ఇవాన్ ద్మిత్రిచ్ ఒక మధ్యతరగతి మనిషి. ఏడాదికి తనకొచ్చే పన్నెండు వందల రూబుళ్ళ
ఆదాయంతో అతను సంతృప్తిగా జీవితం వెళ్ళదీస్తున్నాడు. ఒకరోజు రాత్రి భోజనం చేసాక అతను
తీరిగ్గా సోఫా మీద కూర్చుని వార్తాపత్రిక చదువుకుంటున్నాడు.
ఈలోగా భోజనాల బల్ల శుభ్రం చేస్తున్న భార్యామణి, “ఇవాళ నేను వార్తాపత్రిక చూడడమే
మర్చిపోయాను. కొంచెం లాటరీ ఫలితాలేమైనా వచ్చేయేమో చూస్తారా?” అని అడిగింది.
“ఆఁ, ఆఁ, వచ్చేయి. కానీ నీ టికెట్ రద్దు అయిపోలేదూ?” అడిగేడు ద్మిత్రిచ్.
“లేదు, లేదు, మొన్న మంగళవారం నేను దానిని పునరుద్ధరించాను.”
“ఓహెూ, నంబరెంత?”
“వరుససంఖ్య 9,499, నంబరు 26.”
“సరే, సరే, చూద్దాం…. 9499 యింకా 26.”
ఇవాన్ ద్మిత్రిచ్ కు ఈ లాటరీ అదృష్టం మీద ఏమాత్రం నమ్మకం లేదు. నిజానికి పద్దతి
ప్రకారమైతే అతను ఈ లాటరీ ఫలితాలు చూడటానికి ఒప్పుకునేవాడు కూడా కాదు. కానీ ప్రస్తుతం
చెయ్యటానికి వేరే పనేమీలేదు, ఎదురుగానే వార్తాపత్రిక పడి ఉంది. కనుక ఒప్పుకోక తప్పలేదు.
మెల్లగా లాటరీ నంబర్ల వరుసగుండా అతను తన వేలిని పోనిచ్చాడు. అంతేకాదు, అతని అనుమానపు
బుద్ధిని వెక్కిరిస్తున్నట్టు పై నుంచి రెండో వరుసలో ఒక సంఖ్య అతని దృష్టిని ఆకర్షించింది. 9,499!
అతను తన కళ్ళను నమ్మలేక పత్రికను మోకాళ్ళ మీద పడేసాడు. టికెట్ నంబర్ చూడాలని కూడా
అతనికి తోచలేదు. ఎవరో చల్లటి నీళ్ళు మీద క్రుమ్మరించినట్టు అతని ఒళ్ళంతా జలదరించింది.
తిమ్మిరెక్కినట్టు, తియ్యటి బాధ!
“మాషా, 9499 ఉంది,” అరిచాడతను బొంగురు గొంతుతో.
భయాశ్చర్యాలతో గడ్డ కట్టుకుపోయినట్టున్న తన భర్త మొహంలోకి చూసి, అతను వేళాకోళం
చెయ్యటం లేదని ఆమె నిర్ధారించుకుంది.
“9,499?” అడిగింది ఆమె పాలిపోయిన మొహంతో చేతిలోని తుండుగుడ్డ జారవిడుస్తూ.
“ఆఁ, ఆఁ, అదే, నిజంగానే ఉంది.”
“మరి…. టికెట్ నంబరు కూడా చూడాలి కదూ…. కానీ, ఆగాగు… నే చెప్పేదేమంటే….
ఏదేతేనేం, వరుస సంఖ్య ఉంది. అదే ఉంది. అర్థమయింది కదూ….?”
కొత్త వస్తువుని చూసినప్పుడు బోసినవ్వులు నవ్వే పసివాడిలాగ, ఇవాన్ ద్మిత్రిచ్ తన భార్యను
చూసి మతిలేని నవ్వు నవ్వాడు. ఆమెకూడా నవ్వింది. అతను గెలిచిన టికెట్ నంబరు చూడకుండా
కేవలం వరుస సంఖ్య మాత్రమే చూడడం ఆమెకి నచ్చింది. అది అతనికి కూడా నచ్చింది. రాబోయే
భాగ్యాన్ని తలుచుకుంటూ, గాలి మేడలు కట్టుకోవడం ఎంత మధురంగా ఉంటుంది? ఒక తియ్యటి
వేదన అది.
“ఆ వరుస సంఖ్య మనదే,” అన్నాడు ఇవాన్ ద్మిత్రిచ్ చాలా విరామం తరువాత. “అంటే మనం
గెలిచేందుకు అవకాశం ఉందన్నమాట. కేవలం అవకాశమే అనుకో…. అయినా సరే… అదైనా ఉంది
కదా!”
“సరే, యిప్పుడు యిక చూడండి.”
“కాసేపాగు. మనం నిరాశ పడడానికి మనకి బోలెడు సమయం ఉంది. అది పైనుంచి రెండో
వరుసలో ఉంది. అంటే బహుమతి మొత్తం 75,000. అది అసలు డబ్బుకాదు తెలుసా, దేవుడా, శక్తి.
అబ్బ! ఇంకొక్క నిమిషంలో నేను ఆ వరుస చూస్తాను…. అక్కడ 26! ఆహా, అద్భుతం. మనం ఒకవేళ
నిజంగా గెలిస్తే ఏమౌతుందంటావ్?”
భార్యా, భర్తలిద్దరూ మౌనంగా ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకోసాగారు. గెలిచే అవకాశం
వాళ్ళని వెర్రివాళ్ళని చేసింది. అసలు 75,000తో ఏం చెయ్యొచ్చో వాళ్ళ ఊహకి అందలేదు.
అంతమొత్తం వాళ్ళకి ఎందుకు అవసరమో వాళ్ళకే తెలియదు. దాంతో వాళ్ళేం చెయ్యబోతున్నారో, ఏం
కొనగలరో, ఎక్కడకు వెళ్ళగలరో యివేవీ వారు కలలో కూడా ఊహించని విషయాలు. వారికి నోట
మాట పెగలడం లేదు. వాళ్ళు కేవలం 9,499 యింకా 75,000 అనే సంఖ్యలను మాత్రం
ఊహించుకుంటూ కల్పనాజగత్తులో విహరించసాగారు. నిజంగా అంత డబ్బు వస్తే పొందగల
ఆనందాలు వాళ్ళ ఊహలకి అందనే లేదు.
పత్రిక చేతిలో పట్టుకుని గదిలో అటూ, యిటూ పచారు చేసిన ఇవాన్ ద్మిత్రిచ్ కాసేపటికి
తెప్పరిల్లి మెల్లిగా ఊహించడం ప్రారంభించాడు.
“ఒకవేళ మనం నిజంగా గెలిచామనుకో,” అని ప్రారంభించాడు. “అది సరికొత్త జీవితం. మన
జీవితమే మారిపోతుంది. అది నీ టికెట్ అయిపోయింది గానీ, అదే నాదైతేనా? నేను మొట్టమొదటగా
ఇరవై అయిదువేలు పెట్టి ఒక ఎస్టేటు కొంటాను, పదివేలు కొత్త సామాన్లు, ప్రయాణాలు, అప్పులు
తీర్చడాలు యిలాంటి ఖర్చులకి పోను మిగతా నలభైవేలు బ్యాంకులో వేస్తే ఎంచక్కా వడ్డీ వస్తుంది.”
“ఔను, ఎస్టేటు కొనడం మంచి పనే,” అంది ఒళ్ళో చేతులు పెట్టుకుని కూర్చుంటూ అంది
భార్య.
“తులాలోగానీ, ఒర్సోల్లోగానీ కొన్నామనుకో…. మనకి వేసవి విడిది వెతుక్కోనక్కరలేదు.
ఇంకా కిరాయి కూడా వస్తుంది.”
ఇక ఒక దాన్ని మించి ఒకటి అనేక ఊహాచిత్రాలు అతని మదిలోకి రాసాగాయి. ఒక దానికంటే
ఒకటి సుందరంగా ఉన్నాయవి. ఈ చిత్రాలన్నింటిలో అతను తనని తాను పుష్టిగా, ఆరోగ్యంగా,
ప్రశాంతంగా, వెచ్చగా వెచ్చగా ఏం ఖర్మ వేడిగా ఊహించుకున్నాడు. ఇక చూస్కో నా సామిరంగా….
వేసవికాలంలో సెలయేటి ఒడ్డున కాలే యిసుక తిన్నెలపైనో, లేదా తోటలో బత్తాయి చెట్ల క్రిందో నడం
వాల్చి, చల్లటి మంచులాంటి సూప్ త్రాగుతూ ఉంటే ఉంటుందీ…. ఆహా! అద్భుతం…. తన చిన్నారి
కొడుకూ, కూతురూ తన చుట్టూ పాకుతూ ఉంటారు… యిసుకలో గుంతలు తవ్వుతూ, తను యివాళ,
రేపు, ఎల్లుండి అసలెప్పటికీ ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదనే మధురమైన ఊహలతో ఏ ఆలోచనా
లేకుండా అలా కునుకు తీస్తాడు…. అబ్బ! లేదా, అలా పడుకుని, పడుకుని అలిసిపోయి మెల్లగా
పొలాల్లోకో, లేక పుట్టగొడుగుల కోసం దగ్గరే వున్న అడవిలోకో వ్యాహ్యాళికి వెళతాడు. లేదంటే
జాలరివాళ్ళు చేపలు పడుతుంటే తీరిగ్గా గమనిస్తాడు. ఇక సూర్యాస్తమానం అవగానే తుండుగుడ్డ,
సబ్బు తీసుకుని స్నానశాలకు వెళతాడు. అక్కడ తీరిగ్గా బట్టలు విప్పి, తన నగ్న వక్షాన్ని చేతులతో
రుద్దుకుంటూ, నీటిలో దిగుతాడు. ఇక నీటిలో, సబ్బునురగల మధ్యకు చిన్న చేపపిల్లలు, ఆకుపచ్చని
నాచు వచ్చి చేరుతుంటాయి. ఇక స్నానానంతరం ఆహా… చక్కటి మీగడతో టీ, మెత్తటి
పాలముంజెల్లాంటి బన్నులు…. ఓహోహో. సాయంత్రం వ్యాహ్యాళి లేదా ఇరుగు పొరుగులతో
పిచ్చాపాటీ… అద్భుతం.
“అవును, ఎస్టేట్ కొనడం నిజంగా బావుంటుంది.” అంది అతని భార్య. ఊహాలోకంలో
విహరిస్తూ ఆమె మొహం చూస్తే తన కలల్లో తను ఉందన్న సంగతి అర్థం అవుతూనే ఉంది.
ఇక ఇవాన్ ద్మిత్రిచ్ వర్షాకాలాన్ని ఊహించసాగాడు. వర్షాలు, చల్లని సాయంత్రాలు సెయింట్
మార్టిన్స్ వేసవి… ఆహా… ఇక ఆ కాలంలో అయితే నది ఒడ్డునో లేదా తోటలోనో కాస్త ఎక్కువ సేపు
సాయంత్రం నడక సాగించాలి. అలా బాగా చలి పట్టేక, ఒక పెద్ద గ్లాసుతో వోడ్కా తాగుతూ, ఉప్పటి
పుట్టగొడుగులో, ఊరేసిన దోసకాయలో తిని, మళ్ళీ యింకో గ్లాసు తాగి…. ఆహా…. పిల్లలు
వంటయింటి తోటలోంచి మట్టిలోంచి అప్పుడే పీకిన తాజా కేరట్ దుంపనో, ముల్లంగి దుంపనో
తీసుకుని తన వద్దకు పరిగెత్తి వస్తారు…. ఇక అప్పుడు తను సోఫా మీద కాళ్ళు బార్లా చాపుకు
పడుకుని తీరిగ్గా ఏదో ఒక అందమైన పత్రికను చదవడమో, లేదా కోటు బొత్తాలు ఊడదీసుకుని,
పత్రికతో మొహం కప్పుకుని గుర్రుపెట్టి పడుకోవడమో చేస్తాడు.
సెయింట్ మార్టిన్ వేసవి తరువాత వాతావరణం మబ్బుపట్టి, దిగులుగా ఉన్నట్టుంటుంది.
రాత్రి, పగలూ ఏకధారగా వాన కురుస్తూనే ఉంటుంది. చెట్లన్నీ దుఃఖిస్తున్నట్టుంటాయి. గాలి తేమగా,
చల్లగా ఉంటుంది. కుక్కలు, కోళ్ళూ, గుర్రాలూ అన్నీ తడిచిపోయి దిగులుగా ఉంటాయి. అప్పుడు
షికారు వెళ్ళే వీలుండదు. రోజులు తరబడి వీధి మొహం చూడటానికి ఉండదు, దిగులుగా కిటికీవంక
చూస్తూ, గదిలోనే నిస్పృహగా పచారు చెయ్యాలి. అబ్బ, అది చాలా నీరసంగా ఉంటుంది.
ఇవాన్ ద్మిత్రిచ్ కాస్త ఆగి తన భార్యవంక చూసాడు.
“మాషా, నేను విదేశాలకు వెళ్ళాలి, తెలుసా?” అన్నాడు.
ఇక మళ్ళీ వర్షాకాలంలో ఫ్రాన్స్ దక్షిణ భాగానికో, ఎక్కడికో విదేశాలకు వెళ్ళే ఊహలు
చెయ్యసాగాడు. పోనీ ఇటలీకి…. లేదా ఇండియాకి…!
“నేను కూడా తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి.” అంది అతని భార్య. “కానీ ముందు టికెట్
నంబరు చూడు కదా!”
“ఆగు, ఆగు, ఎందుకంత తొందర…!”
అతను అలా గదిలో పచారుచేస్తూ తన ఆలోచనలను కొనసాగించాడు. అకస్మాత్తుగా అతనికి
ఒకటి తట్టింది : నిజంగానే తన భార్య విదేశాలకు వెళ్తే ఎప్పుడైనా ఒంటరిగానో లేదా చక్కగా స్వేచ్ఛగా
ఉండే యువతులతో కలిసో విదేశాలకు వెళితే బావుంటుంది. అంతేగానీ, ఎప్పుడు చూడూ, పిల్లల
గురించి నస పెడుతూ ప్రతీ కాణీ గురించీ భయంతో వణికి చచ్చే ఆడాళ్ళతో విదేశీ ప్రయాణమేమిటి?
నా బొంద? బుట్టలు, తట్టలు, సంచులూ, గోనెలతో తన భార్య రైలులో ప్రయాణం చేస్తున్నట్టు అతను
ఊహించాడు. ఆమె దేనికో నిట్టూరుస్తూ ఉంటుంది; రైలు ప్రయాణం వలన తలనొప్పి వచ్చిందని
ఫిర్యాదు చేస్తుంది. చాలా డబ్బు ఖర్చు పెట్టేనని గునుస్తూ ఉంటుంది… స్టేషన్ వచ్చినప్పుడల్లా తను
వేణీళ్ళకోసమో, రొట్టెకోసమో, వెన్న కోసమో దిగి పరుగులు తియ్యాలి…. బాగా ఖరీదని తను రైలులో
భోజనం చేయదు మరి!
“ఆమె ప్రతీ కాణీకీ నన్ను వేపుకు తింటుంది,” అనుకున్నాడతను తన భార్యను ఓర కంటితో
చూస్తూ. “ఈ లాటరీ టికెట్ ఆమెది, నాది కాదు. అయినా అసలు, ఆమె విదేశాలకు వెళ్ళి ఏం
ప్రయోజనం? అక్కడ ఆమెకు ఏం కావాలి? ఏం చేస్తుంది? హోటల్ గదిలో తలుపేసుకు
కూర్చుంటుంది. నన్ను కూడా అటూ, యిటూ కదలనివ్వదు. తన ఎదురుగా కూర్చోమంటుంది….
అంతే, అది నాకు తెలుసు!”
అతనికి తన జీవితంలో మొట్టమొదటిసారి తన భార్యకు వయసైపోయిందనీ, సాదాగా
కనిపిస్తోందనీ, వంటింటి వాసన వేస్తోందనీ తోచింది. తనింకా ఆరోగ్యంగా, యవ్వనంతో ఉన్నట్టూ
మళ్ళీ పెళ్ళి చేసుకోదగ్గట్టుగా ఉన్నట్టూ తోచింది.
“సర్లే, అదంతా బుద్దిలేని వ్యవహారం,” అనుకున్నాడతను…. “అది సరే గానీ, అసలు
ఆవిడెందుకు విదేశాలకు వెళ్ళడం? దానితో తను ఏం సాధిస్తుంది? సరే, పోనీ వెళ్ళిందే
అనుకుందాం… ఏదైనా తనకొకటే కదా నేపుల్స్ అయినా కిల్న్ అయినా… తనకేం తేడా ఉంటుంది?
కేవలం నా దారికి అడ్డం తప్ప. నేను ఆవిడ మీద ఆధారపడి ఉండాలి. సాధారణ మహిళల్లాగే
డబ్బురాగానే, తను ఎలా అదంతా పెట్టెలో పెట్టి తాళం వేస్తుందో నాకు తెలుసు…. ఆమె దానిని నా
నుంచి దాచిపెడుతుంది…. ఆమె తన బంధువులందరికీ దోచిపెట్టి, నన్ను ప్రతీ కాణీకి ద్వేషిస్తుంది.”
ఇవాన్ ద్మిత్రిచ్ కి ఆమె బంధువులు గుర్తొచ్చారు. ఆ దిక్కుమాలిన అన్నలు, అక్కలు, అత్తలూ,
మామలూ అంతా ఈ లాటరీ టికెట్ గెలిచిన సంగతి వింటూనే దొర్లుకుంటూ వచ్చేస్తారు.
ముష్టివాళ్ళలాగ దేబిరిస్తూ ఉంటారు… దొంగ వెధవ నవ్వులోత, జిడ్డు కారుతూ మీదపడిపోతూ
ఉంటారు. దిక్కుమాలిన సంత, ఛీ, ఛీ! ఏదైనా యిచ్చేమో, యింకా కావాలని బిరిస్తారు. యివ్వలేదంటే
శాపనార్థాలు పెడతారు; నిందలు వేస్తారు, దరిద్రం చుట్టుకోవాలని మొక్కులు మొక్కుతారు.
ఇవాన్ ద్మిత్రిచ్ తన బంధువులను గుర్తుచేసుకున్నాడు. గతంలో నిష్పాక్షికంగా చూసిన వాళ్ళ
మొహాలే యిప్పుడతనికి ఏవగింపుగా, జుగుప్స కలిగించేవిగా తోచాయి.
“ఛ, ఛ, వాళ్ళంత కన్నా నికృష్టమైన వాళ్ళు!” అనుకున్నాడు.
అంతేకాదు, అతనికి తన భార్య మొహం కూడా ఏవగింపుగా తోచింది. అతని మనస్సులో ఆమె
మీద కోపం పెల్లుబికింది. అతను కసిగా యిలా అనుకున్నాడు! “అసలు ఈవిడకి డబ్బు గురించి ఓ
అంటే న తెలియదు. అందుకే అలా కాల్చుకు మింగుతుంది. ఒకవేళ నిజంగా ఈవిడ లాటరీ టికెట్
గెలిస్తే, నా మొహాన ఒక వంద రూబుళ్ళు కొట్టి మిగతాది చక్కా తాళం వేసి దాచుకుంటుంది.”
ఇప్పుడతను తన భార్య వంక చిరునవ్వుతో కాకుండా, ద్వేషంతో చూసాడు. ఆమె కూడా అతని
వంక ద్వేషంగానూ, కోపంగానూ చూసింది. ఆమెకు తన పగటి కలలు, తన ఊహలు, తన ఆలోచనలు
తనకు ఉన్నాయి. ఆమెకు తన భర్త కలలు చక్కగా అర్ధమయ్యాయి. తను గెలిచిన సొమ్మును
ముందుగా ఎవరు నొక్కేస్తారో ఆమెకు బ్రహ్మాండంగా తెలుసు.
“సొమ్మొకడిది, సోకొకడిది!” అన్నట్టున్నాయి ఆమె కళ్ళు. “ఆ ఊహ కూడా చెయ్యకు,
ఖబడ్డార్!” అని హెచ్చరిస్తున్నట్టున్నాయి అవి.
అతనికి తన భార్య చూపుల అర్థం తెలిసింది; అతని కడుపులో ఆమెపట్ల ద్వేషం మళ్ళీ
పెల్లుబికింది. ఇక ఆమెను విసిగించడానికీ, ఆమెమీద కక్ష సాధించడానికీ అతను పత్రికలో నాలుగో
పేజీలోకీ గబగబా తొంగిచూసి విజయగర్వంతో చదివాడు :
“వరుస సంఖ్య 9,499 టిక్కెట్ నంబర్ 46! 26 కాదు.”
ఆశ, ద్వేషం రెండూ ఒక్కసారిగా మాయమైపోగా వెంటనే యివాన్ ద్మిత్రిచ్ కీ, అతని భార్యకీ
తమ గదులు యిరుకుగానూ, చీకటిగానూ ఉన్నట్టూ, తాము తినే తిండి తమకేమీ బలాన్నివ్వకపోగా,
తమకు అరుగుదల లేకుండా చేస్తోందనీ, తమ సాయంత్రాలు దిగులుతో కూడినవిగా పెద్దవిగా
ఉన్నట్టూ తోచింది.
“బావుంది, దీనర్థం ఏమిటి?” అన్నాడు యివాన్ ద్మిత్రిచ్ వెటకారంగా.
“ఎక్కడ అడుగేసినా, కాగితమ్ముక్కలూ, తొక్కూ, తోలూ…. అసలు ఈ గదులు ఎప్పుడేనా ఊడ్చి
చస్తే! చచ్చినట్టు బయటకు పోవాల్సిందే…. ఛ, ఛ, ప్రాణం పోతే బాగుండు. ఏ చెట్టుకో ఉరేసుకు
చావాల్సిందే!”
