విదూషి, రూపేందర్‌ని కలుసుకుంది.
అప్పుడు నాదెళ్ళ సత్య గురించి టాపిక్ వచ్చింది.
“కృత్రిమ మేధస్సు వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంది అనటం పొరపాటు. మనుషుల్లో వున్న శక్తిని అద్భుతంగా పనిచేయటానికి అది వీలు కల్పిస్తుంది. అలాగే మనం ఉపయోగించుకోవటానికి సులభమైన టెక్నాలజీని మాత్రమే ఆ మేధస్సు ఇస్తుంది అంటున్నారు తాతగారూ” అంది విదూషి.
“అవును. మనకు నాలుగు వేదాలు వున్నాయి. వాటిని అపౌరుషేయాలు అంటారు. అంటే ప్రశ్నించటానికి వీలు లేనివని చెబుతారు. ఇవి చాలా కాలం అందరికీ అందుబాటులో కూడా లేవు. ఏ.ఐ. అలా కాదు. నేను మాత్రమే సర్వస్వం అని చెప్పదు. కృత్రిమ మేధస్సుని పరీక్షించవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలను ఫీడ్ చేయవచ్చు. అంటే నిరంతరం మారుతుంది. అప్‌డేట్ అవుతుంది.”
“వీటి అన్నింటికి మూలం మనిషి మెదడే కదా!”
“అవును విదూ! కృత్రిమ మేధస్సుని మనుషులే కనిపెట్టారు. అనేక రకాల సాఫ్ట్‌వేర్‌లు, హార్డ్‌వేర్ ల్ని మనమే డిస్కవర్ చేశాం. ఇవన్నీ లేనప్పుడూ సైన్స్ వుంది. అనేకమంది సైంటిస్టులు చేసిన ప్రయోగాలు, కొత్త వాటిని మన ముందుకు తీసుకొచ్చాయి. మనం వాటిని డెవలప్ చేసుకుంటున్నాం. ఈ వేదాల వెనకా సైన్స్ వుంది!” అన్నాడు రూపేందర్.
“ఈ మెదడుని ఎవరు కనిపెట్టారు గ్రాండ్‌పా!”
“ఎవరనుకుంటున్నావు నువ్వు?”
“కొంతమంది భగవంతుడు అంటున్నారు. ఇంకొందరు నేచర్ అంటారు. రెండిటినీ నమ్ముతారు. మన సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నప్పుడు అవి సక్సెస్ కావాలని దేవుళ్ళకి పూజలు చేస్తుంటారు.”
“అవును విదూ! ఇది ఎప్పటికీ తేలని సమస్య. దేవుళ్ళని కూడా మనుషులే సృష్టించుకున్నారు. ఇదీ నిజమే. మనం అక్కడ ఆగిపోతే ప్రగతి వుండదు. దేవుడ్ని నమ్మేవారు రోజూ సైన్స్‌ని నమ్ముతారు. లేకుంటే ముందుకు వెళ్ళలేరు. మనం అనుభవించేవన్నీ సైన్స్ సాధించినవే.”
విదూషి తల వూపింది.
“ఇంకో విషయం చెబుతాను. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ‘సేఫ్ జర్నీ’ అంటారు. పెద్దవాళ్ళు ఆశీస్సులు అందిస్తారు. జాగ్రత్తలు చెబుతారు. ఇది కూడా అలాంటిదే. మనం కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఇది కేవలం మన ప్రతిభ కాదు. దీని వెనకాల చాలామంది వున్నారు అనుకోవాలి. భగవంతుడు అనేది ఓ భావం. ప్రతి పని వెనక గాడ్ వున్నాడు అనుకుంటే ఎవరికీ నష్టం లేదు కదా!”
విదూషి ఆలోచిస్తోంది.
“మనం చేయవలసిన పనులు చాలా వున్నాయి. ప్రతి విషయానికి దేవుడు వున్నాడని, లేడని తగాదా పడేవారు స్వార్థపరులు. అలాంటి వారి వెనుక ఆర్థికమో, అధికారమో, రకరకాల కారణాలు వుంటాయి. మనం వాటి గురించి కాదు ఆలోచించాల్సింది. మనకు అర్థం కాని, పరిశోధించాల్సిన రహస్యాల గురించి” అన్నాడాయన.
“మళ్ళీ అనుమానం వచ్చినప్పుడు కలుసుకుంటాను తాతగారూ” అంది విదూషి.
మృదుల తన ముందున్న లాప్‌టాప్ చూస్తోంది. అందులో డీప్‌ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో వున్నది ప్రముఖ హీరోయిన్!
అది చూస్తుంటే నిజమే అనే భ్రమ కలుగుతోంది. సామాన్యులు అది వాస్తవం అనుకుంటారు. తను ఎంతగా విలవిలలాడిందో. ఇంతకుముందు తనూ అంతే. చివరకి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయినా ఇది ఆగటం లేదు. ఎందుకివన్నీ చేస్తున్నారు అనుకుంది.
డబ్బుల కోసమా? వినోదం కోసమా? ఇతరులు బాధపడుతుంటే వారికి వినోదం ఎలా కలుగుతుంది. ఇది మనుషుల లక్షణం కాదు కదా!
రాజకీయ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తారు. సినిమాల్లో కొన్ని బిట్స్ తీసుకొని జోడిస్తారు. పగలబడి నవ్వుకుంటారు. అలాగే కొంతమంది చేయిస్తారు. ఉద్యోగ కల్పన అంటే ఇదా? యూట్యూబ్‌లూ, ఇంకొన్ని సంస్థలు వ్యూస్‌ని బట్టి డబ్బులు ఎందుకు ఇస్తున్నాయి. అవన్నీ ఆపితే ఇంత విచ్చలవిడితనం వుంటుందా?
ఈరోజు ఏది నిజమైన వార్త, ఏది అబద్దమో తెలియటం లేదు. టీ.వీ.లు అలానే వున్నాయి. మనుషుల సమస్యల చోటులో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ రావటం ఎంత దుర్మార్గం!
ఒకప్పుడు ఇవి కుటుంబాలకు పరిమితం. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇంకో శుభకార్యం లేదా విషాద సందర్భం- అందుకు వీడియోలు, ఫోటోలు తీసుకునేవారు. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఆల్బమ్‌లు చూపించేవారు. ఇప్పుడు వ్యక్తిగతం అంటూ లేదు. దాపరికం లేదు. ఎప్పటికయినా ఇవి మారుతాయా?
ఈరోజు అరచేతిలో చిన్న మానిటర్. ప్రపంచాన్ని RABIT SOFTWARE శాసిస్తోంది. మేధస్సు మాత్రమే కాదు బతుకే కృత్రిమం అయిపోయింది అనుకుంది మృదుల.
తనూ విదూషిలా గ్రాడ్యుయేషన్‌లో చేరింది.
గీతిషా, సుధ దగ్గరకు వచ్చింది. తన ముఖంలో బాధ కనిపిస్తోంది.
“ఏం జరిగింది? నువ్వూ, అన్నయ్య తగాదా పడ్డారా? మీ అమ్మా నాన్నలు తిట్టారా?” అడిగింది సుధ.
“అదికాదు నానీ… మన దేశంలో ఎక్కడ చూసినా బెగ్గర్స్ కనిపిస్తారు. విదేశాల్లో కూడా ఇలా వుంటారా?” అంది గీతి.
“కొన్ని దేశాల్లో వుండకపోవచ్చు.”
“ఆకలి అందరికీ వుంటుంది. ఫుడ్ ఎందుకు వుండదు?”
“నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి?”
“అడిగింది చెప్పు నానీ! ప్రపంచ జనాభా ఎంత?”
“ఏడు వందల యాభై కోట్లు అనుకుంటాను.”
“ఇన్ని వందల కోట్ల మనుషులకి ఫుడ్ కావాలంటే ఎన్ని పంటలు పండించాలి. భూమి మీద మూడు వంతుల నీరు వుంది. ఇప్పుడు పంట భూముల్లో ఫ్లాట్స్ కడుతున్నారు. రేపు మనుషులకే భూమి వుండదు. అందరూ ఆకలితో చచ్చిపోవాలా?”
సుధ మనవరాలిని ఆశ్చర్యంగా చూసింది.
“మనుషులు తెలివిగలవారు. ఎకరానికి అయిదు వందల బస్తాల గోధుమలు వారు పండిస్తారులే” అంది.
“ఇంకో పని చేయవచ్చు నానీ!” ఏంటన్నట్లు చూసింది సుధ.
“ఆకలిని పోగొట్టాలి. ఓ చిన్న టాబ్లెట్ వేస్తే కడుపు నిండిపోవాలి. అలాగే భూకంపాలు రాకూడదు, తుఫాన్లు రాకూడదు. ఇవన్నీ కనిపెట్టాలి.”
“మీరు విదూషిని కలిశాక మీ అందరికీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. క్లాసు పుస్తకాలు చదువుతున్నారా? ఇవేనా?”
“చదువుతున్నాం నానీ.”
“ఇవన్నీ పెద్దయ్యాక ఆలోచించండి, అర్థమైందా?” అంది సుధ.
విదూషి దగ్గరకు రోహన్ వచ్చాడు.
“అక్కా! నువ్వు నాకు హెల్ప్ చేయాలి” అన్నాడు.
“ఏ విషయంలో?”
“మొన్న ప్రియాంక అక్కకి చెప్పాను. నేను అయిదు పుస్తకాలు రాస్తాను.”
“ముందు చదువుకో!”
“నువ్వు చదువుకుంటూ అన్ని పనులూ చేయటం లేదా?”
“ఏం హెల్ప్ చేయాలి?”
“నా పుస్తకంలో రోహన్ వర్సెస్ గాడ్ వుంటారు. ఇద్దరి మధ్య ఫైట్ వుంటుంది. కంప్యూటర్‌లో అవన్నీ ఫీడ్ చేయాలి. అప్పుడు నవల బయటకు వస్తుంది.”
“ఇంతవరకు ఏమీ రాయలేదు కదా? ఏం ఫీడ్ చేయమంటావు?”
“చిన్నక్క వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్‌తో ఏ.ఐ.తో బొమ్మ గీయించింది. నేను నీకు విలన్లు ఎవరో, వాళ్ళు ఏం చేస్తారో చెబుతాను. అన్నీ ఫీడ్ చేసి నాలుగు వందల పేజీల నవల కావాలంటే వచ్చేస్తుంది కదా!”
“అలా కాదు రోహన్! మన రైటర్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా రాస్తారు. వారికి ఓ స్టైల్ వుంటుంది. కథ ఎక్కడ మొదలుపెడతారు, ముగింపు ఎలా ఇస్తారు ఇలాంటివి వుంటాయి. వారు ఇప్పటికే బుక్స్ ప్రింట్ చేశారు. అవన్నీ ఫీడ్ చేస్తే ఏ.ఐ.కి ఓ పిక్చర్ వస్తుంది. అప్పుడు రాస్తుంది. మనకి ఒరిజినల్ రైటర్ రాసినట్లు అనిపిస్తుంది చదువుతుంటే.”
“అలా అయితే రౌలింగ్ పుస్తకాలు ఫీడ్ అయి వుంటాయి. లేదా నువ్వు ఫీడ్ చెయ్యి. రోహన్ పేరు మార్చి రాయమను.”
“అప్పుడది రౌలింగ్‌ది అవుతుంది. నీదెలా అవుతుంది?” ఆలోచించాడు రోహన్.
“ఇంకో పని చెయ్యి. పది నుండి ఇరవై పేజీలు రౌలింగ్‌ది. తర్వాత ఇంకో రైటర్. ఒకటి నీది. అలా పదిమంది రైటర్స్‌ని ఫీడ్ చెయ్యి. నవల రాయమను. అప్పుడు ఎవరు రాశారో ఎలా కనుక్కుంటారు?”
పకపకా నవ్వింది.
“నీకు తెలివితేటలు పెరిగాయిరా. సినిమా వాళ్ళు ఇలా చేస్తున్నారు. అరవై సినిమాల్లో అరవై సీన్లు తీసుకుని కథ అల్లుకుంటారు. ఇవన్నీ చేయటానికి నాకు టైమ్ లేదు” అంది విదూషి.
“ప్లీజ్ అక్కా!” అన్నాడు. ఇంతలో ప్రియాంక వచ్చింది. తన బొమ్మ ప్రింట్ ఇచ్చింది.
“బాగుంది ప్రియాంకా! ఇది నీదే అని చెప్పగలవా?”
“కాదు. ఏ.ఐ.తో చేసింది!”
“అసలు మనం బొమ్మలు ఎందుకు గీస్తాం. కథలు ఎందుకు రాయాలనుకుంటాం? అవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ తృప్తి మనకి వుంటుంది. మనం క్రికెట్ గాని, హాకీ గాని, ఇంకో గేమ్ గాని మనుషులతో ఆడించకుండా యంత్రాలతో ఆడిస్తే ఎలా వుంటుంది?”
“మొదట్లో బాగుంటుంది. తర్వాత బాగుండదు” అంది ప్రియాంక.
“అలాగే ఏదయినా. మంచయినా, చెడయినా మనుషులు చేస్తారు. అలాగే మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా వుండరు. బాధా, సంతోషం, కోపం లాంటివి వుంటాయి. అవన్నీ ఫీడ్ చేసుకుంటూ పోవాలా? మీకు ఇంకో విషయం చెప్పాలి.”
ఇద్దరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
“ఏ.ఐ. కి గాని, స్మార్ట్ ఫోన్‌కి గాని ఎథిక్స్ వుండవు. అలాగే ఎమోషన్స్ వుండవు. అవన్నీ మనం ఫీడ్ చేసేదాన్ని బట్టి వుంటాయి. అది బొమ్మలయినా, సంగీతమైనా, ఏదయినా” అంది విదూషి.
“మరి ఏ.ఐ. గురించి ఇంత బాగా చెబుతున్నారు” అంది ప్రియాంక.
“అన్ని ప్రయోజనాలు వున్నాయి కాబట్టి. మనం చేయలేని పనులు చేయటానికి సమయం దొరకనప్పుడు మనకు కృత్రిమ మేధస్సు, యంత్రాలు అవసరం. కళలకు కాదు. సరదాకి ఒకటి రెండు ప్రయోగాలు చేయవచ్చు, అంతే.”
రోహన్ బుంగమూతి పెట్టాడు.
“మనం ఏ.ఐ. కోసం లేం. మన కోసం అది వుంది. అలాగే ఇందాక చెప్పాను. ఎవరి స్టయిల్ వారిది. ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. లేదంటే అవుట్ డేటెడ్ అవుతారు.”
ప్రియాంక రోహన్‌ని చూసింది.
“నేను పెద్ద అయ్యాక రోహన్ సిరీస్ రాస్తాను. ముందు ఫీడ్ చేయటం నేర్చుకుంటాను” అన్నాడు రోహన్.
“అసలు విషయం చెబుతున్నాను. కంప్యూటర్-సూపర్ కంప్యూటర్-ఏ.ఐ. ఇవన్నీ డిస్కవర్ చేసింది మనుషుల మెదడు.”
“మనిషి మెదడుకి ఎథిక్స్ వున్నాయా?” అన్నాడు రోహన్.
“అవునక్కా! ఎమోషన్స్ వున్నాయా? హృదయం వుందా?” అంది ప్రియాంక.
“మనిషికి మెదడు పెట్టిన దేవుడికి ఇవన్నీ వున్నాయా?” అడిగాడు రోహన్.
విదూషి మాట్లాడలేదు. ఇద్దర్నీ చూస్తోంది.
వారిలో మృదుల వుంది. గీతిషా వుంది. ప్రపంచంలోని మనుషులు అందరూ అరుస్తున్నారు. ఇవన్నీ వుంటే ఇంత మారణహోమం ఏమిటి? ఇన్ని అంతరాలు ఎందుకు? ఇన్ని దుర్మార్గాలు ఎందుకు? ఎందుకు?
విదూషి చిన్నగా తలూపింది.
“ఇవన్నీ మనం తెలుసుకోవాలి తమ్ముడూ! ప్రియా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పగలను. అందుకే పెద్దలు అంటారు. ప్రతి కొత్త ఆవిష్కరణకి మానవీయకోణం వుండాలని. మనుషులందరూ ఒకటిగా లేరు. అందుకే ఏది మానవీయ ముఖం? ఎథిక్స్ అంటే ఏమిటి? ఎమోషన్స్ అందరికీ ఒకే రకంగా లేకపోయినా ఎక్కువమందికి ఎలా వుండాలి? ఇవన్నీ ముందు ముందు మనం పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం మీరు ఏ.ఐ. ని ఉపయోగించుకోండి. నేనూ మీ వెనకాల వుంటాను” అంది విదూషి.
రాత్రి విదూషికి నిద్ర పట్టడం లేదు. రకరకాల ఆలోచనలు. రోహన్, ప్రియాంక, గీతి, మృదుల మాత్రమే కాదు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వేధిస్తుంటారు. అందుకు జవాబులు ఎవరు చెప్పాలి? అందుకు చేయవలసిన పనులేంటి? పరిశోధనలేంటి? అలా ఆలోచిస్తూనే మెల్లగా కళ్ళు మూసుకుంది. ఎప్పటికో నిద్ర పట్టింది.
ఉదయం లత వచ్చింది.
“నిన్ను రూపేందర్ గారు కలవాలంటున్నారు” అంది.
విదూషి రూపేందర్‌ని కలుసుకుంది.
“విదూ… మనం ఇంక దూరం అవుతున్నాం” అన్నాడాయన.
“అదేంటి తాతగారూ!”
“నేను రెండు సంవత్సరాలు పిల్లల దగ్గరకు వెళ్తున్నాను. మా అబ్బాయి, అమ్మాయి అమెరికాలో వుంటున్న విషయం నీకు తెలుసు. మీరు ఒంటరిగా వుండటం మాకు ఇష్టం లేదు. మీరు మా దగ్గరకు రావాలి. అమ్మ చనిపోయినా ఇంతకాలం మాకు దూరంగా ఒక్కరే వున్నారు. మాకు అక్కడికి రావటం కుదరదు. మీరు రావాలి. మీ గ్రాండ్ చిల్డ్రన్ కి మీ అవసరం వుంది. ప్లీజ్ అన్నారు. వారి పిల్లలతో అడిగించారు. కాదనలేకపోయాను” అన్నాడు రూపేందర్.
విదూషి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“విదూ! నువ్వు నవ్వించాలి తప్ప ఏడవకూడదు” అన్నాడు.
అయినా విదూషి దుఃఖం ఆగలేదు.
“ముందు ముఖం కడుక్కుని రా” అనగానే లేచి వెళ్ళింది.
రూపేందర్ కళ్ళల్లోనూ నీటి పొరలు. ఆయన కూడా వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. ఇద్దరి ముఖాలు తేటగా వున్నాయి.
“ఇంక మనం కలుసుకునే వీలుండదు. అయినా బాధ లేదు. మనకు ఫోన్లు వున్నాయి. వీడియోల్లో మాట్లాడుకోవచ్చు. అలాగే సైన్స్‌కి చెందిన మ్యాగజైన్స్ పంపిస్తాను. ఎప్పటికప్పుడు ఈ రంగాల్లో వస్తున్న మార్పుల గురించి చర్చించుకుందాం. సరేనా?” అన్నాడాయన.
“అలాగే తాతగారూ! చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు అయ్యాయి. ఇప్పుడు నాకు ఏ.ఐ. గురించి కొంతసేపు మాట్లాడాలనుంది. నాతో నా తమ్ముడు, చెల్లీ, అమ్మమ్మా, అత్తా మావయ్యల పిల్లలు అందరితో మాట్లాడాను. అందరూ ఏదో చేయాలనుకుంటున్నారు. అలాగే కృత్రిమ మేధస్సు గురించి ఆలోచిస్తుంటే నాకు క్లోనింగ్ గుర్తు వచ్చింది” అంది విదూషి.
“అదా! అవును ఆ ప్రకారం మనుషుల నుండి జంతువుల వరకూ అలానే సృష్టించవచ్చు. దానివలన రకరకాల నైతిక సమస్యలు వస్తాయి. అందుకే దానిని ఆమోదించలేదు. అయినా రహస్యంగా అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతకుముందు అనుకున్నాం. సైన్స్‌లో అన్నీ మంచి ప్రయోగాలే జరగవు.”
“తాతగారూ! ఇప్పుడు నా మనసులో డెత్ ని జయించటమో, వయసు పెరగకపోవటమో రావటం లేదు. ఇవన్నీ డబ్బులున్నవారికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనిషి మేధస్సు గురించి ఆలోచిస్తున్నాను. అసలు ఇన్ని సమస్యలకు కారణం మనిషి స్వార్థం కదా! ఈ ప్రపంచాన్ని మేమే జయించాలనుకుంటారు కదా! అందుకేగా ఈ టెర్రరిజాలు… ఈ యుద్ధాలు.”
“అవును విదూ.”
“మా రోహన్ దేవుడి మీద యుద్ధం చేయటానికి ఓ పాత్రను సృష్టిస్తాను అంటున్నాడు.”
“అచ్ఛా” అన్నాడాయన చిరునవ్వుతో.
“నాకు ఒకటే అనిపిస్తోంది తాతగారూ! ఇంతకుముందు మా తాతగారు నానీ చెప్పారు. విశ్వామిత్రుడు అనే మహర్షి సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకుని త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడంట. ఇప్పుడు మన చేతుల్లో సైన్స్ వుంది. నేను ఏదొకరోజు ఓ ప్రయోగం చేయాలనుకుంటున్నాను.”
“ఏంటి విదూ అది!”
“మన ఆలోచనలకు, అభివృద్ధికి, విధ్వంసానికి కారణం మన మెదడు నుండి వస్తున్న ఆలోచనలు. మనల్ని నియంత్రిస్తున్నది మన మెదడు.”
“అవును విదూ!”
“అందుకని సరికొత్త ‘చిప్’ని కనుక్కోవాలి. అందులో అహం, అధికారం, లాభం, అంతరాలు, స్వార్థం ఇవన్నీ ఎరేజ్ అయిపోతాయి. అప్పుడు కేవలం ప్రేమ మాత్రం వుంటుంది. అది మనుషుల పట్ల ప్రేమ. ప్రకృతి పట్ల ప్రేమ. ఇది నా వల్ల అవుతుందని అనటం లేదు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు. ఇదో అందమైన కల తాతగారూ!” అంది విదూషి ఉద్వేగంగా.
అప్పుడు రూపేందర్ విదూషి తల మీద చేతులు వేసి…
“నిన్ను చూస్తుంటే గర్వంగా వుంది తల్లీ. ఒకప్పుడు మనుషులు అనుకున్నది వాస్తవం కావటానికి లక్షల సంవత్సరాలు పట్టాయి. నీ ఆలోచనలను పుస్తక రూపంలో రాస్తే బాగుంటుంది. అది నేను ప్రింట్ చేయిస్తాను. అది చిప్ రూపంలోనో మరో రూపంలోనో వాస్తవం అవుతుంది. ఎవరో ఒకరు నువ్వు అందించిన ఈ విషయాన్ని ప్రేరణగా తీసుకుంటారు” అని బ్లెస్ చేశాడు.
విదూషి తాతగారి పాదాలకు నమస్కరించింది.
సమాప్తం







