నైట్ డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వెళ్తుంటే, నాతో పాటు షిఫ్ట్ పూర్తి చేసుకొని నాకన్నా ముందే ఆఫీస్ నుండి బయల్దేరి, కిరానా కొట్టు నుండి బయటకొస్తున్న భారతి కనిపించింది. ఇద్దరం వెళ్ళేది క్వార్టర్స్ కే గనుక బండి ఆపి లిఫ్ట్ ఇచ్చాను.
ఎప్పటిలాగా తనే ముందు మాట్లాడింది, తన యథావిధి ప్రశ్నతో, “సర్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా?” నిద్ర మత్తు గొంతుతో.
“అడక్కు, అడిగేసేయ్,” నా యథావిధి రెస్పాన్స్.
“సర్, ఇప్పుడూ…కట్నం అంటే డబ్బులు మాత్రమేనా లేదా అన్నీ కలిపే చెప్తారా?” అని అడిగింది.
ఒక్క క్షణం అలోచించి, “సాధారణంగా కట్నం అంటే ఇవ్వాల్సిన క్యాష్ మాత్రమే ఉంటుంది. బంగారం, వెహికల్, సారి సామానూ…ఇవన్నీ విడిగా చెప్తారు,” అని నాకున్న అవగాహన, అనుభవంతో చెప్పాను.
“అవునా సర్,” అంది కొంచెం అమాయకత్వం జోడిస్తూ.
“ఏం, నీ పెళ్ళికి ఎంత ఇవ్వాల్సొస్తుందో అని ఆలోచిస్తున్నావా?”
“లేదు సర్. ఇందాక షాప్ లో టమాటాలు కొంటుంటే, ఒకతను వచ్చి పెళ్ళి కార్డిచ్చారు…”
“నీకా…?” జోక్ చేస్తూ అన్నాను అంతరాయం కలిగిస్తూ.
భారతి గట్టిగా నవ్వుతూ, “అయ్యో! కాదు సర్. షాప్ ఓనర్ కి. పధ్నాలుగు పేజీలు ఉంది సర్ అది. ఏంటి ఇంత పెద్దది కొట్టించారు అని ఇతనడిగితే, రెండు కోట్లు కట్నం తీసుకుంటున్నారు… మరి ఆ మాత్రం ఉండదేంటి అని అన్నారు. అదే డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా,” అని చెప్పింది.
భారతి చెప్పిన దానికి ఆశ్చర్యపోయి, బండి స్పీడ్ తగ్గిస్తూ అన్నాను, “కట్నమే రెండు కోట్లైతే, ఇంక బంగారం ఎంతిచ్చి ఉంటారు, వస్తువులు ఎన్నిచ్చి ఉంటారు.”
“కదా! నాకూ అదే అనిపించింది సర్. ఇలాంటివి చూస్తుంటే, నేనూ అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. అప్పుడు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు,” అంది ఆఖరులో గట్టిగా నవ్వు జోడిస్తూ.
తను కనిపిస్తున్న బండి అద్దం వైపు కళ్ళు తిప్పి, తల అడ్డంగా ఆడిస్తూ నిట్టూర్చి, “నువ్వలా ఫీల్ అవ్వడంలో తప్పు లేదులే. మన సమాజం అలా ఉంది. తీసుకోవడం నేరమని చట్టమున్నా చూసావా, కట్నం గురించి ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారో, కొంచెం కూడా భయం లేకుండా…”
అద్దం లోంచి నన్ను చూస్తూ కామ్ గా నా మాటలు వింటోంది భారతి.
“…ఎందుకుంటుంది భయం? కట్నం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళే, దేశాన్నేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతారు. దేశంలో సగం నేరాలికి ఇలాంటి వారే కారణం. చీడ పురుగుల్లా పట్టి సమాజాన్ని ఎదగనివ్వకుండా చేసున్నారు,” అన్నాను కోపంగా.
“నిజమే సార్,” అంది నెమ్మదిగా నా మాటలకి కొనసాగింపుగా.
సీరియస్ డిస్కషన్ నుండి బయట పడుతున్నట్టు నేనొక దీర్ఘ శ్వాస తీసి, బండి స్పీడ్ కొంచెం పెంచి, “అది సరే గానీ, నీ సంగతేంటి? మరి మీ ఇంట్లో కట్నం గట్రా రెడీ చేస్తున్నారా నీ పెళ్ళికి?” అని అడిగాను.
“వాళ్ళకి ఆ అవసరం లేకుండా, నేనసలు పెళ్ళే చేసుకోనని చెప్పేసాను … ఫర్ సమ్ ఆబ్వియస్ రీజన్స్”
“యువర్ రీజన్స్ మే నాట్ బి ఆబ్వియస్ టు అదర్స్ కదా… అయితే ఇంట్లో ఏమన్నారు ఇలా చెప్పాక?”
“నీ జీవితం నీ ఇష్టం, మా బలవంతం ఏం లేదు అని అన్నారు.”
“వావ్, దట్స్ గ్రేట్! కానీ చెప్పలేం. నీ ఏజ్ అంత ఎక్కువేం కాదు కాబట్టి అలా అని ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు బ్రతిమాలినా ఆగరు. అంతెందుకు, నువ్వే అడుగుతావ్, నాకు పెళ్ళి చెయ్యండి బాబోయ్ అని. పధ్నాలుగు పేజీల పుస్తకం ఒకటి చేతిలో పెట్టి, ‘నా పెళ్ళి సర్, మీరు మీ ఫ్యామిలీ తో కలిసి తప్పకుండా రావాలి’ అంటావ్.”
“అదేం లేదు సర్. I took a decision not to get married. మీరే చూస్తారుగా.”
“సరే చూద్దాం. టైం డిసైడ్స్. అవునూ… పధ్నాలుగు పేజీల కార్డులో ఏముంటుంది అంటావ్?”
“ఏమో సర్, నేనూ గమనించలేదు. వాళ్ళ ఫామిలీ బయో డేటా మొత్తం పెట్టి ఉంటారు,” అని నవ్వుకుంటుంది.
తక్కిన దారంతా ఆ శుభలేఖలో ఇంకా ఏం ఏం ఉండొచ్చో అని మా ఊహాగానాలతో నింపుకుంటూ, నవ్వుకుంటూ క్వార్టర్స్ కి చేరుకొని ఎవరి దారిన వాళ్ళం పోయాం.
ఇంట్లో, నా భార్య అప్పుడే లేచి, డ్యూటీ అయ్యాక ఇంటికి వచ్చి పనులు చేస్తా అని రాత్రి చెప్పివెళ్ళిన నా కోసం ఎదురుచూస్తుంది. “ఓపిక లేదు. నిద్రపోయి లేచాక చేస్తా,” అంటే, “ఇదేం కొత్త కాదుగా తమరికి,” అని ఆ పనులు తనే చేయడం మొదలుపెట్టింది. నేను పళ్ళు ఈకలించి “థ్యాంక్స్” అన్నాను.
తన వెనకాలే తిరుగుతూ, ఇందాక భారతితో జరిగిన డిస్కషన్ గురించి చెప్పాను. మొత్తం విన్నాక, “ఇంతకీ నువ్వేం అనుకుంటున్నావ్?” అని అడిగింది.
“నాకైతే, తను అనుకుంటున్నట్టు పెళ్ళవకుండా ఎక్కువ కాలం ఉండదని అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు ఆపినా, అది సమాజంలో తన గురించి దారితీసే అనుమానాల్ని, దురభిప్రాయాల్ని తట్టుకోలేక పెళ్ళి చేసేసుకుంటుంది.”
“మరి తనకి చెప్పాల్సిందిగా ఇలా.”
“ఇలా నెగెటివ్ గా చెప్తే, నన్నూ అందరితో పాటు జమకట్టి, నాతో పూర్తిగా మాట్లాడటమే మానేస్తుంది.”
“అది కాదు. కట్నం గురించి నువ్వేమనుకుంటున్నావ్?”
“అందులో అనుకోడానికి ఏముంది! ఎంత కట్నం పోసినా, ఆడదానికి చాకిరీ తప్పట్లేదు. మరి ఎందుకివ్వడం అని అడిగితే, ఆచారం అంటారు. అడిగినంత కట్నం రాకపోతే గృహ హింస నేరాలూ ఆగట్లేదు. ఎవరికో గట్టిగా శిక్షపడే వరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది.”
“హ్మ్మ్… ఇలాంటి సంఘోద్ధారక ఉపన్యాసాలకేం తక్కువలేదు,” అడ్డుగా ఉన్న నన్ను తోసి తన పనిలో నిమగ్నమైంది.
****
ఈ డిస్కషన్ జరిగిన కొద్ది రోజులకే ఇద్దరికీ వేర్వేరు చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యి, దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే స్టేషన్ కి వచ్చి చేరాము. చేతిలో ఒక కట్ట పట్టుకొని, కారిడార్ లో నాకు ఎదురుగా నావైపు నడుస్తుంది భారతి. తనలో ఏదో మార్పు. నేనెరిగిన అమాయకపు, అల్లరి పిల్లలా కాకుండా, ఏవో బాధ్యతలు, బాధలు ఎరిగిన ముఖంతో వచ్చి, నన్ను పలకరించి, కట్టలోంచి ఒక కార్డు తీసిచ్చి, తన పెళ్ళికి ఆహ్వానించింది.
“ఓహ్! మొత్తానికి పెళ్ళి చేసుకుంటున్నావ్. కంగ్రాట్స్!…ఇంతకీ ఇది నీ నిర్ణయమా, కాలం తీసుకున్న నిర్ణయమా?” నవ్వుతూ అడిగాను గతంలో సంభాషణ ఒకటి గుర్తు చేస్తూ.
“రెండూ కాదు సర్. నాకు కాబోయే అతనూ, మా అమ్మమ్మ ఆరోగ్యం తీసుకున్న నిర్ణయం.”
“అబ్బో! ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది.”
“అవును సర్. పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు. ఐదు రోజుల ముందే చెప్పానని తప్పించుకోడానికి లేదు,” అని ఇంకా కార్డ్స్ పంచాలని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది.
నేననుకున్నట్టే అయింది. జీవితం పోకడలో ఇంకా ఎటువంటి మలినాలు అంటకుండా, అందరితో సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ తిరిగే పిల్ల, ఎవరి ఒత్తిడి వల్లనో తన జీవన సరళరేఖలు వక్రించబడి, అందరిలాగే సంసారపు వలలో చిక్కుకోబోతుంది.
ఒక వయసు దాటాక, ఈ సమాజంలో పెళ్ళి చేసుకోకుండా మెలగాలంటే, ఏ స్వాతంత్ర సమరయోధులమో, రాజకీయ నాయకులమో, అవార్డులు పొందిన వారమో అయ్యుండాలి కాబోలు. అప్పుడే, మనల్ని పొగిడేస్తూ మన జీవితం నుండి ఇన్స్పిరేషన్ పొందాలని ఉపన్యాసాలిస్తారు.
బ్లడీ హిపోక్రటిక్ సొసైటీ…బ్లడీ చీడ పురుగులు.
****
నేను వేరే బంధువుల పెళ్ళికెళ్ళి వచ్చేసరికి కొలీగ్స్ అందరూ భోజనాలు చేసి సగం పైగా ఖాళీగా ఉన్న ఫంక్షన్ హాల్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. పెళ్ళి జంట రిసెప్షన్ నుండి లేచి, వాళ్ళ కుటుంబాలతో కలిసి డైనింగ్ హాల్లోకి వస్తున్నారు. నేను భోజనం చేస్తుంటే భారతి వచ్చి పలకరించి, పెళ్ళి కొడుకుని పరిచయం చేసింది. కాసేపు మాట్లాడి తను వెళ్ళిపోయాక భారతిని అడిగాను, “ఏంటి చాలా గ్రాండ్ గా చేస్తున్నట్టున్నారు?”
“మరి పాతిక లక్షలు కట్నం తీసుకుంటున్నారు, ఆ మాత్రం ఉండదా సర్,” ఇద్దరం నవ్వుతున్నాం.
ఇంతలో తన బంధువు ఒకరు భారతికి ప్లేట్ తో భోజనం అందించి వెళిపోయారు.
“ఇంతకీ అసలు స్టోరీ చెప్పలేదు?”
“ఓహ్, అదా! చుట్టాలబ్బాయి సర్, ఐదు సంవత్సరాల క్రితమే నన్ను ఇష్టపడ్డాడు. సరాసరి పెద్దలనే అప్ప్రోచ్ అయ్యాడు. ఇంట్లోవాళ్ళని ఎక్కువ రెసిస్ట్ చేయలేకపోయా. అబ్బాయితో మాట్లాడాకే, పర్లేదనిపించి పెళ్ళికి కన్విన్స్ అయ్యాను. వచ్చే సంవత్సరం పెళ్ళి పెట్టుకుందాం అనుకునేసరికి, అమ్మమ్మకి హెల్త్ బాగోక పెళ్ళికి తొందర పట్టింది. అందుకే ఇంత తక్కువ టైంలో.”
“తానే ముందు ఇష్టపడి నిన్ను ఒప్పించినా కట్నం దగ్గర కాంప్రొమైజ్ కాలేదన్నమాట.”
“సర్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా?” అనగానే, “అడక్కూ… అడిగేసేయ్,” అన్నాను వెంటనే అందుకుని.
“మీరప్పుడు ఏమనుకుంటారో అని అడగలేదు…, మీ పెళ్ళికి మీరు కట్నం తీసుకున్నారా సర్?”
“తీసుకున్నాను,” తినడం ఆపి, ఎంగిలి చేతిని ప్లేట్ నుండి కొంచెం పైకి లేపి గాల్లో ఆడిస్తూ వివరిస్తున్నాను, “నేను ఒద్దనే అనుకున్నాను. తెలుసుకదా, నేను వీటికి వ్యతిరేకమని. అమ్మా నాన్న ఒప్పుకోలేదు. ‘ఇంతా గవర్నమెంట్ జాబ్ ఉంచుకొని కట్నం ఎలా వదిలేస్తాం? చెల్లికి ఎంత పోశామో మర్చిపోయావా? నువ్వంటున్నది బాగుండొచ్చు, దాని వల్ల సమాజానికి ఒరిగేదేం ఉండదు సరి కదా, ఆఖరుకి నష్టపోయేది మనమే,’ అనేసరికి నాకు అదే కరెక్ట్ అనిపించింది. నేను తీసుకోలేదని నా బావమరిది తీసుకోకుండా ఉండడు. చెల్లికి పెట్టింది తిరిగి రాదు. లెఖ్ఖ అస్సలు బాలన్స్ అవ్వట్లేదు కదా! సమాజంలో నేనొక్కడినే వెనకపడిపోతానేమో అనిపించింది. ఇంక వాళ్ళతో విభేదించలేకపోయా.”
తను కూడా తినడం ఆపి, నన్ను తదేకంగా చూస్తూ నా మాటలు వింటోంది. “అయినా ఇటువంటి practices నేనొక్కడిని తల్చుకోవడం వల్ల ఆగిపోవు కదా. నువ్వే చెప్పు. కానీ ఎవరైనా పెళ్ళికి పిలిచినప్పుడు, దీనికి వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరూ వినరు…” అని ఇంకా చెప్పబోతుంటే, దూరంగా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యుల నుండి తనకి పిలుపొచ్చింది.
“సరే సర్, నేను వెళ్ళాలి. థ్యాంక్స్ వచ్చినందుకు. ఇందాక మీరు గ్రూప్ ఫోటో మిస్ అయ్యారు. పెళ్ళి తర్వాత స్టాఫ్ అందరం కలిసి మళ్ళీ దిగుదాం, లాస్ట్ వరకు ఉండండి,” అని చెప్పి వెళిపోయింది.
నేను చెప్తుంది పూర్తి కాకముందే వెళిపోయింది. తనని సంసారం బానిసగా మార్చబోయే గుంపులో కలిసిపోయింది. ఆడదాన్ని కట్నం తెచ్చే సరుకు కింద జమకట్టే కర్కశ కోరల వైపు, మాటల్లో నీతులు వల్లించే హిపోక్రాట్స్ వైపు, సమాజాన్ని ఎదగనివ్వకుండా పట్టి పీడించే చీడ పురుగుల వైపు…చూస్తూ ఉండిపోయా.
ఆ తర్వాత ఎందుకనో, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నా, భారతి ఎప్పుడూ నాతో సరిగా కలిసి మాట్లాడింది లేదు.
****

హరీశ్
04 మార్చి 1993 న జన్మించిన హరీశ్. శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎమ్ ఎస్ సి ఫిజిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో భారత వాతావరణ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. 2018 నుండి రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికి రెండు కథలు ప్రచురితమయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్ లో రంగస్థలంలో నటుడిగా కొన్ని నాటకాలు చేశారు. ఈ మధ్య "కథ వింటారా!" అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి తెలుగు కథలు చదువుతున్నారు.
