ఒక సందర్భంలో ఈ రచయితకి అలహాబాదు లో చాలా దూరం జట్కా బండి లో ప్రయాణించే అవకాశం దక్కింది.ఆ బండి తోలే మియా జుమ్మాన్ కి యాభై ఏళ్ళ వయసు ఉంటుంది. ఉత్త వాగుడు కాయ. అతను దారి పొడుగునా తన కథలతో నాకు వినోదం కలిగించేడు. అతని జీవిత కథనూ, అతను చెప్పిన కథలనూ పాఠకుల ఉపయోగం కోసం నేను ఇక్కడ అందిస్తున్నాను.
1.
జుమ్మాన్ : అయ్యగారూ , జట్కా కావాలా అండీ ? అబ్బే , ఆయన ఇటుకేసి చూడడమే లేదు . అతను నాటు బండి కోసం చూస్తున్నాడల్లే ఉంది . మంచిది , సంతోషం . నిజమే, నాటు బండి చవగ్గా దొరుకుతుంది. నేను కాదనను. కానీ, నడుం విరిగిపోదూ? అయ్యగారూ, రోడ్డు ఏమీ బాగా లేదు.నాటు బండి లో ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. నిన్న నాలుగు నాటు బళ్ళు రోడ్డు మీద బోల్తా పడ్డాయని మీరు వార్తా పత్రికలలో చదవలేదూ? మున్సిపాలిటీ చల్లగా ఉండాలి. కొన్నాళ్ళకి అది నాటు బళ్ళని పూర్తిగా ఆపేస్తుంది. లారీలు, కార్లు రోడ్డుని ధ్వంసం చేస్తున్నాయి. పాపం, ఆ ఫలితం అంతా నాటు బళ్ళ వాళ్ళు అనుభవిస్తున్నారు.తొందరలోనే జనాలు విమానాల్లో ప్రయాణిస్తారు. అప్పుడు నాటు బళ్ళకి రోడ్డు మీద కావలసినంత జాగా ఉంటుంది.అప్పుడు ఇక ఎవరూ లారీల వంక కన్నెత్తి కూడా చూడరు. కేవలం అవి మ్యూజియంలలో కనపడతాయి. అవి రోడ్లకి రాజులు.అయ్యగారూ, అసలు మన ప్రయాణాలని అవి ఎంత దుర్భరం చేసేయో తెలుసా? రోడ్డంతా వాటి కోసమే అయినట్టు మనని అంచులకి తోసేసేయి.ఇప్పుడు ఠీవిగా వెళ్తున్నాయి.గానీ, ఒకసారి విమానాలని రానివ్వండి. ప్రభుత్వం ఈ కారు సొంతదారుల నుంచి సొమ్ము తీసుకుని రోడ్లు బాగు చెయ్యొచ్చు కదా! పెట్రోల్ మీద నాలుగింతల పన్ను విధించొచ్చు కదా! వాళ్ళు వాళ్ళ కార్లని టాక్సీలు అని పిలుస్తారు కదా, మరి అలాంటప్పుడు పన్ను కట్టడానికి ఇబ్బంది ఎందుకు? మా ముసలామె అంటుంది కదా, “ నువ్వు నాటు బండిని వదిలేసి, జట్కా బండి కొన్నావు. కానీ, ఇప్పుడు దాని వల్ల కూడా ఉపయోగం లేదు. అంచేత, ఇప్పుడు ఒక కారు కొను.” అని. “ నేను నా కాళ్ళు, చేతుల మీద కాకుండా ఒక యంత్రం మీద ఆధార పడాలా?” అని నేను అడిగేసరికి నోరు మూసుకుంది. మరో వాస్తవం చెప్తాను. అది నిన్ననే జరిగింది. కల్లాన్ కారు చెట్టు ని గుద్దింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించేడు. ఒక్క క్షణంలో అతని భార్య విధవరాలు అయిపోయింది, పది మంది పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయేరు.అయ్యగారూ, నేను బీద వాడిని. ఎలాగో, నా పిల్లలని పోషించుకుంటున్నాను. ఇంతకన్నా నాకేం కావాలి? నేను గత నలభై ఏళ్ళుగా బండి తోలుతున్నాను. ఇక నా జీవితంలో మిగిలిన ఈ కొద్ది కాలం చేతిలో ఈ చెర్నాకోల తో గడిచి పోతుంది. ఆలోచించండి. నాటు బండి గానీ, జట్కా బండి గానీ తిరగబడినా, గుర్రం పడిపోయినా, నువ్వు బతికే ఉంటావు. నీ చేతిలో ఏదో ఒకటి ఉంటుంది. అదే కారు తిరగబడిందనుకోండి.. ఆ ఇనప శవాన్ని ఎవ్వరూ రెండు రూపాయలకు కూడా కొనరు. అయ్యగారూ, గుర్రం మిమ్మల్ని ఎలాగైనా చేరాల్సిన చోటుకి చేరుస్తుంది. కానీ, కార్ల గురించి ఆ మాట చెప్పగలరా? అవి ఎప్పటికప్పుడు రోడ్ల మీద ఆగిపోతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రయాణీకులు తక్కిన దారంతా నడిచే వెళ్ళాలి. గుర్రం అనేది ఎప్పుడూ మన అదుపులో ఉంటుంది. అది ఎప్పుడూ లాభాలు తెచ్చి పెడుతుంది. కారు ప్రయాణం కాస్త సౌకర్యంగా ఉంటుంది, నిజమే. కానీ, జట్కా బండిలో ప్రయాణీకులు నిద్ర పోతారు. నిజానికి గుర్రం కూడా నిద్ర పోతుంది. అయినా,మనం చేరాల్సిన చోటుకి కచ్చితంగా చేరుతాం. మోటార్ కార్ల చప్పుడుకి నీ చెవులు చిల్లులు పడతాయి. ఇక డ్రైవర్ తానేదో రుబ్బు పోత్రం తో పని చేస్తున్నట్టు భావిస్తాడు.
2
ఒక మాట చెప్పనా, అయ్యా! ఈ ఆడాళ్ళు ఉన్నారే,జట్కాలనీ, నాటు బళ్ళనీ మనసనేది లేకుండా వాడుకుంటారు. నిన్నటికి నిన్న ఏడెనిమిది మంది ఆడాళ్ళు వచ్చి త్రివేణి కి వెళ్ళడానికి ఎంత తీసుకుంటావని అడిగేరు. అయ్యా,మా బాడుగ ఎప్పుడూ కచ్చితంగా ఉంటుంది. అది ఏడాదికి నాలుగు సార్లు చవగ్గా సరుకు అమ్మే వైట్ వే కంపెనీ దుకాణం కాదు.రేటు కార్డు మీద ఎంత ఉందో అంత బాడుగ చెల్లించండి. మేం మిమ్మల్ని దీవిస్తాం. నేను మీ గురించి మాట్లాడడం లేదయ్యా! మీరు అప్పుడప్పుడూ నాకు అసలు బాడుగ ఇవ్వకపోయినా, పర్వాలేదు.కానీ, ఈ ఆడాళ్ళున్నారే! రూపాయి ఇవ్వాల్సిన చోట, ఎనిమిదణాలే ఇస్తారు. అయ్యా, మేం పెద్ద మనుషుల కోసం పని చేస్తాం. పెద్ద మనుషులు ఎప్పుడైనా పెద్ద మనుషులే. ఆడాళ్ళు ఎప్పుడూ ఆడాళ్ళే. పర్దా ఉంటుందని మమ్మల్ని దూరంగా నిలబెట్టి,డజన్ల కొద్దీ ఆడాళ్ళు, పిల్లలు బండి ఎక్కేస్తారు. ఒక సారి నా నాటు బండి కాడి విరిగిపోయింది. బండి అక్కడే ఆగిపోయింది. నన్ను నమ్మండి.. అందులోంచి కనీసం పదముగ్గురు ఆడాళ్ళు కిందకి దిగేరు. నేనా, బీద వాడిని. ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పలేను. అసలు ఈ ఆడవాళ్ళంతా ఒకరి ఒళ్ళో ఒకరు ఎలా కూర్చోగలరనేది ఎవరికీ అర్థం కాదు. వాళ్ళ బరువుకి జట్కా కూడా బాధ తో మూలుగుతుంది. వాళ్ళు తమ ముణుకుల మీద పిల్లలని కూర్చోబెట్టి, వాళ్ళ ఒళ్ళో పసిపాపలని పడుకోబెడతారు.దాంతో జట్కా బండి సర్కస్ మైదానంలా కనిపిస్తుంది. ఇంతా చేసి, వాళ్ళు మళ్ళీ పూర్తి బాడుగ చెల్లించరు. పూర్వం పర్దా పాటిస్తున్న కాలంలో మగవాళ్ళ తో మాట్లాడి, పూర్తి బాడుగ వసూలు చేసుకునే వాళ్ళం. కానీ, ఎగ్జిబిషన్ మైదానంలో మేళా ప్రారంభం అయిన దగ్గర్నుంచి పర్దా పక్కకి వెళ్ళింది. ఆడాళ్ళంతా తమంత తామే ప్రయాణాలు ప్రారంభించేరు. మేం డబ్బు నష్టపోతూనే ఉన్నాం. కానీ, అల్లా మమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు.ఈ నష్టాలు ఏడాది చివర్లో భర్తీ అవుతాయి. ఒక్క కమ్మరి పోటు వంద కంసాలి పోటుల కన్నా బలమైనది. పోయిన నెలలో ఒకామె జట్కా ఎక్కి, రెండు గంటల పాటు ఊరేగింది.చివరకు ఎనిమిదణాలు నా చేతిలో పెట్టి, ఇంట్లోకి పరిగెత్తింది. నేను జట్కా లో చూసేసరికి, ఆవిడ బంగారు పతకం ఒకటి పడి ఉంది. నేను వెనక నుంచి ఆమెను పిలుస్తూనే ఉన్నాను. కానీ ఆవిడ, ‘నేను అంతకు మించి ఒక్క పైసా ఇవ్వను,’అని నా మొహం మీద తలుపు వేసేసింది. నేను ఆ తలుపు వంక చూస్తూ కాసేపు నిలబడి, వెనక్కి తిరిగి వచ్చేసాను. నా బాడుగ సొమ్ము ఆవిడకి మిగిలింది. ఆవిడ గారి బంగారు పతకం నాకు మిగిలింది.
3
నిన్నటికి నిన్న ఏం జరిగిందో చెప్తాను, వినండి. కొందరు స్వరాజ్య వాదులు నా జట్కా ఎక్కేరు. వాళ్ళు కత్రా నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించేరు. వాళ్ళు నన్ను బండి వేగంగా తోలమని అడిగేరు.దారి పొడుగునా, ‘ గాంధీజీ కీ జై’ అనే నినాదాలు చేస్తూనే ఉన్నారు.ఎవరో పెద్ద నాయకుడు ఎక్కడ నుంచో వస్తున్నాడట. స్టేషన్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమికూడేరు. అంతటా ఊరేగింపులు జరుగుతున్నాయి. జనాలు నా బండిలో తోలు బొమ్మల్లా దూకి, గంతులు వేసేరు. చివరకు స్టేషన్ చేరే వేళకి నా చేతిలో నాలుగణాలు మాత్రమే పెట్టేరు. నేను మొత్తం బాడుగ చెల్లించాల్సిందేనని పట్టు పట్టేను. కానీ, అక్కడెవరూ నా మాటలని పట్టించుకోలేదు.గానీ ‘ గాంధీజీ కీ జై’ అనే నినాదాలు మాత్రం చేస్తూనే ఉన్నారు.
“ నా పొట్ట సంగతేమిటి? మీరంతా నా జట్కాని రంగస్థలం మాదిరిగా ఉపయోగించుకుని, గంతులు వేసేరు. ఇప్పుడేమో నా బాడుగ మాత్రం చెల్లించరా?” అని నేను కేకలు వేసేను. నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. ఈ లోగా వాళ్ళు గుంపులో కలిసి, మాయమయ్యేరు. ఈ జనాలు నిజంగా పిచ్చెత్తిపోయేరని నా ఉద్దేశ్యం. ఇలాంటి ప్రవర్తన తో వీళ్ళంతా స్వరాజ్యం తెస్తారా? అయ్యగారూ, ఒక వింతైన గాలి వీస్తోంది. వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోరు. గానీ, వాళ్ళకి స్వరాజ్యం కావాలి. వాళ్ళు ముందు వాళ్ళ పద్దతులు మార్చుకోవాలి. వాళ్ళంతా మా అబ్బాయిని కూడా వాళ్ళతో రమ్మన్నారు. వాడు బోలెడన్ని బట్టలు పోగు చేసి, వాటికి నిప్పు పెట్టబోయేడు. నేను మొదట వాడితో వాదించేను, “ నేను బీద వాడిని. కొత్త బట్టలు ఎలా కొనగలను?” అని. వాడు వినకపోయేసరికి, నాలుగు తగిలించేను. అయ్యగారూ, సమయం వచ్చినప్పుడు మా బండి వాళ్ళే స్వరాజ్యం తెస్తారు. అది ఎప్పుడూ మోటార్ కార్లలో రాదు. మొదట నా బాడుగ మొత్తం చెల్లించి, తరవాత స్వరాజ్యం కావాలని అడగండి.
అయ్యగారూ, ఆడాళ్ళు ఆడాళ్ళే.వాళ్ళతో మనం వాదించలేం. వాళ్ళు ఏమిస్తే, అదే మనం పుచ్చుకోవాలి. కానీ, వాళ్ళని మించిపోయిన దగాకోరు మనుషులు కొందరుంటారు. వాళ్ళు బండిలో ఎక్కేటప్పుడు మా బండి నెంబర్ తనిఖీ చేస్తారు.ఒకవేళ వాళ్ళ నిర్లక్ష్యం వలన ఏదైనా బండి లోంచి జారి పడినా, మమ్మల్నే తప్పు పడతారు. పైపెచ్చు వాళ్ళు తక్కువ బాడుగ ఇచ్చినా, నోరు మూసుకు ఉండాలంటారు. ఒకసారి ఇలాంటి దొంగ పెద్దాయన వైస్రాయ్ ఆఫీస్ కి నా జట్కా లో వెళ్ళేడు. దారి పొడుగునా ఏదో గొణుక్కుంటూనే ఉన్నాడు. ఒక్క నిమిషంలో తిరిగి వస్తానని నన్ను గేట్ ముందు నిలబడమన్నాడు. అవేళ నుంచి అతని రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా, మళ్ళీ నా కళ్ళ పడ్డాడో, అవేళ అతనికి నా తడాఖా చూపిస్తాను. ఏది ఎలాగైనా జరగనీ!
4.
ఇప్పుడు కాలం మారింది. కాలం తో పాటు మనుషులు కూడా మారేరు.అసలు మర్యాద, మన్నన అన్నవి ఎటు పోయేయో, ఆ దేవునికే తెలియాలి. మోటార్ కార్ వేగంతో అవి మాయం అయ్యేయి. అయ్యగారూ, మీ లాంటి పెద్ద మనుషులు మాత్రమే మా జట్కా వాళ్ళని పోషిస్తున్నారు, మర్యాదగా చూస్తున్నారు. లేకుంటే మమ్మల్ని అత్యంత హీనంగా చూస్తున్నారు. మమ్మల్ని గేలి చేస్తున్నారు.
నిన్న ఇద్దరు ఆసాములు రోడ్డు మీద వెళ్తున్నారు. నేను “ జట్కా కావాలా?” అని అడిగేను. దానికి ఒకతను “మేం కొంచెం తొందరలో ఉన్నాం,” అన్నాడు. మరొకతను “ టాక్సీ ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగేడు.
అయ్యగారూ, ఇదొక చిన్న ఊరు. మీరు ఎక్కడికి తీసుకు వెళ్ళమన్నా, నేను నిమిషాల్లో తీసుకు వెళతాను. కానీ, వాళ్ళు టాక్సీ ఎక్కడ దొరుకుతుందో నన్ను చెప్పమన్నారు. దీని కంటే విడ్డూరం ఏమన్నా ఉంటుందా? నా గుర్రం గురించీ, నా పిల్లల గురించీ కాస్త ఆలోచించండి. నా బాడుగ కేవలం గంటకు పద్నాలుగు అణాలే. అయ్యగారూ, అసలు ఎవరైనా రోజంతా నా బండిని కిరాయికి తీసుకుంటే ఎంత బాగుంటుందో! కొందరు పెద్దలు ఉన్నారు. నాతో అతి తెలివిగా ప్రవర్తించాలని చూస్తారు. నేను నలభై ఏళ్ళుగా ఇదే పని చేస్తున్నాను.ప్రయాణీకుడిని చూస్తూనే వాడి ఆలోచనలు కనిపెట్టగలను. “ నాకు డబ్బు ఇచ్చి చూడండి. నా గుర్రానికి ఎలా రెక్కలొస్తాయో! ఒక పెద్ద మనిషి చాలాసేపు పిసినారి బేరాలాడి, చివరకు గంటల లెక్కన జట్కా అద్దెకి తీసుకున్నాడు. అది కూడా గవర్నమెంట్ రేటు కన్నా తక్కువకి. చూడండయ్యా, మున్సిపాలిటీ పెట్టిన రేట్లే బగ్గీ వాళ్ళకి కనాకష్టంగా ఉన్నాయి. గానీ, కొందరు ఇంకా తక్కువ ఇవ్వాలనుకుంటారు.నేను కూడా తెలివి తక్కువగా ఆ రేటు కే ఒప్పుకున్నాను. జట్కా కొంత దూరం వెళ్ళేక, మెల్లగా శవం ఊరేగింపులా కదల సాగింది. తొందరగా పోనిమ్మని అతను నన్ను కంగారు పెట్టేడు. ఆ రోజు ఉపవాసం అనీ, నా గుర్రానికి ఆయాసం వస్తుందనీ నేను చెప్తే, అతను ఇలా అన్నాడు: “ సరే, అయితే. నీ గంటలు కూడా పెద్దవిగా ఉంటాయి.”
అయ్యగారూ, మీరెప్పుడూ నా జట్కా లో కూర్చుని ఉంటే, నేను మిమ్మల్ని ఊరంతా తిప్పుతూ ఉండాలని నా కోరిక.
5.
పెద్ద సాహెబ్ గారి ఆఫీస్ లో పని చేసే ఒక గుమాస్తా ఉన్నాడు. అతను కత్రా లో నివశిస్తాడు.నా మాట నమ్మండి. అతని ఛాతీ మూడు గజాల వైశాల్యం తో ఉంటుంది.అతడిని చూస్తూనే, జట్కా బళ్ళ వాళ్ళంతా పారిపోయే వారు.అతని వలన ఎన్నో నాటు బళ్ళు విరిగి పోయేయి. అతని భారీ శరీరం ఎలా ఉన్నా, అతను ఎంత నేర్పుగా గెంతేవాడంటే, తనకి ఎన్నడూ దెబ్బలు తగల్లేదు. జట్కా వాళ్ళందదిలోనూ కేవలం నేను మాత్రమే అతడిని ఎక్కించుకునే సాహసం చేసేవాడిని. అతను బాగా బాడుగ కూడా ఇచ్చేవాడు. దేవుడు అతడిని చల్లగా చూడాలి.
ఒక రోజు ఒక మిత్రుడి నాటు బండి నడుపుతూ ఉంటే, అతను నాకు ఎదురు పడ్డాడు. “ నువ్వు నన్ను ఆఫీస్ కి తీసుకెళ్ళగలవా? నేను ఇప్పటికే ఆలస్యం అయ్యేను,” అన్నాడు.
అతను నాటు బండిలో కూర్చుని, “ అయ్యో, నీ గుర్రం బొత్తిగా అస్థిపంజరం లా ఉందే!” అన్నాడు.
“ అయ్యా,ఇది నా గుర్రం కాదు. మీరు నాకు రెట్టింపు బాడుగ ఇస్తారు.కనక మీకు కావాలంటే, నేను నా జట్కా కి ఒక నాటు బండిని తగిలించి, మిమ్మల్ని ఊరంతా తిప్పుతాను.”
6
మరో కథ చెప్తాను, వినండి.ఒక సేఠ్ గారు నాటు బండి బాడుగకి తీసుకున్నారు. అతను కూరగాయల సంత నుంచి కూరలు, ఇంకా ఏవో కొనుక్కుని , ఆ తరవాత తనని స్టేషన్ లో దింపమని నన్ను అడిగేరు.మంచి కొసరు ఉంటుందనే ఉద్దేశంతో నేను కూడా నా గుర్రాన్ని హుషారుగా పరుగెత్తించేను. పాపం, నా గుర్రాన్ని అవేళ గట్టిగా కొట్టి, అదిలించేను.నా చేతులు నొప్పెట్టేయి.మేం ఎలాగైతేనేం ఆఖరి నిమిషంలో స్టేషన్ కి చేరుకున్నాం.చేరుకున్నాక, అతను నాకు కేవలం పావు అణా చేతిలో పెట్టేడు.
“ ఇదేంటయ్యా?” అని నేను అడిగేను.
“ నీ బాడుగ. నాకు ముందు రేట్ చార్ట్ చూపించు,” అన్నాడతను.
“ అయ్యా, మీరు తొందరలో ఉన్నారని నేను నా గుర్రాన్ని కొట్టి, అదిరింది, మిమ్మల్ని స్టేషన్ కి చేర్చేను.”
సేఠ్ గారు ఇలా జవాబిచ్చేరు: “ అయితే ఏమంటావ్? నీ పని తొందరగా అయిపోయింది కదా! దెబ్బలు నువ్వు తినలేదు కదా!”
నేను అతడిని బతిమాలేను, “ అయ్యా, నా గుర్రం మీద జాలి చూపించండి.”
దాంతో అతను కాస్త మెత్తబడ్డాడు. “ అవును. పాపం. ఈ జంతువు మీద కాస్త కనికరం ఉండాలి.” ఇలా అంటూ, అతను తన బుట్టలోంచి నాలుగు క్యాబేజీ ఆకులు తెంపి, వాటిని గుర్రం నోటికి అందించేడు.ఆ తరవాత తన దారిన తాను పోయేడు. అదంతా అతనికి సరదా, వేళాకోళం కావొచ్చు. కానీ, దాని ఫలితం నేను అనుభవించేను. గుర్రం కడుపు పాడయ్యింది. కాలం ఎలా మారిపోయింది! మనుషులకి ఇతరుల బాగోగులు పట్టటం లేదు.మర్యాదలు, పద్దతులు అన్నీ మారిపోయేయి. నేను బాడుగ అడిగితే వాళ్ళు ఇలా అంటున్నారు, “ నువ్వే యజమానివి . నీకు వీలున్నంత గా మమ్మల్ని దోచుకో.” సేఠ్ గారు తన పశువులకి హల్వా, జిలేబి మేపుతూ ఉండొచ్చు. కానీ మా మెడలు విరగ్గొట్టేడు. ఒకప్పుడు జనాలు మాకు సరైన బాడుగ ఇవ్వడమే కాకుండా మిఠాయిలు కూడా తినిపించేవారు.
7
ఇలాంటి కాలంలో కూడా అప్పుడప్పుడూ మనకి నిజమైన పెద్ద మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఒకసారి కొందరు పెద్దలు కష్మీరీ హోటల్ వద్ద నా జట్కా లో ఎక్కేరు. మేం కొంచెం దూరం ప్రయాణించేం. కిడ్ గంజ్ కి చేరగానే, ముందు వరుసలో కూర్చున్న ప్రయాణీకుడు దిగి పోయి, నాకు పద్నాలుగు అణాలు ముట్టజెప్పేడు. ఆ తరువాత వెనక్కి ఉన్న ప్రయాణీకుడు దిగి పోయి, మరో పద్నాలుగు అణాలు చెల్లించేడు. కానీ, మూడో వ్యక్తి ఇంకా దిగలేదు. నేను “ అయ్యా, ప్రయాణం పూర్తి అయింది,” అన్నాను. జవాబు లేదు.అతడిని కిందకి దింపమని నేను రెండో ప్రయాణీకుడిని కోరేను. అతను కాస్తా తడిమి చూసి, ఆ పెద్ద మనిషి చిత్తుగా తాగి పడి ఉన్నాడని తెలుసుకున్నాడు.
“ ఇప్పుడేం చేద్దాం?” అని నన్ను అడిగేడు.
నేను ఇలా జవాబిచ్చేను, “ చాలా సుళువు. అతడిని పోలీసు ఠాణా కి తీసుకు వెళ్ళండి.అతడి గురించి ఎవరూ రాకపోతే, మీరే నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు.”
అంచేత, అయ్యా, ఈ పనిలో రోజూ ఏదో ఒక తమాషా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పర్దా పాటించేవారు. తివాచీలు పరిచేవారు. నడిచే దారి వెంట గుడారాలు వేసేవారు. అప్పుడు ఆడాళ్ళు బళ్ళలో ఎక్కేవారు. కానీ, ఇప్పుడంతా మారిపోయింది. ప్రయాణీకులకి ఊపిరాడటం లేదని పర్దా తీసేసేరు. నేను నాటు బండి ని సంతోషంగా వదిలి పెట్టలేదు. అందరూ ఒకటే పోరు పెట్టేరు, “నాటు బండిని వదిలి పెట్టు. జట్కా తీసుకో,” అని. వాళ్ళు సౌకర్యం కోసం చూడలేదు. ఇప్పుడు వాళ్ళు తమ జీవితాల గురించి వాళ్ళే పట్టించుకోకుండా మోటార్ కార్లు, టాక్సీ లు కావాలని గోల పెడుతున్నారు. అయ్యా,నాకిదేమీ పెద్ద విషయం కాదు. నేనిక కొద్ది రోజులే బ్రతుకుతాను. నా కళ్ళ ముందు ఏమేం తమాషాలు జరుగుతూ ఉంటాయో చూస్తాను!
