వాళ్ళ గురించి ఆలోచించు...
********
బల్ల మీద పళ్ళైంలో
నీ భోజనం సిద్ధంగా ఉన్నప్పుడు
ఒక్క క్షణం
ఆకలి కంచాల గురించి ఆలోచించు
పావురాల చిన్ని పేగుల కోసం
కొన్ని గింజలను ప్రేమగా చల్లడం మరిచిపోకు!
యుద్ధ కాంక్ష నీలో హద్దులు మీరి
కత్తులు నూరుతున్నప్పుడు
శాంతి కోసం
నెరవేరని కలలతో తపించే హృదయాలను
ఓ సారి తలుచుకో
నీ దుబారా నీళ్ల బిల్లు చెల్లించేటప్పుడు
మేఘాలకు దోసిలి చాపిన గొంతుకల్లో
పిడసగట్టిన దాహమెంతో తెలుకో!
నీ సొంత ఇంటికి నువ్వు తిరిగొస్తున్నప్పుడు
గుడారాల్లో తలదాసుకున్న బతుకుల వైపు
ఓ సారి చూపు సారించు
చుక్కలను లెక్కబెడుతూ
నువ్వు నిద్రపోయేటప్పుడు
నిద్రలేని నిరాశ్రయుల కలతలను కాస్త లెక్కించు
అందమైన పదచిత్రాలతో
నువ్వు పద్యాలల్లేటప్పుడు
మాట్లాడే హక్కును కోల్పోయిన గొంతుల గురించి
కొంత ఆలోచించు!
దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ
నీ గురించి కూడా ఓసారి ఆలోచించు
ఈ చీకటిని కాల్చేయడానికి
నీలో ఓ కొవ్వొత్తిని వెలిగించు
మూలం : (Think Of Others)
- - మహమూద్ దర్వీష్ స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
