నాతో నేను -
అదే,
నాలో ఉన్న ఇంకో నాతో అంటాను :
నువ్వు చేసినదానికి
క్షమాపణ చెప్పకు!
అడుగులు నీవే అయినా
నడిపించింది కాలమే!
ఇదుగో!
నీ జ్ఞాపకాలన్నీ
సాక్షులుగా నీ ముందు
నిలబడ్డాయి:
పిల్లి నిద్రలో జోగుతున్న పగటి అనాసక్తత/
ఎర్రటి ఉదయాల కోడిపుంజు జుట్టు /
గాలిలో
పూర్వీకుల పవిత్ర ఆత్మల సబ్జా సువాసన /
కమ్మని ఇంటి పరిమళాల అమ్మ చేతి కాఫీ /
నేల మీద
పూర్వీకుల ప్రేమను పరిచిన తుంగ చాపా తలదిండ్లు/
నీ ఏకాంతానికి కాపుగాసే
నీ గది లోహపు తలుపు/
సోక్రటీస్ చుట్టూ తిరిగే తార్కిక ఈగ 1*/
ప్లేటో తలమీది తాత్విక మేఘం 2*/
అరబ్బు పురాతన కవితా గానాల
హమస్సా సంకలనం 3* /
నీ మూలాల గుర్తుగా వేలాడే
నాన్న ఫోటో/
నిన్ను విశాల పరిచే
దేశ దేశాల విజ్ఞాన సర్వస్వాలు/
మనిషి నీడల నాటక కర్త
సేక్స్పియర్ /
ఒకనాటి ముగ్గురన్నలు, ముగ్గురు అక్కలు
ఇంకా
నీ చిన్ననాటి స్నేహితులు
అన్నీ, అందరూ నీ నిశ్శబ్ద సాక్షులు!
అనవసరంగా తలదూర్చే
అత్యుత్సాహపు జనం అంటారు :
"ఇది అతడేనా?"
సాక్షులు ఒప్పుకోరు!
"బహుశా...అతనిలాగే ఉన్నాడు!"
నేనడుగుతాను
"ఎవరు?"
వాళ్ళు సమాధానమివ్వరు!
కనుక
నాలోని ఇంకో నన్ను లోగొంతుకతో అడుగుతాను
"ఒకప్పటి నువ్వు... నేనేనా?"
అతడి చూపు నా నుంచి తప్పించుకున్నది
నిర్దారణ కోసం జనం అమ్మ వైపు తిరిగారు
"నీ కొడుకు ఇతడేనా? "
అమ్మ గంభీర నిశ్శబ్దం గొంతు సవరించుకున్నది
"ఇతన్ని కన్న తల్లిని నేనే
పెంచింది మాత్రం ఆ గాలులే"
అప్పుడు నేను వేరొక నాతో అన్నాను
"అమ్మకు మాత్రమే క్షమాపణలు చెప్పు"
-------------------------
మూలం :
(Don’t Apologize for What You’ve Done)
---- మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
-------------------------
(1. సోక్రటీస్ నిరంతరం ప్రశ్నలో సమాజాన్ని చిరాకు కల్గించినా, చైతన్య పరుస్తాడు కనుక అతనిని"The Gadfly who wakes society." అంటారు.
2. ప్లేటో తత్వశాస్త్రం - భౌతిక ప్రపంచం నుండి వేరుగా ఉన్న ఉన్నతమైన, ఆదర్శవంతమైన వాస్తవికతను ప్రతిపాదిస్తుంది.
"The clouds" పేరుతో అరిస్టోఫేన్స్ వ్యంగ్యం నాటిక కూడా ఉంది.
3."హమస్సా సంకలనం" -
దీనిని అబూ తమ్మామ్ (Abu Tammam, 9వ శతాబ్దం) సంకలితం చేశాడు.
దీన్ని అరబ్ సాంప్రదాయ వీరగాథల కవిత్వానికి “మూల గ్రంథం”గా చెప్పుకుంటారు.)
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
