్లలో కి వచ్చేదు. అక్కడ నుంచి వ్యవసాయ క్షేత్రానికి 8 లేదా 9 మైళ్ళు ఉంటుంది. అతను పొడి గా ఉన్న దారి వెంట నడుస్తూ, బద్దకం గా ఎండు గడ్డి నీ నములుతున్న పశువుల మందను చూస్తూ, తను తీసుకున్న ఈ కొత్త నిర్ణయం గురించి ఆలోచించసాగాడు. అతను తన ఆశ్రితుల గురించి కూడా ఆలోచించేడు. తను బయటకు వస్తున్నప్పుడు గేట్ వెయ్యలేదు. కాబట్టి, అవి ఎక్కడకు కావాలంటే, అక్కడకి వెళ్లొచ్చు.
అతను అలా ఒక మైలు దూరం వెళ్ళేడో, లేదో, అతనికి తన వెనుక అడుగుల శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూసి, కోపం గా చేతులు పిసుక్కున్నాడు.తలలు వెలదేసుకుని, కాళ్ళ సందున, తోక లతో, గుర్రం, లైస్క అతని వెనకే వస్తున్నాయి.
” వెనక్కి పొండి!” అరిచేడతను.
అవి ఆగి, ఒకదాన్ని ఒకటి చూసుకుని, అతని వంక చుసేయి. అతను ముందుకి నడిచాడు. అవి అతన్ని
అనుసరించేయి. అప్పుడు అతను ఆగి, ఆలోచించసాగాడు. తనకు పెద్దగా పరిచయం లేని తన మనవరాలి దగ్గరకి, ఈ జంతువులతో కూడా వెళ్లడం ఏ మాత్రం బాగోదు. అలాగని అతను ఇంటికి తిరిగి వెళ్లి వాటిని ఇంట్లో ఉంచలేడు. అసలు వాటిని ఇంట్లో బంధించడానికి ఆ గేటు కూడా ఏ మాత్రం పనికి రాదు.
” అసలు అలా షెడ్ లో ఆకలితో చచ్చే బదులు, నేనే వాటిని ఇగ్న త్ దగ్గరకి తీసుకు పోతే?” అనుకున్నాడు జొతొవ్.
ఇగ్నట్ గుడిసె పచ్చిక బయలు మీద, ధ్వజస్తంభం నుంచి 100 అడుగుల దూరం లో ఉంది. జోతొవ్ ఏమిటి చెయ్యాలో నిర్ణయించుకోక పోయినా, అసలు అతని బుర్ర లో ఈ విషయం గురించి ఒక స్పష్టత లేకపోయినా, అనుకోకుండా నే అతను ఇగ్నట్ గుడిసె వైపు తిరిగేడు. అతని తల తిరుగుతోంది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి.
ఆ గోదారి వాడి వాకిట్లో ఏమిటి జరిగిందో అతనికి ఏ మాత్రం గుర్తు లేదు. భరించలేని తోళ్ళ కంపు, తను వెళ్ళేసరికి ఇగ్నట్ తాగుతున్న చక్కని క్యాబేజ్ సూప్ వాసన మాత్రమే అతనికి గుర్తు ఉన్నాయి. కల లో లా అతను ఇగ్నట్ ను చూసేడు. అక్కడ అతను జోతొవ్ నీ రెండు గంటలు ఎదురు చూసేటట్టు చేసేడు. మెల్లగా బట్టలు మార్చుకుని, ఎవరో ఆడ వాళ్ళతో కబుర్లడుతూ అల చాల సేపు గడిపాడు. ఆ తరవాత ఇగ్నాత్ గుర్రాన్ని ఒక స్టాండ్ లో నిలబెట్టడం అతనికి గుర్తు ఉంది. ఆ తరవాత రెండు బలమైన శబ్దాలు వినిపించేయి. ఒకటి గుర్రం నెత్తిన మొట్టిన శబ్దం. మరొకటి ఏదో బరువైన జంతువు పడిపోయిన శబ్దం. తన మిత్రుడి మరణం చూసి ,కోపం తో మొరుగుతూ లిస్కా ఇగ్నత్ మీదకి పోబోతూ ఉండగా దాని అరుపుని మధ్యలోనే అడ్డుకుంటూ మూడో దెబ్బ వినిపించింది. ఆ తరవాత ఆ రెండు శవాలనీ చూసి, తాగిన మత్తులో ఉన్న తను స్టాండ్ వద్దకు వెళ్లి తన తలని దెబ్బ పడటం కోసం స్టాండ్ మీద పెట్టడం అతనికి లీలగా గుర్తుంది.
ఆ తరవాత ఆ రోజంతా అతనికి తల దిమ్ముగా ఉంది, ఏమీ సరిగ్గా కనిపించలేదు. అతను తన చేతి వేళ్ళను కూడా సరిగ్గా చూడ లేకపోయేడు.
THE DEPENDENTS(1886)
Very nice translation
అనువాదం చాలా బాగుంది మేడమ్. మీ చేహోవ్ కథల మొదటి వాల్యూమ్ కొన్ని కథలు చదివాను.. అందులోనూ అనువాదం చాలా బాగుంది.