అలౌకిక స్వేచ్ఛ

Spread the love

నిశ్శబ్దపు లోతుల్లో మునిగిన నిశ్చల సముద్రం
గంభీర ముద్ర దాల్చిన ఆకాశం కింద
రెక్కలార్పని మౌనం సైతం గుసగుసలాడుతోంది
వినబడని తీయని మాటలేవో
వీనుల విందుగా వినిపిస్తున్నాయి

నింగి నీరు తరువులు - నేను
అన్నీ ఏకమైపోయాము
కంటికి కనిపించని ఇంద్రజాలమేదో
లోకాన్ని ఏకం చేస్తుంటే
పరుగెడుతున్న కాలం ఆగిపోయింది
గుండె చప్పుడు తప్ప మరో సవ్వడి లేదు
నా శ్వాస మాత్రం అలజడి చేస్తోంది

నేను - ఉన్నాను ఇక్కడే!
కేవలం నేనుగానే మిగిలున్నాను
నిన్నటి జ్ఞాపకాల భారాలు లేవు
రేపటి చింతల ఆనవాళ్ళు లేవు
ఈ క్షణం ఈ శూన్యంలో
నన్ను నేను కొత్తగా కలుసుకున్నాను

సరిహద్దులు లేని పరిపూర్ణత
సమాధానం దొరికిన ప్రశాంతత
ప్రతి అణువు స్పష్టం
ప్రతి క్షణం నెమ్మది
ఇప్పుడే ఇక్కడే
అనుభవిస్తున్న నిజమైన స్వేచ్ఛ!
విశ్వమంతా నాలోనే దాగివున్న సత్యం!
మనోజ్ఞ ఆలమూరు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *