మహావిజ్ఞుడు

Spread the love

ప్రాచీన చైనా రాజ్యం చావో రాజధాని హాన్ తాన్ లో  ఒకతను వుండేవాడు. పేరు చాయిచాంగ్. ధనుర్విద్యలో తాను ప్రపంచంలోనే అత్యుత్తముడు కావాలని అతనికి బలమయిన కోర్కె కలిగింది. ఎన్నో ప్రయాసలకోర్చి దేశమంతా వెదకిన మీదట చివరికి అందరికన్నా గొప్ప గురువు వాయీఫోయీ గురించి తెలిసింది. ఆయన విలువిద్యలో ఘటికుడు. వంద గజాల దూరంలోవున్న చిన్న ఆకుని గురిచూసి కొట్టగలరని అతను విన్నాడు. శ్రమదమాదులకోర్చి దూరప్రయాణంచేసి ఎట్టకేలకు వాయీఫోయీ వుంటున్న వూరుకెళ్లి ఆయన శిష్యుడయ్యాడు చాయిచాంగ్.

            గురువు వాయీపోయీ శిష్యునికి చెప్పిన తొలి పాఠం కనురెప్పల్ని మూతపడకుండా ఆపటం అభ్యాసం చెయ్యాలి. గురువుగారి ఆదేశం విన్న చాయిచాంగ్ తిన్నగా ఇంటికి వెళ్లి భార్య పని చేస్తున్న మగ్గంకిందికి దూరి వెల్లకిలా పడుకున్నాడు. తన కళ్ల ఎదుట కిందకీ మీదకీ కదులు తున్న మగ్గాన్ని కనురె ప్పలు వెయ్యకుండా పట్టి చూడాలన్నది అతని ఉద్దేశం. భర్త ఇలా తను పని చేస్తున్న మగ్గం కిందికి దూరి వెల్లకిలా పడుకోవటం చూసి భార్య ముక్కుమీద వేలువేసుకుంది. కట్టుకున్న మగాడయినా భర్త వింతగా పడుకొని తనని అదే పనిగా చూస్తూ పోతే తాను మగ్గం పని ఎలా చేయగలదని ఆమె అభ్యంతరం చెప్పింది. భర్త మొండి పట్టుదల ముందు ఆమె తలవంచక తప్పిందికాదు.

            ప్రతిరోజూ భర్త ఈ ప్రక్రియని సాగిస్తూనే వున్నాడు. రెండేళ్లలో అతను ఎంతో ప్రగతిని సాధించాడు. ఎట్టకేలకు ఈ రెండేళ్ల కాలంలో తాను సాధించిన ప్రగతికి సంతుష్టిచెంది ఒక రోజున అతను మగ్గం గొయ్యిలోంచి బయటికి వచ్చాడు. పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ఎవరైనా తన కనురెప్పమీద నేరుగా దెబ్బకొట్టినా లేదా పిడికెడు దుమ్ముని కళ్ల ముందు జల్లేసినా అతని కళ్లు మూతపడటం లేదు. ఒక నాడేం జరిగిందంటే అతను ఎప్పటిలాగే సాధన చేస్తున్నాడు. కనురెప్పలు వాల్చకుండా స్థిరంగా ఎదురుగా చూస్తు న్నాడు. ఇంతలో ఓ సాలెపురుగొచ్చి అతని కనుబొమల చుట్టూ సాలెగూడుని అల్లేసింది. ఈ సంఘటన అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. తను ఇహ గురువుగార్ని దర్శించవచ్చనుకున్నాడు.

            ఇన్నాళ్లలో తాను సాధించిన అభివృద్ధి గురించి గురువుగారికి శిష్యుడు వివరించిన మీదట వాయీఫోయీ ఇలా సెలవిచ్చారు.. “నువ్వు కనురెప్పలు మూతపడకుండా ఆపటా నికి చేసిన సాధన నువ్వు సాధించిన తొలి పాఠం. ఇహ నువ్వు చూడటం ఎలాగో  అభ్యాసం చెయ్యాలి. వస్తువుల్ని దృష్టి పెట్టి తదేకంగా చూడటం అలవాటు చేసుకో! ఎప్పుడయితే నీకు సూక్ష్మాతి సూక్ష్మమయిన వస్తువు సయితం స్పష్టంగా కనిపిస్తుందో అతి చిన్నది కూడా అతి పెద్దదానిగా నీకు కనిపిస్తుందో అప్పుడు తిరిగి నా దగ్గరికి రా!”

            గురువు ఆదేశం విని చాయిచాంగ్ తిరిగి ఇల్లు చేరుకున్నాడు. ఈసారి అతను తన తోటలోకి వెళ్లి చిన్న పురుగు కోసం వెదికాడు. చివరికి ఎలాగైతేనేం కంటికి కూడా కనిపించనంత చిన్న పురుగుని పట్టుకు న్నాడు. దాన్ని గడ్డిపోచమీద వుంచి గది కిటికీ దగ్గర వేళ్లాడదీశాడు. ఆ తర్వాత తాను గది రెండో చివరికి పోయి నేలమీద కూచుని కిటికీ దగ్గర గడ్డిపోచమీద వేళ్లాడుతున్న చిన్న పురుగుని పట్టుపట్టి చూడసాగాడు. మొదట్లో అంత దూరంలోవున్న ఆ పురుగుని చూడటం అతనికి ఇబ్బందిగానే వుండేది. కానీ పది రోజుల తర్వాత ఆ పురుగు కాస్త పెద్దదయ్యిందని అతనికి అనిపించసాగింది. ఇలా మూడు నెలలు గడిచాయోలేదో ఆ పురుగు పట్టుపురుగంత లావుగా అవుపించటమేగా కుండా దాని ప్రతి అవయవమూ స్పష్టంగా పోల్చుకోగలుగుతున్నాడు తాను.

            ఆ పురుగుని ఏకాగ్రతతో చూడటంలో ఎంత మునిగిపోయాడంటే బయట మారుతున్న రుతువులను గురించిన స్పృహ సయితం అతనికి లేకుండాపోయింది. వసంతకాలపు నునువెచ్చటి ఎండ మిటమిటలాడించే వేసవి మధ్యాహ్నంగా మారిపోయింది. హేమంత రుతువునాటి కాంతివంతమయిన ఆకాశం దక్షిణానికి పయనించే పక్షులతో నిండిపోయింది. చూస్తూ చూస్తూ వుండగానే ఆకులు రాల్చే శిశిరాన్ని వెనక్కి నెట్టి చలికా లపు బూడిదరంగు మంచుగాలులు వీచే రుతువు వచ్చేసింది. ప్రకృతిలో ఇన్ని మార్పులు సంభవిస్తున్నా అవేమీ చాయిచాం గ్ కి పట్టనేపట్టవు. అతని లోకమంతా గడ్డిప రకమీద వేళ్లాడుతున్న చిన్న పురుగుకే పరిమితమయిపోయింది. గడ్డిపరకమీద వుంచిన పురుగు చనిపోవటంగానీ పోవటంగానీ జరిగితే అదే సైజులోని మరొక పురుగుని చాయి చాంగ్ నౌకరు వెంటనే తెచ్చి గడ్డిపరక మీద వుంచేవాడు. ఏది ఏమయినా చాయిచాంగ్ కళ్లెదుటవున్న ఆ చిన్ని పురుగు క్రమంగా ఆ పెరిగి పెద్దదవుతున్నట్టుగా అతనికి అనిపించేది.

            మూడేళ్లపాటు చాయి చాంగ్ బహుశా ఎన్నడూ తన గదిలోంచి బయటికొచ్చిన జాడలేదు. చివరికి ఒక రోజున ఆ పురుగు అతనికి గుర్రం సైజులో కనిపించసాగింది. అతని సంతోషానికి అవధులులేవు. సంతో షంతో గట్టిగా గొంతెత్తి అరుస్తూ, తొడని చరుచుకుంటూ గదిలోంచి బయటకి వూడిప డ్డాడు. కానీ రోడ్డుమీదకి వచ్చాక తన కళ్లని తానే నమ్మలేకపోతున్నాడు అతను. తోవని పోతున్న గుర్రాలు పర్వతాల ఆకారాల్లోనూ, పందులు చిన్నపాటి కొండల్లాగా, కోళ్లు కోట బురుజుల్లాగాను కనిపిస్తున్నాయి. ఎగిరి గంతేస్తూ అతను ఇంట్లోకి పరుగెత్తాడు. పల్చటి ‘శువోపిలుంగ్’ బాణాన్ని తనకి ప్రియ మయిన ధనుస్సుమీద సంధించి గురిచూసి సునాయాసంగా పురుగు గుండెను చీరేశాడు. చిత్రమేమిటంటే పురుగు గుండెను చీల్చిన బాణం గడ్డిపరకని స్పృశించనయినా స్పృశించలేదు.

            ఇక ఆలస్యం చేయకుండా గురువు దగ్గర కెళ్లి తను సాధించిన చమత్కారం గురించి ఆయనకి వివరించాడు చాయిచాంగ్. ఈసారి గురువు వాయీఫోయీ నిజంగా సంతోషించి శిష్యుణ్ణి అభినందించాడు.

            తాను సాధించిన ధనుర్విద్యా రహస్యాలకి ఆవేశంతో ఊగిపోతూ చాయిచాంగ్ ఐదేళ్లు గడిపేశాడు. గురువుగారి అభినందన, తాను పడ్డ శ్రమ వ్యర్ధంకాదని రుజువుచేసింది. తన విలువిద్య పూర్తి అయ్యింది. ఇంక సాధించవలసిందేమీ లేదు. అయినా ఇంటికి తిరిగి  వచ్చేలోపున ఈ విద్యలోని అత్యంత కష్టతర మయిన పరీక్షల్లో సయితం నెగ్గాలని అతను సంకల్పించుకున్నాడు.

            మొట్టమొదట అతను చేసిన పని, గురువు వాయీఫోయీలా ధనుస్సుని అందుకొని వంద గజాల దూరంలోవున్న ఓ చిన్న ఆకుని ఛేదించటానికి అమ్ములపొదిలోవున్న బాణాలన్నిటినీ ఖాళీ చేసేశాడు. తర్వాత కొన్ని రోజులు పోయాక ఓ విలక్షణమయిన పద్ధ తిలో అదే ప్రక్రియని అనుసరించాడు. ఈసారి అమ్ములపొదిని ఖాళీ చేసే చివరి బాణం చాలా పొడవయినదీ, బరువయిన దీను. కుడి మోచెయ్యి మీద నీళ్లతో నిండిన  కప్పుని కదలకుండా వుంచాడు. అన్ని బాణాలూ వెనకటిలాగానే గురి చూసిన వస్తు వుని కొట్టడానికి ఉపయోగించాడు. అయినా కప్పు తొణకలేదు, ఒక్క చుక్క నీళ్లు ఒలక లేదు.

            ఇది జరిగిన కొద్ది రోజులకే చాయిచాంగ్ రెక్కల్లాంటి తేలికైన వంద బాణాలను ధను స్సుమీద వుంచి ఒక్కటొకటిగా వడివడిగా లక్ష్యాన్ని గురిచూసి కొట్టాడు. అవి గురి తప్ప కుండా ఒక దానికొకటి అంటుకుంటూపోయాయి. అతను ధనుస్సుని నేలకి దించినా  గాలిలోనే వూగసాగాయి. ఏ ఒక్కటీ నేలమీద పడిపోలేదు. ఆ ఆద్భుత దృశ్యం చూసి గురువు వాయీఫోయీ మౌనంగా వుండలేకపోయాడు. ఆనందం పట్టలేక చప్పట్లు చరుస్తూ శిష్యుణ్ణి మనసారా  అభినందించాడు.

            ధనుర్విద్యలోని కఠిన పరీక్షలను సయితం  విజయవంతంగా అధిగమించిన చాయిచాంగ్ చివరికి ఇంటికి చేరుకున్నాడు. ఏళ్ల తరబడి భర్త రాకకోసం నిరీక్షించి నిరీక్షించి విసుగెత్తిన భార్య భర్త గుమ్మంలో కాలు పెట్టగానే సూటీపోటీ మాటలతో అతని మనసుని గాయపర్చింది. తనకి స్వాగతం చెప్పాల్సిన భార్య ఇలా అవమానకరంగా ప్రవర్తించ టంతో చికాకుపడ్తూ, ఛర్రున ధనుస్సు అందుకొని ‘చాయీవేయీ’ బాణాన్ని సంధించి వింటినారిని లాగి వదిలాడు భార్య కనురెప్పపై భాగంమీదకి. అద్భుతమయిన వేగం, తప్పిపోని గురి! భార్య కనుబొమనించి మూడు వెంట్రుకలను బాణం ఎత్తుకుపోయినా ఆమెకి ఇసుమంతయినా తెలీదు. తన ధోరణిలో ఆమె భర్తపై తిట్లవర్షం కురిపిస్తూనే వుంది.

            ధనుర్విద్యలో చాయిచాంగ్ తన గురువు వాయీఫోయీ నించి నేర్చుకోవలసిందేమీ మిగలలేదు. తన జీవిత అంతమ లక్ష్యం దరి దాపులకు అతను చేరుకున్నాడు. అయినప్ప టికీ తాను నేర్చుకున్న విద్యలో ఏదో లోపం కనిపించసాగింది. తన మనసు లోతుల్లోకి తడిమి చూసుకున్నాడు. తన లక్ష్యసిద్ధి మార్గంలో ఒక అడ్డంకి వుండటం కనుగొన్నాడు. ఆ అడ్డంకి మరెవ్వరో కాదు, స్వయాన తన గురువుగారే! విలువిద్యలో తాను ఎంత ప్రావీణ్యం చూపించినా గురువు వాయీఫోయీ బతికుండగా తననెవ్వరూ ప్రపంచంలోని అత్యుత్తమ ధనుర్విద్యానిపుణుడిగా గుర్తించరు. విలువిద్యలో గురువుతో సమానస్థాయికి తాను చేరుకున్నా గురువు గార్ని అధిగమించటం తనకి సాధ్యంకాదు. అంటే గురువుగారు బతికుండటమే చాయి చాంగ్ మనో లక్ష్యాన్ని సాధించటానికి ఓ ఛాలెంజ్ గా తయారయ్యింది.

            ఒక రోజున పొలాల మధ్య ముందుకి సాగుతున్న చాయిచాంగ్ కి దూరంనించి గురువు వాయీఫోయీ తనవేపు వస్తూ కనిపించారు. గురువుగార్ని చూసిన వెంటనే వెనుకాముందూ ఆలోచించకుండా ధనుస్సుని ఎత్తుకొని బాణాన్ని సంధించి గురువుగారిని గురి చూసి విడిచిపెట్టాడు. వృద్ధుడయిన గురువుగారు కూడా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. క్షణంలో సగంలో తను కూడా ధనుస్సుని అందుకొని బాణాన్ని విడిచిపెట్టాడు. గురు శిష్యులు విడిచిన బాణాలు మార్గమధ్యంలోనే ఒక దాన్నొకటి ఢీకొని రెండూ నేల మీద పడిపోయాయి. మరుక్షణమే శిష్యుడు వింటినారిని ఎక్కు పెట్టి బాణాన్ని విడవటం, దానికి జవాబుగా గురువుగారు కూడా బాణాన్ని విడవటం, మొదటి దాన్ని రెండోది ఢీకొని నేలని కూల్చటం జరిగిపోయింది. గురువుగారి అమ్ములపొదిలోని చివరి బాణం కూడా అయిపోయేదాకా ఈ ద్వంద్వ సంఘర్షణ సాగుతూనే వుంది. చివరికి చాయి చాంగ్ దగ్గర ఒకే ఒక్క బాణం మిగిలి వుంది. ఇదే అదను అని ఆలోచించి చాయి చాంగ్ ఆ చివరి బాణాన్ని గురువుగారిపై సంధించాడు. అయితే గురువు కూడా తక్కువ తినలేదు. విద్యుత్వేగంతో పక్క నున్న ముళ్లపొదనించి ఓ కొమ్మని తెంచి అంతిమ సమయంలో తన గుండెను గురి చూసి వాయువేగంతో వస్తున్న బాణం యొక్క ములికిని తాను తెంపిన కొమ్మకి వున్న ముల్లు చివరితో వంచేసి నేలమీద పడేశాడు.

.           తన దురుద్దేశం విఫలం కావడంతో చాయి చాంగ్ ఊగిసలాటలో పడ్డాడు. ఆత్మగ్లానితో పశ్చాత్తాపంతో అతని మనసు ఉసూరుమంది. తన లక్ష్యం నెరవేరివుంటే అతని ఆలోచనలు మరోలా వుండేవేమో! మరోవే పున తాను బతికి పోవటంవల్ల సుఖం, తనని తాను రక్షించుకొనేందుకు తాను ప్రయోగించిన విలువిద్యకి గురువు వాయీఫోయీ మనసులో గర్వం కలిగింది. అంతేకాదు తనని హత్య చేయటానికి ప్రయత్నించిన శిష్యునిపై కోపంగానీ విద్వేషంగాని కలగలేదు. ఈ మానసిక స్థితిలోనే గురుశిష్యులిద్దరూ ఒకరివేపు మరొకరు పరుగెత్తి, కన్నీ ళ్లతో ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. కానీ క్షమా గుణంతో శిష్యుణ్ణి అక్కున చేర్చు కుంటున్న వాయీఫోయీ మనసులో దుర్బు ద్ధితోవున్న తన శిష్యుడు ఏదో ఒక రోజున తన ప్రాణానికి ముప్పు తేగలడని అనిపించింది. ఈ ప్రమాదంనించి తప్పుకోవాలంటే సమయం వుండగానే తాను మేల్కోవాలి. చాయిచాంగ్ ని  ఈ ఉన్మాదంనించి తప్పించాలంటే క్లిష్టమయిన లక్ష్యంవేపు అతని మనసుని మళ్లించాలి.

            చాయిచాంగ్ ని తన ఆలింగనం నించి వేరు చేస్తూ చేస్తూ వాయీఫోయీ “చూడు నాయనా! నాకు తెలిసిన విలువిద్యనంతట్నీ నీకు నేర్పేశాను. ఇక నీకు నేర్పటానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. అయినా ఈ విలువిద్యలో ఇంకా లోతుకి వెళ్లి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే దానికో ఉపాయం చెబు తాను నీకు. ఎత్తయిన తాసింగ్ ఘాటే  గుండా పయనించి పశ్చిమ దిశలో హూ అనే పర్వతం ఉంది. దాని శిఖరం మీదకి వెళ్లు. అక్కడ గురుపితామహుడు కాన్ యింగ్ వుంటారు. ఆయనని మించిన విలువిద్యా నిపుణుడు  ఈ ప్రపంచంలోనే మరొకరు లేరు. వారి కౌశలం ముందు మన విలువిద్య చిన్నపిల్లాడి చేష్ట అనిపిస్తుంది. ఆయనొక్కరే ఈ ప్రపంచంలో ధనుర్విద్యలో నిన్ను గమ్యం చేర్చగలడు. వెళ్లి ఆయన గురించి వెదుకు. ఆయన ఇంకా బతికేవుంటే వెంటనే ఆయన శిష్యునిగా చేరిపో” అన్నాడు.

            గురువుగారి మాట విని వెంటనే చాయి చాంగ్ పడమటి వేపుకి ప్రయాణం సాగించాడు. విలువిద్యలో తాను సాధించిన ఘన విజయాల్ని గురువుగారు చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించటం అతని అహానికి బలమయిన క్లేశం కలిగించింది. దానితోపాటు అతనికి భయం కూడా పట్టుకుంది. తాను చేరాల్సిన అంతిమ గమ్యానికి ఇంకా మైళ్ల దూరంలో లేడుగదా! తాను త్వరత్వరగా హూ పర్వత శిఖరం చేరుకొని తన విలువిద్యను ఆ వృద్ధ పితామహుని విద్యతో పోటీ పెట్టాల్సిన అవ సరం ఇప్పుడు ప్రధానమయినదయింది అనుకున్నాడు.

            తాసింగ్ ఘాటేని దాటి చాయిచాంగ్ కష్టనష్టాలకోర్చి ఆ దుర్గమ పర్వత శిఖరానికి ఎక్కసాగాడు. రాతి మార్గంలో నడవడంవల్ల అతని చెప్పులు పగిలిపోయి ముక్కలు చెక్కలయిపోయాయి. అరిపాదాలనించి, మడమల నించీ నెత్తురోడసాగింది. అయినా అతను ధైర్యాన్ని వీడలేదు. ప్రమాదభరితమయిన కొండ చరియలూ, లోతయిన లోయలపై వున్న కొయ్యబల్లలు దాటుకుంటూ సుమారు నెల రోజులపాటు ప్రయాణం సాగించి ఎట్టకేలకు హూ పర్వత శిఖరం చేరుకున్నాడు. అతను. కాని యింగ్ నివసిస్తున్న గుహని సులువుగానే పోల్చుకొని అందులోకి  దూరాడు. కాన్ యింగ్ ముసలివగ్గయినా ఆయన కళ్లలో గొర్రెపిల్ల కళ్లలోని అమాయక కోమలత్వం ప్రతిబింబిస్తోంది. నడుం వంగి వుంది. ఆయన నడుస్తుంటే మంచుతో తడిసిన ముగ్గుబుట్టలాంటి తల నేలని జీరాడసాగింది. ఆయన ఎంత వృద్ధుడంటే చూసే వాళ్లు గాభరాపడిపోతారు.  ఇంత ముసలివాడు సహజంగానే చెవిటి వాడు అయివుంటాడని వూహించిన చాయి చాంగ్ బిగ్గరగా మాట్లాడసాగాడు.

            “నేను భావిస్తున్నంతగా గొప్ప విలుకాడనో, కానో తేల్చుకోడానికి ఇక్కడికి వచ్చాను” అని కాని యింగ్ జవాబు కోసం వేసి వుండకుండానే తాను మోసి తెచ్చిన దేవదారు ధనుస్సుని అందుకొని ఆకాశంలో ఎగురుతున్న పక్షుల గుంపుకి గురి పెట్టి ‘త్యూచియేహ్’ బాణాన్ని ఎక్కు పెట్టి విడిచాడు. చూస్తూ చూస్తూ ఉండగానే ఆకా శంలో విహరిస్తున్న ఐదు పక్షులు బాణం దెబ్బకి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి అతనికి కొద్ది దూరంలో నేలకూలాయి.

            అది తిలకించిన వృద్ధ పితామహుడు ఉదా రంగా నవ్వుకుంటూ “ధనుస్సుతో బాణం గురి చూసి కొట్టడం గొప్ప విషయంకాదు మిత్రమా! నువ్వు ఇప్పటిదాకా బాణం సంధించనవసరంలేకుండా గురిచూసి కొట్టడం నేర్చుకోలేదా? రా, నాతో పాటురా!” అన్నాడు.

            చాయిచాంగ్ వృద్ధ సన్యాసి వైరాగ్యానికి లజ్జితుడవుతూ ఆయనని అనుసరించి గుహలోంచి బయటికి వచ్చి రెండు వందల అడుగుల దూరం నడిచి పర్వతం అంచు దగ్గరకి చేరారు. అక్కణ్ణించి చూస్తే కింద లోతయిన లోయలో వేల గజాల దూరంలో శిలల మధ్య నించి ఓ కొండవాగు వెండిలా తళతళ మెరిసిపోతోంది. దాన్ని చూస్తున్న చాయి చాంగ్ కి  కళ్లు బయిర్లు కమ్మాయి. తల తిరుగుతున్నట్టు అనిపించసాగింది. ఇంతలో గురు పితామహుడయిన కాన్ యింగ్ వేగంగా పరుగెత్తి పర్వతానికి బయట లోయ పైన నిలచివున్న శిలమీద నిలబడ్డాడు. వెను దిరిగి సవాలు విసురుతున్నట్టుగా చాయిచాంగ్ తో ,

            “ఇప్పుడు చూస్తాను నీ విలువిద్య ఏపాటిదో. నేను నిలబడివున్న చోటుకి వచ్చి నువ్వు నీ విలువిద్యని చూపించు!” అన్నాడు.

            అభిమాన ధనుడయిన చాయిచాంగ్ ఆ పని తనవల్ల కాదనలేకపోయాడు. కాన్ యింగ్ నిలబడిన చోటుకి వచ్చి నిలబడ్డాడు. కానీ అడుగు ముందుకి వేయబోతుంటే శిల  మెల్లమెల్లగా ఊగిసలాడసాగింది. ధైర్యం చిక్కబట్టుకొని అతను ధనుస్సుని అందుకొని బాణం సంధించబోతుంటే వేళ్లు వణికాయి. కానీ అప్పుడే శిలకింద వున్న ఓ రాయి జారి, వేల గజాలకింద విస్తరించివున్న శూన్యంలోకి పడిపోతోంది. ఇక తాను బ్యాలెన్సు తప్పుతా నని అతనికి బలంగా అనిపించసాగింది. గాభరాలో తడబడుతూ పడిపోతున్న శిల మీద భాగాన్ని బలంగా పట్టుకున్నాడు. కాళ్లు వణుకుతున్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.

            వృద్ధపితామహుడు ఫకాలున నవ్వాడు. చెయ్యి అందించి చాయిచాంగ్ ని  శిలమీద నించి నెమ్మదిగా దించాడు. తిరిగి తనే శిల మీదకి ఉరికి దాని మీద నిలబడి , “ఇప్పుడు నువ్వు ఇష్టపడితే అసలైన విలు కాడెవరంటారో, నీకు చూపిస్తాను” అన్నాడు.”

            చాయిచాంగ్ మొహం సిగ్గుతో పాలిపో యింది. అతని గుండె శబ్దం సమ్మెటపో టులా వినిపిస్తోంది. ఇంత జరిగినా వృద్ధ గురువు చేతులు రెండూ ఖాళీగా వుండటం గమనించాడతను.

            ‘కానీ కానీ మీ ధనుస్సు ఎక్కడ? ‘ గొంతు సవరించుకుంటూ చివరికి చాయిచాంగ్ అడిగేశాడు.

            “నా ధనుస్సా? ” మళ్లీ ఫక్కున నవ్వేశాడు వృద్ధుడు.

             “నాకు ధనుస్సెక్కడిది? ” చాయి చాంగ్ పై దృష్టిసారిస్తూ అన్నాడాయన. “నీకు ధనుస్సు, బాణం అవసరం వున్నదాకా నువ్వు యీ విలువిద్యలో అట్టడుగునించి బయటికి రాలేవు. అసలు విలువిద్య ధనుస్సుని కోరదు, బాణమూ అవసరంలేదు”

            అప్పుడే వారి తలమీద ఆకాశంలో ఎంతో ఎత్తున ఓ గద్ద ఎగురుతోంది. వృద్ధుడు దృష్టి సారించి గద్దని చూడసాగాడు. చాయిచాంగ్ కూడా గురువు దృష్టిని అనుసరించాడు. అతని తీక్షణమయిన దృష్టికి ఆకాశంలో ఎత్తున ఎగురుతున్న ఆ గద్ద సయితం నువ్వు గింజలా అవుపిస్తోంది. పితామహుడు కాన్ యింగ్ గాలిలో ధనుస్సుని వూహించి అదృ శ్యబాణాన్ని దానిమీద వుంచి ఆకర్ణాంతం వింటినారిని సారించి వూహాబాణాన్ని విడిచి పెట్టాడు. చాయిచాంగ్ కి  సర్రుమన్న శబ్దం వినిపించింది. మరుక్షణంలో గద్ద రెక్కలు ఆడించటం నిలిపివేసి నిర్జీవమయిన రాయిలా ఆకాశంనించి నేల మీద పడిపో యింది.

            అది చూసి చాయిచాంగ్ అవాక్కయిపో యాడు. తాను మొదటిసారిగా విలువిద్య లోని వాస్తవికమయిన అత్యున్నత స్థితిని చూడగలిగినట్టుగా అతను అనుభూతి చెందాడు. దాన్ని

దాన్ని తాను సాధించానన్న అహంకారంతోనే అతను ఇంత దూరం నడిచి వచ్చాడు.

            చాయిచాంగ్ ఈ పర్వత సానువుల్లో  తొమ్మిది సంవత్సరాలు పాటు వృద్ధ పితామహునితో కలిసి విలువిద్యలో సాధన చేశాడు. ఈ తొమ్మిదేళ్లలో అతను చేసిన తపస్సు ఎలాటిదో ఎవరికీ తెలీదు. పదో ఏట అతను పర్వతాలు దిగి ఇల్లు చేరాక అతనిలో ఎన్నెన్నో మార్పులు సంభవించాయి. అందు వల్ల అతణ్ణి పోల్చుకోవటం కష్టమే. అతని మొహంలో గతంలో ద్యోతకమయిన మొండి పట్టుదల, దర్పం తాలూకు చివరి గుర్తులు కూడా మచ్చుకైనా లేకుండా పోయాయి. వాటి స్థానంలో సాదాతనం, సహజత్వం పుట్టుకొచ్చాయి. అతన్ని కలవటానికి వచ్చిన పాత గురువు వాయీఫోయీ అతనిమీద దృష్టిసారించి,

            “అహా! ఇప్పుడు నువ్వు నిజంగానే మహా జ్ఞానివైపోయావు. నాలాంటి అయోగ్యుడు నీ పాద ధూళిని సయితం స్పృశించటానికి అర్హు డుకాడు” అన్నాడు.

            హానాతాన్ నగరవాసులు చాయిచాంగ్ కి  దేశంలోనే అత్యుత్తమ విలుకాడు అని బిరుదు ప్రదానం చేసి అతనికి జేజేలు పలికారు. ఆ తర్వాత అతను ప్రదర్శించబోయే ధనుర్విద్యని దర్శించటానికి ఎంతో ఉత్సా హంగా, ఆసక్తితో ఎదురుచూడసాగారు. కానీ చాయిచాంగ్ నగరవాసుల ఆశలు నెరవేర్చటం అటుంచి ఇంటికొచ్చిన తర్వాత ధనుర్బాణాల్ని తాకనయినా తాకలేదు. తనతో తీసుకెళ్లిన పెద్ద దేవదారు ధనుస్సుని బహుశా కొండల్లోనే విడిచేసి వుంటాడు. అతనిలోని ఈ వైరాగ్యం గురించి ఒకరు అతణ్ణి ప్రశ్నించినపుడు “సక్రియతకి అత్యు న్నత దశ నిష్క్రియత. అలాగే పొగరుబోతుతనానికి అంతిమ పరిణామం మౌనం. విలువిద్యకి పరాకాష్ట ధనుస్సును విసర్జించడం” అని సమాధానమిచ్చాడు.

            హాన్ తాన్  నగర సంవేదనాశీలురయిన నాగరికులు చాయిచాంగ్ పలుకులలోని  మర్మాన్ని వెంటనే గ్రహించారు. ధనుర్బాణాలను స్పృశించేందుకు సయితం నిరాకరించే ఆ మహాధనుర్ధారి ముందు భక్తి భావంతో నతమస్తకులయ్యారు. ఆయన విలువిద్యని త్యజించిన వార్త వ్యాప్తి చెందిన అనంతరం ఆ ప్రాంతమంతటా అతని కీర్తి ఇనుమడిస్తూనే వచ్చింది.

            దేశవిదేశాల్లో ఇప్పుడు చాయి చాంగ్ గురించి రకరకాల పుకార్లు వ్యాపించసాగాయి. అర్ధరాత్రి తర్వాత అతని ఇంటికప్పునించి అదృశ్య వింటినారిని సంధించిన శబ్దాలు వెలువడుతున్నాయనీ, ధనుర్విద్యా దేవత దిన మంతా చాయిచాంగ్ తోనే నివశిస్తున్నట్టు, రాత్రివేళల్లో దురాత్ముల బారినించి అతణ్ణి రక్షించేందుకు బయటికి వస్తున్నట్టు ఎవరో చెప్పారు. చాయిచాంగ్ పొరుగింటి వ్యాపారి ఒక రాత్రివేళ మేఘాలమీద కూచుని చాయి చాంగ్ తన ఇంటి మీంచి ఎగరడం తాను కళ్లారా చూశాననీ అతని చేతిలో నిజమయిన ధనుస్సు వుందనీ, అతను ప్రాచీన యుగపు పేరు మోసిన విలుకాళ్లు హావు ఆయీ, యాంగ్ యాచీలతో విలువిద్యలో పోటీ పున్నట్టుగా పుకార్లు లేవదీశాడు. ముగ్గురూ విడిచిన బాణాలు ఆకాశంలోని ఆరియన్, సిరియస్ అనే నక్షత్రాల మధ్య లోంచి నీలం కాంతిని విడిచి పెడ్తూ నల్లని ఆకాశపు చీకటిలో అదృశ్యమయిపోయినట్టు ఆ వ్యాపారి ఉవాచ.

            ఒక పేరు మోసిన దొంగ తన వాంగ్మూలంలో “ఒకసారి దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనేను చాయిచాంగ్ ఇంట్లోకి చొరబడుతుంటే కిటికీ లోంచి బయటికి వెలువడే తీవ్ర మయిన గాలివాటు హఠాత్తుగా నానోసట మీద చేసిన దాడికి నేను గోడమీంచి కిందప డిపోయాను” అని చెప్పాడు. ఈ సంఘటన జరిగిన అనంతరం చెడు దృష్టిగల లోఫర్లూ, చాయిచాంగ్ పేటనించి బద్మాష్ లూ దూరంగా ఉండసాగారు. ఆకాశమార్గంలో దూర ప్రాంతాలకి పయనించే పక్షులు సయితం తమ తోవని తప్పించుకున్నాయనీ ఆవిధంగా చాయిచాంగ్ ఇంటిమీంచి వెళ్లకుండా వుండాలని అవి అనుకున్నాయనీ అందరూ చెప్పుకుంటున్నారు.

            భూమ్యాకాశాల అంచులదాకా వ్యాప్తి చెందుతున్న తన ఖ్యాతితోపాటుగానే అతను క్రమక్రమంగా ముసలివాడయిపోతున్నాడు. శరీరమూ, ఆత్మ బాహ్యవస్తువులను దర్శించటానికి బదులుగా సాదాతనమూ సహజ త్వమూ నింపుకుని అంతర్ముఖం అయ్యే పరిస్థితికి అతను క్రమక్రమంగా చేరుకున్నాడు. సౌమ్యమయిన అతని మొహంనించి అభివ్యక్తిలోని అంతిమ అవశేషంకూడా మెల్లమె ల్లగా తుడిచివేయబడుతోంది. ఇక ఇప్పుడు ఎలాంటి బాహ్యశక్తి కూడా అతనిలోని ఉదాసీనతని కదిలించలేకపోయింది. ఇప్పుడు మాట్లాడటమేలేదు. అతను ఊపిరి తీస్తున్నాడా లేదా అనే అనుమానం చాలాసార్లు ప్రజలకి కలిగింది. చాలాసార్లు మొత్తం శరీరమంతా వాడిపోయిన వృక్షంల, జీవంలేని దానిలా అవుపిస్తోంది. తన జీవిత సంధ్యా కాలంలో నేను, వాడు, ఇది, అది ల మధ్య వ్యత్యాసాన్ని పాటించడం కష్టమయిపోయేది అతనికి. అతను ప్రాకృతిక నియమాలతో ఎంతలా ఐక్యమయిపోయాడంటే భౌతిక వస్తువుల మధ్యవున్న వైరుధ్యాలతో, అనిశ్చిత లతో భిన్నత్వాన్ని పాటించాడు. ఐంద్రిక అనుభూతులు ఇంద్రజాలం అతని దృష్టిలో అర్థహీనమయిపోయింది .అందువల్ల ఇప్పుడు కన్నుకి బదులుగా చెవి, ముక్కుకి బదులు మొహం వున్నా అతనికేం తేడా  అనిపించదు.

            పర్వతాలను దిగివచ్చిన నలభై ఏళ్ల తర్వాత చాయిచాంగ్ ఒక రోజున ఈ లోకంలోంచి ఆకాశంలో పొగ కలిసిపోయినట్టుగా వెళ్లిపోయాడు. ఈ నలభై ఏళ్లకాలం లోనూ అతను ధనుస్సునీ బాణాన్నీ ముట్టుకోవడం అటుంచి ఎన్నడూ విలువిద్య పేరు సయితం ఉచ్ఛరించలేదు.  అతని జీవితం చివరి సంవత్సరంలో ఒక వింత సంఘటన జరిగింది. అదేమిటంటే! అతను ఒక రోజున తన మిత్రుని ఇంటికి వెళ్లాడు. మిత్రుని ఇంట్లో మేజాబల్ల మీద ఒక వింత వస్తువుని చూశాడు. దాన్ని బహుశా తాను అంతకు ముందు కూడా చూశాడు. అయినా దాని పేరునీ, వుపయో గాన్ని గురించి గుర్తుకి రావటంలేదు. ఎంతగా ఆలోచించినా ఏమీ ప్రయోజనం లేకపోవటంతో చివరికి మిత్రుణ్ణి “మిత్రమా! మీ మేజాబల్ల మీదున్న ఆ వస్తువు పేరేమిటి? ఎందుకు ఉపయోగిస్తారు? ” అని అడిగాడు.

            మిత్రుని ప్రశ్న విని అతను తేలికగా నవ్వేశాడు. చాయిచాంగ్ తనతో పరాచికం ఆడుతున్నాడనుకున్నాడు. ముసలి చాయి చాంగ్ రెండోసారి కూడా అదే ప్రశ్నని అడిగాడు. ఈసారి కూడా చిరునవ్వే మిత్రుని జవాబయ్యింది. అయితే ఆ చిరునవ్వులో అనుమానం కూడా తొంగిచూసింది. కానీ చాయి చాంగ్ గంభీరంగా మూడో పర్యాయం కూడా అదే ప్రశ్న అడిగేసరికి మిత్రుని మొహంలో అవిశ్వాసపు రేఖలు వ్యక్తమయ్యాయి. చాయి చాంగ్ , మొహాన్ని పట్టిపట్టి చూశాడు. తాను సరిగ్గానే విన్నాడని అతనికి పూర్తిగా నమ్మకం కలగటంతో వృద్ధ మిత్రుడు తనతో పిచ్చిగానో, వెటకా రంగానో ప్రశ్నించటంలేదని గట్టిగా నమ్మకం కలగటంతో వెరపుతో అతను

            “గురుదేవ్! మీరు ధన్యులు! ఈ నేల మీద మీకన్నా విజ్ఞులు మరొకరు వుండరు! మీరు ఈ ధనుస్సు పేరు, ఉపయోగం రెండూ మర్చిపోయారు. అదే మీ గొప్పతనపు చరమస్థితి” అన్నాడు.

            ఈ సంఘటన అనంతరం హాన్ తాన్  నగర చిత్రకారులు తమతమ బ్రష్ ని విసిరేశారు. సంగీతకారులు తమతమ వాయిద్యాల తంత్రుల్ని తెంచేశారు. రచయితలు చాలా రోజులుదాకా తమతమ దస్తూరీలను చూసుకోవటానికే సిగ్గుపడిపోయారు.

(రచనాకాలం: 1940)  

 *  *  *

నాకాజిమా అత్సూషీ

జపనీస్ రచయిత. 1909 సంవత్సరంలో టోక్యోలో జన్మించాడు. ప్రత్యేకమైన తన రచనాశైలితో స్వీయ జీవితానుభావాలని రచనలుగా మలిచి మంచి రచయితగా పేరుగాంచాడు. The Moon Over The Mountain, Light, Wind and Dreams ఈయన సుప్రసిద్ధ రచనలు. 1942లో మరణించాడు.

నిర్మలానంద
కీర్తిశేషులు ముప్పన మల్లేశ్వరరావు గారు హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. నిర్మలానంద, విపుల్ చక్రవర్తి, తెలుగు దాసు, ముప్పన రుక్మిణి, కొండపల్లి శైలజ వంటి అనేక పేర్లతో వందలాది కథలను తెలుగులోకి  అనువాదం చేశారు.  ఆయన ఆప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత మహా శ్వేతాదేవితో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు తెలుగు నుంచి చలం, శ్రీశ్రీ,రావి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పాలగుమ్మి పద్మరాజు, వి.రాజారామ్మోహన్ రావు, అల్లం శేషగిరి రావు, బలివాడ కాంతారావు, భాలగంగాధర్ తిలక్, కుందుర్తి, శేషేంద్ర శర్మ, శీలా వీర్రాజు, శివారెడ్డి, ఛాయరాజ్, శీలా సుభద్రా దేవీ, కొప్పుల భానుమూర్తి, ఖదీర్ బాబు రచనలను హిందీ, మలయాళం, సింధీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, మైథిలీ, డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింప చేశారు.. కేరళ నుంచి వెలువడే యుగ ప్రభాత్ పత్రికలో 1960లో అప్పటి పత్రిక ఎడిటర్ రవి వర్మ సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ఉగాది ప్రత్యేక సంచికలను హిందీలోకి తీసుకు వచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *