ఈజిప్టులో
ఏ గంటా ఇంకోదానిలా ఉండదు
ప్రతీ క్షణమూ
నైలునది పక్షి గుడ్డులోంచి
మళ్లీ పుట్టిన జ్ఞాపకమవుతుంది
ఎప్పుడో తేదీ తెలవదు గానీ
నేనక్కడ ఉన్నాను!
అక్కడి పురా మానవుడు
జ్ఞాన కాంతి విరజిమ్మే
సూర్య దేవుణ్ణి సృష్టించాడు!
అక్కడెవరైనా
సొంత పేర్లను చెడిపేసుకొని
"నైలు నది పుత్రుడ"నే
గొప్ప పేరును రాసుకుంటారు
లోతైన నిరాశా అగాధంలోంచి
బయటపడడానికి
మొదటి క్షణం నుంచే
మీరు కూడా మిమ్మల్ని"నెలునది పుత్రుడా! "
అని పిలుచుకుంటారు
అక్కడ
మట్టిలో కలిసి పోయిన వాళ్ళూ
మట్టితో కలిసి జీవిస్తున్న వాళ్ళూ
ఎగువ ఈజిప్టులో
పత్తి మేఘాలను ఏరుకొంటారు
దిగువ మైదానంలో
గోధుమ గింజల కృషిని నాటుకుంటారు
అక్కడ
జీవన మరణాల మధ్య నిలబడి
ఇద్దరు భటులు వంతులవారీగా
ఖర్జూరపు చెట్లను కాపాడుతుంటారు
అక్కడ మీరు
చిక్కులు చిక్కులుగా ఉన్న కాలం గుండా
మీ ఆత్మ వీధుల్లో నడుస్తారు
రసమయ భావాలన్నీ మీలో పొంగుతాయి
మీరు పుట్టక ముందే
ఈజిప్టు తల్లి మిమ్మల్ని మొదటగా
తామర పువ్వులా పుట్టించినట్లుంటుంది!
ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారా?
తనను తాను గమనిస్తూ
ఈజిప్టు, నిశ్శబ్దంగా కూర్చుని
యుగాల మీద కుట్టిన చిరిగిన కోటును
అన్ని వైపుల నుండి వీస్తున్న
గాలిదారాలతో కుట్టుకుంటున్నది
నేనక్కడే ఉన్నాను
మానవుడు జీవన్మరణాల జ్ఞానాన్ని
వాక్యాలలోకి ఒంపుతున్నాడు
ఆ రాత్రి
ప్రతీది రసాత్మకమైన వెన్నెల్లో తడిసిపోతోంటే
రేపటిని వెతుక్కుంటున్న
ఓ కవిత మాత్రం
అమరత్వం గురించి ఆలోచిస్తూ
తన లోపాలను
నైలునదితో చెప్పుకుంటున్నది!
మూలం: (In Egypt, One Hour Isn'T Like Any Other-మహమూద్ దర్వీష్)
స్వేచ్ఛానువాదం: రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
