తెలుగు భారతాలూ…యెం.టి.వాసుదేవన్ నాయర్  భీమాయణమూ… 

Spread the love

యెం.టి.వాసుదేవన్ నాయర్ గారి భీమాయణం  (రాండమూఝం) నవలకు ముందుమాట రాయమని మిత్రుడు, కథాప్రపంచం ప్రచురణ కర్త కిరణ్ అడగ్గానే నేనా పనికి సిద్దం గావడానికి మూడు కారణాలున్నాయి. వాటిలో మూడవది యెం. టీ. గారితో నాకు కాస్త పరిచయముండడం. కాలికట్ దగ్గరి తిరూరు గ్రామం లో ప్రతి సంవత్సరమూ ఆయన జరిపే మలయాళ ఆదికవి తుంచన్ వుత్సవాలకు దాదాపొక దశాబ్దం క్రితం తెలుగు సాహిత్యానికి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు నేనాయనను తొలిసారిగా కలిశాను. మా తొండనాడు మనిషిలాగే అడ్డ పంచె పైన అరచేతుల చొక్కా తొడుక్కుని , మా పల్లెటూరి వాడిలాగే బీడీలు గాలుస్తూ యే ప్రత్యేకతా లేనివాడిలా జనంలో కలగలిసిపోయే ఆ అయిదున్నర అడుగుల వ్యక్తిని  ఆధునిక మలయాళీ సాహిత్యంలో తకజి శివశంకర పిళ్లై , వైకోం మహమ్మద్ బషీర్ ల తర్వాత అంతే గొప్పగా సాహిత్యపు వెలుగుల్ని విరజిమ్మిన ప్రసిద్ద రచయత గా గుర్తు పట్టడమేమంత సులభంగాదు. పాత్రికేయుడిగా , చలనచిత్ర దర్శకుడిగా గూడా సుప్రసిద్దుడయిన ఆయన పూనుకుని నిర్వహించే తుంచన్ ఉత్సవాల్ని చూసి మిగిలిన సోదర భాషల వాళ్ళు నేర్చుకోవలసినదెంతో వుంది. నిండు కుండలా తొణకని వినయం ఆయన వ్యక్తిత్వానికి సహజాభరణం గావుంటూ ఆయనపట్ల గౌరవాన్ని పెంపొదిస్తుంది.

భారత దేశం లోని మిగిలిన అన్ని భాషలవారి కన్నా తెలుగువాళ్ళకే మహాభారతంతో యెక్కువ ఆత్మీయమైన    బంధముండడమే  యీ ముందుమాటలు రాయడానికున్న రెండో కారణం. హస్తినాపురం, ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, ద్వారక మొదలైన ఉత్తర భారత దేశపు ప్రదేశాలు భూమికగా విస్తరిల్లిన  మహాభారతం మానసికంగా తెలుగు వాళ్లకెంతో దగ్గరిదయి పోయింది. కవిత్రయ భారతాంద్రీకరణతోనే తెలుగు సాహిత్యారభం జరిగింది. “అయినను పోయిరావలయు హస్తినకు”, “అదిగో ద్వారక, ఆలమందలవిగో”, అని గొంతెత్తి పాడే తెలుగు గ్రామీణుడెవడూ    హస్తీనాపురమూ, ద్వారక తెలుగు ప్రాంతాలు గావని అనుకోడు. వ్యాసుడి సంస్కృత భారతాన్ని కవిత్రయకవులయిన  నన్నయ, తిక్కన, ఎర్రాప్రగ్గడ తెలుగు కావ్యంగా యెంత ప్రతిభావంతంగా  మార్చగలిగారో తెలిపే పరిశోధనలు యింకా కొనసాగుతూనే వున్నాయి.

నేను మహాభారతంతో మరింత ప్రగాఢమైన సంబంధముండే తొండనాడుకు చెందినవాడ్ని గావడమే మొదటి  కారణం.  ఆంధ్రప్రదేశ్ లోవుండే తిరుపతీ చిత్తూరు జిల్లాలూ, తమిళనాడులో వుండే చెన్నై, తిరువళ్ళూరు ,కంచి, రాయవేళ్లూరు, తిరువణ్ణామలై, పాండుచ్చేరీ, కడలూరు జిల్లాలు కలిసిన తొండనాడు లో కొన్ని దశాబ్ధాల క్రితం వరకూ తెలుగే  ప్రధాన భాషగా వుండేది. యే వూరు తొండనాడులోది అనితెలుసుకోడానికొక కొండగుర్తుంది.   తొండనాడు దయిన వూర్లో తప్పకుండా ధర్మరాజు గుడి వుంటుంది. యీ ప్రాంతంలో యిప్పటికీ చాలా వూర్లల్లో  ప్రతి సంవత్సరమూ పజ్జెనిమిది  రోజుల భారతయజ్ఞం జరుగుతుంది. వేసవి కాలంలో భారతంమిట్ట అని పిలిచే మైదానంలో చింతచెట్ల కింద కొబ్బరి మట్టలతో వేసిన చలువపందిళ్ళ నీడలో మధ్యాహ్నం భోజన సమయం దాటి నప్పటినుంచీ సాయంత్రం వరకూ భారతాన్ని హరిదాసు కథనమూ, పాటా, పద్యమూ, నాట్యమూ కలగలిసిన హరికథగా చెప్తాడు. రాత్రుల్లో అదే కథను జానపదులు(చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నయితే కంగుందిగ్రామం నుంచీ వచ్చిన వాళ్ళు) ఆట అనే నాటకంగా రాత్రినుంచీ తెల్లవారే వరకూ ప్రదర్శిస్తారు.  

కురుక్షేత్ర యుద్దంలో ఆంధ్రులు కౌరవుల పక్షం లో యుద్దం చేశారని చరిత్ర చెప్తోంది. కోస్తా ప్రాంతం వాళ్ళు తీసిన సినిమాలలో యిప్పటికీ కౌరవ పక్షపాతం కనబడ్డానికిదే కారణమేమో ననిపిస్తుంది. కానీ తొండనాడులో మాత్రం తొలినుంచీ పాండవ పూజే జరుగుతోంది. యీ విషయాన్ని గమనించిన కొందరు పండితులు కురుక్షేత్ర యుద్దానంతరం పాండవుల సైనికులు కొందరీ ప్రాంతానికొచ్చి స్థిరపడి వుండాలని  భావిస్తున్నారు. జాతి చేత తమిళులతో ఐక్యంగా వుండిన తెలుగు వాళ్ళు తమిళు ల్లాగా ద్రావిడ సంస్కృతిని అంటి పెట్టుకోకుండా ఆర్యులతో ఎక్కువగా సంపర్కాన్ని పొంది భారత రామాయణాది సంస్కృత కావ్యాల ప్రభావంలోకి రావడానికీ, తొండనాడులో పాండవ పూజలు పాదుకొనివుండడానికీ కారణాలేమిటో  పరిశోధనలు చేసి తేల్చవలసివుంది.

తొండనాడు జనంలోకి భారతం అస్తిగతంగా ప్రవేశిస్తుంది. పజ్జెనిమిది రోజుల భారత యజ్ఞాలు ముగిశాక గూడా వాళ్ళు వాళ్ళ వూరి గుడుల్లో పాండవులతోబాటూ శ్రీకృష్ణుడ్నీ పూజిస్తారు. యిక్కడి పల్లెటూర్లలోని జనాలు, నిరక్షరాశ్యులూ, రైతులూ సైతం, రచ్చబండలపైన కూర్చుని భారతంలోని సంధిగ్ధ విషయాలను గురించీ,    ధర్మాధర్మాలను గురించీ,  నేడు జరుగుతున్న రాజకీయాలను గురించి మాట్లాడుతున్నంత తీవ్రంగా చర్చిస్తూ వుంటారు. యీ ప్రాంతంలో పుట్టి, యిక్కడే జీవిస్తున్న నావంటి వాడికి భారతం పైన ఆసక్తి వుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. పెరిగి పెద్దవాడినయ్యేకొద్దీ భారతపైన నాకున్న చూపూ, అవగాహనా మారుతూ        వస్తున్నాయి. దాదాపు అయిదేళ్ళ క్రితం కవిత్రయ భారతాన్ని పూర్తిగా చదినప్పుడు యీ విషయం నాకు స్పష్టంగా బోధపడింది.

పజ్జెనిమిదవనాడు   కథ దుర్యోధనుడి చావును చేరడంతో తొండనాడు భారతయజ్ఞం  ముగుస్తుంది. తెలుగువాళ్ళ జానపద నాటకాలలోనూ , భారతంలోని వివిధ సంఘటనల ఆధారంగా తీసిన తెలుగు సినిమాల్లోనూ దుర్యోధనుడు మరణించడంతోనే కథ సుఖాంతమై పోతుంది. కానీ కవిత్రయ భారతంలో తొమ్మిదవదైన శల్య పర్వంలో దుర్యోధనుడు మరణిస్తాడు. అంటే దుర్యోధనుడు చనిపోయాక భారతం దాదాపుగా యింకా సగభాగం, తొమ్మిది పర్వాలు మిగిలేవుంటుంది. మిగిలిన సౌప్తిక,స్త్రీ,శాంతి,అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థాన, స్వర్గా రోహణ పర్వాలను అక్కడక్కడా యేదో మొక్కుబడిగా కాస్తమేరకు తప్ప యిప్పటి యజ్ఞాలూ, నాటకాలూ,  సినిమాలూ, పట్టించుకోవడం లేదు. 

భారతం అవతారికలోనే నన్నయభట్టు “ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, యధ్యాత్మ విదులు వేదాంత మని, నీతివిచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమని, లాక్షణికలు సర్వ లక్ష్య సంగ్రహ మని, యైతిహాసికు లితిహాస మని , బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని”  గొనియాడే టట్టుగా వివిధ వేద తత్త్వవేది వేదవ్యాసు డు భారతాన్ని తీర్చిదిద్దాడాని భారత రచనా ప్రణాళికను స్పష్టంగానే చెప్పేశాడు. అందులో కథ అన్నది కేవలo హారంలో దారం లాంటిది మాత్రమేననీ, దాన్ని వాళ్ళు నాడు నమ్మిన వర్ణాశ్రమధర్మాలను  చాటి చెప్పడానికి వాడుకున్నారని బోధపడుతుంది. దుర్యోధనుడు చనిపోయాక అశ్వత్థామ, కృతవర్మా, కృపాచార్యుడూ నిద్రిస్తున్న వుప పాండవులతోబాటూ,ఒక అక్షౌహిణీ  సైన్యాన్ని రాత్రికి రాత్రే వూచ కోత కోసే ధారుణాన్ని చిత్రించే సౌప్తిక  పర్వాన్ని మినహాయిస్తే మిగిలిన దాదాపు అన్ని పర్వాలలో యీ వర్ణాశ్రమధర్మ ప్రభోధమే  సూటిగా, యే   నసుగుసులూ లేకుండా సాగుతుంది.

శ్రీ మదాంధ్ర మహాభారతం లోని ఆరవ పద్యంలోనే నన్నయ రాజరాజ నరేంద్రుడ్ని సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణ మహా మహిముడని కీర్తి స్తాడు. అక్కడ ప్రారంభమైన ధర్మ పరిరక్షణా కార్యక్రమం భారతమంతా ఘాడంగా పరుచుకునివుంది. శాంతి అనే పెద్ద పర్వంలో చెప్పింది చాలక అనుశాసనిక పర్వంలోనూ భీష్ముడు వేల పద్యాలలో యిదే ధర్మ భోధ చేస్తాడు. తరువాత వచ్చే పర్వాలలోనూ  యీ నాదమే విస్పష్టంగా వినబడుతుంది.

వర్ణాశ్రమ ధర్మాలలో క్షత్రియ, వైశ్య, శూద్ర అనే మిగిలిన మూడు వర్ణాలకంటే  బ్రాహ్మణులకు వేసిన పీట పోల్చడానికి వీళ్లేనంత పెద్దది. భారతంలో కూడా బ్రాహ్మణులకు వేసిన పీట భారతమంత పెద్దది. కథకుడు   వొక్కో సారి   కథను కూడా పక్కకు పెట్టి ఔచిత్యా న్ని గూడా మరచి పోతాడు. ద్రౌపదీ స్వయంవరానికెళ్ళే పాండవులకు  అంగపర్ణుడనే  గంధర్వుడు పురోహితుడు లేకపోవడంవల్లే వాళ్ళు కష్టాలు పడుతున్నారనీ , పూరోహితుడి అవసరమెంతో వివరిస్తూ పది పద్యాలకు పైగా చెప్తాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో పై వర్ణం మగ వాళ్ళు కింది వర్ణం వాళ్ళ స్త్రీలనెవరినైనా పెళ్లాడవచ్చుననీ, అందుకు విరుద్దమైన విలోమ పద్దతి పాపమనీ భారతం గొంతెత్తి పాడుతుంది. క్షత్రియ స్త్రీలు భర్తతో పిల్లల్ని కనలేకపోయినప్పుడు బ్రాహ్మణులతోనే నియోగ పద్దతిలో బిడ్డల్ని కనాలని  శాసిస్తుంది. అలాగే తప్పు చేసిన బ్రాహ్మణులకు విధించే శిక్షలు కూడా భిన్నంగా తేలికగా వుండాలంటుం ది. అడవులలో తపస్సుచేసుకుంటున్న బ్రాహ్మణులు , ఎలా వున్నా, వ్యాధిగ్రస్తులయినా,  వెళ్ళి అడిగితే యే  రాజయినా తమ కుమార్తెనిచ్చి సంతోషంగా పెళ్లిచేసేవాడు.

భారతంలో వర్ణాశ్రమధర్మాల పేరుతో బ్రాహ్మణులనింత పక్షపాతంతో గౌరవించడాన్ని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. మొదటిది: విచ్చలవిడిగా ఆరాచకంగా జీవిస్తున్న సామాన్య జనాల్ని అదుపులోపెట్టడానికి బుద్ది జీవులైన బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన వర్ణాశ్రమ ధర్మాలలో తమకోసమంటూ స్వార్థంతో వలపక్షంతో తమకనుగుణంగా ధర్మాలని మల్చుకుని వుండవచ్చు. రెండవది: తమ అస్తిత్వాలను రక్షించుకోడానికి యిటువంటి ప్రత్యేకమైన ధర్మాలని ప్రతిపాదించక తప్పని పరిస్థితిలో బ్రాహ్మణులుండి  వుండవచ్చు. కారణమేదైనా భారతదేశంలో యిప్పటికీ బలంగా పాదుకుని ఉండే వర్ణాశ్రమ ధర్మాలకు భారతం బలమైన పునాదులనే వేసింది.

ఆధునిక కాలంలో మహాభారతాన్ని వీలయినంతలో లౌకికంగా మార్చడం లో  జానపదులూ, సినిమాలూ ప్రధాన పాత్రల్ని పోషించాయి. తొండనాడులో జరిగే భారత యజ్ఞంలో రాత్రిపూట నాటకంగా ఆడే జానపదులు భారతకథను తమ జీవన విధానాలకు అనుగుణంగా తమకు తెలిసిన రీతిలో, తమకు తెలిసిన మానవసంబంధాల పద్దతిలో  మార్చుకుంటూ వెళ్లారు. 1930 ప్రాంతంలో టాకీగా  మారిన సినిమా భారతీయ భాషలన్నింటిలోనూ భారతంలోని కథలనే ముందుగా ఎన్నుకుంది. సమాజంలోని అన్ని వర్గాలవాళ్ళనూ ఆకట్టుకునేలా మలచిన యీ సినిమాల్లో వర్ణాశ్రమధర్మ ప్రవచనం క్రమంగా తగ్గుతూ వచ్చింది. తెలుగులో 1977ప్రాంతాలకొచ్చేసరికి యీ లౌకికవాదమెంత బలంగా తయారయ్యిందో ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం నిరూపిస్తుంది.

భారత రామాయణాలను లౌకికంగానూ మానవీయం గానూ మార్చే పనిని సాహిత్యంకూడా ప్రతిభావంతంగా చేస్తూవస్తోంది. ఆది గ్రంధమైన రామాయణం లోని దైవికమైన, అతిమానుష్యమైన వాటికి తీసివేసి మానవీకరించే పని భవభూతి ఉత్తర రామచరిత్ర తోనే ప్రారంభమయిందని చెప్పవచ్చు. తాటకి వంటి రాక్షసిని చంపి, సముద్రం పైన తేలాడే రాళ్ళతో వారధిని  గట్టించి, రావణుడనే అసురుడ్ని సంహరించే రాముడి కంటే చాకలివాడి నిందను గుర్తించి భార్యను అడవికి పంపి ఆపైన ఆ తప్పుకు అలమటించే రాముడే నమ్మశక్యంగా ఉంటాడు. బాధల్ని భరించలేక సీత తన తల్లయిన భూదేవి దగ్గరకు చేరడాన్నీ, చివరిలో రాముడు సరయూ నదిలో కలిసిపోవడాన్నీ   ఆత్మపరిత్యాగాలుగా చాలా మంది గుర్తిస్తారు.

మహాభారతం లోని కచ దేవయాని, చిత్రాంగద లాంటి గాధల్ని తాను చెప్పదలుచుకున్న అంశానికనుగుణంగా మలుచుకుని వ్యాఖ్యానించడమన్నది రవీంద్ర నాధ టాగూరు రచనల్లోనే గమనించవచ్చు. అయితే భారతాన్ని వాస్తవిక వాద దృక్పధంతో మానవీకరించే పని బహుశా ఐరావతీ కార్వే మరాటీ భాషలో రాసిన యుగాంత(1967) తోనే మొదలయినట్టు తెలుస్తోంది. కార్వే భారతం లోని పాత్రల్ని పురాణ పాత్రలుగా కాకుండా చారిత్రిక పాత్రలుగా భావించి , వివిధ పరిస్థితుల్లో వాళ్ళ మనస్థితులనావిష్కరిస్తూ  నాటి సాంఘిక రాజకేయ పరిస్థితులను ప్రతిభావంతంగా వెల్లడి చేస్తారు.                                                              

మహాభారతాన్ని పునర్మూల్యాకనం చేసిన ఎస్. ఎల్. బైరప్ప గారి కన్నడ నవల ‘పర్వ’(1979), యెం.టి.గారి మలయాళ నవల ‘రండా మూజం’(1983) దాదాపుగా ఒకే కాలంలో రాయబడిన నవలలు.                         ‘రండా మూజం’ 1983 లో ప్రచురించబడినా దాన్ని రచయిత 1979 లోనే రాయడం ప్రారంభించానని చెప్పాడు. భారతం లో వుండే పౌరాణిక మహత్యాలూ, మాయలూ తీసేసి నాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను పరిశోధించి తెలుసుకుని, వాటినాధారంగా వాస్తవంగా యెలా  జరిగుంటుందో  వూహించి  తమదైన శాస్త్రీయ పద్దతిలో రాయబడిన నవలలు యివి రెండూ.

యెం.టి. భారతాన్నలా వ్యాఖ్యానించడానికి తగిన భూమిక అప్పటికే మలయాళ సాహిత్యంలో ఏర్పడివుంది.  1961 లోనే ప్రముఖ మలయాళ నాటక రచయిత సి. ఎన్. శ్రీకంటన్ నాయర్ ఉత్తర రామాయణాన్ని ఆధునికంగా వ్యాఖ్యానిస్తూ ‘కాంచన సీత’ అనే నాటకాన్ని రాశాడు. తరువాత అదే ధోరణిలో ‘సాకేతం’ , ‘లంకాలక్ష్మి’ అనే మరి రెండు నాటకాలు రాశాడు. శ్రీకంటన్ నాయర్ నాటకం ఆధారంగా ప్రముఖ మలయాళ చిత్రదర్శకుడు అరవిందన్ తీసిన ‘కాంచనసీత’ సినిమా (1977)ఉత్తర రామచరిత్రాన్ని స్త్రీవాద దృక్పధం తో చూడ్డం తోబాటూ నేలపైకి లాక్కొచ్చింది. రాముడి సరయూ నది ప్రవేశం మహాప్రస్తానమనే ఆత్మహత్యే నని అరవిందన్ స్పష్టంగా ప్రకటించాడు.

*                                                    *                                               *

యెం.టీ.  గారు భారత కథను చెప్పడానికి భీముడ్ని ప్రధాన పాత్రగా ఎంచుకోవడం తెలుగువాళ్ళకేమీ ఆశ్చర్యాన్ని కలిగించదు. మహాభారతంలో కథానాయకుడెవరన్నది పెద్ద చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. భీష్ముడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడు, వీరే కాకుండా ప్రధాన పాత్ర కుంతిదనీ , ద్రౌపది దనీ నిరూపించి చూపెట్టడం కష్టమేమీ గాదు. తెలుగులోనయితే యీ అన్ని పాత్రలనూ కథానాయకులుగా చిత్రిస్తూ సినిమాలెన్నో వచ్చాయి. కొన్ని సినిమాలను గమనించినప్పుడు ప్రాచుర్యముండే నటుడే పాత్రను పోషిస్తుంటే ఆ పాత్రనే కథానాయకుడుగా కథను మలచడమూ కనబడుతుంది. అందువల్ల యెం.టీ.  గారు భీముడ్ని కథానాయకుడిగా భారతకథను చెప్పడం  తెలుగువాళ్ళకు కొత్తగా యేమీ వుండదు.

జానపదాలూ, నాటకాలూ, సినిమాల ద్వారా భారతకథ కొట్టినపిండయిపోయిన తెలుగువాళ్లకు గూడా  యెం.టీ.  గారి భీమాయణం చదవడానికి కావలసిన ఆసక్తినీ నవల రేకెత్తిస్తుంది . భైరప్పగారిలా  విశదీకరిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఆశ్చర్య చకితుల్ని చేసే పద్దతిలో యెం.టీ. గారు కథ ను చెప్పరు. చిన్నపిల్లలకు చెపుతున్నంత సరళంగా చక చకా చెప్పుకుపోతారు. భారతాన్ని సవివరంగా తెలిసిన  వాళ్ళకు అన్నీ చెప్పాల్సిన పనిలేదని, తాను చెప్పదలుచుకున్నవి చెప్తే చాలని ఆయన భావించినట్టుగా అనిపిస్తుంది.

యీ నవలకు చివరిలో రాసిన ఫలశ్రుతిలో యెం.టీ.  గారు “మొదటి వ్యాసుడైన కృష్ణద్వై పాయనుడు క్రోడీకరించిన కథ చట్రంలో నేనెటువంటి మార్పులూ చేయలేదు. నేను నా స్వేచ్ఛకు  వాడుకున్న  భాగాలకు ఆయన నిశబ్దమే ఆధారం . తన తర్వాతి తరాల కోసం  ఆయన వదిలిపెట్టిన అర్ధ వంత మైన నిశ్శబ్ధం  . ఆయన సూచనలు ఆ పంక్తుల నడుమనే దాగి ఉన్నాయి” అని స్పష్టంగా చెప్పుకున్నారు. గ్రామీణ జీవితంలో శిధిలమైన కుటుంబ అనుబంధాలు, వాటితో పెనవేసుకపోయిన మనుషుల జీవితాలు తన రచనల యితివృత్తాలని కూడా ఆయనే అంటాడు. యీ రెండింటితో బాటూ భారతానికి కథానాయకుడిగా భీముడ్ని తీర్చిదిద్దాలన్న సంకల్పం కూడా కలిసి యీ నవలనిలా రూపొందించాయి.

పంచ పాండవులలో అతి బలవంతుడూ, ముఖ్యుడూ, కౌరవులను జడిసేలా చేసినవాడూ భీముడే అని రచయిత చెప్పడం అతిశయంగా అనిపించదు. అయితే స్వయంవరానంతరం, “చూడండి. నేను బిక్ష తెచ్చామంటూనే, అదేమిటో తెలుసుకోకుండానే  అమ్మ దాన్ని  అయిదు మందీ పంచుకోండి  అనేసింది,” అన్న వాడు భీముడే నని అంటే తెలుగు వాళ్ళుమాత్రం ఆశ్చర్యపడకుండా వుండలేరు. అంతే గాదు , ద్రౌపది నలా అయిదుమందీ   పెళ్లాడడాన్ని వ్యతిరేకిస్తూ ధర్మరాజుతోనూ, కుంతితోనూ భీముడు చేసే వాగ్వివాదాలు నేటి కాలపు స్త్రీవాద           సిద్దాంతాలను గుర్తు చేయడం తో బాటూ రచయిత భీముడ్ని చాలా చోట్లలో తన గొంతుక గా గూడా మార్చుకున్నాడని కూడా గుర్తు చేస్తాయి. యుద్దానంతరం మానవహోమం తో విరక్తిచెందిన ధర్మరాజు భీముడే రాజని ప్రకటించినప్పుడూ , దానితో కుంతీ ద్రౌపదీ ఆందోళన చెందినప్పుడూ, భీముడిఆలోచనలూ , సంఘర్షణలూ, అతడు కేవలం వృకోదరుడు మాత్రమేగాడనీ, గొప్ప బుద్దిజీవని గూడా నిరూపిస్తాయి.

వ్యాసుడు రాసిన కథను, వైశంపాయనుడు చెప్పిన అదే కథను జనమేజయుడికి సూతుడు చెప్పిన గాధగా చెప్పినదే  యిప్పుడు మనకు దొరికిన భారతం . అయితే కథలను చెప్పడంలో నిష్ణాతులైన సూతులు దొరికినదానికి చిలవలు పలవులుగా కల్పనలను కల్పించి, లేని మహిమలనూ, మహత్తులనూ చేర్చడంలో నిపుణులని యెం.టీ.  గారు చెప్తారు. అంతేగాదు , భారతకాలం  నాటికి రాజాస్థానాల్లో రధసారధులుగానే కాకుండా కథకులుగా, మాగధులుగా గూడా ఆదరించబడిన సూతులు ఎప్పటికప్పుడు ఆయా రాజుల్ని దైవ సంజాతులుగా, వాళ్ళు చేసే సాదా సీదా పనుల్ని అనితరసాధ్యమైన వీరోచిత కార్యాలుగా, మహిమలుగా పొగుడుతూ పాడి, వాళ్ళను దాపుగా దేవుళ్ళ స్థాయికి తీసుకెళ్లడమే వృత్తిగా జీవించారని గూడా అంటాడు. ఆయా రాజులను సంతోషపెట్టడానికి మాత్రమేగాదు, ప్రజల్లో రాజుల పట్ల భక్తితో బాటూ బయమూ కలగడానికి సూతులా పని చేయడమెంతో అవసరమని నాటి పాలకుల నమ్మకం గూడా అయివుంటుంది.

సూతులు చేర్చిన యీ అతిమానుష  కల్పనల్ని తీసేసి చూసినప్పుడే సత్యాలు బోధపడతాయని యెం.టీ. గారు అంటాడు . ఆకాలపు సామాజిక చిత్రపటాన్ని ఆయన నిర్ధుష్టంగా చిత్రించే ప్రయత్న చేశాడు. నాటి సమాజం లో బ్రాహ్మణులది ఎదురులేని అగ్రస్థానం. యాజనం, అధ్యాపనం, యజనం, దానం, ప్రతిగ్రహం, అధ్యయనం వాళ్ళ వృత్తులు. మిగిలిన మూడు వర్ణాలవాళ్ళూ బ్రాహ్మణులను పూజిస్తేనే తరించగలుగుతారు.  పూజా కార్యక్రమాలకూ, బలులూ  మొక్కుబడులూ యివ్వడానికీ పూర్వహితుడుండి తీరాలి.  వనవాసంలో పురోహితుడు దొరకనప్పుడు పాండవులు అది వీధి వైపరీత్యమని కుమిలిపోతారు.క్షత్రియులు రాజ్య పాలన చేయాలి. వివిధరకాల సామగ్రుల్ని అమ్ముకోవడం వైశ్యుల పని. పై మూడు వర్ణాలవారికి సపర్యలు చేయడమే శూద్రుల కర్తవ్యం. మగవాళ్ళ కోరికలు తీర్చడానికి వేశ్యలు  సిద్దంగా వుండాలి. సూతులు తెలివైనవాళ్లు. యే  విషయాలు ఆడగాలో, ఎలా అడగాలో, యే  విషయాన్నెప్పుడేలా చెప్పాలో బాగా తెలిసిన వాళ్ళు. స్త్రీలు గర్భ పాత్రలు మాత్రమేననీ,కేవలం గర్భధారణకోసం  మాత్రమే మగవాళ్ళ చెంతకొస్తారనీ , ఆ తరువాత వాళ్ళ గురించి  ఆలోచించడం క్షత్రియ పరాక్రమానికి తగదనీ వాళ్ళ నమ్మకం.

నాగులు పసుపు రంగులో చిన్నశరీరాలుండే జాతి. చిన్నకళ్ళు. ముఖాలపైనా, ఛాతీ పైనా వెంట్రుకలు లేని వాళ్ళు. రంగుల్లో ముంచిన మృగచర్మాల  వస్త్రాలు ధరించేవాళ్ళు. చెట్లను నరికిన సమస్థలంలో చెట్లకాండాలతో యిండ్లు కట్టుకున్నవాళ్ళు. బాల్యంలో కౌరవులు నీళ్ళలోకి పారేసినప్పుడు భీముడ్ని వీళ్ళే ఆదరిస్తారు. అడవులలో వేటాడుతూ జీవించే ఆటవికజాతి నిషాదులు. ఏకలవ్యుడు నిషాదుడు. భూమిలో బావులనూ , సొరంగాలనూ  తవ్వడానికి ఉప్పరవాళ్ళుండేవాళ్ళు. వాళ్ళే లక్కయింటినుంచీ తప్పుకోడానికి పాండవులకోసం సొరంగం తవ్వారు. అడవులలో జంతువులతోబాటూ మనుషులనీచంపితినే నరమాంసభక్షకులైన రాక్షసులుండేవాళ్ళు. వాళ్ళు పైశాచి కలగలిసిన ప్రాకృతం లో మాట్లాడేవాళ్ళు. పగుల్లో మనుషుల రూపంలో తిరుగుతూ, రాత్రుల్లో మాయారూపులుగా వచ్చి దోపిడీలు చేసేవాళ్ళు. వాళ్ళు యజ్ఞ విద్వేషులు. బ్రాహ్మణశత్రువులు. రాక్షసుడైన ఘటోత్కచుడు చావడమే మంచిదనీ,  వాడు చచ్చినా స్వర్గానికెళ్లడనీ , చచ్చినప్పుడు వాడి శరీరానికి చితి పేర్చాల్సిన అవసరం కూడా లేదని కృష్ణుడు నొక్కి చెప్తాడు.

ఆటవికులు,సూతులు,మ్లేచ్చులు  మాత్రమే కుటుంబ సంబంధాలపట్ల అవసరం కంటే యెక్కువ ప్రాముఖ్యత కలిగి వుంటారనీ , ప్రతిఫలాన్ని కోరని స్నేహం కూడా తప్పే ననీ, అది ఆడ గాడిదకు మాత్రమే వుంటుందనీ భారతం నాటి వీరులు నమ్మేవాళ్ళు. బ్రాహ్మణులు క్షత్రియుల్లా వ్యవహరించినా,క్షత్రియులు వైశ్యుల్లా జీవించినా,వైశ్యులు శూద్రుల్లా బతికినా పెద్దగా అభ్యంతరాలు చెప్పరుగానీ, కింది వర్ణాలవాళ్ళు తమ తాహత్తును దాటి పైవర్గాల లాగా వుండాలనుకుంటే మాత్రం సహించేవాళ్ళు కారు. బ్రాహ్మణుడుగా పుట్టినా క్షత్రియ లక్షణాలతో జీవించిన       ద్రోణుడ్నెవరూ అధిక్షేపించ లేదు. క్షత్రియులకోసం జరిగిన ద్రౌపదీ స్వయంవరంలో  బ్రాహ్మణవేషంలో వుండే అర్జునుడు గెలిచినప్పుడు,అక్కడున్న బ్రాహ్మణులందరూ అంతులేని ఆనందంతో పరవశులయిపోతారు. క్షత్రియుల కథ గాకనిపించే భారతంలోని కౌరవపాండవులందరూ వ్యాసుడి సంతానమేనన్నది రహస్యమేమీ గాదు. వైతరణిలో తమ పితరులకు కర్మలను జరిపించినప్పుడు భీముడు “ఎవరిని ధ్యానించాలి? పాండురాజునా? కృష్ణ ద్వైపాయుడినా ? కృష్ణ ద్వైపాయనుడు బతికే వున్నాడు గదా!” అనే మీమాంసలో పడతాడు.

భారతాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు,తండ్రీకొడుకుల బంధాన్ని గురించి మాత్రమేగాకుండా,తల్లీ బిడ్డల సంబంధాల గురించీకూడా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఎప్పుడో కొన్నాళ్ళు గడిపి  ఆ తరువాత మరచిపోయిన హిడింబికి పుట్టిన తన కొడుకు ఘటోత్కచుడిపట్ల  భీముడికున్న మమకారం హద్దుల్లేనిదేమీగాదు. కురుక్షేత్ర యుద్దం లో మరో కొడుకు, బలందర కు పుట్టిన సర్వదుడు, యుద్దానంతరం ద్రౌపది తో పుట్టిన యింకో కొడుకు, ఉప పాండవులలో వొకడు, చంపబడినప్పుడూ, భీముడు చలించవలసినంతగా చలించడు. వాళ్ళందరితో కలిసి అతడు జీవించిన కాలం చాలా తక్కువగావడమే అందుకు కారణమని వాదించవచ్చు. అయితే నిద్రపోతున్న తన అయిదుగురు కొడుకులనూ కిరాతకంగా చంపేసిన అశ్వత్థామను అంత సులభంగా మన్నించి వదిలేయమన్నప్పుడూ, ఆ ధుఖంనుంచీ సులభంగా కోలుకుని, ధర్మరాజు రాజుగాకుండా భీముడు రాజయితే తనకు పట్టపురాణి పదవి పోతుందని వాపోగలిగినప్పుడూ, తల్లిగా ద్రౌపది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది.

భారతంలో కుంతి  ద్రౌపది కంటే పెద్ద ప్రశ్నగా ఎదురవుతుంది. కర్ణుడెవరన్నది  ఆమె చివరి వరకూ దాచిపెట్టడంలోని ఔచిత్యాన్ని చివరిలో ధర్మరాజే ప్రశ్నిస్తాడు. అయితే కర్ణుడ్ని సూర్య పుత్రుడిగా గాకుండా, దృపదుడి  రధసారధి అయిన సూతుడి పుత్రుడిగా గుర్తించినప్పుడు ఆమె మౌనం కొంతవరకూ  సబబేననిపిస్తుంది.  కానీ ధర్మరాజు   విదురుడి కొడుకేనని  తెలిసినప్పుడు ఆమె ధర్మనిష్టే మిటో బోధపడదు. పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడూ, యుద్దానంతరమూ ఆమె విదురుడున్న చోటే వుండడమెందుకో అర్ధమయిపోతుంది. లక్కయింటిలో తెలిసి తెలిసీ వొక ఆటవిక స్త్రీ ఏడుమంది కొడుకులతో బాటూ కాలి చనిపోవడాన్ని ఆమె సంతోషంగా భావించినప్పుడూ, తన అయిదుగురు కొడుకులూ కలిసికట్టుగా వుండేందుకు ద్రౌపదిని పాంచాలి గా పనిగట్టుకుని మార్చడానికి సందేహించనప్పుడూ, యుద్దానంతరం విదురుడి కోరిక మేరకు ధర్మరాజే రాజు కావాలని భీముడ్ని వొప్పించినప్పుడూ కుంతి స్వార్ధమెంత సంకుచితమైనదో ,బలమైనదో తెలిసివస్తుంది.      

తిక్కన చేత మెత్తని పులిగా గుర్తించబడిన ధర్మరాజును యెం. టీ. గారు తన నవలలో మరింతగా మానవీకరించాడు. అతడికున్న  జూదవ్యసనమేస్థాయిదో తొలినుంచీ చూపిస్తాడు. ద్రౌపది ని అయిదు మంది  సోదరులూ పంచుకోవడం వెనక ధర్మ రాజు యంత్రాంగమెలా పన్నాడో చెప్తాడు. ద్రౌపది ని గెలిచింది అర్జునుడే అయినా, ముందుగా ఆమెతో కాపురం చేసింది ధర్మరాజే అని తెలిసినప్పుడూ, వాళ్ళిద్దరూ ఏకాంతంలో వున్నప్పుడు తప్పని పరిస్థితిలో వాళ్ళ అంతఃపురానికెళ్ళి వ్రతభంగం చేసిన తప్పుకు పరిహారంగా యాత్రలకెళ్లగా అర్జునుడు పోగొట్టుకున్న ఆ సంవత్సరం కూడా  ధర్మరాజుదే అయిందని తెలిసినప్పుడు, ఆ న్యాయాల తత్వమేమిటో బేరీజు వేయకతప్పదు. తొలినుంచీ చివరివరకూ ధర్మరాజు తన సోదరులతో కీచులాడిన సంధర్భాలెన్నో వున్నాయి.  యుద్దానంతరం   రాజ్య త్యాగం చేస్తానన్న వాడు ఆ మాట పైన కొంతకాలమైనా నిలబడడు.

సర్వసాక్షికోణం లో ప్రారంభమై ప్రధమ పురుష కోణంలోకి మారినా  నిర్మోహధోరణిలో భారతాన్ని ఆధునికంగా, వాస్తవికంగా  పాఠకుడు వ్యాఖ్యా నించుకునేలా రాయడంలోనే  యెం.టీ.  గారి విశిష్టత వెళ్లడవుతుంది.   తరువాతి కాలంలో భారతాన్ని యిదే ధోరణిలో ఆధునికంగా వ్యాఖ్యానిస్తూ వెలువడిన అనేక పుస్తకాలకీ నవల స్పూర్తిదాయకమై వుంటుందని గుర్తించి తీరాలి. యీ పెద్ద నవలను తెలుగు వాళ్లకోసం అనువదించిన గణపతి గారికీ, యీ పెద్దపనికి పూనుకున్న కిరణ్ కూ అభినందనలు.   

మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కథా రచయిత. కుంభ మేళా, అస్తిత్వానికి అటూ ఇటూ, వెదురు పువ్వు,, రెండేళ్ల పధ్నాలుగు మొదలైన కథా సంకలనాలతో పాటు 'కొండకింద కొత్తూరు', 'భూచక్రం', మనోధర్మ పరాగం వంటి నవలలు వెలువరించారు. 'మనోధర్మ పరాగం' నవలకి 'ఆటా' బహుమతి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *